Saturday, 26 March 2022

ఒక సత్యం.... బహు వర్ణాలు!

 Here, it's my poem, OKA SATYAM... BAHU VARNAALU, published in SOPATHI Sunday supplement of nava telangaana news paper on 27-3-2022...



ఒక సత్యం.... బహు వర్ణాలు!

     --------- మామిడి హరికృష్ణ 


1. వారన్నారు--- 

సత్యం ఎప్పుడూ 

నాకు ఎదురుగానో 

పక్క పక్కనే నడుస్తూనో 

నాకు సమీపంగా కూర్చొని 

నా సమక్షంలో నన్ను క్రీగంట వీక్షిస్తూనో 

నేను కావ్యాలతో సంభాషిస్తూ ఉంటే 

తలుపు పక్కన నిలబడి 

చూపులతో దాగుడుమూతలాడుతూనో 

నేను అక్షరాలు దిద్దుతుంటే 

నన్నే తదేకంగా చూస్తూనో ఉంటుందని...! 


నా నీడగా అడుగుజాడ గా

నా సన్నిధిలో నన్ను ఆసాంతం అల్లుకునో 

బిగియారా కౌగిలించుకొనో 

ఏకాంతంలో నా ఒడిలో కరిగిపోతూనో 

చేతులు చాచి ద్వారాలు తెరిచి 

నన్ను ఆత్మీయంగా ఆహ్వానిస్తూనో 

నా ఆత్మని పూరెమ్మలతో ఒడిసిపట్టుకుని 

అనూహ్య లోకాలలో విహరింప చేస్తూనో  ఉంటుందని...!


2. కానీ ఇప్పుడే తెలిసింది!

సత్యం అరూపి ----

దానికి ఇలానే ఉండాలని 

ఈ ఆకారంలో మాత్రమే దర్శనం ఇవ్వాలనే నియమం లేదు 

మన ఊహల్లో మాత్రమే ఉండి మనం ఇంకా చేరుకోలేని 

seventh state of matter లానైనా కనిపించవచ్చు !


3. సత్యం బహురూపి---

ఎలా అయినా ఉండొచ్చు 

కలల్లో, జ్ఞాపకాలలో,  ఆలోచనల్లో 

భావాలలో, సందేహాలలో, అనుమానాలలో 

మబ్బు తెరల్లా నన్ను చుట్టేసి ఉండొచ్చు

గదిలోనో,  హాల్ లోనో, 

నా  jurisdiction పరిధులు

నా radius పరిమితులలో మాత్రమే కాదు 

మన Orbit కు  ఆవల కూడా ఉండొచ్చు

భూమ్యాకర్షణకు అతీతంగా ఉన్నా 

నన్ను తనలోకి లాక్కుంటూనే ఉండొచ్చు.. 


4. సత్యం నైరూపి---

వినికిడి మేరా Varandahలలోనో 

కనుచూపు మేరా Corridor లలోనో 

Wireless  Satellite  ప్రసారాల దూరంలోనో 

అల్లంతదూరాన అంతరిక్ష వీధిలోనో ఎక్కడైనా ఉండొచ్చు 


5. సత్యమే శివమ్!

marble floor పై సున్నితంగా నడుస్తూ 

బింబ ప్రతిబింబాలు రెండూ కలిసి చలిస్తూ 

కొంగులో నేసిన గులాబీలను నేలపై రాలుస్తుంది 

గోడవారగా పయనిస్తూ వసారా చివరకు చేరుకొని 

కిటికీ దగ్గర ఆగిపోయి 

అద్దాల గుండా ప్రపంచాన్ని వీక్షిస్తూ 

ఏ పిల్లగాలి తాకిడికో 

ఏ జ్ఞాపకాల ఉరవడికో 

పెదాలపై చిర్నవ్వులను గాలిలోకి విసురుతుంది... !


6. సత్యమే  సౌందర్యం!

ఎక్కడున్నామనే దాని కన్నా 

ఎంత influence  చేసామన్నది కదా పాయింట్!

తల పైన ఆకాశంలో 

వెలుగుతూ వేలాడుతున్న నక్షత్రాలు 

పాదాల కింద గరుకుగా నున్నగా తాకే మట్టి రేణువులు

గులాబీ అంచు పచ్చని ఆకుల చీరను దేహం నిండా చుట్టేసి 

ప్రవహించే నదుల కురులు 

వెన్నెముకను సున్నితంగా స్పర్శిస్తూ ఉంటాయి 

ఎడమ భుజం పై నుండి జీరాడుతున్న చీర కొంగును

చేతిలో మడిచి బొటన వేలు చుట్టూ చుట్టేసి

ఏడేడు అడుగులు ముందుకు  నడిచాక

గాలిలోంచి తేలి వచ్చే ఏ మంత్రాలకో ముగ్ధమై 

ఒక్కసారిగా సిగ్గిల్లిన  భారంతో తలను దించి

ఏ పట్టు తెరల చాటుకో 

పట్టుబడకుండా పక్కకు తప్పుకుంటుంది !


