Wednesday, 23 February 2022

జీవితానికి అద్దం – కథా సాహిత్యం !

 జీవితానికి అద్దం – కథా సాహిత్యం !

-#మామిడి_హరికృష్ణ



"మీలో చెప్పని కథను భరించడం కంటే గొప్ప వేదన లేదు." -- మాయ ఏంజెలో


సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు. అన్నిటిలో కెల్లా విశిష్టమైన ప్రక్రియ కథాప్రక్రియ.

సాహిత్యం మనిషి జీవితానికి అద్దంలా నిలిచేది అని అంటారు. జీవితంలో ఉండే ఎన్నో సంఘటనలు, సందర్భాలు, సంఘర్షణలను, వేదనని, ఆనందాలని సంబరాలని, సంతోషాలని ఆలోచనలను అన్నింటిని గుదిగుచ్చి ఒక చోట చేర్చి ఆకట్టుకొనేలా చెప్పగలిగిన అక్షర రూపమే సాహిత్యం. అయితే ఆ సాహిత్యంలో ఉండే ఎన్నో ప్రక్రియలలో జీవితంలోని అన్ని పార్శ్వాలనూ వివరంగా అక్షరీకరించగలిగిన విశిష్ట సాహితీ ప్రక్రియ కథ!

కథలో భాషావిశేషాలు, జీవన విలువలు సాంస్కృతిక నేపథ్యం, ​​వారి వ్యక్తుల ప్రవర్తనలు, వారి ప్రవర్తనలు వాటన్నింటి నేపథ్యంలో ప్రపంచానికి చాటి చెప్పే ఒక సందేశం లేదా ఒక అనుభవం కలగలిసి ఉంటాయి. అందుకే సాహిత్య ప్రక్రియలన్నింటిలో కెల్లా కథకు ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.

నిజానికి చెప్పాలంటే జీవితం ఎంతో బహుముఖినది. అలాంటి జీవితాన్ని అక్షరీకరించడం, పదాలలో కుదించడం అంతగా సాధ్యం కాదు. చాలా విస్తృతమైన జీవన అక్షరాలలో సంకేతాలలో, ప్రతీకలలో చూపించగలిగే చక్కని సాహిత్య ప్రక్రియగా కథకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అందుకే "మానవ జాతి రూపకాలలో ఆలోచిస్తుంది మరియు కథల ద్వారా నేర్చుకుంటుంది." అని ప్రఖ్యాత పుస్తకం “With a Daughters Eye” ను రాసిన అమెరికన్ రచయిత్రి, Cultural Anthropologist అయిన Mary Catherine Bateson చెప్పారు.

మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే ఆది నుంచి ఆచరణలో ఉన్న సాహితీ ప్రక్రియ కథ విధానమే!  కథన విధానమే! ఆదిమ మానవుడి కాలం నుంచి భాష ఆవిష్కరించినప్పటి నుంచి కూడా ఒక తరం తన అనుభవాలని, తనకు ఎదురైన సంఘటనలను మరో తరానికి అందించడానికి, ఆ ద్వారా తమదైన సంస్కృతినీ, సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడానికి కథలు కథలుగా తర్వాతి తరాలకు అందించడం అనే కథన సంప్రదాయమే కారణం అని చెప్పాలి.

సాహిత్యం మౌఖిక రూపంలో ఉన్న కాలంలో కూడా కథన శైలియే అగ్రస్థానం వహించింది అనేది మనకు ఎన్నెన్నో మనవీయశాస్త్ర (Anthropological) అధ్యయనం ప్రకారం అర్థం అవుతుంది. భాష రూపొందిన తర్వాత భావ వినిమయ సాధనంగా భాషకి గుర్తింపు వచ్చిన తర్వాత కథనం అనేది ఒక జాతి వారసత్వ సంపదగా కొనసాగింది! అలాంటి నేపథ్యంలో నుంచి కథ పుట్టిన తర్వాత ప్రతి భాషలో ప్రతి సాహితీ ప్రక్రియలో కథ ఆయా జాతుల జీవనశైలులకు,  ఆయా తరాల జీవన విలువలకు అద్దం పడుతూ దానికి సంక్షిప్త రూపంగా కొనసాగుతూ వస్తోంది!

