*తెలంగాణ చరిత్ర శాసనశాస్త్ర ఆవశ్యకత!*
ఆది 06 ఫిబ్రవరి 01:28:42.157631 2022
కష్ట ప్రయాసలతో కూడిన శాసనాల అధ్యయనం వల్ల వెల్లడయ్యే విశేషాలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే, శాసనాలను అధ్యయనం చేసే మెళకువలను, నైపుణ్యాలను సరళీకరణ చేయడం ద్వారా మాత్రమే చరిత్ర నిర్మాణంలో మరింకెంతో మందిని భాగస్వామ్యం చేయడం సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని సులభతరం చేయడంలో ఇటీవల ప్రచురించిన ''మీరూ శాసనాలు చదవవచ్చు'' పుస్తకం దోహదపడుతుంది. సాధారణంగా ఏ శాస్త్రవేత్త అయినా తనకు తెలిసిన జ్ఞానాన్ని లేదా కొన్ని ఏళ్ళపాటు తను సాధించిన పరిజ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోవాలి అని లేదా తనే కాపీరైట్‌గా మారాలని అనుకోవడం సాధారణం కానీ తను సాధించిన జ్ఞానాన్ని, తను సంపాదించిన విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి. మరింత మంది తర్వాతి తరం యువకులకు మార్గదర్శకం కావాలి. ఒక కఠినమయిన శాస్త్రాన్ని సరళీకరణ చేయడం ద్వారా మరింత మంది తర్వాతి తరం పరిశోధకులకి దారిని సుగమం చేయాలనే ఒక నిస్వార్ధత, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.
Epigraphy is a prime tool in recovering much of the first hand record of antiquity. శాసన శాస్త్రం గురించి ప్రఖ్యాత ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చెప్పిన మాటలివి. సాధారణంగా చరిత్ర ఒక నీటి చెలిమె లాంటిది. తవ్వుతున్న కొద్దీ ఊట లాగా ఎన్నో విషయాలు, వింతలు ప్రపంచానికి తెలియని మరెన్నో సత్యాలు వెలుగులోకి రావడం సహజమే!
నిజానికి చరిత్రను నిర్దిష్ట శాస్త్రంగా మార్పు లేని విషయంగా గమనిస్తారు. కానీ చరిత్రకు ఉన్నంత నమ్యత (Flexibility),, నవ్యత (Novelty)ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలని ఆహ్వానించగలిగే తాత్త్వికత (Philosophy to welcome new discoveries)మరి ఏ శాస్త్రానికి లేదేమో అనిపిస్తుంది.
నిన్నటివరకు ఇది చరిత్ర అనుకున్నది కొద్దికాలం తర్వాత జరిగిన నూతన అన్వేషణలు, నూతన ఆవిష్కరణల (New Revelations)వల్ల ఆ చరిత్ర మారడమో మరింత ముందుకు వెళ్లడమో లేక అప్పటి దాకా అనుకున్న చరిత్రకు కొత్త జోడింపు రావడమో జరుగుతుంది. అలా చరిత్ర ఎప్పుడూ నిర్మాణమవుతూ వెళుతుంది. దీనికి సింధూ నదీ నాగరికతే ఒక గొప్ప ఉదాహరణ.
1920 దశకం వరకు ప్రపంచం మొత్తం మీద ప్రాచీన నాగరికతలుగా మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, గ్రీకు నాగరికత, చైనా నాగరికత మాత్రమే చెప్పుకోవడం జరిగింది. కానీ 1920 తర్వాత అవిభక్త భారతదేశంలో నూతన రైలుమార్గం వేయడం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు సింధూ నది పరివాహక ప్రాంతంలో ప్రాచీన నాగరికత అవశేషాలు బయట పడడం జరిగింది.
సర్ జాన్ మార్షల్, దయారామ్ సాహ్ని నేతృత్వంలో అక్కడ త్రవ్వకాలు జరపడం ద్వారా క్రీస్తుపూర్వం నాటి గొప్ప నాగరికత ఒకటి భారతదేశంలో విలసిల్లింది అని నిరూపించగలిగే చారిత్రక ఆధారాలు బయల్పడ్డాయి. హరప్పా, మొహంజోదారో వంటి ప్రాచీన నగరాలు వెలుగులోకి వచ్చాయి.
