Folks, here it's my research article on the COOPERATIVE SYSTEM published as Sunday cover story of ANDHRA BHOOMI paper on 19-2-2012, in connection with the declaration of 2012 as INTERNATIONAL COOPERATIVE YEAR by UNO.
Today on 4-7-2020 is being observed as NATIONAL COOPERATIVES DAY.. celebrate it and read on...
సహకార నామ సంవత్సరం!
------- Harikrishna Mamidi
‘సహకార సంఘాలు అంతర్జాతీయ సమాజ నిర్మాణం దిశగా, వసుదైక కుటుంబం ఏర్పాటు దిశగా మనం చేస్తున్న ప్రయత్నానికి నిజమైన దృష్టాంతాలు. ఆర్థిక సమృద్ధత, సామాజిక బాధ్యత అనే రెండు ప్రధాన మానవీయ అంశాలను స్పృశించగలిగే సామర్థ్యం ఉన్న ప్రజా సమూహాలు కూడా సహకార సంఘాలే!’
----బాన్‌కి మూన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్
*** *** ***
మానవ జాతి చరిత్రనీ, మానవ నాగరికత పరిణామాన్నీ ఒక్క మాటలో చెప్పడం సాధ్యమా? అనే ప్రశ్నకు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ చరిత్ర ప్రొఫెసర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘సహకారం!’
* * * *** ***
ప్రపంచం మొత్తం మీద ఉన్న దేశాలు, జాతులు ఎప్పటికప్పుడు ఎనె ్నన్నో ఉద్యమాలు నడిపాయి. అయితే ఆ ఉద్యమాలన్నీ స్థానిక అవసరాల కోసమో, స్వాతంత్య్రం కోసమో, ప్రాంతీయంగానో, దేశీయంగానో జరిగిన ఉద్యమాలు మాత్రమే. కానీ ప్రపంచమంతటా ఆమోదం పొందిన ఒకే ఒక్క ప్రజా ఉద్యమం మాత్రం - ‘సహకార ఉద్యమమే!’
* * * *** ****
‘సహకారం’ అనేది ఓ జీవసహజాతం! ఓ చీమ మరో చీమకు సహకరించడం, ఓ మనిషి మరో మనిషికి సహకరించడంలో ఈ సహజాత లక్షణం కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తి అవసరాన్ని, లక్ష్యాన్ని తన అవసరంగా తన లక్ష్యంగా భావించి ఫలితాన్ని ఇద్దరూ పొందడం అనే జీవన విలువ - ‘సహకారం’లో ఇమిడి ఉంది. అందుకే మానవ ప్రగతి యావత్తూ మరో మనిషి సహకారంతో సాధించిన ఫలితమే అని సామాజిక శాస్తవ్రేత్తలు, చరిత్రకారులు నొక్కి చెబుతారు. అంతేగాక, మానవ సంబంధాలు - అనుబంధాలన్నిటికీ ఆలంబన కూడా ‘సహకారమే’ అని మనోవైజ్ఞానిక శాస్తజ్ఞ్రులు కూడా అంగీకరిస్తారు. అందుకే సహకారం మనిషిని మానవుడిగా మార్చే సమున్నత మానవతా వాదం అని తాత్వికులు ప్రశంసించారు. ఇంతగా మన జీవితాలతో పెనవేసుకుపోయి, సహకార భావనని ఓ సమిష్టి శక్తిగా మలిచే ప్రయత్నంలో ఏర్పడిన ఉద్యమమే ‘సహకారోద్యమం!’ ఆ సంఘటిత శక్తికి నిలువెత్తు రూపమే ‘సహకార సంఘాలు.’ అందుకే సహకార సంఘాల జీవసూత్రం ‘ఒక్కరి కోసం అందరు - అందరి కోసం ఒక్కరు’ అనే నినాదంగా మారింది.
ఆ స్ఫూర్తిని మరొక్కసారి ప్రపంచ ప్రజలందరిలో కలిగించడం కోసమే 2012 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది.
అలా మొదలైంది..
సహకారం, సహకార జీవనం అనే అంశాలు మానవజాతి అంత ప్రాచీనమైన భావనలే అయినప్పటికీ ప్రాథమిక రూపంలో ఏర్పడింది వౌర్యుల కాలంలోనే అని చెప్పాలి. ఆ కాలంలో వౌర్య సామ్రాజ్యంలోని నగరాలు, గ్రామాల్లో ‘శ్రేణులు’ అనే సంస్తలు వ్యక్తుల ఆర్థిక అవసరాలను తీర్చే సంస్థలుగా ఉండేవి. కానీ సువ్యవస్థీకత రూపంలో, ఆధునిక ధోరణులలో రూపొందింది మాత్రం యూరప్‌లోనే అని చెప్పాలి. బ్రిటన్‌లోని అబెర్డీన్‌లో 1498లో స్థాపించిన షోర్ పోర్టర్స్ సొసైటీ అనేది తొలి సహకార సంఘం అనే ఆధారాలున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక విప్లవం ఊపందుకోవడం సహకార సంఘాల ప్రగతికి మరింత దోహదపడింది. అలాగే 1769లో ఫెన్‌విక్ అనే ప్రాంతంలో తొలి ‘వినియోగదారుల సహకార సంఘం’ ఏర్పడింది. 1832లో ‘లాక్‌హర్స్ట్ లేన్ పారిశ్రామిక సహకార సంఘం’ రూపొందింది.
