Wednesday, 23 February 2022

జీవితానికి అద్దం – కథా సాహిత్యం !

 జీవితానికి అద్దం – కథా సాహిత్యం !

-#మామిడి_హరికృష్ణ



"మీలో చెప్పని కథను భరించడం కంటే గొప్ప వేదన లేదు." -- మాయ ఏంజెలో


సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైన ప్రక్రియ కథాప్రక్రియ.

సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలా నిలిచేది అని అంటారు. జీవితంలో ఉండే ఎన్నో సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనని, ఆనందాలని సంబరాలని, సంతోషాలని ఆలోచనలను అన్నింటిని గుదిగుచ్చి ఒక చోట చేర్చి ఆకట్టుకొనేలా చెప్పగలిగిన అక్షర రూపమే సాహిత్యం. అయితే ఆ సాహిత్యంలో ఉండే ఎన్నో ప్రక్రియలలో జీవితంలోని అన్ని పార్శ్వాలనూ వివరంగా అక్షరీకరించగలిగిన విశిష్ట సాహితీ ప్రక్రియ కథ!

కథలో భాషావిశేషాలు, జీవన విలువలు సాంస్కృతిక నేపథ్యం, ​​వారి వ్యక్తుల ప్రవర్తనలు, వారి ప్రవర్తనలు వాటన్నింటి నేపథ్యంలో ప్రపంచానికి చాటి చెప్పే ఒక సందేశం లేదా ఒక అనుభవం కలగలిసి ఉంటాయి. అందుకే సాహిత్య ప్రక్రియలన్నింటిలో కెల్లా కథకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.

నిజానికి చెప్పాలంటే జీవితం ఎంతో బహుముఖినది. అలాంటి జీవితాన్ని అక్షరీకరించడం, పదాలలో కుదించడం అంతగా సాధ్యం కాదు. చాలా విస్తృతమైన జీవన అక్షరాలలో సంకేతాలలో, ప్రతీకలలో చూపించగలిగే చక్కని సాహిత్య ప్రక్రియగా కథకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే "మానవ జాతి రూపకాలలో ఆలోచిస్తుంది మరియు కథల ద్వారా నేర్చుకుంటుంది." అని ప్రఖ్యాత పుస్తకం “With a Daughters Eye” ను రాసిన అమెరికన్ రచయిత్రి, Cultural Anthropologist అయిన Mary Catherine Bateson చెప్పారు.

మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే ఆది నుంచి ఆచరణలో ఉన్న సాహితీ ప్రక్రియ కథ విధానమే!  కథన విధానమే! ఆదిమ మానవుడి కాలం నుంచి భాష ఆవిష్కరించినప్పటి నుంచి కూడా ఒక తరం తన అనుభవాలని, తనకు ఎదురైన సంఘటనలను మరో తరానికి అందించడానికి, ఆ ద్వారా తమదైన సంస్కృతినీ, సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడానికి కథలు కథలుగా తర్వాతి తరాలకు అందించడం అనే కథన సంప్రదాయమే కారణం అని చెప్పాలి.

సాహిత్యం మౌఖిక రూపంలో ఉన్న కాలంలో కూడా కథన శైలియే అగ్రస్థానం వహించింది అనేది మనకు ఎన్నెన్నో మనవీయశాస్త్ర (Anthropological) అధ్యయనం ప్రకారం అర్థం అవుతుంది. భాష రూపొందిన తర్వాత భావ వినిమయ సాధనంగా భాషకి గుర్తింపు వచ్చిన తర్వాత కథనం అనేది ఒక జాతి వారసత్వ సంపదగా కొనసాగింది! అలాంటి నేపథ్యంలో నుంచి కథ పుట్టిన తర్వాత ప్రతి భాషలో ప్రతి సాహితీ ప్రక్రియలో కథ ఆయా జాతుల జీవనశైలులకు,  ఆయా తరాల జీవన విలువలకు అద్దం పడుతూ దానికి సంక్షిప్త రూపంగా కొనసాగుతూ వస్తోంది!

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కథన శైలి లిఖిత రూపంలో దర్శనమిచ్చింది. బొకేషియో  రాసిన “ది డేకా మెరాన్” గ్రంథం! అలాగే ఆంగ్ల సాహిత్య పితామహుడిగా పరిగణించే జెఫ్రీ ఛాసర్ రాసిన “Conterbury Tales” గ్రంథం కథన శైలిలో ఉండే సాహిత్య రూపంలో మనకు లభిస్తున్నాయి!

ఇలా ప్రపంచ సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో కథకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది!

తెలుగులో తొలి సాహిత్యంగా చెప్పబడిన “మహాభారతం” కూడా కథన సంప్రదాయానికి సంబంధించిందే! అయితే ఇది ఇతిహాస గాథ గనక విస్తృతంగా ఉంది కానీ దాంట్లో ఉండే ఎన్నో చిన్న కథలు, ఉపాఖ్యానాలు అన్నీ కూడా కథా సాహిత్య తొలి వెలుగులే అని చెప్పొచ్చు! అందుకే ఈ కావ్యంలో నన్నయ విరచిత ఆది, సభా, అరణ్యపర్వంలోని అర్థ భాగాలలో “ప్రసన్న కథాకలితార్థ యుక్తి” ఉంది అనీ, కథా గమనంలో కనిపించే సంక్షిప్తత (Brevity), కుతూహలం (Curiosity), ఉత్తేజం (Excitement) వంటి లక్షణాలుంటాయి. అలాగే పోతన రాసిన ‘శ్రీమద్భాగవతం’ మొత్తం మీద ప్రధాన కథానాయకుడు శ్రీ కృష్ణుడు అయినప్పటికీ, ఆయన జీవన ఘట్టాలన్నీ చిన్నచిన్న కథలుగా, లీలలుగా ఉండి, కథా లక్షణాలలోని ఉత్సుకతని, ఆసక్తిని పాఠకులలో కలిగిస్తాయి. కాగా, తెలుగులో మొట్టమొదటి సారిగా కథా లక్షణాలతో కూడిన రచనను 1911లో “దిద్దుబాటు” అనే కథ ద్వారా గురజాడ అప్పారావు చేశారని  భాషావేత్తలు, చరిత్రకారులు గతంలో నిర్ధారించారు. కానీ తర్వాత జరిగిన పరిశోధనల్లో వెల్లడైన ఒక అద్భుతం ఏంటంటే, భండారు అచ్చమాంబ 1910 ప్రాంతంలోనే చక్కని కథా లక్షణాలతో కూడిన కథా సాహిత్యాన్ని సృష్టించింది అని తెలుస్తోంది. “ధనత్రయోదశి” వంటి స్థానిక సాంస్కృతిక నేపథ్యంతో కూడిన వస్తువులతో ఈ ఆమె కథల్ని సృష్టించారు. ఈ లెక్కన తెలుగులో తొలి కథా రచయిత్రి భండారు అచ్చమాంబగా మనం చెప్పుకోవచ్చు.

