ఉదయ చిత్రం!
---- మామిడి హరికృష్ణ
Melakuva
O Yoga vinyasam!
Toli vekuva
Sahayoga sanchaaram!
Darshanam
Sahajeevana soundaryam!
Sparshanam
Dehaatmala samyogam!
Pratee dinam
Prakruti ichhina varam!
Sudinam nede..
Shubha samayam ippude..
#mhk_poetry
---- మామిడి హరికృష్ణ
Melakuva
O Yoga vinyasam!
Toli vekuva
Sahayoga sanchaaram!
Darshanam
Sahajeevana soundaryam!
Sparshanam
Dehaatmala samyogam!
Pratee dinam
Prakruti ichhina varam!
Sudinam nede..
Shubha samayam ippude..
#mhk_poetry
ఇక్కడ, 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్న మలయాళ మహాకవి అక్కితం అచ్యుతన్ నంబూత్రి గారి కవిత.. నేను అనువదించి 2-12-2019 న నమస్తే తెలంగాణ పేపర్‌లో ప్రచురించిన కవిత..
పలాయన వాది ప్రేమ గీతం !
------- మూలం: అక్కితం అచ్చుతన్ నంబూద్రి
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231
నన్ను ఉన్న పళంగా ఇక్కడంచి తీస్కెళ్ళవా..
ఓ నా అసలు సిసలు ప్రేయసీ,
నన్ను ఒకానొక అజ్ఞాత తీరానికి తీస్కెళ్ళవా !?
అక్కడ దూర దేశాల పుష్పాల పరిమళం
గాలిలో తేలివస్తుంది
సాగరంలోని లేత నీలి కెరటాలు
తీరపు బహువులలో ఓలలాడుతాయి
మన చిన్నారి పడవ సముద్ర మధ్యన లంగరేసి
ప్రశాంత నిశ్చల నిద్రలోకి జారుకుంటుంది
తలొగ్గని కాలపు స్వప్న లోకంలో
ఈ ప్రపంచమంతా సేద తీరుతుంది !
అక్కడ వింతైన సీతాకోకల్లాంటి కీటకాల గుంపు
తమ రెక్కలు టపటపలాడిస్తూ విహరిస్తూ ఉంటాయి
పచ్చిక బయళ్లపై, పూల పాన్పుపై, మహా వృక్ష ఛాయలో
చూస్తే కళ్ళకు కొత్త అనుభూతిని అద్దుతుంటాయి
అలాంటి ఏకాంత ప్రదేశంలో నేను అలసిపోయి తనువు వాలుస్తాను
నా ఛాతీని కలల దుప్పటితో కప్పుకుంటాను!
అక్కడ నా ప్రియా, నీ తేలికైన మృదు హస్తాన్ని
నా గుండెలపై నెమ్మదిగా వేయి
తేనెలు నింపుకున్న నీ స్వరం
పదాలేవీ లేని
ఓ కొత్త అపరిచిత గీతాన్ని ఆలపించనీ !
అక్కడ ఓ మధుర అచేతన స్థితి
సున్నితంగా చెంపలను ముద్దాడి సంబరాలు చేస్తుంది
అక్కడికి మృత్యువు తరలి వస్తుంది
నా దేహాన్ని నూతన ధవళ వస్త్రాలతో చుట్టేసి
నన్ను శాశ్వత గాఢతలోకి తీసుకెళ్లడానికి..
అక్కడి కేవల సంపూర్ణత నన్ను ఆసాంతం
ప్రవాహంలో కరిగించి కనుమరుగు చేస్తుంది !
నా ప్రియ ప్రేయసీ,
నన్ను ఆ అజ్ఞాత అలౌకిక తీరానికి తీస్కెళ్ళవా !?
(ప్రముఖ మలయాళీ కవి అక్కితం అచ్చుతన్ నంబూద్రి కి 2019 సంవత్సరపు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భం...))
ఇదిగో నా కవిత కాలా.. జీవన.. ఓ సంచారీకి అనువాదం! 27-11-2021న కన్నడ దినపత్రిక జన మిడితలో ప్రచురించబడింది..
తెలుగు ఒరిజినల్ ఇక్కడ ఉంది :::
కాలమూ... జీవితమూ... ఓ సంచారి !
-------------------------------------------------
-- మామిడి హరికృష్ణ 8008005231
1. క్షణానికి రంగూ రుచి వాసన ఉందా?
కాలానికి భౌతిక, రసాయనిక, ఆధ్యాత్మిక ధర్మాలున్నాయా?
సమయానికి అడ్డం, నిలువు, ఎత్తు కొలమానాలున్నాయా?
ఉండకూడదు!
ఉదయానికి ఉద్వేగాలు
మధ్యాహ్నానికి మార్మికతలు
సాయంకాలానికి సంవేదనలు ఉండక పోవచ్చు..
అయితేనేం-
నువ్వు కనిపిస్తే ఉదయం-
ఉద్వేగ రాగం పాడుతుంది..
మధ్యాహ్నం --
మార్మిక సంగీతం వినిపిస్తుంది..
సాయంత్రం--
సంవేదనా నృత్యం అభినయిస్తుంది...
2. కాలం అనంతం
జీవితం పరిమితం...
కాల ప్రస్థానం మధ్యలో జీవితం ఆరంభం
జీవితం ఆఖరి శ్వాసకు వీడ్కోలు పలికాక కూడా
కాలం నిరంతరం...
3. ఘడియను కిలో గ్రాముల్లో తూచగలమా?
గంటలను అడుగుల్లో బేరీజు వేయగలమా?
నిమిషాలను ఫాథోమీటర్ లలో కొలవగలమా?
సెకన్లను ఫారెన్‌హీట్, సెంటీగ్రేడ్, కెల్విన్ లలో చెప్పగలమా?
