Sunday, 17 October 2021

బుగులోని తీర్థం

 

              బుగులోని తీర్థం


1. మా ముత్తాత మా తాతకు
మా తాత, మా నాయ్నకు కశికెడు పాలతో నేర్పిచ్చిన రివాజు
దేవుడి ముచ్చట మతిలకు ఎక్కించిన మొదటి ఆవాజు బుగులెంకటేశుని తీర్థానికి బైలెళ్ళిన రోజు

తరతరాల మా నమ్మకం
ఒక తంతెనుండి ఇంకో తంతెకు ఆచారం లెక్క వచ్చింది.
రెండువేల గడపలున్న ఊళ్ళే
మా ఇంటికి బౌభాగపేరు తెచ్చింది.

నెలకొక్క పున్నమి పొడుపు మామూలే
కానీ జిరాల పున్నమి అంటేనే పెద్ద ముచ్చట
అప్పుడే యాటకొక్కపాలి బుగులోని తీర్థం జర్గుతది

ఊరికి ఉత్తరం దిక్కున 30 మైళ్ళు అవతల బుగులోని తీర్థం- తుమ్మలు-తుప్పలు, రేగుచెట్లు, పరికి పండ్లు, బలుసు పండ్ల చెట్లు స్వేచ్ఛగా పెరిగిన చిన్న అడవి
ఆ అడవి నడుమల పెద్ద గుట్ట
ఆ గుట్టపైన సొరికెల నెరిసిన దేవుడు
మా ఇంటిదేవుడు బుగులెంకటేశ్వరుడు!

2.గప్పట్ల -
బుగులోని తీర్థం పోవుడంటే ఓ కాశీ మజిలీ యాత్రకు పోయినట్టే
ఇంటి పండుగను ఊళ్ళన్ని తిర్గుకుంట చేస్కున్నట్టే!
అన్నట్టు తీర్థం పోవుడంటే-
భద్ర జీవునిలో నిక్షిప్తమైన దేశదిమ్మరితనం పురావాసనే కదా....
Indeed, it's a Nomadic Vestige
The Revisting of instinctual Spiritualism
The manifestation of primate naturalism
The resurfacing of hidden originalism!

తీర్థం పోవుడంటే
భక్తి-రక్తి మిళాయించిన
ఓ ప్రయాణ పండుగ!
ఆత్మను ఎనుకులాడుకుంట అడుగులేసే జిప్సీ జీవనం!
సామూహిక సంచార ఉత్సవం!
తొలి మానవుడి జన్యు సహజాతాల ప్రదర్శనం!

తీర్థం పోవు డoటే-
అనాది కాలంల మొదలైన
అర్థాంతరంగా ఆగిపోయిన ఆదిమయాత్రను కొనసాగించడమే కదా!

3.ఇగ బుగులోని తీర్థం పోవుడంటే
మా ఇంట్ల ఓ పెండ్లి చేసినట్టే
ఇంట్ల పెండ్లి చేసినట్టే
ఏరువాక దున్నినట్టే
నెల రోజుల ముందుగాల సందే హైరానా శురువయ్యేది
ఊరూర్ల ఉన్న బందుగులందరికీ మతలాబు చెయ్యాలే
దానికోసం మనిషిని పంపియ్యాలె
బండ్లను వడ్లాయనతోని
బండిగీరెల కమ్మెలను కమ్మరాయనతోని పుదియ్యాలె
నీళ్ళతోని మంచిగ కడిగి
నొగలుకు, గీరెలకు పసుపు కుంకుమ బొట్లను పెట్టాలె
వెదురు బొంగులను వంచి బండి మీద గుడారం లెక్క చేసి
దానిపైన చెద్దరులను కట్టాలె!
మనుషులతో పాటు గొర్రెలు, కోళ్ళు, కట్టెలు, వంటసామాన్లు సదురాలె! చూస్కో ఊరు ఊరే బండ్లమీద బైలెల్లినట్టు కనబడాలె!

మొత్తం రెండు రాత్రులు ఒక పగలు పోతె
బుగులోని జాతర !
ఊరు నుంచి మైలారం దాటి
కొప్పులకు పొయ్యేటాలకు చీకటి పడేది

అక్కడ మా తాత సుట్టాల ఇంట్ల రాత్రి విడిది
సంవత్సరానికొక్కసారి కలుత్తమని
బౌ పానంగ మర్యాదలు ... ముచ్చట్లు
రాత్రి బోయనాలు చేసి బైలెళ్ళేది