ఇదే సందర్భంలో ఒక మనో వైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా మనం గమనించాలి! కథన శైలి, కథా సంప్రదాయం, కథలు (Narrative style) చెప్పగలిగే విధానం అనేది స్త్రీలకు సహజంగా అబ్బిన సహజాతం అని చెప్పొచ్చు. వారి మాట తీరు, వారు పెరిగిన జీవన విధానం, సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆ ప్రకారం జరిగే అంశాలు అన్నీ కలిసి స్త్రీలలో సహజమైన కథనరీతిని, కథన శైలిని, కథన నైపుణ్యాలను పెంపొందింపజేసి ఉంటాయని Psychologists మానవుల మేధాశక్తు (Cognitive Abilities) ల మీద పరిశోధనలలో తేలింది అని చెప్పొచ్చు.

అందుకే కథలు అనగానే మనకు అమ్మ లేదా అమ్మమ్మలు గుర్తుకు వస్తారు.  అమ్మ చెప్పిన కథలు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పిల్లలను పెంచడంలో భాగంగా అమ్మ చెప్పే ఎన్నెన్నో కథలు, దాంట్లో జానపద కథలు, నీతి సందేశాన్ని చెప్పగలిగే కథలు, ఇతిహాసాలకు సంబంధించిన కథలు, వివిధ మానవ మనస్తత్వాన్ని చూపించగలిగిన కథలు కూడా ఎన్నో మనకు అమ్మల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి కథలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఆ లెక్కన మన శాస్త్రవేత్తలు నిరూపించిన సత్యం ప్రకారం స్త్రీలు చక్కని కథన నైపుణ్యం కలిగిన మానవులు అనేది అతిశయోక్తిగా అనిపించదు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కథా సాహిత్యంలో స్త్రీలు విస్తృతంగా కృషి చేశారు.

ఇక, తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ కూడా చాలా మంది మహిళలు చక్కని కథా సేద్యం చేసి తెలంగాణ సాహితీక్షేత్రంలో గొప్ప పంటను పండించారు. వారిలో నందగిరి ఇందిరాదేవి, బొమ్మ హేమాదేవి, పాకాల యశోదారెడ్డి లాంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. సమకాలీన కాలంలో లెక్కకు మిక్కిలి చక్కని కథా రచయిత్రులు తమదైన శైలిలో వివిధ రకాల జీవన విలువలను, సంప్రదాయాలను తమ కథల్లో ప్రతిబింభింపజేస్తూ వస్తున్నారు.

అయితే తెలుగులో కథాసాహిత్య పరిణామంలో మొదటగా కుటుంబ కథా వస్తువులే  ప్రధానాంశంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో అభ్యుదయవాదానికి సంబంధించిన కథా వస్తువు, ఆ తర్వాత విప్లవ కథా వస్తువు, ఆ తర్వాత అస్తిత్వవాద ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన కథా వస్తువులుగా కథా సాహిత్యాన్ని విస్తృతంగా ఆయా రచయితలు సృష్టించారు. అస్తిత్వవాద కథా సాహిత్యంలో స్త్రీవాదం, మైనారిటీవాదం, దళితవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం ప్రధాన భూమికను పోషించాయి. ఇలాంటి కథాసాహిత్యం గత రెండు మూడు దశాబ్దాల కాలం నుంచి సృష్టించబడుతుంది. "There's always room for a story that can transport people to another place." అని ప్రఖ్యాత Harry Potter Series గ్రంథాల రచయిత్రి J.K. Rowling అన్నట్లు పాఠకులను, ప్రజలను అక్షరాల వెంట పయనింపజేస్తూ, ఆయా నేపథ్యాలతో మమేకం అయ్యేలా చేయగలిగే సత్తా ఉన్న కథలను ఎన్నిటినో ఈ వాదాలు తెలుగు సాహిత్యానికి అందించాయి.

ఈ క్రమంలో ఆయవాదాల నేపథ్యంతో కథా సాహిత్యం ప్రజలందరిలో ఒక చైతన్యాన్ని, ఒక ఆలోచనని, ఒక జాగృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే అంబేద్కర్ వాదాన్ని, బుద్ధుడి బోధనలను, మరొకవైపున సర్వమానవ సమానత్వాన్ని చెప్పగలిగిన కథలు కూడా ఎన్నో వచ్చాయి.

అలా ఒక వైపు తెలుగు సాహిత్యాన్ని, తెలుగులో కథా సాహిత్యాన్ని అధ్యయనం చేసి, మరొక వైపు తమకు ఎదురైన జీవితానుభవాలు, తమ జీవితంలో ఎదురైన సంఘటనలు అన్నిటినీ క్రోడీకరించి తమదైన గొంతుతో, తమదైన స్వరంతో, తమదైన అక్షరాన్ని సృష్టించే ప్రయత్నాలను రచయితలు చేసారు, చేస్తున్నారు.

మరోవైపున 2020 జనవరిలో మనదేశంలో మహమ్మారి విజృంభించింది. మానవ జాతి చరిత్రలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. మార్చి 23న మనదేశంలో 'జనతా కర్ఫ్యూ', ఆ తర్వాత 'లాక్ డౌన్' ప్రారంభమయింది. అప్పటిదాకా సూపర్ సానిక్ వేగంతో, కాంతి సంవత్సరం అంత దూరాలను కూడా అధిగమించేంత స్థాయిలో దూసుకువెళ్తున్న మానవ మస్తిష్కం, ఒక్కసారిగా ఫ్రీజ్ అయినట్లయింది. ఎక్కడి వారు అక్కడే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక మనిషిని మరొక మనిషి నమ్మలేని పరిస్థితి వచ్చింది. 'మానవుడు సంఘజీవి' అన్న అరిస్టాటిల్ మాట ఇప్పుడు ప్రశ్నార్థకమై పోయింది. అప్పటిదాకా నిర్మించుకున్న వ్యవస్థలు, నిర్వచనాలు, నమ్మకాలు, అన్నీ సందిగ్ధంలో పడ్డాయి. ప్రజలందరూ సంక్షోభంలో పడ్డారు.

