Friday, 30 October 2020

Caricatures

 



MHK poetry Analysis - అంబటి వెంకన్న

 "సుషుప్తి నుంచి"...

 మేలుకొలిపిన కవిత్వం...

#sushupti_nunchi

#mhk_poetry

వరంగల్‌ జిల్లా శాయంపేట మట్టిలో పుట్టిన మామిడి హరికృష్ణ కేవలం అధికారి మాత్రమే కాదు. అసాధారణ ప్రతిభాశాలి. సకల కళా కోవిదుడు, సాహితీ విమర్శకుడు వంటి మాటలు ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడో 1986 ప్రాంతంలో రాసిన కవిత్వం, ఇయ్యాల అదే చేతిరాతో "సుషుప్తి నుంచి" అనే కవితా సంపుటిగా అచ్చు కావడం వల్ల మామిడి హరికృష్ణ లోని భావుకున్ని, కవిత్వ ప్రేమికున్ని కొత్తగా చూసినట్టయింది. అంతేకాదు కవుల మీద ఆయా స్థల కాలాలతో పాటు పుట్టి పెరిగిన వాతావరణం, వయసు ప్రభావం కచ్చితంగా వుంటాయని మరోసారి నిరూపించిన కవితాసంపుటి.

హైస్కూల్ దశలోనే ఆంగ్ల కవితను తెలుగులోకి అనువదించి, అందరి ప్రశంసలు అందుకున్న మామిడి హరికృష్ణ ఆరోజు తన తల్లి కళ్ళల్లో చూసిన ఆనందం ఎప్పటికీ చెరగని దృశ్యం అయింది. ఇయ్యాల ఇంత ఉన్నత స్థాయిలో నిలబడే అవకాశాన్ని కల్పించింది. 


"అమ్మ అక్షరం అయితే నాన్న వాక్యం" అని ప్రకటించి తల్లిదండ్రులను పుస్తకంగా గుండెలకు హత్తు కుంటడు. 

ప్రేమామృతాన్ని సేవించి, ఆ మత్తులో మునిగిపోతడు. ఒళ్ళు మరిచి నిద్రపోతడు. సుప్తావస్థ లోను శిగమూగుతడు. "ఐ, తపస్వి" అనే కలం పేర్లతో "సుషుప్తి నుంచి" మొదలై ఊహల్లో తేలిపోతడు. ప్రకృతిని ఆరాధిస్తడు. 


"పారేసుకున్న మనసును 

ఎంత వెతికితే ఏం లాభం" అంటూనే ఆమె కోసమే గొంతెత్తి పాడుతడు. ఆడుతడు. అందమైన బొమ్మలు గీస్తడు. ప్రేయసిగా సంభాషిస్తడు. 

"నిన్న రాత్రి నీ వెన్నెల సంతకాన్ని 

చెరిపేయాలని చూస్తున్న తుఫాన్ కి 

నా ప్రాణాన్ని బలి చేశా" అంటడు. అణువణువునా నింపుకున్న ఆమే తన ప్రపంచంగా నిశీధి లోనూ, శూన్యం లోనూ, అగాధం లోనూ అంతట ఆమెనే దేవులాడుతుంటడు. బహుశా ఆమె "స్పందన" కావచ్చునేమో. అయినా ఆమె స్పందనతో సంబంధం లేదు. అక్షరాలకు అంతులేని రూపాన్నిచ్చిన ఆమెను తలచుకుని మామిడి హరికృష్ణ తన "అరూపం" అనే కవితలో 


"పాస్ పోర్ట్ సైజు ఫోటోలో 

నీ పూర్తి రూపాన్ని వెతుక్కునే నేను

నీ హృదయంలో నా రూపాన్ని మాత్రం 

కనుక్కోలేక పోతున్నా" అంటూ పిచ్చోడై తిరుగుతడు. రూపు కట్టని దృశ్యాన్ని, చేతికి తాకని స్వప్నాన్ని వెతికి వెతికి సొమ్మసిల్లి పోతడు. 


"ఎన్నో రైళ్లు వచ్చి పోతున్నాయి 

కానీ.. ఆ మొదటి రైలు మాత్రం రాలేదు 

వచ్చినా ఒక్క సీటు ఖాళీగా లేదు" అంటూ అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం కంటే దౌర్భాగ్యం ఏముంటది. తన బలాన్ని, బలహీనతను నిందిస్తూనే సుతిమెత్తగా

"నీకు అన్నీ కనిపిస్తాయ్ 

వినిపిస్తాయ్ 

నీకు వినిపించనిదల్లా

నా గీతం ఒక్కటే" అంటూ ఆమెకు దూరమై, దగ్గరై, సర్వస్వం కోల్పోయిన వాడై తన "సామాన్యుడు" అనే కవితలో 

"ఓడిపోయినట్టుగా చివికిపోయి

చిరుగులు పట్టిన దేహాన్ని

శాశ్వత సుషుప్తి లోకి తీసుకు వెళ్తున్నాను" అంటడు. అంతటితోనే ఆగిపోకుండా సుధీర్ఘ నిద్రావస్థ నుంచి మేలుకున్న కవి చీకట్లను చీల్చే వెలుగును కలగంటడు. మిణుగురులై తొణికిసలాడే చిరు దీపమైన తనకెంతో ఇష్టమని ప్రకటిస్తడు. "సుషుప్తి నుంచి.." ఆశావహ దృక్పథం వైపుకు అడుగులేస్తడు. భవిష్యత్ చిత్రపటాన్ని గీస్తడు. జీవితంలో ఒక్కో మెట్టుగా కీర్తి శిఖరాలను అధిరోహించిన మామిడి హరికృష్ణ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కళలు, సాహిత్యం తన రెండు కళ్లుగా జీవితాన్ని సాఫల్యం చేసుకున్నడు. తన సాహిత్య కృషికిగాను 2018లో బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా సినీగోయర్స్ అవార్డును అందుకున్నడు. 2009లోను, 2012లోనూ ఉత్తమ సినీ విమర్శకుడిగా రెండు సార్లు నంది అవార్డులు సొంతం చేసుకున్నడు. 2018లో ఇండీవుడ్ అవార్డును, 2019లో జి సినిమా అవార్డును అందుకున్నడు. తాను పుట్టి పెరిగిన ఊరు శాయంపేట పల్లెను తల్సుకొని తెలంగాణ భాషలో "ఊరికి పోయిన యాళ్ళ" అనే కవితా సంపుటిని 2018లో వెలువరించినాడు. అదేవిధంగా తన ఏకాంత జీవితాన్ని ప్రతిబింబించే "ఒంటరి కరణ" కవితా సంపుటిని 2019లో ప్రచురించి తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిల పరచుకున్నడు.  

"శిలగా మారిన మనిషికి నిరీక్షణ పెద్ద కష్టమేమీ కాదని" అంటడు. 

"గతం ఉరి తీతలను వర్తమానం ఉలి దెబ్బలను ఎప్పటికీ మర్చిపోలేననీ" అంటూనే ఆశలు, ఆకాంక్షలను అక్షరాలుగా పేర్చుకుంటడు. తాను ప్రేమించింది, ఆరాధించింది ఎక్కడో కనుమరుగై పోయినప్పటికీ నిటారు మనిషిగా నిలబడుతడు. కళా సేవలో తరించిపోతడు. అంతు లేని నైరాశ్యం నుంచి తేరుకొని ఆశయాల జెండాను ఎగరేస్తడు. 

కవిత్వాన్ని ప్రేమించి, కళలను గౌరవించి, అక్షరాన్ని ఆలింగనం చేసుకునే మనసున్న గొప్ప సృజనకారుడు మామిడి హరికృష్ణకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను.

         


          - అంబటి వెంకన్న

Sunday, 25 October 2020

బహుమఖ ప్రతిభాశాలి మామిడి హరికృష్ణ గారు


బహుమఖ ప్రతిభాశాలి మామిడి హరికృష్ణ గారు


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే ఏమస్తుందనే సమాజానికి ఇక్కడి మట్టి మాణిక్యాలు వెలుగొందు తాయని ,ఈ ప్రాంత సాంస్కృతిక అస్తిత్వం నిలుస్తుందని ,దీనితో పాటు ఇక్కడి కళలు, కళాకారులు, కవులు, చరిత్రకారులు, మన భాష యాస తో తెలంగాణ పూర్వవైభవం సిద్ధిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ని చూస్తే అర్థమవుతుంది. ఈ రకంగా ఒక్కొక్కరు ఆయా రంగాల్లో తెలంగాణ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.  హరికృష్ణ గారు స్వయంగా కవి ,విమర్శకుడు, అనువాదకుడు ,ఆర్టిస్టు, బహుముఖ వ్యాసకర్త, బహుభాషావేత్త ,మంచి వ్యాఖ్యాత .తాను విస్తృతమైన జ్ఞానాన్ని పుస్తకాల్లోని అక్షరాలతో నిర్మించుకున్నారు .అందుకే వీరు అంశం ఏదైనా ఆ అక్షరాలు దానికి చెందిన జ్ఞానాన్ని ,భావాన్ని సహజంగా వ్యక్తపరిచేలా చేయడం వీరిలో గొప్పతనం . ఇదంతా వీరికి బాల్యం నుండి నిరంతరం అధ్యయనం చేయడం వల్ల ఏర్పడింది.


       బాల్యం -చదువు:


         హరికృష్ణ గారు పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం .ఈ గ్రామం గొలుసుకట్టు చెరువులతో ,అన్ని కులాలు,వృత్తులు ఉండే గ్రామం .వీరు పద్మశాలి కులంలో పుట్టినప్పటికి, వీరి తాత వ్యవసాయం చేయగా, తండ్రి మామిడి సుదర్శన్ గారు  మంచి డాక్టర్ గా స్థిరపడ్డారు.వీరి అమ్మగారు స్వరాజ్యం .చదువుల తల్లి, తాను చదువుతూ హరి కృష్ణ గారిని ఇష్టంగా చదివించింది .ఈ దంపతులకు కలిగిన ఐదుగురు సంతానంలో హరికృష్ణ గారు పెద్ద కాగా ,మిగతావారిలో ముగ్గురు చెల్లెల్లు ,ఒక తమ్ముడు .అందరిపెళ్లిళ్లు చేసిన హరికృష్ణ గారు వారందరికీ మంచి భవిష్యత్తునందించారు.


           బాల్యంలో హరికృష్ణ గారు ఇంగ్లీష్ మీడియం లో చదివినప్పటికీ ,ఆ తర్వాత గ్రామంలోని చిన్న బడి ,పెద్ద బడిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు.వీరు తరగతిగదిలో అడిగే ప్రశ్నలకు మిగతా పిల్లలకు పాఠం మొత్తం   అర్థమయ్యే విధంగా ఉండేదని ,వారి బాల్య మిత్రుల మాటల్లో వినిపిస్తుంది. అంతేకాదు తాను చదువుతుంటే తన తోటి మిత్రులకు కూడా చదువు కోవాలనే స్ఫూర్తి కలిగేదని చెప్తారు. మొదటినుండి హరికృష్ణ గారు చదువులో ప్రధమ స్థానం లోనే ఉండే ప్రతిభావంతుడు. ఎనిమిదవ తరగతి లోనే పెద్దబడి ప్రధానోపాధ్యాయులు రామ్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కెరటం మ్యాగజైన్లో మొదటగా రాయడం ప్రారంభించారు. తన తల్లి సహకారంతో చిన్నప్పటినుండి జ్ఞానతృష్ణ అధికంగా పెంపొందించుకొని ,అందుకోసం అక్షరాలతో స్నేహం ,పుస్తకాలతో ఆత్మీయత, ఆ పుస్తకాలు పంచిన జ్ఞానంతో  మైత్రి చేయడం మొదలుపెట్టారు .అందుకేనేమో ఎనిమిదో తరగతిలోనే చలం  పుస్తకాలను పూర్తిగా చదివి నారు.ఆ తరువాత పదవ తరగతి లోనే తెలుగు ప్రముఖ కవుల మీద ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరుచుకొన్నారు. ఇంటర్మీడియట్ వరంగల్   లాల్ బహదూర్ కళాశాల లో ఆర్ట్స్ గ్రూప్ లో చేరారు. నిరంతరం అధ్యయనం చేయడం,ఆ పుస్తకాల తోనే సావాసం చేయడం ద్వారా ఇంటర్ లో నే భారతీయ భాషల్లోని గుజరాతీ, తమిళ్, కన్నడ, బెంగాలీ ,హిందీ, ఒడియా సాహిత్యాన్ని చదవడమే కాక మొత్తం భారతీయ సాహిత్యం మీద ఒక అవగాహన ఏర్పరుచుకొన్నారు. ఆ తరుణంలోనే ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ పత్రికలకు కవర్ స్టోరీస్ తో పాటు వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఇక అదే కాలేజీలో డిగ్రీ లో చేరి నిరంతరం ఎక్కువ సమయం గ్రంథాలయంలో వైవిధ్యమైన పుస్తకాలు చదువుతూ అంతర్జాతీయంగా పేరుగాంచిన మెక్సికో ,గుంతర్ గ్రాస్ ,కార్ల్ మార్క్స్ ,ప్లేటో ,ఎమిలి,హెగల్ మొదలైనవారి సాహిత్యాన్ని జ్ఞాన తృష్ణ తీర్చుకోవడానికి అధ్యయనం చేశారు. వీటితోపాటుగా అభిరుచి మేరకు వేదాంగాలు, ఉపనిషత్తులు ,అష్టాదశ పురాణాలు ,ఇతిహాసాలు  పరీక్షల కోసం కాకుండా జీవితం కోసం ,సమాజ అవగాహన కోసం చదివిన ప్రతిభాశాలి .డిగ్రీ లో కాలేజ్ నుండి వెలువడే మ్యాగజైన్ కు తానే ఎడిటర్ గా మూడు సంవత్సరాలు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత బి.ఇ.డి ఎంట్రెన్స్ రాయగా రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంక్ వచ్చింది. బిఈడి తో పాటు ఎం.ఈ.డి  కూడా పూర్తి చేసుకొని, ఎం.ఎ సైకాలజీ ఉస్మానియాలో చేశారు.