ఐతే మనం ఇప్పుడు పాటిస్తున్న సహకార విధాన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత మాత్రం ‘రాబర్ట్ ఓవెన్’దే! స్కాట్లండ్‌లోని తన కాటన్ మిల్స్ (దానికి ఆయన ‘న్యూలానార్క్’ అని పేరు పెట్టారు)లో తన పరిశ్రమ నిర్వహణను సహకార ప్రాతిపదికగా రూపొందించారు. తన మిల్స్‌లో పనిచేసే కార్మికులే సభ్యులుగా సహకార ప్రాతిపదికన ఓ నూతన నిర్వహణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే ఆయనను ‘సహకారోద్యమ పితామహుడు’గా పిలుస్తారు. అయితే 1828లో ‘ది కోపరేటర్’ అనే పత్రిక ద్వారా సహకార సూత్రాలను విస్తృతంగా ప్రచారం చేసింది మాత్రం విలియం కింగ్ అనే డాక్టరే అని చెప్పాలి.
ఇక 1844లో ఇంగ్లండ్‌లోని రాక్‌డేల్ అనే ప్రాంతంలో రూపొందిన ‘రాక్‌డేల్ సొసైటీ ఆఫ్ ఈక్విటబుల్ పయొనీర్స్’ అనే సంఘం సహకారోద్యమానికి నిర్దిష్టమైన రూపురేఖల్ని, శాస్ర్తియత్వం నిర్ధారించింది. పారిశ్రామిక విప్లవం వల్ల కార్మికులంతా ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడినపుడు, తమలో తాము సంఘంగా ఏర్పడి పరిశ్రమలతో పోటీ పడే ధోరణిని ఈ సంఘం నిజం చేసి సక్సెస్ అయింది. ఈ సంఘం స్థాపించిన ‘నిత్యావసర సరుకుల సహకార సంఘం’ సహకార రంగంలో కొత్త విప్లవానికి దారి వేసింది. అలా మొదలైన సహకారోద్యమం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఎనె్నన్నో రుణాలకు విస్తరించింది.
ఇతర దేశాల్లో..
సహకార ఉద్యమం ప్రధానంగా ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలలో వేర్వేరు అనుభవాల నుండి ఎదిగినప్పటికీ, అనతికాలంలోనే అది ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించింది. స్పెయిన్‌లోని బాస్క్‌కౌంటీలోని ‘మోంగ్రేగౌన్ కోపరేటివ్ కార్పొరేషన్’ అక్కడి సామాన్య ప్రజానీకం ఆర్థిక స్థితిగతులను ఎంతగానో మెరుగుపరచింది. యుగోస్లావియాలో ‘వర్కర్స్ కౌన్సిల్స్’ పేరిట సహకారోద్యమం కార్మికులు - కర్షకుల జీవన విలువలను పెంచడమే కాక, వారికి భద్రతను - ఆర్థిక సుస్థిరతను ఇవ్వడంలో సక్సెస్ అయింది.
ఇక యూరప్ ఖండంలోని చాలా దేశాలలో సహకార సంఘాలు కార్పొరేట్ స్థాయికి ఎదిగాయని చెప్పాలి. అక్కడి సహకార సంఘాలు రిటైల్, బ్యాంకింగ్ వంటి సేవలనే కాక, ఇన్సూరెన్స్ వంటి సేవలను కూడా అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. అలాగే ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రశంసనీయమైన జీవన ప్రమాణాలను కలిగి యున్న డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాల ఉన్నతికి, పురోగతికి ప్రధాన కారణం - సహకార సంఘాలే!
ఇక అభివృద్ధికి అడ్రస్‌గా చెప్పే అమెరికా సైతం ఆ అభివృద్ధికి కారణంగా అమెరికా అధ్యక్షులు సైతం ప్రశంసించే అంశాలలో సహకారోద్యమం ప్రముఖంగా ఉండటం విశేషం. అమెరికాలో దాదాపు 29 వేల పై చిలుకు సహకార సంఘాలు వివిధ సేవలను అందిస్తున్నాయి. ఈ సంఘాలు దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలివ్వడమే కాక సంవత్సరానికి 652 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
ఈ సహకారోద్యమంలో యునైటెడ్ కింగ్‌డమ్ మరో అడుగు ముందుకేసింది. 20వ శతాబ్దపు ఆరంభంలో అక్కడి సహకార సంఘాలన్నీ కలిసి ప్రత్యేకంగా ఓ రాజకీయ పార్టీని ‘కోపరేటివ్ పార్టీ’ పేరిట ఏర్పాటు చేసుకున్నాయి. దాని సభ్యులు కొందరు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు కూడా! ప్రస్తుతం ఈ ‘కోపరేటివ్ పార్టీ’ అక్కడి ‘లేబర్ పార్టీ’తో ఎన్నికల పొత్తు పెట్టుకుని ప్రజా ప్రాతినిధ్యంలో సైతం తమదైన బాణీని, వాణిని ప్రదర్శిస్తున్నాయి. అంతేగాక, ఇంగ్లండ్‌లో సహకార రంగం ఆహార వినియోగ సేవలనే కాక, ట్రావెల్ ఇండస్ట్రీలలోనూ, ఆఖరికి మరణానంతర సేవల నిర్వహణలోనూ తనదైన ప్రత్యేకతను సాధించింది.
