"సుషుప్తి నుంచి"...
మేలుకొలిపిన కవిత్వం...
#sushupti_nunchi
#mhk_poetry
వరంగల్ జిల్లా శాయంపేట మట్టిలో పుట్టిన మామిడి హరికృష్ణ కేవలం అధికారి మాత్రమే కాదు. అసాధారణ ప్రతిభాశాలి. సకల కళా కోవిదుడు, సాహితీ విమర్శకుడు వంటి మాటలు ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడో 1986 ప్రాంతంలో రాసిన కవిత్వం, ఇయ్యాల అదే చేతిరాతో "సుషుప్తి నుంచి" అనే కవితా సంపుటిగా అచ్చు కావడం వల్ల మామిడి హరికృష్ణ లోని భావుకున్ని, కవిత్వ ప్రేమికున్ని కొత్తగా చూసినట్టయింది. అంతేకాదు కవుల మీద ఆయా స్థల కాలాలతో పాటు పుట్టి పెరిగిన వాతావరణం, వయసు ప్రభావం కచ్చితంగా వుంటాయని మరోసారి నిరూపించిన కవితాసంపుటి.
హైస్కూల్ దశలోనే ఆంగ్ల కవితను తెలుగులోకి అనువదించి, అందరి ప్రశంసలు అందుకున్న మామిడి హరికృష్ణ ఆరోజు తన తల్లి కళ్ళల్లో చూసిన ఆనందం ఎప్పటికీ చెరగని దృశ్యం అయింది. ఇయ్యాల ఇంత ఉన్నత స్థాయిలో నిలబడే అవకాశాన్ని కల్పించింది.
"అమ్మ అక్షరం అయితే నాన్న వాక్యం" అని ప్రకటించి తల్లిదండ్రులను పుస్తకంగా గుండెలకు హత్తు కుంటడు.
ప్రేమామృతాన్ని సేవించి, ఆ మత్తులో మునిగిపోతడు. ఒళ్ళు మరిచి నిద్రపోతడు. సుప్తావస్థ లోను శిగమూగుతడు. "ఐ, తపస్వి" అనే కలం పేర్లతో "సుషుప్తి నుంచి" మొదలై ఊహల్లో తేలిపోతడు. ప్రకృతిని ఆరాధిస్తడు.
"పారేసుకున్న మనసును
ఎంత వెతికితే ఏం లాభం" అంటూనే ఆమె కోసమే గొంతెత్తి పాడుతడు. ఆడుతడు. అందమైన బొమ్మలు గీస్తడు. ప్రేయసిగా సంభాషిస్తడు.
"నిన్న రాత్రి నీ వెన్నెల సంతకాన్ని
చెరిపేయాలని చూస్తున్న తుఫాన్ కి
నా ప్రాణాన్ని బలి చేశా" అంటడు. అణువణువునా నింపుకున్న ఆమే తన ప్రపంచంగా నిశీధి లోనూ, శూన్యం లోనూ, అగాధం లోనూ అంతట ఆమెనే దేవులాడుతుంటడు. బహుశా ఆమె "స్పందన" కావచ్చునేమో. అయినా ఆమె స్పందనతో సంబంధం లేదు. అక్షరాలకు అంతులేని రూపాన్నిచ్చిన ఆమెను తలచుకుని మామిడి హరికృష్ణ తన "అరూపం" అనే కవితలో
"పాస్ పోర్ట్ సైజు ఫోటోలో
నీ పూర్తి రూపాన్ని వెతుక్కునే నేను
నీ హృదయంలో నా రూపాన్ని మాత్రం
కనుక్కోలేక పోతున్నా" అంటూ పిచ్చోడై తిరుగుతడు. రూపు కట్టని దృశ్యాన్ని, చేతికి తాకని స్వప్నాన్ని వెతికి వెతికి సొమ్మసిల్లి పోతడు.