చైనా నాగరికతకు, ఈజిప్టు నాగరి కతకు, గ్రీకు నాగరికతకు, మెసప టోమియా నాగరికతకు తీసిపోని ఒక వైభవోపేతమైన ప్రాచీన నాగరికత భారత దేశంలో సైతం విరాజిల్లింది అని చెప్పగలిగిన గొప్ప ఆధారాలూ వెలికి వచ్చాయి.
ఈ ఉదాహరణను బట్టి మనకి అర్ధమయ్యేది ఏంటంటే చరిత్ర ఎప్పుడూ నిరంతర నిర్మాణ శాస్రమే (Ever construct ing science). అందుకే చరిత్రకి ఇది అంతం అనేది ఉండదు. చరిత్రకు ఫుల్ స్టాప్ లేదు, కామాలు మాత్రమే ఉంటాయి !
ఇలాంటి చరిత్ర ద్వారా ప్రతి సమాజానికి, ప్రతి జాతికి, మనుషులకి తన పూర్వీకుల గురించి, తమ కన్నా ముందు తరాల జీవన సంస్కృతి నుంచి ఇతర ఎన్నో అంశాలను అర్థం చేసుకోవడానికి, దాని ఆధారంగా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక ప్రాతిపదిక దొరుకుతుంది!
*'చరిత్ర'తో ప్రయోజనం?*
చరిత్ర వల్ల లాభం ఏంటి? అనేది ఎన్నో ఏళ్ల నుంచి అందరినీ వేధించే ప్రశ్న! చరిత్రవల్ల మానవజాతి ప్రస్థానం తెలుస్తుంది.! మన పరిణామం అర్థమవుతుంది.! నేటి తీరుకి, తరహాకి, తరీఖాకి మూలాలు ఎక్కడున్నాయో అవగతం అవుతుంది! ఇప్పుడు చూస్తున్న మహావృక్షపు కొమ్మల మూలాలు, వ్రేళ్ళు ఎక్కడున్నాయో అర్ధమైతే దాన్ని బట్టి ఆయా జాతులు, 'మనుషులు', దేశాలు, ప్రదేశాలు, ప్రాంతాల చరిత్రను మిగతా అన్ని అంశాలను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
మొత్తంగా మానవజాతిలోని వైవి ధ్యత (Diversity)ను, వైవిధ్యతలోని విశిష్టత (Uniqueness) ను, విశిష్టతలోని విభిన్నత (Difference) ను, విభిన్నతలోని ప్రాముఖ్యత (Significance) ను గౌరవిం చడానికి మనందరికీ ఒక ఆదరువు దొరుకుతుంది. అందుకే చరిత్ర అధ్యయనం అంటే కేవలం సంవత్సరాలు, సంఘటనలు, వీరుల గాధలు, రాజ్యాలు, రాజభోగాలు, కట్టడాలు, నిర్మాణాలు, కోటలు మాత్రమే కాదు.
చరిత్ర అంటే - మొత్తం మానవాళి సామూహిక జ్ఞాపకాల సంకలనం...! (Collection of collective memories of mankind)
చరిత్ర అంటే - మనిషి మేధస్సు అట్టడుగు పొరల్లో దాగి ఉన్న సమూహ కార్యాల పునర్దర్శనం (Revisiting of collec tive efforts). ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన చరిత్రను నిర్ధారించే ఆధారాలలో పురావస్తు ఆధారాలు(Archaeological Resources) లిఖిత ఆధారాలు(Written documents),ఎన్నో ఉన్నాయి. వాటిలో విశిష్టమైనవి శాసనాలు (Inscriptions), ఆ శాసనాలకు సంబంధించిన అధ్యయన శాస్త్రం ఎపిగ్రఫీ!
ప్రాచీన కాలం నుంచి, మధ్య యుగాలు, ఆధునిక కాలం వరకు ప్రతి సందర్భంలో ఏదో ఒక అంశంపై రాజులు, రాజ్యాలు, దేశాలు శాసనాలను వేయించడం ద్వారా తమ విధానాన్ని, తమ పాలన రీతిని, తమ సంస్కరణ దృక్పథాన్ని, అనాటి సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, చారిత్రక పరిస్థితులని ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అందుకే శాసనాలు చరిత్ర నిర్మాణానికి ఒక ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయి. శాసనాలు చరిత్ర రచన శాస్త్రానికి(Historiography) గొప్ప ఆసరాను అందిస్తున్నాయి.