చైనా, జపాన్ దేశాలు కూడా ఈ విషయంలో వెనుకబడి లేవు. ఇక దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ సహకారోద్యమాన్ని ‘సెమా ఉల్‌డాంగ్’ పేరిట (జన్మభూమి, శ్రమదానం వంటి పథకాలకు ఇదే స్ఫూర్తి) నిర్వర్తిస్తూ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్నాయి.
మన దేశం సంగతేంటి?
మన దేశంలో సహకార సంఘాలకు సంబంధించిన ఆధారాలు మగధ సామ్రాజ్య కాలంలోనే ఉన్నప్పటికీ, ఆధునిక రూపంలో వీటిని దేశంలో ప్రవేశపెట్టింది మాత్రం బ్రిటిష్ పాలకులే! అయితే మన దేశంలో సహకార సంఘాల వ్యవస్థాపనకు ‘కరువు’ కారణం కావడం విశేషం! 1899లో దేశవ్యాప్తంగా కరువు విలయతాండవం చేసింది. ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి డెరిక్ నికల్సన్ అనే నిపుణుడు చేసిన సూచనలను మరియు 1901లో ఏర్పాటైన ‘రెండవ కరువు పరిశీలక సంఘం’ చేసిన ప్రతిపాదనలను అనుసరించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1904లో తొలిసారిగా సహకార సంఘాలను స్థాపించింది. రుణాలు, వినియోగ వస్తువులు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా ఎనె్నన్నో సహకార సంఘాలు పుట్టుకొచ్చాయి. కానీ 1928-32 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంభవించిన ‘ఆర్థిక మాంద్యం’తో బ్రిటిష్ ప్రభుత్వం సహకార సంఘాల విస్తరణపై నిర్లక్ష్యం వహించింది. అయితే 1933లో ఏర్పాటైన ‘రిజర్వ్ బ్యాంక్’ మాత్రం సహకార రుణాలపై పరిశీలన కోసం ప్రత్యేక విభాగానే్న ఏర్పాటు చేసింది. దాంతో సహకార సంఘాలు మళ్లీ కొంత పుంజుకున్నాయి. ఇక 1945లో ‘అఖిల భారత సహకార ప్రణాళికా కమిటీ’ ఏర్పడటంతో సహకార భావన ఉద్యమ రూపంలోకి మారి విస్తృతమయింది.
స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వం కూడా గ్రామీణ పునర్నిర్మాణంలో, దేశ ప్రగతి సాధనలో సహకార రంగం యొక్క పాత్రను సరిగానే అంచనా వేసింది. అందుకే మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం (1951) నుండి వీటిపై ప్రత్యేక శ్రద్ధను చూపించింది. అదే సమయంలో 1954లో ‘సహకారోద్యమ స్వర్ణోత్సవాల’ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సందర్భంగా ప్రభుత్వం సహకార సంఘాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాంతోపాటు సహకార మార్కెటింగ్ సొసైటీలను కూడా ప్రారంభించింది.
రెండో పంచవర్ష ప్రణాళికకి సహకార రంగంలోకి గిడ్డంగులను కూడా తీసుకురాగా, మూడో పంచవర్ష ప్రణాళిక మరో అడుగు ముందుకేసి సహకార చక్కెర కర్మాగారాలను, సహకార నూలు పరిశ్రమలను, సహకార స్పిన్నింగ్ మిల్లులను, సహకార పాల సరఫరా సంఘాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో సిబ్బందికి, సహకార సభ్యులకు శిక్షణ నిమిత్తం పూనెలో ‘సహకార శిక్షణ కాలేజ్’ని స్థాపించింది.
ఇక నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశమంతటా ‘హరిత విప్లవం’ ఆరంభమైంది. వ్యవసాయ రంగంలో నూతన మార్పులను తీసుకురావడానికి సహకార రంగంలో పరపతి సంఘాలను మరింతగా ఏర్పాటు చేశారు.
ఐదో పంచవర్ష ప్రణాళికా కాలంలో కేంద్ర సహకార బ్యాంకుల విధానాన్ని బలోపేతం చేయడమే కాక వినియోగదారుల సహకార సంఘాలకు చేయూతనిచ్చి, రైతు సేవా సంఘాలను కొత్తగా స్థాపించారు.
ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాథమిక స్థాయి సహకార సంఘాలను మల్టీపర్పస్ సంఘాలుగా మార్చారు. దీని ప్రకారం ఆహార ప్రాసెసింగ్, కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తి, చేపలు పట్టడం వంటి ఎన్నో ఇతర రంగాలలో సహకార సంఘాల స్థాపన మొదలైంది.
