Thursday, 13 May 2021

సేవ దూతలు

 My poetic tribute to NURSING OFFICERS.. #International_Nurses_Day

సేవా దూతలు!

------ మామిడి హరికృష్ణ 8008005231


ఇప్పటిదాకా మనం 

ఎన్నో రకాల దానాల గురించి విన్నాం 

పురాణాల యుగం నుండి పరమాణు కాలం దాకా 

మరెన్నో విధాల సేవల గురించి చదివాం 


కానీ వాళ్ళు-

రాలిపోయే ప్రాణాలను పొడిగించి కాల దానం చేస్తారు 

ఆరిపోయే జీవానికి ఊపిరులూది ఆరోగ్య దానం చేస్తారు!


వాళ్ళు-

జీవన దాతలు- ధవళ వస్త్ర ధారులు 

ఆకాశ దూతలు- ఆరోగ్య ప్రదాతలు 

సంజీవ పర్వతాన్ని భుజాన మోసే నవ చిరంజీవులు !


క్రిమియన్ వార్ నుండి కరోనా వైరస్ వరకు 

క్షతగాత్రులను- వ్యాధి గ్రస్తులను అమ్మలా హత్తుకోవడం 

చేతి కొసల నుండి జీవ ధాతువును ధార పోయడం 

పెదాల అంచుల్లో చిరునవ్వులను ధరించి 

కళ్ళ నిండా కారుణ్యాన్ని వెదజల్లుతూ 

బతుకుకు భరోసాను ఇవ్వడం వాళ్లకు తెలుసు!


యుద్ధ క్షేత్రం- దవాఖానా- అగ్ని ప్రమాదం

వరద భీభత్సం- భూకంపం- ఆత్మ హననం 

విపత్తు ఏదైనా- ఆపత్తు ఏది వచ్చినా... 

అవుట్ పేషంట్- ఎమెర్జెన్సీ- ICU -జనరల్ వార్డ్ 

ప్రదేశం ఏదైనా- ప్రభావం యెంత తీవ్రమైనా 

పోయే ప్రాణాలను తిరిగి తెచ్చేదాకా పోరాడటం వాళ్లకు తెలుసు !


సెలైన్ బాటిల్- సిరంజీ నీడిల్- మందు గోలీ- క్యాప్సూల్ 

ఆపరేషన్ థియేటర్ లో హృదయం లేని కత్తెరలు సైతం 

వాళ్ల చేతి స్పర్శ తాకగానే ప్రాణాల్ని నిలిపే నైపుణ్యాన్ని పొందుతాయి!


స్టెతస్కోప్- X రే- స్కానర్- స్పైమోమానోమీటర్ 

అంబులెన్స్- స్ట్రెచర్- వీల్ చైర్- ఆక్సిజన్ సిలిండర్ సైతం 

వాళ్ళ కనుసైగల తోనే జీవవార్తాహరులుగా మారతాయి!


టెస్ట్ లు- డయాగ్నసిస్ లు- రిపోర్ట్ లు- డిస్చార్జ్ షీట్ లు 

వాళ్ళ పెదాల నుంచే మనకు అర్ధమవుతాయి !


వాళ్ళందరూ Lady with the Lamp అవునో కాదో తెలీదు 

కానీ- కష్ట కాలంలో మాత్రం మనకు వాళ్ళు-

జన్మనివ్వని అమ్మలు- రక్తం పంచుకోని సోదరులు 

కండ్లల్ల నిలుపుకొని కాపలా కాసే దోస్తులు.. 


వాళ్ళు నర్సులు-

లోకం గాయాలను నయం చేసే సూర్యులు 

భూగోళం వైకల్యాలను తుడిచివేసే చంద్రులు!


(2020 ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ నర్సుల సంవత్సరంలో 59 దేశాలలో కరోనా రోగులకు సేవలు అందిస్తూ 2262 మంది


నర్సులు మృతి చెందారనే వార్త చదివాక... )

#mhk_poetry

గాంధీ మార్గం


 

DASHARADHI CINE GEETHA

Paper presentation in national seminar on Dasharadhi is here. My research paper is titled, DASHARADHI CINE GEETHA


, where I tried my level best to portray d personality and poetry of Dasharadhi, with the help of his film songs..