>

>             హరికృష్ణ గారికి జీవితంలో అకడమిషన్ గా స్థిరపడాలని ఆలోచన ఇష్టం గా ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా అయితే అకడమిషన్ చేసే  పని కూడా చేయవచ్చనే ఉద్దేశంతో  సివిల్స్ రాశారు. ఆ కోవలోనే గ్రూప్ టూ లో కోఆపరేటివ్ సంస్థలో ఉద్యోగం సాధించారు. వీరు సివిల్స్ కు  ప్రిపేర్ అయినప్పుడు విస్తృతంగా పుస్తకాలు చదవడంతో అన్ని శాస్త్రాల మీద అవగాహన పెంచుకున్నారు. అందుకే  వీరిని కదిలిస్తే విషయం ఏదైనా దాని గురించిన సమగ్ర అవగాహన ఉంటుందని చెప్పుకోవడం విశేషం. నిరంతరం అధ్యయనం చేసే తత్వం ఉండటంతో వారికి ఆ జ్ఞానం సొంతమైంది. వారి చేతికి ఏదైనా పొట్లం కట్టగా వచ్చిన పేపర్ కూడా పూర్తిగా చదువుతారంటే అతిశయోక్తి కాదు ఎక్కువమంది విద్యార్థులు, యువత ఒక్కసారైనా సివిల్స్ కు చదవాలని కోరుకుంటారు.తద్వారా విస్తృత విజ్ఞానం అన్ని సబ్జెక్టుల్లో ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్తారు .మనిషి ఎంత చదివినా సామాజిక అవగాహన, మానవీయ కోణం, ఈ మట్టి మీద మమకారం ఉండాలని విశ్వసిస్తారు.


       తెలంగాణ ఉద్యమంలో:


             హరికృష్ణ గారు తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ యాస భాషలో కవితలు రాసి చైతన్యాన్ని కలిగించారు. అంతేకాదు ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించే విధంగా అనేక వ్యాసాలు రాశారు. ఒకపక్క తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ జన గోసను , తండ్లాటను,  ఈ ప్రాంత వాణిని వినిపించడానికి ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రిక రూపకల్పనలో భాగంగా తనవంతుగా సూచనలు చేశారు .అంతే కాదు తెలంగాణ బిడ్డలకు సినిమా మీద అవగాహన కల్పించడం కోసం భారతీయ సినిమా తో పాటు ప్రపంచ స్థాయి సినిమా గురించి తెలియాలని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక లో 'రంగులకళ' అనే శీర్షికతో నాలుగు సంవత్సరాలపాటు వ్యాసాలు రాశారు. అలాగే హరికృష్ణ గారు అంతకు ముందు ఈటీవీ లో వావ్ గేమ్ షోను రూపొందించడమే గాక దానికి స్క్రిప్ట్ రైటర్ గా ఏడు సంవత్సరాలు పని చేశారు . దీనితో పాటుగా వివిధ ప్రముఖ ఛానల్స్లో స్క్రిప్ట్ రైటర్ గా మరియు ప్రోగ్రామ్స్ డిజైనరుగా, కాన్సెప్ట్ రూపకల్పన చేసిన అనుభవం ఉంది . ఉద్యమకాలంలో వీరికి చానల్స్ లో పనిచేసిన అనుభవం ఉండటంతో  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రపంచస్థాయిలో వినిపించేలా 'టీ. న్యూస్' ఛానల్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ డిజైన్స్ రూపకల్పనలో, స్క్రిప్ట్ రైటర్ గా కీలక పాత్ర పోషించారు .ఆ రోజుల్లో టి. న్యూస్కు స్క్రిప్ట్  రాసినా, వారు ఆ పక్కకు వెళ్లిన వారిని  పక్కన పెట్టే వారు .అలాంటిది వీరు తెలంగాణ కోసం 'టీ.న్యూస్' చానల్స్ కి  స్క్రిప్ట్ రైటర్ గా పని చేయడమే గాక ప్రోగ్రామ్స్ రూపొందించడంలో కీలక పాత్ర వహించారు.ఇందులో తెలంగాణ ఆకాంక్షను, ఆవశ్యకతను ప్రపంచానికి తెలిసేలా తెలంగాణ మహనీయుల గురించి,  తెలంగాణ పుణ్యక్షేత్రాలగురించి, తెలంగాణ  చారిత్రక కట్టడాల గురించి  అనేకరకాల స్క్రిప్ట్స్  రాయడం జరిగింది .


          సినిమా అవగాహన:


         హరికృష్ణ గారి దగ్గర ఏదైనా సినిమా గురించి ప్రస్తావిస్తే సముద్రమంత భావజాలాన్ని తన గళంలో నింపుకొని మాట్లాడినట్లు కనిపిస్తుంది. అంతే కాదు సినిమా గురించి వ్యాసం రాసినా అలాగే అనిపిస్తుంది. వీరికి పుస్తకం అంటే ఎంత ఇష్టమో ,సినిమా అంటే అంతే ఇష్టం .అందుకే ఎక్కువ సమయాన్ని గ్రంథాలయంలోను మరియు సినిమాలు చూడడానికి కేటాయిస్తారు. భారతీయ భాషల్లోని బాలీవుడ్ ,కోలీవుడ్ ,టాలీవుడ్ ,కన్నడ, బెంగాలీ ,మరాఠీ ,గుజరాతీ, ఒడిసి మొదలైన అన్ని భాషల్లోని సినిమాల మీద అవగాహనతో పాటు శాస్త్రీయంగా విశ్లేషించగల ప్రతిభావంతులు. భారతీయ సినిమానే కాకుండా హాలీవుడ్, కొరియా, జపనీస్ మొదలైన ప్రపంచ స్థాయి సినిమా మీద కూడా అవగాహన ఉన్న ప్రతిభాశాలి. ఆయా భాషల సినిమాల గురించి స్కీన్ ప్లే,   కథలు, కథనాలు, ఆయా కథలు ఆ సమయంలో రావడానికి గల కారణాలను, టెక్నిక్స్ , ఆ సినిమాలో అంతర్లీనంగా ఉన్న సామాజికాంశాలను, సద్విమర్శ, విమర్శ చేయగల సమర్థులు. అంతర్జాతీయ సినిమా తో పాటు భారతీయ సినిమా గురించి అనేక వ్యాసాలు రాశారు. సినిమా దర్శకులకే వారు తీసిన సినిమాలో వారికిి తెలియని కొత్త కోణాన్ని చూపిస్తూ  కూడా  రాయగల నైపుణ్యం హరికృష్ణ గారిది. అందుకే  ఉత్తమ సినిమా విమర్శకునిగా మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. వీరికి సినిమా మీద ఉన్న విస్తృత పరిజ్ఞానం ప్రపంచ సినిమా మీదనే ఎక్కువ వ్యాసాలు రాసేలా చేసిందనడం లో అతిశయోక్తి లేదు. హరికృష్ణ గారిని నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు సినిమా గురించి లఘు గ్రంధాన్ని రాయమని తెలుగు అకాడమీ కోరినపుడు కేవలం ఏడు రోజుల్లోనే 'తెలుగు సినిమాలో భాష-సాహిత్యం -సంస్కృతి అనే గ్రంథాన్ని రాశారు. దీన్ని బట్టి వారికి సినిమా మీద ఎంత విస్తృత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వారు సినిమా మీద  ఇష్టంతోనే తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద సినిమా మీద పరిశోధన కూడా చేస్తున్నారు.


     కవిగా:


         హరికృష్ణ గారు బహుముఖ వ్యాసకర్త,కవి, విమర్శకుడు, అనువాదకుడు, బహుభాషావేత్త, ఆర్టిస్టు అంతేగాక కళల గురించి అమితంగా అవగాహన కలిగిన వారు. తాను సమాజంలో  కష్టాలు కన్నీళ్లు ఒక దశలో అనుభవించిన వారు కావడంతో సంఘజీవిగా తన మనుగడ కోసం పరిభ్రమిస్తున్నప్పుడు తనలో కలిగే సంఘర్షణ భావజాలాన్ని వ్యక్తీకరించడానికి తాను కవిగా ఆవిష్కరింపబడినారు. వీరి కవిత్వం ఒక ప్రవాహంలో చిన్నచిన్న పాయలు కలిసినట్టుగా అన్ని భావజాలాలు పాయలుగా కలిసి ప్రవహిస్తూనే ఉంటుంది. వీరి కవితలు వివిధ పత్రికల్లో మ్యాగజైన్స్ లో నిరంతరం ప్రచురితంవుతూనేఉంటాయి కానీ వాటిని ప్రచురించటం జరగలేదు. ఆ కవిత్వమనే ప్రవాహానికి అడ్డుకట్టవేసి పుస్తకాలు ప్రచురించాల నుకోలేదు. ప్రపంచ సాహిత్యాన్ని అవపోసన పట్టిన వారు కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక లో ప్రపంచ కవిత శీర్షికన ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన కవుల కవితలను అనువదిస్తూ ప్రచురిస్తున్నారు. ఇందులో అమెరికా న్యూజెర్సీకి చెందిన డోరాతి షిల్డ్ పార్కర్, గ్రీక్ కవి నోబెల్ సాహిత్య బహుమతి దిగ్గజం జార్గోస్ సెఫెరిస్, నైజీరియా  సాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బెన్ ఓక్రి  మొదలైనవారి కవితలను అనువదిస్తూ ,ప్రపంచ సాహిత్యాన్ని నేటి సమాజానికి తెలియజేస్తున్నారు . వీరు భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ విస్తృతంగా కవితలు వ్యాసాలు రాస్తున్నప్పటికీ , తెలంగాణ యాస భాషకు పట్టం కట్టేలా,తెలంగాణ యాసలో 2018  సెప్టెంబర్20 న వారి అమ్మకు అంకితమిస్తూ రాసి , ప్రచురించిన 'ఊరికి పోయినయాళ్ల ' అనే దీర్ఘ కవితా  పుస్తకం   మణిమకుటంలా నిలుస్తుంది. 

>  

>    తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణాలోభాగంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఇక్కడి సాంస్కృతిక జీవనం, కళలు, కళాకారులు, కవులు ,పండుగలు, తెలంగాణ భాష యాస పునరుజ్జీవింప చేయాలనే సంకల్పానికి అనుగుణంగా ,అన్ని రకాలుగా విస్తృత పరిజ్ఞానం కలిగిన మామిడి హరికృష్ణ గారిని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గా నియమించింది .ఇక ముఖ్యమంత్రి గారి మనోగతానికి తగ్గట్టుగానే హరికృష్ణ గారు తెలంగాణ కళలకు,కళాకారులకు  ,కవులకు, పండుగలకు అధిక ప్రాధాన్యమిస్తూ రవీంద్ర భారతి వేదిక తో పాటు దేశరాజధాని మరియు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నూతనంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. గత అరవై ఏళ్లుగా జానపద కళలు మనుగడ కోసం పాకులాడిన తండ్లాటను , గోసను దృష్టిలో ఉంచుకొని జానపద కళ బతకాలంటే అవకాశం, ఆదాయం కల్పిస్తే కళ బతుకుతుందని, ఆ రకంగా వాటికి అవకాశాలు ఆదాయం సమకూరే కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదట రవీంద్రభారతి వేదికగా నూట ఇరవై ఐదు రోజులు రాష్ట్రంలోని జానపద కళలకు అవకాశం కల్పిస్తూ కళారాధన పేరుతో రవీంద్రభారతిలో జానపద కళలకు పెద్దపీట వేశారు .అంతే కాకుండా కేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శించే జానపద కళా రూపాలను కూడా రవీంద్రభారతి వేదికతో పాటు జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశాలు కల్పిస్తూ, ఆ కళారూపాల మనుగడకు మరియు  కళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలను గుర్తించి, వాటిని డాక్యుమెంటేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు . హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వంటి వేదికల మీద కూడా జానపద కళల ప్రదర్శన తో పాటు, ముఖ్యంగా జానపద వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ జానపద కళల వైశిష్ట్యాన్ని తెలియజేశారు.  అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ను, పండుగల సందర్భాల్లోనూ అనేక కళారూపాలకు, కళాకారులకు అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ప్రపంచ జానపద దినోత్సవాన్ని  పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 'జానపద జాతర 'అనే పేరుతో ఉత్సవాలు నిర్వహించి జానపద కళల మూల సంస్కృతిని పరిరక్షించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు.

