Tuesday, 21 July 2020

పండగల్లో కార్పొరేట్ పాఠాలు ! Harikrishna Mamidi

పండగల్లో కార్పొరేట్ పాఠాలు!
-------- harikrishna mamidi 

కార్పొరేట్ కంపెనీలు నేడు తమ వ్యాపార వ్యూహాల కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీల సలహాలను, ట్రేడ్ అనలిస్టుల సూచనలను పాటించిన ఈ కంపెనీలు ఇప్పుడు భారతదేశం మూలాల్లోకి వెళ్లి, ఇక్కడి ‘నేటివ్ స్టైల్స్’తో కార్పొరేట్ ప్రపంచాన్ని పునర్నిర్మించే పని చేస్తున్నాయి.

దానికోసం దేశీయ ఉత్సవాలైన ‘పండగల లోంచి పాఠాల’ను ఒంటబట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ వనరుల నిర్వహణ మొదలుకొని, వినియోగదారు ప్రవర్తన వరకూ అన్ని రకాల కార్పొరేట్ వ్యూహాలకూ పరిష్కారాలను పండగల్లోంచి ‘కనుక్కునే’ దిశగా అడుగులేస్తున్నాయి.
*******************************

కోల్‌కతా...
టోలీగంజ్ ఏరియాలోని రిచ్ కాలనీ...
దాదాపు 50 మందికి పైగా యంగ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ నెలరోజుల నుంచీ రోజూ షిఫ్టులవారీగా ఆ కాలనీని సందర్శించి, అక్కడ నివాసం ఉంటున్న సెలబ్రిటీల నుండి కామన్‌మ్యాన్ వరకూ అందరినీ కలుస్తున్నారు. వివరాలను సేకరించి ల్యాప్‌టాపుల్లో ఫీడ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఆ కాలనీ ‘లుక్’ని ఫొటోలు తీస్తున్నారు. వేర్వేరు కోణాల్లో రోడ్లని, అపార్ట్‌మెంట్లని షూట్ చేస్తున్నారు. ఈ హంగామా అంతా ఏదో సినిమా కోసమో టీవీ సీరియల్ కోసమో కానే కాదు. దీపావళి పండుగని సెలబ్రేట్ చేయడం కోసం ఓ కార్పొరేట్ కంపెనీ సన్నాహక ప్రాజెక్ట్ అది!

పండుగలు చెప్పే పాఠాలు
కంపెనీల స్థాపనకు ముందు జరిగే మార్కెట్ సర్వే మొదలుకొని, కంపెనీ ఎదుర్కొనే సవాళ్ల పరిష్కారం వరకూ విదేశాల్లోని ‘మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ’లను సంప్రదించడం, దానికోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం కార్పొరేట్ బిజినెస్‌లో మామూలే. ఆ మాటకొస్తే, అసలు ‘కార్పొరేట్ నిర్వహణ’ అనే కాన్సెప్టే అమెరికా వంటి దేశాల ఆర్థిక అవసరాల్లోంచి పుట్టింది. అందుకే కార్పొరేట్ కంపెనీల నిర్వహణ అనగానే ఫ్రెడ్ లూథాన్స్, ఫిలిప్ కొట్లర్ రూపొందించిన విధానాలే ప్రామాణికంగా ఉంటూ వచ్చాయి. ఎల్టన్ మేయో ‘మానవ సంబంధాల దృక్పథం’, ఫ్రెడ్‌రిగ్స్ ‘తులనాత్మక దృక్పథం’ వంటివే కార్పొరేట్ కంపెనీల నిర్వహణాశైలులుగా మారాయి. ఛెస్టర్ బెర్నార్డ్ అధ్యయనాలు, డేల్ కార్నెజీ ఇన్‌స్టిట్యూట్ సూచనలు వాటికి బైబిల్‌లా మారాయి.

అయితే, జాతి వారసత్వ సంపదగా వేల యేళ్ల నుంచీ ఉన్న పండుగలు ఇన్నేళ్లు ఎలా కొనసాగగలుగుతున్నాయి? మన కంపెనీలు కనీసం పదేళ్ల పాటు కూడా ఆ స్ఫూర్తిని ఎందుకు కొనసాగించలేకపోతున్నాయి? ఎన్ని ఆర్థిక సంక్షోభాలు, ఒడిదుడుకులు వచ్చినా నిరాటంకంగా కొనసాగుతున్న ఈ పండుగల్లాగా, ఆర్థిక మాంద్యాలకు అతీతంగా స్థిరమైన వృద్ధితో కంపెనీలను ఎందుకు నడపలేకపోతున్నాం? ఈ ప్రశ్నల్లోంచే ఇప్పుడు భారతీయ పండగలపై కార్పొరేట్ అధ్యయనాల ఆలోచన మొలకెత్తింది. పండుగలు చెప్పకనే చెప్తున్న పాఠాలను పెద్ద కంపెనీల సీఈఓలు సైతం బుద్ధిమంతులైన విద్యార్థుల్లాగా చేతులు కట్టుకుని వింటున్నారు.

టీమ్ స్పిరిట్ బోధించే జన్మాష్టమి
మూడు నాలుగేళ్ల క్రితం ముంబైలోని కొన్ని అటానమస్ మేనేజ్‌మెంట్ కాలేజీలు తమ ఎంబీఏ విద్యార్థులకు ‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ వేడుకల్లో పాల్గొనడం తప్పనిసరి చేశాయి. జన్మాష్టమి వేడుకల్లో ‘ఉట్టి కొట్టే కార్యక్రమం’ గొప్ప ఉత్సవం. విద్యార్థులు అందులో పాల్గొనాలి. విజయం సాధించాలి. దానికోసం చేసే ప్రయత్నాలను తమ వాస్తవ అనుభవాలతో సహా గ్రంథస్థం చేసి, ‘ప్రాజెక్ట్ థీసిస్’లా సమర్పించాలి. ఈ అంశాలనే వివిధ ఐటీ కంపెనీలకు మార్గదర్శక ప్రతిపాదనలుగా అందిస్తున్నారు.

లక్ష్యం - అల్లంత ఎత్తున్న రెండు ఎదురెదురు అపార్ట్‌మెంట్ల మధ్య 10వ అంతస్థులో వేలాడుతున్న ఉట్టి.
లక్ష్యాన్ని ఛేదించడానికి ఉన్న ఒకే ఒక మార్గం - మానవ పిరమిడ్ నిర్మాణం. దీని నిర్మాణానికి శారీరక దారుఢ్యం అవసరం.
10వ అంతస్థు అంత ఎత్తు చేరడానికి ఎంతమంది మనుషులు అవసరమవుతారో మానవ వనరుల ప్రణాళిక చేసుకోవడం. విద్యార్థులను దీనికోసం ఎంపిక చేసుకోవడం. దీనికోసం విద్యార్థుల్లో ‘టీమ్ స్పిరిట్’ని పెంపొందించడం.

ఎంపిక చేసిన మ్యాన్ పవర్‌కి ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం (పిరమిడ్ నిర్మాణం ప్రత్యేక నైపుణ్యమే కదా!)
పిరమిడ్‌ను మూడంచెలుగా నిర్మించడం. దిగువ భాగాన ఆరోగ్యంగా, బలంగా ఉన్నవారిని నిలపడం. వారిపైన చురుకుగా ఉండేవారిని ఎక్కించడం. బరువు తక్కువగా, సన్నగా ఉండే ఒక వ్యక్తి వీరందరిపై నుంచి మెట్లు మెట్లుగా ఎక్కుతూ శిఖరానికి చేరుకుని ఉట్టిని (లక్ష్యాన్ని) ఛేదించడం.

ఈ మొత్తం టాస్క్‌ని పూర్తిచేయడానికి కాలావధి ఉంటుంది. కనుక సరైన టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్‌ని పాటించడం.
పిరమిడ్ నిర్మిస్తున్న సమయంలో ఎదురయ్యే ఆటంకాలకు (కుండపోతగా నీళ్లు చల్లుతుంటారు) చలించకుండా దీక్షతో నిలిచే మనోభీష్టాన్ని ఏర్పర్చడం.

ఈ కోణంలో జన్మాష్టమి వేడుకలని విశ్లేషిస్తే, కార్పొరేట్ కంపెనీలు పాటించే విజయసూత్రాలే ఇందులో ఇమిడి ఉన్నట్లుగా కనిపించక మానవు.

పని విభజనను తెలిపే వినాయక చవితి

తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సామూహిక సాంస్కృతిక ఉత్సవాలను కార్పొరేట్ కంపెనీలు కొత్తగా అర్థం చేసుకుంటున్నాయి.
కొత్త కంపెనీని స్థాపించాలంటే ముందుగా లొకేషన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ఉత్సవాల నిర్వహణకు ఓ కాలనీనో, గ్రామాన్నో ఎంపిక చేసుకోవాలి.

మొత్తం ఉత్సవాల నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమీకరించడం - కాలనీవాసుల నుండి చందాలు, ఏదైనా కంపెనీ స్పాన్సర్‌షిప్ ద్వారా సమకూర్చుకోవడం (కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులను అప్రోచ్ అయ్యే ధోరణి).

వేదిక నిర్మాణానికి కావలసిన కలప, అలంకరణ సామగ్రి, విగ్రహాన్ని సమకూర్చుకోవాలి. (ఆఫీసు భవనం, విద్యుత్, రవాణా, కంప్యూటర్లు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సమానం).

ఉత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. రెండు రోజుల ముందు జరిగే సన్నాహక చర్యలని, నిమజ్జన అనంతర కార్యక్రమాలని ప్రణాళిక వేసుకోవాలి.

విగ్రహ ప్రతిష్ఠాపనలో కావలసిన వనరులను సమకూర్చుకోవాలి. నిమజ్జనం రోజు జరిగే వేడుకలకి కావలసిన వస్తువులు, ఆహారం, పండ్లు, వాహనం వంటివి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా టైమ్ ఫ్రేమ్‌లో నిర్వహించాలి.

9 రోజులకి గాను రోజూ ఒక విశిష్టమైన ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయాలి. దీనికోసం ప్రత్యేక నైపుణ్యాలు గల కళాకారులను రప్పించాలి. (కలవడం, కన్విన్స్ చేయడం వంటి కార్పొరేట్ సంప్రదింపు నైపుణ్యాలు ఒంటబడతాయి).

ఒకే నాయకత్వం కింద పనిచేయడం (లీడర్‌షిప్), తమ మధ్య పనులను విభజించుకుని (డివిజన్ ఆఫ్ వర్క్), తమకప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం. ఎప్పుడూ టీమ్‌లో ఉత్తేజాన్ని కలిగించడం, ప్రోత్సహించడం. టీమ్ మెంబర్స్‌కుండే ప్రత్యేక సామర్థ్యాలను బట్టి వారికి బాధ్యతలను అప్పగించడం (సామాజిక సామర్థ్యాలు ఉన్న వారిని వేదిక దగ్గర నియమించడం వంటివి), వారందరినీ సమన్వయం చేయడం (ఇవన్నీ కో-ఆర్డినేషన్ సూత్రానికి ప్రాక్టికల్సే!)

లక్ష్యాన్ని ఛేదించడం నేర్పే రావణ వధ
బెంగళూరులోని కొన్ని ఐటీ కంపెనీలు ఇటీవలి దసరా వేడుకల్లో తమ సిబ్బందిని పాల్గొనమని చెప్పడమే కాక, వారి పరిశీలనలు, అనుభవాలను రిపోర్ట్ రూపంలో అందించాల్సిందిగా ఆదేశించాయి. రావణ వధ వేడుకలను తమ సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన వ్యూహాల కోసం ఉపయోగపడే ప్రయోగాలుగా భావించడమే దీనికి కారణం.

రావణ వధ వేడుకకు మొదట కావలసింది ఖాళీ మైదానం. గ్రామానికి చేరువలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడం. (కార్పొరేట్ కంపెనీలు కూడా తమ కంపెనీలు ‘సెజ్’లో, ఐటీ హబ్‌లలో, పారిశ్రామిక ఎస్టేట్లలో ఏర్పాటు చేయాలని భావించడం లాంటిదే).

ఈ వేడుకని నిర్వహించడానికి గ్రామపంచాయితీ ఆఫీసు నుండి, పోలీసు యంత్రాంగం నుండి అనుమతులు తీసుకోవడం (కంపెనీ స్థాపనలో లెసైన్సులు పొందడం, ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడం, కావలసిన ‘స్పేస్’ని సాధించడం).

మానవ, ఆర్థిక వనరులను మొబిలైజ్ చేయడం (కంపెనీ స్థాపనకు కావలసిన పెట్టుబడులు, హ్యూమన్ క్యాపిటల్ సముపార్జన).

