Here, it's my poetic tribute to women in general and mothers in special... HAPPY WOMEN'S DAY...
ఒకానొక ఆకాశానికి..
---మామిడి హరికృష్ణ
#mhk_poetry
ఇన్నాళ్ళూ నువ్వు భూమి లాంటి దానివే అనుకున్నా
కానీ
ఆకాశానివి కూడా అని తెల్సుకున్నా..
**** **** *****
చిన్నపుడు నువ్వు బొమ్మలను- గురుగులను
సందుగ పెట్టెలో దాచుకున్నట్టు
నన్ను కూడా నీ దేహం పెట్టెలో
ఎంతో అపురూపంగా దాచుకున్నావ్ కదా
రోజు రోజుకూ నీ దేహం లో నేను ఎదిగి పోతూ
నువ్వు తినే ప్రతీ ఆహారపు ముద్దనీ
నేనే తినేసాను
నీ నోటిలోని ముద్దని మాయం చేసాను
అయినా -
లోలోపలి నా ఆకలిని నీ ఆకలి గా
ఈ లోకానికి భ్రమింప చేసావ్
లో లోపలి నా తన్నుకులాటని
నీ పెనుగులాటగా లుంగలు చుట్టుకు పోయావ్
గర్భాంతరిక్షం లో నేను జీరో గ్రావిటీ నై సంచరిస్తుంటే
పళ్ళ మధ్య నొప్పిని బిగించి పెదాలతో నిండుగా నవ్వావు
నాకు ఈ లోకం నుంచి ఆహ్వానం అందిన క్షణాన
నన్ను స్వాగతించడానికి
నిన్ను నువ్వు రెండుగా చీల్చుకున్నావ్
నిన్ను విధ్వంసం చేసుకుని
నన్ను ఈ విశ్వంలో సృష్టించావ్
నీ తరతరాల జ్ఞానాన్నంతా
పేగు కార్డుతో నాలోకి డౌన్ లోడ్ చేసి
నా కేరింతల -బోసి నవ్వుల - ఉత్తుత్తి ఏడుపుల-
పోర్లాటల- పారాటల -తప్పటడుగుల - తప్పుడు మాటల-
అక్షరాభ్యాసాల- జీవితాధ్యయనాలలో
నా చుట్టూ 360 చేతులతో
అష్ట దిక్కులా దృక్కులతో నన్ను కాపాడుకున్నావ్
చందమామని చూపించి
నాలో భావుకతని పెంచింది
బూ.. బూచాడని చెప్పి
నాలో చైతన్యాన్ని రగిల్చింది
"అనగనగా " కథలతో
నన్ను విజేతగా నిలిపింది
నా కోసం అన్నీ త్యాగం చేసి
నా నవ్వులలోనే నీ సంతోషాన్ని వెతుక్కుని
నా సాఫల్యంలోనే నీ జీవిత పరమార్ధాన్ని అన్వేషించి
ఏమీ లేని నన్ను
అన్నీ ఉన్న వాడిగా అనుగ్రహించింది--
నువ్వే కదా
అక్షరాల అడవిలో "కాటు " కలసినప్పుడు
అనుభవ రాహిత్యపు ఎడారిలో తడబడినప్పుడు
ఆశల క్రాస్ రోడ్స్ లో ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు
దిక్సూచివి - ఒయాసిస్సువి - సిగ్నలింగ్ లైట్ వి నువ్వే కదా
నా ఇష్టాలనే నీ ఇష్టాలుగా మార్చుకుని
నా కలలనే నీ కలలుగా స్వప్నించి
నా అడుగు జాడల్లో
నీ ఆకాంక్షల ముగ్గులని మురిపెంగా చూసుకున్నది నువ్వే కదా..
**** **** *****
భూదేవి ఎత్తిన మానవ జన్మం నువ్వు
దేవుడు వేసిన వంతెన నువ్వు
నా ఆజన్మాంత సహచరి నువ్వు
నా ఆకాశం నువ్వు
నా అమ్మవు నువ్వు..
(ఈ లోకానికి "సౌందర్యం" నేర్పుతున్న అమ్మాయిలకి, "శివం" ఔన్నత్యాన్ని గుర్తెరిగేలా చేస్తున్న అమ్మలకి, "సత్యం" లోతును ఆవిష్కరిస్తున్న అమ్మమ్మలకు.. మొత్తంగా "సత్యం-శివం-సుందరం" తామే అయిన స్త్రీ మూర్తులందరికీ గౌరవం తోనూ, భక్తి తోనూ, ప్రేమ తోనూ .. )
--- మామిడి హరికృష్ణ
No comments:
Post a Comment