Friday, 26 November 2021

కాలమూ... జీవితమూ... ఓ సంచారి !

 ఇదిగో నా కవిత కాలా.. జీవన.. ఓ సంచారీకి అనువాదం! 27-11-2021న కన్నడ దినపత్రిక జన మిడితలో ప్రచురించబడింది..


తెలుగు ఒరిజినల్ ఇక్కడ ఉంది :::

కాలమూ... జీవితమూ... ఓ సంచారి !


-------------------------------------------------

        -- మామిడి హరికృష్ణ 8008005231


1. క్షణానికి రంగూ రుచి వాసన ఉందా?

కాలానికి భౌతిక, రసాయనిక, ఆధ్యాత్మిక ధర్మాలున్నాయా?

సమయానికి అడ్డం, నిలువు, ఎత్తు కొలమానాలున్నాయా?


ఉండకూడదు!


ఉదయానికి ఉద్వేగాలు

మధ్యాహ్నానికి మార్మికతలు

సాయంకాలానికి సంవేదనలు ఉండక పోవచ్చు..


అయితేనేం- 


నువ్వు కనిపిస్తే ఉదయం-

ఉద్వేగ రాగం పాడుతుంది..

మధ్యాహ్నం --

మార్మిక సంగీతం వినిపిస్తుంది..

సాయంత్రం--

 సంవేదనా నృత్యం అభినయిస్తుంది...


2. కాలం అనంతం

జీవితం పరిమితం...

కాల ప్రస్థానం మధ్యలో జీవితం ఆరంభం

జీవితం ఆఖరి శ్వాసకు వీడ్కోలు పలికాక కూడా 

కాలం నిరంతరం...


3. ఘడియను కిలో గ్రాముల్లో తూచగలమా?

గంటలను అడుగుల్లో బేరీజు వేయగలమా? 

నిమిషాలను ఫాథోమీటర్ లలో కొలవగలమా?

సెకన్లను ఫారెన్‌హీట్, సెంటీగ్రేడ్, కెల్విన్ లలో చెప్పగలమా?


చెప్పలేకపోవచ్చు-


ఘడియలకు ఘనరూపం లేదు

నిమిషాలు నేల ఆకారంలోకి ఒదగవు

ద్రవ రూపంలో ప్రవహించవచ్చు

సెకన్లు వాయు మార్గంలో పయనించవు!


అయితేనేం..


నువ్వు ఎదురైతే---

ఘడియలు ఘనీభవిస్తాయి

నిమిషాలు భూమి అంతటా పరుచుకుంటాయి

సెకన్లు స్పందించడం నేర్చుకుంటాయి!


4. నా ప్రియా... జీవితమా...!


చేయలేననుకున్నవి చేసి చూపిస్తావు

చేయగలననుకున్నవి చేయకుండా ఆపేస్తావు

అంతరిక్షమంత ప్రేమను ఆల్చిప్పలా చూసి

అణువంత ఆవేశాన్ని ఆకాశం వరకు విస్తరింపచేస్తావు

సముద్రమంత ఆశను ఇసుక రేణువులా మార్చి

ఆవాల గింజంత నిరాశను ఎవరెస్టు లా పెంచేస్తావు!


జీవితమా..!

ఇన్నేళ్లు గడిచాక కూడా నువ్వు నాకింకా ఏమీ అర్ధం కాలేదు..

నువ్వు నాతో ఇంకా సోపతి చెయ్యలేదు..


అయితేనేం-

ఇన్ని గాయాలు- అనుభవాల తర్వాత కూడా 

నేను నీతో 

మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తున్నావు..

తిరిగి తిరిగి నిన్నే చేరుకునేలా చేస్తున్నావు...!!

#mhk_కవిత్వం

******"""""******"""""******""""""******

Wednesday, 17 November 2021

కవిలేఖ -25 ఊరికి పోయిన యాళ్ళ #mhk poetry analysis

 కవిలేఖ -25



నేల మీద పూల అలుకు మామిడి హరికృష్ణన్న కవిత్వం. 