బాణంతో రావణ బొమ్మను కాల్చడం (ప్రాబ్లమ్ షూటింగ్ సామర్థ్యం ఉన్న వ్యక్తిని టీమ్ లీడర్‌గా పెట్టి టార్గెట్‌ని సాధించే కార్పొరేట్ ప్రక్రియ).

టార్గెట్ కస్టమర్‌‌స అంచనా వేయించే దీపావళి

కోల్‌కతాలోని కొన్ని స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు దీపావళి నిర్వహణ ద్వారా కొత్త మేనేజ్‌మెంట్ సూత్రాలను ఉద్యోగులు నేర్చుకునేలా చేస్తున్నాయి. టోలీగంజ్ ఏరియాలో చేస్తున్న ప్రయోగం అందులో భాగమే.

టోలీగంజ్‌లోని ఓ కాలనీలో ఉన్న ఇళ్లు ఎన్ని, జనాభా ఎంత, పిల్లలు, మహిళలు ఎంతమంది అనే సర్వే చేశారు. (కార్పొరేట్ ప్రాథమిక సూత్రం ‘టార్గెట్ క్లయింట్స్’ అనే భావన ఇక్కడ ఆచరణలో తెలుస్తుంది).

కాలనీ విస్తీర్ణం ఎంత, రోడ్లు ఎంతమేరకు ఉన్నాయి అనే సర్వే చేయడం (తమ ప్రొడక్ట్‌కి మార్కెట్ ఏ మేరకు ఉంది, ఎంత ఉత్పత్తి అవసరం అనే అంచనాలకి రావడం లాంటిది).

దాన్ని బట్టి ఎన్ని దీపాలు, ఏ రకం దీపాలు, దేనితో తయారుచేసిన దీపాలు అవసరమవుతాయో ఒక అంచనాకు రావడం (క్లయింట్ల అవసరాన్ని బట్టి తగిన సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడం)

ఫైర్‌వర్క్స్ కౌంటర్ దగ్గర ఎంతమంది ఉండాలో నిర్ణయించడం, ప్రమాదాలేవీ రాకుండా ఫైర్ ఇంజన్‌ని, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవడం (సాఫ్ట్‌వేర్‌కు వైరస్ రాకుండా, ఫైల్స్ కరప్ట్ కాకుండా జాగ్రత్తలు చేపట్టడం. ఒకవేళ ఏమైనా జరిగితే హెల్ప్‌లైన్, 24/7 ‘ఆన్‌బోర్డ్’గా ఉండే నిపుణులను ఏర్పాటు చేయడం లాంటివి)

కొచ్చిన్‌లోని కొన్ని కంపెనీలు ఓనమ్ పండుగ సందర్భంగా జరిగే బోట్ రేసులను ఈ కోణంలోంచి అర్థం చేసుకోవడం కోసం ప్రత్యేక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. అలాగే చండీగర్‌లోని సిఖ్‌వాడీలో సిక్కుల పవిత్ర పండుగైన ‘వైశాఖి’ జరిగే తీరును కూడా అధ్యయనం చేస్తున్నారు.

మానవ సంబంధాలకే పట్టం
వేలాది సంవత్సరాలుగా పండుగలు సెలెబ్రేట్ చేసుకోవడంలో ఉన్న మూలసూత్రం, ఈ అధ్యయనాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారతీయ పండుగల్లో ఉన్న ప్రధాన లక్షణం సామూహిక ఉత్సవం. ఒకరికోసం అందరు, అందరి కోసం ఒక్కరు అనే సాముదాయిక జీవన సౌందర్యమని గుర్తిస్తున్నారు. ఈ వేడుకల్లో మనుషులందరినీ ఒక్కటిగా చేస్తున్న మూలకారకం-మానవ సంబంధాలు అని కూడా గుర్తిస్తున్నారు.

మనుషులను నిపుణులుగా, హ్యూమన్ క్యాపిటల్‌గా, వనరులుగా, కొండొకచో ఓ యంత్రంగా మాత్రమే పరిగణిస్తున్న కార్పొరేట్ ప్రపంచం- మనిషిలోని సున్నితమైన భావోద్వేగాలకి పట్టం కడుతున్న పండుగల నుంచి కొత్త పాఠాలను నేర్చుకుంటోంది. తమ కంపెనీలను కొత్తగా నిర్మించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
.....................**********************

ప్రాచీన సాహిత్య మూలాల్లోకి...
సాధారణంగా కార్పొరేట్ కంపెనీల ఆలోచనలన్నీ ‘విజన్ 2020’, ‘విజన్ 2050’ వంటి భవిష్యత్ కాల ‘స్పెక్యులేషన్’ల మీదనే ఆధారపడి ఉంటాయి. ఆ మాటకొస్తే, కార్పొరేట్ విధానంలోనే భవిష్యత్ కాల వీక్షణం ఉంది. కానీ ఇప్పుడా ధోరణి మారింది. ‘రివర్స్ గేర్’ మొదలైంది. ప్రాచీన కావ్యాలు- సాహిత్యంలోని నిగూఢ అంశాలను ఇప్పటి అవసరాలకి అనుగుణంగా అనుప్రయుక్తం చేసుకోవడం ప్రారంభమైంది.

ఈ ధోరణిలో బడా కార్పొరేట్ కంపెనీలు తమ సమస్యల పరిష్కారానికి, గ్రీక్ ఇతిహాసాలైన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’ల మీద ఆధారపడుతున్నాయి. చైనీయుల ప్రాచీన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ పుస్తకాల మీద, ‘షాయోలిన్’, ‘నింజా’ సంస్థల నిర్వహణాశైలి మీద అధ్యయనాలు చేస్తున్నాయి. అలాగే భారతీయ ప్రాచీన సాహిత్య రూపాలైన రామాయణ, మహాభారతాలతో సహా మరెన్నో గ్రంథాలను సరికొత్త కోణంలో చదువుతున్నాయి.

యుద్ధక్షేత్రంలో అస్త్రసన్యాసం చేస్తానన్నప్పుడు, అర్జునుణ్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేయడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన ‘కౌన్సెలింగ్ సెషన్’గా భగవద్గీతను కొత్తగా చూస్తున్నారు. భక్తి, జ్ఞాన, కర్మ యోగాలుగా ఉన్న భగవద్గీతలోని కర్మ సూత్రాన్ని ‘ప్రిన్సిపుల్ ఆఫ్ యాక్షన్’గా, స్థిత ప్రజ్ఞతను ‘ఎమోషనల్ కోషియెంట్’గా సూత్రీకరిస్తున్నారు.

ఒక దేశం, ప్రాంతం, రాజ్యం బలంగా ఉండటానికి కావలసిన ప్రధానాంశాలను ‘సప్తాంగ సిద్ధాంతం’గా అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చర్చించాడు. కౌటిల్యుడు వివరించిన రాజు లక్షణాలను ఆధునిక ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు ఏవిధంగా వర్తింపజేయవచ్చో విశ్లేషిస్తున్నారు.

మహాభారతంలోని ‘శాంతిపర్వం’లో అంపశయ్యపై భీష్ముడు రాజ్యపాలనకు సంబంధించి ధర్మరాజుకి చెప్పిన సూచనలు కార్పొరేట్ కంపెనీలకు నయాసూత్రాలుగా మారాయి. అలాగే షడ్దర్శనాల్లోని స్రాంఖ్యం (కపిలుడు), యోగం (పతంజలి), న్యాయం (గౌతముడు), వైశేషికం (కణాదుడు), ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస ప్రాచీన నియమాల్లోంచి ఆధునిక విలువలను పునర్నిర్మిస్తున్నారు.

స్వదేశీ-విదేశీ కార్పొరేట్ పండిట్లను ఆకర్షిస్తున్న మరో ముఖ్యమైన గ్రంథం విష్ణుశర్మ ‘పంచతంత్రం’! ఎన్నెన్నో జీవన నియమాలను, నీతి సూత్రాలను వివిధ జంతు-పక్షుల పాత్రల ద్వారా వెల్లడించిన ఈ పుసకంలోని కథలను... ఒక కంపెనీకి మరో కంపెనీకి మధ్య జరిగే పోటీని, ఎదుటి కంపెనీని దెబ్బతీయడానికి చేసే ఎత్తుగడలని, ఉన్న కంపెనీలను మరో కంపెనీలో కలిపేయడం (మెర్జర్), ఒక కంపెనీని మరో కంపెనీకి అమ్మేయడం వంటి వ్యూహాలను విశ్లేషించడానికి ఉదాహరిస్తున్నారు.
.....................****************

‘కార్పొరేట్’కు ఆధ్యాత్మిక జోడింపు
మానవీయ కోణాన్ని, ఆధ్యాత్మిక స్ఫూర్తిని జోడించి కార్పొరేట్ ప్రపంచంలో నవ్య విప్లవానికి తెరతీస్తున్నారు కార్పొరేట్ గురువులు. వ్యక్తిగత పోటీ, ఆధ్యాత్మిక ఆనందం, వృత్తి సంతృప్తి వంటి అంశాలను చర్చిస్తూ కార్పొరేట్ ఉద్యోగుల్లోని స్ట్రెస్, డిప్రెషన్‌లకు నివృత్తి మార్గాలను సూచిస్తున్నారు ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’ ఫేమ్ రాబిన్‌శర్మ.

’Simple Living- High thinking'భావన ప్రాతిపదికగా ఉద్యోగుల మధ్య అద్భుతమైన మానవీయ స్పర్శ ద్వారానే కంపెనీలు లక్ష్యాలను సాధిస్తాయంటారు అరిందమ్ చౌదరి. భగవద్గీతను మేనేజ్‌మెంట్‌కు అన్వయించి ‘కౌంట్ ద చికెన్ బిఫోర్ దే హ్యాచ్’ రాశారాయన.

ఇక రవిశంకర్ తన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ విధానంలోని ధ్యాన ప్రక్రియ (సుదర్శన క్రియ) ద్వారా ఉద్యోగుల్లో నిశ్చల మనస్తత్వాన్ని, సవాళ్లను ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని తీసుకురావచ్చంటారు. ‘కార్పొరేట్ కంపెనీలన్నీ మానవ వనరులతోనే నడుస్తాయి. మానవులేమో నిరంతర చైతన్యశీలులు. ప్రయోగశాలల్లోని రసాయనల్లాగా స్థిరంగా ఉండరు. అలాంటివారి మధ్య సుస్థిరతకి ప్రాచీన భారతీయులు చెప్పిన ధ్యానమే మార్గ’మని ఆయన చెపుతారు. దీపక్ చోప్రా, శివ్‌ఖేరా కూడా ప్రస్తుత సంక్లిష్ట జీవనంలో ఆధ్యాత్మికత సాయంతో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం ఎలా సాధించాలో వివరిస్తారు.

అలాగే యండమూరి వీరేంద్రనాథ్ ‘విజయానికి ఆరోమెట్టు’... భగవద్గీతని ఆధునిక కార్పొరేట్ ప్రపంచానికి అన్వయిస్తూ చేసిన రచనే! ప్రయాగ రామకృష్ణ మహాభారతంలోనూ, భీష్ముని సందేశంలోనూ ఇమిడి ఉన్న కార్పొరేట్ సూత్రాలతో భీష్మ ఎట్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్‌‌స రాశారు.

-*************************
‘సినిమా స్టడీస్’ కూడా...
కార్పొరేట్ కంపెనీలు తమకు కావలసిన వ్యూహాల కోసం ఏ అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. దాన్లో భాగంగానే సినిమా లను కూడా కేస్ స్టడీ చేస్తున్నాయి. స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సైతం సినిమా అధ్యయనాలను స్పెషల్ ప్రాజెక్టు లుగా తమ సిలబస్‌లో చేర్చాయి.

అలాంటి అరుదైన గౌరవం దక్కించుకున్న మొదటి భారతీయ సినిమా ‘లగాన్’ (2001). భువన్ అనే సాధారణ యువకుడు అసా దారణ లక్ష్యాన్ని సవాలుగా స్వీకరించి, విజయం కోసం కావలసిన మానవ వనరు లను తన పరిధిలోనే గుర్తించి, శిక్షణ ఇస్తాడు. ఒక్క తాటిపై నడిచే మహత్తరమైన టీమ్‌ని బిల్డ్ చేయడం ఓ మోడ్రన్ కార్పొ రేట్ కంపెనీ నిర్మాణానికి ‘ప్రొటోటైప్’లా ఉంటుంది. ‘చక్ దే ఇండియా’, ‘గోల్’, ‘ఇక్బాల్’ సినిమాలు కూడా కొన్ని మేనేజ్ మెంట్ విద్యాసంస్థల సిలబస్సులయ్యాయి.
---_---- harikrishna mamidi
(Published as Sunday cover story in SAKSHI FUNDAY supplement in 2011)

Posted 1st December 2011

Monday, 20 July 2020

లేఖ... ప్రేమ లేఖ !