1991 తర్వాత దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఆరంభమైన తర్వాత వచ్చిన ప్రైవేటైజేషన్‌లో భాగంగా అన్ని రంగాలలో ‘డిజినె ్వస్ట్‌మెంట్’ మొదలైంది. అది సహకార రంగాన్ని కూడా తాకింది. దాంతో ప్రభుత్వ సహాయము - నియంత్రణ - పర్యవేక్షణలో నడుస్తూ వస్తున్న, సహకార సంఘాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని ఆలోచించారు. ఆ క్రమంలో ప్రభుత్వ నిధులు కానీ, ప్రభుత్వ నియంత్రణకు కానీ తావులేని కొత్త సహకార వ్యవస్థకు రూపకల్పన చేశారు. అదే 1995లో అమలులోకి వచ్చిన ‘పరస్పర సహాయక సహకార సంఘ’ విధానం! అయితే ఈ చట్టం పరిధిలోకి రావడానికి, ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఎక్కువ రాష్ట్రాలు సుముఖత చూపలేదు. ప్రస్తుతం విదర్భ ప్యాకేజి, వైద్యనాథన్ కమిటీ (2004) వంటి అంశాలతో సహకార రంగంలో పునర్నిర్మాణ చర్యలను భారత ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం (2002) అమలు దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో సంగతి..
మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఒకే భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు లేనట్లే సహకార రంగంలో కూడా ఒకే తరహా సంఘాలు, సాఫల్య వైఫల్యాలు లేవు. అయితే సహకార రంగంలోని ప్రయోజనాలను సక్రమంగా ఉపయోగించుకుని అభివృద్ధిని సాధించిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, హర్యానా, గుజరాత్, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ప్రముఖమైనవని చెప్పాలి. ఈ రాష్ట్రాలలోని సహకార రంగం స్థానిక వనరులు - ప్రజల నైపుణ్యాలు - మార్కెట్ సౌకర్యాలు ఆధారంగా రూపొందింది. అన్నింటికీ మించి ఇక్కడి ప్రజలు - సభ్యులలో ‘సమిష్టి బాధ్యత - సమిష్టి భద్రత’ అనే భావనలు కూడా బలంగా ఉండటం వల్ల ఇక్కడి సహకార సంఘాలు అంతర్జాతీయంగా సక్సెస్ స్టోరీలుగా నిలిచిపోయాయి.
గుజరాత్‌లోని ఆనంద్‌లోని ‘అముల్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం’ సాధించిన సక్సెస్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఎగ్జాంపుల్. అలాగే తమిళనాడులో వ్యవసాయ సహకార సంఘాలు, చెరకు సహకార సంఘాలు, పంజాబ్ - హర్యానాలలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపరిచాయి.
ఇక కేరళ విషయానికి వస్తే, ఆ రాష్ట్రంలో మొత్తం 14 వేల సహకార సంఘాలుండగా, అందులో దాదాపు 10 వేల సంఘాలు సక్రమంగా నడుస్తూన్నాయి. వాటిలో 40 వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అయితే కేరళలోని సహకారోద్యమం కొబ్బరి, రబ్బర్ ఉత్పత్తిదారుల సహకార సంఘాలుగా రూపొందడం విశేషం కాగా, కేరళ రాష్ట్రంలో హాస్పిటల్స్‌ను సహకార రంగంలో నిర్వహించడం మరో గొప్ప విశేషం!
మన రాష్ట్రం విషయమేమిటి?
మొదట్నించీ సహకారోద్యమం విషయంలో చురుకైన పాత్ర పోషిస్తున్న రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ఒకటి. అయితే సహకార సంఘాల స్థాపన 1950 తర్వాతే మొదలైందని చెప్పాలి. అయితే మన రాష్ట్రంలో 1964 వరకూ రెండు వేర్వేరు చట్టాల ప్రాతిపదికన సహకార వ్యవస్థ కొనసాగింది. కోస్తాంధ్ర - రాయలసీమ ప్రాంతాలలో 1904 నాటి సహకార చట్టం ఆధారంగా ఏర్పడిన సహకార సంఘాలుండగా, తెలంగాణ ప్రాంతంలో ‘అంజుమన్ బ్యాంక్’ల పేరిట నైజాం సర్కార్ చట్టంతో రూపొందిన సహకార వ్యవస్థ ఉండేది.
రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత సహకార వ్యవస్థ కోసం 1964లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చట్టాన్ని చేసింది. అప్పట్నించీ రాష్టమ్రంతటా ఒకే విధమైన సహకార విధానం కొనసాగుతోంది. అలా ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణ సహాయంతో నడుస్తున్న సంఘాలు ప్రస్తుతం 19090 వరకు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు 2949 ఉండగా, ఉద్యోగుల పరపతి సంఘాలు 3392, బలహీన వర్గాల సహకార సంఘాలు 9189, వినియోగదారుల సహకార సంఘాలు 671, హౌసింగ్, సహకార సంఘాలు 2735 ఉన్నాయి. ఇవే కాకుండా అర్బన్ సహకార బ్యాంక్‌లు (103), సహకార సమిష్టి వ్యవసాయ సంఘాలు, గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంఘాలుల (4) వంటివెన్నో ఉన్నాయి. ఇక 1995 నాటి పరస్పర సహాయక సహకార చట్టం పరిధిలో పనిచేస్తున్న సంఘాలు రాష్టవ్య్రాప్తంగా 54,520 వరకూ ఉన్నాయి.