ఇలాంటి విపత్కర, విస్మయ విహ్వల పరిస్థితిలో రచయితలు, కవులు, సృజనకారులు, మొదట్లో కొంత స్తబ్దంగా అయిపోయారు, వెంటనే తేరుకుని తమ కలలకు పదును పెట్టారు. అక్షరాలలో తమ స్పందనకు తెర లేపారు. కొత్త కథ, కవిత వస్తువు పుట్టింది. ఇంకేం, ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో గుర్తించడం ద్వారా ఎన్నెన్నో కవితలు, కథలు పుట్టుకొచ్చాయి. తెలుగు వాళ్ళు కూడా వెంటనే స్పందించారు.

సమకాలీన సమాజంలో మనుషుల మధ్య ఉన్న వైరుధ్యాలు, మానవ సంఘర్షణలు, హెచ్చుతగ్గుల తారతమ్యాలు, కులపరమైన వివక్షలు, ఆ వివక్ష నుంచి పుట్టిన ఆవేదనలు, వాటిల్లోంచి ఎగిసిన నిరసనలు, వీనిటన్నిటి కథల రూపంలో డాక్యుమెంట్లు చేసిన రచయితలు 'కరొన'ను కూడా కలుపుకొని, సమకాలీన సామాజిక, మానవీయ కథలను, వైరుధ్యాల స్పందన, వైరుధ్యాలు .

అలాగే, కథా రచయితకి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే! తన చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను, వ్యక్తిత్వాలను, వివిధ సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలలో వారి ప్రవర్తనా రీతులను నిరంతరం గమనిస్తూ ఉండటం, గమనించిన వస్తువులను అక్షరీకరించగలిగే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండటం కథారచయితకి ఉండాల్సిన గొప్ప లక్షణాలు!

అంతేగాకుండా రచయితకు ఒక హృదయనేత్రం ఉంటుంది! ఒక సృజనాత్మక దృక్కోణం ఉంటుంది! ఒక సామాజిక దృక్పథం ఉంటుంది! ఆ కళ్ళకి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది!

వీటన్నింటి వల్ల కథకుల నుంచి ఇప్పటివరకు వచ్చిన, ఇపుడు వస్తున్నరచనలు కానీ, రాబోయే కాలంలో వచ్చే కథలు గానీ, మరింత సమాజహిత భావనతో, సమాజంలో ఉండే అంతరాలపై ఎక్కుపెట్టే బాణాలుగా, మార్పుకి సంకేతంగా నిలుస్తాయని ఆశించవచ్చు. కొత్త ఆలోచనలకి ఉద్దీపనలుగా ఉంటాయని భావిస్తున్నట్లు అమెరికన్ ఇండియన్లలో ఒక జాతి అయిన హోపి జాతి ప్రజలలో ఉండే సామెత "కథలు చెప్పే వారు ప్రపంచాన్ని శాసిస్తారు." అన్న మాటను నిజం చేసేలా ఉంటాయని ఆకాంక్షించవచ్చు.

Sunday, 20 February 2022

MISSING MAN!

 Today February 20 is being observed as #MISSING_DAY... here it's my poem #MISSING_MAN published in mana telangana news paper on 1-11-2021...


MISSING MAN!


----- మామిడి హరికృష్ణ 8008005231


చేతులు ఉన్నాయి కదా అని

తలుపులను మూస్తాం

ద్వారాలను బంధిస్తాం

బారికేడ్ లను కడతాం

గోడలను నిర్మిస్తాం

కందకాలను తవ్వెస్తాం...

దీని కోసం--

మన తెలివినంతా ధార పోస్తాం!

అరిషడ్వర్గాలను ఒక్క తాటి మీదకు తెచ్చి

చతుర్విధ పురుషార్ధాలకు భాష్యం చెపుతాం!


Do's and don'ts కరదీపిక ను 

Terms and conditions guide ను ప్రచురిస్తాం

హద్దులను నిర్ణయిస్తాం

ప్రపంచ పటం పై సరిహద్దులను గీసి

Prohibited area అనీ

Forbidden zone అనీ 

Tresspassers will be prosecuted అనీ 

బోర్డు లు పెడతాం...

నీతి రీతుల ఉపదేశాలను నిర్దేశించి

విలువల కోడ్ ను శాసనంగా చేస్తాం...

దీని కోసం--

మన సామూహిక అనుభవ సారాన్ని అంతా వెచ్చించి

వ్యూహ చతురత కు పదును పెడతాం!!

భక్తి - ఆధ్యాత్మిక సూత్రాలను ప్రస్తావించి

సంస్కృతీ ధర్మాలను వల్లే వేస్తాం!!


ఆది -మధ్య -అంతం లేని భూమిపై

అక్షాంశ రేఖాంశాలను గీసి

 సర్వే నంబర్ ల వారీగా కంచెలు పాతుతాం

ఇది నా భూమి... నా దేశం అనీ గెజిట్ లు ప్రకటిస్తాం

ఎవరేం చేయాలో global protocol లను నిర్ధారిస్తామ్...

దీని కోసం--

మన జ్ఞాన సంజ్ఞాన సహజాతాలు అన్నిటినీ పుటం పెడతాం!!!

సాంకేతిక-తాత్విక- శాస్త్రీయ తర్కాలను సాయంగా తెచ్చుకుంటాం!!! 


మానవా... మహాత్మా...

ఇన్ని యుగాల తర్వాత అయినా

 తలపులకు తలుపులు బిగించ గలిగామా

ఆలోచనలకు సంకెళ్లు వేయగలిగామా

ఊహలను ఉరి తీయగలిగామా

ఆశలను తొక్కి పెట్టగలిగామా

స్వప్నాలకు అడ్డుకట్ట వేయగలిగామా

అక్షరాన్ని నిషేధించగలిగామా

ప్రేమను పాతిపెట్టగలిగామా...

ఆఖరికి--

మనిషిని పట్టుకోగలిగామా...


#mhk_poetry 


#mhk_poetry

Thursday, 17 February 2022

A TOUCH OF MEADOWS!

 MEADOWS యొక్క టచ్!



మన కళ్ళు తెరవాల్సిన సమయం ఇది

వికసించిన పువ్వును చూసి స్వాగతం పలకడానికి..


పాదాలను గుర్తుచేసే గడ్డి ఆకు 

అది హృదయాన్ని తాకింది

 మరియు ఆ పాదాలను మళ్లీ సందర్శించడానికి ఆహ్వానిస్తున్నాను...


ఇది సంధ్యా సమయం

చీకటి, వేకువ చేతులు జోడించి నడిచే చోట..

వెలుతురు కోసం వెతుకులాటలో..


ఓ వెలుగు, రండి 

పచ్చికభూముల అవశేషాల మీదుగా

నీడల జ్ఞాపకాల మీదుగా..


ఆశల కొత్త ప్రపంచం నీ కోసం ఎదురుచూస్తోంది....


