Shubha samayam, plz read my detailed analytical article #LEKHA_PREMA_LEKHA, on the evolution and metamorphosis of #LETTERS in human life, from stone inscripp
లేఖ... ప్రేమలేఖ !
-- మామిడి హరికృష్ణ 8008005231
ఈ ప్రపంచంలో సంభవించిన సాహితీ, సాంస్కృతిక, శాస్త్రసాంకేతిక, సామాజిక, ఆర్థిక ఆవిష్కరణలన్నీ ఆయా సమాజాల అవసరాల నుంచి ఉద్భవించినవే. అందుకే Necessity is the mother of all inventions అన్నారు. వేర్వేరు కారణాల వల్ల దూరంగా ఉంటున్న వ్యక్తుల మధ్య సమాచారం - క్షేమం - విశేషాలు - వికాసాలకు సంబంధించిన వివరాలను చేరవేసుకోవాలి... అలా ప్రాంతాలకు అతీతంగా మానవ సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవాలనే ఆలోచనలోంచి పుట్టిన సాహితీ సృజనాత్మక ఆవిష్కరణ - లేఖ!
Oకానొక కాలంలో లేఖలు, లేఖా సాహిత్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యాన్ని సాధించాయి. క్రమంగా డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్‌ల రాకతో ఇతర సంప్రదాయాలలాగే ఉత్తరం కూడా ‘అంతరించిపోయే అలవాటు’ (Endangered Habit) గా పరిణమించింది. ఈ సంక్షోభ సమయంలోనూ ఓ తీపి కబురు ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఇళ్లలోనే ఉన్న సందర్భంలో జరిపిన ఓ ఆన్ లైన్ సర్వేలో, అత్యధిక శాతం ప్రజలు తమ పాత వస్తువులలో ఉత్తరాలే అమూల్యమైనవని చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరాల పరిణామం, లేఖా సాహిత్యపు తీరుతెన్నుల విశ్లేషణే ఈవారం కవర్ స్టోరీ..
*************
‘How wonderful it is to be able to write Someone a letter! To eel like conveying your thoughts to a person, to sit at your desk and pick up a pen, to put your thoughts onto words like this is truly marvelous’- ప్రఖ్యాత జపనీస్ రచయిత హరుకీ మురాకమి 1987లో రాసిన ‘నార్వేజియన్ వుడ్' నవలలో ఒకచోట లేఖల గురించి చెప్పిన వాక్యాలివి.
నిజమే, ఉత్తరం అంటే హృదయ నివేదన...!
ఆత్మావిష్కారం!!
అభిప్రాయాల కలబోత!! విషాదానందాల వలపోత! నిత్య జీవితంలోని ఉద్వేగక్షణాలను, ఉత్తేజ సందర్భాలను, ఉల్లాస సన్నివేశాలను, ఉత్కృష్ట సమయాలను అక్షరాలలో పొదిగి, తెల్లకాగితంపై అందంగా లిఖించే మనఃపూర్వక కళ- లేఖారచన! అందుకే ఉత్తరం, మనుషుల మధ్య అక్షరవారధిని కట్టింది! ఆలోచనాస్ఫోరకమై నిలిచింది! ఆత్మీయ భాషణమై భాసించింది! ఆచరణాత్మక దృక్పథమై మార్గదర్శనం చేయించింది.!!