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కథన శైలి లిఖిత రూపంలో దర్శనమిచ్చింది. బొకేషియో  రాసిన “ది డేకా మెరాన్” గ్రంథం! అలాగే ఆంగ్ల సాహిత్య పితామహుడిగా పరిగణించే జెఫ్రీ ఛాసర్ రాసిన “Conterbury Tales” గ్రంథం కథన శైలిలో ఉండే సాహిత్య రూపంలో మనకు లభిస్తున్నాయి!

ఇలా ప్రపంచ సాహిత్యంలో, భారతీయ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో కథకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది!

తెలుగులో తొలి సాహిత్యంగా చెప్పబడిన “మహాభారతం” కూడా కథన సంప్రదాయానికి సంబంధించిందే! అయితే ఇది ఇతిహాస గాథ గనక విస్తృతంగా ఉంది కానీ దాంట్లో ఉండే ఎన్నో చిన్న కథలు, ఉపాఖ్యానాలు అన్నీ కూడా కథా సాహిత్య తొలి వెలుగులే అని చెప్పొచ్చు! అందుకే ఈ కావ్యంలో నన్నయ విరచిత ఆది, సభా, అరణ్యపర్వంలోని అర్థ భాగాలలో “ప్రసన్న కథాకలితార్థ యుక్తి” ఉంది అనీ, కథా గమనంలో కనిపించే సంక్షిప్తత (Brevity), కుతూహలం (Curiosity), ఉత్తేజం (Excitement) వంటి లక్షణాలుంటాయి. అలాగే పోతన రాసిన ‘శ్రీమద్భాగవతం’ మొత్తం మీద ప్రధాన కథానాయకుడు శ్రీ కృష్ణుడు అయినప్పటికీ, ఆయన జీవన ఘట్టాలన్నీ చిన్నచిన్న కథలుగా, లీలలుగా ఉండి, కథా లక్షణాలలోని ఉత్సుకతని, ఆసక్తిని పాఠకులలో కలిగిస్తాయి. కాగా, తెలుగులో మొట్టమొదటి సారిగా కథా లక్షణాలతో కూడిన రచనను 1911లో “దిద్దుబాటు” అనే కథ ద్వారా గురజాడ అప్పారావు చేశారని  భాషావేత్తలు, చరిత్రకారులు గతంలో నిర్ధారించారు. కానీ తర్వాత జరిగిన పరిశోధనల్లో వెల్లడైన ఒక అద్భుతం ఏంటంటే, భండారు అచ్చమాంబ 1910 ప్రాంతంలోనే చక్కని కథా లక్షణాలతో కూడిన కథా సాహిత్యాన్ని సృష్టించింది అని తెలుస్తోంది. “ధనత్రయోదశి” వంటి స్థానిక సాంస్కృతిక నేపథ్యంతో కూడిన వస్తువులతో ఈ ఆమె కథల్ని సృష్టించారు. ఈ లెక్కన తెలుగులో తొలి కథా రచయిత్రి భండారు అచ్చమాంబగా మనం చెప్పుకోవచ్చు.

ఇదే సందర్భంలో ఒక మనో వైజ్ఞానిక పరమైన అంశాన్ని కూడా మనం గమనించాలి! కథన శైలి, కథా సంప్రదాయం, కథలు (Narrative style) చెప్పగలిగే విధానం అనేది స్త్రీలకు సహజంగా అబ్బిన సహజాతం అని చెప్పొచ్చు. వారి మాట తీరు, వారు పెరిగిన జీవన విధానం, సామాజిక కట్టుబాట్లు, సంప్రదాయాలు, ఆ ప్రకారం జరిగే అంశాలు అన్నీ కలిసి స్త్రీలలో సహజమైన కథనరీతిని, కథన శైలిని, కథన నైపుణ్యాలను పెంపొందింపజేసి ఉంటాయని Psychologists మానవుల మేధాశక్తు (Cognitive Abilities) ల మీద పరిశోధనలలో తేలింది అని చెప్పొచ్చు.