చెప్పలేకపోవచ్చు-
ఘడియలకు ఘనరూపం లేదు
నిమిషాలు నేల ఆకారంలోకి ఒదగవు
ద్రవ రూపంలో ప్రవహించవచ్చు
సెకన్లు వాయు మార్గంలో పయనించవు!
అయితేనేం..
నువ్వు ఎదురైతే---
ఘడియలు ఘనీభవిస్తాయి
నిమిషాలు భూమి అంతటా పరుచుకుంటాయి
సెకన్లు స్పందించడం నేర్చుకుంటాయి!
4. నా ప్రియా... జీవితమా...!
చేయలేననుకున్నవి చేసి చూపిస్తావు
చేయగలననుకున్నవి చేయకుండా ఆపేస్తావు
అంతరిక్షమంత ప్రేమను ఆల్చిప్పలా చూసి
అణువంత ఆవేశాన్ని ఆకాశం వరకు విస్తరింపచేస్తావు
సముద్రమంత ఆశను ఇసుక రేణువులా మార్చి
ఆవాల గింజంత నిరాశను ఎవరెస్టు లా పెంచేస్తావు!
జీవితమా..!
ఇన్నేళ్లు గడిచాక కూడా నువ్వు నాకింకా ఏమీ అర్ధం కాలేదు..
నువ్వు నాతో ఇంకా సోపతి చెయ్యలేదు..
అయితేనేం-
ఇన్ని గాయాలు- అనుభవాల తర్వాత కూడా
నేను నీతో
మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తున్నావు..
తిరిగి తిరిగి నిన్నే చేరుకునేలా చేస్తున్నావు...!!
#mhk_కవిత్వం
******"""""******"""""******""""""******
కవిలేఖ -25
నేల మీద పూల అలుకు మామిడి హరికృష్ణన్న కవిత్వం.
----------------------------------------
ప్రియమైన హరికృష్ణ అన్న కు,
అన్న ఈ మధ్య నే పోర్షియా దేవి అక్క "మాట్లాడే సమయం "కవిత్వ ఆవిష్కరణ సభకు వచ్చినప్పుడు దండకడియం తమ్ముడు తగుళ్ళ గోపాల్,సాయ భగత్,సలీం తో కలిసి రవీంద్రభారతిలో మీ ఆఫీస్ కు వచ్చింది. మా అందరికీ మీ కవిత్వ పుస్తకాలను ఇచ్చి పంపిండ్రు. అందులో 'ఊరికి పోయిన యాళ్ళ' కవిత్వం అంతా చదివిన.గమ్మతి ఏందంటే అంతటా మన వరంగల్ కొమ్మాల జాతర్ల ప్రభలోలె తెలంగాణ నుడికారం ఎల్గిపోతుంది. ప్రపంచ భాషల్ల కవిత్వం చదివి కూడా కైష్ తో గిట్ల రాసుడు నువద్దే దీవిలి పండుక్కు మన తోట్ల పూసిన బంతి పువ్వులను దెంపి కొన వాకిట్ల పంచలకు దండ గట్టినట్టు తెలంగాణ కవిత్వ బోనాన్ని చెల్లించిండ్రు.
ఇప్పుడు వర్తమాన తెలంగాణ కవిత్వం జాలు వారుతంది. ఇదు వరకు రాని పల్లెలు,చెరువులు,చెట్లు,తీర్థాలు తీరొక్కటి కవిత్వంలో నిండుతన్నై. మీరు ఈ సంపుటిలో చెప్పిన తరిక. శాయంపేట,చెరుకుబాయి,సీతకుంట,బుగులోని తీర్థం మొదలైనవి. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్ నిర్మాణం కు గివ్వి నిండుగా వుంటై. ప్రాంతీయ ఆస్తిత్వ సోయి తో ఎంతో సాహిత్యం వచ్చింది. కైతలు రాసుట్ల,పాటలు కట్టుట్ల మనది పేరువోయిన బెజ్జంకి కదనే.అనాదిగా ఈ నేల మీద తిరుగు బాటు పాదులున్నై. మన కంచుట్ల వత్తిని ఆరిపోకుంట మనం తాల్సుకుంటేనే కదా పురుగేదో ,బుసేదో కండ్లవడేది. ఏమంటరు అన్న?.
ఇక్కడి మట్టిని,మట్టి మనుషుల కతలను ,ఏతలను సినిమాగా బయటి ప్రపంచానికి ఎరుక జేయాల్లన్న మీ ఆరాటానికి వేలాది శనార్తులు అన్న. నాకైతే మీ మీద మన ఆస్థిత్వ పతాక ను ఎట్లన్న ఎగరేస్తవన్న బొచ్చెడు ఆశ వున్నది. యువతరాన్ని మీరు దగ్గర దీసుకునే తరిక జూత్తే మస్తు కుశాల నాకు. పట్నమస్తే హరికృష్ణ అన్న వున్నడన్న ధైర్నం వచ్చింది. పట్నం మీకు పెద్దమ్మ. మీరు ఉన్నరు గావట్టి మాకు పట్నం పెద్దన్న ఇప్పుడు.
ఇట్లా తెలంగాణ మట్టి చరిత్ర ఏదో ఒక రూపంల ఇంకొకలకు నెలువు అవుడు గొప్ప ముచ్చట. ఇగ గిట్ల తెలంగాణ బిరుజు కాపాడుతున్న కవులు ,కళాకారులు అందరికీ నా మట్టి దండాలు. ముఖ్యంగా తెలంగాణ భాష కు ఎంతో కృషి జేస్తున్న మా నలిమెల భాస్కర్ సార్ తోటి మా తరానికి కావలసిన ముచ్చట్లు మన భాష సాంస్కృతిక శాఖ తరుపున ఇప్పించాలని కోరుతున్న.