#mhk_కవిత్వం

17-2-2022

Tuesday, 15 February 2022

సెల్ఫ్ పార్ట్ నర్ !*

 సెల్ఫ్ పార్ట్ నర్ !*


----- మామిడి హరికృష్ణ 8008005231


ఎప్పుడూ స్థిమితంగా పట్టించుకోలేదు 

వేదాలు- ఉపనిషద్ లు - పురాణాలు 

బైబిల్- ఖురాన్- జెండ్ అవెస్తా లు 

శ్లోకం సాక్షిగా వేలాది సంవత్సరాలుగా చెపుతున్నా...


ఏనాడూ ఏకాగ్రతతో ఆలోచించలేదు 

మార్మికులు- తాత్వికులు- వాగ్గేయకారులు 

ప్రబోధకులు- ప్రవచన కర్తలు- ప్రసంగికులు 

వాక్యం సాక్షిగా శతాబ్దాల కాలం నుంచి వివరిస్తున్నా...


ఏ క్షణమూ నిదానంగా వినలేదు 

అంజనాలు- సోది పలుకులు- వళ్ళు పట్టుడులు 

హస్త సాముద్రికాలు- రామ చిలుక జోస్యాలు- Tarot Reading లు 

జ్యోతిషాలు- సైన్స్ ఫిక్షన్ లు- Futurology లు 

పదం సాక్షిగా నెత్తీ నోరూ కొట్టుకొని అరిచినా...


ఏ ఘడియా కుదురుగా కనలేదు 

నక్షత్రాలు- గ్రహ గతులు- సూర్య చంద్ర గమనాలు 

రాహు కేతు గ్రహణాలు- పూర్వీకుల దీవెనలు- పితృదేవతల శాపాలు 

అక్షరం సాక్షిగా కళ్ళెదురుగా విశ్వరూపం చూపించినా...


సాముదాయికం జీవనం- సమూహ చలనం 

సహ జీవనం- సహ గమనం లోనే 

సంరక్షణ- సంప్రోక్షణ ఉంటుందని 

జాతిగానే నాకో Identity 

గుంపుగానే నాకో Speciality 

కూటమిలోనే నాకో Maturity 

సమాజంలోనే నాకో Security అని 

నిరంతరం నన్ను చంపుకుంటూ బతికాను 


నాలోని వెలితిని నీతో నింపేసి సంపూర్ణత సాధించాలని 

నాలోని శూన్యాన్ని నీ తోడుతో భర్తీ చేయాలని 

నన్ను జీరో చేసుకొని నిన్నే మనసు నిండా నింపుకున్నాను 


ఒంటరి యుగాల్లో గుంపు కోసం వెతికి 

తీరా సమూహంలోకి వచ్చి పడ్డాక 

నన్ను నేను కోల్పోయి - కాట కలిసి 

నన్నెక్కడ పోగొట్టుకున్నానో అని దిక్కులన్నిటా శోధిస్తున్నాను 


నేను ఏకాకిని కాదు- ఏకాంతిని 

ఒక్కడిగా వచ్చాను- ఒక్కడినే పోతాను 

నా యాత్ర నాదే- నా పాత్రా నాదే 

ఎవరి దారికో నా పాదాలను అరువు ఇవ్వలేను 

ఎవరి గమనానికో నా చూపులను అతికించలేను 

Gregarious Instinct మాయలో 

Soliloquoy Intellect ని నలిపేసాను కదా 

ఇప్పటిదాకా సోయి రాలేదు 

ఇప్పుడు చెప్తున్నా-

Suffering and సంబరం are very personal 

పంచుకోవడం- పెంచుకోవడం అంతా ఉత్త cynical 

Solitude is  My ultimate Attitude ! 


yes , నా గ్రూప్- Loneliness !

నా జీవితం- Solo song 

నా రాజ్యం - United Singledom 

నా relationship status - Single 

అవును, నేను Narcissist ను- నర నిరసనిస్ట్ ను కాను 

Selfish ను- Self Healer ను అంతకన్నా కాను 

నేను సామాన్య Self Partner ను!!


(* Beauty and the Beast , Harry Potter సీరీస్ సినిమాలతో ప్రఖ్యాతి సాధించిన హాలీవుడ్ యువ నటి Emma Watson ఇటీవల Single కు ప్రయోగించిన కొత్త పదం Self Partner )

#mhk_poetry

Saturday, 5 February 2022

తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!


 *తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!*

ఆదివారం 06 ఫిబ్రవరి 2022

కష్ట ప్రయాసలతో కూడిన శాసనాల అధ్యయనం వల్ల వెల్లడయ్యే విశేషాలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే, శాసనాలను అధ్యయనం చేసే మెళకువలను, నైపుణ్యాలను సరళీకరణ చేయడం ద్వారా మాత్రమే చరిత్ర నిర్మాణంలో మరింకెంతో మందిని భాగస్వామ్యం చేయడం సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని సులభతరం చేయడం ఇటీవల ప్రచురించిన ''మీరూ శాసనాలు చదవవచ్చు'' పుస్తకం దోహదపడుతుంది. సాధారణంగా ఏ శాస్త్రవేత్త అయినా తనకు తెలిసిన జ్ఞానాన్ని లేదా కొన్ని ఏళ్ళపాటు తను సాధించిన పరిజ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోవాలి లేదా తనే కాపీరైట్‌గా మారాలని అనుకోవడం సాధారణం కానీ తను సాధించిన జ్ఞానాన్ని, తను సంపాదించిన విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి. మరింత మంది తర్వాత తరం యువకులకు మార్గదర్శకం కావాలి.ఒక కఠినమయిన శాస్త్రాన్ని సరళీకరణ చేయడం ద్వారా మరింత మంది తర్వాత తరం పరిశోధకులకి దారిని సుగమం చేయాలనే ఒక నిస్వార్ధత, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.

   Epigraphy is a prime tool in recovering much of the first hand record of antiquity.    శాసన శాస్త్రం గురించి ప్రఖ్యాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన మాటలివి. సాధారణంగా చరిత్ర ఒక నీటి చెలిమె లాంటిది. తవ్వుతున్న కొద్దీ ఊట లాగా ఎన్నో విషయాలు, వింతలు ప్రపంచానికి తెలియని మరెన్నో సత్యాలు వెలుగులోకి రావడం సహజమే!

   నిజానికి చరిత్రను నిర్దిష్ట శాస్త్రంగా మార్పు లేని విషయంగా గమనిస్తారు. కానీ చరిత్రకు ఉన్నంత నమ్యత (Flexibility),, నవ్యత (Novelty)ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలని ఆహ్వానించగలిగే తాత్త్వికత (Philosophy to welcome new discoveries)మరి ఏ శాస్త్రానికి లేదేమో అనిపిస్తుంది.