ఇంతగా మనుషుల జీవితాలతో పెనవేసుకు పోయిన ఉత్తరం గత రెండు దశాబ్దాలకాలం నుంచీ క్రమంగా అదృశ్యమవుతూ వస్తున్నది. మానవజాతి నిర్మించుకున్న ఎన్నో విశిష్టమైన సంప్రదాయాలలో ఒకటైన లేఖారచన ఇప్పుడు, అంతరించి పోతున్న సంప్రదాయాల కోవలోకి చేరింది... ఒకప్పుడు కష్టాలను, కన్నీళ్ళను, నమ్మకాన్నీ, ధైర్యాన్నీ, ఆశలనూ... మొత్తంగా జీవితాన్నీ, జీవనేచ్ఛనూ మోసుకొచ్చిన ఉత్తరం నేడు మానవ మస్తిష్కపు స్టోర్‌రూమ్‌లో ‘పాత వస్తువు’గా మారిపోయింది. అందుకే ఉత్తరం 1990 తరపు మనుషుల వరకూ ఓ నోస్టాల్జీయా... ఒక జ్ఞాపకం... ఒక దిగులు... ఒక బెంగ... ఒక పోగొట్టుకున్న జీవనపార్శ్వం... ఒక కోల్పోయిన ప్రపంచ శకలం... అన్నింటినీ మించి ఒక శిథిల స్వప్నం!
ఇలా మనసులోనే లుంగలు చుట్టుకుని కునారిల్లుతూ, నవజీవన శైలుల మెరుపులను కళ్ళకు ఎంతగా అతికించుకున్నా, గుండెలోతుల్లో ఏ మూలో నిరుడు కురిసిన లేఖా హిమసమూహాలను తల్చుకుంటూ, మనోభారంతో ‘పెన్ను’నీడుస్తున్న క్షణాన... నిత్య జీవన పోరాటంలో పరుగెత్తుతూ వర్తమానం వెంట భవిష్యత్తు వెలుగుల కోసం వెంపర్లాటలు పెరిగిన క్షణాన... ప్రపంచమంతా ఒక్క కుదుపు... వాయువేగ, మనోవేగాలతో భ్రమిస్తూ, పరిభ్రమిస్తూ ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆగిపోయి స్థాణువై స్తంభించి పోయేలా చేసిన మహా కుదుపు... మానవాళిపై కరోనా మహమ్మారి దాడి! దేశాలు, ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలంతా స్వీయ నిర్బధంలో, ఇళ్ళలో ఉండాల్సి వచ్చింది... ‘లాక్ డౌన్' ప్రపంచ గమ్యాన్ని చెరిపింది. విశ్వ గమనాన్ని కుదిపింది. ఆర్థిక వ్యవస్థలను, అభివృద్ధిని నిశ్చేష్టపరిచింది. అలాగే ఎక్కడా క్షణకాలమైనా ఆగకుండా, అలుపు లేకుండా దూసుకుపోతున్న మనిషి ఒక్కసారి ఆగిపోయి, తన గతంలోకి, నడిచొచ్చిన బాటవైపు, తనలోకి తొంగి చూసుకునే అవకాశాన్ని కూడా కలిగించింది.!
ఈ సందర్భంలో ప్రజలంతా, ఇంతకాలం తమ స్టోర్ రూమ్‌లలో దుమ్ము కొట్టుకుపోయిన వస్తువులను వెలికి తీశారు... జ్ఞాపకాలను తవ్వుకున్నారు... ఆ తవ్వకాలలో బయల్పడ్డ విస్మృత అనర్ఘ రత్నాలలో ఒక అద్భుతం - ఉత్తరం ! ఇలా, కాలం చెల్లాయని అనుకుంటున్న లేఖలు మళ్ళీ మన హృదయ సౌధంలో కేంద్ర స్థానాన్ని అలంకరించాయి. ఉత్తరం ఇంతకాలం కేవలం ఓ ‘Nostalgia’ అనుకున్నారు. కానీ ఇది ఓ panacea (మరిచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలను తిరిగి బతికించిన అమృతం) అని వెల్లడయింది. చాలా లేఖలు ‘ఉభయకుశలోపరి’తో మొదలై ‘ఇట్లు మీ శ్రేయోభిలాషి’గా ముగించినప్పటికీ, కొన్ని లేఖలు మాత్రం సాహిత్య రంగంలో కావ్య ప్రతిపత్తిని, శాశ్వతత్వాన్ని సాధించడం విశేషం.!!