Fusion శాయరీ on కవిత్వమ్

 #world_poetry_day greetings to u all.. here it's my poem on POETRY, in fushion SHAYAREE style, for your kind reading:::


Fusion శాయరీ on కవిత్వమ్ 


--- మామిడి హరికృష్ణ 


1. కన్నీళ్ళ ద్రావకం లో రక్తపు చుక్కలను జల్లి కొన్ని నవ్వులనీ, ఇంకొన్ని ఆశ్చర్యాలనీ  cocktailలా చేసి అక్షరాల ice-cubeలను coolగా, సుఖూన్ గా గ్లాస్ లో జార విడిచాక, గర్దిష్ మె  సదా రహేంగే తారే కాస్తా గుండెలని somersault చేయించాక, బొక్క బోర్లా పడి, పక్కా చోర్ లా నిలబడి, mind-blowing questionsతో కలబడి, కో అహమ్, who am I, నేనెవరు? అని పరి పరి విధాల, రక రకాల భంగిమలలో సందేహ పడి, రంధి పడి, గుక్క తిప్పుకోనివ్వని hiccupsని కప్పులు కప్పులుగా త్రాగేసాక, ఈ wonderful world ఆ miniature కప్పులలోకి ఒదగదని, జడ కొప్పులుగా, పురుటి నొప్పులుగా, olympic medals మెప్పులుగా నిరంతరం metamorphosis చెందుతూ ఉంటుందని zen వృక్షం కింద enlighten అయ్యాక, diffusion లెన్ని ఉన్నా, delusions ఎన్ని ఎదురైనా, Confucius సాక్షిగా confusion లన్నీ తొలగిపోయి, ఈ లోకంలో absolute truth అనే పదం కేవలం obsolete అనీ, pure అనేది sure గా లేనే లేదని, ఈ బ్రహ్మాండమంతా ఓ Fusion అనే తత్త్వం బోధపడ్తుంది.. కవిత్వం రా....లి....ప...డు...తుం...ది.. 


అవును, కవిత్వం ఓ philosophy....  దాని తమన్నా Philanthropy...!


2. పంచీ, నదియా, పవన్, షాయరీ, time and space నిత్య చలనశీలాలు. సత్య గమన గోళాలు. శివం అన్వేషిత మేళాలు. సుందర సహజాత మేళ తాళాలు. 'ఇరుక్కి రారా' అన్నా, ఎరక్కపోయి ఇరుక్కున్నా కదలికే నయా జరోఖా! ప్రవహిస్తున్న Amazon ఒకే ప్రదేశం లో సైతం ఎప్పుడూ ఒకే నీటినివ్వదు. దిల్ సాఫ్ కర్ కె పానీ మె డూబో.. ఏ సచ్చాయీ ఆప్ కో జానా హోగా .. ఖూబ్ కితాబో కో పడే తో ఈ magical realism నీ ముందు మోకరిల్లుతుంది. ముఖాముఖమై, అంతర్ముఖమై, ముఖ రహితమై, మఖలో పుట్టిన ముఖ పుస్తకమై, నీ సమ్ముఖాన పదునైన నఖమై, సుహ్రుల్లేఖగా, ప్రేమలేఖగా, భావార్థాల శిఖగా, శరణార్థుల శంఖంగా మనో తీరానికి కొట్టుకు వస్తుంది. 


yes, కవిత్వం ద్విముఖి...  ఓ ముఖానిది Agony..  మరో ముఖానిది జవానీ ..!


3. Twister లా పరిభ్రమిస్తూ వందల మైళ్ళ వేగంతో, వేల భావాల ధూళిని లేపుకుంటూ దూసుకు వస్తుంది కవిత్వం. దాని తాకిడికి చిత్తు కాగితమై ఎగిరిపోయి, దాని అలజడికి ఛిన్నాభిన్నమై, ఛిద్రమై, దాని wild దాహానికి ఎముకలన్నీ విరిగిపోయి, muscles అన్నీ melt అయిపోయి కరిగిపోతాను. దాని మోహపు ఊబిలోనే కూరుకుపోతాను. మబ్బుల పొట్లం లో బిగదీసుకుని చంచలిస్తున్న చినుకుని touch చేసి, కొనవేల్లతో మచ్చిక చేసి, ఉప్పదనం లోని మాధుర్యాన్ని తేనెలా గ్రోలుతాను.. లోకం తోటలోని పూలన్నిటినీ ఆఘ్రానిస్తూ వాటిలోని 'గమ్' ని జుర్రుకుని 'నగమ్' ని లిఖిస్తూ ఉంటాను.  చిన్నప్పుడు బొంబాయి మిటాయిని గడియారం లా మణి కట్టుకి చుట్టేసి నాలుకతో చప్పరిస్తూ క్షణాలన్నీ మింగేసినట్టు,million nights అఫ్ ఒంటరితనాన్ని relish చేస్తాను  


