బెంగటిల్లిన ఉత్తరం!
----- మామిడి హరికృష్ణ 8008005231
పేరుకు ఉత్తరమే కానీ
అష్ట దిక్కుల నుండీ
మనందరినీ కలుపుతున్న వృత్తం ఇది!
ఉత్తరం ఒకప్పుడు నా ఉటోపియా
ఇప్పుడు ఓ నోస్టాల్జియా
ఉత్తరం పరిణామ శీలి- నిత్య చైతన్య జావళి
పేరు మారొచ్చు- రూపు మారొచ్చు
ఉత్తరానికి జరా మరణాలు లేవు
ఉత్తరం లేకుండా మన జ్ఞాపకాలు ఉండవు !
ఉత్తరం ఇప్పుడు
అంతరించిపోతున్న జీవజాలం కాదు
అవతారం చాలించిన అక్షర దేవత !
పోస్ట్ box నుంచి ఇన్ బాక్స్ లోకి
రూపాంతరించిన ఆకాశ దూత !
ఉత్తరం -
తాత తరం నుంచి నేటి తరం దాకా
నిరంతరం ప్రవహిస్తున్న జీవ నది !
తోడుకున్నోళ్లకు తోడుకున్నంత
జ్ఞాపకాలను ఇచ్చి
మనసునంతా తడిమేస్తుంది
కాలాన్ని కన్నీటి చెమ్మతో తడిపేస్తుంది !
ఇప్పటిదాకా ఎందరెందరి బెంగలనో తీర్చిన ఉత్తరం-
ఇన్నాళ్లకు తానే బెంగటిల్లింది
రాసే చేతులు కరువై- పెన్ను బరువై
కాగితంపై వాక్యాలూ చెరిగిపోయి
సిరా ముద్రలు అలుక్కుపోయి
ఆలోచనలన్నీ గజిబిజియై ఉత్తరం బెంగటిల్లింది!
ఇల్లు ఖాళీ చేసినంత సులువు కాదు కదా
ఉత్తరాన్ని ఖాళీ చేయడం !
ఏ భావం ఏదో ఏ ఉద్వేగం ఏదో
తెలీని కొలాజ్ చిత్రంలా
ఒంటినిండా అక్షరాల నగలను దిగేసుకొని
గుండె మూసుకుపోయిన మనిషిలా
ఉత్తరం ఇప్పుడు బెంగటిల్లింది!
ఇప్పుడు ఉత్తరం
పెన్ను పెదాల చుంబనానికి దూరమై
తెల్లని అంచుల నడుమన
ఖాళీ గదిలో బెంగటిల్లి పdi ఉంది!!
3 మార్చి, 2012
No comments:
Post a Comment