>           

>            హరికృష్ణ గారు తమ శాఖ తరపున కొన్ని పథకాలను కూడా రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా కళోధ్ధారణ పేరుతో దేవాదాయశాఖ తో కలిసి  కొన్ని జానపద కళా బృందాలను ఎంపిక చేసుకొని, ఆ బృందాలకు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రదర్శనలు కల్పిస్తూ, ఆయా కళారూపాల మనుగడకు మరియు ఆర్థికంగా కూడా చేయూతనిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు నిర్వహించడం లేదు. కానీ అది మామిడి హరికృష్ణ గారికే సాధ్యమైంది. అంతేకాకుండా వీరు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా 42 వ యేటనే నియమింపబడటం విశేషం. దేశంలోని మిగతా భాషా సాంస్కృతిక శాఖ ల్లో నియమింపబడిన సంచాలకుల వయసును బట్టి చూస్తే అతి పిన్న వయస్కులు వీరే కావడం మరో విశేషం .అందుకే నూతన ఆలోచనలతో తెలంగాణ సోయితో అనేక కార్యక్రమాలు చేయగలుగుతున్నారు.

>

>          తెలంగాణాలో నాటకమే లేదనే దశలో హరికృష్ణ గారు నాటక కళాకారులను ప్రోత్సహించి పద్య నాటకాలు మరియు పౌరాణిక నాటకాలు కలిపి నెలకు 45 నాటకాల చొప్పున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాటకోత్సవాలను నిర్వహిస్తూ, తెలంగాణ నాటకాలకు ఆ కళాకారులకు గుర్తింపును గౌరవాన్ని కలిగిస్తున్నారు. 

>      హరికృష్ణ గారు జానపద కళల్ని ప్రోత్సహించినట్లు గానే మిగతా కళల్ని కూడా, అంతే దృష్టితో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తెలంగాణకే పరిమితమైన పేరిణి నృత్యానికి పూర్వవైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్రంలోని అన్ని సంగీత కళాశాలల్లో ప్రత్యేకంగా పేరిణి కోర్సును ప్రవేశపెట్టి అనేకరకాలుగా ప్రోత్సహించడమే కాక ఆ కళాకారులకు కూడా ప్రదర్శనావకాశాలు కల్పిస్తూ,కళను పునరుజ్జీవింప చేస్తున్నారు. వీటితో పాటుగా తెలంగాణాలోని శాస్త్రీయ కళల్ని, నాటకం ,మిమిక్రీ, చిత్రకళ, కార్టూనిస్ట్ ,శిల్పకళ మొదలైన కళలు ఏవైనా కళాకారులందర్నీ సాదరంగా ఆహ్వానించి , ఆయా కళలకు రాష్ట్రస్థాయి ,జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ,వారి యొక్క కళకు బహుళ ప్రాచుర్యాన్ని, ఆయా కళాకారులకు ఆత్మవిశ్వాసాన్ని  కలిగిస్తున్నారు.

>

>      పుస్తకాల ప్రచురణ:

>

>                  హరికృష్ణ గారు స్వయంగా కవి, విమర్శకుడు, అనువాదకుడు .అంతేకాకుండా సాహిత్యంలోని అస్తిత్వ వాదాలు, భావజాలాలు సమగ్రంగా తెలిసిన వారు కావడంతో తెలంగాణ సాహితీకారులు అంటే అమితంగా ఇష్టపడతారు. ఈ కోవలోనే ఉగాది ,బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రవీంద్రభారతి వేదికగా అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. కవిసమ్మేళనాలు నిర్వహించడమే కాకుండా ,ఆ కవితలను సంకలనం చేసి ,పుస్తకాల రూపంలో ప్రచురించి తెలంగాణ కవుల భావజాలాన్ని ఆవిష్కరింపజేశారు.  ఇందులో ప్రధానంగా తంగేడు వనం, కొత్త సాలు, తల్లివేరు, తొలిపొద్దు, మట్టి ముద్ర, స్వేదభూమి, పద్య తెలంగాణం మొదలైనవి. ఇవే కాకుండా తెలంగాణ మట్టి కోసం ఇక్కడి అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ బిడ్డలను స్మరించుకోవాలని, వారి చరిత్ర నిక్షిప్తం కావాలని ,ఆ మహనీయులను భావితరాలు తలుచుకోవాలని" తెలంగాణ తేజోమూర్తులు" అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాకుండా కాకతీయుల ప్రస్థానం, తెలంగాణ రుచులు, మనకు తెలియని తెలంగాణ ,తారీఖులలో తెలంగాణ , తెలంగాణ హార్వెస్ట్, తెలంగాణ సోయితో రచనలు చేసిన మేధావులను ప్రోత్సహిస్తూ వారి పుస్తకాలను కూడా భాషా సాంస్కృతిక శాఖ తరపున ప్రచురిస్తూ తెలంగాణ సంస్కృతిని విభిన్న కోణాల నుండి పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి మీద కూడా  'స్వర నారాయణీయం 'అనే పుస్తకాన్ని ప్రచురించి భాషా సాంస్కృతిక శాఖ వారి ఔన్నత్యాన్ని తెలిపింది. అలాగే  జానపద కళల మీద ఉన్న మక్కువతో  'పటం కథలు' , 'కళా తెలంగాణం' అనే రెండు పుస్తకాలను ప్రచురించి  వాటి సంస్కృతిని నిక్షిప్తంచేశారు .సంచాలకులుగా వీరు శాఖ తరపున ప్రచురించిన పుస్తకాల మీద పరిశోధనచేస్తే ,నాలుగైదు సిద్ధాంత గ్రంథాలను కూడా రాయడానికి వీలైన విస్తృతమైన తెలంగాణ విజ్ఞానం దాగి ఉందనడంలో అతిశయోక్తి లేదు.

>

>             తెలంగాణ అంటేనే మన బతుకమ్మ మన బోనం అంటూ బతుకమ్మ సంబరాలకు  ప్రాచుర్యం కల్పిస్తూ ,ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే విధంగా చేస్తున్నారు. అంతేకాక మహా బతుకమ్మ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు ఆకర్షించేలా చేశారు. జంటనగరాల్లో జరిగే బోనాలను  వైభవంగా  జరిగేలా పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ బోనాల పండుగ శోభాయమానంగా జరిగేటట్టు  నిర్వహిస్తున్నారు.

>

>            హరికృష్ణ గారు ప్రత్యేక తెలంగాణ రాకముందే ప్రముఖ కవి రావూరి భరద్వాజ మీద డాక్యుమెంటరీ ఫిలిమ్ తీశారు . వీరికి సినిమా అంటే ప్రాణం. తెలంగాణ నుండి ఆశించినంతగా సినిమారంగంలో లేరని ,నేటి తరంలో సినిమా మీద ఆసక్తి గల యువతను ప్రోత్సహిస్తూ,  లఘు చిత్రాలను తీస్తున్నవారికి ఒక వేదిక ఒక గుర్తింపు ఉండాలని' సినీవారం ' పేరుతో ప్రతి శనివారం ఒక నూతన లఘు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వారి లఘు చిత్రానికి గుర్తింపుతో పాటు ప్రాచుర్యం కల్పిస్తూ,వారిలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లఘు చిత్రాల  దర్శకులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  అవార్డులు కూడా ప్రధానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. రవీంద్ర భారతిలో లఘు చిత్రాలు ప్రదర్శించే హాలును కూడా పునరుద్దరించి తెలంగాణ ముద్దుబిడ్డ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్ పేరును నామకరణం చేశారు.  అంతేకాకుండా సండే సినిమా 'పేరుతో రవీంద్రభారతిలో ప్రతి ఆదివారం ఒక సందేశాత్మక భారతీయ సినిమాలనే కాకుండా అంతర్జాతీయ సినిమాలను కూడా ప్రదర్శిస్తూ అన్నిరకాలుగా ప్రేక్షకులను ఆకర్షించేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సెంటర్ ను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నారు.

>

>               తెలంగాణ అస్తిత్వం కోసం  పోరాడిన  కాళోజి, దాశరధి, సురవరం ప్రతాపరెడ్డి , ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త  ప్రొఫెసర్ జయశంకర్ సార్ ,డా.సి.నారాయణరెడ్డి గారి వంటి జయంతి ఉత్సవాలను  ఘనంగా చేస్తూ వస్తున్నారు. భూమికోసం, భుక్తికోసం ,నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్య , కొమురం భీమ్ ను, సినిమా రంగంలో ప్రముఖులైన ప్రభాకర్ రెడ్డి, కాంతారావు వంటి వారిని కూడా స్మరించుకుంటూ  తెలంగాణ భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. వీరినే కాకుండా తెలంగాణలోని ప్రముఖ కవులు కళాకారుల జయంతి ఉత్సవాలను కూడా జరుపుతున్నారు.

>

>             తెలంగాణ కవులు, రచయితలు, సాహితీ సంస్థలు  రవీంద్ర భారతిలో   సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేందుకు 'అక్షర' అనే పథకాన్ని రూపొందించి, ఉచితంగా ఒక హాలును కేటాయించారు హరికృష్ణగారు.ఈ రకంగా కూడా కవులను ప్రోత్సహిస్తూ,ప్రత్యేక తెలంగాణ తెచ్చిన ప్రతి ఫలంలో ఇది ఒకటని చెప్పుకునేలా చేస్తున్నారు. అంతేగాక శాఖ తరపున సాహితీసదస్సులకు,ఉత్సవాలకు కాదనకుండా ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు.రవీంద్రభారతిలో హరికృష్ణ గారి సిబ్బందిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కానీ, వీరు చేసే కార్యక్రమాలు వందల్లో లెక్కపెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి.వీరు రూపొందించే కార్యక్రమాలు ఎక్కువ మంది కళాకారులకు అవకాశాలు కల్పించే విధంగా  ఉండటమే కాక ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఒక విజన్ తోపాటు   దాని వెనకాల తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండటంప్రత్యేకత. 

>

>               హరికృష్ణగారు తెలంగాణలో  తిరిగి అకాడమీల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అకాడమీలను అధ్యయనం చేసి గౌరవముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మనోగతానికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపకల్పన చేసి సాహిత్య అకాడమీ, సంగీతనాటక అకాడమీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా లలిత కళా అకాడమీ, జానపదకళల అకాడమీ, 'ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ' ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి , వాటి స్థాపనలో కూడా తమ వంతుగా కృషి చేస్తున్నారు .

>

>             తెలంగాణలోని ప్రతి కళాకారున్ని గుర్తించి   ప్రభుత్వపరంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఒక వెబ్ సైట్ ను రూపొందించడం  జరిగింది. దీనికి కళాకారుల నుండి విశేష స్పందన వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే జాతీయస్థాయి స్కాచ్ అవార్డు తెలంగాణ  భాషా సాంస్కృతిక శాఖకు దక్కింది.  భారతదేశంలోని ఏ సాంస్కృతిక శాఖకు కంప్యూటర్ రంగంలో  ఇచ్చే ఈ అవార్డు ఇంతవరకు రాలేదు .అది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కు రావడం గొప్ప విశేషం.              

