Thursday, 8 October 2020

MHK poetry Analysis 2 ( సుషుప్తి నుంచి )- యెనగంటి నర్సింగరావు

 మెలకువను పరిచయం చేసే అక్షర సమూహం.

సుషుప్తి నుంచి.....

------------------------------------------------------------

ఏదీ పూర్తిగా తెలియకున్నా ఎంతో తెలుసుననే భ్రమలో, జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటూ హుషారుగా కాలాన్ని దాటేసే వయసులో చదివే చదువు ఇంటర్మీడియట్. అందరూ కుర్రాళ్ళలా అతడు ఆలోచించలేదు, యవ్వనపు ఛాయలు దేహానికే గాని ఆయన పొందిన విజ్ఞానం వయసు ఎంతో ఎక్కువ.  అక్షరాన్ని అమ్మగా ప్రేమించి, కవిత్వపు కమ్మదనాన్ని లోకానికి అందించాలనే అప్పటి ఆ ఆరాటానికి ప్రతిబింబమే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మామిడి హరికృష్ణ గారి సుషుప్తి నుంచి అనే కవితాసంకలనం.


కవికి ఉన్నతమైన స్థానాన్నిచ్చిన తర్వాత కవిత్వం గురించి చెప్పడం ఉత్తమమైన పద్ధతి. ఇక్కడ కవిని విశ్వజనీనుడని, నిరంతరుడని, నిత్యవసంతుడని, సార్వజనీనుడని వారు సంబోధించినప్పుడే మనకు తెలిసిపోతుంది కవిత్వంపై వారికున్న అనన్య సామాన్యమైన ప్రేమ. చినుకులా ఎప్పుడో ఒకప్పుడు మొదలైన అక్షరం వాక్యంగా రూపుదిద్దుకొని కవిత్వంగా ఎదగడం మొదలయ్యిన తరువాత అది నిరంతర ప్రక్రియగా రూపాంతరం చెందుతుందనే సత్యాన్ని ఆరంభంలోనే మనకు గొప్పగా చెప్పారు హరికృష్ణ గారు. 


ముఖకవళికలు మనిషి ఆలోచనల్ని కొంత వరకు తెలుపుతాయి. కానీ చేతిరాత విధానం అతడి భావోద్వేగ తీవ్రతని చక్కగా చూపిస్తుంది. ఇదే మానసికశాస్త్రం లోని గ్రాఫాలజీ గొప్పతనం. మూడు దశాబ్దాల క్రితం కవి భావవ్యక్తీకరణ ప్రతీ కవితలో పరిణామం చెందిన విధానం మనకిక్కడ బోధపడుతుంది. ఎందుకంటే అన్ని పుస్తకాల్లో మరయంత్రం సాయంతో అందమైన మాయలోకి తోసేసిన అక్షర కూర్పు కాదిది. హరికృష్ణ గారి నేర్పుని, స్వయంగా వారే ఓర్పుతో మనకందించిన గొప్ప ప్రయత్నం. అందుకే ఈ కవితా సౌరభాల్ని మనం ఆస్వాదిస్తూ, ఆనందించాలి.


కాలం దొంతరల్లో నిక్షిప్తమైన ఒక జ్ఞాపకం ఒకానొక ఉలికిపాటు మూలంగా మన నిద్రను చెరిపేసినప్పుడు

ఆ జ్ఞాపకాన్ని పదిలంగా భద్రపరిచిన ఆ వాత్సల్యానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 34 యేళ్ళ క్రితపు అక్షర ప్రవాహం ఎక్కడో తెలియని బందీగా మారినప్పుడు, ఆ అక్షరాలకు స్వేచ్ఛను ప్రసాదించిన ఆ రూపం మామిడి సుదర్శన్ గారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ కవి హృదయాంతరాలలోకి తొంగిచూసి ఆ అనుభూతులను స్వీకరిస్తూ తన్మయత్వంతో తపస్విని తడుతూ మురిసిపోదాం పదండి.

