Wednesday, 21 April 2021

*ఏడో రుతువు!*


*ఏడో రుతువు!*


    ----- మామిడి హరికృష్ణ 8008005231


1. అక్కడెక్కడో పూదోటలున్నాయని చెబితే

వాళ్ళంతా ఓ మహా వలస యాత్ర మొదలెట్టారు-

పూలంటే వాళ్ళకి అంత ఇష్టం!


2. దూరదూర తీరాలలో ఒకచోట వనాలున్నాయని చెబితే

వాళ్ళంతా ఊళ్ళు ఖాళీచేసి పాదాలకు రెక్కలు తొడిగారు--

వనాలంటే వారికి అంత గౌరవం! 


3. భూమి అంచుల దగ్గరొకచోట సరస్సులున్నాయని చెబితే 

వాళ్లంతా పొలాలు వదిలేసి పదాలు పాడుతూ కదంతొక్కారు--

సరస్సులంటే వారికి అంత అభిమానం!


4. మబ్బుల మాటున ఒక కాడ నిధులున్నాయని చెబితే 

వాళ్ళంతా ముంతలో పాలను విసిరేసి పరుగులు పెట్టారు--

నిధులంటే వాళ్ళకి అంత కాంక్ష!


5. చందమామ వెన్నెల దిగువన సౌందర్యం దాగి ఉందని చెబితే 

వాళ్ళలో కొందరు మాత్రమే కళ్ళను విప్పార్చి అటుదిక్కుగా దృష్టి సారించారు--

సౌందర్యం అంటే వారికి అంత ఆరాధన!


6. సూర్యుడి చేతుల మధ్యన త్యాగదీపం వెలుగుతోందని చెబితే

వాళ్ళలో ఎవ్వరూ ఆ తాపాన్ని తాళలేక పోయారు 

త్యాగమంటే వాళ్ళకి అంత భయం!


7. ఆకాశం నీడ క్రిందొక తావున ఆశయాలున్నాయని చెబితే

వాళ్ళల్లో కొందరు మాత్రమే ఇల్లు దాటి చేతుల్లో కలాలు పట్టి బయటికొచ్చారు

ఆశయాలంటే వారికి అంత ప్రాణం!


8. దిగంతపు అంచులకు ఆవల విశ్వ వీధుల్లో సత్యం సంచరిస్తోందని చెబితే

వాళ్ళందరూ నిర్లిప్తంగా నిద్రలోకి జారుకున్నారు --

సత్యమంటే వారికి అంత అనాసక్తి!


9. కానీ-

గాలి తరగల మీద తేలియాడుతూ వసంతం వస్తోందని చెబితే

వాళ్ళల్లో అందరూ ఛాతీ పెంచి ఊపిరి పీల్చారు

చేతులెత్తి స్వాగతించారు

వసంతం వాళ్ళకి అంత అవసరం!


10. సహ యాత్రికుడా--

 ఇప్పుడు మనం

ముత్యమంత ప్రేమను

చిటికెడంత నమ్మకాన్ని కురిపించే

ఏడో ఋతువు కోసం ప్రార్థన మొదలెడదాం...

గాలి బుడగంత జీవితానికి

గడ్డి పరకంత ధైర్యాన్నిచ్చే

కొత్త యుగాది కోసం ప్రస్థానం ప్రారంభిద్దాం!!


#mhk_poetry

No comments:

Post a Comment