>                   తెలుగుకు ప్రాచీన హోదా విషయంలో కూడా హరికృష్ణ గారు తనదైన శైలిలో ప్రాచీన హోదాకు  తగిన ఆధారాలను సేకరించి తెలుగుకు ప్రాచీన హోదా రావడం కోసం ప్రముఖపాత్ర వహించారు.  ప్రపంచ తెలుగు మహాసభల్లో తమ శాఖ తరపున అమూల్యమైన గ్రంధాలను వెలువరించడమేగాక, సభల్లో రవీంద్ర భారతి వేదిక సాహిత్య కార్యక్రమాలకు ప్రధాన దిక్సూచి కావడం లో హరికృష్ణ గారి పాత్ర ఎంతో ఉంది. కళలకు కళాకారులకు సాహితీవేత్తలకు సాహితీ సంస్థలకు వీరు చేస్తున్న కృషిని గమనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ గారు ఒక సందర్భంలో "తెలంగాణ బిడ్డలను ,కళాకారులను, కవులను, రచయితలను ఆహ్వానించడానికి 'రవీంద్ర భారతికి కట్టిన ఒక మంచి మామిడితోరణం' హరికృష్ణ గారని అన్నారు .బంగారు తెలంగాణ నిర్మాణంలో కళలు ,పండుగలు పూర్వవైభవం సాధించేందుకు  అహర్నిశలు శ్రమిస్తున్న హరికృష్ణ గారి గురించి చెప్పుకుంటే సంవత్సరాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం సూచించినట్టుగానే, ముందు ముందు రవీంద్ర భారతి గురించి చర్చకు వస్తే హరికృష్ణ గారికంటే పూర్వం ,ముందు అని చెప్పుకోవడం కనిపిస్తుంది. అంతేకాదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా హరికృష్ణ గారి గురించి ఒక వ్యాసం రాయడం కంటే ఒక పుస్తకమే రాయడం సమగ్రంగా  ఉంటుంది. 

>

>                                       డా.బాసని సురేష్

>                                        9989417299.        

>                                Email.basanisuresh75@gmail.com

 Here, it's my poem ఓ నిరాశ్రయుని అసంపూర్ణ స్వప్నం! Published in SOPATHI Sunday supplement of NAVA TELANGANA paper on 25-10-2020... Plz read.. #mhk_poetry


ఓ నిరాశ్రయుని అసంపూర్ణ స్వప్నం  ! 


                                             - మామిడి హరికృష్ణ

8008005231


అతను నిరాశ్రయుడు-

ఆకాశాన్ని కప్పుకుని

సూర్య చంద్రులనే దీపాలుగా వెలిగించినవాడు

నదిలో పొర్లాడి - సముద్రంలో ఈదులాడి 

వనభూముల వెంట పరుగులు పెడ్తూ

నేల అంచులదాకా దృష్టిసారించినవాడు

గాలిని మెడలో వేసుకొని

అగ్నిని కళ్ళల్లో పూయించినవాడు

చెట్టును ఎక్కి- రాయిని మొక్కి

గుట్టను చెక్కి - పిట్టను ఎగరేసినవాడు!


అతను నిరాశ్రయుడు-

కాలంతో పాటు కళ్ళు తెరిచి

పొద్దుహద్దు లేవీ లేకుండా

స్వేచ్చతో యధేచ్చగా సంచరించేవాడు

నిరంతరం అభద్రతతో ఉలిక్కిపడి

భయంతో స్నేహం చేసేవాడు

తూర్పు రేఖలను మళ్ళీ చూడటం కోసం

నిత్య మెలుకువతో కళ్ళు తెరిచి నిద్రించేవాడు!


అతను నిరాశ్రయుడు-

చెట్టుకు మబ్బు - పిట్టకు గూడు, 

చీమకు పుట్ట - చేపకు నాచు 

కుందేలుకు పొద- సింహానికి గుహ

వాటి వాటి నెలవులు!

అతను వెన్నెల మైదానం,

అగ్ని సముద్రం, 

హరిత ఆకాశం!

దోచుకోవడానికి ఏమీ లేనివాడు

దాచుకోవడానికి తల తప్ప మరేది మిగలని వాడు!


అతను నిరాశ్రయుడు-

శతాబ్దాలుగా నెలవు కోసం వెదుకుతూనే ఉన్నాడు

కానీ ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం-

అర్ధం చేసుకునే ప్రయత్నంలో 

పజిల్స్ ను పరిష్కరిస్తూనే ఉన్నాడు

ఈ లోకం కోట్లాది గదులున్న మర్మ మందిరం-  

రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాడు!


యుగాలుగా తన గది కోసం తిరుగుతూనే ఉన్నాడు

గదులన్నీ తడుతూ ఒకసారి

గదుల వసారాలో దారి తప్పి మరోసారి

కనుగొంటూ, తెలుసుకుంటూ, నడుస్తూ, 

సందేహిస్తూ, సవరిస్తూ, సంచరిస్తూనే ఉన్నాడు

ఆశతో ఎగిరెళ్ళి, నిరాశతో వెనుతిరిగి

మధ్య మధ్య ఎన్నెన్నో ఆశ్చర్యాలను 

మరెన్నో అద్భుతాలను అనుభూతిస్తూనే ఉన్నాడు!

Yes, one have to touch irrelevant things

to find the relevant!!


అతను నిరాశ్రయుడు-

ఎన్నో దశాబ్దాల వెదుకులాట తర్వాత

గది దొరికింది

“ఈ మర్మదేశంలో స్వర్గమంటూ ఉంటే

అది ఇదే... అది ఇదే” అని

అతని మది పదే పదే పలవరించింది

సంచార జీవనానికి ఇదే ఆఖరి మజిలీ అని

అతని అంతరాత్మ మరీ మరీ రీసౌండ్ లో చెప్పింది!


ఇప్పుడతను ఆ గది తలుపుల ముందు

నిల్చొని ఉన్నాడు....!


#dasara2020

Friday, 23 October 2020

SMILE, MY WARRIOR!

 #mhk_poetry

SMILE, MY WARRIOR!



Smile... cheer up.. 

Times have come to challenge the evil!

Moments have arisen to confront the devil!!


Seen so far so many tears

Came across so many waters

Struggled against so many woods

Overrode the volcanos and floods

Don't worry! We knew pretty well 

That, life is full with bed of nails

Full with the path of thorns

Move on.. go on.. run on.. ride on...!!


At last, world waits for the winners

To share the experiences..!

Waits for the losers too

To soothe their wounds..!!


Don't lose smile on your face..

Don't erase cheerfulness from your lips..

That is the best weapon to combat weakness..

That is the best medicine to get rid of the ill health..

Fill confidence in your smile to fight illness..

Fill trust in your action to fight illness..


Dear, Fight the stillness..

Fight the dullness, hollowness, and the deadly shallowness..


Coz, we are the warriors!

We are the survivors!!


----- harikrishna mamidi

2-7-2020

Wednesday, 21 October 2020

కల్పన

 Here, it's my Telugu  translation of the poem, A FANTASY, written by LOUISE ELISABETH GLUCK, American poetess and the winner of 2020 NOBEL PRIZE FOR LITERATURE, published in NAMASTE TELANGANA paper on 10-10-2020..

కల్పన


!


నేను నీకు ఏదో ఒకటి చెపుతాను, ప్రతిరోజూ..

మనుషులు మరణిస్తున్నారు

ఇది కేవలం ఆరంభం మాత్రమే

ప్రతిరోజూ అంతిమ సంస్కార గృహాలలో

కొత్త వితంతువులు జన్మిస్తూనే ఉన్నారు

నవ అనాథలు పుట్టుకు వస్తూనే ఉన్నారు

ఈ కొత్త జీవితాన్ని నిర్ణయించుకుంటూ

చేతులు జోడించి వాళ్లు బేలగా కూచుంటారు!


ఇక వాళ్లు శ్మశానానికి వస్తారు

అందులో కొందరికి అదే మొదటిసారి

కొన్నిసార్లు దుఃఖాన్ని చూసి

ఇంకొన్ని సార్లు దుఃఖించకపోవడాన్ని చూసి

భయపడే స్వభావం వారిది

ఎవరో ఒకరు శోకభారంతో వాలిపోతారు

తర్వాతేం చేయాలో తోచక,

బహుశా కొన్ని మాటలు చెప్పడమో

లేక కొన్నిసార్లు బొందమీద మట్టి చల్లడమో చేస్తారు..!


ఆ తర్వాత, ప్రతి ఒక్కరూ ఇళ్లకు తిరిగివెళతారు

ఇల్లు ఒక్కసారిగా సందర్శకులతో కిటకిటలాడుతుంది

భర్తను పోగొట్టుకున్న వనిత మాత్రం స్థిరంగా కూచుంటుంది

బంధువులు-మిత్రులు అందరూ వరుసలో వస్తారు

కొందరు ధైర్యం చెప్పడం కోసం

ఆమె చేతిని స్పృశిస్తారు..

 మరికొందరు కౌగిలించుకుంటారు

ప్రతి ఒక్కరికీ ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది

వచ్చినందుకు అందరికీ

 కృతజ్ఞతలు తెలుపాలనుకుంటుంది..!


నిజానికి ఆమె మనసు మాత్రం

వాళ్లందరూ అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరుకుంటుంది

ఆమె తిరిగి స్మశానానికి వెళ్లాలని

దవాఖానలోని రోగుల గదికి వెళ్లాలని ఆరాటపడుతుంది

ఆమెకు తెలుసు-

ఇది అసాధ్యమని..

అయినా ఇది ఆమె ఒకే ఒక్క ఆశ

గతంలోకి వెళ్లాలనే ఆశ...

పెళ్లినాటి పాతకాలంలోకో

తొలిముద్దునాటి గడిచిన సమయంలోకో కాదు

సమీప గతంలోకి మాత్రమే వెళ్లాలనే ఆశ.. ...!


మూలం: లూయిస్‌ ఎలిజబెత్‌ గ్లక్‌, 

స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231

#mhk_poetry 

#PRAPANCHA_KAVITHA

(లూయిస్‌ ఎలిజబెత్‌ గ్లక్‌కు 2020 నోబెల్‌ సాహిత్య బహుమతి ప్రకటించిన సందర్భంగా...)


A FANTASY


I'll tell you something: every day

people are dying. And that's just the beginning.

Every day, in funeral homes, new widows are born,

new orphans. They sit with their hands folded,

trying to decide about this new life.


Then they're in the cemetery, some of them

for the first time. They're frightened of crying,

sometimes of not crying. Someone leans over,

tells them what to do next, which might mean

saying a few words, sometimes

throwing dirt in the open grave.


And after that, everyone goes back to the house,

which is suddenly full of visitors.

The widow sits on the couch, very stately,

so people line up to approach her,

sometimes take her hand, sometimes embrace her.

She finds something to say to everbody,

thanks them, thanks them for coming.


In her heart, she wants them to go away.

She wants to be back in the cemetery,

back in the sickroom, the hospital. She knows

it isn't possible. But it's her only hope,

the wish to move backward. And just a little,

not so far as the marriage, the first kiss.


by Louise Gluck

చేరని ఉత్తరం...!

 Here, it's my poem CHERANI UTTARAM ( UNDELIVERED LETTER) published in KALAM page of MANA TELANGANA news paper on 12-10-2020...

#mhk_poetry

చేరని ఉత్తరం...!


------- మామిడి హరికృష్ణ 8008005231


ఉత్తరం ఇక ఇంటికి చేరదు 

ఉత్తరం ఇక కంటికి ఆనదు 

నేను పంపిన ఉత్తరం కాంతి సంవత్సరం అంత లేటు !


నా గురించి, జాబ్, జిందగీ గురించి 

నీకు చెప్పాలనుకున్నవీ- చెప్పలేక పోయినవీ 

చెప్పీ చెప్పకుండా వదిలేసినవీ 

చెప్పకుండానే చేసినవీ 

అన్నింటినీ ఉత్తరంలో మూట కట్టాను 

కొన్ని దుఃఖాలకు మాటలను అద్దాను 

కొన్ని సంతోషాలకు పదాలను అల్లాను 

ఎదురైన అనుభవాలన్నిటినీ వాక్యాలపై నిలబెట్టాను 

ఏదో తెలీని అభావాలన్నిటినీ ఖాళీలుగా వదిలేసాను!


అయినా, ఉత్తరం మన అస్తిత్వ ఆవిష్కరణం కదా 

విషాదానందాల వలపోత కదా 

అందుకే ఉత్తరం తెరవగానే 

అందులోంచి 

ఒకసారి గులాబీ రేకులు గదినిండా పర్చుకుంటాయి 

ఇంకోసారి అక్షింతలు తలపై ఆశీస్సులను అందిస్తాయి 

మరోసారి అక్షరాలా కన్నీళ్ళై 

గుండె చెరువు అలుగు దుంకి మత్తడి పారేలా చేస్తాయి !


ఇంతకాలం ఉత్తరం 

తన రెక్కల మాటున 

ఒకింత నమ్మకపు ఆకాశాన్ని 

ఆశల మబ్బుల ఛాయలను 

ధైర్యపు సూర్య కిరణాలను 

కలల చెట్ల పచ్చదనాలను మోసుకొచ్చింది 

జీవనేచ్ఛ దేహానికి ఇంద్ర ధనుస్సు షర్ట్ ను తొడిగింది !