*శాసన శాస్త్రం అంటే ఏంటి?*
రాళ్లు, శిలలు, రాతి స్తంభాలు, దేవాలయ కుడ్యాలు, రాగి పలకలు వంటి వాటిపై రాసిన భాష విషయ విశేషాలను అధ్యయనం చేసి చరిత్రను నిర్మించే శాస్త్రమే శాసనాల శాస్త్రంగా చెప్పవచ్చు. ఇక ఈ శాసనాలు మనకు ప్రధా నంగా శిలలపై, లోహాలపై, మట్టి పాత్రలపై, కలపపై, తాళపత్రాలలో, వస్త్రాలపై, శంఖువులపై, కుడ్య చిత్రాలు, నాణాలపై మనకు కనిపిస్తాయి !
అయితే శాసన శాస్త్రం ఇలాంటి ప్రాచీన వస్తు సంస్కృతులకి ఆధారంగా ఉన్నప్పటికీ నిజానికి ఇది ఒక భాషాశాస్త్రం (Linguistics), ఒక లేఖనశాస్త్రం (Graphology), భాషా పరిణామ విశ్లేషణ శాస్త్రం (Philology), అలాగే పద పరిణామ విశ్లేషణ శాస్త్రం (Etymology) వంటి మరెన్నో శాస్త్రాలు కలిసిన బహుళశాస్త్రం.
ఎపిగ్రఫీ ప్రధాన ఉద్దేశాలు సాధారణంగా రెండుగా కనిపిస్తాయి:
1. చేసిన పనులు, చట్టాలు లేదా నిర్ణయాలు క్షయం నాశనం కాకుండా పది కాలాల పాటు: నిలిచిపోవాలనేది.
2. ఒక తరం నుంచి మరో తరానికి ఆనాటి సంప్రదాయ విధానాల గురించిన జ్ఞానాన్ని ఎరుకను బదిలీ చేయడం అనేది.
అయితే చరిత్రను నిర్మించడంలో పురా వస్తువులు, శిలాజ అవశేషాలు, మట్టి పాత్రలు, శిల్పాలు, చిత్రాలు, తాళపత్ర గ్రంధాలు కూడా ఎంతో ఉపకరిస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిని చరిత్ర నిర్మాణంలో ప్రాథమిక ఆధారాలుగా, ప్రాథమిక సాక్ష్యాలుగా భావించవచ్చు.
అలాగే ఈ శాసనాలలోని అంశాలు, విషయాలు, విశేషాల ఆధారంగా ఆయా కాలాలనాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక, పురావస్తు విధమైన ప్రాచీనతను, సమాజ పరిణామాన్ని నిర్ధారించడానికి మనకు అవకాశాలు ఏర్పడతాయి.
*ఏ భాషలో ఎన్ని శాసనాలు?*
''జర్నల్ ఆఫ్ ది గ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా'' వాల్యూమ్ 19-1903 ప్రకారం భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి అంటే లిపి పుట్టిన నాటి నుంచి భాషల వారీగా శాసనాల గురించిన ఎన్నో విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. దానిలో ఏ భాషల్లో ఎన్ని శాసనాలు ఇప్పటి వరకు వచ్చాయనే సంఖ్యాత్మకమైన పరిశోధనలు కూడా వారు చేశారు. దాన్ని అనుసరించి భారతీయ భాషలలో అత్యధికంగా తమిళ భాషలో 20 వేలకు పైగా శాసనాలు లభ్యమవుతున్నాయి అని తెలిపారు. భారతీయ భాషలు అన్నిటి లోకల్లా ప్రాచీన భాషగా తమిళం ఉండటం వల్ల, ప్రాచీనకాలం నుంచే శాసనాలు వేసే సంప్రదాయం బహుశా తమిళ భాషలో మొదలవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం!
అలాగే ఇప్పటి వరకు లభించిన వాటిలో కన్నడ భాషలో దాదాపు 10,600, సంస్కృత భాషలో 7500 వరకు శాసనాలు వివిధ కాలాల నాటివి లభిస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన చారిత్రిక పరిశోధనల్లో వెల్లడైన శాసనాల సంఖ్య 4,500 కు పైగా ఉంది.
