#హరికృష్ణ మామిడి
వాగ్గేయం !
సంగీత సాహిత్య సత్య తత్వ దర్శనం !!
మానవుని నిత్య పరిణామ శీలతకు, సత్యశోధనా గమనానికి ఆదిమ కాలం నుంచీ
రెండు అంశాలు ప్రధానంగా కారణం అవుతున్నాయి
అవి 1) విజ్ఞానం, 2) విశ్వాసం
మనదేశంలో ప్రాచీనకాలం నుంచీ విజ్ఞానం, విశ్వాసం రెండూ సమాంతరంగానూ, సమానంగానూ ప్రవహిస్తూ వస్తున్నాయి. షద్దర్శనాలలోని వైశేషికంలో "కపిత్థాకారః భూగోళ అని భూమి గుండ్రంగా లేదని ఒత్తబడిన నారింజ ఆకారంలో ఉందని (elliptical Shape) విశదీకరించారు. క్రీ.పూర్వం నాడే భారతీయులు చెప్పిన ఈ విషయాన్ని తెల్సుకోవడానికి పాశ్చాత్యులు 14వ శతాబ్దం వరకు వేచి చూడాల్సి వచ్చింది. టాలెమీ కోపర్నికస్, గెలీలయోల పరిశోధనల తర్వాత భూమి ఆకారం గురించిన శాస్త్రీయ నిర్ధారణ జరిగింది. అలాగే సంఖ్యారూపంలో 'సున్నాను' కనుగొన్న భాస్కరుడు, 'బృహత్పంహిత రాసిన వరహమిహిరుడు ఇంకా మరెన్నో ఖగోళశాస్త్ర దృగ్విషయాలను వివరించారు అలాంటి శాస్త్ర జ్ఞాన పరిశీలన భారతీయులకే సాధ్యమయింది
అలాగే 'విశ్వాసం' విషయంలో కూడా దార్శనికతని, ద్వైత భావనని, అద్వైత స్ఫూర్తిని దేహాత్మల ఉనికిని, భౌతికతకు అతీతమైన పారభౌతిక, ఆధ్యాత్మిక విషయాలను విశ్లేషించిన ఖ్యాతికూడా ప్రాచీన కాలం నుంచీ భారతీయులదే అని చెప్పాలి. ఇలా మన దేశంలో విజ్ఞానం, విశ్వాసం రెండూ, రెండు పాయలుగా సమాన వేగంతో సమాన పునాదులతో బలంగా కొనసాగుతూ వచ్చాయి. అందుకే మన సమాజం కూడా విజ్ఞానాన్ని, విశ్వాసాన్ని రెండింటినీ ఆమోదించే జీవన విధానాన్ని అమలు చేస్తూ వచ్చింది
ఐతే మన భారతీయ సమాజాన్ని మొదటినుంచీ సన్మార్గం వైపు, సత్యశీలతవైపు, సదాశయాలవైపు నడిపిస్తున్న, మార్గదర్శనం చేయిస్తున్న అంశాలలో 'విశ్వాసమే ప్రధానమైనది. అలాగే 'విశ్వాసం' అనే స్థూల భావనలో క్రమంగా రెండు ధోరణులు బలపడ్డాయి. వాటిలో ఒకటేమో సద్ విశ్వాసం(Belief), రెండోది - మూఢ విశ్వాసం (Superstition)! మూఢవిశ్వాసం, అంధవిశ్వాసం స్థాయికి వెళ్ళి భారతీయుల పురోగతిని నిరోధించగా, సద్ విశ్వాసం మనుషులలో సత్ సంకల్పాలకు కొత్త ఆలోచనలకు దారులుతీస్ లోకప్రయోజనానికి కారణమయిందని చరిత్ర చెప్తున్నది!.
అలా సద్ విశ్వాసం పునాదులపై భక్తితత్వం ఆధారంగా మనిషిని మనీషిగా రూపొందించే లక్ష్యంతో భారతీయ తాత్విక చింతనలో మొగ్గతొడిగిన సంగీత సాహితీ - ప్రదర్శనా ప్రక్రియే "వాగ్గేయం! వాగ్గేయంలో రెండు ప్రధాన అంశాలు ఒకటిగా కలసిపోయి దేహాత్మలలాగా ఒక్కటిగా కనిపిస్తాయి. వాక్కు (సాహిత్యం), గేయం (సంగీత బద్ధమైన రాగయుక్త ఆలాపన! ఇందులో వాక్కు దేహమైతే, గేయం ఆత్మ అని చెప్పుకోవచ్చు అంటే ఒక భావనని పండిత, పామర జనరంజకంగా మలచడంలో, పునఃస్కరణ చేయడంలో, మననం చేయడంలో ఈ 'వాగ్గేయం' అంతకు ముందటి ఎన్నెన్నో సాహితీ ప్రక్రియలకన్నా ప్రజానుకూలంగా ఉండి ఆదరణ పొందింది
వాగ్గేయం-లక్షణాలు
1. ఇది సంగీత సాహిత్యాల సమ్మిళిత రూపం
2. భక్తి, ఆధ్యాత్మిక చింతన, తాత్విక దర్శనం దీనిలోని ప్రధాన వస్తువులు
3. దేవుడు - మానవుడు మధ్య సంబంధాలను, అనుబంధాన్ని బలోపేతం చేయడం
4. పారారభౌతిక, పారలౌకిక ఆలోచనాధారకు పట్టం
5.మనిషిని సన్మార్గంలో నడిపించడం, భూతదయ, కరుణ, సాటి మనిషి పట్ల గౌరవం కలిగించడం, పరస్పర విశ్వాసం వంటి అనుకూల ఆలోచనలను (Positive thought) పాదుకొల్పడం.
6.సాహిత్యానికి తగిన రాగాలను ఎన్నుకోవడం, ఆ రాగంలో ఆలపించడం ద్వారా భక్తి భావనకు విస్తృత వ్యాప్తిని చేయడం జనాలను ఆకట్టుకోవడం.
7. రాగాలాపన ద్వారా శ్రోతలు / ప్రేక్షకులలో భక్తి భావనను, ఆధ్యాత్మిక స్ఫూర్తిని రగల్చడం.