ఇప్పుడు ఉత్తరాలు లేవు 

ఉద్వేగాలకు ఓపిక తక్కువ కదా 

తోకలేని పిట్టలకు ఉద్వాసన చెప్పి 

Virtual పిట్టలను వెదుక్కున్నాయి 

నెలలు, రోజులు కాదు సెకన్లలోనే 

అవి చేరాల్సిన చోట ప్రత్యక్షం అవుతున్నాయి  

ఇప్పుడు నేను చెక్కిన ఉత్తరం 

కాంతి సంవత్సరం అంత వేగం! 

కలలను - కన్నీళ్లను- కరుణను- కాఠిన్యాలను.... 

నిస్తంత్రిగా , నిరంధిగా, నిశ్చింతగా, 

అచ్చంగా Robotలా.. Satellite లా.... 

వాయు వేగంతో అందిస్తున్నాయి!! 


అప్పుడు ఉత్తరానికి కొన్ని రూపాలే 

Post Card, Inland Letter, Mail, Telegram 

అనుబంధాల లాగే... ప్రేమ లాగే... !

ఇప్పుడది Metamorphosis చెందింది 

SMS, e-mail, facebook, social media,

whatsapp, twitter, instagram... 

ఇంకా ఎన్నెన్నో అవతారాలను ఎత్తింది..!


అప్పుడు ఉత్తరం ఏకరూపి ! 

ఇప్పటి "net రం" బహు రూపి ... విస్తృత సంచారి 

మనో వేగ విహారి ... క్షణ భంగుర బేహారి !


అయితేనేం--

చెప్పాల్సిన విషయం text లోకి పొదిగి 

నిన్న నేను పంపించిన ఉత్తరం 

కళ్ళు మూసి తెరిచేంతలో 

చేరాల్సిన చోటికే చేరింది!


కానీ-

In-Boxలోనే ఉండిపోయి 

Unread Messageగా సమాధి అయింది......!!

వాన కచేరీ!

 #mhk_poetry 

వాన కచేరీ!

---- మామిడి హరికృష్ణ 8008005231


మహా సంగీతోత్సవానికి 

రంగం సిద్ధమైంది 


వాయు గుండమే ఆహ్వాన పత్రం 

అల్ప పీడనమే స్వాగత తోరణం   

 

ఆకాశ వేదికపై 

మేఘాల కచేరీ 


మెరుపులే రాగాలు 

ఉరుములే తాళాలు 


చినుకుల సంగీతం కురుస్తూనే ఉంది 


భూమి ఇప్పుడు పొంగి పొర్లుతున్న 

ఓ పరవశాల శ్రోత !


11-10-2020

కొత్త మజిలీ !

 




#mhk_poetry

కొత్త మజిలీ !

    ----- మామిడి హరికృష్ణ 8008005231


కాలం ఓ నిరంత రహదారి 

ఎన్నెన్నో మలుపులు, తలపులు, మెరుపులు, మరుపులు 

ప్రతిదీ గొప్పదే

మలుపు మలుపునా ఓ మజిలీ 

మజిలీ మజిలీనా 

ఆశ్చర్యమో, ఆనందమో, ఆవేదనో, ఆక్రందనో 

భీభత్సమో , భయానకమో, కరుణమో, శాంతమో 

విస్మయమో, విజయమో, విపత్తో, వైపరీత్యమో

వీరమో, విప్లవమో, విలాపమో, విషాదమో 

ఏదో ఒకటి తేలిపోతుంది!


2020 మహా మజిలీ 

రెండు రెండ్లు, రెండు సున్నాలున్నట్టుగా 

రెండు మజిలీలు 

కరోనా... వాన...!


తొలి మజిలీలో 

కరోనా కుండపోత వానలా కురిసింది 

మనిషి అహంభావాన్ని ప్రశ్నించింది!

తుది మజిలీలో 

వాన కరోనాలా సకల లోకాన్ని ఆక్రమించింది 

మనిషి ఆధిపత్యాన్ని సవాల్ చేసింది!


కొత్త మజిలీని సృష్టించడానికి 

ప్రకృతి పడుతున్న పురుటి నొప్పులా ఇవి!?


Sunday, 11 October 2020

కాలం జారిపోతున్న సవ్వడి

 **మామిడి హ‌రికృష్ణ గారి క‌విత - కాలం జారిపోతున్న స‌వ్వ‌డి - చిన్న‌పాటి స్పంద‌న‌!


చెంప‌ల మీది బిందువుల్లా రోజులు జారిపోతున్న చ‌ప్పుడునీ

మెట్ల మీద వ‌డ‌గ‌ళ్ళ‌లా  జ్ఞాప‌కం ప‌గిలిపోతున్న చ‌ప్పుడునీ ఎవ‌రైనా విన్నారా? 

ఇదిగో ఈ క‌విత చ‌దివితే వినిపిస్తాయి!


స‌ముద్రంలోకి ఒలికిపోతున్న ఆకాశాన్ని, ఆకాశంలోకి ఇంకిపోతున్న మేఘాన్ని ఎవ‌రైనా చూశారా?

ఈ క‌విత చ‌దివితే క‌నిపిస్తాయి!


- ఆకాశంలో రూపు మారిన వేలాది అవ‌తారాలు

మునిగిన ప‌డ‌వ‌ను నీటి రంగుల‌లో ఖ‌న‌నం చేస్తాయి - ఒక్క నిముషం నీటి రంగు ని గుర్తు తెచ్చుకోకుండా ఉండ‌గ‌ల‌రా.. ఇది చ‌దివాకా?


- తీరం వెంట చెట్టునై నేను

ఇసుక‌నంతా పాదాల ద‌గ్గ‌ర కుప్ప‌గా పోసుకుని

పిట్ట‌గూడును అల్లుతుంటాను - చెట్టు ఒక‌టి ఇసుక‌లోకి వేళ్ళు త‌న్ని నిలుచోవ‌డం, ఆ చెట్టు మీద పిట్ట‌లు గూళ్ళు అల్ల‌డం - సాదృశ్యం చేసిన వాక్యాలు!  అయితే.... గూడు చెట్టు అల్లిందా?  పిట్ట అల్లిందా?  లేక ఇది చ‌దువుతూ నేనో, మీరో అల్లేశామా?


- కెర‌టాలు న‌డుస్తూ న‌డుస్తూ గ‌వ్వ‌ల చేయి ప‌ట్టుకుని వ‌స్తాయి - జ‌స్ట్ ఇమాజిన్‌! 

కెర‌టం వ‌స్తూ వ‌స్తూ కొన్ని గ‌వ్వ‌ల్ని తీరం పైకి విసిరేయ‌డాన్ని ఇంత క‌న్నా బాగా వ‌ర్ణించే అక్ష‌రాలు ఇంకెక్క‌డైనా ఉండి ఉంటాయా?


- స్ప‌ర్శ‌లు వ‌ర్షిస్తూ వ‌ర్షిస్తూ న‌వ్వుల‌ని అశ‌బ్దం చేస్తాయి

అనుభ‌వాలు కోసుకుని కోసుకుని దేహాన్ని దాహ‌ర‌హితం చేస్తాయి!


- వెన్నెల క‌న్నీటి చుక్కై చీక‌టి రెక్క‌లు తొడుక్కుని ఎగిరెళ్ళిపోతుంది

ప‌డ‌మ‌టి గాలి వెలుగు చుక్కై అంత‌రిక్షం గొంగ‌ళి క‌ప్పుకుని మెరుస్తుంది!


చ‌దివిన త‌ర్వాత మ‌నం కూడా స‌ముద్రం ద‌గ్గ‌రకీ, అంత‌రిక్షంలోకీ, ఇసుక‌ల్లోకీ, కెర‌టాల్లోకీ, జ్ఞాపకాల‌లోకీ... కాలం తోపాటు జారిపోతూ... వ‌డ‌గ‌ళ్ళై క‌రిగిపోతూ... ఎక్క‌డ తేల‌తామో!


**Original poem**

***కాలం జారిపోతున్న సవ్వడి ***


చెంపల మీది బిందువుల్లా 

రోజులు జారిపోతున్న చప్పుడు 

మెలుకువ లోకి ఊడిపడిన కాలం

మెట్ల మీద కరిగిపోతున్న వడగళ్ళలా 

జ్ఞాపకం పగిలిపోతున్న దృశ్యం 


మత్తులోకి కూరుకుపోయిన సమయం

సముద్రంలోకి ఒలికిపోతున్న ఆకాశం 

ఆకాశం లోకి ఇంకిపోతున్న మేఘం 

మేఘంలో కుంగిపోతున్న ఆకారం 

ఆకారం లో రూపు మారిన వేలాది అవతారాలు 

మునిగిన పడవను నీటి రంగులలో ఖననం చేస్తాయి 


అడుగున ఉన్న నాచు మొక్కని పైకి తెలుస్తాయి

తీరం వెంట చెట్టునై నేను 

ఇసుకనంతా పాదాల దగ్గర కుప్పలుగా పోసుకుని 

పిట్ట గూడును అల్లుతుంటాను


కెరటాలు నడుస్తూ నడుస్తూ 

గవ్వల చేయి పట్టుకుని వస్తాయి 


ప్రేమలు మండుతూ మండుతూ పువ్వుల్ని మసి చేస్తాయి 

స్పర్శలు వర్షిస్తూ వర్షిస్తూ నవ్వులని అశ‌బ్దం చేస్తాయి 

అనుభవాలు కోసుకుని కోసుకుని దేహాన్ని దాహరహితం చేస్తాయి


ఇక్కడ ఇక వెన్నెల 

కన్నీటి చుక్కై 

చీకటి రెక్కలు తొడుక్కుని ఎగిరెల్లిపోతుంది 

పడమటి గాలి వెలుగుచుక్కైె

అంతరిక్షం గొంగళి కప్పుకుని మెరుస్తుంది .....


- మామిడి హ‌రికృష్ణ‌

(published in andhra jyothi sunday 21 sept,2014)

Thursday, 8 October 2020

MHK poetry Analysis 2 ( సుషుప్తి నుంచి )- యెనగంటి నర్సింగరావు

 మెలకువను పరిచయం చేసే అక్షర సమూహం.

సుషుప్తి నుంచి.....

------------------------------------------------------------

ఏదీ పూర్తిగా తెలియకున్నా ఎంతో తెలుసుననే భ్రమలో, జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటూ హుషారుగా కాలాన్ని దాటేసే వయసులో చదివే చదువు ఇంటర్మీడియట్. అందరూ కుర్రాళ్ళలా అతడు ఆలోచించలేదు, యవ్వనపు ఛాయలు దేహానికే గాని ఆయన పొందిన విజ్ఞానం వయసు ఎంతో ఎక్కువ.  అక్షరాన్ని అమ్మగా ప్రేమించి, కవిత్వపు కమ్మదనాన్ని లోకానికి అందించాలనే అప్పటి ఆ ఆరాటానికి ప్రతిబింబమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మామిడి హరికృష్ణ గారి సుషుప్తి నుంచి అనే కవితాసంకలనం.


కవికి ఉన్నతమైన స్థానాన్నిచ్చిన తర్వాత కవిత్వం గురించి చెప్పడం ఉత్తమమైన పద్ధతి. ఇక్కడ కవిని విశ్వజనీనుడని, నిరంతరుడని, నిత్యవసంతుడని, సార్వజనీనుడని వారు సంబోధించినప్పుడే మనకు తెలిసిపోతుంది కవిత్వంపై వారికున్న అనన్య సామాన్యమైన ప్రేమ. చినుకులా ఎప్పుడో ఒకప్పుడు మొదలైన అక్షరం వాక్యంగా రూపుదిద్దుకొని కవిత్వంగా ఎదగడం మొదలయ్యిన తరువాత అది నిరంతర ప్రక్రియగా రూపాంతరం చెందుతుందనే సత్యాన్ని ఆరంభంలోనే మనకు గొప్పగా చెప్పారు హరికృష్ణ గారు. 


ముఖకవళికలు మనిషి ఆలోచనల్ని కొంత వరకు తెలుపుతాయి. కానీ చేతిరాత విధానం అతడి భావోద్వేగ తీవ్రతని చక్కగా చూపిస్తుంది. ఇదే మానసికశాస్త్రం లోని గ్రాఫాలజీ గొప్పతనం. మూడు దశాబ్దాల క్రితం కవి భావవ్యక్తీకరణ ప్రతీ కవితలో పరిణామం చెందిన విధానం మనకిక్కడ బోధపడుతుంది. ఎందుకంటే అన్ని పుస్తకాల్లో మరయంత్రం సాయంతో అందమైన మాయలోకి తోసేసిన అక్షర కూర్పు కాదిది. హరికృష్ణ గారి నేర్పుని, స్వయంగా వారే ఓర్పుతో మనకందించిన గొప్ప ప్రయత్నం. అందుకే ఈ కవితా సౌరభాల్ని మనం ఆస్వాదిస్తూ, ఆనందించాలి.