వీటన్నిటి ద్వారా ప్రాంతాలు, రాజ్యా లు, రాజ్యాల కాలమునాటి ఎన్నో విషయాలు, పాలనాపరమైనవి, సామా జిక, ఆర్థికపరమైన, విశ్వాసాల పరమైనవి ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
అందుకే మనిషి పరిణామంలో ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి శాసన శాస్త్రం ఒక్క గొప్ప ఆధారంగా ఉంటూ వస్తుంది!
ఇక ఇప్పటివరకూ లభ్యం అవుతున్న శాసనాల ఆధారంగా ఈ శాసనాలను రూపొందించే విధానంలో ఓ ప్రత్యేకత కనిపిస్తుంది.
శాసనాలు చేసే ఆకరాలు (sources) అంటే మాధ్యమాలుగా రాళ్లు (Rocks/stones), లోహాలు (Metal), మట్టి అంశాలు (Mud Works), కర్రకు సంబంధించిన అంశాలు (Wood works), వస్త్రాలు (Clothes), గోడలు (Walls), నాణాలు (Coins) వంటివి ఉండగా ఈ వేసే విధానం (టెక్నిక్)లో కటింగ్, కార్వింగ్, క్యాస్టింగ్, ఎంగ్రేవింగ్, ఎంబోసింగ్, స్క్రాచింగ్, డ్రాయింగ్ వంటి విధానాలు లేదా నైపుణ్యాలు మనకు కనిపిస్తాయి.
ఇలా చేయడం వల్ల కాల పరిణామంలో రుతువుల మార్పులను అతిక్రమించి, ఆయా మాధ్యమాల మీద రాయబడిన రాతలు, చెక్కబడిన విషయాలు క్షయం కాకుండా నిలిచి ఉండటానికి అవకాశం ఏర్పడింది.
*బహుశాస్త్రాల మేళవింపు*
ఇక శాసనాల అధ్యయనం ఒక బహుముఖీన శాస్త్రాల అధ్యయనంగా భావించవచ్చు. ఉపరితలం నుంచి చూస్తే ఇది కేవలం శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రంగా కనిపించవచ్చు. కానీ ఒక శాసనాల అధ్యయన కర్తకి మరెన్నో శాస్త్రాల గురించిన అవగాహన కూడా అవసరం. దీనిలో చరిత్ర రచన శాస్త్రం(Historiography) తెలిసుండాలి. భాషాశాస్త్రం, సోషియాలజీ, ఆర్కియాలజీ, కార్బన్ డేటింగ్ టెస్ట్ లాంటి ఇతర సాంకేతిక శాస్త్ర నైపుణ్యాలు కూడా ఒక శాసన అధ్యయన శాస్త్రవేత్తకి అవసరంగా ఉంటాయి! అందుకే శాసనాల ఆధారంగా చరిత్రను నిర్మించడం అనేది ఒక బహుళ విషయాల సమీకృత అంశం (Multi Disciplinary Approach) గా భావించాలి.
ఇలా ఎన్నెన్నో అధ్యయనాల తర్వాత శాసనాల ఆధారంగా చరిత్రని నిర్మిస్తున్నప్పుడు, చరిత్రకారుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవడం కూడా సహజమే. తను అర్ధం చేసుకున్న ఒక శాసనం ఆధారంగా తను అర్ధం చేసుకున్న విషయాల సాధికారత (Authority), (Authenticity),, సార్వజనీనత (Unive rsality), ప్రామాణికత (Standardization), విశ్వసనీయత(Reliability) అనేవి ప్రశ్నార్ధకంగానే ఉండిపోతాయి. అందుకే చరిత్రకారుడు కానీ శాసన అధ్యయన కారులు గాని తమ పరిమితులకు అతీతంగా సబ్జెక్టివ్ అప్రోచ్ లో కాకుండా విషయాత్మక ఆలోచనలతో ఒక విస్తృత పరిశీలనా దృక్పథంతో విశ్లేషణ చేయాల్సి ఉంటుంది.
