Thursday, 28 January 2021

పాద భాష

 Here, it's my poem #PAADA_BHAASHA! ( Language of the feet) published on 3-1-2020 in namaste telangana newspaper.. plz read..


పాదభాష!

                       -మామిడి హరికృష్ణ, 8008005231


భాష అంటే పదాలే  అనుకున్నాం

కానీ పాదాలు కూడా భాషిస్తాయి!


మాటల భాష కన్నా

నిజానికి దేహభాషే గొప్పది!

కళ్ళు మాట్లాడతాయి

లేకపోతే కవులు అంతగా కళ్ళను ఎందుకు కీర్తిస్తారు?

కనుబొమలు కూడా మాట్లాడతాయి 

లేకపోతే  మాటలలోకి కుదించకపోయినా 

ఇష్టాఇష్టాలు ఎలా అర్ధమవుతాయి?


చేతులకీ భాష ఉంది

లేకపోతే మనసులోని భావాలన్నీ

సైగలతోనే ఇతరులకు ఎలా తెలుస్తాయి?


అవును, పాదాలకీ భాష ఉంది!

ఇంతకాలం అది నాట్యంలో కనిపించింది

నడకలో దర్శనమిచ్చింది

పరుగులో వినిపించింది

స్పర్శలో అర్ధమయింది !


నీకు తెలుసా?

పాదాలు మాటలు మాత్రమే కాదు

పాటలు కూడా పాడతాయి

అరిపాదాలు సంబరాలతో అంబరమవుతాయి

బొటన వేళ్ళు నిలకడగా నివ్వెరపోతాయి 

కాలివేళ్ళు సందిగ్ధంలో తత్తరపడతాయి 

పాదాలు ఊగి తూగి విస్మయాన్ని, విజయాన్ని చెపుతాయి 

నడిచీ మడిచీ విప్లవాన్ని, వైఫల్యాన్నీ వెల్లడిస్తాయి 

స్థాణువై నిలిచి విషాదాన్ని, విలాసాన్నీ లిఖిస్తాయి !


నిజానికి పెదాలు కొన్ని సందర్భాలలోనే మాట్లాడతాయి

కొన్ని సమయాలకే పదాల రంగులను అద్దుతాయి 

కానీ పాదాలు వసపిట్టలు

సవ్వడి లేని సంభాషణ వాటికి తెలుసు

సందడి లేని సంతోషం వాటికి సొగసు !


పాదాలు నిరంతరం సంభాషిస్తూనే ఉంటాయి

నడకలో, నిలకడలో, పరుగులో, గంతులో,

చిందులో, నర్తనలో, విన్యాసహేలలో

పాదాలు పదాలు పలుకుతూనే ఉంటాయి !


కళ్ళు మూసుకుని, పెదాలు బిగించి,

ముసుగు కింద ముఖం కప్పేసిన వేళల్లో

ఆఖరికి దేహమంతా నిద్రలో కూరుకుపోతున్నప్పుడు సైతం

పాదాలు మాట్లాడుతూనే ఉంటాయి...!


ఆఖరుగా నీ పాదాలు ఎదురైనపుడు 

మాటలన్నీ ఆవిరై  మౌనాన్ని కప్పుకుంటాయి 

ఇక నీ పాదచాలనం  జరిగినప్పుడు మాత్రం 

ప్రేమ లేపనాన్ని పూసుకొని గాలిలో తేలిపోయి 

గుసగుసలతో రహస్య భాషలో సంభాషణను పెనవేస్తాయి !

#mhk_poetry

No comments:

Post a Comment