THOMMIDO DIKKU is my poetic tribute to all mothers in general and to my mother in special, published in nava telangana news paper sopathi Sunday supplement on 11-8-2019...
Plz read on..
HAPPY MOTHER'S DAY 🎉💐🌷💐💐🌷
ఈ వారం కవిత్వం
తొమ్మిదో దిక్కు !
- మామిడి హరికృష్ణ
నవ తెలంగాణ - సోపతి (ఆదివారం సంచిక)
11 ఆగస్టు 2019
చెరువు కట్టదాటివచ్చిన మనుషులంతా అనుకుంటున్నారు
కట్టమీది చెట్టు ఆకులు వర్షిస్తున్నాయని
భూమిని పెళ్ళగించుకుని
చెట్టు వేళ్ళు పొగిలివచ్చాయని...!
****. *****. ****
ఇప్పుడు నేను రాయాలి...
ఆమె గురించి మాత్రమే రాయాలి
అయితే, ఎక్కడ్నించి మొదలెట్టాలి?
నా ఆది మధ్యాంతాల దాకా విస్తరించిన ఆకాశంకదా
నా మొదటి అడుగుకు చోటిచ్చిన భూమికదా
నా బ్రతుకుకు ఊపిరులూదిన వాయువు కదా
నాకు జ్ఞానాన్ని అందించిన నీరు కదా
అన్ని దిక్కులూ తానే అయి
నాకు తొమ్మిదో దిక్కుకు తొవ్వచూపిన దిగంతం కదా...!
ఆమె కొన్ని కలల్ని ఇంకొన్ని ఆశలను
కొంగులో ముడివేసుకుని వెంటతెచ్చింది
మబ్బుల్ని తెంపి, నక్షత్రాలను త్రుంచి
చినుకుల్ని ఒడిసిపట్టి విత్తనంగా చేసి నేలపై నాటింది
అది మొక్కై పెరిగింది
దానికి పెరిగిన అక్షరాల ఆకులను
కవితల పూలను అపురూపంగా చూసుకుంది
ఇంకేం తక్కువ అనిపించిందో ఏమో
చంద్రున్ని రంగరించి ఆ మెరుపును ఆ మొక్కకు అద్దింది
సూర్యున్ని వస్త్రకాగితం పట్టి
నిగ్గుతేలిన ఉత్తేజరజాన్ని ఆ మొక్కపై చల్లింది
ఆకాశాన్ని చూర్ణంచేసి తన స్వేదాన్ని మిళితం చేసి
అత్తరుగా తయారు చేసింది....
ఆ మొక్కకు పరిమళాన్ని అందించింది...
ఇపుడా మొక్క చెట్టయింది.
దేదీప్యమానంగా వెలుగుతూ, సువాసనలు వెదజల్లుతూ
కావ్యాల పూలను, పుస్తకాల పండ్లను ఇస్తూ,
జనానికి తోడైంది... జీవానికి మేడయింది.
లోకానికి నీడైంది... జగానికి జాడైంది...
ఇపుడా చెట్టు ఆమెకోసం వెదుకుతుంది.
కొమ్మలన్నిటినీ చేతులుగా చేసి
ఆమె పాదాలను స్పృశించాలని ఆరాటపడుతోంది..
నిజమైన కలల్ని, ఆమె దోసిలిలో నింపాలని,
ఆమె కొంగునిండా ఆనందాల్ని పరచాలని తండ్లాడుతోంది...
తనపై వాలిన పిట్టలన్నింటినీ ఆమె గురించి అడిగింది
అష్టదిక్కులకీ ఎగిరెళ్ళి తన ఎదురుచూపును చేరవేయమని
చెప్పింది...
రోజంతా దేశదిమ్మరిలా తిరిగి తిరిగి పొద్దుగుంకి చెట్టును చేరిన పిట్టలన్నీ
ముక్త కంఠంతో ఒకటే చెప్పాయి.
ఆమె తొమ్మిదో దిక్కుగా నడిచెళ్ళిపోయిందని...
చెట్టు బెంగపడింది... గుబులు పడింది... దిగులు పడింది...
నేల దిగువనుంచి తన వేళ్ళని తొమ్మిదో దిక్కుగా చాపింది...
అక్కడ మట్టిమీద కొన్ని అడుగు జాడలున్నాయి.
ఆత్రపడుతూ అడుగులని అడిగింది.
ఆమె ఆచూకీ ఏమైనా తెలుసా అని
ఆమె తొమ్మిదో దిక్కు నుండి రోదసిలోకి ఎగిసివెళ్ళిందని
వెళుతూ వెళుతూ ఓ సందేశాన్నిచ్చిందని...
'నా బంగారు బిడ్డ, నా కలలు నెరవేరుస్తాడని
సకల లోకాల మద్దతు కూడకట్టడానికే తాను
నిష్క్రమిస్తున్నానని' చెప్పిందని
ఆ అడుగులు సన్నగా చెప్పాయ్!
అడుగులను హత్తుకుని వేళ్ళు వెక్కివెక్కి ఏడ్చాయ్
చెట్టు పొర్లిపొర్లి దు:ఖించింది.!!
****. ****. ****
చెరువు కట్టమీద నడిచి వెళ్తున్న మనుషులు
భూకంపం వచ్చిందన్నారు....
చెట్టుకు గాలిసోకిందన్నారు...
భూమిపైకి పెకిలి వచ్చిన వేళ్ళగురించి
ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు...
కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు...
(21 ఏళ్ళ క్రితం ఊర్ధ్వ
లోకాలకు ఎగిసిపోయిన అమ్మకు...)
#mhk_poetry
Harikrishna Mamidi
No comments:
Post a Comment