ఇది ఎంతో క్లిష్టమైన, కష్టమైన పని. అయితే ''కవిత్వం ఒక ఆల్కెమీ! దాని రహస్యం కవికి మాత్రమే తెలుసు'' అనే వాక్యం ఎలా ఉందో ''చరిత్ర కూడా ఒక ఆల్కెమీ! దాని రహస్యం చరిత్రకారుడికి మాత్రమే తెలుసు!'' అని భావించాలి.
ఆ విధంగా శాసనాల గురించిన అనుపానులు, శాసనాలలోని విశేషాల విశ్లేషణ, శాసనాలలో నిబిడీకృతమైన అంశాల ప్రామాణికత, వాటి నిర్ధారణ (Authorisation) అన్నీ కూడా శాసన అధ్యయన శాస్త్రవేత్తకు ఉండే జ్ఞానం వల్లనే సాధ్యమవుతాయి.
*తెలంగాణ చరిత్ర - శాసనశాస్త్రం*
భారతదేశంలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇప్పటికీ వెలుగు చూడకుండానే ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంత ప్రాచీనత గురించిన పరిశోధనలు మళ్ళీ మొదలయ్యాయి. శ్రీమతి కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ జాగృతి' సంస్థ, తెలంగాణ సాంస్కృతిక విషయాలు, బతుకమ్మ పండుగ వంటి వాటితో పాటు విస్మృత తెలంగాణ చరిత్రపై విస్తృతంగా పరిశోధనలు ప్రారంభించింది. 2009లో తెలంగాణ జాగృతికి అనుబంధంగా తెలంగాణ చరిత్ర విభాగాన్ని మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్‌లతో ఏర్పాటు చేసి, వారి సారథ్యంలో పరిశోధనను నేటికీ నిర్వహిస్తూ వస్తోంది.
గతంలో ఆదిరాజు వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, బి.ఎన్. శాస్త్రి, గులామ్ ఎజ్డానీ మొదలగు చరిత్రకారులు ఈ రంగంలో చేసిన అవిరళ కృషి ఫలితంగానే ఇప్పటికి అందుబాటులో ఉన్న చరిత్ర నిర్మాణమయింది. దీన్ని ఇపుడు కొనసాగించడం, మరింత ముందుకు తీసుకెళ్లడం అవసరం.
అయితే తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళు ముఖ్యంగా సాహిత్య చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కరీంనగర్ బొమ్మలగుట్టపైన 'కురిక్యాల శాసనం' లో (జినవల్లభుడు వేసినది) కనిపిస్తాయి. అంతకు ముందు క్రీ. పు. 6వ శతాబ్ది కాలం నాటి బౌద్ధ, జైన కట్టడాల వద్ద వేసిన ప్రాకృత, బ్రాహ్మీ శాసనాలు, షోడష మహాజన పదాల కాలంలో అస్మక రాజ్యంగా ఉన్న బోధన ప్రాంతంలో వేయించిన శాసనాలు, శాతవాహనుల కాలంలో, ఆ తర్వాత కాకతీయుల కాలం, ఆ తదనంతరం కూడా ఎన్నెన్నో శాసనాలు తెలంగాణా నేల నలుచెరగులా స్థాపించడం జరిగింది. ఇవేకాక, కుతుబ్ షాహీలు, ఆ తర్వాత అసఫ్ జాహీల (నిజాంలు) కాలంలో వేసిన పర్షియన్, అరబిక్, ఉర్దూ శాసనాలు కూడా డికోడ్ చేయవలసి ఉంది. అలా వందలాది శాసనాలకు నెలవుగా తెలంగాణ ఉంది. అయితే ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నీ ఇంకా పరిపూర్ణం కావలసి ఉంది.
ఇలా రాష్ట్రంలోని వేర్వేరు దేవాలయాలు, చెరువు గట్టులు, గ్రామాలలో వెలుగు చూసిన శాసనాలను సేకరించడం, వాటి కాలాలను నిర్ధారించడం, ఆ శాసనాలలోని విషయాలను చదవడం, అధ్యయనం చేయడం, ఆ విషయాల ఆధారంగా ఇప్పటికే మనకు తెలిసిన చరిత్రకు అదనపు సమాచారాన్ని లేదా కొత్త సమాచారాన్ని జతచేయడం అనేవి ప్రస్తుతం గొప్ప లక్ష్యాలు. వీటన్నిటినీ పరిష్కారం చేస్తే ఇంకా ఎన్నెన్నో చరిత్ర విశేషాలు లోకానికి వెల్లడి అవుతాయి.