   నిన్నటివరకు ఇది చరిత్ర అనుకున్నది కొద్దికాలం తర్వాత జరిగిన నూతన అన్వేషణలు, నూతన ఆవిష్కరణల (New Revelations)వల్ల ఆ చరిత్ర మారడమో మరింత ముందుకు వెళ్లడమో లేక అప్పటి దాకా అనుకున్న చరిత్రకు కొత్త జోడింపు రావడమో జరుగుతుంది. అలా చరిత్ర ఎప్పుడూ నిర్మాణమవుతూ వెళుతుంది. దీనికి సింధూ నదీ నాగరికతే ఒక గొప్ప ఉదాహరణ.

   1920 దశకం వరకు ప్రపంచం మొత్తం మీద ప్రాచీన నాగరికతలుగా మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్‌ నాగరికత, గ్రీకు నాగరికత, చైనా నాగరికత మాత్రమే చెప్పుకోవడం జరిగింది. కానీ 1920 తర్వాత అవిభక్త భారతదేశంలో నూతన రైలుమార్గం వేయడం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు సింధూ నది పరివాహక ప్రాంతంలో ప్రాచీన నాగరికత అవశేషాలు బయట పడడం జరిగింది.

   సర్‌ జాన్‌ మార్షల్‌, దయారామ్‌ సాహ్ని నేతృత్వంలో అక్కడ త్రవ్వకాలు జరపడం ద్వారా క్రీస్తుపూర్వం నాటి గొప్ప నాగరికత ఒకటి భారతదేశంలో విలసిల్లింది అని నిరూపించగలిగే చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. హరప్పా, మొహంజోదారో వంటి ప్రాచీన నగరాలు వెలుగులోకి వచ్చాయి.

   చైనా నాగరికతకు, ఈజిప్టు నాగరి కతకు, గ్రీకు నాగరికతకు, మెసప టోమియా నాగరికతకు తీసిపోని ఒక వైభవోపేతమైన ప్రాచీన నాగరికత భారత దేశంలో సైతం విరాజిల్లింది అని చెప్పగలిగిన గొప్ప ఆధారాలూ వెలికి వచ్చాయి.

  ఈ ఉదాహరణను బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే చరిత్ర ఎప్పుడూ నిరంతర నిర్మాణ శాస్రమే  (Ever construct ing science). అందుకే చరిత్రకి ఇది అంతం అనేది ఉండదు. చరిత్రకు ఫుల్‌ స్టాప్‌ లేదు, కామాలు మాత్రమే ఉంటాయి !

   ఇలాంటి చరిత్ర ద్వారా ప్రతి సమాజానికి, ప్రతి జాతికి, మనుషులకి తన పూర్వీకుల గురించి, తమ కన్నా ముందు తరాల జీవన సంస్కృతి నుంచి ఇతర ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడానికి, దాని ఆధారంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక ప్రాతిపదిక దొరుకుతుంది!


*'చరిత్ర'తో ప్రయోజనం?*

   చరిత్ర వల్ల లాభం ఏంటి? అనేది ఎన్నో ఏళ్ల నుంచి అందరినీ వేధించే ప్రశ్న! చరిత్రవల్ల మానవజాతి ప్రస్థానం తెలుస్తుంది.! మన పరిణామం అర్థమవుతుంది.! నేటి తీరుకి, తరహాకి, తరీఖాకి మూలాలు ఎక్కడున్నాయో అవగతం అవుతుంది! ఇప్పుడు చూస్తున్న మహావృక్షపు కొమ్మల మూలాలు, వ్రేళ్ళు ఎక్కడున్నాయో అర్ధమైతే దాన్ని బట్టి ఆయా జాతులు, 'మనుషులు', దేశాలు, ప్రదేశాలు, ప్రాంతాల చరిత్రను మిగతా అన్ని అంశాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

   మొత్తంగా మానవజాతిలోని వైవి ధ్యత (Diversity)ను, వైవిధ్యతలోని విశిష్టత (Uniqueness) ను, విశిష్టతలోని విభిన్నత (Difference) ను, విభిన్నతలోని ప్రాముఖ్యత  (Significance) ను గౌరవిం చడానికి మనందరికీ ఒక ఆదరువు దొరుకుతుంది. అందుకే చరిత్ర అధ్యయనం అంటే కేవలం సంవత్సరాలు, సంఘటనలు, వీరుల గాధలు, రాజ్యాలు, రాజభోగాలు, కట్టడాలు, నిర్మాణాలు, కోటలు మాత్రమే కాదు.

   చరిత్ర అంటే - మొత్తం మానవాళి సామూహిక జ్ఞాపకాల సంకలనం...! (Collection of collective memories of mankind)

   చరిత్ర అంటే - మనిషి మేధస్సు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న సమూహ కార్యాల పునర్దర్శనం (Revisiting of collec tive efforts). ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన చరిత్రను నిర్ధారించే ఆధారాలలో పురావస్తు ఆధారాలు(Archaeological Resources) లిఖిత ఆధారాలు(Written documents),ఎన్నో ఉన్నాయి. వాటిలో విశిష్టమైనవి శాసనాలు (Inscriptions), ఆ శాసనాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం ఎపిగ్రఫీ! 

   ప్రాచీన కాలం నుంచి, మధ్య యుగాలు, ఆధునిక కాలం వరకు ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశంపై రాజులు, రాజ్యాలు, దేశాలు శాసనాలను వేయించడం ద్వారా తమ విధానాన్ని, తమ పాలన రీతిని, తమ సంస్కరణ దృక్పథాన్ని, అనాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, చారిత్రక పరిస్థితులని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

   అందుకే శాసనాలు చరిత్ర నిర్మాణానికి ఒక ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయి. శాసనాలు చరిత్ర రచన శాస్త్రానికి(Historiography) గొప్ప ఆసరాను అందిస్తున్నాయి.


*శాసన శాస్త్రం అంటే ఏంటి?*

   రాళ్లు, శిలలు, రాతి స్తంభాలు, దేవాలయ కుడ్యాలు, రాగి పలకలు వంటి వాటిపై రాసిన భాష విషయ విశేషాలను అధ్యయనం చేసి చరిత్రను నిర్మించే శాస్త్రమే శాసనాల శాస్త్రంగా చెప్పవచ్చు. ఇక ఈ శాసనాలు మనకు ప్రధా నంగా శిలలపై, లోహాలపై, మట్టి పాత్రలపై, కలపపై, తాళపత్రాలలో, వస్త్రాలపై, శంఖువులపై, కుడ్య చిత్రాలు, నాణాలపై మనకు కనిపిస్తాయి !