*తెలుగు సాహిత్యంలో..*
తెలుగులో లేఖాసంప్రదాయపు ఛాయలు ప్రాచీన కావ్యాలలో కూడా కనిపిస్తాయి. వాటిలో ప్రముఖంగా ప్రస్తావించుకోదగింది- గజపతిరాజుకు అల్లసాని పెద్దన రాసినట్లుగా చెప్పుకునే పద్యలేఖ! దండయాత్రకు వచ్చిన రాజు ఈ పద్యలేఖతో వెనుదిరిగిపోయినట్లుగా ‘విజయనగర చరిత్ర’ అనే గ్రంథంలో ఉటంకించబడింది.
రాయప్రోలు సుబ్బారావు రాసిన ‘స్నేహలతాదేవి లేఖ’ తెలుగు లేఖా సాహిత్యంలో పేరెన్నికగన్నది. ఇంటిని తాకట్టుపెట్టి కూతురు పెండ్లి చేయాలనుకున్న తండ్రి దుస్థితికి చలించి, ఆ కూతురు ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషాదాంత రచన అప్పట్లో వరకట్నంపై నిరసనగా నిలిచింది. ఇక గుర్రం జాషువా తన ‘గబ్బిలం’ ద్వారా లేఖా సంప్రదాయపు ప్రాథమిక రూపమైన సందేశ విధానాన్ని పాటించగా, ‘ఫిరదౌసి’ కావ్యంలో పూర్తిస్థాయి లేఖాసాహిత్య సృష్టిని చేశారు. మాట తప్పిన చక్రవర్తి గజనీ ప్రభువును ఉద్దేశించి కవి ఫిరదౌసి రాసిన కవితాలేఖ కరుణరసాత్మకంగా సాగి గుండెలను ఆర్ద్రం చేస్తుంది.
తిరుపతి వేంకటకవులు 1910-14 మధ్యకాలంలోరాసిన ఉత్తరాలతో వేసిన ‘గీరతం’, అనుభూతి కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘సైనికుడి ఉత్తరం’ కవిత (‘అమృతం కురిసిన రాత్రి’ లోనిది), త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల ‘పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా’, ‘పోస్టు చెయ్యని ఉత్తరాలు’, పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలు (అందులోనూ ఆరో సంపుటిలోని లేఖలు), బోయి భీమన్నరాసిన ‘జానపదుని జాబులు’ తెలుగు సాహిత్యంలో లేఖా సంప్రదాయానికి పెట్టని కోటలుగా నిలిచాయి.
ఇవే కాకుండా నవలల్లో కూడా లేఖా ప్రయోగాలు విస్తృత పాఠకాదరణను పొందాయి. వాటిలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘ప్రేమలేఖలు’ నవల, మరో రచయిత రాసిన ‘ఉత్తరాయణం’ అనే హాస్య నవల ప్రముఖమైనవి. పాపులర్ నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘దూరం’ నవల ఆసాంతం ఉత్తరాలతోనే నడిచి పాఠకులకు శిల్పపరంగా కొత్త అనుభూతినిచ్చింది. ఇక, చలం రాసిన ‘ప్రేమలేఖలు’ అయితే తెలుగు లేఖా సాహిత్య ప్రస్థానంలో ఒక మేలుమలుపుగా నిలిచాయి. లేఖాప్రక్రియ ద్వారా ఎంత హృద్యమైన సాహిత్యాన్ని సృష్టించవచ్చో నిరూపించాయి. అలాగే, మామిడి హరికృష్ణ 2012 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుక విశేషాలను ఓపాఠశాల విద్యార్ధి తన మేనమామకు ఉత్తరం రాసినట్లుగా అందించాడు.
*లేఖా సాహిత్యంలో..*
‘కాదేదీ సాహిత్యానికనర్హం ‘ అన్నట్టు మానవ జీవితాన్ని పరివేష్టించి ఉన్న ఏ అంశంపైన అయినా సాహిత్యాన్ని సృజించవచ్చు. అయితే ఆ జీవన పార్శ్వాన్ని అందంగా, మనోరంజకంగా అందించడానికి రచయితకు నైపుణ్యం అవసరం. ఏ వస్తువు అయినా, ఏ అంశం అయినా లేఖాశైలిలో అందించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాహితీ పీఠాలు దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనాలు నిర్వహించాయి. ఈ పరిశోధనలను అనుసరించి, ఇప్పటి వరకు అంతర్జాతీయంగా వచ్చిన లేఖా సాహిత్యంలోని వస్తువు (Subject) ఆధారంగా లేఖలను అనేక రకాలుగా అభివర్ణించారు. వాటిలో కొన్ని...