అలాగే సహకారోద్యమం మన రాష్ట్రంలో ఇతర శాఖల పరిధిలో కూడా ముందంజలోనే ఉందని చెప్పాలి. అలా మన రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల సహకార సంఘాలు 8766, జాలరుల సహకార సంఘాలు 4708, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు 3454, చేనేత, సహకార సంఘాలు 1527, చక్కెర సహకార సంఘాలు 22, సహకార జూనియర్ కాలేజీలు 80 వరకూ ఉన్నాయి.
మన రాష్ట్రంలో సహకారోద్యమం మొదట రైతుకు ఆర్థిక రుణాలను అందించే లక్ష్యంతో మొదలై ఇప్పుడు విభిన్న రంగాలలో వేర్వేరు అవసరాలను తీర్చే సంఘటిత శక్తులుగా ఎదగడం గర్వించదగిందే. అయినా, సంఘాల నిర్వహణ పనితీరు మాత్రం అంతగా ఆశాజనకంగా లేకపోవడం శోచనీయం. కరీంనగర్‌లోని ముల్కనూరు సహకార సంఘం వంటి కొన్ని సంఘాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలలోని సహకార సంఘాలు తప్ప మిగతా జిల్లాలలోని అన్ని రకాల సహకార సంఘాలు ఏమంత గొప్పగా ఉన్న దాఖలాలు లేవు.
సహకార అర్బన్ బ్యాంక్‌లు - తీరుతెన్నులు
మన దేశంలో సహకార సంఘాల ఏర్పాటుకు తొలి ప్రాతిపదిక గ్రామీణ రైతుకు తన వ్యవసాయాన్ని చేసుకోవడానికి కావలసిన పెట్టుబడిని అందించడమే! జమీందారులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలోంచి బక్కచిక్కిన రైతన్నను ఆదుకోవడం, ఆర్థిక రుణాలను అందజేయడం సహకార ఉద్యమం మన నేల మీద ఊపిరి పోసుకోవడానికి ప్రధాన కారణం. అలాంటి అవసరంలోంచి ఏర్పడ్డవే ‘సహకార అర్బన్ బ్యాంక్‌లు’! ‘పాజిటివ్ బ్యాంకింగ్’ అనే కానె్సప్ట్‌తో రూపొందిన ఈ బ్యాంకులు ఇటీవలి కాలంలో అత్యంత వివాదాగ్రస్తంగా మారాయి. నిజానికి ఈ బ్యాంకులు సదాశయంతో రూపొందాయనే చెప్పాలి..
గ్రామీణ ప్రాంతాలలోంచి పట్టణాలు/ నగరాలకు వలసలు పెరిగిపోయిన దశలో, ఇలాంటి, సామాన్య, బడుగు ప్రజలకు ఆర్థిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా వారి ప్రగతికి దోహదపడటం అర్బన్ బ్యాంక్‌ల లక్ష్యం. వాణిజ్య బ్యాంక్‌లలు రుణాలివ్వాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఆ లోపాన్ని అధిగమించి చిన్నకారు - సన్నకారు వ్యాపారికి కావలసిన రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ‘సహకార అర్బన్ బ్యాంక్’లు వేలాది పట్టణ నిరుద్యోగ కుటుంబాలకు ఆసరాగా నిలిచాయి. ఐతే వలసలు, నగరీకరణ ధోరణులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 1991లో వచ్చిన నూతన ఆర్థిక సంస్కరణలు, తత్ఫలితంగా బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సరళీకృత విధానాల వల్ల దేశవ్యాప్తంగా సహకార అర్బన్ బ్యాంక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. అయితే వీటి నిర్వహణలో, ఆర్థిక క్రమశిక్షణలో సరైన నియంత్రణ లేకపోవడం వల్ల 2001 తర్వాత ఈ అర్బన్ బ్యాంక్‌లు సంక్షోభంలోకి చేరుకున్నాయి.
సహకార అర్బన్ బ్యాంక్‌ల నిర్వహణ అంతా సభ్యుల చేత ఎన్నికైన మేనేజింగ్ కమిటీ నేతృత్వంలో వుండటం, వారి వ్యక్తిగత ప్రయోజనాలే బ్యాంక్ ప్రయోజనాలకన్నా మిన్నగా మారడం వంటి అవాంఛనీయ పరిణామాలు అర్బన్ బ్యాంక్‌లలో ఎనె్నన్నో కుంభకోణాలకు తెర తీశాయి. కానీ 2001 తర్వాత నుండి రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సహకార అర్బన్ బ్యాంక్‌లలో ఎనె్నన్నో క్రమశిక్షణా చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం అవన్నీ ఇతర వాణిజ్య/ షెడ్యూల్డు బ్యాంకులకు మల్లే ప్రస్తుతం ముందంజలో దూసుకెళ్తున్నాయి.