----------------------------------------


ప్రియమైన హరికృష్ణ అన్న కు,


     అన్న ఈ మధ్య నే పోర్షియా దేవి అక్క "మాట్లాడే సమయం "కవిత్వ ఆవిష్కరణ సభకు వచ్చినప్పుడు దండకడియం తమ్ముడు తగుళ్ళ గోపాల్,సాయ భగత్,సలీం తో కలిసి రవీంద్రభారతిలో మీ ఆఫీస్ కు వచ్చింది. మా అందరికీ మీ కవిత్వ పుస్తకాలను ఇచ్చి పంపిండ్రు. అందులో 'ఊరికి పోయిన యాళ్ళ' కవిత్వం అంతా చదివిన.గమ్మతి ఏందంటే అంతటా మన వరంగల్ కొమ్మాల జాతర్ల ప్రభలోలె తెలంగాణ నుడికారం ఎల్గిపోతుంది. ప్రపంచ భాషల్ల కవిత్వం చదివి కూడా కైష్ తో గిట్ల రాసుడు నువద్దే దీవిలి పండుక్కు మన తోట్ల పూసిన బంతి పువ్వులను దెంపి కొన వాకిట్ల పంచలకు దండ గట్టినట్టు తెలంగాణ కవిత్వ బోనాన్ని చెల్లించిండ్రు.


ఇప్పుడు   వర్తమాన  తెలంగాణ  కవిత్వం జాలు వారుతంది. ఇదు వరకు  రాని  పల్లెలు,చెరువులు,చెట్లు,తీర్థాలు  తీరొక్కటి  కవిత్వంలో  నిండుతన్నై. మీరు  ఈ సంపుటిలో చెప్పిన  తరిక. శాయంపేట,చెరుకుబాయి,సీతకుంట,బుగులోని  తీర్థం మొదలైనవి. తెలంగాణ  సాహిత్య చరిత్ర పునర్  నిర్మాణం కు   గివ్వి  నిండుగా  వుంటై. ప్రాంతీయ  ఆస్తిత్వ  సోయి తో  ఎంతో  సాహిత్యం వచ్చింది.  కైతలు  రాసుట్ల,పాటలు  కట్టుట్ల మనది  పేరువోయిన  బెజ్జంకి కదనే.అనాదిగా  ఈ నేల మీద  తిరుగు బాటు  పాదులున్నై.   మన కంచుట్ల  వత్తిని ఆరిపోకుంట మనం  తాల్సుకుంటేనే కదా  పురుగేదో  ,బుసేదో  కండ్లవడేది. ఏమంటరు  అన్న?.


ఇక్కడి  మట్టిని,మట్టి  మనుషుల కతలను ,ఏతలను  సినిమాగా బయటి  ప్రపంచానికి  ఎరుక  జేయాల్లన్న  మీ  ఆరాటానికి  వేలాది  శనార్తులు  అన్న. నాకైతే మీ  మీద మన  ఆస్థిత్వ  పతాక ను ఎట్లన్న  ఎగరేస్తవన్న  బొచ్చెడు  ఆశ  వున్నది. యువతరాన్ని మీరు  దగ్గర  దీసుకునే తరిక జూత్తే  మస్తు  కుశాల నాకు. పట్నమస్తే  హరికృష్ణ  అన్న వున్నడన్న  ధైర్నం వచ్చింది. పట్నం  మీకు  పెద్దమ్మ. మీరు  ఉన్నరు  గావట్టి మాకు    పట్నం  పెద్దన్న  ఇప్పుడు.


ఇట్లా  తెలంగాణ  మట్టి  చరిత్ర  ఏదో  ఒక  రూపంల  ఇంకొకలకు  నెలువు  అవుడు గొప్ప ముచ్చట. ఇగ గిట్ల  తెలంగాణ  బిరుజు  కాపాడుతున్న  కవులు  ,కళాకారులు  అందరికీ  నా మట్టి  దండాలు. ముఖ్యంగా  తెలంగాణ  భాష కు ఎంతో  కృషి  జేస్తున్న  మా నలిమెల  భాస్కర్ సార్ తోటి  మా తరానికి  కావలసిన  ముచ్చట్లు  మన  భాష  సాంస్కృతిక శాఖ తరుపున  ఇప్పించాలని  కోరుతున్న.