7. Truth is omniscient

Goodness is ubiquitous

Beauty is omnipresent 


#mhk_poetry

Thursday, 24 March 2022

పిట్టని దేవులాడిన గూడు!

 


పిట్టని దేవులాడిన గూడు!

                                 - మామిడి హరికృష్ణ


1. ఇత్నా బడా షహీన్ షహర్ల ఇల్లేమీ లేనివాణ్ని

 అడ్రస్ అంటూ లేనివాణ్ని


 కాందిశీకున్ని.. శరణార్థిని 


నిత్య యాత్రికుడ్ని... నిరంతర సంచారిని


2. యుగాల క్రిందకెపుడో

 నాకూ ఓ గుహ ఉండేది. 

తొలినాటి నా ఊహలని చిత్రించి 

బలహీనతలని దాచుకోవడానికి 

భయాలని రాళ్ళకింద పాతిపెట్టి

 వాన, చలి, ఎండ నుంచి కాపాడుకోవడానికి 

మనిషి - మృగం నుంచి పారిపోయి

 నా ఉనికికి చిగుళ్ళు తొడగడానికి 

నాకూ ఒక గుహ ఉండేది.


3. శతాబ్దాల క్రితమెపుడో 

నాకూ ఓ గూడు ఉండేది

గోడు చెప్పుకోడానికి 

'దిగుడు'లో దిగుళ్ళ దీపం వెలిగించి 

చిలక్కొయ్యకు కన్నీళ్ళ అంగీని ఆరేయడానికి 

'సూరు'లో చిరునవ్వుల విస్తరాకును చెక్కి

 పొయ్యి కింద కట్టెల్లో బతుకు మెతుకులను రాజేయడానికి 

నా అస్తిత్వానికి గుడికట్టడానికి 

నాకూ ఓ గుడిసుండేది.



4. దశాబ్దాల క్రిందటెపుడో 

నాకూ ఓ ఇల్లుండేది.

క్యాలెండర్లో ఉద్వేగాలని వేళ్ళాడదీసి

 బీరువాలో ఉత్సాహాలని భద్రపరచడానికి

 టీపాయ్ మీద ఉత్తేజాలను Flower- vase లా పరచి 

రంగుల్లో అనుబంధాలను అద్దడానికి 

నా ఆత్మగౌరవానికి రెక్కలు తొడగడానికి

 నా ఓ ఇల్లుండేది.


5. ఇపుడదంతా ఓ యాది.... ఓ జ్ఞాపకం..... ఓ Nostalgia

 నాలుకకీ నాభికీ మధ్య నిరంతర వలస 

మొదటి అక్షరానికీ - చివరి వాక్యానికీ మధ్య అలుపులేని ప్రయాణం



6. ఇపుడేమో గుహ మతిలలేకుండ పోయి

 ఆదిమ పేగుబంధం తెగినట్లయింది

గుడిసెను యాది మర్సి 

 గుండెను పాతాళంల పాతిపెట్టినట్లయింది 

ఇల్లు కళ్ళలోంచి కరిగిపోయి

 మట్టి వాసన మచ్చుకైనా లేకుండా మాయమయింది


7. పుస్తకాల రెక్కలు కట్టుకొని

 ఊరు దాటి ఎగిరి వచ్చినంక


 జిందగీల కొత్త ఆట షరీక్ అయింది


 ఉరుకులాట.... పెనుగులాట.... 


దేవులాట.... తన్లాట 


గివ్వే ఇప్పటి ఆటలు

 ఈ వేటలో యాదిలన్నీ తుక్ డ తుక్ డ అయినై 

ఎండిన ఆకుల్లెక్క 'పటపట ఇరిగిపోయినయి

 అప్పుడప్పుడు వాన వచ్చినట్టు ఇల్లు గుర్తుకచ్చేటిది

.గుండె చప్పుడు మతిలకచ్చేటిది

 ఎదురుంగ ఉరికి ఉరికి మీదికచ్చి

 మబ్బుల్ల పడి మాయమయ్యే మెరుపు.....




8. కనీ, ఎగిలివారంగ ఊళ్ళ నుంచి బైలెల్లి 

సడక్ ఎక్కి, ఎడ్లబండెక్కి, ఎర్రబస్సెక్కి

రైలుబండెక్కి, ఆటోరిచ్చ ఎక్కి

 పట్టపగటియాళ్ళకి

పట్నంల నేను పన్జేసే ఆఫీసుకు 

నాయ్నా, నువ్వచ్చినవ్ సూడు

 అప్పుడు -

మన ఇల్లు ఇల్లే

నా దగ్గరికి నడ్సి వచ్చినట్టనిపిచ్చె.....

ఎగిరిపోయిన పిట్టని ఎనుకులాడుకుంట

 గూడే కదిలివచ్చినట్టనిపిచ్చె......