   అయితే శాసన శాస్త్రం ఇలాంటి ప్రాచీన వస్తు సంస్కృతులకి ఆధారంగా ఉన్నప్పటికీ నిజానికి ఇది ఒక భాషాశాస్త్రం (Linguistics), ఒక లేఖనశాస్త్రం  (Graphology), భాషా పరిణామ విశ్లేషణ శాస్త్రం  (Philology), అలాగే పద పరిణామ విశ్లేషణ శాస్త్రం (Etymology) వంటి మరెన్నో శాస్త్రాలు కలిసిన బహుళశాస్త్రం.

ఎపిగ్రఫీ ప్రధాన ఉద్దేశాలు సాధారణంగా రెండుగా కనిపిస్తాయి:

1. చేసిన పనులు, చట్టాలు లేదా నిర్ణయాలు క్షయం నాశనం కాకుండా పది కాలాల పాటు: నిలిచిపోవాలనేది.

2. ఒక తరం నుంచి మరో తరానికి ఆనాటి సంప్రదాయ విధానాల గురించిన జ్ఞానాన్ని ఎరుకను బదిలీ చేయడం అనేది.

   అయితే చరిత్రను నిర్మించడంలో పురా వస్తువులు, శిలాజ అవశేషాలు, మట్టి పాత్రలు, శిల్పాలు, చిత్రాలు, తాళపత్ర గ్రంధాలు కూడా ఎంతో ఉపకరిస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిని చరిత్ర నిర్మాణంలో ప్రాథమిక ఆధారాలుగా, ప్రాథమిక సాక్ష్యాలుగా భావించవచ్చు.

   అలాగే ఈ శాసనాలలోని అంశాలు, విషయాలు, విశేషాల ఆధారంగా ఆయా కాలాలనాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, పురావస్తు విధమైన ప్రాచీనతను, సమాజ పరిణామాన్ని నిర్ధారించడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి.


*ఏ భాషలో ఎన్ని శాసనాలు?*

   ''జర్నల్‌ ఆఫ్‌ ది గ్రాఫికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా'' వాల్యూమ్‌ 19-1903 ప్రకారం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి అంటే లిపి పుట్టిన నాటి నుంచి భాషల వారీగా శాసనాల గురించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. దానిలో ఏ భాషల్లో ఎన్ని శాసనాలు ఇప్పటి వరకు వచ్చాయనే సంఖ్యాత్మకమైన పరిశోధనలు కూడా వారు చేశారు. దాన్ని అనుసరించి భారతీయ భాషలలో అత్యధికంగా తమిళ భాషలో 20 వేలకు పైగా శాసనాలు లభ్యమవుతున్నాయి అని తెలిపారు. భారతీయ భాషలు అన్నిటి లోకల్లా ప్రాచీన భాషగా తమిళం ఉండటం వల్ల, ప్రాచీనకాలం నుంచే శాసనాలు వేసే సంప్రదాయం బహుశా తమిళ భాషలో మొదలవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం!

   అలాగే ఇప్పటి వరకు లభించిన వాటిలో కన్నడ భాషలో దాదాపు 10,600, సంస్కృత భాషలో 7500 వరకు శాసనాలు వివిధ కాలాల నాటివి లభిస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన చారిత్రిక పరిశోధనల్లో వెల్లడైన శాసనాల సంఖ్య 4,500 కు పైగా ఉంది.

   వీటన్నిటి ద్వారా ప్రాంతాలు, రాజ్యా లు, రాజ్యాల కాలమునాటి ఎన్నో విషయాలు, పాలనాపరమైనవి, సామా జిక, ఆర్థికపరమైన, విశ్వాసాల పరమైనవి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

   అందుకే మనిషి పరిణామంలో ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి శాసన శాస్త్రం ఒక్క గొప్ప ఆధారంగా ఉంటూ వస్తుంది!

   ఇక ఇప్పటివరకూ లభ్యం అవుతున్న శాసనాల ఆధారంగా ఈ శాసనాలను రూపొందించే విధానంలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది.

   శాసనాలు చేసే ఆకరాలు (sources) అంటే మాధ్యమాలుగా రాళ్లు (Rocks/stones), లోహాలు (Metal), మట్టి అంశాలు (Mud Works), కర్రకు సంబంధించిన అంశాలు (Wood works), వస్త్రాలు (Clothes), గోడలు (Walls), నాణాలు  (Coins) వంటివి ఉండగా ఈ వేసే విధానం (టెక్నిక్‌)లో కటింగ్‌, కార్వింగ్‌, క్యాస్టింగ్‌, ఎంగ్రేవింగ్‌, ఎంబోసింగ్‌, స్క్రాచింగ్‌, డ్రాయింగ్‌ వంటి విధానాలు లేదా నైపుణ్యాలు మనకు కనిపిస్తాయి.

   ఇలా చేయడం వల్ల కాల పరిణామంలో రుతువుల మార్పులను అతిక్రమించి, ఆయా మాధ్యమాల మీద రాయబడిన రాతలు, చెక్కబడిన విషయాలు క్షయం కాకుండా నిలిచి ఉండటానికి అవకాశం ఏర్పడింది.


*బహుశాస్త్రాల మేళవింపు*

   ఇక శాసనాల అధ్యయనం ఒక బహుముఖీన శాస్త్రాల అధ్యయనంగా భావించవచ్చు. ఉపరితలం నుంచి చూస్తే ఇది కేవలం శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రంగా కనిపించవచ్చు. కానీ ఒక శాసనాల అధ్యయన కర్తకి మరెన్నో శాస్త్రాల గురించిన అవగాహన కూడా అవసరం. దీనిలో చరిత్ర రచన శాస్త్రం(Historiography) తెలిసుండాలి. భాషాశాస్త్రం, సోషియాలజీ, ఆర్కియాలజీ, కార్బన్‌ డేటింగ్‌ టెస్ట్‌ లాంటి ఇతర సాంకేతిక శాస్త్ర నైపుణ్యాలు కూడా ఒక శాసన అధ్యయన శాస్త్రవేత్తకి అవసరంగా ఉంటాయి! అందుకే శాసనాల ఆధారంగా చరిత్రను నిర్మించడం అనేది ఒక బహుళ విషయాల సమీకృత అంశం (Multi Disciplinary Approach) గా భావించాలి.