మన రాష్ట్రంలో సహకార అర్బన్ బ్యాంక్‌ల తీరుతెన్నులను గమనిస్తే, 2006-07లో 124గా ఉన్న సహకార అర్బన్ బ్యాంక్‌లు, 2007-08 లో 116కు తగ్గాయి. 2008-09లో 114కు, 2009-10కు 111కు, ప్రస్తుతం 103కు ఆ సంఖ్య తగ్గింది. అయితే ఇదే కాలంలో డిపాజిట్లు పెరగడం ఓ ఆశ్చర్యం. 2006-07లో రాష్ట్రంలోని అర్బన్ బ్యాంక్‌లలో డిపాజిట్లు 2665 కోట్లు ఉండగా, 2008-08 నాటికి 3092 కోట్లకు, 2008-09 నాటికి 3653 కోట్లకు, 2009-10 నాటికి 4281 కోట్లకు, 2010-11 నాటికి 5180 కోట్లకు పెరిగాయి.
సకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, సహకార అర్బన్ బ్యాంక్‌ల విషయంలో స్పందించి, సమస్యాత్మకంగా మారిన బ్యాంక్‌లను రద్దు చేయడం, ఇతర బ్యాంక్‌లలో విలీనం చేయడం, స్పెషల్ ఆఫీసర్‌ల నియామకం ద్వారా సమస్యలను పరిష్కరించడం ద్వారా మళ్లీ ప్రజలు - సభ్యులలో సహకార అర్బన్ బ్యాంక్‌లపై విశ్వాసాన్ని పెంచగలిగారు. అందుకే కృషి, చార్మినార్ వంటి బ్యాంక్‌లు సభ్యుల డిపాజిట్లను తిరిగి చెల్లించడమే కాక, ప్రస్తుతం తమ కార్యకలాపాలలో మళ్లీ పుంజుకుని సక్రమంగా నడుస్తున్నాయి. ఈ విజయానికి ప్రభుత్వ యంత్రాంగం యొక్క సత్వర పనితీరే కారణమని చెప్పాలి.
సమస్యలేంటి? పరిష్కారాలేంటి?
‘సామాజిక న్యాయం - ఉద్యోగితా కల్పన - పేదరిక నిర్మూలన’ అనే త్రిముఖ వ్యూహంతో ఏర్పాటైన సహకార సంఘాలు ఆది నుండి అన్నీ ఆటంకాలే. అయితే గతంలోని ప్రజావసరాలు, గ్రామీణ పరిస్థితులు, ‘హరిత విప్లవం’ వంటి ప్రత్యేక కార్యక్రమాల వల్లనూ, జాతీయ స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిధులను ప్రోత్సాహకాలను అందించడం వల్లనూ సహకార రంగం, సంఘాలు కూడా ఉద్యమ స్థాయిలో ముందుకురికాయి. కానీ ప్రస్తుత కాలానికి సహకార రంగం, సంఘాలు అన్నీ ఎనె్నన్నో సంస్థాగతమైన, ఆర్థికపరమైన, నిర్వహణా పరమైన, నాయకత్వ పరమైన లోపాలతో కునారిల్లుతున్నాయి.
ఇక రాజకీయ పరమైన జోక్యాలు - ప్రభావాలు సరేసరి. జవాబుదారీతనంతో కూడి సుశిక్షితులైన నిర్వాహక సిబ్బంది కొరత, నిధుల లేమి, ప్రభుత్వ విధానాల ఫలితంగా వచ్చే ఆటంకాలు, రుణాల రికవరీ సమస్యలు, మేనేజింగ్ కమిటీ ఏకపక్ష పోకడలు, సహకార సంఘాల అధ్యక్షుల స్వార్థ ప్రయోజనాలు వంటివి కూడా రాష్ట్రంలో సహకార వృక్షానికి చీడలుగా దాపురించాయి. ఇదంతా ఒకెత్తయితే, సభ్యుల ఉదాసీన వైఖరి, నిర్ణయాలలో భాగస్వామ్య రాహిత్యం వంటివి మరో ఎత్తు అని చెప్పాలి. ‘ప్రజాస్వామ్యం - ప్రభుత్వ పర్యవేక్షణ’ అనే రెండు యంత్రాంగాల సమన్వయంతో నడిచే సహకార సంఘాలు గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారడం, భవిష్యత్ నాయకులకు పాఠశాలలుగా మారడం కూడా ఇందులో భాగమే. అలాగే వాస్తవ వసూళ్లు కాకుండా ‘రీ షెడ్యూలింగ్’ ద్వారా రికవరీలను అడ్జస్ట్ చేసే విధానం కూడా సభ్యుని బాధ్యత నుంచి దూరంగా చేస్తున్నాయి.