చాలా  మంది  కవిత్వాన్ని  నోస్టాల్జియా  అంటరు  గని గతం లేని  వర్తమానం  గాని,వర్తమానం  లేని  భవిష్యత్తు  లేదు  కదా  అన్న. ఈ గత ,వర్తమాన,భవిష్యత్తుల చక్రం  అనివార్యం అనిపిస్తది. మీ ఊరైన  శాయంపేట ను  పలువరిస్తూ ఊరును  తరగని  ఊట గా,జ్ఞాపకాలసద్ది మూటగా,బోధి వృక్షం,మాతృం వృక్షంగా,పురాణగాధ గా చెప్పడం  ఒక ఎత్తు. మన లోని  సూర్యుడిని  రాజేసే  కొలిమి గా  చెప్పడం వల్ల మీ కవిత్వ సత్తువ  ఎర్కైంది. ఊరంటే  జీనోమ్  మ్యాప్  కథ అనడం శాస్త్రీయ  దృష్టి .ఊరు  కర్మయోగి  అనుట్ల  మీ తాత్విక  కోణం  తెల్సింది. కొందరు  కవులైతే  ఊరును  మహా  కావ్యం అన్నట్టు  యాదికుంది. ఇట్లా  ఊరుకి ఉన్న  అనేక  యాదులు గుర్తు జేసిండ్రు. ఒక కట్ట  మీద  వున్న  ర్యాలచెట్టును ఒంటరి దైతేంది  నిలబడ్డప్పుడు  ఊరందరికి  పెద్ద  దిక్కు అని కవిత్వీకరించిన  తీరు  సూపర్ గా ఉన్నది. చెట్టు ను  మనిషిగా  చెప్పడం  వాస్తవమే.


సీతకుంట  గురించి  రాస్తూ సీతకుంట  ఊరికి  తొలి  గడప. అని చెప్పుకుంట.దాని  అలలను  ఉతికి దండానికి  ఆరేసిన వెండి దోతులని  ఎంత  బాగ  బొగిడినవు అన్న. ఈ కుంట  దాటే  కదా  అచ్చరాల  మోచ్చం  పొందినవు. అది  పురాగ  సచ్చిన  మీరు  కడుపుల  దాసుకున్నరు.


పల్లె  జ్ఞాపకాలు,పట్టణ జ్ఞాపకాలు  రెండిటిని జమిలీగ  పలవరించిండ్రు. పట్నం ను ఈ జమీన్ మీన వాలిన చాంద్ కా టుక్డా అని,దునియాల నిల్సిన సూరజ్ కా ముఖడా. తెలంగాణ  షాన్ వని శికులంమీద  పెట్టిండ్రు.


కొన్ని  సార్లు  కవితల్లో  కవిత్వబలం మధ్యలోనూ,ముగింపులోనూ,ప్రారంభంలోనూ   వుండచ్చు. అని అనుకుంట.చత్తిరి  కవిత  చదివినప్పుడు  ముగింపు లో చినుకులల్ల పూసిన నల్ల  తంగేడు పువ్వుగా వర్ణించిన  తీరు  అబ్బక్క అనిపించింది. అంతతో  అగకుంట  "గీ వానాకాలం ల  చత్తిరి/అత్తాకోడళ్ల పంచాయితీ నడిమిట్ల/అడ్డంగ నిలబడ్డ ఎర్రి బాగుల కొడుకుఅన్నరు.చాలా  సహజంగా  మంచిగ కుదిరింది.


పచ్చడి,బచ్చం...మా బంగ్లా  కైతల యుగాది  గురించి  చెప్పినట్టుగా వున్నది  గనీ  లోతైన  తాత్విక భావలున్నై. వసంతం మనతాన్నే  వుంటది/కోయిల మనలోనే వుంటది/కొత్త  చిగురు  మనకోసమే ఏత్తది. ఈ సంపుటిలో  చాలా  ఫోయమ్స్  ప్రోజ్  ఫోయమ్స్ లా  వున్నై అన్న. Fusion  షాయరీ నిర్మాణం  కండ్ల వడ్డది. ఉస్మానియా  హస్టల్  గురించి రాసిన  కవిత  E-1 రూం నంబర్ 70.ఈరూమ్  నాకు అమ్మ,గురువు,దోస్త్ ఒక్క మాటలో  చెప్పాలంటే  రూమ్  జీవితం  అని  తేల్చిపారేసిండ్రు. ఈ కవిత  చదివినంక నా ఎం ఏ రోజులు యాదికచ్చినై.  కాకతీయ  యూనివర్సిటీ లోని ప్రతాప రుద్ర  హస్టల్లో GR-IV  రూమ్ నంబర్  3గురించి  రాసుకోవాలి అనిపించింది. పిట్టను  దేవులాడిన గూడు,దారం కట్టిన సందమామ  భలే  నచ్చిన  శీర్షికలు. పతంగి మీద  మీరు  రాసిన  కైత  పాయిరంగా  వున్నది. పతంగిని  అంతరిక్షం మీన/మనకాలపు అర్జునుడు ఏసిన  కాగితపు  నిచ్చెనఅన్నరు . ఈ వాక్యం  బాగా  నచ్చింది.