చాలా మంది కవిత్వాన్ని నోస్టాల్జియా అంటరు గని గతం లేని వర్తమానం గాని,వర్తమానం లేని భవిష్యత్తు లేదు కదా అన్న. ఈ గత ,వర్తమాన,భవిష్యత్తుల చక్రం అనివార్యం అనిపిస్తది. మీ ఊరైన శాయంపేట ను పలువరిస్తూ ఊరును తరగని ఊట గా,జ్ఞాపకాలసద్ది మూటగా,బోధి వృక్షం,మాతృం వృక్షంగా,పురాణగాధ గా చెప్పడం ఒక ఎత్తు. మన లోని సూర్యుడిని రాజేసే కొలిమి గా చెప్పడం వల్ల మీ కవిత్వ సత్తువ ఎర్కైంది. ఊరంటే జీనోమ్ మ్యాప్ కథ అనడం శాస్త్రీయ దృష్టి .ఊరు కర్మయోగి అనుట్ల మీ తాత్విక కోణం తెల్సింది. కొందరు కవులైతే ఊరును మహా కావ్యం అన్నట్టు యాదికుంది. ఇట్లా ఊరుకి ఉన్న అనేక యాదులు గుర్తు జేసిండ్రు. ఒక కట్ట మీద వున్న ర్యాలచెట్టును ఒంటరి దైతేంది నిలబడ్డప్పుడు ఊరందరికి పెద్ద దిక్కు అని కవిత్వీకరించిన తీరు సూపర్ గా ఉన్నది. చెట్టు ను మనిషిగా చెప్పడం వాస్తవమే.
సీతకుంట గురించి రాస్తూ సీతకుంట ఊరికి తొలి గడప. అని చెప్పుకుంట.దాని అలలను ఉతికి దండానికి ఆరేసిన వెండి దోతులని ఎంత బాగ బొగిడినవు అన్న. ఈ కుంట దాటే కదా అచ్చరాల మోచ్చం పొందినవు. అది పురాగ సచ్చిన మీరు కడుపుల దాసుకున్నరు.
పల్లె జ్ఞాపకాలు,పట్టణ జ్ఞాపకాలు రెండిటిని జమిలీగ పలవరించిండ్రు. పట్నం ను ఈ జమీన్ మీన వాలిన చాంద్ కా టుక్డా అని,దునియాల నిల్సిన సూరజ్ కా ముఖడా. తెలంగాణ షాన్ వని శికులంమీద పెట్టిండ్రు.
కొన్ని సార్లు కవితల్లో కవిత్వబలం మధ్యలోనూ,ముగింపులోనూ,ప్రారంభంలోనూ వుండచ్చు. అని అనుకుంట.చత్తిరి కవిత చదివినప్పుడు ముగింపు లో చినుకులల్ల పూసిన నల్ల తంగేడు పువ్వుగా వర్ణించిన తీరు అబ్బక్క అనిపించింది. అంతతో అగకుంట "గీ వానాకాలం ల చత్తిరి/అత్తాకోడళ్ల పంచాయితీ నడిమిట్ల/అడ్డంగ నిలబడ్డ ఎర్రి బాగుల కొడుకుఅన్నరు.చాలా సహజంగా మంచిగ కుదిరింది.
పచ్చడి,బచ్చం...మా బంగ్లా కైతల యుగాది గురించి చెప్పినట్టుగా వున్నది గనీ లోతైన తాత్విక భావలున్నై. వసంతం మనతాన్నే వుంటది/కోయిల మనలోనే వుంటది/కొత్త చిగురు మనకోసమే ఏత్తది. ఈ సంపుటిలో చాలా ఫోయమ్స్ ప్రోజ్ ఫోయమ్స్ లా వున్నై అన్న. Fusion షాయరీ నిర్మాణం కండ్ల వడ్డది. ఉస్మానియా హస్టల్ గురించి రాసిన కవిత E-1 రూం నంబర్ 70.ఈరూమ్ నాకు అమ్మ,గురువు,దోస్త్ ఒక్క మాటలో చెప్పాలంటే రూమ్ జీవితం అని తేల్చిపారేసిండ్రు. ఈ కవిత చదివినంక నా ఎం ఏ రోజులు యాదికచ్చినై. కాకతీయ యూనివర్సిటీ లోని ప్రతాప రుద్ర హస్టల్లో GR-IV రూమ్ నంబర్ 3గురించి రాసుకోవాలి అనిపించింది. పిట్టను దేవులాడిన గూడు,దారం కట్టిన సందమామ భలే నచ్చిన శీర్షికలు. పతంగి మీద మీరు రాసిన కైత పాయిరంగా వున్నది. పతంగిని అంతరిక్షం మీన/మనకాలపు అర్జునుడు ఏసిన కాగితపు నిచ్చెనఅన్నరు . ఈ వాక్యం బాగా నచ్చింది.