సహకార రంగం, సహకారోద్యమం వల్ల, సామాజిక ప్రగతి, వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అంతేగాక, మన దేశం లాంటి ‘ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ’ గల దేశాలలో సహకార రంగాన్ని మించిన ‘అభివృద్ధి నమూనా’ మరోటి ఉండదు. అందుకే సహకార రంగంలోని లోపాలను, సమస్యలను పరిష్కరించి వాటిని మరింత పరిపుష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీని కోసం, 1)మొదట సభ్యులలో చైతన్యం తీసుకురావడం, 2)సంఘ కార్యకలాపాలలో క్రియాశీలక భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచింపజేయడం అవసరం. అప్పుడే నిధుల సక్రమ నిర్వహణ, రుణ వసూళ్లు, కొత్త వ్యాపారాలకు విస్తరణ వంటివి సాధ్యవౌతాయి. 3)అంతేగాక, పంచాయతీరాజ్ సంస్థల సకాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉన్నట్టుగానే సహకార సంఘాల కోసం ఓ ‘ప్రత్యేక ఎలక్షన్ కమీషన్’ని ఏర్పాటు చేయడం అవసరం. 4)సభ్యులకు - సిబ్బందికీ శిక్షణా సౌకర్యాలు కల్పించడం,5) సంఘ కార్యకలాపాలను కంప్యూటరీకరించడం, 6) సంఘాలు, బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణను పర్యవేక్షణను పూర్తి స్థాయిలో పెంచడం, 7)ఉద్యోగులు, మేనేజింగ్ కమిటీలను జవాబుదారీగా చేయడం, 8) అవకతవకలకు పాల్పడిన సంఘ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి అవరం. 9)అంతేగాక, 1995 చట్టం ప్రకారం రూపొందిన పరస్పర సహాయక సహకార సంఘాలను సైతం ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురావడం, 10)ఏకలక్ష్య నిర్వహణకు బదులుగా బహుళ వ్యాపకాల నిర్వహణలను చేపట్టేలా సంఘాలను బలోపేతం చేయడం ఈ సమస్యలకు ఒకింత పరిష్కారాలుగా భావిచాలి. 11)అన్నింటినీ మించి ప్రజలు సభ్యులు సంఘంలో చేరేప్పుడు చూపిన శ్రద్ధ ఆ తర్వాత కూడా కొనసాగేలా చైతన్యపరచాలి.
సహకార రంగం - వివాదాలు
ఎంతో సమున్నత ఆశయంతో ‘సమిష్టి కృషి - సమాన ప్రగతి’ అనే లక్ష్యంతో మొదలైన సహకార సంస్థలలు, క్రమేణా ఎనె్నన్నో ప్రతిబంధకాలు, అవరోధాలనే కాక, వివాదాలనూ కుంభకోణాలనూ కూడా మూటగట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే, ప్రణాళికా రచనలో మూలాంశాలైన మైక్రో లెవల్ ప్లానింగ్, పీపుల్స్ పార్టిసిపేషన్ వంటివి మొదట అమలు చేసినవి సహకార సంఘాలే. అయితే ‘కర్ణుడీల్గె నార్గురి చేతన్’ అన్నట్లు ప్రస్తుతం సహకార సంఘాలు ఎనె్నన్నో విమర్శలకు, ప్రజలు సభ్యుల నిరాదరణకు గురవుతున్నాయి. మన రాష్ట్రం విషయానికొస్తే, సహకార రంగం తీవ్రమైన విమర్శలకు గురయిన సందర్భం మాత్రం ‘కృషి అర్బన్ బ్యాంక్’ ‘చార్మినార్ అర్బన్ బ్యాంక్’ వంటి అర్బన్ బ్యాంక్‌లలో వెల్లడైన వివాదాల వల్లనే అని చెప్పాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, సహకార సంఘాల రిజిస్ట్రార్, ఇతర ప్రభుత్వ యంత్రాంగం సత్వరమే స్పందించడం, డిపాజిట్‌లు - లోన్‌లలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా ఇపుడు హైదరాబాద్ నగరంలోని సహకార అర్బన్ బ్యాంక్‌లు గాడిన పడ్డాయి. ఇతర వాణిజ్య బ్యాంక్‌లకు ధీటుగా సేవలను అందిస్తూ సభ్యుల నమ్మకాన్ని సాధించాయి.
సహకార రంగంలో మరో వివాదాగ్రస్తమైన అంశం - సహకార గృహ నిర్మాణ రంగం! సొంతిల్లు అనే స్వప్నాన్ని సాకారం చేసుకోవాలనే సంకల్పంతో సహకార సంఘంగా ఏర్పడిన సభ్యులు తర్వాత దాని మూలసూత్రానికే గండి కొట్టడం వల్లనే ఈ వివాదాలు చెలరేగాయని చెప్పాలి. సహకార రంగంలోని ఈ సౌలభ్యాన్ని సామాన్యులకు బదులు బడా స్వాములు ఉపయోగించుకోవడం. వారు సొసైటీగా ఏర్పడి, ప్రభుత్వ రాయితీలతో భూములను పొందడం, ఆ తర్వాత సహకార స్ఫూర్తికి తిలోదకాలు ఇవ్వడం జరుగుతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జూబ్లీ హిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరిగిన అవకతవకలే అని చెప్పాలి. ఈ విషయమై రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ అయిన శ్రీనివాస్ శ్రీనరేష్ ‘మన రాష్ట్రంలో సహకార గృహ సంఘాలు కేవలం గృహాల కోసం భూమి కేటాయింపు అంశాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సభ్యులకు భూమి కేటాయించడంతోనే తమ పని పూర్తయి పోయిందని అనుకుంటున్నాయి. ఆ ధోరణి మారాలి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలు కేవలం ప్రభుత్వ నూమిని తీసుకోవడం, డెవలప్ చేయడం, ప్లాట్‌ల కేటాయింపు చేయడం వంటి అంశాలకే కాక, సొసైటీలో నిర్మాణమైన గృహాలను మెయిన్‌టెయిన్ కూడా వారే చేస్తున్నారు. దాంతో హౌసింగ్ సొసైటీలోని సభ్యులందరి మధ్య సమిష్టి బాధ్యత ఏర్పడుతోంది. అలాంటి స్థితినే మన రాష్ట్ర సహకార హౌసింగ్ రంగంలో తీసుకురావడం ప్రస్తుతావసరం’ అని వివరించారు.