పిట్టను  దేవులాడిన గూడు  శీర్షికన  వున్న  కైత నాకు  నచ్చింది. శీర్షికతోనే  సగం  మెరుపు వచ్చింది. ఈ కవిత  సారమంత  పట్నంలో  వున్న  కొడుకు  దగ్గరికి పల్లె నుండి వచ్చిన  తండ్రి  ప్రయాణం ను  వివరించిన  కవిత. క్రమంగా ,సహజంగా  మంచిగున్నది. ఈషహర్ లో ఇల్లేమి  లీని,అడ్రసు లేని కాందీశీకున్ని,నిత్య  సంచారి ని  అంటూ మొదలైతది. శతాబ్దాల  క్రితం నాకు  ఒక గూడు  ఉండేదని,చిలకొయ్యకు కన్నీళ్ళ అంగీని ఆరేయడానికి,సూరులో  చిరునవ్వుల విస్తరాకును చెక్కి/పొయ్యి కింద  కట్టెల్లో బతుకు  మెతుకులు  రాజేయడానికి/నా అస్తిత్వానికి గుడి కట్టడానికి నాకూ  ఒక గుడిసె వుండేదని ఇప్పుడు  ఆ మట్టి  వాసన మాయమైందని   చెప్తూ నాయన  వస్తే ఇల్లు  ఇల్లే  కదిలి  వచ్చినట్టు అనిపించింది  అనడం మచ్చి  ముగింపు  అనిపించింది నాకు.  సాపేక్షతకవిత   ప్రయోగాత్మక వుంది. దోని ని  ఇల్లు  పట్టిన  దోసిలి గా వర్ణించడం గొప్పగా  ఉంది. మొత్తంగా  పల్లెను  విడువని  తనం  నిండా  వుంది. మా గర్జనపల్లి  పాఠశాల కు  మద్దికుంట  లక్ష్మణ్ సార్ ను కలువడానికి  వచ్చి  పదవతరగతి పిల్లలకు  క్లాసు  తీసుకున్న క్షణాలు  ఎప్పుడు మతిలనే  వుంటై అన్న. ఇంకా  మీ ఒంటరీకరణ  , సుషుప్తి నుంచి సంపుటాలు  చదవలసి వుంది. నాకు  చాలా  నచ్చిన ఈ టైటిల్  ఫోయమ్ ఊరికి  పోయిన యాళ్ళ.  పాఠకులు  సౌలత్  కొరకు  ఇస్తున్న. తేజబ్  కలువని  సొక్కం  బంగారమసొంటి తెలంగాణ భాష ను  కవిత్వంలో  ఒంపిన  మీకు  జయహో.


ఊరికిపోయిన యాళ్ల...


1.ఊరికి పోవడం అంటే

'ఊరికే' పోవడం కాదు -

ఊపిరి కోసం పోవడం 

తప్పని సరై తప్పక పోవడం కాదు

గతి తప్పకుండా ఉండడం కోసం పోవడం

నగరం నదిలోని తెప్ప

దారి తప్పకుండా చూడడం కోసం పోవడం


2. ఊరికి పోవడం అంటే 

చిరిగిన నెక్కర్ లోని బాల్యాన్ని 

గడీల బడి చూరులోంచి దిగిన సూర్యున్ని

పెద్ద బడి బాదం చెట్టు నుండి రాలిన తరగతి పాఠాలని ఒక్క సారి ఒడిసి పట్టుకోవడమే


మంచి నీళ్ళ బాయిలోంచి సోపతిగాల జ్ఞాపకాలని బొక్కెనల కొద్దీ చేదుకోవడమే మోదుగు చెట్టు ముదురు మట్టి ఎండుటాకుల్లోంచి ఎండాకాలం సెలవుల వీరత్వాన్ని మరొక్క సారి తడిమి చూడటమే....


