Here, it's my poem PRAKRUTHI.. PANCHA BHOOTALU.. O PRAYANAM!!, published in NAVA TELANGANA news paper on 1-6-2020..Plz read..
ప్రకృతి ...పంచభూతాలు... ఓ ప్రయాణం ...!
---- మామిడి హరికృష్ణ 8008005231
1. అర్ధాంతరంగా అనాలోచితంగా ప్రయాణం మొదలెడతాను
దిక్కులు తెలీదు – దిక్సూచీ లేదు
వెలుతున్నది సాగరంలోకి – అరణ్యానికి –
ఎడారికి – మంచులోయలోకి
మరే భౌగోళిక ఖండాంతరంలోకో అంతకన్నా తెలీదు
తెలిసిందల్లా ఒక్కటే
ఈ గమనం ప్రకృతిలోనికే అనీ.. ప్రేమలోకే అనీ.. !
2. అలలు అలలుగా ఒకసారి- తాటిచెట్టు ఎత్తులో మరోసారి
సాగరంలో కెరటాలు ఎగిసిపడతాయి
తడిసిపోతాను ....మునిగిపోతాను.... తేలిపోతాను...
ఈదులాడతాను... ఎదురువెళతాను...ఎగసి దూకుతాను
ఆల్చిప్పలను, ముత్యాలను అన్వేషిస్తూ
సముద్రపు లోతుల్లోకి దూసుకెళతాను!
3. గడ్డిపూవులా నేలబారుగా ఒకసారి
ఆకాశంలోకి తలను చొప్పించి మహావృక్షంగా మరోసారి
నేల అంతా సమాంతరంగా నిలువుగా విస్తరించిన వనం
అడవంతా పరుచుకున్న లతలు, వృక్షశాఖలు
కిరణాలను సైతం నేలను చుంబించనీయని చిక్కని ఆకులు
అష్ట దిశలా
పత్రహరితాలు – పూలు – కాయలు – పండ్లు
హరిణాలు – నెమల్లు – కుందేళ్ళు – కోయిలలు!
పల్లవిస్తాను.. పరవశిస్తాను ...పరిమళిస్తాను...
పలవరిస్తాను.. పడిపోతాను... పరుగెత్తుతాను...
ఒత్తిగిలి మత్తుగా పడుకుంటాను..
నా పాట నేనే నాలో కొత్తగా పాడుకుంటాను!
ఆకుపచ్చని లోకాన్ని –
అరణ్య గంభీర సౌందర్యాన్నివెదుక్కుంటూ
చెట్టు తొర్రల లోలోపలి పొరల్లోకి పొర్లుతాను!
4. రేణువులు రేణువులుగా విస్తరించిన ఇసుక
దిబ్బలు దిబ్బలుగా పేరుకుని
నేల అంతటా మట్టి రంగు అలికినట్లు
కంటికి ఆనేంత దాకా వ్యాపించిన ఎడారి
పాదా పాదానా కూరుకుపోయే అడుగులు
నిట్టనిలువు ఎండజాడలలో కరిగిపోయే మడుగులు
అర్థరాత్రి వెన్నెలలో చల్లబడే మనసులు
చిందరవందర ఔతాను...చంచలిస్తాను..
చమటలు కారతాను.. చిచ్చర పిడుగునై రెచ్చిపోతాను..
చంద్రున్ని వెదికి పట్టుకొని
పెదాలతో చుంబించి చాపంలా మెరుస్తాను..!
5. ఇంటికప్పులపై – దేవదారు వృక్షాలపై – పర్వతాలపై
లోయ అంతటా దూదికుప్పలు పోసినట్లుగా మంచు
నది కూడా ఘనీభవించి ప్రవాహ ధర్మాన్ని మర్చిపోయేలా చేసి
లోకాన్నంతా ధవళ వర్ణాలతో ముంచేసి
రక్త కణాలను సైతం గడ్డ కట్టించే శీతల హిమసమూహం!
నిశ్చలుణ్ణి అవుతాను ... నిర్విణ్ణున్ని అవుతాను..
నిబ్బరపడతాను... నిర్లిప్తుణ్ణి అవుతాను
నిగిడిపోతాను...నిగారింపు తేలుతాను !
6. నా వెంట ఏవీ తెచ్చుకోలేదు -
వాహనం – నావ – ఒంటె – స్లెడ్జ్
తలపైకి హ్యాట్ – డైవింగ్ సూట్ – హార్డ్ షూస్ – స్వెటర్ ఏవీ లేవు
నాతో ఏవీ అమర్చుకోలేదు-
ఆయుధాలూ -ఆసరా- ఆర్భాటం- అనుచర వర్గం ఏవీ లేవు
ఉన్నదల్లా నేను.... నా మేను మాత్రమే...!
అగ్ని విశ్వాసం – జల సంకల్పం
వాయుగమనం – ధాత్రీ సహనం
ఆకాశ లక్ష్యం మాత్రమే ...!
7. వాలిన దిక్కుకి ఇటు ఒడ్డున
ఇప్పుడు అర్థమయిందల్లా ఒక్కటే --
ఈ ప్రస్థానం పంచభూతాలలోనికే అనీ..
ప్రణయంలోనికే అనీ ... !!
No comments:
Post a Comment