8. ' వాగ్గేయం' ద్వారా మనన పునఃస్మరణాలు సులభతరం అవుతాయి. కనుక సాహిత్యానికి శాశ్వతత్వం అందించడం
9. శ్రుత సంపద్రాయం' లోకి తీసుకొచ్చి ప్రజల నాల్కల మీద నిరంతరం, తరంతరం నడయాడేలా చేయడం, మరో తరానికి అందించడం
10. లోకరీతిని, లౌకిక జ్ఞానాన్ని, ప్రస్తుత మానవుడి వెంపర్లాటని, దానిలోని అసంగతత్వాన్ని ఉదాహరణల ద్వారా రాగయుక్తంగా అందించడం. మహోన్నత సత్యాన్ని ఆవిష్కరించడం.
11. అంతిమంగా మనిషి జీవితానికి ఆధ్యాత్మిక ప్రాతిపదికగా 'ఆనందమార్గం' ను చూపించడం
12. మనిషిలోని జంతువాంఛలను, స్వార్ధకాంక్షను, హింసాప్రవృత్తిని, ధ్వంస వ్యక్తిత్వాన్ని తగ్గించి, మనిషిని ఉదాత్త మానవీయ విలువలతో కూడిన సమున్నత మానవునిగా
ఎదిగేందుకు తొవ్వ చూపించడం
13. భౌతిక, దైహిక వాంఛలలోని డొల్లతనాన్ని తాత్కాలికత్వాన్ని సహేతుకంగా వివరించి
శాశ్వత ఆనందం' (Eternal Bliss) దిశగా మానవ ప్రస్థానాన్ని నడిపించడం.
ఎవరు వాగ్గేయకారులు ?
స్థూలంగా చెప్పాలంటే త్రికరణ లను (మనోవాక్కాయ కర్మ లను ) వాగ్గేయకారులు అనవచ్చు. ఎందుకంటే 'వాగ్గేయకారం!' అనే పదం మూడు సంస్కృత పదాల కలయిక. అవి
అ) వాక్-సాహిత్యం-వాక్కు
ఆ) గేయం-రాగతాళస్వరాలు కూర్చిన సంగీతం - మనస్సు
ఇ) కార-పై రెండింటిని చేసే కర్త - కర్మ
అయితే శాస్త్రీయ సంగీత శాస్త్రానికి మూల భూమికను ఏర్పరచిన ప్రాచీన గ్రంథాలలో ఒకటైన "సంగీత రత్నాకరం" లో కూడా వాగ్గేయకారునికి సంబంధించిన శ్లేషణలు, వివరణలు మనకు కనిపిస్తాయి. భారతీయ సంగీత శాస్త్రానికి ప్రాతిపదికను కూర్చిన సారంగదేవుడు సంస్కృతంలో రాసిన ఈ గ్రంథంలో ఇలా చెపుతాడు :
"Speech and song are called 'matu' and 'dhatu' respectively (in musical texts and terminology); and he, who creates both speech (shabda Brahma) and song (Nada Brahma) is verily a vaaggeyakara".
అదే కావ్యంలో సారంగదేవుని మాటల్లో వాగ్గేయకారుని గురించి చెప్పాలంటే వాజ్మా తురుచ్యతే గేయం - ధాతురిత్యాభిధీయతే
వాచం గేయంచ కురుతే - యఃస వాగ్గేయకారక!!
మాతువు (సాహిత్యం-మాట ); ధాతువు (సప్తస్వరబద్ధమైన సంగీతం) లను రెండింటినీ సమపాళ్ళలో కూర్చగలిగిన వారే వాగ్గేయకారులని దీనిభావం .
అందుకే శోంగ' అనే ప్రామాణిక గ్రంథంలో కూడా "A vaaggeyakara' is the perfect embodiment of 'shabda Brahma' and "nada Brahma" par excellence" అని చెప్పారు. అదే గ్రంధంలో మరింత వివరంగా ఇలా చెప్పారు
"A vaaggeyakara in true sense is a mystic musician who as a perfect singer gives sweet and scintillating, full and faithfull expression to shabda Brahma and nada Brahma".
దక్షిణ మరియు ఉత్తర భారతదేశంలోని వాగ్గేయకార సంప్రదాయాన్ని విశదంగా కూలంకషంగా ప్రస్తావించిన 'శోధ్ గంగ' గ్రంధంలో మరోచోట వాగ్గేయకారునికి సంబంధించి మరో చక్కని వివరణను ఇచ్చారు. అది :
"A Vaaggeyakara is a reservoir of known music as well as rio- a erine releaser of new music, a sea as well as a source of music
sublime and supreme".
అలాగే భారతీయ దర్శనం, తాత్వికత మీద సాధికారిక ప్రసంగాలను, రచనలను ఎన్నింటినో చేసిన దార్శనికుడు, భారత మాజీ రాష్ట్రపతి శ్రీ డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ 1965లో చేసిన ఓ ప్రసంగంలో ఇలా వర్ణించారు "The Vaaggeyakara is a creative innovator and not merely a
repititive traditional For as a devotee of music, he is at once the worshipper of goddess Saraswathi who holds in her hands the book and the veena -Veena Pustak Dharini"!
అంటే సరస్వతీదేవి ధరించిన 'వీణ' సంగీతాన్ని, 'పుస్తకం' సాహిత్యానికి సంకేతాత్మక అంశాలన్నమాట.
పురాణాలలో సంగీతజ్ఞులు:
భారతీయ ఇతిహాసాలు, పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాగ్గేయ కారత్వానికి అధిదేవతగా, వాగ్గేవిగా పూజలందుకోవడం మనకు తెలిసిందే. అయితే సరస్వతీదేవి మాత్రమే కాక, మరెంతో మంది పురాణ దేవతలు, రుషులు ఈ వాగ్గేయతత్వానికి, సంగీత సాధనకు ప్రతినిధులుగా మనకు కనిపిస్తారు. దీని గురించి ఆర్. రంగరామానుజ అయ్యంగార్ History of South Indian (carnatic) Music (1972) గ్రంథం లో ఇలా వివరిస్తాడు .
"శివుడు, బ్రహ్మ, భరతుడు, కశ్యప మహాముని, మాతంగుడు యష్టికుడు, దుర్గాశక్తి,
శార్థూల కోహల, విశాభిల, దంతిల, కంబాల, అత్యతార, తుంబుర, శారద. ఆంజనేయ, మాతృగుప్త, రావణుడు, నందీశ్వరుడు, బిందురాజా, క్షేత్రరాజు, రాహులుడు, సోమేశుడు, అభినవ భట్ట, లొల్లాటుడు మొ॥ వారు సంగీతానికి వాగ్గేయానికి ప్రతినిధులుగా ప్రస్తుతించబడ్డారు."