ప్రకృతి లేఖలు; ఆరోగ్య లేఖలు; కుటుంబ సంబంధాల లేఖలు; శాస్త్ర, సాంకేతిక లేఖలు; ప్రత్యేక దినాలపై లేఖలు; దేశభక్తి లేఖలు; జీవన శైలి లేఖలు; పండుగలపై లేఖలు; మార్గదర్శులపై లేఖలు; భాషా సాహిత్యాలపై లేఖలు; సామాజిక -రాజకీయ లేఖలు; మత, ఆధ్యాత్మిక, తాత్విక లేఖలు; ప్రపంచ శాంతి- మానవీయ లేఖలు!
*వాక్యాల వెంట ప్రయాణం*
లేఖా సాహిత్యంలో పదాలను పొదిగిన తీరు, వాక్యాలను అల్లిన విధానం, విషయానికి విషయానికీ మధ్య సంభాషణా శైలి.. అంతా ఆయా రచయితలు వేరువేరు రూపాలలో మన ఎదురుగా నిలబడి, మన చేయిపట్టుకుని తమ వెంట తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా లేఖలన్నింటినీ ఒకేసారి ఏకబిగిన చదివినా, విడివిడిగా దఫదఫాలుగా చదివినా ఈ లేఖల అంతిమలక్ష్యం మనలోని మానవున్ని, మానవత్వాన్ని, మానవ తత్వ్తాన్ని స్పృశించినట్లుగానే అనిపిస్తాయి. “అక్షరం - సాహిత్యం ఏదైనా ఒక విస్తృత సామాజిక ప్రయోజనాన్ని కలిగి ఉండాలి. మనకు తెలీని మనలోని అంతరంగ మానవున్ని తట్టి లేపాలి. రేపటి సుందర సమాజ నిర్మాణానికి మనల్ని పురికొల్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే సాహిత్య సృష్టి ఏదైనా దాని అంతిమ లక్ష్యం మానవత్వ పునరుద్ఘాటనే (Reaffirmation of humanity) కావాలి..’ అనే మాటలకు నిలువెత్తు ఉదాహరణగా లేఖలు ఉంటాయి!
*లేఖలు...*
మనసు నుండి మనసు వల్ల, మనసు కోసం...
మనసుతో మనసు చేసే సంభాషణలు.
వాటిని మనసు విప్పి విందాం...!
గుండె తడిని, మనసు అలజడిని, ఆలోచనల ఉరవడిని, సంఘర్షణల తాకిడిని...
అనుబంధాల జడిని నిక్షిప్తం చేసుకొన్న జీవన నిధులు.
వాటిని.. హృదయం తెరచి చూద్దాం.. !
ఈ లాక్ డౌన్ కాలంలో స్టోర్‌రూమ్‌ల నుంచి బయటపడ్డ పాత ఉత్తరాల ప్రేరణతో మళ్ళీ ఒకసారి మన ఆత్మీయులను లేఖలతో పలుకరిద్దాం...!
********************
ఉత్తరం రాయడం ఓ కళ !