అందుకే కథలు అనగానే మనకు అమ్మ లేదా అమ్మమ్మలు గుర్తుకు వస్తారు.  అమ్మ చెప్పిన కథలు ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పిల్లలను పెంచడంలో భాగంగా అమ్మ చెప్పే ఎన్నెన్నో కథలు, దాంట్లో జానపద కథలు, నీతి సందేశాన్ని చెప్పగలిగే కథలు, ఇతిహాసాలకు సంబంధించిన కథలు, వివిధ మానవ మనస్తత్వాన్ని చూపించగలిగిన కథలు కూడా ఎన్నో మనకు అమ్మల ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి కథలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఆ లెక్కన మన శాస్త్రవేత్తలు నిరూపించిన సత్యం ప్రకారం స్త్రీలు చక్కని కథన నైపుణ్యం కలిగిన మానవులు అనేది అతిశయోక్తిగా అనిపించదు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా కథా సాహిత్యంలో స్త్రీలు విస్తృతంగా కృషి చేశారు.

ఇక, తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ కూడా చాలా మంది మహిళలు చక్కని కథా సేద్యం చేసి తెలంగాణ సాహితీక్షేత్రంలో గొప్ప పంటను పండించారు. వారిలో నందగిరి ఇందిరాదేవి, బొమ్మ హేమాదేవి, పాకాల యశోదారెడ్డి లాంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. సమకాలీన కాలంలో లెక్కకు మిక్కిలి చక్కని కథా రచయిత్రులు తమదైన శైలిలో వివిధ రకాల జీవన విలువలను, సంప్రదాయాలను తమ కథల్లో ప్రతిబింభింపజేస్తూ వస్తున్నారు.

అయితే తెలుగులో కథాసాహిత్య పరిణామంలో మొదటగా కుటుంబ కథా వస్తువులే  ప్రధానాంశంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో అభ్యుదయవాదానికి సంబంధించిన కథా వస్తువు, ఆ తర్వాత విప్లవ కథా వస్తువు, ఆ తర్వాత అస్తిత్వవాద ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన కథా వస్తువులుగా కథా సాహిత్యాన్ని విస్తృతంగా ఆయా రచయితలు సృష్టించారు. అస్తిత్వవాద కథా సాహిత్యంలో స్త్రీవాదం, మైనారిటీవాదం, దళితవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం ప్రధాన భూమికను పోషించాయి. ఇలాంటి కథాసాహిత్యం గత రెండు మూడు దశాబ్దాల కాలం నుంచి సృష్టించబడుతుంది. "There's always room for a story that can transport people to another place." అని ప్రఖ్యాత Harry Potter Series గ్రంథాల రచయిత్రి J.K. Rowling అన్నట్లు పాఠకులను, ప్రజలను అక్షరాల వెంట పయనింపజేస్తూ, ఆయా నేపథ్యాలతో మమేకం అయ్యేలా చేయగలిగే సత్తా ఉన్న కథలను ఎన్నిటినో ఈ వాదాలు తెలుగు సాహిత్యానికి అందించాయి.

ఈ క్రమంలో ఆయవాదాల నేపథ్యంతో కథా సాహిత్యం ప్రజలందరిలో ఒక చైతన్యాన్ని, ఒక ఆలోచనని, ఒక జాగృతిని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అలాగే అంబేద్కర్ వాదాన్ని, బుద్ధుడి బోధనలను, మరొకవైపున సర్వమానవ సమానత్వాన్ని చెప్పగలిగిన కథలు కూడా ఎన్నో వచ్చాయి.

అలా ఒక వైపు తెలుగు సాహిత్యాన్ని, తెలుగులో కథా సాహిత్యాన్ని అధ్యయనం చేసి, మరొక వైపు తమకు ఎదురైన జీవితానుభవాలు, తమ జీవితంలో ఎదురైన సంఘటనలు అన్నిటినీ క్రోడీకరించి తమదైన గొంతుతో, తమదైన స్వరంతో, తమదైన అక్షరాన్ని సృష్టించే ప్రయత్నాలను రచయితలు చేసారు, చేస్తున్నారు.