ఇలాంటి పౌరాణిక, భక్తి నేపథ్యమే వాగ్గేయకార సంప్రదాయంగా చివరికి పరిణమించింది. ఇదే సందర్భములో చాలామందిలో చర్చకు వచ్చే అంశం ఏమిటంటే వాగ్గేయకార సంప్రదాయం లౌకిక, తార్కిక మార్గంలో ఉండదా? కేవలం భక్తి - ఆధ్యాత్మిక మార్గాలలోనే ఉంటుందా? అనేది.
ఈ విషయమై ఎంతో మేధోమథనం చేసిన సంగీత పరిశోధకులెందరో వాగ్గేయకార సంప్రదాయానికి సంగీతం-సాహిత్యం దేహమైతే, దాని ఆత్మనే భక్తి అని చెపుతారు. అలాంటపుడు ఆత్మలేని జీవాన్ని ఉహించలేము అని కొట్టివేసారు. ఇదే విషయాన్ని " శోధ్ గంగ" అనే గ్రంధంలో ఇలా వివరిస్తారు
Music may be sacred or Secular. But a secular music has never produced any Vaaggeakara worth the name. Vaaggeyakara is sole product of Soulful realisation of the Brahman in its two fold aspect of "Shabda Anubhava" and "Nada Anubhava".
దీన్నిబట్టి వాగ్గేయకార సాంప్రదాయం, మతం, ఆచారాలు, విశ్వాసాల ఆధారంగా రూపొందిన భక్తితత్వాన్ని అనుసరించే ఉంటుంది తప్ప, విడిగా ఉండలేదనేది వెల్లడవుతోంది
ప్రపంచం-ఇతర మతాల్లో వాగ్గేయకార సంప్రదాయం :
ప్రపంచంలోని ఇతర దేశాలను, వాటి సాంస్కృతిక చరిత్రలను లోతుగా గమనిస్తే,
ఈ వాగ్గేయకార సంప్రదాయం కేవలం భారతదేశానికే ప్రత్యేకమైనది కాదని, విశ్వవ్యాప్తంగా ఈ ఈ సంప్రదాయం ఆయా జాతులు, దేశాలు మతాల విశ్వాసాలకు అనుగుణంగా వేర్వేరు రూపాలలో అమలులో ఉందని అర్థ మవుతుంది. ముఖ్యంగా 'వాగ్గేయకార సంప్రదాయం మతం - మతంలోని ఐతిహాసిక, పౌరాణిక, ఆధ్యాత్మిక, భక్తి, తత్వ అంశాల పైననే ఆధారపడి ఉండటం వల్లనూ, అత్యధిక వాగ్గేయాలు ఆయా మతాలలోని పురాణ పురుషుల లీలావిన్యాసాలను కీర్తిస్తూ ఉండటం వల్లనూ, ఇవి ఏమతానికామతం, తమదైన సంప్రదాయాలు, ప్రక్రియలలో స్థిరపడ్డాయని తెలుస్తోంది. అంతేగాక, మతం - విశ్వాసం యొక్క ప్రధానాశయం ప్రజల మస్తిష్కాల్లో ముద్రపడటమే కనుక, ఈ వాగ్గేయకార సంప్రదాయం అన్ని మతాలవారికి వారి వారి భావజాల వ్యాప్తికి ఎంతగానో
సహకరించిందనేది కూడా తెలుస్తోంది. ఇదే అంశాన్ని "St. Kirpal Singh; the Japaji
(1959) అనే గ్రంధంలో ఇలా వివరిస్తాడు :
This (Vaaggeyakara) is the eternal Divine music which Lord Christ refers to as the 'word', the Mohammedan Faith call it "Kalma', while the Hindu Scriptures hail it as shruti, Nada or Akashavani"
దీన్నిబట్టి, ఈ వాగ్గేయకార సంప్రదాయం అన్ని మతాలలో ఏదో ప్రక్రియలో, ఏదో రూపంలో ఉందనే విషయం స్పష్టపడ్తోంది
అలాగే, బౌద్ధం, జైనం, షింటోయిజం (జపనీస్ మత సంప్రదాయ) లలో కూడా ఆయా మతాల, విశ్వాసాల వ్యాప్తికోసం ఈ తరహా వాగ్గేయకార ప్రక్రియనే అమలు చేసినట్లుగా ఆధారాలున్నాయి. ఈ విషయాన్నే క్రైస్తవంలోని Angelic Music ను, పొందు మతంలోని దేశికాలు ను తులనాత్మకంగా చెపుతూ The New Dictionary of thoughts (1951) పుస్తకంలో "Deshikas are the angels and this divine music of Angelic mystics in Deshi music. that is one reason why Tho mas carlye calls music as the "Speech of Angels" అని వివరించారు .
అలాగే మనదేశంలో హిందూమతాన్ని సంస్కరించే లక్ష్యంతో 13వ శతాబ్దిలో భక్తి ఉద్యమం ఉద్భవించినట్లుగా, యూరప్ లో 16వ శతాబ్దంలో క్రైస్తవ మత సంస్కరణోద్యమం వెల్లువెత్తింది. జర్మనీలో మొదలైన ఈ ఉద్యమానికి సారథ్యం వహించిన మార్టిన్ లూధర్ తన ఎన్నో ప్రసంగాలకు, క్రైస్తవమతంలో సంస్కరణల ఆలోచనకు Angelic music నుండే తాను స్ఫూర్తిని పొందానని చెప్పేవాడు. అంతేగాక, వాటిలోని వాక్యాలను పాడుకుంటూ ఉదాహరిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే "Next to Theology, I give to music the highest place and honour. And we see how David and all the Saints have wrought their godly experiences and constructs into verse, rhyme and song"
దీన్నిబట్టి వాగ్గేయకార సంప్రదాయం అన్ని మతాలలో, దేశాలలో వారిదైన రూపంలో విలసిల్లుతోందని చెప్పవచ్చు.