3. ఊరికి పోవడం అంటే -


మంగలి సమ్మయ్య కత్తెరనీ - 

మేర మదుసూదన్ మిషిన్ నీ 

తమ్మ లచయ్య డోలునీ -

 బోయ కమమ్మ బీడీల గంపని

 కంచరి రాజయ్య నిప్పుల కొలిమిని 

కుమ్మరి ఓదెలు మట్టి కుండలని 

శాల నరసక్క ఆసు కొయ్యని - 

సదానందం మొగ్గం గుంటని 

సుంకరి సారయ్య చాటింపుని


పెల్లి రామయ్య మార్కండేయ పురాణాన్ని

గొల్ల యాదగిరి గొర్రెల కొట్టాన్ని

ముత్రాసి కాంతమ్మ చాపల బండని

 మాదిగ సాయిలు డప్పు సప్పుడుని 

పక్కీరు సాయెబు నెమలీకల కట్టని


 తెనుగు శంకరి బొంబాయ్ మిటాయ్న 

కాపు యాదగిరి గడ్డి వామిని 

సాంబయ్య సైకిల్ ట్యాక్సీని 

గుడిసె రామసామి గుర్రం టాంగా ని


తుర్క రబ్బానీ మాము ఆటోని 

గవుండ్ల రఘు బాబాయ్ జీవుని....


మడతలు పడ్డ మస్తిష్కం లోంచి మళ్ళీ వెలికి తీయడమే


4. బాల సంత శంకరయ్యఊదిన శంఖు నాదాన్ని వింటూ 

పూసబెర్ల మల్లమ్మ గంపలోని మొలతాడు దారాన్ని కొంటూ

 బాల రాజనర్సు జమిడీక సప్పుడుని తడుతూ 

పట్వారి పాపిరెడ్డి పట్టా బుక్కులని చూస్తూ మత్స్య గిరి గుడి శిఖరం మీది మైకు లోంచి వేకువ జాము గాలుల్లో తేలి వచ్చే 

"పడవెల్లి పోతోందిరా... ఓ మానవుడా" పాటలనిపాడుకుంటూ


దేవుని చెరువు కట్టను మళ్ళీ దాటడమే...!


5. అడుగు పెట్టీ పెట్టగానే 

ఊరి మట్టిని దేహం నిండా పులుముకుని

 ఆ మట్టి బురదని అత్తరుల అంగీపై చల్లుకొని 

లుంగీని ఎగగట్టి ములుగర్రను చేతిన బట్టి దుక్కి దున్ని- మడులు గట్టి- 

మట్టి అడుగున దాగి ఉన్న

 నా ఊరి జ్ఞాపకాలను తవ్వి పోసి వాటిలో వర్తమానం వరి మొక్కలను నాటుతాను !


6. నేనిప్పుడు నిలువుగా ఎదిగిన చెట్టుని మబ్బుల దాకా ధ్వనిస్తున్న ఆకు పాటని చిటారు కొమ్మల్లో కూచుని ఉన్నా చెట్టు వేళ్ళ లోకే ఒలికి పోతాను మట్టి మూలాలలోనే ఒదిగి పోతాను. 

పెరిగి పెరిగి - తిరిగి తిరిగి - కరిగి కరిగి జరిగింది


పాదాలతో కొలతలు మొదలెట్టిన 

నేల పైకే మళ్ళీ వస్తాను.


డాలర్ సునామీ కి చెల్లా చెదురై

చెదిరి పోయిన ఇసుక గూడుని పదేపదే నిర్మిస్తాను.

మళ్ళీ ఊరికే వస్తాను

మళ్ళీ మళ్ళీ ఊరికి వస్తాను


7. ఊరికి రావడం అంటే

'ఊరికే 'రావడం కాదు

బస్ పాస్, పాస్ పోర్ట్, వీసాలను రెన్యూ చేసుకున్నట్లు 

నా ఐడెంటిటీ ని మళ్ళీ పొడిగించుకోవడం...! పొగ చూసిన ఊపిరి తిత్తుల నిండా

 తంగేడు పూల వాసనని మురిపెంగా నింపుకోవడం ...!


