Thursday, 13 May 2021

సేవ దూతలు

 My poetic tribute to NURSING OFFICERS.. #International_Nurses_Day

సేవా దూతలు!

------ మామిడి హరికృష్ణ 8008005231


ఇప్పటిదాకా మనం 

ఎన్నో రకాల దానాల గురించి విన్నాం 

పురాణాల యుగం నుండి పరమాణు కాలం దాకా 

మరెన్నో విధాల సేవల గురించి చదివాం 


కానీ వాళ్ళు-

రాలిపోయే ప్రాణాలను పొడిగించి కాల దానం చేస్తారు 

ఆరిపోయే జీవానికి ఊపిరులూది ఆరోగ్య దానం చేస్తారు!


వాళ్ళు-

జీవన దాతలు- ధవళ వస్త్ర ధారులు 

ఆకాశ దూతలు- ఆరోగ్య ప్రదాతలు 

సంజీవ పర్వతాన్ని భుజాన మోసే నవ చిరంజీవులు !


క్రిమియన్ వార్ నుండి కరోనా వైరస్ వరకు 

క్షతగాత్రులను- వ్యాధి గ్రస్తులను అమ్మలా హత్తుకోవడం 

చేతి కొసల నుండి జీవ ధాతువును ధార పోయడం 

పెదాల అంచుల్లో చిరునవ్వులను ధరించి 

కళ్ళ నిండా కారుణ్యాన్ని వెదజల్లుతూ 

బతుకుకు భరోసాను ఇవ్వడం వాళ్లకు తెలుసు!


యుద్ధ క్షేత్రం- దవాఖానా- అగ్ని ప్రమాదం

వరద భీభత్సం- భూకంపం- ఆత్మ హననం 

విపత్తు ఏదైనా- ఆపత్తు ఏది వచ్చినా... 

అవుట్ పేషంట్- ఎమెర్జెన్సీ- ICU -జనరల్ వార్డ్ 

ప్రదేశం ఏదైనా- ప్రభావం యెంత తీవ్రమైనా 

పోయే ప్రాణాలను తిరిగి తెచ్చేదాకా పోరాడటం వాళ్లకు తెలుసు !


సెలైన్ బాటిల్- సిరంజీ నీడిల్- మందు గోలీ- క్యాప్సూల్ 

ఆపరేషన్ థియేటర్ లో హృదయం లేని కత్తెరలు సైతం 

వాళ్ల చేతి స్పర్శ తాకగానే ప్రాణాల్ని నిలిపే నైపుణ్యాన్ని పొందుతాయి!


స్టెతస్కోప్- X రే- స్కానర్- స్పైమోమానోమీటర్ 

అంబులెన్స్- స్ట్రెచర్- వీల్ చైర్- ఆక్సిజన్ సిలిండర్ సైతం 

వాళ్ళ కనుసైగల తోనే జీవవార్తాహరులుగా మారతాయి!


టెస్ట్ లు- డయాగ్నసిస్ లు- రిపోర్ట్ లు- డిస్చార్జ్ షీట్ లు 

వాళ్ళ పెదాల నుంచే మనకు అర్ధమవుతాయి !


వాళ్ళందరూ Lady with the Lamp అవునో కాదో తెలీదు 

కానీ- కష్ట కాలంలో మాత్రం మనకు వాళ్ళు-

జన్మనివ్వని అమ్మలు- రక్తం పంచుకోని సోదరులు 

కండ్లల్ల నిలుపుకొని కాపలా కాసే దోస్తులు.. 


వాళ్ళు నర్సులు-

లోకం గాయాలను నయం చేసే సూర్యులు 

భూగోళం వైకల్యాలను తుడిచివేసే చంద్రులు!


(2020 ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ నర్సుల సంవత్సరంలో 59 దేశాలలో కరోనా రోగులకు సేవలు అందిస్తూ 2262 మంది


నర్సులు మృతి చెందారనే వార్త చదివాక... )

#mhk_poetry

No comments:

Post a Comment