మనదేశంలో వాగ్గేయ ప్రస్థానం :
భక్తి, ఆధ్యాత్మిక, ఆత్మిక పారమార్ధిక పరమైన చింతనే పునాదిగా సంగీతం హిత్యం, తత్వం, సత్యం అనే నాలుగు స్థంభాలపై నిర్మితమైనదే వాగ్గేయ సౌధం!.
మనదేశంలో ఈ వాగ్గేయ సంప్రదాయం ఒక్కరోజులోనో, ఒక్క తరంతోనో స్థిరపడింది కాదు. వందలాది సంవత్సరాల జ్ఞానసముచ్ఛయం ఒక వైపు, వందలాది సంగీత తాత్వికుల సామూహిక కృషి మరోవైపు కలసి ఈ వాగ్గేయకార సంప్రదాయం రూపొందింది. అయితే 13వ శతాబ్దినాటి భక్తి ఉద్యమానికి ఆదిశంకరాచార్య, రామానుజాచార్య వంటి దక్షిణాది తాత్వికులు ఎలా ఊపిరులు ఊదారో, ఈ వాగ్గేయకార సంప్రదాయానికి కూడా దక్షిణాది సంగీత తాత్వికులే బాటలు వేయడం యాధృచ్చికమే. అదీ ముఖ్యంగా కర్ణాటక సంగీత రీతిలోనే ఈ వాగ్గేయకార సంప్రదాయం రూపొందడం విశేషం.
ఈ లెక్కన సంగీత చరిత్రకారుల పరిశోధనల ప్రకారం మనదేశంలో కర్నాటక సంప్రదాయ రీతిలో వాగ్గేయ ప్రస్థానం (4) దశలలో కనిపిస్తుంది.
1.ప్రాక్ సంగీత త్రయకాలం (18వ శతాబ్ద పూర్వం) 2.సంగీత త్రయకాలం (18వ శతాబ్దం)
3. సంగీత త్రయ అనంతర కాల తొలిదశ (19వ శతాబ్దం)
4. సంగీత త్రయ అనంతర కాల మలిదశ (20వ శతాబ్దం)
పైదశల వారి విభజనకు ప్రాతిపదికగా “కర్ణాటక సంగీత త్రయం” శ్యామశాస్త్రి (1762-1827), త్యాగరాజస్వామి (1767-1847), ముత్తుస్వామి దీక్షితార్ (1775-1835) ల కాలాదులను స్వీకరించారని చెప్పాలి.
1. ప్రాక్ సంగీత త్రయ కాలం :
నిజానికి వాగ్గేయకార సంప్రదాయం క్రమక్రమంగా ఎన్నోన్నో దశలను, మలుపులను దాటుకొని 18వ శతాబ్దం నాటికి నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది. అందుకే వాగ్గేయకార సంప్రదాయ మూలాలు, భాష తొలి నాళ్ళలో మౌఖికరూపంలో, పురాణగాన రూపంలో ఉన్న కాలంలోనే ఉన్నాయని చెప్పవచ్చు, భాష, పదాలు, సామూహిక మానవ అనుభవాల నుంచి పుట్టిన తత్వాలు అన్నీ స్మరణానికి, మననానికి, పునరుత్పాదనకు వీలుగా ఉండాలంటే అవి గానయోగ్యంగా ఉన్నపుడే సాధ్యమని, అప్పుడు మాత్రమే ఒకతరం నుంచి మరో తరానికి అందించబడతాయని అర్థమయింది. దానికితోడు మొదట్లో భాషకు లిపి కానీ లిఖితంగా గ్రంధస్థం చేయగలిగే సదుపాయం కానీ లేకపోవడం వల్ల ఈ విధంగా ప్రజల నాల్కల మీద గుర్తుంచుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది
అయితే ఈ స్థితి లిఖితరూపంలోకి, తాళపత్ర గ్రంధాలుగ క్రోడీకరించే దశక్తు చేరిన తర్వాత ఈ వాగ్గేయకార సంప్రదాయం నిర్దిష్ట రూపాన్ని సంతరించుకునే ప్రస్థానాన్ని ఆరంభించింది... ఈ ప్రస్థానానికి 12వ శతాబ్ధంలోని బసవేశ్వరుడి వచనాలే శ్రీకారం చుట్టాయని చెప్పాలి. కన్నడ భాషలో ప్రధానంగా కళ్యాణి రాగంలో మరితర రాగాలలో కూర్చబడినందువల్ల శ్రోతలను త్వరగా ఆకట్టుకోగలిగాయి. వీరశైవసంప్రదాయానికి పతాకాలుగా నిలిచిన దాదాపు 1300 వచనాలు జనంలోకి తొందరగా వెళ్ళడమేకాక, నేటికీ సజీవంగా ఉన్నాయి
ఆ తర్వాత వారిలో చెప్పుకోదగినవారు కన్నడ భాషలో 1321 పైగా కృతులను రచించిన అల్లమ ప్రభు (12వ శతాబ్దం ప్రధానంగా శివరంజని రాగం), దాదాపు 430 పైగా కీర్తనలు రచించిన అక్క మహాదేవి (ప్రధానంగా భైరవి రాగం), సంస్కృతంలో రాసిన నరహరితీర్థులు ప్రస్తావించ దగినవారు, అలాగే తెలుగులో రాసిన తాళ్ళపాక అన్నమాచార్య (1408-1503) దాదాపు 36వేలకు పైగా కీర్తనలను రాసి పదకవితా పితామహుడిగా వాసికెక్కడమే కాక, దాదాపు 1000 పైగా రాగాలలో ఈ కీర్తనలకు స్వరాలు కూర్చారు.