లేఖ... ప్రేమ లేఖ !

                                                                                                                                                                                                                                                                      --- మామిడిహరికృష్ణ, 8008005231

 

                ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother  of all inventions అని అంటారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - వర్తమానవిశేషాలు - వికాసం సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి, తద్వారా దూరాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ  సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!

 

                ఒకానొక కాలంలో లేఖలు, లేఖాసాహిత్యం, మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సాధించాయి... కానీ కాలక్రమంలో డిజిటల్ టెక్నాలజీ ఇంటర్‌నెట్‌ల ఆగమనంతో, గతకాలపు ఇతర సంప్రదాయాలు, రీతులలాగే లేఖ/ఉత్తరం కూడా ఇపుడు ‘‘అంతరించిపోయే అలవాటు’’ (Endangered Habit) గా పరిణమించింది. ఈలాంటి సందర్భంలోనే ఇటీవల సాహిత్యరంగంలో సంభవించిన రెండుప్రయత్నాలు -- ఉత్తరాలు అందులోనూ ప్రేమలేఖల ప్రేమికుల గుండెల్లో మళ్ళీ వసంతపు చిగుళ్ళను వేయించాయి. వాటిలో ఒకటి - హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో సంవత్సరంపాటు ప్రసారమై ఇటీవల పుస్తకంగా విడుదలైన శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారి ‘‘కొత్త ప్రేమ లేఖలు’’ కాగా, రెండోది  యువ రచయిత్రి కడలి సత్యనారాయణ ప్రచురించిన ‘‘లెటర్స్ టు లవ్’’ పుస్తకం ! 

అదే విధంగా కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధం లో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఒక ఆన్ లైన్ సర్వేలో, అత్యధిక ప్రజలు తమ పాత వస్తువులలో ఎక్కువగా ఇష్ట పడే అంశంగా లేఖలకు పట్టం కట్టారు! ఈ నేపధ్యంలో ఉత్తరాల పరిణామాన్ని, లేఖా సాహిత్యపు తీరు తెన్నులను విశ్లేషించడమే ఈవారం ‘కవర్  స్టోరీ ’!

***************************************************************************************





          “How wonderful it is to be able to write Someone a letter! To feel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous.”

                ప్రఖ్యాత జపనీస్ రచయిత Haruki Murakami 1987లో రాసిన Norwegian Wood నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి. ప్రతిష్టాత్మక World Fantasy Award ను, Franz Kafka Prize ను గెల్చుకున్న ఈ రచయిత లేఖారచనలో ఇమిడి ఉండే హృదయ గత అనుభూతులను సరళంగానే అయినా చక్కగా వ్యక్తీకరించాడనడంలో సందేహం లేదు...

                అందుకే ఉత్తరం అంటే హృదయనివేదన...! ఆత్మావిష్కారం!! అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత!

             మన నిత్య జీవితంలో ఉండే ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన!

                అందుకే ఉత్తరం, అది పుట్టినప్పటి నుంచీ మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.

                ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తూంది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో లేఖా రచన కూడా ఒకటిగా కొనసాగి, ఇప్పుడు అంతరించి పోతున్న ఇతర సంప్రదాయాల కోవలోకి చేరింది...

                ఒకప్పుడు అక్షింతలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ, మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం ఇప్పుడు మానవ మస్తిష్కపు స్టోర్‌రూమ్‌లో ‘పాత వస్తువు’గా మారిపోయింది...

                అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒకజ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒకకోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!

                ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన...

                నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన...

          ప్రపంచమంతా ఒక్క కుదుపు...

          వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు...       

          మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్భధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ఈ ‘లాక్ డౌన్’ ప్రపంచ గమ్యాన్నిచెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్ధిక వ్యవస్థలను, అభివృద్దిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణ కాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది. 

          ఈ సంధర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమస్టోర్ రూమ్ లలో ఉంచిన, దుమ్ము కొట్టుకుపోయిన  ఎన్నెన్నో వస్తువులను వెలికి తీసారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో భయల్పడ్డ ఎన్నెన్నో విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం !

          లాక్ డౌన్ సంబంధిత అంశాలపై ఇటీవల జరిపిన ఓ ఆన్ లైన్ సర్వేలో, "మీ పాత వస్తువులలో ఇప్పటికీ మీకు ఏది గొప్పగా అనిపించింది?" అన్న ప్రశ్నకు దాదాపు 80% మంది పాతకాలంలో తాము రాసిన, అందుకున్న ఉత్తరాలే అని చెప్పారు...

                ఇలా, కాలం చెల్లింది అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి.  అలాగే ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని ఈ సర్వేలో వెల్లడయింది.

          ఇలా లేఖలు తక్షణ ప్రయోజనాన్ని ఆశించే ‘ఉభయకుశలోపరి’తో మొదలై “ఇట్లు మీ శ్రేయోభిలాషి” గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని కూడా సాదించాయి. అలాంటి లేఖలు ‘లేఖ సాహిత్యం’గా ఉదాత్తత్వాన్ని, ఉన్నతత్వాన్ని సాధించడం విశేషం.



లేఖాసాహిత్యం : (Epistolary)

                సాహిత్యంలోఎన్నెన్నోప్రక్రియ (Genre) లువాడుకలోఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style),  శిల్పమే(technique), ప్రధానకారణాలు. ఆలెక్కన విశ్లేషిస్తే ఉత్తరాలు, లేఖల ద్వారా విషయాన్ని చెప్పే విధానాన్ని ‘లేఖా సాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు.

                ఈ లేఖాసాహిత్యానికి సమానార్థకంగా ఇంగ్లీష్‌లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!



ఉత్తరం రాయడం ఓ కళ !

                మన నిత్య వ్యవహారంలో  ‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని అందరూ అంటుండగా వింటుంటాం. కానీ ఉత్తరం రాయడాన్ని ఓకళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఈ ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే  ‘Epistolography ‘ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ రెండు పదాల కలయిక నుంచే ఈ లేఖా రచనా శాస్త్రం (Epistolography) ఉద్భవించింది.

                కాగా ఈ శాస్త్రం యూరప్‌లో బైజాంటైన్‌ సామ్రాజ్యయుగంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్ సామ్రాజ్యానికే బైజాంటియమ్‌ అని పేరు. ఇది యూరప్‌లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్ నగరం 1453లో ఆటోమాన్ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్‌స్టాంటి నోపిల్‌’ గా, ఆ తర్వాత ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్’గా పేరుపొందింది.

                ప్రాచీన బైజాంటియన్ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. దీని కోసం వారు ఉత్తరాన్ని, లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడం కోసం ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాక, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో పాటు ఒక అంశంగా ఈ లేఖా రచనా కళను అభ్యసించారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. అంటే రాజ్యాల మధ్య యుద్ధంలేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజు పట్ల భక్తి భావం, విధేయత పెరగాలన్నా లేఖ రాసే విధానం వల్లనే సాద్యమవుతుందనే మౌలిక విషయాన్నిఈ రోమన్ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్ని బట్టి చెప్పవచ్చు. అలా లేఖకు ఉండే శక్తిని ఈ ఉదంతాలు తేటతెల్లం చేస్తాయి.



తోకలేని పిట్ట నుండి ట్విట్టర్ దాకా...  :

              నిజానికి ‘లేఖ’ ప్రధానలక్ష్యం - ‘‘సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం!’’ నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తద్వారా తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ!

                అయితే ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూసాయి. మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరులు ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా లేఖలు సమాచారాన్ని చేరవేసేవి. ఈ కాలంలో లేఖలను ఒకచోటు నుంచి మరోచోటుకి చేర్చే మాధ్యమాలలో మనుషులు, పక్షులు, జంతువులు వాహకాలుగా ఉపయోగించబడేవారు.

                మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడంతో లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే కాక, చదువుకున్నఇతర సమాజాలకి కూడా అందుబాటులోకి వచ్చాయి. మరో వైపున ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతం అయి ఉత్తరాలు, లేఖల బట్వాడా సులభతరం అయింది.

                ఆతర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, లేఖలు మరెన్నో పరిణామాలకు లోనయ్యాయి. అలా టెలిగ్రామ్, ఫాక్స్ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా 2000 సంవత్సరం తర్వాతదేశంలోమొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్‌నెట్ వంటి  వాటివల్ల పేజర్, ఈ మెయిల్,‌ షార్ట్‌ మెసేజస్ సర్వీస్‌ (SMS) వంటివి ఇప్పుడు జనబాహుళ్యం లోకి వచ్చి ‘‘సంప్రదాయలేఖ’’ అనే అర్ధాన్ని, వ్యవస్థను మార్చివేసాయి. ఇక సోషల్  మీడియా (ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్) విజృంభణతో లేఖలు, లేఖా సాహిత్యంఅనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోయే సంప్రదాయంగా మారిపోయాయి.

                అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’ లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్ నుండి పేపర్‌లెస్ ఈ-మెసేజ్‌లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆలెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్  సాంకేతిక రూపాలైన మెయిల్, మెసేజ్‌ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.

 

ప్రపంచలేఖాసాహిత్యం - ప్రముఖరచనలు :

                లేఖాసాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్‌ భాషలో రాసిన ‘Prison of Love’ ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్  సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666)ను సాహితీ చరిత్రకారులు చెపుతారు. ఈయన రాసిన ‘Familiar Letters’ అనే గ్రంథం ఈ ఘనతను సాధించింది. ఇందులో ఆయన విదేశాలు, యాత్రలు, సాహసాలు, స్త్రీలు, జైలు, జీవితం, ప్రజలు, అలవాట్లు వంటి ఎన్నో అంశాలను ఉత్తరాల రూపంలో వ్యక్తీకరించారు.

                ఇక, ఈప్రక్రియలో పూర్తి స్థాయి నవల, Aphra Behn రాసిన Love-Letters Between a Nobleman and His Sister అని చెప్పాలి. ఈ నవల మూడు భాగాలుగా 1684, 1685, 1687 సంవత్సరాలలో వెలువడి సంచలనం సృష్టించింది. కాగా 18వ శతాబ్దం నాటికి ఈ సాహితీ ప్రక్రియ అమిత ప్రజాదరణ పొందింది. దీనికి Samuel Richardson రాసిన Pamela (1740), Clarissa (1749) నవలలు ఎంతగానో దోహదపడ్డాయి. ఇందులో Pamela నవల ఇతివృత్తం అంతా - Mr. B అనే యజమాని దగ్గర పనికి కుదిరిన పమేలా తన పేద తల్లిదండ్రులకు రాసే ఉత్తరాల పరంపరగానే ఉంటుంది .

                అయితే ప్రఖ్యాత రాజనీతిజ్ఞులు, ‘అధికార పృథక్కరణ సిద్ధాంతం’ (Theory of separation of Powers) ను ప్రతిపాదించిన Montesquieu 1721 లో Letters Persian  పేరుతో ఫ్రెంచ్‌లోఉత్తరాల రూపంలో గ్రంధాన్ని రాయడం విశేషం. అలాగే, ప్రముఖ ప్రకృతి వాద తత్త్వవేత్త (Naturalism) సామాజిక ఒడంబడిక సిద్ధాంతకర్త (Social Contract Theory) Jean-Jacques Rousseau కూడా Julie, or the New Heloise పేరుతో 1761లోరాసాడు. ప్రముఖ జర్మన్ తత్వవేత్త - సాహితీకారుడు  Johann Wolfgang Von Goethe కూడా 1769లో The Sorrows of Young Wert her అనే నవలను రాసాడు. ఇవన్నీలేఖాసాహిత్య కోవకు చెందినవే!

                18వ శతాబ్దం నాటికి ఈలేఖా సాహిత్య ప్రక్రియ ఎంత ఉధృతిని సాధించిందో అంతే విమర్శను కూడా ఎదుర్కొంది. ఆతర్వాత ఈప్రక్రియను చిన్న బుచ్చుతూ కొన్ని వ్యంగ్య రచనలు, ప్రహసనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈవ్యంగ్య రచనలను చేసిన వారు ప్రముఖ రచయితలు కావడం గమనార్హం!  Samuel Richardson రాసిన Pamela నవలకు కౌంటర్‌గా Shamela (1741) నవలను Henry Fielding, రాయగా, మరో ప్రముఖ సాహితీ వేత్త Oliver Goldsmith లండన్‌లో నివసించే చైనీయతత్వవేత్తగాథగా The Citizen of the World పేరుతో 1761లో ఒక నవలను రాసాడు. అలాగే ప్రఖ్యాత Pride and Prejudice నవలను రాసిన Jane Austen కూడా తన తొలినాళ్ళలో  Lady Susan పేరుతో 1794లో ఓ నవలను ఈ లేఖా సాహిత్య సంప్రదాయంలోనే  రాసింది.