పిట్టను దేవులాడిన గూడు శీర్షికన వున్న కైత నాకు నచ్చింది. శీర్షికతోనే సగం మెరుపు వచ్చింది. ఈ కవిత సారమంత పట్నంలో వున్న కొడుకు దగ్గరికి పల్లె నుండి వచ్చిన తండ్రి ప్రయాణం ను వివరించిన కవిత. క్రమంగా ,సహజంగా మంచిగున్నది. ఈషహర్ లో ఇల్లేమి లీని,అడ్రసు లేని కాందీశీకున్ని,నిత్య సంచారి ని అంటూ మొదలైతది. శతాబ్దాల క్రితం నాకు ఒక గూడు ఉండేదని,చిలకొయ్యకు కన్నీళ్ళ అంగీని ఆరేయడానికి,సూరులో చిరునవ్వుల విస్తరాకును చెక్కి/పొయ్యి కింద కట్టెల్లో బతుకు మెతుకులు రాజేయడానికి/నా అస్తిత్వానికి గుడి కట్టడానికి నాకూ ఒక గుడిసె వుండేదని ఇప్పుడు ఆ మట్టి వాసన మాయమైందని చెప్తూ నాయన వస్తే ఇల్లు ఇల్లే కదిలి వచ్చినట్టు అనిపించింది అనడం మచ్చి ముగింపు అనిపించింది నాకు. సాపేక్షతకవిత ప్రయోగాత్మక వుంది. దోని ని ఇల్లు పట్టిన దోసిలి గా వర్ణించడం గొప్పగా ఉంది. మొత్తంగా పల్లెను విడువని తనం నిండా వుంది. మా గర్జనపల్లి పాఠశాల కు మద్దికుంట లక్ష్మణ్ సార్ ను కలువడానికి వచ్చి పదవతరగతి పిల్లలకు క్లాసు తీసుకున్న క్షణాలు ఎప్పుడు మతిలనే వుంటై అన్న. ఇంకా మీ ఒంటరీకరణ , సుషుప్తి నుంచి సంపుటాలు చదవలసి వుంది. నాకు చాలా నచ్చిన ఈ టైటిల్ ఫోయమ్ ఊరికి పోయిన యాళ్ళ. పాఠకులు సౌలత్ కొరకు ఇస్తున్న. తేజబ్ కలువని సొక్కం బంగారమసొంటి తెలంగాణ భాష ను కవిత్వంలో ఒంపిన మీకు జయహో.
ఊరికిపోయిన యాళ్ల...
1.ఊరికి పోవడం అంటే
'ఊరికే' పోవడం కాదు -
ఊపిరి కోసం పోవడం
తప్పని సరై తప్పక పోవడం కాదు
గతి తప్పకుండా ఉండడం కోసం పోవడం
నగరం నదిలోని తెప్ప
దారి తప్పకుండా చూడడం కోసం పోవడం
2. ఊరికి పోవడం అంటే
చిరిగిన నెక్కర్ లోని బాల్యాన్ని
గడీల బడి చూరులోంచి దిగిన సూర్యున్ని
పెద్ద బడి బాదం చెట్టు నుండి రాలిన తరగతి పాఠాలని ఒక్క సారి ఒడిసి పట్టుకోవడమే
మంచి నీళ్ళ బాయిలోంచి సోపతిగాల జ్ఞాపకాలని బొక్కెనల కొద్దీ చేదుకోవడమే మోదుగు చెట్టు ముదురు మట్టి ఎండుటాకుల్లోంచి ఎండాకాలం సెలవుల వీరత్వాన్ని మరొక్క సారి తడిమి చూడటమే....
3. ఊరికి పోవడం అంటే -
మంగలి సమ్మయ్య కత్తెరనీ -
మేర మదుసూదన్ మిషిన్ నీ
తమ్మ లచయ్య డోలునీ -
బోయ కమమ్మ బీడీల గంపని
కంచరి రాజయ్య నిప్పుల కొలిమిని
కుమ్మరి ఓదెలు మట్టి కుండలని
శాల నరసక్క ఆసు కొయ్యని -
సదానందం మొగ్గం గుంటని
సుంకరి సారయ్య చాటింపుని
పెల్లి రామయ్య మార్కండేయ పురాణాన్ని
గొల్ల యాదగిరి గొర్రెల కొట్టాన్ని
ముత్రాసి కాంతమ్మ చాపల బండని
మాదిగ సాయిలు డప్పు సప్పుడుని
పక్కీరు సాయెబు నెమలీకల కట్టని
తెనుగు శంకరి బొంబాయ్ మిటాయ్న
కాపు యాదగిరి గడ్డి వామిని
సాంబయ్య సైకిల్ ట్యాక్సీని
గుడిసె రామసామి గుర్రం టాంగా ని
తుర్క రబ్బానీ మాము ఆటోని
గవుండ్ల రఘు బాబాయ్ జీవుని....
మడతలు పడ్డ మస్తిష్కం లోంచి మళ్ళీ వెలికి తీయడమే
4. బాల సంత శంకరయ్యఊదిన శంఖు నాదాన్ని వింటూ
పూసబెర్ల మల్లమ్మ గంపలోని మొలతాడు దారాన్ని కొంటూ
బాల రాజనర్సు జమిడీక సప్పుడుని తడుతూ
పట్వారి పాపిరెడ్డి పట్టా బుక్కులని చూస్తూ మత్స్య గిరి గుడి శిఖరం మీది మైకు లోంచి వేకువ జాము గాలుల్లో తేలి వచ్చే
"పడవెల్లి పోతోందిరా... ఓ మానవుడా" పాటలనిపాడుకుంటూ
దేవుని చెరువు కట్టను మళ్ళీ దాటడమే...!
5. అడుగు పెట్టీ పెట్టగానే
ఊరి మట్టిని దేహం నిండా పులుముకుని
ఆ మట్టి బురదని అత్తరుల అంగీపై చల్లుకొని
లుంగీని ఎగగట్టి ములుగర్రను చేతిన బట్టి దుక్కి దున్ని- మడులు గట్టి-
మట్టి అడుగున దాగి ఉన్న
నా ఊరి జ్ఞాపకాలను తవ్వి పోసి వాటిలో వర్తమానం వరి మొక్కలను నాటుతాను !
6. నేనిప్పుడు నిలువుగా ఎదిగిన చెట్టుని మబ్బుల దాకా ధ్వనిస్తున్న ఆకు పాటని చిటారు కొమ్మల్లో కూచుని ఉన్నా చెట్టు వేళ్ళ లోకే ఒలికి పోతాను మట్టి మూలాలలోనే ఒదిగి పోతాను.
పెరిగి పెరిగి - తిరిగి తిరిగి - కరిగి కరిగి జరిగింది
పాదాలతో కొలతలు మొదలెట్టిన
నేల పైకే మళ్ళీ వస్తాను.