అలాగే కన్నడ, సంస్కృత భాషలలో లక్షలాది కీర్తనలను రాసి, కర్నాటక సంగీత పితామహుడిగా ప్రఖ్యాతి సాధించిన పురందర దాసు (1484-1564), కనకదాసు (1509-1609), తెలుగులో మువ్వగోపాల పదాలు రాసిన క్షేత్రయ్య (1600-1680) దాశరథి శతకం, ఇంకా ఎన్నెన్నో కీర్తనలను రాసిన భద్రాచల రామదాసు (1620 1688), 'కృష్ణలీల తరంగిణి' వంటి ప్రసిద్ధ కావ్యాలను రచించిన నారాయణ తీర్థులు (1650-1745) తొలినాటి నవవర్ణ కృతులను రచించిన ఊట్టుకకాడు వెంకటకవి (1700-1765), దేశిత్రిపదిరీతిని, సువ్వాలి తత్వాన్ని ప్రచారం చేసిన జగన్నాథ దాసుడు (1728-1809) వంటి వారు ఈ కాలంలో ప్రముఖ వాగ్గేయ కారులు
2. సంగీత త్రయ కాలం :
కర్నాటక సంప్రదాయ సంగీతం, దానితోపాటే వాగ్గేయకార సంప్రదాయం విశిష్టరూపాన్ని పూర్తి స్థాయిలో సంతరించుకొని స్థిరపడ్డ కాలం ఇది. ఈ కాలంలోని శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు తెలుగు, సంస్కృతం, తమిళ బాషలలో స్వరాలుకూర్చి గానం చేసిన కీర్తనలు శాశ్వత కీర్తిని సముపార్జించాయి.
ఈ కాలానికే చెందిన ఇరైయమ్మన్ తంపి (1782-1856), తిరువారూర్ రామస్వామి పిళ్లై (1798-1852), కవి కంజర భారతి (1810-1896) వంటివారు చేసిన రచనలు, స్వరాలు వాగ్గేయకార సంప్రదాయాన్ని మరింత సుసంపన్నం చేశాయి ఒక మలయాళ, కన్నడ, తెలుగు, తమిళ్ వంటి దక్షిణాది భాషల్లోనే కాక, సంస్కృతంలోనూ,
ఉత్తరాది భాషలైన హిందీ, ప్రజ్ భాషల్లోనూ కీర్తనలను రచించిన స్వాతి తిరునాళ్ (1813 1846) వాగ్గేయ కార సంప్రదాయాన్ని మరింత విస్తృతీకరించారు.
3.సంగీత త్రయ అనంతర కాల తొలిదశ :
19 వ శతాబ్దం నాటికి భారతదేశంలోనూ, దక్షిణాదిలోనూ సామాజికంగా చారిత్రకంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నెన్నో మార్పులు పొడచూపాయి. బ్రిటిష్ పాలన, పాశ్చాత్య భావజాలం, స్వాతంత్ర కాంక్ష వంటి సామాజిక అంశాలు కూడా తోడై, ఈ కాలం నాటి వాగ్గేయకారుల ఆలోచనా సరళిని ప్రభావితం చేసాయి. అయినా భారతీయతకు ఆలంబనగా నిలిచిన ఆధ్యాత్మికత, భక్తి భావనలు మాత్రం అదేవిధంగా కొనసాగాయి
ఈ కాలంలో వచ్చిన ఎందరో మహానుభావులు తమ రచనాస్వరాలతో వాగ్గేయకార సంప్రదాయానికి సమకాలీన సొబగులను అద్దారు. వారిలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి (1882-1921), తెలుగు జావళీలు రాసిన ధర్మపురి సుబ్బారాయుడు, 72 మేళకర్త రాగాలను సృజించిన కోటీశ్వర అయ్యర్ (1870-1940), మహావైద్యనాధ్ అయ్యర్ (1844-1893), మోహన రాగ వర్ణమ్ 'నిన్నుకోరి' వంటి ఎన్నెన్నో తెలుగు కృతులను రచించిన పూచి శ్రీనివాస అయ్యంగార్ (1860-1919), 90 రాగాలలో గీతమాలికను తెలుగులో అందించిన ఆదిభట్ల నారాయణదాసు (1864-1945) వంటివారు చెప్పుకో దగినవారు.
4.సంగీత త్రయ అనంతర కాల మలిదశ:
సమకాలీన సామాజిక, ఆర్థిక రాజకీయ అంశాల కన్నా శుద్ధ భక్తి మార్గంలోనే సంప్రదాయ పునర్ వైభవానికి పట్టంకట్టిన కాలంగా ఈ కాలపు వాగ్గేయకార సంప్రదాయం విశిష్టతను సంతరించుకుంది. సంగీతం, స్వరాలు, రాగాలు అన్నీ స్థిరపడిన కాలం కావడంతో ఈ కాలంనాటి వాగ్గేయకారులు తమ రచనలతో వాటిని మరింత సుస్థిరం చేయడానికి మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు. బహుశ అందుకే ఈ కాలంనాటి వాగ్గేయకారులు పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక, తాత్విక, పౌరాణిక భావనలకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు
ఈ కాలంనాటి వాగ్గేయకారులలో దండపాణి దేశికర్ (1908-1972) మహారాజపురం సంతానం (1928-1992), నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు (1925- 2006), లాల్గుడి జయరామన్ (1930-2013), మంగళంపల్లి బాలమురళీకృష్ణ (1930 2016) మొదలగువారు ప్రముఖులు.