                మరో ప్రఖ్యాత రచయిత, నాటకకర్త Honore de Balzac రాసిన Letters of Two Brides నవల విమర్శకులను సైతం ఆకట్టుకుంది. విద్యార్ధిదశలో స్నేహితులైన ఇద్దరు అమ్మాయిలు పాఠశాలను వదిలిన తర్వాత కాలంలో వారి జీవితంలో సంభవించిన మార్పులను ఉత్తరాల రూపంలో వెల్లడించిన ఈ నవల, సాహితీ ప్రస్థానంలో ఓ మైలురాయిలా నిలిచిపోయింది.

                ఈ లేఖా రచనా సంప్రదాయంలో వచ్చిన సాహిత్యంలో చెప్పుకోదగింది Frankenstein!  ప్రఖ్యాత కవి P.B. షెల్లీభార్య Mary Shelly 1818లో ఈ నవలను ఉత్తరాల రూపంలోనే రాసింది. ఈ నవలలోని మూడు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఉత్తరాల ద్వారా మొత్తం కథ నడుస్తుంది.

                అలాగే, 1897లో Dracula నవలను Bram Stoker  రాసాడు. ప్రపంచ హారర్ సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ నవల అంతా ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది. వీటికి తోడుగా పత్రికా కథనాలను, టెలి గ్రాములను, డాక్టర్, ఓడలప్రయాణపురికార్డులనుకూడాఉపయోగించారు.

                The Diary of a Young Girl పేరిట రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని భయానక భీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను Anne Frank రాసింది.అయితే ఈ గ్రంధాన్నిఆమె లేఖలు, డైరీ రూపంలో రాయడం విశేషం!

                ప్రసిద్ధ రచయిత్రి Alice Walker 1982లో The Color Purple - నవలను ప్రచురించింది. ఇది Celie అనే ఓ నల్ల జాతి అమ్మాయి కథ. ఇందులో ఆమె తన కథను తన సోదరికి, దేవుడికి ఉత్తరాల రూపంలో చెప్తుంది.

                మరో ప్రఖ్యాత రచయిత్రి Virginia Woolf 1938 లో Three Guineas అనే వ్యాసాన్ని ఈ లేఖా సాహిత్య ప్రక్రియ లో రాసింది. ఇది ప్రపంచ స్త్రీవాద సాహితీ చరిత్ర లోనే గొప్ప రచనగా పేరు పొందింది. అలాగే 1748లోనే John Cleland రాసిన Funny Hill నవల సరస శృంగార నవలగా ప్రఖ్యాతి సాధించి, లేఖాసాహిత్యానికి ఉన్న పరిధిని విస్తృతపరిచింది. ఇందులో ఓ అనామక వ్యక్తికి తన మనసులోని భావాలను ఉత్తరాల పరంపరగా కథానాయకి రాస్తుంది.

                అలాగే Wilkie Collins తను రాసిన The Woman in White (1859), The Moonstone (1868) లో లేఖా సాహిత్య సంప్రదాయంలో డిటెక్టివ్  నవలలను సమర్ధవంతంగా రాసి, ఉత్తరాల ద్వారానే నేరపరిశోధనా క్రమాన్నిఆసక్తిదాయకంగా చెప్పగలిగాడు.

                ప్రఖ్యాత రష్యన్  రచయత Fyodor Dostoyevsky తన రచనా ప్రస్థానాన్ని ఈలేఖా సాహిత్య ప్రక్రియతోనే ప్రారంభించాడనేది అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. 1846లో ఆయన రాసిన తొలి రచన Poor Folk రష్యా విప్లవ పూర్వ కాలం నాటి ఇద్దరు మిత్రుల కథగా, వారిద్దరి మధ్య జరిగే ఉత్తరాల రూపంలోనే నడుస్తుంది.

                ఇంకా Saul Bellow రాసిన Herzog (1964),  Endo Shusaku రాసిన Silence (1966), Stephen King రాసిన Carrie (1974), John Updike రాసిన ‘S’ (1988), Helen Fielding రాసిన Bridget Jones’s Diary (1996), Carolyn Hart రాసిన Last Day of Summer (1998), వంటివి ఈ లేఖా సాహిత్య పరంపరలో పేరెన్నికగన్న సమకాలీన రచనలుగా చెప్ప వచ్చు.

                అలాగే ప్రఖ్యాత భారతీయ రచయిత 2008లోప్రతిష్టాత్మక బుకర్ పురస్కార విజేత అయిన అరవింద్  అడిగా రాసిన The White Tiger కూడా ఈ కోవ లోనిదే కావడం ఇక్కడ ప్రస్తావనార్హంగా చెప్పాలి. ఈ నవల అంతా, ఒక భారతీయ రైతు చైనా ప్రధానికి రాసే ఉత్తరాల రూపంలో ఉంటుంది.



 మరి తెలుగు సంగతేంటి? :

                తెలుగు సాహిత్యంలో లేఖాసంప్రదాయపు ఛాయలు తరచి చూస్తే ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగినది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతోవెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగరచరిత్ర’ అనేగ్రంథంలో ఉటంకించబడింది.

                అలాగే, రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెళ్ళి చేయాలనుకున్న తండ్రి స్థితికి చలించి, ఆకూతురు ఉత్తరంరాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచనఅప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది.

                ఇక గుర్రంజాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాధమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి ఘజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రంచేస్తుంది.

                అలాగే, తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘సైనికుడిఉత్తరం’ కవిత (‘అమృతంకురిసినరాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల  ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’ ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు రాసిన ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరోసంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’  తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.

                ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతి నిచ్చింది.

                ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితేతెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరంరాసినట్లుగా అందించాడు. ఇది ఆంధ్రభూమి, ఆదివారం అనుబంధంలో కవర్‌స్టోరీగా ప్రచురితమైంది.

                ఈ పరంపరలోనే, నేటి ఇంటర్‌నెట్ యుగంలో అంతరించి పోయిందనుకుంటున్న లేఖా సాహిత్యపు అద్భుత సంప్రదాయాన్నిఈ తరానికి గుర్తుచేసి ఆత్మీయంగా అల్లుకున్న రచనలుగా ‘కొత్తప్రేమలేఖలు’, ' లెటర్స్ టు లవ్ " పుస్తకాలు మళ్ళీ ఒక్కసారి ఉత్తరాల తోటలోకి తొంగిచూసేలా చేసాయి.

                ఇంత గొప్ప సంప్రదాయం, చరిత్ర, సాహితీ ప్రస్థానాన్నిసాగించిన లేఖా సాహిత్యం, నేటితరంలో మళ్ళీ ఊపిరి పూసుకోవడానికి, పునరుజ్జీవితాన్ని సాధించి, మరికొంతకాలం కొనసాగడానికి, మరిన్ని రచనలు ఈతరహాలో రావడానికి ప్రేరణగా ఈ పుస్తకాలు నిలిచాయి. ఆర్ద్రంగా, ఆత్మీయంగా గాలి తెరల లోంచి తేలివచ్చి శ్రోతల / పాఠకుల హృదయాలను స్పృశించాయి!

 

లేఖ సాహిత్యంలో ఏమేం ఉంటాయి ?

           

         "కాదేదీ సాహిత్యానికనర్హం " అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశం పైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. అలాగే, లేఖా సాహిత్యం లో వస్తువు విషయం లో కూడా ఏ నిర్దిష్టత లేదు. ఏ వస్తువు, అంశంను అయినా లేఖ శైలిలోకి అందించవచ్చు. అయితే  ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో సృజించిన లేఖా సాహిత్యంపై ఆయా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు ఎన్నెన్నో పరిశోధనలను విస్తృత స్థాయిలో నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను ఎన్నెన్నో రకాలుగా అభివర్ణించారు. వాటిలో ముఖ్యమైనవి.

 

1.            ప్రకృతి లేఖలు : వ్యవసాయం, విత్తనం, చెట్టు, కాలం, పక్షులు,  వరదలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ వంటి ప్రాకృతిక అంశాలపై రాసిన లేఖలు.

2.            ఆరోగ్య లేఖలు : వైద్యం, పాలియేటివ్ కేర్ (మృత్యు అవసాన కాలపు సంరక్షణ), ఆయుర్వేదం, యునానీ, హోమియో, యోగ,  క్యాన్సర్, తలసీమియా వంటి ఆరోగ్య సంబంధ అంశాలపై రాసిన లేఖలు.

3.            కుటుంబ సంబంధాల లేఖలు : అమ్మచీర, అత్తాకోడలు, అమ్మ , వృద్ధాప్యం, నాన్న, పెళ్లి వంటి అంశాల ఆధారంగా కుటుంబ బంధాలపై రాసిన లేఖలు

4.            శాస్త్ర, సాంకేతికలేఖలు : ఆకాశవాణి, సినిమా, చంద్రయాన్, ఎలక్ర్టానిక్స్, జెనెటిక్స్, అణు పరిశోధన, అంతరిక్షం వంటి శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక పరిణామాలపై రాసిన లేఖలు

5.            ప్రత్యేక దినాలపై లేఖలు : కొత్త సంవత్సరం, వినియోగదారులు (మార్చి 15), ప్రేమికులు (వాలెంటెన్ డే  ఫిబ్రవరి 14), కుటుంబం ( మే 15), పర్యావరణ ( జూన్ 5), స్నేహితులు (ఆగష్టు రెండో ఆదివారం) , రాజ్యాంగం (నవంబర్ 26) మొదలగు ప్రత్యేక దినోత్సవాలు పురస్క రించుకుని రాసిన లేఖలు.

6.            దేశభక్తి లేఖలు : సైనికులు, భారతమాత, త్రివిధ దళాలు వంటి అంశాలు దేశం, జాతీయతలో వాటి పాత్రపై రాసిన ఉత్తేజ పూర్వక లేఖలు.

7.            జీవన శైలి లేఖలు : చీరకట్టు (ప్యాషన్స్), సౌందర్యం, ప్రమాదాల నివారణ, డిప్రెషన్, సర్దుబాటు, అలవాట్లు, విజయ సాధన వంటి జీవనోత్సాహ శైలులపై రాసినలేఖలు.

8.            పండుగలపై లేఖలు : సంక్రాంతి, బోనాలు, బతుకమ్మ, వినాయక చవితి, క్రిస్మస్, రమ్ జాన్, బుద్ధ పౌర్ణిమ వంటి పండుగలు, వాటిలోని విశిష్టతలు, వాటిలో ఇమిడి వున్న సామాజిక, పర్యావరణ, మానవీయ ప్రయోజనాలపై రాసిన లేఖలు.

9.            మార్గదర్శులపై లేఖలు : గాంధీజీ 150వజయంతి, సమతామూర్తులు (అంబేద్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్‌రామ్), కార్ల్ మార్క్స్, మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్రనాథ్ టాగోర్, షేక్స్పియర్, కాళోజి, దాశరధి  జయంతుల సందర్భంగా వారి జీవన విశేషాలపై స్ఫూర్తిదాయకంగా రాసిన లేఖలు.

10.          భాషా సాహిత్యాల పై లేఖలు : మాతృ (అమ్మ)  భాష, కవిత్వం - కవి వంటిసాహిత్యసంబంధఅంశాలపైరాసినలేఖలు

11.        సామాజిక -రాజకీయ లేఖలు :   సమాజం, రాజ్యాంగం, బ్యాలెట్బాక్స్, పోలీస్వంటిఅంశాలపై, మానవ పరిణామ ప్రగతిలో వాటిసేవలపై రాసిన ఆలోచనాత్మక లేఖలు.

  12. మత , ఆధ్యాత్మిక, తాత్విక  లేఖలు:  ఆయా మత విశ్వాసాలు, పురాణ కథనాలు, ఐతిహాసిక గాధలు, బౌద్ధ జాతక కథలు, లౌకిక దృక్పథం వంటి అంశాలపై లేఖలు   

13. ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు:  యుద్ధాలు, వినాశనాలు, వసుధైక కుటుంబం, వర్ణ వివక్ష రహిత ప్రపంచం, విశ్వ మానవ తత్త్వం,  మొదలైనవి.    