కాలం దొంతరల్లో నిక్షిప్తమైన ఒక జ్ఞాపకం ఒకానొక ఉలికిపాటు మూలంగా మన నిద్రను చెరిపేసినప్పుడు

ఆ జ్ఞాపకాన్ని పదిలంగా భద్రపరిచిన ఆ వాత్సల్యానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 34 యేళ్ళ క్రితపు అక్షర ప్రవాహం ఎక్కడో తెలియని బందీగా మారినప్పుడు, ఆ అక్షరాలకు స్వేచ్ఛను ప్రసాదించిన ఆ రూపం మామిడి సుదర్శన్ గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ కవి హృదయాంతరాలలోకి తొంగిచూసి ఆ అనుభూతులను స్వీకరిస్తూ తన్మయత్వంతో తపస్విని తడుతూ మురిసిపోదాం పదండి.

జీవితపాఠాన్ని ఆరంభ కవితగా అందించి, మనోనేత్రంతో లోకాన్ని విశాలదర్శనం గావించిన

ఆ అక్షరాలకు ఆత్మీయ సన్మానం చేసి వద్దాం పదండి.


కలల్లో విహరించిన అబద్దాన్ని వదిలేసి జలతారు పరదాల సరదాలను దాటేసి నిజంలోకి రమ్మనిచెప్పారు వారు. అసమానతల అడ్డుగోడల్లో

నిరంకుశ లావాలో దారిద్య్రపు తుఫాన్ లో నీ కలల శవాలు పడిఉన్నాయి. మెళుకువలోకి వచ్చి చూడమనే చైతన్య బాణాలను సంధించారు. కాంతను మెప్పించే భావుకుడి అవతారం కూడా ఎత్తాడు కవి ఇక్కడ. పెదాల పొగడ్తని పదాలతో ఆరంభించి ప్రేమసరస్సులో ప్రేయసిని తడిపేసిన చిలిపితనపు వయస్సును ప్రతిబింబించారు.


ఆమని సంధ్యావాద్యాలను వినుకుంటూ ప్రేయసి పిలుపులను అమితంగా ఆరాధించిన కవి, వెళ్లిపోయిన బ్రతుకురైలు ప్లాట్ ఫామ్ మీదనే నీ లక్ష్యాలను వదిలేసిపోయినా, నిరీక్షణ తరువాత అదే రైలు మళ్ళీ వస్తుందనే ఆశాభావాన్ని పాఠకుడి మనసులో ముద్రించాడు. గులాబి సౌరభంతో పాటు వెనుక దాగిన ముల్లును కూడా గుర్తుచేసాడు. రక్తమాంసాలు లేని ఎముకలగూడులోంచి ఆకలినేత్రాలతో సమాజ దృశ్యాల్ని మనకు చూపించాడు. సామాన్యుడి జీవితాన్ని పరిచయం చేస్తూ నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాడు.


అసలెప్పుడో మొదలైందీ పయనం.

కోట్లలో ఒకడిగా అలుపెరుగక పోరాటం చేసిన పిదప

దరిచేరిన అదృష్టమిది.

ఎవరు నేర్పారో తెలియదు గానీ,

కణంలాగా ఉన్నపుడే రణం లోన గెలిచాను.

మాసపు సోపానాలు దాటుకుంటూ

మాంసపు ముద్దగా నేలపై పడ్డాను.

గాలితరగలనెన్నో తాకాను,

ఊహల పరుగులకు ఊతమిచ్చాను,

ఆశల నురగలను హత్తుకున్నాను,

అవి చిదిమిన తరువాత చింతించాను.

వలుపుల వలల్లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డాను.

ఇవ్వన్నీ పాఠకుడిగా నా భావాలు. నాలాంటి ఎందరి ఆర్తికో అర్థాన్ని చెబుతూ, ఆ చింతలను కాగితంపై చెక్కిన గొప్ప శిల్పి మామిడిహరికృష్ణ గారు.


అలుముకున్న నిర్లిప్తతని, విరుచుకుపడిన నిశ్శబ్దాన్ని చెరిపేసిన ఒకే ఒక్క పదాన్ని పరిచయం చేసిన ప్రయత్నమిది. మంచి చెడుల మధ్య దీనంగా నిలబడి చూస్తుంది. నిజమనే పేరును తనకు తగిలించి సూక్తుల మూటలను బలవంతంగా ఎత్తుతుంటే, మోయలేక అలిసింది తను.

అస్తిత్వ పోరులో, స్వార్థపు ఉధృతిలో,

సంకల్పం చెంత సాగిలపడి దుఃఖిస్తున్న సత్యానికి

కొంత ఊరట కావాలి.

కాంతి ఱెక్కలు విరిచి, పాడుబడ్డ చీకటిలోకి తోసేసి

'చెడు'చేస్తున్న కరాళనృత్యానికి తాళమందించే సమాజంలో అసత్యమనేది నూతన రూపాన్ని సంతరించుకుంటుంది.


బూజుపట్టిన దేహాల ఆర్తిలో,

చెమటచుక్కల ప్రవాహ హోరులో,

భావరహిత చూపుల రేఖలపై

కదులుతూ ఎటెళ్లాలో తెలియక అచేతనమయ్యింది సత్యం. కాలానికి, కపాలానికి  మధ్య సంధి కుదిర్చే బాధ్యత కవిదే. ఆశయాలకు, ఆనందాలకు మధ్య తీవ్రతను గుర్తించే సహనమే కవి. ఆ కవి మనసుపెట్టి రాయడం మొదలుపెడితే సమాజం పొందే ప్రతిఫలం ఎంతో గొప్పగా ఉంటుందనడానికి నిదర్శనం ఈ సుషుప్తి నుంచి...


తెరిచిన పుస్తకంలోనుండి వచ్చే పదాల పరిమళం మదిని తాకుతూ విజ్ఞానం రూపంలో నిక్షిప్తం గావించే బాధ్యతని కవి తీసుకున్నప్పుడు ఆ పదాల సృష్టికర్త దైవంతో సమానం. పదానికి పదానికి మధ్య విరామాన్ని మధ్య విరామాన్ని త్వరగా తుడిచేయాలనే ఆరాటం పాఠకుడిని పరుగు పెట్టించినప్పుడు ఆ కవి చేసిన ప్రయత్నం మహోన్నత ఫలితం పొందినట్టే. ఓపక్క సమాజాన్ని ప్రశ్నిస్తూ, మరోపక్క సమాధానాన్ని సూచించడానికి మనముందుకు తెచ్చిన అద్భుత ప్రయత్నమే ఈ సుషుప్తి నుంచి...


వీధి మొత్తానికి ఉన్న ఒక్క దీపం గొప్పదనాన్ని జీవనదాతలా వర్ణించాడు. ఈస్ట్ మన్ కలర్ లో భవిష్యత్ చిత్రపటాన్ని చిత్రించగలిగినా వర్తమానం ఉలిదెబ్బలని మర్చిపోలేక పోతున్నాననే ఆవేదనని వ్యక్తపరిచాడు కవి. గ్లిజరిన్ కన్నీళ్ళలోని ఆర్ద్రతని, ప్లాస్టిక్ పూలలోని పరిమళాన్ని వెతుక్కునే నేను అబద్దమనే నిన్ను కనుక్కోలేక పోయానని తల్లడిల్లిపోయాడు. భుజాలకు తుపాకులేసుకొని వచ్చిన వాళ్ళు రగిలించిన కాగడాని నీ కన్నీళ్లతో ఆర్పుతారు అప్పుడు నువ్వే మరో సూర్యుడివై వెలగాలి అనే గొప్పనైన ప్రేరణని అందించారు మామిడి హరికృష్ణ గారు.


నీతో నీవే ద్వేష గీతాన్ని ఆలపిస్తూ సృష్టించిన భౌతిక దాడిని వివరించారు. అలలు, మేఘాలు నీకు కనిపించినా, సముద్ర ఘోష నీకు వినిపించినా నా గీతాన్ని గాంచాలంటే నీ మనోనేత్రాన్ని తెరిచిచూడమని నిర్దేశిస్తూ వారి అక్షరాలతో విడదీయలేని ఒక దృఢమైన బంధాన్ని సృష్టించిన ఆ కవి అన్వేషణ ఎంత ఉన్నతమైందో లోతుగా తెలియజెప్పే గొప్ప పుస్తకం 'సుషుప్తి నుంచి'.

మనం కూడా గాఢ నిద్రను వదిలేసి ఉలికిపాటుల్ని ఎంతగానో ప్రేమించుదాం.


         ✍️యెనగంటి నర్సింగరావు

Tuesday, 6 October 2020

లేఖ ...ప్రేమ లేఖ !

 Shubha samayam, plz read my detailed analytical article #LEKHA_PREMA_LEKHA, on the evolution and metamorphosis of #LETTERS in human life, from stone inscripp

లేఖ... ప్రేమలేఖ !

-- మామిడి హరికృష్ణ 8008005231


         ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother  of all inventions అన్నారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - విశేషాలు - వికాసాలకు సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి... అలా ప్రాంతాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ  సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!

          Oకానొక కాలంలో లేఖలు, లేఖా సాహిత్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించాయి. క్రమంగా డిజిటల్‌ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ల రాకతో ఇతర సంప్రదాయాలలాగే ఉత్తరం కూడా ‘అంతరించిపోయే అలవాటు’ (Endangered Habit) గా పరిణమించింది. ఈ సంక్షోభ సమయంలోనూ  ఓ తీపి కబురు ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఓ ఆన్‌ లైన్‌ సర్వేలో, అత్యధిక శాతం ప్రజలు తమ పాత వస్తువులలో ఉత్తరాలే అమూల్యమైనవని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరాల పరిణామం, లేఖా సాహిత్యపు తీరుతెన్నుల విశ్లేషణే ఈవారం కవర్‌ స్టోరీ..

*************


‘How wonderful it is to be able to write Someone a letter! To eel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous’- ప్రఖ్యాత జపనీస్‌ రచయిత హరుకీ మురాకమి 1987లో రాసిన ‘నార్వేజియన్‌ వుడ్‌' నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి. 

నిజమే, ఉత్తరం అంటే హృదయ నివేదన...! 

ఆత్మావిష్కారం!! 

అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత! నిత్య జీవితంలోని ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన! అందుకే ఉత్తరం, మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.!!

              ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తున్నది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో ఒకటైన లేఖారచన  ఇప్పుడు, అంతరించి పోతున్న సంప్రదాయాల కోవలోకి చేరింది...  ఒకప్పుడు కష్టాలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ... మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం నేడు మానవ మస్తిష్కపు స్టోర్‌రూమ్‌లో ‘పాత వస్తువు’గా మారిపోయింది.  అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒక జ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒక కోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!

             ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన...  నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన... ప్రపంచమంతా ఒక్క కుదుపు... వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు...  మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్బధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ‘లాక్‌ డౌన్‌' ప్రపంచ గమ్యాన్ని చెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణకాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.!

                ఈ సందర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమ స్టోర్‌ రూమ్‌లలో దుమ్ము కొట్టుకుపోయిన వస్తువులను వెలికి తీశారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో బయల్పడ్డ విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం ! ఇలా, కాలం చెల్లాయని అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి.  ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని వెల్లడయింది.  చాలా లేఖలు ‘ఉభయకుశలోపరి’తో మొదలై ‘ఇట్లు మీ శ్రేయోభిలాషి’గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని సాధించడం విశేషం.!!


*తెలుగు సాహిత్యంలో..*


          తెలుగులో లేఖాసంప్రదాయపు ఛాయలు ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగింది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతో వెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగర చరిత్ర’ అనే గ్రంథంలో ఉటంకించబడింది. 

         రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెండ్లి చేయాలనుకున్న తండ్రి దుస్థితికి చలించి, ఆ కూతురు ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచన అప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది.  ఇక గుర్రం జాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాథమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి గజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రం చేస్తుంది. 

        తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రాసిన ‘సైనికుడి ఉత్తరం’ కవిత (‘అమృతం కురిసిన రాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్‌ రాసిన నవల  ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరో సంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’ తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.

        ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్‌ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతినిచ్చింది. ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితే తెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే, మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరం రాసినట్లుగా అందించాడు.


