బహుమఖ ప్రతిభాశాలి మామిడి హరికృష్ణ గారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధిస్తే ఏమస్తుందనే సమాజానికి ఇక్కడి మట్టి మాణిక్యాలు వెలుగొందు తాయని ,ఈ ప్రాంత సాంస్కృతిక అస్తిత్వం నిలుస్తుందని ,దీనితో పాటు ఇక్కడి కళలు, కళాకారులు, కవులు, చరిత్రకారులు, మన భాష యాస తో తెలంగాణ పూర్వవైభవం సిద్ధిస్తుందని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ని చూస్తే అర్థమవుతుంది. ఈ రకంగా ఒక్కొక్కరు ఆయా రంగాల్లో తెలంగాణ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. హరికృష్ణ గారు స్వయంగా కవి ,విమర్శకుడు, అనువాదకుడు ,ఆర్టిస్టు, బహుముఖ వ్యాసకర్త, బహుభాషావేత్త ,మంచి వ్యాఖ్యాత .తాను విస్తృతమైన జ్ఞానాన్ని పుస్తకాల్లోని అక్షరాలతో నిర్మించుకున్నారు .అందుకే వీరు అంశం ఏదైనా ఆ అక్షరాలు దానికి చెందిన జ్ఞానాన్ని ,భావాన్ని సహజంగా వ్యక్తపరిచేలా చేయడం వీరిలో గొప్పతనం . ఇదంతా వీరికి బాల్యం నుండి నిరంతరం అధ్యయనం చేయడం వల్ల ఏర్పడింది.
బాల్యం -చదువు:
హరికృష్ణ గారు పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం .ఈ గ్రామం గొలుసుకట్టు చెరువులతో ,అన్ని కులాలు,వృత్తులు ఉండే గ్రామం .వీరు పద్మశాలి కులంలో పుట్టినప్పటికి, వీరి తాత వ్యవసాయం చేయగా, తండ్రి మామిడి సుదర్శన్ గారు మంచి డాక్టర్ గా స్థిరపడ్డారు.వీరి అమ్మగారు స్వరాజ్యం .చదువుల తల్లి, తాను చదువుతూ హరి కృష్ణ గారిని ఇష్టంగా చదివించింది .ఈ దంపతులకు కలిగిన ఐదుగురు సంతానంలో హరికృష్ణ గారు పెద్ద కాగా ,మిగతావారిలో ముగ్గురు చెల్లెల్లు ,ఒక తమ్ముడు .అందరిపెళ్లిళ్లు చేసిన హరికృష్ణ గారు వారందరికీ మంచి భవిష్యత్తునందించారు.
బాల్యంలో హరికృష్ణ గారు ఇంగ్లీష్ మీడియం లో చదివినప్పటికీ ,ఆ తర్వాత గ్రామంలోని చిన్న బడి ,పెద్ద బడిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు.వీరు తరగతిగదిలో అడిగే ప్రశ్నలకు మిగతా పిల్లలకు పాఠం మొత్తం అర్థమయ్యే విధంగా ఉండేదని ,వారి బాల్య మిత్రుల మాటల్లో వినిపిస్తుంది. అంతేకాదు తాను చదువుతుంటే తన తోటి మిత్రులకు కూడా చదువు కోవాలనే స్ఫూర్తి కలిగేదని చెప్తారు. మొదటినుండి హరికృష్ణ గారు చదువులో ప్రధమ స్థానం లోనే ఉండే ప్రతిభావంతుడు. ఎనిమిదవ తరగతి లోనే పెద్దబడి ప్రధానోపాధ్యాయులు రామ్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కెరటం మ్యాగజైన్లో మొదటగా రాయడం ప్రారంభించారు. తన తల్లి సహకారంతో చిన్నప్పటినుండి జ్ఞానతృష్ణ అధికంగా పెంపొందించుకొని ,అందుకోసం అక్షరాలతో స్నేహం ,పుస్తకాలతో ఆత్మీయత, ఆ పుస్తకాలు పంచిన జ్ఞానంతో మైత్రి చేయడం మొదలుపెట్టారు .