పచ్చడి, బచ్చం .... మా బంగ్లా...
ఉగాది అనంగనె, శానా మంది
కోయిలపాట - పచ్చని వసంతం అని
ఎవ్వెవ్వో ముచ్చట్లను కైకడ్తరు
కనీ, మాకైతే ఉగాది అనంగనె
మా బంగ్లా యాదికత్తది.
మా బంగ్లా ఓ ముసలి బాపమ్మ
డంగు సున్నం గోడలు - టేకు కట్టె కడీలు
వాటి మీన పాలాస్త్రి ఇటుకలను పేర్చి కట్టిండ్లు ఆకాలంల మాదొక్కటే రెండంత్రాల బంగ్లా
మా తాత కాలంలనె అది కట్టనీకి
పదేండ్లు పట్టిందట
గీనాటికి అది ముసలిదైపాయె
బంగ్లా బంగ్లంత సీకటి పడ్జట్టాయె
పడావు పడ్డ పొలంలెక్కాయె
ఐతెమాయెగనీ, ఈ ఉగాది దినంల
మా బంగ్లా పెద్ద తలుపు దర్వాజలు మామిడాకులను చెంపసేరులెక్క అతికిచ్చుకుంటయ్
పదారు గడపల పాదాలు పసుపు పూసుకొని నిండు ముత్తైదులెక్క షానీ గొడ్తయి
ఇంట్లో పర్మిన షాబాదు బండలు
నీళ్లతో మొఖాలు కడుక్కున్నట్టుగ
అద్దాలెక్క మెరుస్తయ్
బంగ్లా మీది కెళ్ళే మెట్లు
ముగ్గుల హారాలను మెడలో దిగేసుకున్నట్టుంటయ్
పెరట్ల బాయి గోడలు కుంకుమ బొట్లు అద్దుకుని లేని
కండ్లను అతికిచ్చుకున్నట్టుంటయ్
కోతుల ఎగురుడుకు
యాప చెట్టు పూత అంత రాలిపోయి
నేల మీన పూల అలుకు సల్లినట్టయితది పొయ్యి కింద మండుతున్న పోర్క 'చిట్ పట్ 'మనుకుంట
మా కడ్పు పేగుల గోసని ఇన్పిత్తయ్
మోకాళ్ళ మీద కూకున్న మా అమ్మ
పూర్ణాన్ని రొట్టె నడిమిట్ల పెట్టి గాజుల చేత్తో ఒత్తుకుంట
పెనం మీన ఏత్తది
'సుయ్యి 'మనుకుంట బచ్చం
మా సూపులను గుంజుకోని
మా ముందటున్న పల్లెంలకు ఎగిరి అత్తది. సకులం ముకులం పెట్కొని పీట మీద కూసుంటం కదా
ముందటున్న పల్లెం పక్కన ఇత్తడి గిలాస ఇగురంగ అచ్చి చేర్తది
గిలాస నిండ చింతపండు - బెల్లం సాక దాంట్లే తేలుకుంట మునుక్కుంట యాప్పూత-మామిడి కాయ ముక్కలు.....
బచ్చం తినుకుంట-పచ్చడి తాగుతాంటే
అప్పుడు కడుపుల కోయిల కూత్తది మొఖంల వసంతం ఎగిరెగిరి దున్కుతది
ఒరేయ్ నల్ల మొఖపోడా,
మా బంగ్లా సాచ్చిగ సెప్తాన ఇను
వసంతం మనతాన్నే ఉంటది
కోయిల మనలోనే ఉంటది
కొత్త చిగురు మనకోసమే ఏత్తది
ఉగాది మనకోసమే వత్తది ...!
- మామిడి హరికృష్ణ
మట్టి ముద్ర
శ్రీ దుర్ముఖి నమ ఉగాది కవిత్వం -2016
No comments:
Post a Comment