"ఎన్నో రైళ్లు వచ్చి పోతున్నాయి
కానీ.. ఆ మొదటి రైలు మాత్రం రాలేదు
వచ్చినా ఒక్క సీటు ఖాళీగా లేదు" అంటూ అంది వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడం కంటే దౌర్భాగ్యం ఏముంటది. తన బలాన్ని, బలహీనతను నిందిస్తూనే సుతిమెత్తగా
"నీకు అన్నీ కనిపిస్తాయ్
వినిపిస్తాయ్
నీకు వినిపించనిదల్లా
నా గీతం ఒక్కటే" అంటూ ఆమెకు దూరమై, దగ్గరై, సర్వస్వం కోల్పోయిన వాడై తన "సామాన్యుడు" అనే కవితలో
"ఓడిపోయినట్టుగా చివికిపోయి
చిరుగులు పట్టిన దేహాన్ని
శాశ్వత సుషుప్తి లోకి తీసుకు వెళ్తున్నాను" అంటడు. అంతటితోనే ఆగిపోకుండా సుధీర్ఘ నిద్రావస్థ నుంచి మేలుకున్న కవి చీకట్లను చీల్చే వెలుగును కలగంటడు. మిణుగురులై తొణికిసలాడే చిరు దీపమైన తనకెంతో ఇష్టమని ప్రకటిస్తడు. "సుషుప్తి నుంచి.." ఆశావహ దృక్పథం వైపుకు అడుగులేస్తడు. భవిష్యత్ చిత్రపటాన్ని గీస్తడు. జీవితంలో ఒక్కో మెట్టుగా కీర్తి శిఖరాలను అధిరోహించిన మామిడి హరికృష్ణ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కళలు, సాహిత్యం తన రెండు కళ్లుగా జీవితాన్ని సాఫల్యం చేసుకున్నడు. తన సాహిత్య కృషికిగాను 2018లో బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ గా సినీగోయర్స్ అవార్డును అందుకున్నడు. 2009లోను, 2012లోనూ ఉత్తమ సినీ విమర్శకుడిగా రెండు సార్లు నంది అవార్డులు సొంతం చేసుకున్నడు. 2018లో ఇండీవుడ్ అవార్డును, 2019లో జి సినిమా అవార్డును అందుకున్నడు. తాను పుట్టి పెరిగిన ఊరు శాయంపేట పల్లెను తల్సుకొని తెలంగాణ భాషలో "ఊరికి పోయిన యాళ్ళ" అనే కవితా సంపుటిని 2018లో వెలువరించినాడు. అదేవిధంగా తన ఏకాంత జీవితాన్ని ప్రతిబింబించే "ఒంటరి కరణ" కవితా సంపుటిని 2019లో ప్రచురించి తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిల పరచుకున్నడు.
"శిలగా మారిన మనిషికి నిరీక్షణ పెద్ద కష్టమేమీ కాదని" అంటడు.
"గతం ఉరి తీతలను వర్తమానం ఉలి దెబ్బలను ఎప్పటికీ మర్చిపోలేననీ" అంటూనే ఆశలు, ఆకాంక్షలను అక్షరాలుగా పేర్చుకుంటడు. తాను ప్రేమించింది, ఆరాధించింది ఎక్కడో కనుమరుగై పోయినప్పటికీ నిటారు మనిషిగా నిలబడుతడు. కళా సేవలో తరించిపోతడు. అంతు లేని నైరాశ్యం నుంచి తేరుకొని ఆశయాల జెండాను ఎగరేస్తడు.
కవిత్వాన్ని ప్రేమించి, కళలను గౌరవించి, అక్షరాన్ని ఆలింగనం చేసుకునే మనసున్న గొప్ప సృజనకారుడు మామిడి హరికృష్ణకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నాలుగు మాటలు మీతో పంచుకుంటున్నాను.
- అంబటి వెంకన్న
No comments:
Post a Comment