అందుకేనేమో ఎనిమిదో తరగతిలోనే చలం పుస్తకాలను పూర్తిగా చదివి నారు.ఆ తరువాత పదవ తరగతి లోనే తెలుగు ప్రముఖ కవుల మీద ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరుచుకొన్నారు. ఇంటర్మీడియట్ వరంగల్ లాల్ బహదూర్ కళాశాల లో ఆర్ట్స్ గ్రూప్ లో చేరారు. నిరంతరం అధ్యయనం చేయడం,ఆ పుస్తకాల తోనే సావాసం చేయడం ద్వారా ఇంటర్ లో నే భారతీయ భాషల్లోని గుజరాతీ, తమిళ్, కన్నడ, బెంగాలీ ,హిందీ, ఒడియా సాహిత్యాన్ని చదవడమే కాక మొత్తం భారతీయ సాహిత్యం మీద ఒక అవగాహన ఏర్పరుచుకొన్నారు. ఆ తరుణంలోనే ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ పత్రికలకు కవర్ స్టోరీస్ తో పాటు వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఇక అదే కాలేజీలో డిగ్రీ లో చేరి నిరంతరం ఎక్కువ సమయం గ్రంథాలయంలో వైవిధ్యమైన పుస్తకాలు చదువుతూ అంతర్జాతీయంగా పేరుగాంచిన మెక్సికో ,గుంతర్ గ్రాస్ ,కార్ల్ మార్క్స్ ,ప్లేటో ,ఎమిలి,హెగల్ మొదలైనవారి సాహిత్యాన్ని జ్ఞాన తృష్ణ తీర్చుకోవడానికి అధ్యయనం చేశారు. వీటితోపాటుగా అభిరుచి మేరకు వేదాంగాలు, ఉపనిషత్తులు ,అష్టాదశ పురాణాలు ,ఇతిహాసాలు పరీక్షల కోసం కాకుండా జీవితం కోసం ,సమాజ అవగాహన కోసం చదివిన ప్రతిభాశాలి .డిగ్రీ లో కాలేజ్ నుండి వెలువడే మ్యాగజైన్ కు తానే ఎడిటర్ గా మూడు సంవత్సరాలు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత బి.ఇ.డి ఎంట్రెన్స్ రాయగా రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంక్ వచ్చింది. బిఈడి తో పాటు ఎం.ఈ.డి కూడా పూర్తి చేసుకొని, ఎం.ఎ సైకాలజీ ఉస్మానియాలో చేశారు.
>
> హరికృష్ణ గారికి జీవితంలో అకడమిషన్ గా స్థిరపడాలని ఆలోచన ఇష్టం గా ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా అయితే అకడమిషన్ చేసే పని కూడా చేయవచ్చనే ఉద్దేశంతో సివిల్స్ రాశారు. ఆ కోవలోనే గ్రూప్ టూ లో కోఆపరేటివ్ సంస్థలో ఉద్యోగం సాధించారు. వీరు సివిల్స్ కు ప్రిపేర్ అయినప్పుడు విస్తృతంగా పుస్తకాలు చదవడంతో అన్ని శాస్త్రాల మీద అవగాహన పెంచుకున్నారు. అందుకే వీరిని కదిలిస్తే విషయం ఏదైనా దాని గురించిన సమగ్ర అవగాహన ఉంటుందని చెప్పుకోవడం విశేషం. నిరంతరం అధ్యయనం చేసే తత్వం ఉండటంతో వారికి ఆ జ్ఞానం సొంతమైంది. వారి చేతికి ఏదైనా పొట్లం కట్టగా వచ్చిన పేపర్ కూడా పూర్తిగా చదువుతారంటే అతిశయోక్తి కాదు ఎక్కువమంది విద్యార్థులు, యువత ఒక్కసారైనా సివిల్స్ కు చదవాలని కోరుకుంటారు.తద్వారా విస్తృత విజ్ఞానం అన్ని సబ్జెక్టుల్లో ఆర్జించడానికి అవకాశం ఉంటుందని చెప్తారు .మనిషి ఎంత చదివినా సామాజిక అవగాహన, మానవీయ కోణం, ఈ మట్టి మీద మమకారం ఉండాలని విశ్వసిస్తారు.