జీహా, కవిత్వం నా ప్రేయసి, ఓ illusion.....  కవిత్వం అందాల రాక్షసి, ఓ collision...!  


4. నా అంతరాంతర odyssey లో పరిభ్రమించి, ప్రవహించి, మంచులా ఘనీభవించే కవిత్వం Manifestation of an అభిసారిక! రస సింహాసన మార్గంలో సాల భంజిక ! రోదసీ యానంలో నవ మల్లిక!  వర్ణాక్షర వాక్యాలంకారాల సముద్రంలో భావాల ఓడపై నేను సాగిపోతున్నపుడు, జలాల లోంచి ఇంద్రజాలంలా ఎగిసి వచ్చి నన్ను కవ్వించే కవిత్వం- ఓ Mythological Siren! మోహావేశ ప్రేరితుడనై, దాహాక్రోశ పీడితుడనై  వాలిపోయిన నన్ను అధో లోకాలకు, ఊర్థ్వ జగత్తులకు మేల్కొలిపే కవిత్వం- ఓ factory Siren!


By the way, కవిత్వం ఓ revolution ... అయితేనేం, నాకదే Solution...!


5. ఎప్పుడైనా కన్నీటి ఉప్పదనాన్ని మనసులోకి  ఒంపి చూసావా? నన్నే మున్నే ప్యారే న్యారే tender దరహాసాలని పిల్లల బుగ్గల్లో ఏనాడైనా నింపి చూసావా? పగుళ్ళు బారిన భూమిని, నాగేటి సాలు ముడతలని ముఖం నిండా పులుముకున్న వృద్ధురాలినీ, ఆమె 'జుబాన్'పై ఆరిన తడిదనాన్ని, నీరు లేని ఎడారిలో కన్నీరుని కూడా పండించలేని కరువునీ ఏ క్షణమైనా అనుభవించావా? విశ్వపు horizon పై రెండు దిగంతపు అంచులని ఒక్క చోట చేర్చి చూసావా?


నేను చూసాను .. కావ్య కల్పవృక్షం కింద ధ్యాన సమాధిలో కూరుకుపోయి Astral Journey చేసి చూసాను... 

True, Poetry  is a Tree... విచిత్ర emotional చిత్రాల Geometry...!    

#mhk_poetry

#fusion_shayaree

#mhk_art

కొత్త సంతకం


 

పచ్చడి, బచ్చం .... మా బంగ్లా...

 పచ్చడి, బచ్చం .... మా బంగ్లా...



ఉగాది అనంగనె, శానా మంది

 కోయిలపాట - పచ్చని వసంతం అని

 ఎవ్వెవ్వో ముచ్చట్లను కైకడ్తరు

 కనీ, మాకైతే ఉగాది అనంగనె

 మా బంగ్లా యాదికత్తది.


