Friday, 3 December 2021

పలాయన వాది ప్రేమ గీతం !

 ఇక్కడ, 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న మలయాళ మహాకవి అక్కితం అచ్యుతన్ నంబూత్రి గారి కవిత.. నేను అనువదించి 2-12-2019 న నమస్తే తెలంగాణ పేపర్‌లో ప్రచురించిన కవిత..

పలాయన వాది ప్రేమ గీతం !



------- మూలం: అక్కితం అచ్చుతన్ నంబూద్రి 

         స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231


నన్ను ఉన్న పళంగా ఇక్కడంచి తీస్కెళ్ళవా..

ఓ నా అసలు సిసలు ప్రేయసీ,

నన్ను ఒకానొక అజ్ఞాత తీరానికి తీస్కెళ్ళవా !?


అక్కడ దూర దేశాల పుష్పాల పరిమళం

గాలిలో తేలివస్తుంది 

సాగరంలోని లేత నీలి కెరటాలు 

తీరపు బహువులలో ఓలలాడుతాయి 

మన చిన్నారి పడవ సముద్ర మధ్యన లంగరేసి 

ప్రశాంత నిశ్చల నిద్రలోకి జారుకుంటుంది 

తలొగ్గని కాలపు స్వప్న లోకంలో 

ఈ ప్రపంచమంతా సేద తీరుతుంది !


అక్కడ వింతైన సీతాకోకల్లాంటి కీటకాల గుంపు 

తమ రెక్కలు టపటపలాడిస్తూ విహరిస్తూ ఉంటాయి 

పచ్చిక బయళ్లపై, పూల పాన్పుపై, మహా వృక్ష ఛాయలో 

చూస్తే కళ్ళకు కొత్త అనుభూతిని అద్దుతుంటాయి 

అలాంటి ఏకాంత ప్రదేశంలో నేను అలసిపోయి తనువు వాలుస్తాను 

నా ఛాతీని కలల దుప్పటితో కప్పుకుంటాను! 


అక్కడ నా ప్రియా, నీ తేలికైన మృదు హస్తాన్ని 

నా గుండెలపై నెమ్మదిగా వేయి 

తేనెలు నింపుకున్న నీ స్వరం 

పదాలేవీ లేని 

ఓ కొత్త అపరిచిత గీతాన్ని ఆలపించనీ !


అక్కడ ఓ మధుర అచేతన స్థితి 

సున్నితంగా చెంపలను ముద్దాడి సంబరాలు చేస్తుంది 

అక్కడికి మృత్యువు తరలి వస్తుంది 

నా దేహాన్ని నూతన ధవళ వస్త్రాలతో చుట్టేసి 

నన్ను శాశ్వత గాఢతలోకి తీసుకెళ్లడానికి..

అక్కడి కేవల సంపూర్ణత నన్ను ఆసాంతం 

ప్రవాహంలో కరిగించి కనుమరుగు చేస్తుంది ! 


నా ప్రియ ప్రేయసీ,

నన్ను ఆ అజ్ఞాత అలౌకిక తీరానికి తీస్కెళ్ళవా !?


(ప్రముఖ మలయాళీ కవి అక్కితం అచ్చుతన్ నంబూద్రి కి 2019 సంవత్సరపు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భం...))

No comments:

Post a Comment