అయితే ప్రస్తుత కాలంలో ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన ఈ శాసనా శాస్త్రవేత్తలు మనకు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉన్నారు. మరి అసంఖ్యాకంగా లభిస్తున్న శాసనాలను పరిష్కరించడానికి శాసన శాస్త్రవేత్తలు ఎంతో మంది అవసరం అవుతారు. అందుకని ఇప్పుడు శాసన అధ్యయనవేత్తల ఆవశ్యకత ఎంతగానో ఉంది.
*శాసనాలను ఎవరైనా చదవవచ్చా?*
ఇలాంటి కష్ట ప్రయాసలతో కూడిన శాసనాల అధ్యయనం వల్ల వెల్లడయ్యే విశేషాలన్నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే, శాసనాలను అధ్యయనం చేసే మెళకువలను, నైపుణ్యాలను సరళీకరణ చేయడం ద్వారా మాత్రమే చరిత్ర నిర్మాణంలో మరింకెంతో మందిని భాగస్వామ్యం చేయడం సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని సులభతరం చేయడంలో ఇటీవల ప్రచురించిన ''మీరూ శాసనాలు చదవవచ్చు'' పుస్తకం దోహదపడుతుంది.
సాధారణంగా ఏ శాస్త్రవేత్త అయినా తనకు తెలిసిన జ్ఞానాన్ని లేదా కొన్ని ఏళ్ళపాటు తను సాధించిన పరిజ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోవాలి అని లేదా తనే కాపీరైట్‌గా మారాలని అనుకోవడం సాధారణం కానీ తను సాధించిన జ్ఞానాన్ని, తను సంపాదించిన విజ్ఞానాన్ని సమాజానికి అందించాలి. మరింత మంది తర్వాతి తరం యువకులకు మార్గదర్శకం కావాలి. ఒక కఠినమయిన శాస్త్రాన్ని సరళీకరణ చేయడం ద్వారా మరింత మంది తర్వాతి తరం పరిశోధకులకి దారిని సుగమం చేయాలనే ఒక నిస్వార్ధత, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది.
ఈ గ్రంథం చదివిన తర్వాత, శాసనాల గురించి ఏమాత్రం తెలియకపోయినా చివరి పేజీ ముగించిన తర్వాత, శాసనాలను అధ్యయనం చేయాలనే ఆసక్తి, మనం కూడా శాసనాలను చదవగలం అనే ఒక ధైర్యం, శాసనాలను మనం కూడా విశ్లేషించగలుగుతాము అనే ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే అంత చక్కగా ఎంతో విడమరిచి, సరళంగా, సులభశైలిలో ప్రతి శాసనానికి సంబంధించిన అంశాలనీ, భాషావిశేషాలని, లిపి పరిణామాన్ని కూడా విస్తరిస్తూ, వివరిస్తూ విశ్లేషిస్తూ కొన్ని కేస్ స్టడీస్ ని కూడా ఉదహరిస్తూ వాటి ఆధారంగా చరిత్ర నిర్మించిన విధానాన్ని మనకు ఈ గ్రంథంలో ఈమని శివనాగిరెడ్డి గారు ఎంతో చక్కగా పామరులకు సైతం అర్ధం అయ్యేలాగా వివరించారు.
గతంలో మనకు ''30 రోజుల్లో మలయాళ భాష'' సిరీస్‌తో కొన్ని పుస్తకాలు వచ్చేవి. ఇంగ్లీషులో యూరప్‌లో ఈ సంప్రదాయం ఉంది. 'ఇంగ్లీష్ లర్నింగ్' అనే పేరుతో ఇంగ్లీషేతరుల కోసం కూడా యూరప్ లో కొన్ని పుస్తకాలు సాధారణంగా ఉండేవి. గురజాడ రాసిన కన్యాశుల్కంలో కూడా గిరీశం పాత్ర ''ఇంగ్లీష్ లెర్నింగ్ మేడీజీ'' అనే మాటను వాడటం మనకు తెలిసిందే!