‘ఉత్తరం రాయడమూ ఒక కళే’ అని తరచూ అంటుంటాం, వింటుంటాం. కానీ లేఖా రచనను ఓ కళాత్మక విషయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఒకటుందనే విషయం మాత్రం అంతగా తెలీదు. ఉత్తరం రాసే కళనే గ్రీకులు ప్రాచీన కాలంలోనే ‘Epistolography’ అని పిలిచారు. Epistole అంటే అక్షరం, ఉత్తరం అనీ, graphia అంటే రాయడం, లిఖించడం అనీ అర్థం. ఈ శాస్త్రం యూరప్‌లో బైజాంటైన్ సామ్రాజ్యంలో స్వర్ణయుగాన్ని చవి చూసిందని చెప్పాలి. ప్రాచీన కాలంలో తూర్పు రోమన్ సామ్రాజ్యానికే బైజాంటియమ్ అని పేరు. ఇది యూరప్‌లో క్రీ.శ. 395 నుండి 1453 వరకు రాజ్యమేలింది. ఈ సామ్రాజ్య రాజధాని అయిన బైజాంటియమ్ నగరం 1453లో ఆటోమాన్ టర్కుల ఆక్రమణ అనంతరం ‘కాన్‌స్టాంటి నోపిల్'గా, ఆధునిక కాలంలో ‘ఇస్తాంబుల్'గా పేరుపొందింది. ప్రాచీన బైజాంటియన్ చక్రవర్తులు తమ శాసనాలకు, చట్టాలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ప్రజలకు, ఇతర రాజులకు ఉత్తరాల ద్వారా తెలియజేసేవారు. ఆ లేఖలను రసరమ్యంగా, మనోరంజకంగా రాయడానికి ప్రత్యేక నిపుణులను నియమించుకోవడమే కాదు, రాజశిక్షణలో యుద్ధ విద్యలతో లేఖారచనా కళనూ అభ్యసించేవారని తెలుస్తున్నది. రాజ్యాల మధ్య యుద్ధం లేదా శాంతి ఏర్పడాలన్నా, ప్రజలలో రాజుపట్ల భక్తిభావం, విధేయత పెరగాలన్నా లేఖవల్లనే సాధ్యమవుతుందనే మౌలిక విషయాన్ని రోమన్ చక్రవర్తులు తెలుసుకున్నారని దీన్నిబట్టి చెప్పవచ్చు.
********************
లేఖా సాహిత్యం
సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. దీనికి ఆయా సాహిత్య ప్రక్రియలలోని వస్తువు (Theme), శైలి (style), శిల్పమే (technique) ప్రధాన కారణాలు. ఆ లెక్కన విశ్లేషిస్తే ఉత్తరాల ద్వారా విషయాన్ని వెల్లడించే విధానాన్ని ‘లేఖాసాహితీ ప్రక్రియ’గా చెప్పవచ్చు. లేఖాసాహిత్యానికి సమానార్థంగా ఇంగ్లీష్‌లో ‘Epistolary’ అని పిలుస్తారు. ఇది గ్రీక్ పదం ‘Epistle అంటే ‘అక్షరం’ లేదా ‘ఉత్తరం’ నుండి ఏర్పడింది. అంటే, Epistolary is a literary genre pertaining to letters అన్నమాట!
************************
*తోకలేని పిట్ట నుండి ట్విట్టర్ దాకా...*
2000 సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల పేజర్, ఈ-మెయిల్, షార్ట్ మెసేజెస్ సర్వీస్ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే మార్చివేశాయి.
నిజానికి ‘లేఖ’ ప్రధాన లక్ష్యం - సమాచారాన్ని, సందేశాన్ని ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడం! నిర్దేశిత వ్యక్తులు ప్రత్యక్షంగా కలుసుకోలేకున్నా, దూరంగా ఉన్నా వారిమధ్య సమాచార మార్పిడికి, తదనంతర కార్యాచరణకు దోహదం చేసే మానవ అవసరంలోంచి ఉత్పన్నమైన లిఖిత విశేషమే- లేఖ! అయితే, ‘లేఖలు’ వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో దశలను దాటి, ఎన్నెన్నో పరిణామాలను చవి చూశాయి.