నగరం జీవితంలో అలిష్ట పడ్డోళ్ళకు ఊరికి పోవుడు నిజంగ గాలి పీల్చుకున్నట్టే. గ్యాపకాల బొంకెనను చేదుకున్నట్టే. కైత నడిమిట్ల సబ్బండ వర్ణాల చేతి పనులను కలెగల్పిన డాక్యుమెంటరీ. మబ్బుల దాంక సప్పుడు జేస్తున్న ఆకు పాట.


తంగెడును రాష్ట్ర పుష్పంగ ప్రకటించిన యాల్ల మీరు రాసింది. తంగేడు పూల నేల కవిత. గోపి సారూ తంగేడు పూలను బంగరు పూలన్నడు. మీరు బతుకు పిరమిడ్ ను నిర్మించే అమరవీరులు అని జెప్పిర్రు. సలిమంట లాంటి కవిత తెలంగాణ వస్తే బాగుండని ఆశను తెల్పింది. కాళోజీని జెండాగ ఎగిరిన అచ్చరంగ ,రైతు ను మట్టి చెక్కిన శిల్పంగ కవిత్వం జేసిర్రు. అన్న అమ్మ జెప్పిన కందాన్ కతను నిలబెట్టినవు.


ప్రేమతో మీ తమ్ముడు

నాగిళ్ళ రమేశ్

16.11.2021

Sunday, 14 November 2021

బచ్చాహుడ్ !



బచ్చాహుడ్ !

---------మామిడి హరికృష్ణ 8008005231

_____________________

1.జీవితం ఓ మహావృక్షం. Instincts వేళ్ళు ,Emotions కొమ్మలు. అనుభవాల ఆకులు,Intellect పూలు, Intuition పండ్లు..ఈ whole process and Product కి ఆదిపదం, మొదటి హమ్దం .. మూల లయ, తొలి విత్తనం-- బాల్యం! ఇప్పుడు సంపూర్ణమైన చెట్టు మాత్రమే గోచరం... విత్తనం అదృశ్యం!


అవును, బచ్ పన్ ఓ ఇన్సెప్షన్! Time machine ని Rewind చేసి వెనక్కెనక్కెనక్కి నక్కి నక్కి వెళ్లాలనుకునే Regressive transition !!

.

2.'చందమామ దూర్ కే - పుయే పకాయే బూర్ కె' గీతాలను, 'ముద్దుగారే యశోద ముంగిట ముత్యము' జాడలని, 'పిల్లలూ దేవుడూ చల్లని వారె'ననే కీర్తింపబడిన ఊహ నీ , తరతరాల నుండి, నరనరాల గుండా ఇంకిచ్చుకుని , పొంగించుకుని, కృంగించుకుని, మననం చేసుకోగా, ఉనికిలో ఇంకేదో సశేషమని భావిస్తూ.....


Of course, బచ్ పన్- ఓ పహచాన్ !.అష్టదిక్కుల్లో చరిస్తూ మన ఇంటికి ,వంట్లోకి ,కంట్లోకి నడిచొచ్చే నిరంతర మెహమాన్!!


3.బ్రహ్మ మొక్కటే... బాల్యమొక్కటే ..!.కానీ బహుళ బాహువులతో, బహు ముఖాలతో బహుళ స్వరాలతో నినదించీ ,నిరసించీ, నిలువరించి, నగమై నిటారుగా నిలిచి, నదిలా ప్రవహించి, నభోవీధిలో సంచరించి, అనువదించటానికి వీలులేని అచ్చమైన జ్ఞాపకంగా, సచ్ ముచ్ యాద్ గా సదా బహార్ గెలిచిన బాల్య మొక్కటే .... పర బ్రహ్మ మొక్కటే !


నిజమే .. చిన్ననాటి డీకోడ్ చెయ్యలేని ఓ తాళపత్ర ఐడియాలజీ! .. కవులందరి నిత్య స్మరణీయ ఎలిజి!! 


4.గ్రీక్ పైడికీ ఇలికియా ,లాటిన్ ప్యూరిటియా ,అరబిక్ మర్హాలత్ అల్టుఫులా, ,జర్మన్ కింధేట్ ,స్పానిష్ ఇన్ఫాన్సియా ,ఫ్రెంచ్ ఎన్‌ఫాన్స్ ,బెంగాలీ షైసభ ..ఇంకెన్ని చెప్పినా హ్యూమన్ జెనెటిక్ ఇంజినీరింగ్‌లో జన్యుమొక్కటే ...!