అలాగే సూపర్ బజార్‌లు కూడా రాష్ట్రంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్నాయి. రిటైల్ వ్యాపారంలో ఇపుడు కార్పొరేట్ లెవెల్‌లో నడుస్తున్న సూపర్ మార్కెట్ కల్చర్‌ను మొదటిసారిగా ‘సూపర్ బజార్’ల పేరిట ప్రవేశపెట్టిన ఘనత సహకార రంగానిదే! వినియోగదారుడు అల్ప ధరలలో నాణ్యమైన సరుకులు - వస్తువులు - ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ సూపర్ బజార్‌లు కాలక్రమేణా ఎనె్నన్నో నిర్వహణాపరమైన లోపాలతో నష్టాలపాలై మూతపడ్డాయి. కానీ ఈ లోపాలను చక్కదిద్ది సూపర్ మార్కెట్‌లకు ధీటుగా వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
2012 - అంతర్జాతీయ సహకార సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా సంభవించే మానవ అవసరాల దిశగా సభ్యదేశాలు, వాటి ప్రభుత్వాలతో చైతన్యం కలిగించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ప్రతీ సంవత్సరాన్ని ఏదో ఒక అంశంపై కేంద్రీకరించడాన్ని ఆశయంగా పాటిస్తోంది. దాన్లో భాగంగా 2012 సంవత్సరాన్ని ఐరాస ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ 18 డిసెంబర్ 2009లోనే ఆమోదించి, ఐరాసలో సభ్యులుగా ఉన్న 204 దేశాలకు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. ‘సామాజిక అభివృద్ధిలో సహకార సంఘాలు’ అనే పేరిట ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఈ తీర్మానంలో సామాజిక ప్రగతిలో సహకారోద్యమం యొక్క పాత్రను ప్రముఖంగా ప్రస్తావించడమే కాక, ఆయా దేశాలు - ప్రభుత్వాలు అన్నీ సహకార సంఘాల పురోభివృద్ధికి తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన ఆవశ్యకతను విశదీకరించాయి.
2012ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం ద్వారా, అంతర్జాతీయంగా నడుస్తున్న సహకార సంస్థలు - ఉద్యమంపై మరొక్కసారి నిర్మాణాత్మక ఆలోచనలను దేశాలు - ప్రభుత్వాలు - ప్రజలు - సభ్యులలో కలిగించదలిచారు. అంతేగాక, మానవుడి అత్యాశలకు కాకుండా మానవుడి నిత్యావసరాలను సమకూర్చడంలో మానవులందరిలో ఉండాల్సిన సహకార భావనని పెంపొందించడాన్ని కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా చేశారు. కాగా, ఈ బృహత్ బాధ్యతని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ సహకార సంఘం’ నేతృత్వంలో 2012 సంవత్సరం పొడవునా అన్ని దేశాల్లో నిర్వహింchaaరు. ==========================================****
సహకారోద్యమం - మెరుగైన సమాజం
1901లో ఏర్పాటైన రాయల్ కమీషన్ భారతీయ రైతు గురించి ఓ మాట చెప్పింది ‘అప్పుల్లోనే పుట్టి అప్పుల్లోనే పెరిగి, అప్పుల్లోనే మరణించి, అప్పులనే వారసత్వంగా ఇస్తున్నాడు’ అని! ఈ దయనీయ స్థితి నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముక అయిన రైతన్నను రక్షించే దిశగా ఏర్పాటైన సహకార సంఘాలు, సహకారోద్యమం ఆ దిశగా చెప్పుకోదగ్గ విజయం సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఏ అండా రక్షణా లేని సామాన్యుడికి భద్రతనూ, స్థిరత్వాన్నీ ఇవ్వగలిగిన సంస్థలలో సహకార రంగాన్ని మించింది లేదు అని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలు, దేశాలు తమ అనుభవాలలోంచి నిరూపించి చెప్తున్నాయి.
ప్రస్తుత ప్రపంచం నిరంతరం ఎనె్నన్నో సంక్షోభాలు - సమస్యలతో అతలాకుతలం అవుతోంది. వీటన్నింటినీ పరిష్కరించగలిగే ఒకే ఒక సాధనం ‘సహకారం’ అని ఐక్యరాజ్యసమితి వంటి ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు గుర్తించాయి. అందుకే ‘సహకారం’ అనే భావనను ఇప్పుడు ఓ సంఘానికి, ఉద్యమానికి మాత్రమే పరిమితం చేయకుండా ఓ ‘జీవన విధానం’గా ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఆ దిశగా మన ప్రభుత్వాలు, ప్రజలు, సంఘాలు, సభ్యులు, అధికారులు అందరూ కలసి వెళ్లాల్సిన సమయం ఇదే! *

No comments:
Post a Comment