*లేఖా సాహిత్యంలో..*


        ‘కాదేదీ సాహిత్యానికనర్హం ‘ అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశంపైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. ఏ వస్తువు అయినా, ఏ అంశం అయినా లేఖాశైలిలో అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనాలు నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను అనేక రకాలుగా అభివర్ణించారు. వాటిలో కొన్ని... 

 

ప్రకృతి లేఖలు; ఆరోగ్య లేఖలు; కుటుంబ సంబంధాల లేఖలు; శాస్త్ర, సాంకేతిక లేఖలు; ప్రత్యేక దినాలపై లేఖలు; దేశభక్తి లేఖలు; జీవన శైలి లేఖలు; పండుగలపై లేఖలు; మార్గదర్శులపై లేఖలు; భాషా సాహిత్యాలపై లేఖలు; సామాజిక -రాజకీయ లేఖలు; మత, ఆధ్యాత్మిక, తాత్విక  లేఖలు; ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు!


*వాక్యాల వెంట ప్రయాణం*


        లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లిన విధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి.. అంతా ఆయా రచయితలు  వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని తమ వెంట తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. “అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే (Reaffirmation of humanity) కావాలి..’ అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా లేఖలు ఉంటాయి!


*లేఖలు...*


మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...

మనసుతో మనసు చేసే సంభాషణలు. 

వాటిని మనసు విప్పి విందాం...!

గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...

అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు. 

వాటిని.. హృదయం తెరచి చూద్దాం.. !

ఈ లాక్‌ డౌన్‌ కాలంలో స్టోర్‌రూమ్‌ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలుకరిద్దాం...!


********************

ఉత్తరం రాయడం ఓ కళ !


       ‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని తరచూ అంటుంటాం, వింటుంటాం.  కానీ లేఖా రచనను ఓ కళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే  ‘Epistolography’ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ శాస్త్రం యూరప్‌లో బైజాంటైన్‌ సామ్రాజ్యంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్‌ సామ్రాజ్యానికే బైజాంటియమ్‌ అని పేరు. ఇది యూరప్‌లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్‌ నగరం 1453లో ఆటోమాన్‌ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్‌స్టాంటి నోపిల్‌'గా, ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్‌'గా పేరుపొందింది. ప్రాచీన బైజాంటియన్‌ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. ఆ లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడానికి ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాదు, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో లేఖారచనా కళనూ అభ్యసించేవారని తెలుస్తున్నది. రాజ్యాల మధ్య యుద్ధం లేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజుపట్ల భక్తిభావం, విధేయత పెరగాలన్నా లేఖవల్లనే సాధ్యమవుతుందనే మౌలిక విషయాన్ని రోమన్‌ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్నిబట్టి చెప్పవచ్చు.

********************

లేఖా సాహిత్యం 


        సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style),  శిల్పమే (technique) ప్రధాన కారణాలు. ఆ లెక్కన విశ్లేషిస్తే ఉత్తరాల ద్వారా విషయాన్ని వెల్లడించే విధానాన్ని ‘లేఖాసాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు. లేఖాసాహిత్యానికి సమానార్థంగా ఇంగ్లీష్‌లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్‌ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే, Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!

************************


*తోకలేని పిట్ట నుండి ట్విట్టర్‌ దాకా...*


       2000 సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వల్ల పేజర్‌, ఈ-మెయిల్‌, షార్ట్‌ మెసేజెస్‌ సర్వీస్‌ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే మార్చివేశాయి.

      నిజానికి ‘లేఖ’ ప్రధాన లక్ష్యం - సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం! నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ! అయితే, ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూశాయి.

       మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరుల ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా సమాచారాన్ని చేరవేసేవి. ఆ కాలంలో లేఖలను గమ్యానికి చేర్చేందుకు మనుషులు, పక్షులు, జంతువులను వాహకాలుగా ఉపయోగించేవారు. మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడం... ముఖ్య పరిణామాలు. దీంతో, లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే పరిమితం కాకుండా.. చదువుకున్న ఇతర సమాజాలకు కూడా అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతమై ఉత్తరాల బట్వాడా సులభతరం అయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ లేఖలు ఎన్నో  మార్పులకు గురి అయ్యాయి.  అలా టెలిగ్రామ్‌, ఫ్యాక్స్‌ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి.      


        2000వ సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వల్ల పేజర్‌, ఈ-మెయిల్‌, షార్ట్‌ మెసేజెస్‌ సర్వీస్‌ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే  మార్చివేశాయి. ఇక సోషల్‌  మీడియా (ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌) విజృంభణలతో లేఖలు, లేఖా సాహిత్యం అనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోతున్న  సంప్రదాయంగా మారాయి.  అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్‌ నుండి పేపర్‌లెస్‌ ఈ-మెసేజ్‌లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆ లెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్‌  సాంకేతిక రూపాలైన మెయిల్‌, మెసేజ్‌ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.

*************************

*ప్రపంచ సాహిత్యం*


         లేఖా సాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్‌లో రాసిన ‘Prison of Love’ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్‌ సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666) కలం పట్టిన ‘Familiar Letters’ ను పేర్కొంటారు. 18వ శతాబ్దం నాటికి లేఖా సాహిత్యం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. జేన్‌ ఆస్టిన్‌, వర్జీనీయా వుల్ఫ్‌ లేఖల రూపంలో సాహిత్యాన్ని వెలువరించారు. ఫ్రాంకెన్‌స్టిన్‌, డ్రాకులా, ద కలర్‌ పర్పుల్‌ లాంటి క్లాసిక్స్‌ లేఖారూపంలోనే సాగుతాయి. రెండో ప్రపంచయుద్ధ కాలంలోని భయానక బీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను ప్రతిఫలించిన ‘ద డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గాళ్‌' కూడా కొంత లేఖారూపంలోనే రాయడం విశేషం. 

***********************


*మౌఖిక లేఖలు*

         రాయబారాలూ, మధ్యవర్తిత్వాలూ మౌఖిక లేఖల కిందికే వస్తాయి. దూతగా పంపినవారి మనోభావాన్ని వెల్లడించడమే వీరి పని.  భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీ మౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు ఆయా సందర్భాల్లో చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు. 

            కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈ పదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend)! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్‌ లేఖను ఆయన రాశాడు. 

          అలాగే ‘సందేశ కావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్ని అందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.

************************

*ప్రేమ లేఖల రూటే సెపరేటు*

           లేఖా సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్‌గా, చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖా సాహిత్యంలో, ప్రేమలేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని కొత్త కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్‌ రాణులు,  నోబెల్‌ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు.. వంటి ఎంతోమంది ఆయాకాలాల్లో  రాసిన ప్రేమలేఖలు, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం చేస్తున్నాయి.


          అలా ప్రముఖులు వేర్వేరు సందర్భాలలో రాసిన ప్రేమలేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.  అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.

        అలాగే సాధారణంగా ప్రేమలేఖలు రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు - “I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough” అన్నమాటలను గుర్తుచేస్తాయి. అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుంచి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.

***********************

*కొత్త ప్రేమలేఖలు : లెటర్స్‌ టు లవ్‌*  


        ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్‌  అయినంపూడి శ్రీలక్ష్మి  రాసిన ‘కొత్త ప్రేమలేఖలు’ పుస్తకం తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశవాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం, తర్వాత పుస్తకంగా సంకలనం చేయడం ద్వారా వాటికి ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే! ఈ పుస్తకంలో పొందుపరిచిన  51 ప్రేమలేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా,  తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేశాయి.   

           అలాగే, యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - ‘లెటర్స్‌ టు లవ్‌'! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జనరేషన్‌ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా, ఆమె పుస్తకం ప్రారంభంలోనే చెప్పినట్టు చలం శైలి, ప్రభావం సమకాలీనతరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి. 

***********************

*సామాజిక ప్రయోజనం*

           స్వామి వివేకానందుడు (1863-1902), శరచ్చంద్ర చటోపాధ్యాయ (1876 -1938), జవహర్‌లాల్‌ నెహ్రూ  (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరాగాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) అధిగమించి, సామాజిక ప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.  

        అలాగే విశ్వకవి, నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్‌ ఠాగూర్‌కూ... తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు  విక్టోరియా ఒకెంపోకు మధ్య సాగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆ లేఖా బంధమే చివరికి ఠాగూర్‌ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఈ కావ్యాన్ని ఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా వాదనను బలపరుస్తున్నది.!

---------  Harikrishna Mamidi

MHK poetry Analysis 1

 కవిముద్ర - 52

~

తెలంగాణ జీవద్భాష సొబగుల సౌందర్యం- 'మామిడి హరికృష్ణ' కవిత్వం

~

కవిగా 'ఊరికిపోయిన యాళ్ళ'(2018), 'ఒంటరీకరణ'(2019), 'సుషుప్తి నుంచి'(2020) మూడు కవిత్వసంపుటులు తీసుకొచ్చారు. వరంగల్ జిల్లాలోని శాయంపేట తన పుట్టినూరు. ఊరితో కవికున్న గాఢమైన అనుబంధం, పల్లెభాష, జానపదుల బతుకుల్లోని సంస్కృతులు, జీవనవిధానాలు; పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావం, తెలంగాణ ఉద్యమం, మనిషి మనసు లోతుల్లోకి వెళ్ళి తనను తాను అన్వేషించడం, మనిషి భావోద్వేగస్థాయిలు, యవ్వనంలోని ప్రేమ, విరహం, అభ్యుదయ భావజాల ప్రభావం మొ.నవి తన కవిత్వం నిండా పుష్కలంగా కనిపిస్తాయి. కవిత్వనిర్మాణంలో కథనాత్మక పద్ధతి వాడటం వల్ల ఊర్లలో జనం ముచ్చట్లు చెప్పుకునే విధానంలానే ఆసక్తికరంగా వుంటూ సారం వైపుకు తన కవిత్వం లాక్కెళ్తుంది. చెప్పదల్చుకున్న విషయానికి 'ఉన్ముఖీకరణ' లాగా నిర్మాణవిధానంలోని కొనసాగింపు వుంటుంది. శీర్షికను ధృడపరిచేలా బహుళ నిర్వచన ప్రవచనాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వీటిని మొదటి సంపుటిలో ఎక్కువగా చూస్తాం.

"కొడ్కా! నువ్వు ఎక్కడికిపోతే అక్కడికి నువ్వొక్కనివే పోవు"(అమ్మమాట)

ఇందులో సమాంతర చర్యలు(parallel actions) ప్రస్తావించబడ్డాయి. తల్లి పిల్లాడిని బడికి తయారు చేయడం ఒక పక్క, మంచిగ  సద్వుకుని మంచిగ పనిచేస్తే మంచోల్లంటరని బుద్దులు జెప్పుడు ఇంకోపక్క ఏకకాలంలో జరుగుతుంటాయి. ప్రాంతీయత నుండి అంతర్జాతీయత వరకు మనిషి ఎదుగుదలను, ఎదుగుదలతో పాటుగా అవిభాజ్యంగా ప్రయాణం చేసే కుటుంబం, కులం, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం మొ.నవి  మంచి-చెడ్డల్ని ఎలా మోస్తుంటాయో చెప్తూ- పిల్లల వ్యక్తిత్వవికాసనిర్మాణంలో తల్లి పోషించే పాత్రను ప్రతిబింబిస్తుందీ కవిత.

"ఇగ చూస్కో ఊరు ఊరే బండ్లమీద బైలెల్లినట్టుండేది!"(బుగులోని తీర్థం)

తెలంగాణ సంస్కృతిలోని జాతరలు, తీర్థాలు జానపదుల జీవితాలతో ఎంతగా పెనవేసుకుని వున్నాయో చెప్పడం ప్రధానమైన విషయం. దానితోపాటు పట్టింపు వున్న, ఆచరించే మనుషులున్నంత కాలమే అవి వారితో వెలుగొందుతాయన్న సత్యం అంతర్గతంగా చెప్పబడింది. తల్లిపేగును తెంపుకున్న పసిబిడ్డను ప్రస్తావించడంలోని ఉద్ధేశ్యం అంతరార్థం ఇదే! 

"బోనాన్ని తలకెత్తుకొని/సాంపి సల్లి, సాలుకట్టి, సాకుకొని/సావుకెదురు నిల్సింది నా తెలంగాణ!"(బోనం సాక!)

ఇవి పండుగలే కాదన్నోల్లకు, అనాగరికమని అవమానించినోల్లకు బుద్ధి చెప్పిన కాలమది. నగరం ఊరులా రూపాంతరం చెందే బోనాలు హైద్రాబాద్ పురా సంస్కృతికి ఆనవాలు. ఊరి పండుగల్ని ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక ఆయుధాలుగా ఎక్కుపెట్టిన కాలమది.

