చీకటి మాసం... వెలుగుల కాలం... ఒక సంకల్పం !
--------------- మామిడి హరికృష్ణ 8008005231
నేను పుట్టినప్పటి నుంచి
మా బంధువులు అందరూ నాకు చిరపరిచితులే !
ఈ వేకువ ఝామునే వారిలో ఒకరు హఠాత్తుగా అరిచారు!
మనోవీధి వెంట పరుగులు పెడుతూ
చేతులు రెండూ ఛాతీపై బాదుకుంటూ
కంఠాన్ని బిగబట్టి భీకరంగా అరుస్తూ
"చీకటి మాసం... చీకటి మాసం ముంచుకొస్తోంది" అని !
మా వాళ్ళు అందరూ ఉలిక్కిపడ్డారు
వారిలో వారు గుసగుసలు మొదలెట్టారు
భయంతో పుట్టిన అసహనంతో కూడిన నిస్సహాయత లోంచి
"అయ్యో.. మళ్లీనా..." అని నీరస పడిపోయారు!
నేను అవేవీ గమనించలేదు !
వెలుగుల వెల్లువ లో స్నానం చేస్తున్నాను కదా
కిరణాల వెచ్చదనాన్ని గుండె నిండా నింపుకుంటూ ఉన్నాను కదా
ప్రపంచాన్ని అంతటినీ కొత్తగా చూస్తూ
కళ్ళల్లో వసంతాన్ని చిగురేయిస్తున్నాను కదా !
ఆ అరుపులతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యాను
క్రితందాకా చీకటి కాలాన్నే కప్పుకున్నాను కదా
ఇప్పుడిప్పుడే వెలుగుల మాసాన్ని ఆస్వాదిస్తున్నాను కదా
క్షణంలోనే కాంతుల కాలం మాయం అవుతుందా
మళ్లీ చీకటి గుప్పిట్లోకి మునిగి పోవాల్సిందేనా అని కలవర పడ్డాను !
సహవాసీ !
కాల గణన కన్నా ముందు నుంచీ
నా ప్రయాణం చీకటిలోనే మొదలై
చీకటిలోకే ప్రవహించి చీకటితోనే కొనసాగుతూ వచ్చింది !
చీకటి నాకేమీ కొత్త కాదు
నిజానికి చీకటే నాకు సత్యం
వెలుగే అనిత్యమ్ !
అదేంటో, నువ్వొచ్చాకే కదా-
నాలోకి వెలుగుల మాసం తొంగి చూసింది
నువ్వు పలకరించాకే కదా-
నవ్వుల కిరణాలను చేతితో స్పృశించింది
నువ్వు చూసాకే కదా-
చూపుల ప్రకాశాన్ని కళ్ళల్లో పూయించింది
నువ్వు కరచాలనం చేశాకే కదా-
దేహపు వెన్నెలను నిలువెల్లా హత్తుకుంది
నువ్వు ఆహ్వానించాకే కదా-
ఆత్మ తేజాన్ని మనస్సులో ప్రతిష్టించుకుంది
ఇప్పుడు నేను లేచి నిల్చుని గదిని బద్దలు కొట్టాను
ఆ చప్పుడుకు ఒక్కసారి అవాక్కయిన వాళ్ళంతా
నా దిక్కు సందేహాశ్చర్యంగా
భయానుమానంగా చూశారు!
క్షణకాల నిశ్శబ్ద మౌనం తర్వాత నేను అరిచాను-
నా బంధువులారా -
ఒక్కొక్కరం ఒక్కో కాంతిపుంజం అవుదాం !
వెలుగుల మాసాన్ని మనం మళ్లీ సృష్టిద్దాం !!
--- Harikrishna Mamidi
#mhk_poetry
No comments:
Post a Comment