మా బంగ్లా ఓ ముసలి బాపమ్మ 

డంగు సున్నం గోడలు - టేకు కట్టె కడీలు

 వాటి మీన పాలాస్త్రి ఇటుకలను పేర్చి కట్టిండ్లు ఆకాలంల మాదొక్కటే రెండంత్రాల బంగ్లా

 మా తాత కాలంలనె అది కట్టనీకి

 పదేండ్లు పట్టిందట


గీనాటికి అది ముసలిదైపాయె

 బంగ్లా బంగ్లంత సీకటి పడ్జట్టాయె

 పడావు పడ్డ పొలంలెక్కాయె


ఐతెమాయెగనీ, ఈ ఉగాది దినంల 

మా బంగ్లా పెద్ద తలుపు దర్వాజలు మామిడాకులను చెంపసేరులెక్క అతికిచ్చుకుంటయ్ 

పదారు గడపల పాదాలు పసుపు పూసుకొని నిండు ముత్తైదులెక్క షానీ గొడ్తయి 

ఇంట్లో పర్మిన షాబాదు బండలు

 నీళ్లతో మొఖాలు కడుక్కున్నట్టుగ

 అద్దాలెక్క మెరుస్తయ్


బంగ్లా మీది కెళ్ళే మెట్లు

ముగ్గుల హారాలను మెడలో దిగేసుకున్నట్టుంటయ్ 

పెరట్ల బాయి గోడలు కుంకుమ బొట్లు అద్దుకుని లేని

కండ్లను అతికిచ్చుకున్నట్టుంటయ్


కోతుల ఎగురుడుకు

యాప చెట్టు పూత అంత రాలిపోయి 

నేల మీన పూల అలుకు సల్లినట్టయితది పొయ్యి కింద మండుతున్న పోర్క 'చిట్ పట్ 'మనుకుంట

మా కడ్పు పేగుల గోసని ఇన్పిత్తయ్


మోకాళ్ళ మీద కూకున్న మా అమ్మ 

పూర్ణాన్ని రొట్టె నడిమిట్ల పెట్టి గాజుల చేత్తో ఒత్తుకుంట 

పెనం మీన ఏత్తది

'సుయ్యి 'మనుకుంట బచ్చం

మా సూపులను గుంజుకోని

 మా ముందటున్న పల్లెంలకు ఎగిరి అత్తది. సకులం ముకులం పెట్కొని పీట మీద కూసుంటం కదా

 ముందటున్న పల్లెం పక్కన ఇత్తడి గిలాస ఇగురంగ అచ్చి చేర్తది 

గిలాస నిండ చింతపండు - బెల్లం సాక దాంట్లే తేలుకుంట మునుక్కుంట యాప్పూత-మామిడి కాయ ముక్కలు..... 

బచ్చం తినుకుంట-పచ్చడి తాగుతాంటే

 అప్పుడు కడుపుల కోయిల కూత్తది మొఖంల వసంతం ఎగిరెగిరి దున్కుతది


ఒరేయ్ నల్ల మొఖపోడా, 

మా బంగ్లా సాచ్చిగ సెప్తాన ఇను

 వసంతం మనతాన్నే ఉంటది

 కోయిల మనలోనే ఉంటది 

కొత్త చిగురు మనకోసమే ఏత్తది 

ఉగాది మనకోసమే వత్తది ...!


- మామిడి హరికృష్ణ

మట్టి ముద్ర 

శ్రీ దుర్ముఖి నమ ఉగాది కవిత్వం -2016 


Paper clippings

 


ఒక యాత్ర - మూడు దశలు


 

నాలుగు గమనాలు


 

Monday, 10 May 2021

THOMMIDO DIKKU

 THOMMIDO DIKKU is my poetic tribute to all mothers in general and to my mother in special, published in nava telangana news paper sopathi Sunday supplement on 11-8-2019...

Plz read on..

HAPPY MOTHER'S DAY 🎉💐🌷💐💐🌷 


ఈ వారం కవిత్వం

తొమ్మిదో దిక్కు !

- మామిడి హరికృష్ణ

నవ తెలంగాణ - సోపతి (ఆదివారం సంచిక)

11 ఆగస్టు 2019


చెరువు కట్టదాటివచ్చిన మనుషులంతా అనుకుంటున్నారు

కట్టమీది చెట్టు ఆకులు వర్షిస్తున్నాయని

భూమిని పెళ్ళగించుకుని

చెట్టు వేళ్ళు పొగిలివచ్చాయని...!


****. *****. ****


ఇప్పుడు నేను రాయాలి... 

ఆమె గురించి మాత్రమే రాయాలి

అయితే, ఎక్కడ్నించి మొదలెట్టాలి?

నా ఆది మధ్యాంతాల దాకా విస్తరించిన ఆకాశంకదా

నా మొదటి అడుగుకు చోటిచ్చిన భూమికదా

నా బ్రతుకుకు ఊపిరులూదిన వాయువు కదా

నాకు జ్ఞానాన్ని అందించిన నీరు కదా

అన్ని దిక్కులూ తానే అయి

నాకు తొమ్మిదో దిక్కుకు తొవ్వచూపిన దిగంతం కదా...!