       

ప్రేమ లేఖల రూటే సెపరేటు :

          సాధారణంగా లేఖ సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్ గా చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖ సాహిత్యంలో, ప్రేమ లేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్ రాణులు,  నోబెల్ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు వంటి ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు ఆ కాలంలో వారు రాసిన వ్యక్తిగత ప్రేమలేఖలలో, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం అవుతున్నాయి.

          అలా ప్రముఖులు వేర్వేరు సంధర్భాలలో రాసిన ప్రేమ లేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -

“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.”  అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.

                అలాగే సాధారణంగా  ప్రేమలేఖలు’ రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు -

                ‘‘I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough’’ అన్నమాటలను గుర్తుచేస్తాయి.

                అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుండి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.



వాక్యాల వెంట ప్రయాణం : 

                లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లుకున్నవిధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి అంతా ఆయా రచయితలు  వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని వారి వెంట తీస్కెళ్ళినట్టుగా అనిపిస్తుంది.

                సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. ‘‘అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే “(Reaffirmation of humanity) కావాలి.." అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా ఈ లేఖలు ఉంటాయి!

             అందుకే ఈ ‘లేఖలు’ - సమ్యక్ ఆలోచనకు, సంపూర్ణ ఆత్మీయతకు, సానుకూల ఆచరణకు వెలుగు దివిటీలు గాను, ఈ లేఖా సాహిత్యం తెలుగు సాహితీ లోకంలో ఓ దీపశిలగా నిలిచి గెలిచిందని తడుముకోకుండా చెప్పవచ్చు.

చివరగా... లేఖా సాహిత్యం... 

మనసులోని భావాలన్నిటినీ వాక్యాలుగా గుదిగుచ్చిన హృదయ హారం

అంతరంగం, ఆత్మీయతలను అక్షరాలుగా పేర్చిన ఆలోచనా ద్వారం

ఒకప్పుడు ప్రేమలేఖ... జీవితాంతం గుండెల్లో దాచుకునే నెమలీక

ఇప్పుడు ప్రేమలేఖ... అంతరించి, అవశేషంగా మిగిలిన జ్ఞాపిక...

అవి కేవలం రాశి పోసిన అక్షరాలు మాత్రమే కావు  - అవి ఆనాటి తరపు హృదయరేఖలు ! 

అందుకే లేఖలు ...

మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...

మనసుతో మనసు చేసే సంభాషణలు. 

వాటిని మనసు విప్పి విందాం...!

గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...

అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు. 

వాటిని  .. హృదయంతెరచిచూద్దాం.. !

ఈ లాక్ డౌన్ కాలంలో స్టోర్ రూమ్ ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో 

మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలకరిద్దాం...!



--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బాక్స్ -1

లేఖాసాహిత్యం ప్రత్యేకతలేంటి? :

                అన్ని లేఖలు లేఖలుగానే ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే సాహిత్య ప్రతిపత్తిని, కావ్యగౌరవాన్నిపొందుతాయి. దానికి ఆ లేఖలో పొందుపరిచిన విషయాలు, ఉపయోగించిన భాష, పద సౌందర్యం, రాసిన విధానం, శైలి, అందులోని సామాజిక ప్రయోజనాత్మకత, విషయ వివరణలో కళాత్మకత, సౌందర్యదృష్టి (Aesthetics) వంటివన్నీ కలిసి కారణమవుతాయి. ఆ విధంగా లేఖాసాహిత్య విశిష్టతలను ఈ విధంగా చెప్పవచ్చు.

*             కథనంలో కాల్పనికతకు, వాస్తవికత (Realism)కు, కవితాత్మక అభివ్యక్తికి  సమాన ప్రాధాన్యత ఉంటుంది 

*             ఇందులో ఏకోన్ముఖ వివరణ కన్నా బహుముఖ వ్యక్తీకరణకు అవకాశం.

*             ఈ ప్రకియ వల్ల పాత్రల లోతైన మనోభావాలు, ఆలోచనలు పాఠకులకు అవగతం అవుతాయి.

*           రచయిత ఊహా శక్తి, సృజన స్థాయి, కాల్పనికత ఒక వైపు, వాటికోసం అల్లుకున్న పదాలు అన్నీ పాఠకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. 

*           వీటిలోని శైలి అంతా మనకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు మనకు ఆత్మీయంగా చెప్తున్నట్లుగా ఉంటుంది. కనుక వీటి ద్వారా అన్ని రకాలభావోద్వేగాలను, నవ రసాల భావనలను హృదయాలకు హత్తుకునేలాగా అక్షరాలలోనే పండించవచ్చు. 

*             రచయిత స్వంత కల్పితాల కన్నా యధార్ధ సంఘటనలు, సందర్భాలతోనే పాఠకులకు సంధానం ఏర్పడుతుంది.

*             ఇందులోని శైలి-సంబోధనాత్మకంగా, సంభాషణాత్మకంగా ఉండటం వల్ల పాఠకుడు, శ్రోత మమేకమయ్యే అవకాశం ఎక్కువ.

*             దీనిలోని ఉటంకింపులు ఎంత సంభ్రమాశ్చర్యాలకు రసానందానికి గురిచేస్తాయో, అందించే సమాచారం, ఉదాహరించే ఉదంతాలు, గణాంకాలు కూడా అంతే జ్ఞానాన్నిఅందిస్తాయి.


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

బాక్స్-2

భారతీయ సాహిత్యం - లేఖాసంప్రదాయం :

                ప్రాచీన అలంకారికులు భారతీయ సాహిత్యాన్ని మూడు రకాలుగా వర్ణిస్తారు.

1.            ప్రభుసమ్మితాలు

2.            కాంతాసమ్మితాలు

3.            మిత్రసమ్మితాలు

                అంటే సాహితీ సృజనకు ప్రేరకాలుగా, కారకాలుగా ఈ మూడు ఉంటాయని అంటారు. వీటిలో ‘మిత్ర సమ్మితాల’ కోవలోకి వచ్చేది ‘లేఖాసాహిత్యం’ అనిచెప్పవచ్చు.

                సాధారణంగా లేఖలు ఎవరు ఎవరికి రాసినా వాటిలో అంతర్లీనంగా ఉండే అంశం, రాసే విధానం అంతా మిత్రులతో సంభాషించినట్లుగా, ఇతరుల క్షేమాన్ని, మేలును ఆశించినట్లుగా ఉండటం సహజం. ఈసున్నితమైన మానవీయ కోణం మిగతా సాహిత్య ప్రక్రియలలో కన్నాలేఖల ద్వారా వెల్లడించే అవకాశం ఎక్కువగా ఉండటం వల్లనేనేమో,  ఇది ఒక ప్రత్యేక ‘రచనా సంప్రదాయం’గా ఎదిగింది.

                భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీమౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు. కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈపదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend,) ! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్ లేఖను ఆయన రాశాడు.

                అలాగే ‘సందేశకావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్నిఅందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.

                ఇక ఆధునిక కాలంలో ప్రముఖవ్యక్తులు ఆయా సందర్భాలలో రాసిన ఉత్తరాలు సాహిత్య ప్రతిపత్తిని పొందే స్థాయిలో ఉండటం విశేషం. ఆలెక్కన లేఖా సంప్రదాయపు సాహిత్యం మనకు రెండు రూపాలలో కనిపిస్తుంది.

1.            కవులు, రచయితలు, మేధావులు, తాత్త్వికులు ఆయా సందర్భాలలో వారి ఆత్మీయులకు రాసిన లేఖలే ఆతర్వాత సాహిత్య స్థాయిని సంతరించుకోవడం.

2.            రచయితలు, సృజనకారులు ఐచ్ఛికంగానే తాము రాయాలనుకున్న కథను లేదా సృజనాత్మక రచనను లేఖా సంప్రదాయపు శిల్పం ద్వారా ఆవిష్కరించడం.

                ఈ విషయంలో స్వామి వివేకానందుడు (1863-1902), శరత్చంద్ర ఛటోపాధ్యాయ (1876 -1938), జవహర్‌లాల్ నెహ్రూ  (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరా గాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక, సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) దాటిన సామాజికప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.

                అలాగే విశ్వకవి, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్ టాగూర్‌కు, తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు  విక్టోరియా ఒకెంపోకు మధ్య జరిగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆలేఖా బంధమే చివరికి ఠాగూర్‌ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది.  ఈ కావ్యాన్నిఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా ఈవాదనను బలపరుస్తోంది.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------

-----------------------------------------------------------------------------------------------------------------

బాక్స్- 3

కొత్త ప్రేమ లేఖలు :లెటర్స్ టు లవ్ " 

               ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్  శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి  రాసిన ‘కొత్తప్రేమలేఖలు’ పుస్తకం ఇటీవలి కాలం లో ఎన్నో రకాలుగా తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశ వాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం , తర్వాత వాటికి పుస్తకంగా సంకలనంచేయడం ద్వారా ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే!ఈ పుస్తకంలో పొందుపరిచిన  51 ప్రేమ లేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్ధిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా, అంతకు ముందు తెల్సిన అంశాల కన్నా ఎన్నెన్నో తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేసాయి. ఎంపిక చేసుకున్నఅంశాలు కూడా ఎంతో సమకాలీనతను, సామాజికతను కలిగి ఉండటమే కాక సాధారణంగా కనిపించే అంశాలలోని అసాధారణత్వాన్ని, అసామాన్యతత్వాన్ని సునిశితంగా, సాధికారికంగా, గణాంకాలు, చరిత్రతో మేళవించి మానవీయ కోణంలో అందించాయి. అందుకే గౌరవ గవర్నర్ శ్రీమతి తమిళ్ ఇసై సౌందర్య రాజన్ గారు రాజ్ భవన్ లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాక ఎంతగానో ప్రశంసించారు!

              అలాగే యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - "లెటర్స్ టు లవ్ " ! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జెనరేషన్ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా , ఆమె పుస్తకం ప్రారంభం లోనే చెప్పినట్టు 'చలం ' శైలి, ప్రభావం సమకాలీన తరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి. 

------------------------------------------------------------------------------------------------

Saturday, 4 July 2020

Mango bytes blog

http://harikrishnamango.blogspot.com/2008/10/bathukamma-festival-of-flowers.html?m=1

వసంత కోకిల!


నీ చేయికి నా చేయికి మధ్య ..


ఇది సహకార నామ సంవత్సరం !

Folks, here it's my research article on the COOPERATIVE SYSTEM published as Sunday cover story of ANDHRA BHOOMI paper on 19-2-2012, in connection with the declaration of 2012 as INTERNATIONAL COOPERATIVE YEAR by UNO. 
Today on 4-7-2020 is being observed as NATIONAL COOPERATIVES DAY.. celebrate it and read on...

సహకార నామ సంవత్సరం!
------- Harikrishna Mamidi

‘సహకార సంఘాలు అంతర్జాతీయ సమాజ నిర్మాణం దిశగా, వసుదైక కుటుంబం ఏర్పాటు దిశగా మనం చేస్తున్న ప్రయత్నానికి నిజమైన దృష్టాంతాలు. ఆర్థిక సమృద్ధత, సామాజిక బాధ్యత అనే రెండు ప్రధాన మానవీయ అంశాలను స్పృశించగలిగే సామర్థ్యం ఉన్న ప్రజా సమూహాలు కూడా సహకార సంఘాలే!’    
                  ----బాన్‌కి మూన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్

***        ***          *** 
మానవ జాతి చరిత్రనీ, మానవ నాగరికత పరిణామాన్నీ ఒక్క మాటలో చెప్పడం సాధ్యమా? అనే ప్రశ్నకు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ చరిత్ర ప్రొఫెసర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘సహకారం!’ 

* * *      ***         ***
ప్రపంచం మొత్తం మీద ఉన్న దేశాలు, జాతులు ఎప్పటికప్పుడు ఎనె ్నన్నో ఉద్యమాలు నడిపాయి. అయితే ఆ ఉద్యమాలన్నీ స్థానిక అవసరాల కోసమో, స్వాతంత్య్రం కోసమో, ప్రాంతీయంగానో, దేశీయంగానో జరిగిన ఉద్యమాలు మాత్రమే. కానీ ప్రపంచమంతటా ఆమోదం పొందిన ఒకే ఒక్క ప్రజా ఉద్యమం మాత్రం - ‘సహకార ఉద్యమమే!’ 