హిందుస్థానీలో వాగ్గేయకార సంప్రదాయం :
మనదేశంలో వాగ్గేయకార సంప్రదాయం ప్రధానంగా కర్ణాటక సంగీత రీతిలోనే కనిపించినప్పటికీ, హిందుస్థానీ సంగీత రీతిలో కూడా ఇది ఉందని కొంచెం లోతుగా విశ్లేషిస్తే అవగతం అవుతుంది. జయదేవుడు (1170-1245), భక్త కబీర్ దాసు (1440 -1518)వంటి వారి కృతులలో ఈ ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక ఆధ్యాత్మిక భక్తి తత్వానికి ఉత్తర భారతంలో పేరెన్నికగన్న తులసీదాసు (1511-1623), సూరదాసు (14, 15 శతాబ్దకాలం) వంటివారు రాసిన రచనలు అన్నీ వాగ్గేయ సంప్రదాయంలోనే కనిపిస్తాయి. అన్నిటినీమించి, వారి పేర్లలో 'దాసు' అనే విశేషం ఉండటమే వాగ్గేయకార సాంప్రదాయంలో ప్రధానాంశమైన భగవంతుడికి దాసత్వం అనే లక్షణం కూడా ఇమిడి ఉందని తేట తెల్లమవుతోంది. అలాగే కేరళ ప్రాంతానికి చెందిన స్వాతి తిరునాళ్ హిందుస్థానీలో కూడా రచనలను చేయడం ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
అయితే హిందుస్థానీ రీతిలో వాగ్గేయకార సంప్రదాయాన్ని స్థిరీకరించిన వారిలో ఉస్తాద్ అదారంగ్, ఉస్తాద్ సదారంగ్లను చెప్పుకోవచ్చు. నేటికీ వీరు స్వరపరిచిన రాగాలు ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉండటం విశేషం
కాగా, సమకాలీన హిందుస్థానీ వాగ్గేయకార సంప్రదాయం 'ఆగ్రా ఘరానా' నుండే మొదలవుతుందని చెప్పవచ్చు. మెహబూబ్ ఖాన్ “దరస్పియ, ఫైయాజ్ ఖాన్ 'ప్రేమ పియా', విలాయత్ హుస్సేన్ ఖాన్ 'ప్రాణ్ పియా', జగన్నాధ్ బువా పురోహిత్ 'గుణీదాస్' వారిలో ముఖ్యులు కూడా చెప్పవచ్చు అలాగే జైపూర్-అత్రాలీ ఘరానా స్థాపకుడు అల్లాదియాఖాన్ గురించి
తెలంగాణలో వాగ్గేయకార సంస్కృతి :
విశిష్టమైన భారతీయ వాగ్గేయకార సంస్కృతిని సుసంపన్నం చేయడంలో తెలంగాణ ప్రాంతం కూడా వెనుకంజలో లేదు. బౌద్ధం, జైనం, హైందవం, మాతృదేవతారాధన వంటి ఎన్నిన్నో మతవిశ్వాసాలను పెంచి పోషించిన తెలంగాణ ప్రాంతంలో ఈ వాగ్గేయకార సంప్రదాయం ఒక సంస్కృతిగా ఎదగడం ఓ ప్రత్యేకత! అయితే ప్రధానంగా భద్రాచల రామదాసు (1620-1680) కాలం నుంచి ఈ వాగ్గేయకార సంప్రదాయం తెలంగాణలో స్థిరపడిందని చెప్పవచ్చు. ప్రధానంగా శ్రీరాముణ్ణి, మనిషి జీవనధర్మాన్ని, తాత్వికతనీ వందలాది కీర్తనలలో వర్ణించిన రామదాసు తెలంగాణా వాగ్గేయ కారులందరికీ ఆదిగురువు అని చెప్పవచ్చు. కాగా, తెలంగాణలో వాగ్గేయకార సంస్కృతి ప్రధానంగా మనకు మూడు సూపాలలో కనిపిస్తుంది. అవి -
1)శాస్త్రీయ వాగ్గేయకారం : శాస్త్రీయ సంగీత బాణీలు, స్వరాలు ఆధారంగా రూపొందినవి.
2) భజన వాగ్గేయకారం : శాస్త్రీయ సంగీతంతో పాటు లలిత సంగీతం ప్రాతిపదికగా
రూపొందినవి
3) ప్రజా వాగ్గేయకారం : ప్రజలలో వాడుకలో ఉన్న ప్రజా గేయ రీతులలో రూపొందినవి వీటిలో శాస్త్రీయ, లలిత బాణీల కన్నా సామాన్య ప్రజలను ఆకట్టుకునే రీతులే ప్రధానం
పై మూడు రీతులకు సంబంధించిన ఎంతోమంది వాగ్గేయకారులు తెలంగాణలో ఈ వాగ్గేయకార సంప్రదాయాన్ని బలోపేతం చేశారు. వీరిలో హిందూ వాగ్గేయకారులే కాక, ముస్లిం వాగ్గేయకారులు కూడా ఉండటం తెలంగాణ నేలలోని సర్వమత సామరస్య భావనకు నిలువుటద్దం అని చెప్పాలి. ఇలా గణుతికెక్కిన కొందరు తెలంగాణ వాగ్గేయకారులను ప్రస్తావించుకుందాం...
రాకమచర్ల వెంకటదాసు (1808-1859)
నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట మండలం పెద్దాపురం గ్రామంలో జన్మించిన రాకమచర్ల వెంకటదాసు వేలాది కీర్తనలు రాసినప్పటికీ వాటిలో ప్రస్తుతం దాదాపు 50 వరకు మాత్రమే ప్రచారంలో ఉన్నవి. ఆయన తాను రాసిన ఒక కీర్తనలో
'నీవైన దయజూడవమ్మ లోకపావని నను బ్రోవవమ్మ
యేవేళ మీ పాదసేవ జేసినవారి
కావరించి బ్రోవవమ్మ దయాంబుధి' అని సీతాదేవికి విన్నపాన్ని ఆట తాళంలో అందించారు. అలాగే
"చూడరమ్మ రాముల గూడరమ్మా
చూడు చూడు మీ చూడ్కలలర
గురితోడ త్రికూటము జూడదెలసి మరి” అని శ్రీరాముని వైభవాన్ని ఏకతాళంలో
రాసిన కీర్తనలో వర్ణించారు
మన్నెంకొండ హనుమద్దాసు (1814-1874)
మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీ వేంకటేశ్వరుడికి రెండో నివాసంగా పేరుపొందిన మన్నెంకొండ ప్రాంతానికి చెందిన హనుమద్దాసు దాదాపు 150 పైగా కీర్తనలు రాసి గానం చేసి శ్రీరామునికి అంకితమిచ్చారు. వాటిలో శుద్ధసావేరి రాగం-ఆట తాళంలో ఆయన రచించిన
"దయశాలివనియంటి రామ - నా దైవమై నీవంటి రామ
దయశాలివని యంటి - దరిజేర్చె వనుకుంటి నయము జెందుచునంటి - నా తండ్రి నీవంటి” అనే కీర్తన మరియు రేగుప్పి రాగం ఏక తాళంలో
“చూచేనురా రామ - చూచేనురా -
నీ సుందర నగుమోము చూచేనురా -
దాచావెందుకు నీ దండీ సంస్థానము
గాచినందుకు నిన్ను కనుగొన్నదేచాలు"
అని రాసిన కీర్తన ప్రఖ్యాతి చెందినవి.
దున్న ఇద్దాసు (1811-1919)
భక్తికన్నా తాత్వికతను, దేవుని కన్నా పారమార్థిక దార్శనికతను ప్రధానంగా చేసి తత్వగీతాలను రచించిన దున్న ఇద్దాసు చెప్పుకోదగిన ప్రజా వాగ్గేయకారుడు. సాహిత్యం సంగీత జ్ఞానం ఉన్నత వర్గాలలో మాత్రమే పుడతాయనే సూత్రీకరణను బద్దలు చేసి తాత్వికతకు పుట్టుక కన్నా, ఆలోచన దృక్పథమే హేతువు అవుతుందని నిరూపించిన జ్ఞాని ఈయన.
