పిట్టని దేవులాడిన గూడు!
- మామిడి హరికృష్ణ
1. ఇత్నా బడా షహీన్ షహర్ల ఇల్లేమీ లేనివాణ్ని
అడ్రస్ అంటూ లేనివాణ్ని
కాందిశీకున్ని.. శరణార్థిని
నిత్య యాత్రికుడ్ని... నిరంతర సంచారిని
2. యుగాల క్రిందకెపుడో
నాకూ ఓ గుహ ఉండేది.
తొలినాటి నా ఊహలని చిత్రించి
బలహీనతలని దాచుకోవడానికి
భయాలని రాళ్ళకింద పాతిపెట్టి
వాన, చలి, ఎండ నుంచి కాపాడుకోవడానికి
మనిషి - మృగం నుంచి పారిపోయి
నా ఉనికికి చిగుళ్ళు తొడగడానికి
నాకూ ఒక గుహ ఉండేది.
3. శతాబ్దాల క్రితమెపుడో
నాకూ ఓ గూడు ఉండేది
గోడు చెప్పుకోడానికి
'దిగుడు'లో దిగుళ్ళ దీపం వెలిగించి
చిలక్కొయ్యకు కన్నీళ్ళ అంగీని ఆరేయడానికి
'సూరు'లో చిరునవ్వుల విస్తరాకును చెక్కి
పొయ్యి కింద కట్టెల్లో బతుకు మెతుకులను రాజేయడానికి
నా అస్తిత్వానికి గుడికట్టడానికి
నాకూ ఓ గుడిసుండేది.
4. దశాబ్దాల క్రిందటెపుడో
నాకూ ఓ ఇల్లుండేది.
క్యాలెండర్లో ఉద్వేగాలని వేళ్ళాడదీసి
బీరువాలో ఉత్సాహాలని భద్రపరచడానికి
టీపాయ్ మీద ఉత్తేజాలను Flower- vase లా పరచి
రంగుల్లో అనుబంధాలను అద్దడానికి
నా ఆత్మగౌరవానికి రెక్కలు తొడగడానికి
నా ఓ ఇల్లుండేది.
5. ఇపుడదంతా ఓ యాది.... ఓ జ్ఞాపకం..... ఓ Nostalgia
నాలుకకీ నాభికీ మధ్య నిరంతర వలస
మొదటి అక్షరానికీ - చివరి వాక్యానికీ మధ్య అలుపులేని ప్రయాణం
6. ఇపుడేమో గుహ మతిలలేకుండ పోయి
ఆదిమ పేగుబంధం తెగినట్లయింది
గుడిసెను యాది మర్సి
గుండెను పాతాళంల పాతిపెట్టినట్లయింది
ఇల్లు కళ్ళలోంచి కరిగిపోయి
మట్టి వాసన మచ్చుకైనా లేకుండా మాయమయింది
7. పుస్తకాల రెక్కలు కట్టుకొని
ఊరు దాటి ఎగిరి వచ్చినంక
జిందగీల కొత్త ఆట షరీక్ అయింది
ఉరుకులాట.... పెనుగులాట....
దేవులాట.... తన్లాట
గివ్వే ఇప్పటి ఆటలు
ఈ వేటలో యాదిలన్నీ తుక్ డ తుక్ డ అయినై
ఎండిన ఆకుల్లెక్క 'పటపట ఇరిగిపోయినయి
అప్పుడప్పుడు వాన వచ్చినట్టు ఇల్లు గుర్తుకచ్చేటిది
.గుండె చప్పుడు మతిలకచ్చేటిది
ఎదురుంగ ఉరికి ఉరికి మీదికచ్చి
మబ్బుల్ల పడి మాయమయ్యే మెరుపు.....
8. కనీ, ఎగిలివారంగ ఊళ్ళ నుంచి బైలెల్లి
సడక్ ఎక్కి, ఎడ్లబండెక్కి, ఎర్రబస్సెక్కి
రైలుబండెక్కి, ఆటోరిచ్చ ఎక్కి
పట్టపగటియాళ్ళకి
పట్నంల నేను పన్జేసే ఆఫీసుకు
నాయ్నా, నువ్వచ్చినవ్ సూడు
అప్పుడు -
మన ఇల్లు ఇల్లే
నా దగ్గరికి నడ్సి వచ్చినట్టనిపిచ్చె.....
ఎగిరిపోయిన పిట్టని ఎనుకులాడుకుంట
గూడే కదిలివచ్చినట్టనిపిచ్చె......
No comments:
Post a Comment