* * *          ***             ****  
       ‘సహకారం’ అనేది ఓ జీవసహజాతం! ఓ చీమ మరో చీమకు సహకరించడం, ఓ మనిషి మరో మనిషికి సహకరించడంలో ఈ సహజాత లక్షణం కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి అవసరాన్ని, లక్ష్యాన్ని తన అవసరంగా తన లక్ష్యంగా భావించి ఫలితాన్ని ఇద్దరూ పొందడం అనే జీవన విలువ - ‘సహకారం’లో ఇమిడి ఉంది. అందుకే మానవ ప్రగతి యావత్తూ మరో మనిషి సహకారంతో సాధించిన ఫలితమే అని సామాజిక శాస్తవ్రేత్తలు, చరిత్రకారులు నొక్కి చెబుతారు. అంతేగాక, మానవ సంబంధాలు - అనుబంధాలన్నిటికీ ఆలంబన కూడా ‘సహకారమే’ అని మనోవైజ్ఞానిక శాస్తజ్ఞ్రులు కూడా అంగీకరిస్తారు. అందుకే సహకారం మనిషిని మానవుడిగా మార్చే సమున్నత మానవతా వాదం అని తాత్వికులు ప్రశంసించారు. ఇంతగా మన జీవితాలతో పెనవేసుకుపోయి, సహకార భావనని ఓ సమిష్టి శక్తిగా మలిచే ప్రయత్నంలో ఏర్పడిన ఉద్యమమే ‘సహకారోద్యమం!’ ఆ సంఘటిత శక్తికి నిలువెత్తు రూపమే ‘సహకార సంఘాలు.’ అందుకే సహకార సంఘాల జీవసూత్రం ‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే నినాదంగా మారింది. 
          ఆ స్ఫూర్తిని మరొక్కసారి ప్రపంచ ప్రజలందరిలో కలిగించడం కోసమే 2012 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. 

అలా మొదలైంది..        
               సహకారం, సహకార జీవనం అనే అంశాలు మానవజాతి అంత ప్రాచీనమైన భావనలే అయినప్పటికీ ప్రాథమిక రూపంలో ఏర్పడింది వౌర్యుల కాలంలోనే అని చెప్పాలి. ఆ కాలంలో వౌర్య సామ్రాజ్యంలోని నగరాలు, గ్రామాల్లో ‘శ్రేణులు’ అనే సంస్తలు వ్యక్తుల ఆర్థిక అవసరాలను తీర్చే సంస్థలుగా ఉండేవి. కానీ సువ్యవస్థీకత రూపంలో, ఆధునిక ధోరణులలో రూపొందింది మాత్రం యూరప్‌లోనే అని చెప్పాలి. బ్రిటన్‌లోని అబెర్డీన్‌లో 1498లో స్థాపించిన షోర్ పోర్టర్స్ సొసైటీ అనేది తొలి సహకార సంఘం అనే ఆధారాలున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవం ఊపందుకోవడం సహకార సంఘాల ప్రగతికి మరింత దోహదపడింది. అలాగే 1769లో ఫెన్‌విక్ అనే ప్రాంతంలో తొలి ‘వినియోగదారుల సహకార సంఘం’ ఏర్పడింది. 1832లో ‘లాక్‌హర్స్ట్ లేన్ పారిశ్రామిక సహకార సంఘం’ రూపొందింది. 
                   ఐతే మనం ఇప్పుడు పాటిస్తున్న సహకార విధాన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత మాత్రం ‘రాబర్ట్ ఓవెన్’దే! స్కాట్లండ్‌లోని తన కాటన్ మిల్స్ (దానికి ఆయన ‘న్యూలానార్క్’ అని పేరు పెట్టారు)లో తన పరిశ్రమ నిర్వహణను సహకార ప్రాతిపదికగా రూపొందించారు. తన మిల్స్‌లో పనిచేసే కార్మికులే సభ్యులుగా సహకార ప్రాతిపదికన ఓ నూతన నిర్వహణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయనను ‘సహకారోద్యమ పితామహుడు’గా పిలుస్తారు. అయితే 1828లో ‘ది కోపరేటర్’ అనే పత్రిక ద్వారా సహకార సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేసింది మాత్రం విలియం కింగ్ అనే డాక్టరే అని చెప్పాలి.
                 ఇక 1844లో ఇంగ్లండ్‌లోని రాక్‌డేల్ అనే ప్రాంతంలో రూపొందిన ‘రాక్‌డేల్ సొసైటీ ఆఫ్ ఈక్విటబుల్ పయొనీర్స్’ అనే సంఘం సహకారోద్యమానికి నిర్దిష్టమైన రూపురేఖల్ని, శాస్ర్తియత్వం నిర్ధారించింది. పారిశ్రామిక విప్లవం వల్ల కార్మికులంతా ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడినపుడు, తమలో తాము సంఘంగా ఏర్పడి పరిశ్రమలతో పోటీ పడే ధోరణిని ఈ సంఘం నిజం చేసి సక్సెస్ అయింది. ఈ సంఘం స్థాపించిన ‘నిత్యావసర సరుకుల సహకార సంఘం’ సహకార రంగంలో కొత్త విప్లవానికి దారి వేసింది. అలా మొదలైన సహకారోద్యమం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎనె్నన్నో రుణాలకు విస్తరించింది. 

 ఇతర దేశాల్లో..     
                సహకార ఉద్యమం ప్రధానంగా ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలలో వేర్వేరు అనుభవాల నుండి ఎదిగినప్పటికీ, అనతికాలంలోనే అది ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించింది. స్పెయిన్‌లోని బాస్క్‌కౌంటీలోని ‘మోంగ్రేగౌన్ కోపరేటివ్ కార్పొరేషన్’ అక్కడి సామాన్య ప్రజానీకం ఆర్థిక స్థితిగతులను ఎంతగానో మెరుగుపరచింది. యుగోస్లావియాలో ‘వర్కర్స్ కౌన్సిల్స్’ పేరిట సహకారోద్యమం కార్మికులు - కర్షకుల జీవన విలువలను పెంచడమే కాక, వారికి భద్రతను - ఆర్థిక సుస్థిరతను ఇవ్వడంలో సక్సెస్ అయింది. 
                 ఇక యూరప్ ఖండంలోని చాలా దేశాలలో సహకార సంఘాలు కార్పొరేట్ స్థాయికి ఎదిగాయని చెప్పాలి. అక్కడి సహకార సంఘాలు రిటైల్, బ్యాంకింగ్ వంటి సేవలనే కాక, ఇన్సూరెన్స్ వంటి సేవలను కూడా అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాగే ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రశంసనీయమైన జీవన ప్రమాణాలను కలిగి యున్న డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాల ఉన్నతికి, పురోగతికి ప్రధాన కారణం - సహకార సంఘాలే! 
                ఇక అభివృద్ధికి అడ్రస్‌గా చెప్పే అమెరికా సైతం ఆ అభివృద్ధికి కారణంగా అమెరికా అధ్యక్షులు సైతం ప్రశంసించే అంశాలలో సహకారోద్యమం ప్రముఖంగా ఉండటం విశేషం. అమెరికాలో దాదాపు 29 వేల పై చిలుకు సహకార సంఘాలు వివిధ సేవలను అందిస్తున్నాయి. ఈ సంఘాలు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలివ్వడమే కాక సంవత్సరానికి 652 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. 
              ఈ సహకారోద్యమంలో యునైటెడ్ కింగ్‌డమ్ మరో అడుగు ముందుకేసింది. 20వ శతాబ్దపు ఆరంభంలో అక్కడి సహకార సంఘాలన్నీ కలిసి ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీని ‘కోపరేటివ్ పార్టీ’ పేరిట ఏర్పాటు చేసుకున్నాయి. దాని సభ్యులు కొందరు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు కూడా! ప్రస్తుతం ఈ ‘కోపరేటివ్ పార్టీ’ అక్కడి ‘లేబర్ పార్టీ’తో ఎన్నికల పొత్తు పెట్టుకుని ప్రజా ప్రాతినిధ్యంలో సైతం తమదైన బాణీని, వాణిని ప్రదర్శిస్తున్నాయి. అంతేగాక, ఇంగ్లండ్‌లో సహకార రంగం ఆహార వినియోగ సేవలనే కాక, ట్రావెల్ ఇండస్ట్రీలలోనూ, ఆఖరికి మరణానంతర సేవల నిర్వహణలోనూ తనదైన ప్రత్యేకతను సాధించింది. 
               చైనా, జపాన్ దేశాలు కూడా ఈ విషయంలో వెనుకబడి లేవు. ఇక దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ సహకారోద్యమాన్ని ‘సెమా ఉల్‌డాంగ్’ పేరిట (జన్మభూమి, శ్రమదానం వంటి పథకాలకు ఇదే స్ఫూర్తి) నిర్వర్తిస్తూ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నాయి. 

మన దేశం సంగతేంటి?    
         మన దేశంలో సహకార సంఘాలకు సంబంధించిన ఆధారాలు మగధ సామ్రాజ్య కాలంలోనే ఉన్నప్పటికీ, ఆధునిక రూపంలో వీటిని దేశంలో ప్రవేశపెట్టింది మాత్రం బ్రిటిష్ పాలకులే! అయితే మన దేశంలో సహకార సంఘాల వ్యవస్థాపనకు ‘కరువు’ కారణం కావడం విశేషం! 1899లో దేశవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి డెరిక్ నికల్సన్ అనే నిపుణుడు చేసిన సూచనలను మరియు 1901లో ఏర్పాటైన ‘రెండవ కరువు పరిశీలక సంఘం’ చేసిన ప్రతిపాదనలను అనుసరించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1904లో తొలిసారిగా సహకార సంఘాలను స్థాపించింది. రుణాలు, వినియోగ వస్తువులు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఎనె్నన్నో సహకార సంఘాలు పుట్టుకొచ్చాయి. కానీ 1928-32 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ‘ఆర్థిక మాంద్యం’తో బ్రిటిష్ ప్రభుత్వం సహకార సంఘాల విస్తరణపై నిర్లక్ష్యం వహించింది. అయితే 1933లో ఏర్పాటైన ‘రిజర్వ్ బ్యాంక్’ మాత్రం సహకార రుణాలపై పరిశీలన కోసం ప్రత్యేక విభాగానే్న ఏర్పాటు చేసింది. దాంతో సహకార సంఘాలు మళ్లీ కొంత పుంజుకున్నాయి. ఇక 1945లో ‘అఖిల భారత సహకార ప్రణాళికా కమిటీ’ ఏర్పడటంతో సహకార భావన ఉద్యమ రూపంలోకి మారి విస్తృతమయింది. 
                 స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వం కూడా గ్రామీణ పునర్నిర్మాణంలో, దేశ ప్రగతి సాధనలో సహకార రంగం యొక్క పాత్రను సరిగానే అంచనా వేసింది. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం (1951) నుండి వీటిపై ప్రత్యేక శ్రద్ధను చూపించింది. అదే సమయంలో 1954లో ‘సహకారోద్యమ స్వర్ణోత్సవాల’ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సందర్భంగా ప్రభుత్వం సహకార సంఘాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాంతోపాటు సహకార మార్కెటింగ్ సొసైటీలను కూడా ప్రారంభించింది. 
                 రెండో పంచవర్ష ప్రణాళికకి సహకార రంగంలోకి గిడ్డంగులను కూడా తీసుకురాగా, మూడో పంచవర్ష ప్రణాళిక మరో అడుగు ముందుకేసి సహకార చక్కెర కర్మాగారాలను, సహకార నూలు పరిశ్రమలను, సహకార స్పిన్నింగ్ మిల్లులను, సహకార పాల సరఫరా సంఘాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో సిబ్బందికి, సహకార సభ్యులకు శిక్షణ నిమిత్తం పూనెలో ‘సహకార శిక్షణ కాలేజ్’ని స్థాపించింది. 
               ఇక నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశమంతటా ‘హరిత విప్లవం’ ఆరంభమైంది. వ్యవసాయ రంగంలో నూతన మార్పులను తీసుకురావడానికి సహకార రంగంలో పరపతి సంఘాలను మరింతగా ఏర్పాటు చేశారు. 
               ఐదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కేంద్ర సహకార బ్యాంకుల విధానాన్ని బలోపేతం చేయడమే కాక వినియోగదారుల సహకార సంఘాలకు చేయూతనిచ్చి, రైతు సేవా సంఘాలను కొత్తగా స్థాపించారు. 
              ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక స్థాయి సహకార సంఘాలను మల్టీపర్పస్ సంఘాలుగా మార్చారు. దీని ప్రకారం ఆహార ప్రాసెసింగ్, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తి, చేపలు పట్టడం వంటి ఎన్నో ఇతర రంగాలలో సహకార సంఘాల స్థాపన మొదలైంది. 
             1991 తర్వాత దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత వచ్చిన ప్రైవేటైజేషన్‌లో భాగంగా అన్ని రంగాలలో ‘డిజినె ్వస్ట్‌మెంట్’ మొదలైంది. అది సహకార రంగాన్ని కూడా తాకింది. దాంతో ప్రభుత్వ సహాయము - నియంత్రణ - పర్యవేక్షణలో నడుస్తూ వస్తున్న, సహకార సంఘాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని ఆలోచించారు. ఆ క్రమంలో ప్రభుత్వ నిధులు కానీ, ప్రభుత్వ నియంత్రణకు కానీ తావులేని కొత్త సహకార వ్యవస్థకు రూపకల్పన చేశారు. అదే 1995లో అమలులోకి వచ్చిన ‘పరస్పర సహాయక సహకార సంఘ’ విధానం! అయితే ఈ చట్టం పరిధిలోకి రావడానికి, ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఎక్కువ రాష్ట్రాలు సుముఖత చూపలేదు. ప్రస్తుతం విదర్భ ప్యాకేజి, వైద్యనాథన్ కమిటీ (2004) వంటి అంశాలతో సహకార రంగంలో పునర్నిర్మాణ చర్యలను భారత ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం (2002) అమలు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 