అందుకే ఆయన
“వాననబువ్వు పూసేనమ్మా
నర అడవిలో సు
వాసాన జ్ఞాన మానెనమ్మా" అని జ్ఞానానికి కిరీటం పెట్టారు. మరోవైపున “దాటరా మాయను దాటరా ఈ కర్మబంధము" అంటూ
మాయ మనకు కన్నతల్లి - దాటనివ్వదు మనోకాంత
సందు జేసుక మనో కాంతను - బంధమేసి అల్లవాలికి” అని భోధిస్తాడు
వేపూరి హనుమద్దాసు (1852- 1947)
దైవస్తుతి, ఆత్మప్రబోధ తత్వాలను రచించిన పాలమూరు వాగ్గేయకారుడు వేపూరి హనుమద్దాసు దాదాపు 477 కీర్తనలు రచించి తెలంగాణ సంప్రదాయాన్ని పరిపుష్టం సారు. ఆయన రాసిన కీర్తనలలో
"రామ రామ సుశామ సుజనలలామ రామ నమో నమో.
ప్రేమతో నను బ్రోవుమా శ్రితకామ రామ నమో నమో” అనే ఆట తాళంతో
మార్చిన కీర్తన, అలాగే
"ఏదయా రామ నీదయా వైకుంఠవాసా
ఏదయా నీ కరుణ నాపై రాదయా నేనెంత వేడిన
లేదయా కరినేలినటు నీ యాదరణ అని శంబుజూడగ" అనే మరో కీర్తన హనుమద్దాసు సంకీర్తనా చాతుర్యానికి మచ్చు తునకలు.
ఉప్పరిపల్లి కృష్ణదాసు (1866-1952)
మహబూబ్ నగర్ జిల్లా ఘనపురం మండలం ఉప్పరిపల్లి గ్రామంలో జన్మించిన కృష్ణదాసు 'సోలీపురం గురుభజన కీర్తనలు' పేరిట దాదాపు 250 పద్యాలు, కీర్తనలు రచించారు
మాధవునకు మరుపుదోచే మగువ యేమందునే
మానసమున మరులు గలిగె మా హరినెట్లుగందునే”
అని రూపకరాగంలో ఒక కీర్తనను,
“దత్తాత్రేయ మిము దలంచువారలు సత్తామాత్రులై యున్నారుగా హత్తుగాను నడనెత్తి బగులయా మిత్తినణ మేలన్నారుగా”
అని ఏకతాళంలో మరో కీర్తనను రాసి, గానం చేసి ఇహపర జీవితాలలో సగుణమార్గాన్ని ప్రతిపాదించారు
పెద్దరాం పోచయ్యదాసు :
పద్యాలల్లుతూ, భక్తి గీతాలు రాస్తూ, భజన బృందాలను తయారుచేస్తూ జీవితమంతా ఆధ్యాత్మిక మార్గంలోనే గడిపిన పోచయ్యదాసు ఒకవైపు చేనేతను, మరోవైపు వాగ్గేయ కలనేతను తాత్విక దారంతో నేసాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం,
తిమ్మాపురం గ్రామంలో జన్మించిన ఈయన ఆటతాళంలో రాసిన రామ యననినాడు భూమిలోనున్న కీడు
పామరమా యనమిడు క్షేమము తుదకుజుూడు
అని శ్రీరామునిపై కీర్తన ఎంత ఆదరణ పొందిందో, అదే ఆటతాళ రాగంలో..
"పండరి విఠలేశ - దండమె దీనపోష
రండిటు రుక్మిణేశ - భండనరిపువినాశ”
అనే పాండురంగ విఠలేశ్వరస్వామిపై రాసిన కీర్తనకూడా అంతే ప్రచారాన్ని సాధించింది.
గొల్లపల్లి వెంకటదాసు :
భక్తి, వైరాగ్యం, తత్వం, జ్ఞానం అనే నాలుగు స్థంభాలపై ఆధ్యాతిక చింతన ఉందని భావించిన వెంకటదాసు ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా గోపాల్ పేట మండలం గొల్లపల్లి గ్రామంలో జన్మించి, పారమార్ధిక మార్గంలో దాదాపు 238 కీర్తనలను రచించారు. ఈయన శ్రీరాముని మీదనేగాక, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతల మీదకూడా రచనలు చేసాడు. వాటిలో ఆట తాళంలో రాసిన
"నరసింహమ దేవా గోవిందా - నిన్నూ నమ్మితి పాహి ముకుందా క్రూరాహరణా నిత్యానందా నిన్నూ గోరీతి నతభక్త బృందా"అనే కీర్తన అదే ఆట తాళంలో రాసిన
“ఇంతా పంతామేల దేవా కృష్ణా చెంతా జేరగ ఇందు రావా అనే కీర్తన చెప్పుకోదగినవి
యోగి పరమేశ్వరదాసు :
బిక్షాటన చేసుకుంటూ ఊరూరూ తిరుగుతూ శృతిబద్ధంగా గానం చేస్తూ తాను రచించిన దాదాపు 250 పైగా తత్వగీతాలను ప్రజల్లో ప్రచారం చేసిన పరమేశ్వరదాసు ఆదిలాబాద్ జిల్లావాసి. ఆయన రాసిన వాటిలో
“చారీ ఆచారి జగములో యెవరొయి బ్రహ్మచారీ
సారరహిత సంసారంబులో-పరబ్రహ్మజ్ఞాన పరిపక్వ మొనర్చిన
నరుడే బ్రహ్మచారి
యీ జగములో' అనే తత్వగీతం
కర్మ దాటతరమా నరుడా కర్మదాట తరమా
కర్మచే నీర్మితకాయ సృష్టియిదే మర్మ మెరిగితే యేమూలము లేనిదే
నిర్మితమాయెను సృష్టి వింతలు
కర్మతో వెలుబడె కారనకారుడు" అనే తాత్విక రచన ప్రసిద్ధాలు.