మొదట్లో లేఖ సారాంశం మౌఖికంగా వార్తాహరులు, రాయబారులు, అనుచరుల ద్వారా చేరవేయడం జరిగేది. ఆ తర్వాత శిలలపై చెక్కిన అక్షరాల ద్వారా, ఆ తర్వాత తాళ పత్రాల ద్వారా, వస్త్ర పత్రాల ద్వారా సమాచారాన్ని చేరవేసేవి. ఆ కాలంలో లేఖలను గమ్యానికి చేర్చేందుకు మనుషులు, పక్షులు, జంతువులను వాహకాలుగా ఉపయోగించేవారు. మన దేశంలో 1853లో రైల్వే రవాణా ప్రారంభం కావడం, 1854లో తపాలా విధానం అమలులోకి రావడం... ముఖ్య పరిణామాలు. దీంతో, లేఖా సంప్రదాయం రాజులు, కులీనులకు మాత్రమే పరిమితం కాకుండా.. చదువుకున్న ఇతర సమాజాలకు కూడా అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ‘లేఖల చేరవేత’ విధానం వ్యవస్థీకృతమై ఉత్తరాల బట్వాడా సులభతరం అయింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ లేఖలు ఎన్నో మార్పులకు గురి అయ్యాయి. అలా టెలిగ్రామ్, ఫ్యాక్స్ (ఫాసిమిలీ) విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
2000వ సంవత్సరం తర్వాత దేశంలో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల పేజర్, ఈ-మెయిల్, షార్ట్ మెసేజెస్ సర్వీస్ వంటివి జనబాహుళ్యంలోకి వచ్చి ‘సంప్రదాయ లేఖ’ అర్థాన్నే మార్చివేశాయి. ఇక సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్) విజృంభణలతో లేఖలు, లేఖా సాహిత్యం అనేవి గతకాలపు చిహ్నాలుగా, అంతరించిపోతున్న సంప్రదాయంగా మారాయి. అయితే, కొంచెం సానుకూలంగా ఆలోచిస్తే ‘లేఖ’లోని ‘ఆత్మ’ (సమాచారాల చేరవేత) కనుమరుగు కాలేదనీ, లేఖ రూపం మాత్రమే (పేపర్ నుండి పేపర్‌లెస్ ఈ-మెసేజ్‌లకు) మారిందనీ అర్థమవుతుంది. ఆ లెక్కన ప్రస్తుతం న్యూజనరేషన్ సాంకేతిక రూపాలైన మెయిల్, మెసేజ్ వంటివన్నీ ‘లేఖ’కు కొనసాగింపులుగానే భావించాల్సి ఉంటుంది.
*************************
*ప్రపంచ సాహిత్యం*
లేఖా సాహిత్యం (Epistolary) ప్రక్రియలో ప్రపంచభాషలలో వచ్చిన తొలి నవలగా 1485లో Diego de San Pedro స్పానిష్‌లో రాసిన ‘Prison of Love’ని చెప్పుకోవచ్చు. కాగా ఇంగ్లీష్ సాహిత్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్తగా Howell (1594-1666) కలం పట్టిన ‘Familiar Letters’ ను పేర్కొంటారు. 18వ శతాబ్దం నాటికి లేఖా సాహిత్యం అనూహ్యమైన ప్రగతిని సాధించింది. జేన్ ఆస్టిన్, వర్జీనీయా వుల్ఫ్ లేఖల రూపంలో సాహిత్యాన్ని వెలువరించారు. ఫ్రాంకెన్‌స్టిన్, డ్రాకులా, ద కలర్ పర్పుల్ లాంటి క్లాసిక్స్ లేఖారూపంలోనే సాగుతాయి. రెండో ప్రపంచయుద్ధ కాలంలోని భయానక బీభత్స అనుభవాలను, వాటిపై స్పందనలను ప్రతిఫలించిన ‘ద డైరీ ఆఫ్ ఎ యంగ్ గాళ్' కూడా కొంత లేఖారూపంలోనే రాయడం విశేషం.