 బహుశా, బాల్యం ఓ ముషాయిరా! .. కావ్యాలన్నీ కృతజ్ఞతలు చెప్పుకునే వాక్యాల జాతర ...!!


5.ఇంత అనుకున్నాక" బచ్చా హుడ్ "ని అర్ధం చేసుకుని, పైట అనిపించుకుని, షార్ట్‌హ్యాండ్‌లో స్మార్ట్‌గా చెప్పాలనుకుంటాం ..కానీ అది అదోలోకం ,అధో ప్రపంచం 

 దాని రహస్య మార్గం శ్రీరాముడికీ ,అభిమన్యుడికీ, ఎలెక్ట్రా కి, ఈడిపస్ రెక్స్ కీ, వాల్మీకికీ, వ్యాసుడికీ, Sophocles కీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ కీ ,ఎలిజబెత్ హర్లాక్ కీ తెలుసు !


అందుకే బాల్యం ఓ పురాణ పురస్మృతి! పురాలు ,ఇహపరాలకు అందని, అంతుచిక్కని ఆకృతి !!


6. కాలం నిర్దయ! లోకం నిత్య భయ! బాల్యం నిర్భయ ! ఫుట్ పాత్ మీద, చెత్త కుండీల్లో , స్లమ్స్లో, ఘెట్టోస్ లోనే కాదు. బడిలో,గుడిలో,ఖార్ఖానాలో ,షాదీఖానాలో ,దవాఖానాల్లో ,నెట్ లో ,ఇంటర్ నెట్ లో నిత్యం భయం డ్రెస్ వేసుకొని అడ్రస్ లేకుండా ప్రయాణిస్తూ ,పలవరిస్తూ ,కలవరిస్తూ ,ఎవ్వరికీ ఏమి కాని అనాధ!. రుద్దబడి .. దిద్దబడి .. తల్లిదండ్రులు ,సమాజం లక్ష్యాలు బరువు ల క్రింద నలిగి, చిరిగి మూస మానవుడికి నకలుగా మారే విషాద గాధ !


అవును ,బాల్యం ఓ నెమలీక ! నెమలి నుంచి దూరమైన దుఃఖ చారిక !!


#mhk_కవిత్వం

Saturday, 6 November 2021

GUEST OF HONOUR! ----- మామిడి హరికృష్ణ

 గౌరవ అతిథి!

----- మామిడి హరికృష్ణ



ఈ దిగంతాల దిగువన

క్షితిజ రేఖల చివరన

జ్వలిస్తున్న దీపం నువ్వు-

ప్రపంచానికి కనిపించే వెలుగును నేను..


నేలకు ఊర్థ్వ మ్ గా

ఆకాశం అంతరంగంలో

సంచరించే వాయువు నువ్వు-

మట్టి దేహంలో ఆడే శ్వాసను నేను..


సమూహ జీవనంలో

అజ్ఞాత సమయాల నుండి

జన విజయాల సంకేతమైన పండుగ నువ్వు-

ఎగిరి, దూకి, చిందేసి పాడే వేడుక నేను..


అర్ధ జీవిత కాలంలో

అర్ధ భూగోళ భ్రమణ పరిభ్రమణం లలో

వ్యోమ యాత్రను సాకారం చేసిన జాబిలి నువ్వు-

అర్థ నిమీలిత నయనాలతో 

చల్లగా కాసే వెన్నెల నేను...


ఈ నాటి దీప ఛాయలో

జ్ఞాన నేత్రం తెరుచుకుంది..

యుగాలుగా చీకటి 

నాకు బయట 

గాలిలో వేళ్ళాడుతూ ఉంది అనుకున్నాను..

ఇంతకాలంగా అది 

నాలోనే నాతోనే ఉందని అర్థం

...

నిజానికి నీడనూ, నిశీధినీ నేనే అని బోధపడింది...


ఈశ్వరా...

ఇన్నాళ్లకు నాకు తెలిసింది-

ఈ జీవన లౌల్యానికి- అనంత ప్రేమకి

ఈ కాలానికి - ఈ లోకానికి 

నేను అధిపతిని కాను..

కేవలం అతిథిని మాత్రమే అని...!!


5-11-2021

#mhk_కవిత్వం