  ఇలా ఎన్నెన్నో అధ్యయనాల తర్వాత శాసనాల ఆధారంగా చరిత్రని నిర్మిస్తున్నప్పుడు, చరిత్రకారుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవడం కూడా సహజమే. తను అర్ధం చేసుకున్న ఒక శాసనం ఆధారంగా తను అర్ధం చేసుకున్న విషయాల సాధికారత (Authority), (Authenticity),, సార్వజనీనత (Unive rsality), ప్రామాణికత (Standardization), విశ్వసనీయత(Reliability) అనేవి ప్రశ్నార్ధకంగానే ఉండిపోతాయి. అందుకే చరిత్రకారుడు కానీ శాసన అధ్యయన కారులు గాని తమ పరిమితులకు అతీతంగా సబ్జెక్టివ్‌ అప్రోచ్‌ లో కాకుండా విషయాత్మక ఆలోచనలతో ఒక విస్తృత పరిశీలనా దృక్పథంతో విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.

   ఇది ఎంతో క్లిష్టమైన, కష్టమైన పని. అయితే ''కవిత్వం ఒక ఆల్కెమీ! దాని రహస్యం కవికి మాత్రమే తెలుసు'' అనే వాక్యం ఎలా ఉందో ''చరిత్ర కూడా ఒక ఆల్కెమీ! దాని రహస్యం చరిత్రకారుడికి మాత్రమే తెలుసు!'' అని భావించాలి.

   ఆ విధంగా శాసనాల గురించిన అనుపానులు, శాసనాలలోని విశేషాల విశ్లేషణ, శాసనాలలో నిబిడీకృతమైన అంశాల ప్రామాణికత, వాటి నిర్ధారణ (Authorisation) అన్నీ కూడా శాసన అధ్యయన శాస్త్రవేత్తలకు ఉండే జ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది.


*తెలంగాణ చరిత్ర - శాసనశాస్త్రం*

   భారతదేశంలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇప్పటికీ వెలుగు చూడకుండానే ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంత ప్రాచీనత గురించిన పరిశోధనలు మళ్ళీ మొదలయ్యాయి. శ్రీమతి కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ జాగృతి' సంస్థ, తెలంగాణ సాంస్కృతిక విషయాలు, బతుకమ్మ పండుగ వంటి వాటితో పాటు విస్మృత తెలంగాణ చరిత్రపై విస్తృతంగా పరిశోధనలు ప్రారంభించారు. 2009లో తెలంగాణ జాగృతికి అనుబంధంగా తెలంగాణ చరిత్ర విభాగాన్ని మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామరోజు హరగోపాల్‌లతో ఏర్పాటు చేసి, వారి సారథ్యంలో పరిశోధనలు నేటికీ కొనసాగుతున్నాయి.

   గతంలో ఆదిరాజు వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, బి.ఎన్. శాస్త్రి, గులామ్‌ ఎజ్డానీ మొదలగు చరిత్రకారులు ఈ రంగంలో చేసిన అవిరళ కృషి ఫలితంగా ఇప్పటికి అందుబాటులో ఉన్న చరిత్ర నిర్మాణమైంది. దీన్ని ఇపుడు కొనసాగించడం, మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరం.

   అయితే తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు ముఖ్యంగా సాహిత్య చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కరీంనగర్‌ బొమ్మలగుట్టపైన 'కురిక్యాల శాసనం' లో (జినవల్లభుడు వేసినది) కనిపిస్తుంది. అంతకు ముందు క్రీ. పు. 6వ శతాబ్ది కాలం నాటి బౌద్ధ, జైన కట్టడాల వద్ద వేసిన ప్రాకృత, బ్రాహ్మీ శాసనాలు, షోడష మహాజన పదాల కాలంలో అస్మక రాజ్యంగా ఉన్న బోధన ప్రాంతంలో వేయించిన శాసనాలు, శాతవాహనుల కాలంలో, ఆ తర్వాత కాకతీయుల కాలం, ఆ తదనంతరం కూడా ఎన్నెన్నో శాసనాలు తెలంగాణ నేల నలుచెరగులా స్థాపించడం జరిగింది. ఇవేకాక, కుతుబ్‌ షాహీలు, ఆ తర్వాత అసఫ్‌ జాహీల (నిజాంలు) కాలంలో వేసిన పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ శాసనాలు కూడా డికోడ్‌ చేయవలసి ఉంది. అలా వందలాది శాసనాలకు నెలవుగా తెలంగాణ ఉంది. అయితే ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇంకా పరిపూర్ణం కావాల్సి ఉంది. 

   ఇలా రాష్ట్రంలోని వేర్వేరు దేవాలయాలు, చెరువు గట్టులు, గ్రామాలలో వెలుగు చూసిన శాసనాలను సేకరించడం, వాటి కాలాలను నిర్ధారించడం, ఆ శాసనాలలోని విషయాలను చదవడం, అధ్యయనం చేయడం, ఆ విషయాల ఆధారంగా ఇప్పటికే మనకు తెలిసిన చరిత్రకు అదనపు సమాచారాన్ని లేదా కొత్త సమాచారాన్ని జతచేయడం అనేవి ప్రస్తుతం గొప్ప లక్ష్యాలు. వీటన్నిటినీ పరిష్కారం చేస్తే ఇంకా ఎన్నెన్నో చరిత్ర విశేషాలు లోకానికి వెల్లడి అవుతాయి.

   అయితే ప్రస్తుత కాలంలో ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన ఈ శాసన శాస్త్రవేత్తలు మనకు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. మరి అసంఖ్యకంగా లభిస్తున్న శాసనాలను పూర్తి శాసన శాస్త్రవేత్తలు ఎంతో మంది అవసరం అవుతారు. అందుకని ఇప్పుడు అధ్యయనవేత్తల అవశ్యకత ఎంతగానో ఉంది.


*శాసనాలను ఎవరైనా చదవవచ్చా?*

   ఇలాంటి కష్ట ప్రయాసలతో కూడిన శాసనాల అధ్యయనం వల్ల వెల్లడయ్యే విశేషాలన్నీ అందరికీ అందుబాటులోకి రావాలంటే, శాసనాలను అధ్యయనం చేసే మెళకువలను, నైపుణ్యాలను సరళీకృతం చేయడం ద్వారా మాత్రమే చరిత్ర నిర్మాణంలో మరింకెంతో మంది భాగస్వామ్యం చేయడం సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని సులభతరం చేయడం ఇటీవల ప్రచురించిన ''మీరూ శాసనాలు చదవవచ్చు'' పుస్తకం దోహదపడుతుంది.

   సాధారణంగా ఏ శాస్త్రవేత్త అయినా తనకు తెలిసిన జ్ఞానాన్ని లేదా కొన్ని ఏళ్ళపాటు తను సాధించిన పరిజ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోవాలి అని లేదా తనే కాపీరైట్‌గా మారాలని అనుకోవడం సాధారణం కానీ తను సాధించిన జ్ఞానాన్ని, తను సంపాదించిన విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి. మరింత మంది తర్వాత తరం యువకులకు మార్గదర్శకం కావాలి. ఒక కఠినమయిన శాస్త్రాన్ని సరళీకరణ చేయడం ద్వారా మరింత మంది తర్వాత తరం పరిశోధకులకి దారిని సుగమం చేయాలనే ఒక నిస్వార్ధత, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.