డాలర్ సునామీ కి చెల్లా చెదురై
చెదిరి పోయిన ఇసుక గూడుని పదేపదే నిర్మిస్తాను.
మళ్ళీ ఊరికే వస్తాను
మళ్ళీ మళ్ళీ ఊరికి వస్తాను
7. ఊరికి రావడం అంటే
'ఊరికే 'రావడం కాదు
బస్ పాస్, పాస్ పోర్ట్, వీసాలను రెన్యూ చేసుకున్నట్లు
నా ఐడెంటిటీ ని మళ్ళీ పొడిగించుకోవడం...! పొగ చూసిన ఊపిరి తిత్తుల నిండా
తంగేడు పూల వాసనని మురిపెంగా నింపుకోవడం ...!
నగరం జీవితంలో అలిష్ట పడ్డోళ్ళకు ఊరికి పోవుడు నిజంగ గాలి పీల్చుకున్నట్టే. గ్యాపకాల బొంకెనను చేదుకున్నట్టే. కైత నడిమిట్ల సబ్బండ వర్ణాల చేతి పనులను కలెగల్పిన డాక్యుమెంటరీ. మబ్బుల దాంక సప్పుడు జేస్తున్న ఆకు పాట.
తంగెడును రాష్ట్ర పుష్పంగ ప్రకటించిన యాల్ల మీరు రాసింది. తంగేడు పూల నేల కవిత. గోపి సారూ తంగేడు పూలను బంగరు పూలన్నడు. మీరు బతుకు పిరమిడ్ ను నిర్మించే అమరవీరులు అని జెప్పిర్రు. సలిమంట లాంటి కవిత తెలంగాణ వస్తే బాగుండని ఆశను తెల్పింది. కాళోజీని జెండాగ ఎగిరిన అచ్చరంగ ,రైతు ను మట్టి చెక్కిన శిల్పంగ కవిత్వం జేసిర్రు. అన్న అమ్మ జెప్పిన కందాన్ కతను నిలబెట్టినవు.
ప్రేమతో మీ తమ్ముడు
నాగిళ్ళ రమేశ్
16.11.2021
బచ్చాహుడ్ !
---------మామిడి హరికృష్ణ 8008005231
_____________________
1.జీవితం ఓ మహావృక్షం. Instincts వేళ్ళు ,Emotions కొమ్మలు. అనుభవాల ఆకులు,Intellect పూలు, Intuition పండ్లు..ఈ whole process and Product కి ఆదిపదం, మొదటి హమ్దం .. మూల లయ, తొలి విత్తనం-- బాల్యం! ఇప్పుడు సంపూర్ణమైన చెట్టు మాత్రమే గోచరం... విత్తనం అదృశ్యం!
అవును, బచ్ పన్ ఓ ఇన్సెప్షన్! Time machine ని Rewind చేసి వెనక్కెనక్కెనక్కి నక్కి నక్కి వెళ్లాలనుకునే Regressive transition !!
.
2.'చందమామ దూర్ కే - పుయే పకాయే బూర్ కె' గీతాలను, 'ముద్దుగారే యశోద ముంగిట ముత్యము' జాడలని, 'పిల్లలూ దేవుడూ చల్లని వారె'ననే కీర్తింపబడిన ఊహ నీ , తరతరాల నుండి, నరనరాల గుండా ఇంకిచ్చుకుని , పొంగించుకుని, కృంగించుకుని, మననం చేసుకోగా, ఉనికిలో ఇంకేదో సశేషమని భావిస్తూ.....
Of course, బచ్ పన్- ఓ పహచాన్ !.అష్టదిక్కుల్లో చరిస్తూ మన ఇంటికి ,వంట్లోకి ,కంట్లోకి నడిచొచ్చే నిరంతర మెహమాన్!!
3.బ్రహ్మ మొక్కటే... బాల్యమొక్కటే ..!.కానీ బహుళ బాహువులతో, బహు ముఖాలతో బహుళ స్వరాలతో నినదించీ ,నిరసించీ, నిలువరించి, నగమై నిటారుగా నిలిచి, నదిలా ప్రవహించి, నభోవీధిలో సంచరించి, అనువదించటానికి వీలులేని అచ్చమైన జ్ఞాపకంగా, సచ్ ముచ్ యాద్ గా సదా బహార్ గెలిచిన బాల్య మొక్కటే .... పర బ్రహ్మ మొక్కటే !
నిజమే .. చిన్ననాటి డీకోడ్ చెయ్యలేని ఓ తాళపత్ర ఐడియాలజీ! .. కవులందరి నిత్య స్మరణీయ ఎలిజి!!
4.గ్రీక్ పైడికీ ఇలికియా ,లాటిన్ ప్యూరిటియా ,అరబిక్ మర్హాలత్ అల్టుఫులా, ,జర్మన్ కింధేట్ ,స్పానిష్ ఇన్ఫాన్సియా ,ఫ్రెంచ్ ఎన్‌ఫాన్స్ ,బెంగాలీ షైసభ ..ఇంకెన్ని చెప్పినా హ్యూమన్ జెనెటిక్ ఇంజినీరింగ్‌లో జన్యుమొక్కటే ...!
బహుశా, బాల్యం ఓ ముషాయిరా! .. కావ్యాలన్నీ కృతజ్ఞతలు చెప్పుకునే వాక్యాల జాతర ...!!