ప్రతి కవితలోనూ ప్రాణప్రదమైన పాలమొగురం లాంటి ఒక్కవాక్యమైనా దొరుకుతుంది. ఆ వాక్యం చుట్టూ 'కవిత' మొత్తం అనేక అంత్రాల తీగల్లెక్క అ లుముకుని తన బలిమిని చూపిస్తుంది.

"నివద్దిగ చెప్తే గీ వానల చత్తిరి ఉంటే/పక్కన మనిషున్నట్టే"(చత్తిరి)

వస్తువుతో ముడిపడివున్న అనేక నిర్ధిష్టతలను  ఆధారంగా చేసుకుని సాధారణీకరించడం కనిపిస్తుంది. ఇక్కడ చత్తిరిని రకరకాలుగా " చినుకులల్ల పూసిన నల్లతంగేడుపువ్వు, పెద్ద మర్రిచెట్టు, సాత్ గ నిలబడ్డ జిగ్రీదోస్త్, అత్తాకోడల్ల పంచాయితీ నడిమిట్ల అడ్డంగ నిలబడ్డ ఎర్రిబాగుల కొడుకు" గా వర్ణించడం జరిగింది. చత్తిరి పట్టుకున్న వ్యక్తినిబట్టి అవతారాల్ని చెప్పడం(వామనుడు, గోపయ్య, ఇంద్రుడు, ఆదిశేషు) చూస్తాం. ఇటువంటి సాధనను 'దారం కట్టిన సందమామ', 'దోని నీళ్ళు' కవితల్లోనూ చూస్తాం. 

"మెడల గొలుసు కట్టుకున్న కుక్కపిల్ల/మా ఎన్క తోకూపుకుంట/గాలిల తేలుకుంట వచ్చినట్టు అనిపిచ్చేటిది"(దారం కట్టిన సందమామ)

పతంగిని దారం కట్టిన సందమామగా, పైలోకాలనున్న ఏ దేవునికో పంపించే ధన్యవాదాల ఉత్తరంగా, మనకాలపు అర్జునుడు ఏసిన కాయితపు నిచ్చెనగా చెప్పిన నూతన అభివ్యక్తులకు ముగ్ధులమవుతాం.

"రెండు కాలాలలో ఎవరికీ పట్టని దోని/వానకాలంల శివుని శిగల గంగలెక్కయితది/అప్పటిదాంక సడీసప్పుడు చెయ్యక/ఇంటికప్పు మీది చెత్తను/రాలిపడిన యాపచెట్టు ఆకులను నింపుకుని వడ్లబస్తలెక్క గమ్మునుంటది/తొలిచినుకు పడంగనే/దబ్బదబ్బ ఆ సరుకునంత ఖాళీచేత్తది"(దోని నీళ్ళు)

తరంగ చలనంలో శృంగం, ద్రోణి లాంటి పదాల్ని వింటాం. ద్రోణిలాంటిదే దోని. దోనిని 'ఇల్లు పట్టిన దోసిలి, మబ్బుల వాన కోసం కట్టిన కాలువ, బెంగుళూరు గూనలన్ని కలిసి చినుకుల గింజలను ఒక్కచోట రాశిపోసే కల్లం'గా చెప్తాడు కవి. ఇవి కవిత్వసాంద్రతను పట్టిస్తాయి. అలాగే "ఊరికిపోవడం అంటే/ఊరికే పోవడం కాదు/ఊపిరి కోసం పోవడం"(ఊరికిపోయిన యాళ్ల) లాంటి వాక్యాలు ఎప్పటికీ మనోఫలకంపై గుర్తుండిపోతాయి. తెలంగాణ జీవద్భాష అత్యంత సహజంగా ఒదిగిపోవడం కవిత్వానికి మరింత శోభను చేకూర్చే అంశం.

"గుట్టల్ల బాంబు పెట్టినం/సుతిలికి అగ్గిపెట్టి/గుట్ట ఎప్పుడు పేలుతదా/అని యెదురుసూసినం/గుట్ట పేలింది - ముక్కలు చెక్కలయింది"(గుట్టను పగలేసినం)

అది బొర్రపెట్టిన సీమాంధ్ర నాయకత్వపు అధికారపు గుట్ట. గుట్టను పగలేసినంకనే మన జాగ జాడ దెల్శింది. మన జెండాపాతి అస్తిత్వ గౌరవాన్ని నిల్పుకున్నం - అనే సారాంశం ఇందులో వుంది.

*

కవి సృష్టించిన నూతన కవితా ప్రక్రియ "Fusion షాయరీ". దీని అవసరం ఏంటి? అని ప్రశ్నించినపుడు "విశ్వవ్యాప్తమైన భావాల్ని వ్యక్తం చేసే భాష కూడా హద్దులకు, పరిమితులకు అతీతంగా మారాల్సిన అవసరంలోంచి, వాటి నేపథ్యంలోంచి పుట్టుకొచ్చిన సమకాలీన నవకవితా సంప్రదాయమే multi-lingual, multi-cultural కవిత్వంగా చెప్తూ దానికి Fusion షాయరీ" గా నామకరణం చేసినట్టు చెప్తాడు కవి. ఇక్కడ fusion అనేది poetry&prose ల కలయికను చెబుతుంది. prose style లోని paragraph pattern మరియు poetry లోని stanza form మిళితమై రెండింటి లక్షణాల్ని కల్గివుంటుంది. అయితే యిది 4 నుంచి 8 stanza లు వుండి, ప్రతి స్టాంజా చివర విడిగా కొసమెరుపు లాంటి వ్యాఖ్యానం ఉంటే గాఢత చేకూరి పాఠకుడికి రసానుభూతి కలుగుతుందని చెప్పబడింది. ఇది కవి సృజనాత్మక నైపుణ్యంపై ఆధారపడి వుంటుంది.

"Fusion షాయరీ on తెలంగాణ జమీన్" ను గమనిద్దాం.

1. of course, మట్టి గొప్పది.. మట్టి సూపిన బాట గొప్పది

2. Indeed, ఈ మట్టి గొప్పది. ఈ మట్టి మండించిన ఉద్యమాల బట్టీ గొప్పది

3. షాయర్ ఈ మట్టి గొప్పది. ఈ మట్టి నుండి పుట్టిన ప్రజానీకం గొప్పది

ఇవి వివిధ స్టాంజాల్లోని విడిగా వుండే మెరుపులాంటి వాక్యాలుగా చెప్పబడ్డ పంక్తులు. అయితే ఏ కవికైనా తాను రాసే కవిత్వంలో పూర్తిగా pure language వుండడం అన్నివేళలా సాధ్యంకాదు. ఒక భాష అనేక భాషల మిశ్రమంగా మాత్రమే తన ఉనికిని కాపాడుకుంటూ మనగల్గుతుంది. అది తెలంగాణ భాషైనా.. ప్రపంచంలో మరే భాషైనా కావచ్చు. కవికి తన మాతృభాషలోని పదం తట్టకపోతే భావానికి సరిపడే ఇతర భాషాపదాల్ని ఈ ప్రక్రియలో విరివిగా వాడుకునే స్వేచ్ఛ వుంది. దానితోపాటు ఈప్రక్రియ కేవలం తెలుగు కవిత్వానికే పరిమితం కానిది. ఏ భాషాకవులైనా ఈ ప్రక్రియలో యథేచ్ఛగా రాసుకునే వెసులుబాటు ఉంది. బహుళ ప్రాచుర్యం కల్పిస్తే ఎక్కడైనా మనగలిగే ప్రక్రియగా చెప్పొచ్చు. వస్తువు విషయంలో ఏకత్వం; శైలీ, నిర్మాణం విషయంలో అనేకత్వం వుండడం ఇందులోని అసలు అంశం.

*

'ఒంటరీకరణ' లో ప్రధానంగా భావోద్వేగ స్థాయిల్లో చెప్పబడ్డ భరతుని నాట్యశాస్త్రంలోని శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత రసాలు, ఉపగుప్తుని చేర్పు - శాంతరసం తో కలుపుకుని నవరసాల్లో మానవ భావోద్వేగాల్లోని ప్రతిఫలనాలు కొంతలో కొంత పొడచూపినట్టు గమనించవచ్చు. Know thyself(నిన్ను గూర్చి నీవు తెలుసుకో) కు ఎక్కువ priority ఇవ్వబడింది. మనిషి తనను తాను వెతుక్కోవడంలో భాగంగా రకరకాల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి చేసే నిరంతర అన్వేషణ వుంటుంది. ఒంటరితనం, సమూహాంలో ఏకాంతాన్ని కోరుకోవడం(privacy factor), ప్రేమరాహిత్యం మొ.నవి కవిత్వగాఢతను నిర్ణయిస్తాయి. 

"ఏళ్ళతరబడి అన్వేషించినా  రాత్రి అంతం కాలేదు/గుండె నిండుగా కురిసిన శూన్యం సాక్షిగా/మనసు అంతటా విచ్చిన చీకటి మొక్కలకి/అసంతృప్తి ఆకులు మొలిచి/నిరాశపూలు గుత్తులు గుత్తులుగా.."(అంతర్లోకం)

శూన్యం, అసంతృప్తి, నిరాశ మొ.నవి negative vibrations. అయినప్పటికీ అంతర్మథనంతో స్వచ్ఛమైన మనిషి జాడకు తొవ్వచూపే పరికరాలివే. 

*

"సుషుప్తి నుంచి' కవిత్వంలో  ప్రాథమికతనంతో పాటు ప్రౌఢ, యవ్వన ప్రాయాల్లోని భావోద్వేగాలకు, మానసిక అలజడులకు అద్దం పట్టే వస్తువుల్లో ప్రేమ అగ్రభాగాన నిలుస్తుంది. గ్రాఫాలజీ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ వికాస దశలను అంచనా వేయడానికి వీలవుతుందనే తలంపుతో తీసుకురాబడింది. తొలిప్రేమలోని తాజాదనం, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసంతొణికిసలాడుతుంది. ప్రేమతో పాటు సమాజంలోని అవకతవకల పట్ల, అంతరాల పట్ల సంఘర్షణ కూడా జమిలీగా పెనవేసుకుని వుంటుంది. 

"ఒక మనిషిగా/సాటి మనిషికి/నేనేమి చేయగలను?/చదవడమా..ఓదార్చడమా?"(జీవితపాఠం)

ఇదంతా కవి నోస్టాల్జియా. ఒకానొక ఫ్యూర్ లైఫ్ కి సాక్షీభూతంగా నిలువగలిగే కవిత్వం. వివిధ రంగాల్లో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ versatile unique personality గా ఎదిగివచ్చిన కవికి శనార్తులు.

**

ఇప్పటివరకు 52 వారాలుగా "కవిముద్ర" ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అవకాశం కల్పించిన "కవిసంగమం" నిర్వాహకులకు, కవి యాకూబ్ గారికి కృతజ్ఞతలు. సెలవు.

***

కవిముద్ర ద్వారా పరిచయం చేసిన కవుల వివరాలు

*

దర్భశయనం శ్రీనివాసాచార్య, వడ్డెబోయిన శ్రీనివాస్, రవి వీరెల్లి, ఎన్. వేణుగోపాల్, మునాసు వెంకట్, తగుళ్ళ గోపాల్, మౌనశ్రీ మల్లిక్, కొండి మల్లారెడ్డి, సుంకర రమేష్, కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, షాజహానా, మెర్సీ మార్గరేట్, జూపాక సుభద్ర, మోహన్ రుషి, వనపట్ల సుబ్బయ్య, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ ఎస్వీకే, పసునూరి రవీందర్, నలిమెల భాస్కర్, బిల్లా మహేందర్, కొలిపాక శోభారాణి, నస్రీన్ ఖాన్, వాణి దేవులపల్లి, అరుణ నారదభట్ల, విప్లవశ్రీ శ్రీనిధి, స్కైబాబా, అవనిశ్రీ, కందుకూరి అంజయ్య, అనిశెట్టి రజిత, పొన్నాల బాలయ్య, బాసిత్, తైదల అంజయ్య, కందుకూరి దుర్గాప్రసాద్, అన్వర్, నందకిషోర్, కోడూరి విజయకుమార్, బూర్ల వెంకటేశ్వర్లు, శ్రీరామోజు హరగోపాల్, తెలిదేవర భానుమూర్తి, నరేష్ కుమార్ సూఫీ, కాసుల ప్రతాపరెడ్డి, ఇబ్రహిం నిర్గుణ్, నారాయణస్వామి వెంకటయోగి, పెన్నా శివరామకృష్ణ, నిధి, నాగేశ్వర్, సి.హెచ్ ఆంజనేయులు, వేముగంటి మురళీకృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, శేషభట్టర్ రఘు, ననుమాస స్వామి, మామిడి హరికృష్ణ

***