ఇతర రాష్ట్రాల్లో సంగతి..   
        మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఒకే భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు లేనట్లే సహకార రంగంలో కూడా ఒకే తరహా సంఘాలు, సాఫల్య వైఫల్యాలు లేవు. అయితే సహకార రంగంలోని ప్రయోజనాలను సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధిని సాధించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, హర్యానా, గుజరాత్, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రముఖమైనవని చెప్పాలి. ఈ రాష్ట్రాలలోని సహకార రంగం స్థానిక వనరులు - ప్రజల నైపుణ్యాలు - మార్కెట్ సౌకర్యాలు ఆధారంగా రూపొందింది. అన్నింటికీ మించి ఇక్కడి ప్రజలు - సభ్యులలో ‘సమిష్టి బాధ్యత - సమిష్టి భద్రత’ అనే భావనలు కూడా బలంగా ఉండటం వల్ల ఇక్కడి సహకార సంఘాలు అంతర్జాతీయంగా సక్సెస్ స్టోరీలుగా నిలిచిపోయాయి. 
          గుజరాత్‌లోని ఆనంద్‌లోని ‘అముల్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం’ సాధించిన సక్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఎగ్జాంపుల్. అలాగే తమిళనాడులో వ్యవసాయ సహకార సంఘాలు, చెరకు సహకార సంఘాలు, పంజాబ్ - హర్యానాలలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపరిచాయి.
                ఇక కేరళ విషయానికి వస్తే, ఆ రాష్ట్రంలో మొత్తం 14 వేల సహకార సంఘాలుండగా, అందులో దాదాపు 10 వేల సంఘాలు సక్రమంగా నడుస్తూన్నాయి. వాటిలో 40 వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే కేరళలోని సహకారోద్యమం కొబ్బరి, రబ్బర్ ఉత్పత్తిదారుల సహకార సంఘాలుగా రూపొందడం విశేషం కాగా, కేరళ రాష్ట్రంలో హాస్పిటల్స్‌ను సహకార రంగంలో నిర్వహించడం మరో గొప్ప విశేషం! 

మన రాష్ట్రం విషయమేమిటి?    
              మొదట్నించీ సహకారోద్యమం విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఒకటి. అయితే సహకార సంఘాల స్థాపన 1950 తర్వాతే మొదలైందని చెప్పాలి. అయితే మన రాష్ట్రంలో 1964 వరకూ రెండు వేర్వేరు చట్టాల ప్రాతిపదికన సహకార వ్యవస్థ కొనసాగింది. కోస్తాంధ్ర - రాయలసీమ ప్రాంతాలలో 1904 నాటి సహకార చట్టం ఆధారంగా ఏర్పడిన సహకార సంఘాలుండగా, తెలంగాణ ప్రాంతంలో ‘అంజుమన్ బ్యాంక్’ల పేరిట నైజాం సర్కార్ చట్టంతో రూపొందిన సహకార వ్యవస్థ ఉండేది. 
             రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సహకార వ్యవస్థ కోసం 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టాన్ని చేసింది. అప్పట్నించీ రాష్టమ్రంతటా ఒకే విధమైన సహకార విధానం కొనసాగుతోంది. అలా ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ సహాయంతో నడుస్తున్న సంఘాలు ప్రస్తుతం 19090 వరకు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 2949 ఉండగా, ఉద్యోగుల పరపతి సంఘాలు 3392, బలహీన వర్గాల సహకార సంఘాలు 9189, వినియోగదారుల సహకార సంఘాలు 671, హౌసింగ్, సహకార సంఘాలు 2735 ఉన్నాయి. ఇవే కాకుండా అర్బన్ సహకార బ్యాంక్‌లు (103), సహకార సమిష్టి వ్యవసాయ సంఘాలు, గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలుల (4) వంటివెన్నో ఉన్నాయి. ఇక 1995 నాటి పరస్పర సహాయక సహకార చట్టం పరిధిలో పనిచేస్తున్న సంఘాలు రాష్టవ్య్రాప్తంగా 54,520 వరకూ ఉన్నాయి. 
               అలాగే సహకారోద్యమం మన రాష్ట్రంలో ఇతర శాఖల పరిధిలో కూడా ముందంజలోనే ఉందని చెప్పాలి. అలా మన రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సహకార సంఘాలు 8766, జాలరుల సహకార సంఘాలు 4708, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు 3454, చేనేత, సహకార సంఘాలు 1527, చక్కెర సహకార సంఘాలు 22, సహకార జూనియర్ కాలేజీలు 80 వరకూ ఉన్నాయి. 
               మన రాష్ట్రంలో సహకారోద్యమం మొదట రైతుకు ఆర్థిక రుణాలను అందించే లక్ష్యంతో మొదలై ఇప్పుడు విభిన్న రంగాలలో వేర్వేరు అవసరాలను తీర్చే సంఘటిత శక్తులుగా ఎదగడం గర్వించదగిందే. అయినా, సంఘాల నిర్వహణ పనితీరు మాత్రం అంతగా ఆశాజనకంగా లేకపోవడం శోచనీయం. కరీంనగర్‌లోని ముల్కనూరు సహకార సంఘం వంటి కొన్ని సంఘాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలోని సహకార సంఘాలు తప్ప మిగతా జిల్లాలలోని అన్ని రకాల సహకార సంఘాలు ఏమంత గొప్పగా ఉన్న దాఖలాలు లేవు. 

సహకార అర్బన్ బ్యాంక్‌లు - తీరుతెన్నులు  
              మన దేశంలో సహకార సంఘాల ఏర్పాటుకు తొలి ప్రాతిపదిక గ్రామీణ రైతుకు తన వ్యవసాయాన్ని చేసుకోవడానికి కావలసిన పెట్టుబడిని అందించడమే! జమీందారులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలోంచి బక్కచిక్కిన రైతన్నను ఆదుకోవడం, ఆర్థిక రుణాలను అందజేయడం సహకార ఉద్యమం మన నేల మీద ఊపిరి పోసుకోవడానికి ప్రధాన కారణం. అలాంటి అవసరంలోంచి ఏర్పడ్డవే ‘సహకార అర్బన్ బ్యాంక్‌లు’! ‘పాజిటివ్ బ్యాంకింగ్’ అనే కానె్సప్ట్‌తో రూపొందిన ఈ బ్యాంకులు ఇటీవలి కాలంలో అత్యంత వివాదాగ్రస్తంగా మారాయి. నిజానికి ఈ బ్యాంకులు సదాశయంతో రూపొందాయనే చెప్పాలి.. 
                గ్రామీణ ప్రాంతాలలోంచి పట్టణాలు/ నగరాలకు వలసలు పెరిగిపోయిన దశలో, ఇలాంటి, సామాన్య, బడుగు ప్రజలకు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా వారి ప్రగతికి దోహదపడటం అర్బన్ బ్యాంక్‌ల లక్ష్యం. వాణిజ్య బ్యాంక్‌లలు రుణాలివ్వాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఆ లోపాన్ని అధిగమించి చిన్నకారు - సన్నకారు వ్యాపారికి కావలసిన రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ‘సహకార అర్బన్ బ్యాంక్’లు వేలాది పట్టణ నిరుద్యోగ కుటుంబాలకు ఆసరాగా నిలిచాయి. ఐతే వలసలు, నగరీకరణ ధోరణులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 1991లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, తత్ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సరళీకృత విధానాల వల్ల దేశవ్యాప్తంగా సహకార అర్బన్ బ్యాంక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. అయితే వీటి నిర్వహణలో, ఆర్థిక క్రమశిక్షణలో సరైన నియంత్రణ లేకపోవడం వల్ల 2001 తర్వాత ఈ అర్బన్ బ్యాంక్‌లు సంక్షోభంలోకి చేరుకున్నాయి. 
                  సహకార అర్బన్ బ్యాంక్‌ల నిర్వహణ అంతా సభ్యుల చేత ఎన్నికైన మేనేజింగ్ కమిటీ నేతృత్వంలో వుండటం, వారి వ్యక్తిగత ప్రయోజనాలే బ్యాంక్ ప్రయోజనాలకన్నా మిన్నగా మారడం వంటి అవాంఛనీయ పరిణామాలు అర్బన్ బ్యాంక్‌లలో ఎనె్నన్నో కుంభకోణాలకు తెర తీశాయి. కానీ 2001 తర్వాత నుండి రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సహకార అర్బన్ బ్యాంక్‌లలో ఎనె్నన్నో క్రమశిక్షణా చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం అవన్నీ ఇతర వాణిజ్య/ షెడ్యూల్డు బ్యాంకులకు మల్లే ప్రస్తుతం ముందంజలో దూసుకెళ్తున్నాయి. 
                మన రాష్ట్రంలో సహకార అర్బన్ బ్యాంక్‌ల తీరుతెన్నులను గమనిస్తే, 2006-07లో 124గా ఉన్న సహకార అర్బన్ బ్యాంక్‌లు, 2007-08 లో 116కు తగ్గాయి. 2008-09లో 114కు, 2009-10కు 111కు, ప్రస్తుతం 103కు ఆ సంఖ్య తగ్గింది. అయితే ఇదే కాలంలో డిపాజిట్లు పెరగడం ఓ ఆశ్చర్యం. 2006-07లో రాష్ట్రంలోని అర్బన్ బ్యాంక్‌లలో డిపాజిట్లు 2665 కోట్లు ఉండగా, 2008-08 నాటికి 3092 కోట్లకు, 2008-09 నాటికి 3653 కోట్లకు, 2009-10 నాటికి 4281 కోట్లకు, 2010-11 నాటికి 5180 కోట్లకు పెరిగాయి. 
                సకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, సహకార అర్బన్ బ్యాంక్‌ల విషయంలో స్పందించి, సమస్యాత్మకంగా మారిన బ్యాంక్‌లను రద్దు చేయడం, ఇతర బ్యాంక్‌లలో విలీనం చేయడం, స్పెషల్ ఆఫీసర్‌ల నియామకం ద్వారా సమస్యలను పరిష్కరించడం ద్వారా మళ్లీ ప్రజలు - సభ్యులలో సహకార అర్బన్ బ్యాంక్‌లపై విశ్వాసాన్ని పెంచగలిగారు. అందుకే కృషి, చార్మినార్ వంటి బ్యాంక్‌లు సభ్యుల డిపాజిట్లను తిరిగి చెల్లించడమే కాక, ప్రస్తుతం తమ కార్యకలాపాలలో మళ్లీ పుంజుకుని సక్రమంగా నడుస్తున్నాయి. ఈ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సత్వర పనితీరే కారణమని చెప్పాలి. 