ఉదారి నాగదాసు
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల నాగాపురం గ్రామానికి చెందిన నాగదాసు భగవంతుని ఎంత కీర్తించారో, తాత్విక చింతననుకూడా అంతే ప్రస్తుతించారు. ఆయన రాసిన కీర్తనలో
"సత్యము సర్వంబులోనా సందులేక యున్నదీ
గుట్టు తెలిసిన వారికి అది బట్టబయలైయున్నదీ"
సత్యావిష్కారణచేసి మరో కీర్తనలో భగవంతుడి ఉనికిని ప్రశ్నిస్తూ.
"కనపడవేమిరా భగవంతా - కనుబడు చున్నది జగమంతా
కనబడేదెల్ల కలిమాయేయని - వినుచుంటిరనే భగవంతా” అని సృష్టిలోని వైచిత్రిని భగవంతుని వేర్వేరు రూపాలలో దర్శింపచేస్తాడు.
వీరేకాక, ఇంకా షర్రాఫ్ అమృతదాసు(1897-1959), దాయపంతులపల్లి చెన్నదాసు (1904-1964), వెలివర్తి రామదాసు (1905-1941), పొన్నలూరి హనుమద్దాసు(1911-1986), మామిడిపల్లి సాంబకవి (1920-1980) వంటి మరెందరో తెలంగాణ వాగ్గేయకారులు తమ కృతులతో వాగ్గేయ సంప్రదాయాన్ని సుసంపన్నం చేశారు
ముస్లిం వాగ్గేయ కారులు :
తెలంగాణ ప్రాంతంలో 14వ శతాబ్దం నుండి గోల్కొండ కుతుబ్ షాలతో మొదలై 1724లో ఆసఫ్ జాహీల పాలనతో మళ్ళీ పుంజుకొని 1948 వరకు మొత్తం 6 శతాబ్దాలపాటు ముస్లింలు పరిపాలించారు. దీనివల్ల హిందూ-ముస్లింల మధ్య వైరుధ్యాలతోపాటు ఆధ్యాతిక వినిమయం, తాత్విక మార్పిడి కూడా జరిగిందని చెప్పాలి. మరో మాటల్లో చెప్పాలంటే హిందువులు నిష్కామకర్మ భావన, తాత్విక చింతన ముస్లింలను, ముస్లింల నిరాకార నిర్గుణ ఉపాసన హిందువులను కూడా ఆకర్షించింది.
ఇలా జరుగుతున్న క్రమంలో కొంతమంది ముస్లిం చింతనాపరులు భారతీయ దార్శనికతకు స్పందించి తాముకూడా వాగ్గేయ కారులుగా కీర్తనా సాహిత్య సంగీతాలను సృష్టించారు. వారిలో ప్రముఖంగా ప్రస్తావించదగినవారు అబ్దుల్ అజీం దడాఖా ఖ్వాజా అహ్మదుద్దీన్ వంటివారు.
అబ్దుల్ అజీం దవాఖా (1869-1965)
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ లో జన్మించిన దడాఖా దాదాపు 238 పైగా కీర్తనలు తెలుగులో 114 కీర్తనలను హిందీలో రచించి భక్తితత్వాన్ని తనదైన రీతిలో ప్రచారం చేసారు.
గమనించి చూడు మనసా ఘటమందు ఓం శబ్దం అమనస్కమైతే మనసా ఘటమందు ఓం శబ్దం"
అని భీంప్లాస్ రాగంలో ఆదితాళంలో రాసిన కీర్తన తత్వభోధన చేయగా, తోడిరాగంలో ఆదితాళంలో రాసిన కీర్తన తత్వ బోధన చేయగా, తోడిరాగం ఆదితాళంలో ఆయన రాసిన “మనమది శ్రీహరి గదిరా - సుజ్జానులకే తెలియునురా అనే మరో కీర్తన ఆత్మ - పరమాత్మల భావనము, తత్వాతీతంగా వ్యక్తీకరించినది.
ఖ్వాజా అహ్మదుద్దీన్ (1905-1970)
అహ్మదుద్దీన్ ఆత్మతత్వాలు' అనే పేరుతో ఐదు భాగాల గ్రంధాన్ని ప్రచురించిన ఖ్వాజా ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లాలో వసంతాపురం గ్రామంలో జన్మించారు. ఆటతాళంలో ఆయన రాసిన
"ఆటలాడుదమా శ్రీహరి పైన పాట పాడూదామా
సాటిలేని గురుడు నోట జెప్పినమాట పాటి దప్పక నిలిపి
కోటలేడును దాటి ఘట్టి గమనలోన పుట్టుగిట్టుక దెలిపి” అని ప్రభోదించారు.
అలాగే ఆటతాళంలో "త్యాగమెందుకురా మనకు భోగమెందుకురా రాగద్వేషములన్ని మాని యోగిగావలెరా" అని పారమార్ధిక తత్వాన్ని పాడారు
తెలంగాణ వాగ్గేయం - భజన సంకీర్తనా సంప్రదాయం :
ఇలా తెలంగాణ మట్టిమీద ప్రభవించిన ఎంతోమంది వాగ్గేయకారులు తమ రచనలతో గొప్ప తాత్విక భూమికను, ఆధ్యాత్మిక స్పృహను గ్రామీణ, పల్లె ప్రాంతాలలో సైతం కల్పించారు
అయితే తెలంగాణా వాగ్గేయకార సంప్రదాయంలో మరొక విశేషమేంటంటే ఈ వాగ్గేయ కారులలో రామదాసు వంటివారు మినహా ఇతరులు రాసిన కీర్తనలు అన్నీ శిష్ట సాంప్రదాయం కన్నా దేశీ సంప్రదాయంలో 'భజన సంకీర్తనల' పేరిట ప్రజలలో విపరీతంగా వాడుకలోకి వచ్చాయి. శాస్త్రీయ సంగీత కచేరీలలోనూ, సాంప్రదాయ నృత్య రీతులలోనూ ఈ భజన సంకీర్తనలు చొచ్చుకు పోకపోయినప్పటికీ, రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆలయాలలో మాత్రం ప్రధాన సంగీత ఉపాసనలుగా జనాదరణ పొందాయి స్థాయి భేదాలు, ఉన్నత-నిమ్న వర్గాల వివక్షకు అతీతంగా ఇవి ప్రజలందరికీ చేరువై వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా భజన సంకీర్తనలను నేర్చుకొని, పాడి అలరించే సౌలభ్యాన్ని కలిగించాయి.