మరోవైపున 2020 జనవరిలో మనదేశంలో మహమ్మారి విజృంభించింది. మానవ జాతి చరిత్రలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. మార్చి 23న మనదేశంలో 'జనతా కర్ఫ్యూ', ఆ తర్వాత 'లాక్ డౌన్' ప్రారంభమయింది. అప్పటిదాకా సూపర్ సానిక్ వేగంతో, కాంతి సంవత్సరం అంత దూరాలను కూడా అధిగమించేంత స్థాయిలో దూసుకువెళ్తున్న మానవ మస్తిష్కం, ఒక్కసారిగా ఫ్రీజ్ అయినట్లయింది. ఎక్కడి వారు అక్కడే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఒక మనిషిని మరొక మనిషి నమ్మలేని పరిస్థితి వచ్చింది. 'మానవుడు సంఘజీవి' అన్న అరిస్టాటిల్ మాట ఇప్పుడు ప్రశ్నార్థకమై పోయింది. అప్పటిదాకా నిర్మించుకున్న వ్యవస్థలు, నిర్వచనాలు, నమ్మకాలు, అన్నీ సందిగ్ధంలో పడ్డాయి. ప్రజలందరూ సంక్షోభంలో పడ్డారు.

ఇలాంటి విపత్కర, విస్మయ విహ్వల పరిస్థితిలో రచయితలు, కవులు, సృజనకారులు, మొదట్లో కొంత స్తబ్దంగా అయిపోయారు, వెంటనే తేరుకుని తమ కలలకు పదును పెట్టారు. అక్షరాలలో తమ స్పందనకు తెర లేపారు. కొత్త కథ, కవిత వస్తువు పుట్టింది. ఇంకేం, ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో గుర్తించడం ద్వారా ఎన్నెన్నో కవితలు, కథలు పుట్టుకొచ్చాయి. తెలుగు వాళ్ళు కూడా వెంటనే స్పందించారు.

సమకాలీన సమాజంలో మనుషుల మధ్య ఉన్న వైరుధ్యాలు, మానవ సంఘర్షణలు, హెచ్చుతగ్గుల తారతమ్యాలు, కులపరమైన వివక్షలు, ఆ వివక్ష నుంచి పుట్టిన ఆవేదనలు, వాటిల్లోంచి ఎగిసిన నిరసనలు, వీనిటన్నిటి కథల రూపంలో డాక్యుమెంట్లు చేసిన రచయితలు 'కరొన'ను కూడా కలుపుకొని, సమకాలీన సామాజిక, మానవీయ కథలను, వైరుధ్యాల స్పందన, వైరుధ్యాలు .

అలాగే, కథా రచయితకి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే! తన చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను, వ్యక్తిత్వాలను, వివిధ సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలలో వారి ప్రవర్తనా రీతులను నిరంతరం గమనిస్తూ ఉండటం, గమనించిన వస్తువులను అక్షరీకరించగలిగే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండటం కథారచయితకి ఉండాల్సిన గొప్ప లక్షణాలు!

అంతేగాకుండా రచయితకు ఒక హృదయనేత్రం ఉంటుంది! ఒక సృజనాత్మక దృక్కోణం ఉంటుంది! ఒక సామాజిక దృక్పథం ఉంటుంది! ఆ కళ్ళకి ఒక సామాజిక బాధ్యత ఉంటుంది!

వీటన్నింటి వల్ల కథకుల నుంచి ఇప్పటివరకు వచ్చిన, ఇపుడు వస్తున్నరచనలు కానీ, రాబోయే కాలంలో వచ్చే కథలు గానీ, మరింత సమాజహిత భావనతో, సమాజంలో ఉండే అంతరాలపై ఎక్కుపెట్టే బాణాలుగా, మార్పుకి సంకేతంగా నిలుస్తాయని ఆశించవచ్చు. కొత్త ఆలోచనలకి ఉద్దీపనలుగా ఉంటాయని భావిస్తున్నట్లు అమెరికన్ ఇండియన్లలో ఒక జాతి అయిన హోపి జాతి ప్రజలలో ఉండే సామెత "కథలు చెప్పే వారు ప్రపంచాన్ని శాసిస్తారు." అన్న మాటను నిజం చేసేలా ఉంటాయని ఆకాంక్షించవచ్చు.

No comments:

Post a Comment