ఆమె కొన్ని కలల్ని ఇంకొన్ని ఆశలను

కొంగులో ముడివేసుకుని వెంటతెచ్చింది

మబ్బుల్ని తెంపి, నక్షత్రాలను త్రుంచి 

చినుకుల్ని ఒడిసిపట్టి విత్తనంగా చేసి నేలపై నాటింది

అది మొక్కై పెరిగింది

దానికి పెరిగిన అక్షరాల ఆకులను

కవితల పూలను అపురూపంగా చూసుకుంది

ఇంకేం తక్కువ అనిపించిందో ఏమో

చంద్రున్ని రంగరించి ఆ మెరుపును ఆ మొక్కకు అద్దింది

సూర్యున్ని వస్త్రకాగితం పట్టి

నిగ్గుతేలిన ఉత్తేజరజాన్ని ఆ మొక్కపై చల్లింది

ఆకాశాన్ని చూర్ణంచేసి తన స్వేదాన్ని మిళితం చేసి

అత్తరుగా తయారు చేసింది....

ఆ మొక్కకు పరిమళాన్ని అందించింది...


ఇపుడా మొక్క చెట్టయింది.

దేదీప్యమానంగా వెలుగుతూ, సువాసనలు వెదజల్లుతూ

కావ్యాల పూలను, పుస్తకాల పండ్లను ఇస్తూ,

జనానికి తోడైంది... జీవానికి మేడయింది.

లోకానికి నీడైంది... జగానికి జాడైంది...


ఇపుడా చెట్టు ఆమెకోసం వెదుకుతుంది.

కొమ్మలన్నిటినీ చేతులుగా చేసి

ఆమె పాదాలను స్పృశించాలని ఆరాటపడుతోంది..

నిజమైన కలల్ని, ఆమె దోసిలిలో నింపాలని,

ఆమె కొంగునిండా ఆనందాల్ని పరచాలని తండ్లాడుతోంది...


తనపై వాలిన పిట్టలన్నింటినీ ఆమె గురించి అడిగింది

అష్టదిక్కులకీ ఎగిరెళ్ళి తన ఎదురుచూపును చేరవేయమని

చెప్పింది...

రోజంతా దేశదిమ్మరిలా తిరిగి తిరిగి పొద్దుగుంకి చెట్టును చేరిన పిట్టలన్నీ

ముక్త కంఠంతో ఒకటే చెప్పాయి.

ఆమె తొమ్మిదో దిక్కుగా నడిచెళ్ళిపోయిందని...


చెట్టు బెంగపడింది... గుబులు పడింది... దిగులు పడింది...

నేల దిగువనుంచి తన వేళ్ళని తొమ్మిదో దిక్కుగా చాపింది...

అక్కడ మట్టిమీద కొన్ని అడుగు జాడలున్నాయి.

ఆత్రపడుతూ అడుగులని అడిగింది.

ఆమె ఆచూకీ ఏమైనా తెలుసా అని

ఆమె తొమ్మిదో దిక్కు నుండి రోదసిలోకి ఎగిసివెళ్ళిందని

వెళుతూ వెళుతూ ఓ సందేశాన్నిచ్చిందని...

'నా బంగారు బిడ్డ, నా కలలు నెరవేరుస్తాడని

సకల లోకాల మద్దతు కూడకట్టడానికే తాను

నిష్క్రమిస్తున్నానని' చెప్పిందని

ఆ అడుగులు సన్నగా చెప్పాయ్!


అడుగులను హత్తుకుని వేళ్ళు వెక్కివెక్కి ఏడ్చాయ్

చెట్టు పొర్లిపొర్లి దు:ఖించింది.!!


****. ****. ****


చెరువు కట్టమీద నడిచి వెళ్తున్న మనుషులు

భూకంపం వచ్చిందన్నారు....

చెట్టుకు గాలిసోకిందన్నారు...


భూమిపైకి పెకిలి వచ్చిన వేళ్ళగురించి

ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు...

కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు...


(21 ఏళ్ళ క్రితం ఊర్ధ్వ


లోకాలకు ఎగిసిపోయిన అమ్మకు...)

#mhk_poetry

Harikrishna Mamidi

తంగేడు పూల నేల


 

E1, రూమ్ నంబర్ 70


 

దారం కట్టిన సందమామ


 

పిట్టని దేవులాడిన గూడు !


 

సాపేక్షత !


 

మా ఊరి పురాణం

 


సీతకుంట