***********************
*మౌఖిక లేఖలు*
రాయబారాలూ, మధ్యవర్తిత్వాలూ మౌఖిక లేఖల కిందికే వస్తాయి. దూతగా పంపినవారి మనోభావాన్ని వెల్లడించడమే వీరి పని. భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలలోని రాయబార ఘట్టాలన్నీ మౌఖిక లేఖా సంప్రదాయంలోని తొలి రూపాలే అని చెప్పవచ్చు. అంగదుడు, హనుమంతుడు, సంజయుడు, శ్రీకృష్ణుడు ఆయా సందర్భాల్లో చేసిన ప్రయత్నాలు దీనికి ఉదాహరణలు.
కాగా, పూర్తిస్థాయిలో లేఖా సాహిత్యం మొదటగా మనకు సంస్కృతంలో రాసిన ‘సుహృల్లేఖ’ లో కనిపిస్తుంది. ఈ పదానికి అర్థం ‘మిత్రునికో ఉత్తరం’ (An Epistle to a Friend)! దీనిని బౌద్ధ మహాముని ఆచార్య నాగార్జునుడు (క్రీ.శ. 50-120) రాసాడు. ఆనాటి శాతవాహన చక్రవర్తి శాతకర్ణిని ఉద్దేశించి బౌద్ధమతంలోని విశిష్టతలను, సామాజికావసరాన్ని వివరిస్తూ ఈ బృహత్ లేఖను ఆయన రాశాడు.
అలాగే ‘సందేశ కావ్యాలు’ కూడా లేఖా సాహిత్యం కోవ లోనివే అని చెప్పవచ్చు. కాళిదాసు రాసిన ‘మేఘదూతం’ దీనికి ఉదాహరణ. విరహంతో ఉన్న యక్షుడు తన ప్రేయసికి మేఘం ద్వారా సందేశాన్ని అందించే లక్ష్యంతో రాసిన ఈ కావ్యం సాహితీ శిల్ప సంప్రదాయాలలో ఓ విశిష్ట ప్రయోగం అనే చెప్పాలి.
************************
*ప్రేమ లేఖల రూటే సెపరేటు*
లేఖా సాహిత్యం ఆయా దేశ కాలాల సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనధికారిక డాక్యుమెంటేషన్‌గా, చరిత్ర రచనకు మరొక ఆధారంగా ఇప్పుడు సర్వత్రా ఆమోదాన్ని పొందింది. అయితే లేఖా సాహిత్యంలో, ప్రేమలేఖా సాహిత్యం మరొక అడుగు ముందుకేసి, అంతర్జాతీయంగా ఆయా ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవిత అంశాలను, ప్రపంచానికి తెలియని కొత్త కోణాలను వెల్లడి చేస్తున్నాయి. బ్రిటిష్ రాణులు, నోబెల్ విజేతలు, చక్రవర్తులు, గతకాలపు దేశాధినేతలు.. వంటి ఎంతోమంది ఆయాకాలాల్లో రాసిన ప్రేమలేఖలు, వారిలోని విస్మృత కోణాలు లోకానికి ఆవిష్కృతం చేస్తున్నాయి.
అలా ప్రముఖులు వేర్వేరు సందర్భాలలో రాసిన ప్రేమలేఖలను చదివితే ప్రఖ్యాత Zen బోధకుడు Thich Nhat Hanh చెప్పినట్లు -A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write. అనే మాటలకు రుజువులుగా అనిపిస్తాయి.
అలాగే సాధారణంగా ప్రేమలేఖలు రాసే విధానం అనుకోకుండానే Franz Kafka ఓ సందర్భంలో చెప్పినట్లు - “I answer one of your letters, then lie in bed in apparent calm, but my heart beats through my entire body and is conscious only of you. I belong to you; there is really no other way of expressing it, and that is not strong enough” అన్నమాటలను గుర్తుచేస్తాయి. అలా ఈ ‘ప్రేమలేఖలు’ వస్తువు పరంగానే కాక, శైలి (Presentation Style) లో కూడా కొత్త పుంతలు తొక్కాయనే చెప్పవచ్చు. సాధారణంగా ఉత్తరం రాసే శైలి సహృదయతని కలిగి ఉంటుంది. కానీ ‘ప్రేమలేఖలు’ సహృదయతతో పాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని, విశ్లేషణను, వివరణలను కూడా అందించి తొలి అక్షరపు పలకరింపు నుంచి చివరి ముగింపు వాక్యం దాకా ఒక సున్నిత ఆత్మీయతను అక్షరాలనిండా నింపుకుని పరిమళిస్తాయి.
