ఒకానొక dislocation సూత్రం!
----- మామిడి హరికృష్ణ 8008005231
ఇప్పటిదాకా మీరందరూ అన్నారు
జాతుల మధ్య పోరాటాలు మాత్రమే మనల్ని dislocate చేస్తాయని
దేశ సరిహద్దుల వద్ద యుద్ధాలు మాత్రమే
ఈ స్థితిని సృష్టిస్తుంది
కరువుకాటకాలు మాత్రమే దీనికి కారణం అవకాటకాలు
వరదలు -సునామీలు
అగ్నిపర్వత లావాలు- అడవి కార్చిచ్చులు
భూకంపాలు- అణుబాంబు విస్ఫోటనం మాత్రమే
దీన్ని విస్తరింప చేయండి...
కానీ తొలగుట
తప్పించలేని తప్పించుకోలేని invitable phenomenon కదా!
భూమి పొరలలోకి ఒకసారి తొంగి చూడు
మనిషి పాదంపై పగుళ్లను ఒకసారి తడిమి చూడు
చలనంలోనే ఉనికి -ఊపిరి ఉందని
ఉపాధి- ఉద్యోగాలలోనే భద్ర జీవితం ఉందని నమ్మావు
dislocation ను నీకు నువ్వుగా ఆహ్వానించావు
నువ్వు గమనించావో లేదో
మనకు తొట్టతొలి dislocation ఎక్కడ జరిగిందో తెలుసా
అమ్మ గర్భంలో నుంచి విడిపడి
ఈ ప్రపంచంలోకి దిగుమతి అయినప్పుడే !
అంతేనా --
మన ప్రయాణంలో జరిగిన ప్రతి మలుపు ఓ dislocation యే కదా
ఇంట్లో కలతిరిగిన బుడి బుడి పాదాలు బడి దిక్కు అడుగులు వేసినపుడు
కాలేజీ కోసం మన మెదళ్లను బస్సు ఎక్కించి పట్టణానికి పంపించినప్పుడు
జీవిక కోసం ఊరును -అమ్మ నాన్నలను వదిలి కారు స్టీరింగ్ అయి కదిలినప్పుడు
బంగరు భవిత కోసం రైలు నుంచి విమానం రెక్కలు కట్టుకున్నప్పుడు
ఇలా మనం నిరంతరం dislocate అవుతూనే ఉన్నాం !
అంతేనా --
ఆశ కోసం -ఆశయం కోసం
కలలు కనడం కోసం- కలల్ని సాకారం చేసుకోవడం కోసం
ఆర్ద్రత కోసం -ఆత్మీయత కోసం- ఆరోగ్యం కోసం -ఆర్థిక అభివృద్ధి కోసం
ఆత్మాభిమానం కోసం -అంతరంగ అన్వేషణ కోసం
ఆధ్యాత్మిక వికాసం కోసం- ఆత్మ సాక్షాత్కారం కోసం
దాహం కోసం -మోహం కోసం- సందేహం కోసం
పుణ్యం కోసం -పురుషార్థం కోసం- ప్రకృతి సౌందర్య ఆరాధన కోసం
ఇలా ఇంకెన్నిటి వల్లనో మనం నిత్యం dislocate అవుతూనే ఉన్నాం !
అయినా సత్యం ఎరుకలోకి వచ్చింది-
చెట్టు కొమ్మ నుండి యాపిల్ పండు dislocate అయినప్పుడే కదా ...
మట్టి అంతా తడిసి మెత్తబడి మొలకలకు తొవ్విచ్చింది -
మబ్బుల నుండి వాన చుక్క dislocate అయి జారినప్పుడే కదా ...
కోట్లాది కడుపులు నిండి సంబరంలో ఊగిసలాడింది -
పొలాల నుండి వారి గొలుసులు dislocate అయినప్పుడే కదా ...
భూగోళం మీది అన్ని ఖండాలలో మన జెండా ఎగిరింది -
ఆఫ్రికా నుంచి మనం dislocate అయినందువల్లే కదా..
సౌరమండలంలో కూడా స్పేస్ స్టేషన్ వెలిసింది-
మన చూపులు నేల నుండి ఆకాశం వంక dislocate అయినందుకే కదా...
నువ్వు ఎన్నైనా చెప్పు
Dislocation మనలలోనే ప్రోగ్రామింగ్ అయి ఉంది
జీవి సహజత సూత్రంగానే కాదు
సామాజిక ధర్మంగా కూడా నిర్ధారణ అయింది
ఇంకా అనుమానం ఉంటే నీ ధమనులలోని రక్తకణాలను
అవి నిరంతరం ప్రవహిస్తూ అదే నిజాన్ని ఆక్సిజన్ సాక్షిగా ప్రతిధ్వనిస్తాయి
దోస్త్... అంతా బాగానే ఉంది కానీ
నిన్న రాత్రి తొలిజాములో
నీ ప్రేమను చేరుకోలేని నిస్సహాయతలో
నీ నుండి నువ్వు dislocate అయ్యావు చూడూ...
అప్పుడు నాకు తెలియకుండానే
నా కంటి అశ్రువులు కూడా dislocate అయ్యాయి.... !
#mhk_poetry