   ఈ గ్రంథం చదివిన తర్వాత, శాసనాల గురించి ఏమాత్రం తెలియకపోయినా చివరి పేజీ ముగించిన తర్వాత, శాసనాలను అధ్యయనం చేయాలనే ఆసక్తి, మనం కూడా శాసనాలను చదవడం అనే ఒక ధైర్యం, శాసనాలను మనం కూడా అధ్యయనం చేయగలము అనే ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అంత చక్కగా ఎంతో విడమరిచి, సరళంగా, సులభశైలిలో ప్రతి శాసనానికి సంబంధించిన అంశాలు, భాషావిశేషాలని, లిపి పరిణామాన్ని కూడా విస్తరిస్తూ, విశ్లేషిస్తూ కొన్ని కేసు స్టడీస్ ని కూడా ఉదహరిస్తూ వాటి ఆధారంగా నిర్మించిన చరిత్ర మనకు ఈ గ్రంథంలో ఈమని శివనాగిరెడ్డి గారు ఎంతో చక్కగా పామరులకు సైతం అర్ధం అయ్యేలాగా వివరించారు.

   గతంలో మనకు ''30 రోజుల్లో మలయాళ భాష'' సిరీస్‌తో కొన్ని పుస్తకాలు వచ్చేవి. ఇంగ్లీషులో యూరప్‌లో ఈ సంప్రదాయం ఉంది. 'ఇంగ్లీష్‌ లర్నింగ్‌' అనే పేరుతో ఇంగ్లీషేతరుల కోసం కూడా యూరప్‌ లో కొన్ని పుస్తకాలు సాధారణంగా ఉండేవి. గురజాడ రాసిన కన్యాశుల్కంలో కూడా గిరీశం పాత్ర ''ఇంగ్లీష్‌ లెర్నింగ్‌ మేడీజీ'' అనే మాటను వాడటం మనకు తెలిసిందే!

   వివిధ రకాల శాస్త్రాలన్నీ వివిధ రకాల భాషలలో సులభగ్రాహ్యంగా ఉండేలా, ఆ భాష తెలియని వారికి సైతం అర్థమయ్యే రీతిలో అందిం చడం పరిపాటి. దీని కోసం కొన్ని ఆధారాల ప్రాతిపదికగా నిర్మించే విధా నం మనకు మొదటి నుంచి ఉంది.

   అయితే శాస్త్రాల విషయంలో ఇది కష్టం. ముఖ్యంగా చరిత్ర రచన శాస్త్రంలో, శాసన అధ్యయన శాస్త్రంలో కూడా ఇది కష్టమే అయినప్పటికీ ఒక మహా సంకల్పంతో శాసన శాస్త్రాలను కూడా. సరళీకరించి, అధ్యయనం చేయడానికి వీలుగా ఈ గ్రంథాన్ని ఎంతో చక్కగా ఒక నిర్మాణాత్మక వ్యూహంతో, విషయ నిష్టతో, అన్నిటినీ మించి ఒక సామాజిక ప్రయోజన దృక్పథంతో రాయడం గొప్ప విశేషం!

   ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఇప్పటికే ఉన్న, కొత్తగా వెలుగు చూస్తున్న శాసనాలను అధ్యయనం చేయడం, వాటిని రికార్డు చేసి, ఇప్పటివరకూ తెలియని మరెన్నో చారిత్రక విశేషాలను వెల్లడి చేయడం ద్వారా తెలంగాణా చారి త్రక, సాంస్కృతిక, సాహితీ వైభవాన్ని భారతదేశ చరిత్రలో అంత ర్భాగం చేసే అవకాశం లభిస్తుంది. దానికి ఇదే సరైన తరుణం!!


*కొసమెరుపు*

   శాసన విశ్లేషణని ఆధారంగా చేసుకొని చరిత్రను నిర్మించే విధానానికి తొలిసారిగా శ్రీకారం చుట్టిన ఘనత జేమ్స్‌ ప్రిన్‌సెప్‌ ది. ఆయనను ''ఫాదర్‌ ఆఫ్‌ ఎపిగ్రఫీ''గా అభివర్ణిస్తారు. కేవలం 40 ఏళ్ళు మాత్రమే జీవించిన అతను, తాను మొదలెట్టిన శాసన అధ్యయన శాస్త్రానికి ప్రేరణ భారతీయ శాసనాల నుంచి తీసుకోవడం ఇక్కడ దృష్టి. లండన్‌ నుంచి భారతదేశానికి విచ్చేసిన జేమ్స్‌ప్రిన్‌సెప్‌ ఇక్కడ ఉండే చారిత్రక కట్టడాలనింటిని గమనించి ఎంతో ఆశ్చర్యానికి గురై, సంస్కృత భాష ఇతర భాషలను నేర్చుకొని ఆ లిపిని గమనించి వాటి ఆధారంగా భారతీయ చరిత్రను నిర్మించే ప్రయత్నం చేశారు.

   ఆయన ప్రాచీన భారతదేశానికి చెందిన ఖరోష్టి, బ్రాహ్మీ లిపులను నేర్చుకోవడమే కాకుండా వాటిని అర్థం చేసుకునేవారు కూడా చేశారు. అంతేగాక కోల్ కత్తాలో మొదలైన రసంస్థాపక సంపాదకులుగా ఉండి తను చేసిన పరిశోధనలను, తనలాంటి వారు చేసిన భారతీయ పరిశోధనలను గ్రంథస్థం చేస్తూ పునాదులు నిర్మించే ప్రయత్నం చేశారు.

   ఆయన మన దేశంలోని బెనారస్‌లో ప్రఖ్యాతిగాంచిన నాణేల ముద్రణశాలలో, నాణ్యత నిపుణుడిగా పని చేస్తూనే వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, పర్యటిస్తూ చరిత్రకు సంబంధించిన వస్తువులను వెలికితీస్తూ భారతీయ ప్రాచీనతకు సంబంధించిన శాసనాల ఆధారంగా చరిత్రను నిర్మించే గొప్ప ప్రయత్నం చేశారు. ఇప్పుడిక మన వంతు!! 

*- మామిడి హరికృష్ణ, 8008005231* 


*వెబ్‌సైట్ లింక్: www.navatelangana.com/Sopathi/1132590

*ఆర్కైవ్ చేయబడిన లింక్: https://web.archive.org/web/20220206042823/http://www.navatelangana.com/Sopathi/1132590