జీవితపాఠాన్ని ఆరంభ కవితగా అందించి, మనోనేత్రంతో లోకాన్ని విశాలదర్శనం గావించిన

ఆ అక్షరాలకు ఆత్మీయ సన్మానం చేసి వద్దాం పదండి.


కలల్లో విహరించిన అబద్దాన్ని వదిలేసి జలతారు పరదాల సరదాలను దాటేసి నిజంలోకి రమ్మనిచెప్పారు వారు. అసమానతల అడ్డుగోడల్లో

నిరంకుశ లావాలో దారిద్య్రపు తుఫాన్ లో నీ కలల శవాలు పడిఉన్నాయి. మెళుకువలోకి వచ్చి చూడమనే చైతన్య బాణాలను సంధించారు. కాంతను మెప్పించే భావుకుడి అవతారం కూడా ఎత్తాడు కవి ఇక్కడ. పెదాల పొగడ్తని పదాలతో ఆరంభించి ప్రేమసరస్సులో ప్రేయసిని తడిపేసిన చిలిపితనపు వయస్సును ప్రతిబింబించారు.


ఆమని సంధ్యావాద్యాలను వినుకుంటూ ప్రేయసి పిలుపులను అమితంగా ఆరాధించిన కవి, వెళ్లిపోయిన బ్రతుకురైలు ప్లాట్ ఫామ్ మీదనే నీ లక్ష్యాలను వదిలేసిపోయినా, నిరీక్షణ తరువాత అదే రైలు మళ్ళీ వస్తుందనే ఆశాభావాన్ని పాఠకుడి మనసులో ముద్రించాడు. గులాబి సౌరభంతో పాటు వెనుక దాగిన ముల్లును కూడా గుర్తుచేసాడు. రక్తమాంసాలు లేని ఎముకలగూడులోంచి ఆకలినేత్రాలతో సమాజ దృశ్యాల్ని మనకు చూపించాడు. సామాన్యుడి జీవితాన్ని పరిచయం చేస్తూ నిశ్శబ్ద సంగీతాన్ని వినిపించాడు.


అసలెప్పుడో మొదలైందీ పయనం.

కోట్లలో ఒకడిగా అలుపెరుగక పోరాటం చేసిన పిదప

దరిచేరిన అదృష్టమిది.

ఎవరు నేర్పారో తెలియదు గానీ,

కణంలాగా ఉన్నపుడే రణం లోన గెలిచాను.

మాసపు సోపానాలు దాటుకుంటూ

మాంసపు ముద్దగా నేలపై పడ్డాను.

గాలితరగలనెన్నో తాకాను,

ఊహల పరుగులకు ఊతమిచ్చాను,

ఆశల నురగలను హత్తుకున్నాను,

అవి చిదిమిన తరువాత చింతించాను.

వలుపుల వలల్లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డాను.

ఇవ్వన్నీ పాఠకుడిగా నా భావాలు. నాలాంటి ఎందరి ఆర్తికో అర్థాన్ని చెబుతూ, ఆ చింతలను కాగితంపై చెక్కిన గొప్ప శిల్పి మామిడిహరికృష్ణ గారు.


అలుముకున్న నిర్లిప్తతని, విరుచుకుపడిన నిశ్శబ్దాన్ని చెరిపేసిన ఒకే ఒక్క పదాన్ని పరిచయం చేసిన ప్రయత్నమిది. మంచి చెడుల మధ్య దీనంగా నిలబడి చూస్తుంది. నిజమనే పేరును తనకు తగిలించి సూక్తుల మూటలను బలవంతంగా ఎత్తుతుంటే, మోయలేక అలిసింది తను.

అస్తిత్వ పోరులో, స్వార్థపు ఉధృతిలో,

సంకల్పం చెంత సాగిలపడి దుఃఖిస్తున్న సత్యానికి

కొంత ఊరట కావాలి.