5.ఇంత అనుకున్నాక" బచ్చా హుడ్ "ని అర్ధం చేసుకుని, పైట అనిపించుకుని, షార్ట్‌హ్యాండ్‌లో స్మార్ట్‌గా చెప్పాలనుకుంటాం ..కానీ అది అదోలోకం ,అధో ప్రపంచం
దాని రహస్య మార్గం శ్రీరాముడికీ ,అభిమన్యుడికీ, ఎలెక్ట్రా కి, ఈడిపస్ రెక్స్ కీ, వాల్మీకికీ, వ్యాసుడికీ, Sophocles కీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ కీ ,ఎలిజబెత్ హర్లాక్ కీ తెలుసు !
అందుకే బాల్యం ఓ పురాణ పురస్మృతి! పురాలు ,ఇహపరాలకు అందని, అంతుచిక్కని ఆకృతి !!
6. కాలం నిర్దయ! లోకం నిత్య భయ! బాల్యం నిర్భయ ! ఫుట్ పాత్ మీద, చెత్త కుండీల్లో , స్లమ్స్లో, ఘెట్టోస్ లోనే కాదు. బడిలో,గుడిలో,ఖార్ఖానాలో ,షాదీఖానాలో ,దవాఖానాల్లో ,నెట్ లో ,ఇంటర్ నెట్ లో నిత్యం భయం డ్రెస్ వేసుకొని అడ్రస్ లేకుండా ప్రయాణిస్తూ ,పలవరిస్తూ ,కలవరిస్తూ ,ఎవ్వరికీ ఏమి కాని అనాధ!. రుద్దబడి .. దిద్దబడి .. తల్లిదండ్రులు ,సమాజం లక్ష్యాలు బరువు ల క్రింద నలిగి, చిరిగి మూస మానవుడికి నకలుగా మారే విషాద గాధ !
అవును ,బాల్యం ఓ నెమలీక ! నెమలి నుంచి దూరమైన దుఃఖ చారిక !!
#mhk_కవిత్వం
గౌరవ అతిథి!
----- మామిడి హరికృష్ణ
ఈ దిగంతాల దిగువన
క్షితిజ రేఖల చివరన
జ్వలిస్తున్న దీపం నువ్వు-
ప్రపంచానికి కనిపించే వెలుగును నేను..
నేలకు ఊర్థ్వ మ్ గా
ఆకాశం అంతరంగంలో
సంచరించే వాయువు నువ్వు-
మట్టి దేహంలో ఆడే శ్వాసను నేను..
సమూహ జీవనంలో
అజ్ఞాత సమయాల నుండి
జన విజయాల సంకేతమైన పండుగ నువ్వు-
ఎగిరి, దూకి, చిందేసి పాడే వేడుక నేను..
అర్ధ జీవిత కాలంలో
అర్ధ భూగోళ భ్రమణ పరిభ్రమణం లలో
వ్యోమ యాత్రను సాకారం చేసిన జాబిలి నువ్వు-
అర్థ నిమీలిత నయనాలతో
చల్లగా కాసే వెన్నెల నేను...
ఈ నాటి దీప ఛాయలో
జ్ఞాన నేత్రం తెరుచుకుంది..
యుగాలుగా చీకటి
నాకు బయట
గాలిలో వేళ్ళాడుతూ ఉంది అనుకున్నాను..
ఇంతకాలంగా అది
నాలోనే నాతోనే ఉందని అర్థం
...
నిజానికి నీడనూ, నిశీధినీ నేనే అని బోధపడింది...
ఈశ్వరా...
ఇన్నాళ్లకు నాకు తెలిసింది-
ఈ జీవన లౌల్యానికి- అనంత ప్రేమకి
ఈ కాలానికి - ఈ లోకానికి
నేను అధిపతిని కాను..
కేవలం అతిథిని మాత్రమే అని...!!
5-11-2021
#mhk_కవిత్వం
బుగులోని తీర్థం
1. మా ముత్తాత మా తాతకు
మా తాత, మా నాయ్నకు కశికెడు పాలతో నేర్పిచ్చిన రివాజు
దేవుడి ముచ్చట మతిలకు ఎక్కించిన మొదటి ఆవాజు బుగులెంకటేశుని తీర్థానికి బైలెళ్ళిన రోజు
తరతరాల మా నమ్మకం
ఒక తంతెనుండి ఇంకో తంతెకు ఆచారం లెక్క వచ్చింది.
రెండువేల గడపలున్న ఊళ్ళే
మా ఇంటికి బౌభాగపేరు తెచ్చింది.
నెలకొక్క పున్నమి పొడుపు మామూలే
కానీ జిరాల పున్నమి అంటేనే పెద్ద ముచ్చట
అప్పుడే యాటకొక్కపాలి బుగులోని తీర్థం జర్గుతది
ఊరికి ఉత్తరం దిక్కున 30 మైళ్ళు అవతల బుగులోని తీర్థం- తుమ్మలు-తుప్పలు, రేగుచెట్లు, పరికి పండ్లు, బలుసు పండ్ల చెట్లు స్వేచ్ఛగా పెరిగిన చిన్న అడవి
ఆ అడవి నడుమల పెద్ద గుట్ట
ఆ గుట్టపైన సొరికెల నెరిసిన దేవుడు
మా ఇంటిదేవుడు బుగులెంకటేశ్వరుడు!
2.గప్పట్ల -
బుగులోని తీర్థం పోవుడంటే ఓ కాశీ మజిలీ యాత్రకు పోయినట్టే
ఇంటి పండుగను ఊళ్ళన్ని తిర్గుకుంట చేస్కున్నట్టే!
అన్నట్టు తీర్థం పోవుడంటే-
భద్ర జీవునిలో నిక్షిప్తమైన దేశదిమ్మరితనం పురావాసనే కదా....
Indeed, it's a Nomadic Vestige
The Revisting of instinctual Spiritualism
The manifestation of primate naturalism
The resurfacing of hidden originalism!
తీర్థం పోవుడంటే
భక్తి-రక్తి మిళాయించిన
ఓ ప్రయాణ పండుగ!