వివిధ రకాల శాస్త్రాలన్నీ వివిధ రకాల భాషలలో సులభగ్రాహ్యంగా ఉండేలా, ఆ భాష తెలియని వారికి సైతం అర్థమయ్యే రీతిలో అందిం చడం పరిపాటి. దీని కోసం కొన్ని ఆధారాల ప్రాతిపదికగా నిర్మించే విధా నం మనకు మొదటి నుంచి ఉంది.
అయితే శాస్త్రాల విషయంలో ఇది కష్టం. ముఖ్యంగా చరిత్ర రచన శాస్త్రంలో, శాసన అధ్యయన శాస్త్రంలో కూడా ఇది కష్టమే అయినప్పటికీ ఒక మహా సంకల్పంతో శాసన శాస్త్రాలను కూడా. సరళీకరించి, అధ్యయనం చేయడానికి వీలుగా ఈ గ్రంథాన్ని ఎంతో చక్కగా ఒక నిర్మాణాత్మక వ్యూహంతో, విషయ నిష్టతో, అన్నిటినీ మించి ఒక సామాజిక ప్రయోజన దృక్పథంతో రాయడం గొప్ప విశేషం!
ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఇప్పటికే ఉన్న, కొత్తగా వెలుగు చూస్తున్న శాసనాలను అధ్యయనం చేయడం, వాటిని రికార్డు చేసి, ఇప్పటివరకూ తెలియని మరెన్నో చారిత్రక విశేషాలను వెల్లడి చేయడం ద్వారా తెలంగాణా చారి త్రక, సాంస్కృతిక, సాహితీ వైభవాన్ని భారతదేశ చరిత్రలో అంత ర్భాగం చేసే అవకాశం లభిస్తుంది. దానికి ఇదే సరైన తరుణం!!
*కొసమెరుపు*
శాసన విశ్లేషణని ఆధారంగా చేసుకొని చరిత్రను నిర్మించే విధానానికి తొలిసారిగా శ్రీకారం చుట్టిన ఘనత జేమ్స్ ప్రిన్‌సెప్ ది. ఆయనను ''ఫాదర్ ఆఫ్ ఎపిగ్రఫీ''గా అభివర్ణిస్తారు. కేవలం 40 ఏళ్ళు మాత్రమే జీవించిన అతను, తాను మొదలెట్టిన శాసన అధ్యయన శాస్త్రానికి ప్రేరణ భారతీయ శాసనాల నుంచి తీసుకోవడం ఇక్కడ దృష్టి. లండన్ నుంచి భారతదేశానికి విచ్చేసిన జేమ్స్‌ప్రిన్‌సెప్ ఇక్కడ ఉండే చారిత్రక కట్టడాలను గమనించి ఎంతో ఆశ్చర్యానికి గురై, సంస్కృత భాషా ఇతర భాషలను నేర్చుకొని ఆ లిపిని గమనించి వాటి ఆధారంగా భారతీయ చరిత్రను నిర్మించే ప్రయత్నం చేశారు.
ఆయన ప్రాచీన భారతదేశానికి చెందిన ఖరోష్టి, బ్రాహ్మీ లిపులను నేర్చుకోవడమే కాకుండా వాటిని అర్థంచేసేవారు కూడా చేశారు. అంతేగాక కోల్ కత్తాలో మొదలైన రసంస్థాపక సంపాదకులుగా ఉండి తను చేసిన పరిశోధనలను, తనలాంటి వారు చేసిన భారతీయ పరిశోధనలను గ్రంథస్థం చేస్తూ పునాదులు నిర్మించే ప్రయత్నం చేశారు.
ఆయన మన దేశంలోని బెనారస్ లో ప్రఖ్యాతిగాంచిన నాణేల ముద్రణశాలలో, లోహ నాణ్యత నిపుణుడిగా పని చేస్తూనే వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, పర్యటిస్తూ చరిత్రకు సంబంధించిన అంశాలను వెలికితీస్తూ భారతీయ ప్రాచీనతకు శాసనాల ఆధారంగా చరిత్రను నిర్మించే గొప్ప ప్రయత్నం చేశారు. ఇప్పుడిక మన వంతు!!
*- మామిడి హరికృష్ణ, 8008005231*
*Website Link: www.navatelangana.com/Sopathi/1132590
*Archived Link: https://web.archive.org/web/20220206042823/http://www.navatelangana.com/Sopathi/1132590