ఆకాశంల త్రయోదశి ఎన్నెల వెండి పూతల జిగేల్ జిగేల్...
మట్టిబాట మీద ఎద్దుల కాలిగిట్టల టకేల్ టకేల్
గంగడోలుల మీద గజ్జెల ఘల్ ఘల్ బండిగీరెల కింద ఎండుకొమ్మలు విరిగిన చిటపట చిటపటల్...
బండిలోపల మనుషులు అచ్చట్లు ముచ్చట్లు
అన్నీ కలిసి ఎన్నెలరాత్రిని ఆరబోసిన గాలిల
వింతైన ధ్వనులను పరిమళిస్తుండేటియి
ముచ్చట్లల్ల ముచ్చట్లల్లనే
ఎడ్లు నడుంటే నడుత్తాంటెనే
బండ్లె కట్టేసిన కోడి కూత్తది
తూర్పు గట్లల్ల తెల్లవారుతది
బుగులోని గుట్టకాడికి
మా బండ్లు చేరుకుంటయ్!

4. ఓ చెట్టునో, గుట్ట నీడనో సూసుకొని
బండ్లను ఆపి ఎడ్లను ఇడిసి గడ్డి వేసి
విడిది ఏర్పాటు చేసుకుంటం.....
మొకాలు, కాళ్ళు చేతులు కడుక్కొని
దేవుని గుండంల తానాలు జేత్తం
మూడు మునుగులు
మూడు చెంబుల నీళ్ళు తలమీద గుమ్మరించుకొని
బట్టలు మార్చుకుని
నీళ్ళు కారుతున్న వెంట్రుకలతోనే
గుట్ట ఎక్కుడు షురూ జేత్తం
బండల సందులకెళ్ళి - సొరికెలల్లకెళ్ళి
బుగులెంకటేశుని గుహదగ్గరికి పోయి
దండాలు పెట్టి - కొబ్బరికాయలు కొట్టి
పసుపు కుంకుమలు బొట్లు పెట్టి
మొక్కులు అప్పజెప్పుతం.......
గుండె నిండ భక్తిని నింపుకుని
కండ్ల నిండ దేవున్ని సూసి తప్పులు కాయమని చెంపలేసుకొని వచ్చే ఏటికి అంతా మంచే చెయ్యమని
దేవునికి ముడుపులు కడతం!

పోయిన తొవ్వల నె
మళ్ళ గుట్టు దిగి వచ్చి
గుట్ట కింద గుడారం దుకాణాలల్ల
బత్తేసలు, నిమ్మ చిల్కలు, ప్యాలాలు, బెల్లం కొనుక్కొని
దేవుని పలారం అని మూటలు కడ్తం...

5. ఇగ, మా బాబాయ్ లు -
విడిది కాడికచ్చి
దేవుని పేరుమీద మొక్కి పొట్టేల్ను, కోళ్ళను కోసి
ఆ నెత్తురును అందరికి బొట్ల లెక్క పెడ్తరు.

జీతగాండ్లు కోడి బూరు పీకి - పొట్టేలు తోలు ఒలిచి
ముక్కల కింద కొట్టి దేనిది దానికి పోగులు పెడ్తరు
తలకాయ బొక్కలు - నెత్తురు - మాంసం-
దేనికదే కుప్పలు పెట్టి మంచిగ కడుగుతరు
బండలు ఏరుకచ్చి పొయ్యి పుదిచ్చి
కట్టెలు పెట్టి అగ్గి రాజేత్తరు

గప్పుడు ఇగ ఆడోళ్ళపని మొదలైతది.
బాపమ్మ, అమ్మ, చిన్నమ్మలు అంత కూడి
వాటన్నిటిని పెద్ద పెద్ద బాసాన్ ల పెట్టి
మసాలా - గసాలాలు - పసుపు, కారాలు దట్టించి
పొయ్యిమీద గిన్నెలల్ల మరుగుతున్న నూనెల వేసి
ఘుమ ఘుమలాడే కూరలు చేత్తరు !

6. నేను చినపిలగాడ్ని గదా-
మెదడు - గుర్ధాలు - కప్పూరం - గుండె అసొంటి మెత్తటి భాగాలు సూకాగ వండి సక్కగ పెడ్తరు .
వంటలన్నీ అయిపోయి, మంటలను చల్లార్చి
గిన్నెలల్ల కూరలన్ని పొగలు కక్కుతున్నపుడె
నన్ను ఎత్తుకుని మా అమ్మ గోరుముద్దలు పెట్టేటిది తాత-నాయ్న-బాబాయ్ లు -బంధువులు
మొగోళ్ళంత
బండ్ల పక్కన చెట్టు నీడల్ల బంతిలెక్క కూసొని
సారా బుడ్డీల మూతలను
పట్వలల్ల ఉండే కల్లు మీన ఈతాకులను తీసి
స్టీలు గ్లాసులల్ల వంచి - అందరికి పంచుతరు !

