ఇదిగో నా కవిత కాలా.. జీవన.. ఓ సంచారీకి అనువాదం! 27-11-2021న కన్నడ దినపత్రిక జన మిడితలో ప్రచురించబడింది..
తెలుగు ఒరిజినల్ ఇక్కడ ఉంది :::
కాలమూ... జీవితమూ... ఓ సంచారి !
-------------------------------------------------
-- మామిడి హరికృష్ణ 8008005231
1. క్షణానికి రంగూ రుచి వాసన ఉందా?
కాలానికి భౌతిక, రసాయనిక, ఆధ్యాత్మిక ధర్మాలున్నాయా?
సమయానికి అడ్డం, నిలువు, ఎత్తు కొలమానాలున్నాయా?
ఉండకూడదు!
ఉదయానికి ఉద్వేగాలు
మధ్యాహ్నానికి మార్మికతలు
సాయంకాలానికి సంవేదనలు ఉండక పోవచ్చు..
అయితేనేం-
నువ్వు కనిపిస్తే ఉదయం-
ఉద్వేగ రాగం పాడుతుంది..
మధ్యాహ్నం --
మార్మిక సంగీతం వినిపిస్తుంది..
సాయంత్రం--
సంవేదనా నృత్యం అభినయిస్తుంది...
2. కాలం అనంతం
జీవితం పరిమితం...
కాల ప్రస్థానం మధ్యలో జీవితం ఆరంభం
జీవితం ఆఖరి శ్వాసకు వీడ్కోలు పలికాక కూడా
కాలం నిరంతరం...
3. ఘడియను కిలో గ్రాముల్లో తూచగలమా?
గంటలను అడుగుల్లో బేరీజు వేయగలమా?
నిమిషాలను ఫాథోమీటర్ లలో కొలవగలమా?
సెకన్లను ఫారెన్‌హీట్, సెంటీగ్రేడ్, కెల్విన్ లలో చెప్పగలమా?
చెప్పలేకపోవచ్చు-
ఘడియలకు ఘనరూపం లేదు
నిమిషాలు నేల ఆకారంలోకి ఒదగవు
ద్రవ రూపంలో ప్రవహించవచ్చు
సెకన్లు వాయు మార్గంలో పయనించవు!
అయితేనేం..
నువ్వు ఎదురైతే---
ఘడియలు ఘనీభవిస్తాయి
నిమిషాలు భూమి అంతటా పరుచుకుంటాయి
సెకన్లు స్పందించడం నేర్చుకుంటాయి!
4. నా ప్రియా... జీవితమా...!
చేయలేననుకున్నవి చేసి చూపిస్తావు
చేయగలననుకున్నవి చేయకుండా ఆపేస్తావు
అంతరిక్షమంత ప్రేమను ఆల్చిప్పలా చూసి
అణువంత ఆవేశాన్ని ఆకాశం వరకు విస్తరింపచేస్తావు
సముద్రమంత ఆశను ఇసుక రేణువులా మార్చి
ఆవాల గింజంత నిరాశను ఎవరెస్టు లా పెంచేస్తావు!
జీవితమా..!
ఇన్నేళ్లు గడిచాక కూడా నువ్వు నాకింకా ఏమీ అర్ధం కాలేదు..
నువ్వు నాతో ఇంకా సోపతి చెయ్యలేదు..
అయితేనేం-
ఇన్ని గాయాలు- అనుభవాల తర్వాత కూడా
నేను నీతో
మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తున్నావు..
తిరిగి తిరిగి నిన్నే చేరుకునేలా చేస్తున్నావు...!!
#mhk_కవిత్వం
******"""""******"""""******""""""******
No comments:
Post a Comment