***********************
*కొత్త ప్రేమలేఖలు : లెటర్స్ టు లవ్*
ప్రముఖ కవయిత్రి, రేడియో అనౌన్సర్ అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన ‘కొత్త ప్రేమలేఖలు’ పుస్తకం తెలుగు సాహితీలోకంలో కొత్తముద్రను వేసిందని చెప్పాలి. లిఖిత రూపంలోఉండాల్సిన లేఖలను మొదటగా ఆకాశవాణిలో సంవత్సర కాలం పాటు ‘శ్రవణ’రూపంలోప్రసారం చేయడం, తర్వాత పుస్తకంగా సంకలనం చేయడం ద్వారా వాటికి ‘ముద్రణ’ రూపాన్నివ్వడం అపూర్వమైన విషయమే! ఈ పుస్తకంలో పొందుపరిచిన 51 ప్రేమలేఖలు స్థూలంగా ఎన్నెన్నో సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక, జీవన శైలి సంబంధిత అంశాలపై విషయపరంగా, విశ్లేషణపరంగా, తెలియని కోణాలను ఆవిష్కరించి ‘కొత్త’ అన్నపేరును సార్థకం చేశాయి.
అలాగే, యువ రచయిత్రి కడలి సత్యనారాయణ రాసిన ప్రేమలేఖల సంకలనం - ‘లెటర్స్ టు లవ్'! 40 లేఖలు ఉన్న ఈ పుస్తకంలో ప్రేయసీ ప్రియుల మధ్య జీవన పార్శ్వాలను సున్నితంగా వ్యక్తీకరించడమే కాక, న్యూ జనరేషన్ యువత సమకాలీన ప్రపంచాన్ని, స్త్రీ పురుష సంబంధాలను అర్ధం చేసుకుంటున్న తీరును అద్దంలా చూపించింది. అయితే ఈ ప్రేమలేఖలన్నింటా, ఆమె పుస్తకం ప్రారంభంలోనే చెప్పినట్టు చలం శైలి, ప్రభావం సమకాలీనతరపు ఆలోచనలతో దర్శనమిస్తాయి.
***********************
*సామాజిక ప్రయోజనం*
స్వామి వివేకానందుడు (1863-1902), శరచ్చంద్ర చటోపాధ్యాయ (1876 -1938), జవహర్‌లాల్ నెహ్రూ (1889-1965) వంటి వారు రాసిన లేఖలు మొదటి కోవలోకి వస్తాయి. నెహ్రూ తన కూతురు ఇందిరాగాంధీకి రాసిన లేఖలు కేవలం వ్యక్తిగత క్షేమ సమాచారంగానే కాక సాధికారిక విజ్ఞాన అంశాలుగా ప్రసిద్ధికెక్కి, వైయక్తికతను (Individuality) అధిగమించి, సామాజిక ప్రయోజనాన్ని (Social Utility) సాధించాయి.
అలాగే విశ్వకవి, నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూర్‌కూ... తన అభిమాని, అర్జెంటీనా దేశస్థురాలు విక్టోరియా ఒకెంపోకు మధ్య సాగిన ఉత్తరాలు, ప్రపంచ సాహిత్య చరిత్రలో సహృదయ స్పందనలుగా గుర్తింపు పొందాయి. ఆ లేఖా బంధమే చివరికి ఠాగూర్ ‘పూరబి’ పేరుతో ప్రేమ కవితల సంకలనాన్ని రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఈ కావ్యాన్ని ఆయన ఆమెకు అంకితం ఇవ్వడం కూడా వాదనను బలపరుస్తున్నది.!
--------- Harikrishna Mamidi
No comments:
Post a Comment