సమస్యలేంటి? పరిష్కారాలేంటి? 
         ‘సామాజిక న్యాయం - ఉద్యోగితా కల్పన - పేదరిక నిర్మూలన’ అనే త్రిముఖ వ్యూహంతో ఏర్పాటైన సహకార సంఘాలు ఆది నుండి అన్నీ ఆటంకాలే. అయితే గతంలోని ప్రజావసరాలు, గ్రామీణ పరిస్థితులు, ‘హరిత విప్లవం’ వంటి ప్రత్యేక కార్యక్రమాల వల్లనూ, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిధులను ప్రోత్సాహకాలను అందించడం వల్లనూ సహకార రంగం, సంఘాలు కూడా ఉద్యమ స్థాయిలో ముందుకురికాయి. కానీ ప్రస్తుత కాలానికి సహకార రంగం, సంఘాలు అన్నీ ఎనె్నన్నో సంస్థాగతమైన, ఆర్థికపరమైన, నిర్వహణా పరమైన, నాయకత్వ పరమైన లోపాలతో కునారిల్లుతున్నాయి. 
           ఇక రాజకీయ పరమైన జోక్యాలు - ప్రభావాలు సరేసరి. జవాబుదారీతనంతో కూడి సుశిక్షితులైన నిర్వాహక సిబ్బంది కొరత, నిధుల లేమి, ప్రభుత్వ విధానాల ఫలితంగా వచ్చే ఆటంకాలు, రుణాల రికవరీ సమస్యలు, మేనేజింగ్ కమిటీ ఏకపక్ష పోకడలు, సహకార సంఘాల అధ్యక్షుల స్వార్థ ప్రయోజనాలు వంటివి కూడా రాష్ట్రంలో సహకార వృక్షానికి చీడలుగా దాపురించాయి. ఇదంతా ఒకెత్తయితే, సభ్యుల ఉదాసీన వైఖరి, నిర్ణయాలలో భాగస్వామ్య రాహిత్యం వంటివి మరో ఎత్తు అని చెప్పాలి. ‘ప్రజాస్వామ్యం - ప్రభుత్వ పర్యవేక్షణ’ అనే రెండు యంత్రాంగాల సమన్వయంతో నడిచే సహకార సంఘాలు గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం, భవిష్యత్ నాయకులకు పాఠశాలలుగా మారడం కూడా ఇందులో భాగమే. అలాగే వాస్తవ వసూళ్లు కాకుండా ‘రీ షెడ్యూలింగ్’ ద్వారా రికవరీలను అడ్జస్ట్ చేసే విధానం కూడా సభ్యుని బాధ్యత నుంచి దూరంగా చేస్తున్నాయి. 
               సహకార రంగం, సహకారోద్యమం వల్ల, సామాజిక ప్రగతి, వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంతేగాక, మన దేశం లాంటి ‘ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ’ గల దేశాలలో సహకార రంగాన్ని మించిన ‘అభివృద్ధి నమూనా’ మరోటి ఉండదు. అందుకే సహకార రంగంలోని లోపాలను, సమస్యలను పరిష్కరించి వాటిని మరింత పరిపుష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీని కోసం, 1)మొదట సభ్యులలో చైతన్యం తీసుకురావడం, 2)సంఘ కార్యకలాపాలలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచింపజేయడం అవసరం. అప్పుడే నిధుల సక్రమ నిర్వహణ, రుణ వసూళ్లు, కొత్త వ్యాపారాలకు విస్తరణ వంటివి సాధ్యవౌతాయి. 3)అంతేగాక, పంచాయతీరాజ్ సంస్థల సకాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉన్నట్టుగానే సహకార సంఘాల కోసం ఓ ‘ప్రత్యేక ఎలక్షన్ కమీషన్’ని ఏర్పాటు చేయడం అవసరం. 4)సభ్యులకు - సిబ్బందికీ శిక్షణా సౌకర్యాలు కల్పించడం,5) సంఘ కార్యకలాపాలను కంప్యూటరీకరించడం, 6) సంఘాలు, బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణను పర్యవేక్షణను పూర్తి స్థాయిలో పెంచడం, 7)ఉద్యోగులు, మేనేజింగ్ కమిటీలను జవాబుదారీగా చేయడం, 8) అవకతవకలకు పాల్పడిన సంఘ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి అవరం. 9)అంతేగాక, 1995 చట్టం ప్రకారం రూపొందిన పరస్పర సహాయక సహకార సంఘాలను సైతం ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావడం, 10)ఏకలక్ష్య నిర్వహణకు బదులుగా బహుళ వ్యాపకాల నిర్వహణలను చేపట్టేలా సంఘాలను బలోపేతం చేయడం ఈ సమస్యలకు ఒకింత పరిష్కారాలుగా భావిచాలి. 11)అన్నింటినీ మించి ప్రజలు సభ్యులు సంఘంలో చేరేప్పుడు చూపిన శ్రద్ధ ఆ తర్వాత కూడా కొనసాగేలా చైతన్యపరచాలి. 

సహకార రంగం - వివాదాలు  
           ఎంతో సమున్నత ఆశయంతో ‘సమిష్టి కృషి - సమాన ప్రగతి’ అనే లక్ష్యంతో మొదలైన సహకార సంస్థలలు, క్రమేణా ఎనె్నన్నో ప్రతిబంధకాలు, అవరోధాలనే కాక, వివాదాలనూ కుంభకోణాలనూ కూడా మూటగట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే, ప్రణాళికా రచనలో మూలాంశాలైన మైక్రో లెవల్ ప్లానింగ్, పీపుల్స్ పార్టిసిపేషన్ వంటివి మొదట అమలు చేసినవి సహకార సంఘాలే. అయితే ‘కర్ణుడీల్గె నార్గురి చేతన్’ అన్నట్లు ప్రస్తుతం సహకార సంఘాలు ఎనె్నన్నో విమర్శలకు, ప్రజలు సభ్యుల నిరాదరణకు గురవుతున్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే, సహకార రంగం తీవ్రమైన విమర్శలకు గురయిన సందర్భం మాత్రం ‘కృషి అర్బన్ బ్యాంక్’ ‘చార్మినార్ అర్బన్ బ్యాంక్’ వంటి అర్బన్ బ్యాంక్‌లలో వెల్లడైన వివాదాల వల్లనే అని చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, సహకార సంఘాల రిజిస్ట్రార్, ఇతర ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించడం, డిపాజిట్‌లు - లోన్‌లలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇపుడు హైదరాబాద్ నగరంలోని సహకార అర్బన్ బ్యాంక్‌లు గాడిన పడ్డాయి. ఇతర వాణిజ్య బ్యాంక్‌లకు ధీటుగా సేవలను అందిస్తూ సభ్యుల నమ్మకాన్ని సాధించాయి.    
       సహకార రంగంలో మరో వివాదాగ్రస్తమైన అంశం - సహకార గృహ నిర్మాణ రంగం! సొంతిల్లు అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనే సంకల్పంతో సహకార సంఘంగా ఏర్పడిన సభ్యులు తర్వాత దాని మూలసూత్రానికే గండి కొట్టడం వల్లనే ఈ వివాదాలు చెలరేగాయని చెప్పాలి. సహకార రంగంలోని ఈ సౌలభ్యాన్ని సామాన్యులకు బదులు బడా స్వాములు ఉపయోగించుకోవడం. వారు సొసైటీగా ఏర్పడి, ప్రభుత్వ రాయితీలతో భూములను పొందడం, ఆ తర్వాత సహకార స్ఫూర్తికి తిలోదకాలు ఇవ్వడం జరుగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జూబ్లీ హిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అవకతవకలే అని చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ అయిన శ్రీనివాస్ శ్రీనరేష్ ‘మన రాష్ట్రంలో సహకార గృహ సంఘాలు కేవలం గృహాల కోసం భూమి కేటాయింపు అంశాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సభ్యులకు భూమి కేటాయించడంతోనే తమ పని పూర్తయి పోయిందని అనుకుంటున్నాయి. ఆ ధోరణి మారాలి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలు కేవలం ప్రభుత్వ నూమిని తీసుకోవడం, డెవలప్ చేయడం, ప్లాట్‌ల కేటాయింపు చేయడం వంటి అంశాలకే కాక, సొసైటీలో నిర్మాణమైన గృహాలను మెయిన్‌టెయిన్ కూడా వారే చేస్తున్నారు. దాంతో హౌసింగ్ సొసైటీలోని సభ్యులందరి మధ్య సమిష్టి బాధ్యత ఏర్పడుతోంది. అలాంటి స్థితినే మన రాష్ట్ర సహకార హౌసింగ్ రంగంలో తీసుకురావడం ప్రస్తుతావసరం’ అని వివరించారు. 
            అలాగే సూపర్ బజార్‌లు కూడా రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. రిటైల్ వ్యాపారంలో ఇపుడు కార్పొరేట్ లెవెల్‌లో నడుస్తున్న సూపర్ మార్కెట్ కల్చర్‌ను మొదటిసారిగా ‘సూపర్ బజార్’ల పేరిట ప్రవేశపెట్టిన ఘనత సహకార రంగానిదే! వినియోగదారుడు అల్ప ధరలలో నాణ్యమైన సరుకులు - వస్తువులు - ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సూపర్ బజార్‌లు కాలక్రమేణా ఎనె్నన్నో నిర్వహణాపరమైన లోపాలతో నష్టాలపాలై మూతపడ్డాయి. కానీ ఈ లోపాలను చక్కదిద్ది సూపర్ మార్కెట్‌లకు ధీటుగా వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

 2012 - అంతర్జాతీయ సహకార సంవత్సరం 
          ప్రపంచవ్యాప్తంగా సంభవించే మానవ అవసరాల దిశగా సభ్యదేశాలు, వాటి ప్రభుత్వాలతో చైతన్యం కలిగించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతీ సంవత్సరాన్ని ఏదో ఒక అంశంపై కేంద్రీకరించడాన్ని ఆశయంగా పాటిస్తోంది. దాన్లో భాగంగా 2012 సంవత్సరాన్ని ఐరాస ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ 18 డిసెంబర్ 2009లోనే ఆమోదించి, ఐరాసలో సభ్యులుగా ఉన్న 204 దేశాలకు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. ‘సామాజిక అభివృద్ధిలో సహకార సంఘాలు’ అనే పేరిట ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ తీర్మానంలో సామాజిక ప్రగతిలో సహకారోద్యమం యొక్క పాత్రను ప్రముఖంగా ప్రస్తావించడమే కాక, ఆయా దేశాలు - ప్రభుత్వాలు అన్నీ సహకార సంఘాల పురోభివృద్ధికి తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన ఆవశ్యకతను విశదీకరించాయి. 
             2012ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం ద్వారా, అంతర్జాతీయంగా నడుస్తున్న సహకార సంస్థలు - ఉద్యమంపై మరొక్కసారి నిర్మాణాత్మక ఆలోచనలను దేశాలు - ప్రభుత్వాలు - ప్రజలు - సభ్యులలో కలిగించదలిచారు. అంతేగాక, మానవుడి అత్యాశలకు కాకుండా మానవుడి నిత్యావసరాలను సమకూర్చడంలో మానవులందరిలో ఉండాల్సిన సహకార భావనని పెంపొందించడాన్ని కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా చేశారు. కాగా, ఈ బృహత్ బాధ్యతని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ సహకార సంఘం’ నేతృత్వంలో 2012 సంవత్సరం పొడవునా అన్ని దేశాల్లో నిర్వహింchaaరు. ==========================================****
సహకారోద్యమం - మెరుగైన సమాజం 
          1901లో ఏర్పాటైన రాయల్ కమీషన్ భారతీయ రైతు గురించి ఓ మాట చెప్పింది ‘అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోనే పెరిగి, అప్పుల్లోనే మరణించి, అప్పులనే వారసత్వంగా ఇస్తున్నాడు’ అని! ఈ దయనీయ స్థితి నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక అయిన రైతన్నను రక్షించే దిశగా ఏర్పాటైన సహకార సంఘాలు, సహకారోద్యమం ఆ దిశగా చెప్పుకోదగ్గ విజయం సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఏ అండా రక్షణా లేని సామాన్యుడికి భద్రతనూ, స్థిరత్వాన్నీ ఇవ్వగలిగిన సంస్థలలో సహకార రంగాన్ని మించింది లేదు అని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలు, దేశాలు తమ అనుభవాలలోంచి నిరూపించి చెప్తున్నాయి.
             ప్రస్తుత ప్రపంచం నిరంతరం ఎనె్నన్నో సంక్షోభాలు - సమస్యలతో అతలాకుతలం అవుతోంది. వీటన్నింటినీ పరిష్కరించగలిగే ఒకే ఒక సాధనం ‘సహకారం’ అని ఐక్యరాజ్యసమితి వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు గుర్తించాయి. అందుకే ‘సహకారం’ అనే భావనను ఇప్పుడు ఓ సంఘానికి, ఉద్యమానికి మాత్రమే పరిమితం చేయకుండా ఓ ‘జీవన విధానం’గా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఆ దిశగా మన ప్రభుత్వాలు, ప్రజలు, సంఘాలు, సభ్యులు, అధికారులు అందరూ కలసి వెళ్లాల్సిన సమయం ఇదే! *
-------------------- Harikrishna mamidi 8008005231