ఇగ ముచ్చట్లు మొదలైతై
తాత ముత్తాతలనాటి కతలు - ఇగురాలు- ఇకమతులు
అన్నీ యాది చేసుకుని మాట్లాడుకుంటరు.
పల్లెంల ముక్కలను తినుకుంట,గ్లాసులల్ల సారా తాక్కుంట
ముచ్చట్లల్ల మునిగి తేలి
ఎప్పటికో బువ్వతిని ఎక్కడోళ్లక్కడ పండుకుంటరు!
ఇస్తాళ్ళు ఎత్తేసి, గిన్నెలు - తపేలాలు అన్నీ కడిగి
ఆడోళ్ళందరూ అన్నీ సదిరి
చాపల మీద నడుం వాలుస్తరు!

సూత్తాంటే సూత్తాంటేనే రాత్రయితది

పండు పగిలినట్లు పున్నమి ఎన్నెల ఇరగబూస్తది

అందరం ఒక్కచోట చేరినంక
పాటలన్ని అయిపోయినంక గా ఎన్నీలలనె బోయనాలు

మాటలు మాటలల్లనె మల్ల ముచ్చట్లు

అటెన్క మాతోటి వచ్చిన కూనపెల్లి రామయ్య

మార్కండేయపురాణం కథలు కండ్లకు కట్టినట్టు కనికట్టు చేసినట్టు

కథాగానం మొదలు.....
ఇనుకుంట ఇనుకుంటనే అక్కడే అందరి రాత్రి నిద్రలు!

7. పొద్దుగాల కోడి కూసే యాళ్ళకు
అందరు లేసి నోట్లె యాప పుల్లలు ఏసుకొని పండ్లు తోముకుంటరు  రాత్రి అన్నంనే పులిహోర లెక్క చేసి అందరికి పెడ్తరు.

గుడాలు గిన్నెలల్ల పోసుకుని బండ్లెక్కి

ఊరి దిక్కు పయనం కడ్తరు

సడుగు మీద ఎనకపొంటి బుగులోని గుట్ట కనిపించే దాక

'గోవింద గోవింద' అని వెంకటేశ్వరుని తల్సుకుంట
ఇంటి మొకాన ఎడ్లను తోలుతరు

ఎక్కడ ఆగకుంట

మాపటి యాళ్ళకు ఊరికి-ఇండ్లల్లకు చేరుకుంటరు.....!

ఆడోళ్ళంత మల్ల వంటలు చేసి

అందరికీ వడ్డించి ఎక్కడోళ్ళను అక్కడికి సాగ తోలుతరు

తెల్లారి పొద్దుగాల
అమ్మ - బాపమ్మ - చిన్నమ్మలు

నిష్టగ తలకు నీళ్ళు పోసుకుని, తానాలు చేసి

కొత్త చీరలు కట్టుకుంటరు.

బుగులోని తీర్థం పలారాలను
పేపర్ల పొట్లాల లెక్క కడ్తరు.

ఊళ్ళే అందరి ఇండ్లల్లకు పోయి
ముత్తయిదుల కాళ్ళకు పసుపు రాసి
పలారం పొట్లాలను అందరికీ పంచుతరు...

8. గిట్ల బుగులోని తీర్థయాత్ర
మా తాత కాలం దాకా బౌ సక్కగ నడిసింది.

మా తాత సచ్చిపోయిండు

వారసత్వంగా మా నాయ్నకు - బాబాయ్ లకు పొలాలు, భూములు, అన్నీ విరాసత్ ల సంక్రమించినై

బంగారం - భవనాలు
ఎడ్లు - కొట్టాలు - పండిన పంటలు అన్నీ సమానంగా
పంపకమైనయి

కానీ

మా ముత్తాత - తాతకు అందిచ్చిన బుగులోని తీర్థయాత్ర

మా తాతతోనే ఆగిపోయింది.

అన్ని పంచుకున్న కొడుకులు -

ఉజ్జోగం సజ్జోగం కోసం కొత్త యాత్రలు పోయిండ్రు!
ఎక్కడెక్కడికో ఎగిరిపోయిండ్రు!

ఇప్పుడు మా తాత... బుగులోని తీర్థానికి మా యాత్ర

రెండూ చిన్నప్పటి జ్ఞాపకాల లెక్కనే....
నడిమిట్ల ఆగిపోయిన ప్రయాణం లెక్కనే....
తెగిన తంతే లెక్కనే....
తల్లి పేగును తెంపుకున్న పసిబిడ్డ లెక్కనే.......!

- మామిడి హరికృష్ణ

(మే, 2011)