ఆత్మను ఎనుకులాడుకుంట అడుగులేసే జిప్సీ జీవనం!
సామూహిక సంచార ఉత్సవం!
తొలి మానవుడి జన్యు సహజాతాల ప్రదర్శనం!
తీర్థం పోవు డoటే-
అనాది కాలంల మొదలైన
అర్థాంతరంగా ఆగిపోయిన ఆదిమయాత్రను కొనసాగించడమే కదా!
3.ఇగ బుగులోని తీర్థం పోవుడంటే
మా ఇంట్ల ఓ పెండ్లి చేసినట్టే
ఇంట్ల పెండ్లి చేసినట్టే
ఏరువాక దున్నినట్టే
నెల రోజుల ముందుగాల సందే హైరానా శురువయ్యేది
ఊరూర్ల ఉన్న బందుగులందరికీ మతలాబు చెయ్యాలే
దానికోసం మనిషిని పంపియ్యాలె
బండ్లను వడ్లాయనతోని
బండిగీరెల కమ్మెలను కమ్మరాయనతోని పుదియ్యాలె
నీళ్ళతోని మంచిగ కడిగి
నొగలుకు, గీరెలకు పసుపు కుంకుమ బొట్లను పెట్టాలె
వెదురు బొంగులను వంచి బండి మీద గుడారం లెక్క చేసి
దానిపైన చెద్దరులను కట్టాలె!
మనుషులతో పాటు గొర్రెలు, కోళ్ళు, కట్టెలు, వంటసామాన్లు సదురాలె! చూస్కో ఊరు ఊరే బండ్లమీద బైలెల్లినట్టు కనబడాలె!
మొత్తం రెండు రాత్రులు ఒక పగలు పోతె
బుగులోని జాతర !
ఊరు నుంచి మైలారం దాటి
కొప్పులకు పొయ్యేటాలకు చీకటి పడేది
అక్కడ మా తాత సుట్టాల ఇంట్ల రాత్రి విడిది
సంవత్సరానికొక్కసారి కలుత్తమని
బౌ పానంగ మర్యాదలు ... ముచ్చట్లు
రాత్రి బోయనాలు చేసి బైలెళ్ళేది
ఆకాశంల త్రయోదశి ఎన్నెల వెండి పూతల జిగేల్ జిగేల్...
మట్టిబాట మీద ఎద్దుల కాలిగిట్టల టకేల్ టకేల్
గంగడోలుల మీద గజ్జెల ఘల్ ఘల్ బండిగీరెల కింద ఎండుకొమ్మలు విరిగిన చిటపట చిటపటల్...
బండిలోపల మనుషులు అచ్చట్లు ముచ్చట్లు
అన్నీ కలిసి ఎన్నెలరాత్రిని ఆరబోసిన గాలిల
వింతైన ధ్వనులను పరిమళిస్తుండేటియి
ముచ్చట్లల్ల ముచ్చట్లల్లనే
ఎడ్లు నడుంటే నడుత్తాంటెనే
బండ్లె కట్టేసిన కోడి కూత్తది
తూర్పు గట్లల్ల తెల్లవారుతది
బుగులోని గుట్టకాడికి
మా బండ్లు చేరుకుంటయ్!
4. ఓ చెట్టునో, గుట్ట నీడనో సూసుకొని
బండ్లను ఆపి ఎడ్లను ఇడిసి గడ్డి వేసి
విడిది ఏర్పాటు చేసుకుంటం.....
మొకాలు, కాళ్ళు చేతులు కడుక్కొని
దేవుని గుండంల తానాలు జేత్తం
మూడు మునుగులు
మూడు చెంబుల నీళ్ళు తలమీద గుమ్మరించుకొని
బట్టలు మార్చుకుని
నీళ్ళు కారుతున్న వెంట్రుకలతోనే
గుట్ట ఎక్కుడు షురూ జేత్తం
బండల సందులకెళ్ళి - సొరికెలల్లకెళ్ళి
బుగులెంకటేశుని గుహదగ్గరికి పోయి
దండాలు పెట్టి - కొబ్బరికాయలు కొట్టి
పసుపు కుంకుమలు బొట్లు పెట్టి
మొక్కులు అప్పజెప్పుతం.......
గుండె నిండ భక్తిని నింపుకుని
కండ్ల నిండ దేవున్ని సూసి తప్పులు కాయమని చెంపలేసుకొని వచ్చే ఏటికి అంతా మంచే చెయ్యమని
దేవునికి ముడుపులు కడతం!
పోయిన తొవ్వల నె
మళ్ళ గుట్టు దిగి వచ్చి
గుట్ట కింద గుడారం దుకాణాలల్ల
బత్తేసలు, నిమ్మ చిల్కలు, ప్యాలాలు, బెల్లం కొనుక్కొని
దేవుని పలారం అని మూటలు కడ్తం...
5. ఇగ, మా బాబాయ్ లు -
విడిది కాడికచ్చి
దేవుని పేరుమీద మొక్కి పొట్టేల్ను, కోళ్ళను కోసి
ఆ నెత్తురును అందరికి బొట్ల లెక్క పెడ్తరు.
జీతగాండ్లు కోడి బూరు పీకి - పొట్టేలు తోలు ఒలిచి
ముక్కల కింద కొట్టి దేనిది దానికి పోగులు పెడ్తరు
తలకాయ బొక్కలు - నెత్తురు - మాంసం-
దేనికదే కుప్పలు పెట్టి మంచిగ కడుగుతరు
బండలు ఏరుకచ్చి పొయ్యి పుదిచ్చి
కట్టెలు పెట్టి అగ్గి రాజేత్తరు
గప్పుడు ఇగ ఆడోళ్ళపని మొదలైతది.