కాంతి ఱెక్కలు విరిచి, పాడుబడ్డ చీకటిలోకి తోసేసి

'చెడు'చేస్తున్న కరాళనృత్యానికి తాళమందించే సమాజంలో అసత్యమనేది నూతన రూపాన్ని సంతరించుకుంటుంది.


బూజుపట్టిన దేహాల ఆర్తిలో,

చెమటచుక్కల ప్రవాహ హోరులో,

భావరహిత చూపుల రేఖలపై

కదులుతూ ఎటెళ్లాలో తెలియక అచేతనమయ్యింది సత్యం. కాలానికి, కపాలానికి  మధ్య సంధి కుదిర్చే బాధ్యత కవిదే. ఆశయాలకు, ఆనందాలకు మధ్య తీవ్రతను గుర్తించే సహనమే కవి. ఆ కవి మనసుపెట్టి రాయడం మొదలుపెడితే సమాజం పొందే ప్రతిఫలం ఎంతో గొప్పగా ఉంటుందనడానికి నిదర్శనం ఈ సుషుప్తి నుంచి...


తెరిచిన పుస్తకంలోనుండి వచ్చే పదాల పరిమళం మదిని తాకుతూ విజ్ఞానం రూపంలో నిక్షిప్తం గావించే బాధ్యతని కవి తీసుకున్నప్పుడు ఆ పదాల సృష్టికర్త దైవంతో సమానం. పదానికి పదానికి మధ్య విరామాన్ని మధ్య విరామాన్ని త్వరగా తుడిచేయాలనే ఆరాటం పాఠకుడిని పరుగు పెట్టించినప్పుడు ఆ కవి చేసిన ప్రయత్నం మహోన్నత ఫలితం పొందినట్టే. ఓపక్క సమాజాన్ని ప్రశ్నిస్తూ, మరోపక్క సమాధానాన్ని సూచించడానికి మనముందుకు తెచ్చిన అద్భుత ప్రయత్నమే ఈ సుషుప్తి నుంచి...


వీధి మొత్తానికి ఉన్న ఒక్క దీపం గొప్పదనాన్ని జీవనదాతలా వర్ణించాడు. ఈస్ట్ మన్ కలర్ లో భవిష్యత్ చిత్రపటాన్ని చిత్రించగలిగినా వర్తమానం ఉలిదెబ్బలని మర్చిపోలేక పోతున్నాననే ఆవేదనని వ్యక్తపరిచాడు కవి. గ్లిజరిన్ కన్నీళ్ళలోని ఆర్ద్రతని, ప్లాస్టిక్ పూలలోని పరిమళాన్ని వెతుక్కునే నేను అబద్దమనే నిన్ను కనుక్కోలేక పోయానని తల్లడిల్లిపోయాడు. భుజాలకు తుపాకులేసుకొని వచ్చిన వాళ్ళు రగిలించిన కాగడాని నీ కన్నీళ్లతో ఆర్పుతారు అప్పుడు నువ్వే మరో సూర్యుడివై వెలగాలి అనే గొప్పనైన ప్రేరణని అందించారు మామిడి హరికృష్ణ గారు.


నీతో నీవే ద్వేష గీతాన్ని ఆలపిస్తూ సృష్టించిన భౌతిక దాడిని వివరించారు. అలలు, మేఘాలు నీకు కనిపించినా, సముద్ర ఘోష నీకు వినిపించినా నా గీతాన్ని గాంచాలంటే నీ మనోనేత్రాన్ని తెరిచిచూడమని నిర్దేశిస్తూ వారి అక్షరాలతో విడదీయలేని ఒక దృఢమైన బంధాన్ని సృష్టించిన ఆ కవి అన్వేషణ ఎంత ఉన్నతమైందో లోతుగా తెలియజెప్పే గొప్ప పుస్తకం 'సుషుప్తి నుంచి'.

మనం కూడా గాఢ నిద్రను వదిలేసి ఉలికిపాటుల్ని ఎంతగానో ప్రేమించుదాం.


         ✍️యెనగంటి నర్సింగరావు

No comments:

Post a Comment