బాపమ్మ, అమ్మ, చిన్నమ్మలు అంత కూడి
వాటన్నిటిని పెద్ద పెద్ద బాసాన్ ల పెట్టి
మసాలా - గసాలాలు - పసుపు, కారాలు దట్టించి
పొయ్యిమీద గిన్నెలల్ల మరుగుతున్న నూనెల వేసి
ఘుమ ఘుమలాడే కూరలు చేత్తరు !
6. నేను చినపిలగాడ్ని గదా-
మెదడు - గుర్ధాలు - కప్పూరం - గుండె అసొంటి మెత్తటి భాగాలు సూకాగ వండి సక్కగ పెడ్తరు .
వంటలన్నీ అయిపోయి, మంటలను చల్లార్చి
గిన్నెలల్ల కూరలన్ని పొగలు కక్కుతున్నపుడె
నన్ను ఎత్తుకుని మా అమ్మ గోరుముద్దలు పెట్టేటిది తాత-నాయ్న-బాబాయ్ లు -బంధువులు
మొగోళ్ళంత
బండ్ల పక్కన చెట్టు నీడల్ల బంతిలెక్క కూసొని
సారా బుడ్డీల మూతలను
పట్వలల్ల ఉండే కల్లు మీన ఈతాకులను తీసి
స్టీలు గ్లాసులల్ల వంచి - అందరికి పంచుతరు !
ఇగ ముచ్చట్లు మొదలైతై
తాత ముత్తాతలనాటి కతలు - ఇగురాలు- ఇకమతులు
అన్నీ యాది చేసుకుని మాట్లాడుకుంటరు.
పల్లెంల ముక్కలను తినుకుంట,గ్లాసులల్ల సారా తాక్కుంట
ముచ్చట్లల్ల మునిగి తేలి
ఎప్పటికో బువ్వతిని ఎక్కడోళ్లక్కడ పండుకుంటరు!
ఇస్తాళ్ళు ఎత్తేసి, గిన్నెలు - తపేలాలు అన్నీ కడిగి
ఆడోళ్ళందరూ అన్నీ సదిరి
చాపల మీద నడుం వాలుస్తరు!
సూత్తాంటే సూత్తాంటేనే రాత్రయితది
పండు పగిలినట్లు పున్నమి ఎన్నెల ఇరగబూస్తది
అందరం ఒక్కచోట చేరినంక
పాటలన్ని అయిపోయినంక గా ఎన్నీలలనె బోయనాలు
మాటలు మాటలల్లనె మల్ల ముచ్చట్లు
అటెన్క మాతోటి వచ్చిన కూనపెల్లి రామయ్య
మార్కండేయపురాణం కథలు కండ్లకు కట్టినట్టు కనికట్టు చేసినట్టు
కథాగానం మొదలు.....
ఇనుకుంట ఇనుకుంటనే అక్కడే అందరి రాత్రి నిద్రలు!
7. పొద్దుగాల కోడి కూసే యాళ్ళకు
అందరు లేసి నోట్లె యాప పుల్లలు ఏసుకొని పండ్లు తోముకుంటరు రాత్రి అన్నంనే పులిహోర లెక్క చేసి అందరికి పెడ్తరు.
గుడాలు గిన్నెలల్ల పోసుకుని బండ్లెక్కి
ఊరి దిక్కు పయనం కడ్తరు
సడుగు మీద ఎనకపొంటి బుగులోని గుట్ట కనిపించే దాక
'గోవింద గోవింద' అని వెంకటేశ్వరుని తల్సుకుంట
ఇంటి మొకాన ఎడ్లను తోలుతరు
ఎక్కడ ఆగకుంట
మాపటి యాళ్ళకు ఊరికి-ఇండ్లల్లకు చేరుకుంటరు.....!
ఆడోళ్ళంత మల్ల వంటలు చేసి
అందరికీ వడ్డించి ఎక్కడోళ్ళను అక్కడికి సాగ తోలుతరు
తెల్లారి పొద్దుగాల
అమ్మ - బాపమ్మ - చిన్నమ్మలు
నిష్టగ తలకు నీళ్ళు పోసుకుని, తానాలు చేసి
కొత్త చీరలు కట్టుకుంటరు.
బుగులోని తీర్థం పలారాలను
పేపర్ల పొట్లాల లెక్క కడ్తరు.
ఊళ్ళే అందరి ఇండ్లల్లకు పోయి
ముత్తయిదుల కాళ్ళకు పసుపు రాసి
పలారం పొట్లాలను అందరికీ పంచుతరు...
8. గిట్ల బుగులోని తీర్థయాత్ర
మా తాత కాలం దాకా బౌ సక్కగ నడిసింది.
మా తాత సచ్చిపోయిండు
వారసత్వంగా మా నాయ్నకు - బాబాయ్ లకు పొలాలు, భూములు, అన్నీ విరాసత్ ల సంక్రమించినై
బంగారం - భవనాలు
ఎడ్లు - కొట్టాలు - పండిన పంటలు అన్నీ సమానంగా
పంపకమైనయి
కానీ
మా ముత్తాత - తాతకు అందిచ్చిన బుగులోని తీర్థయాత్ర
మా తాతతోనే ఆగిపోయింది.
అన్ని పంచుకున్న కొడుకులు -
ఉజ్జోగం సజ్జోగం కోసం కొత్త యాత్రలు పోయిండ్రు!
ఎక్కడెక్కడికో ఎగిరిపోయిండ్రు!
ఇప్పుడు మా తాత... బుగులోని తీర్థానికి మా యాత్ర
రెండూ చిన్నప్పటి జ్ఞాపకాల లెక్కనే....
నడిమిట్ల ఆగిపోయిన ప్రయాణం లెక్కనే....
తెగిన తంతే లెక్కనే....
తల్లి పేగును తెంపుకున్న పసిబిడ్డ లెక్కనే.......!
- మామిడి హరికృష్ణ
(మే, 2011)