తెలంగాణ ఉద్యమంలో:
హరికృష్ణ గారు తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. తెలంగాణ యాస భాషలో కవితలు రాసి చైతన్యాన్ని కలిగించారు. అంతేకాదు ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను, తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించే విధంగా అనేక వ్యాసాలు రాశారు. ఒకపక్క తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ జన గోసను , తండ్లాటను, ఈ ప్రాంత వాణిని వినిపించడానికి ప్రారంభమైన నమస్తే తెలంగాణ పత్రిక రూపకల్పనలో భాగంగా తనవంతుగా సూచనలు చేశారు .అంతే కాదు తెలంగాణ బిడ్డలకు సినిమా మీద అవగాహన కల్పించడం కోసం భారతీయ సినిమా తో పాటు ప్రపంచ స్థాయి సినిమా గురించి తెలియాలని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక లో 'రంగులకళ' అనే శీర్షికతో నాలుగు సంవత్సరాలపాటు వ్యాసాలు రాశారు. అలాగే హరికృష్ణ గారు అంతకు ముందు ఈటీవీ లో వావ్ గేమ్ షోను రూపొందించడమే గాక దానికి స్క్రిప్ట్ రైటర్ గా ఏడు సంవత్సరాలు పని చేశారు . దీనితో పాటుగా వివిధ ప్రముఖ ఛానల్స్లో స్క్రిప్ట్ రైటర్ గా మరియు ప్రోగ్రామ్స్ డిజైనరుగా, కాన్సెప్ట్ రూపకల్పన చేసిన అనుభవం ఉంది . ఉద్యమకాలంలో వీరికి చానల్స్ లో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రపంచస్థాయిలో వినిపించేలా 'టీ. న్యూస్' ఛానల్ ఏర్పాటు చేసినప్పుడు ఆ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ డిజైన్స్ రూపకల్పనలో, స్క్రిప్ట్ రైటర్ గా కీలక పాత్ర పోషించారు .ఆ రోజుల్లో టి. న్యూస్కు స్క్రిప్ట్ రాసినా, వారు ఆ పక్కకు వెళ్లిన వారిని పక్కన పెట్టే వారు .అలాంటిది వీరు తెలంగాణ కోసం 'టీ.న్యూస్' చానల్స్ కి స్క్రిప్ట్ రైటర్ గా పని చేయడమే గాక ప్రోగ్రామ్స్ రూపొందించడంలో కీలక పాత్ర వహించారు.ఇందులో తెలంగాణ ఆకాంక్షను, ఆవశ్యకతను ప్రపంచానికి తెలిసేలా తెలంగాణ మహనీయుల గురించి, తెలంగాణ పుణ్యక్షేత్రాలగురించి, తెలంగాణ చారిత్రక కట్టడాల గురించి అనేకరకాల స్క్రిప్ట్స్ రాయడం జరిగింది .
సినిమా అవగాహన:
హరికృష్ణ గారి దగ్గర ఏదైనా సినిమా గురించి ప్రస్తావిస్తే సముద్రమంత భావజాలాన్ని తన గళంలో నింపుకొని మాట్లాడినట్లు కనిపిస్తుంది. అంతే కాదు సినిమా గురించి వ్యాసం రాసినా అలాగే అనిపిస్తుంది. వీరికి పుస్తకం అంటే ఎంత ఇష్టమో ,సినిమా అంటే అంతే ఇష్టం .అందుకే ఎక్కువ సమయాన్ని గ్రంథాలయంలోను మరియు సినిమాలు చూడడానికి కేటాయిస్తారు. భారతీయ భాషల్లోని బాలీవుడ్ ,కోలీవుడ్ ,టాలీవుడ్ ,కన్నడ, బెంగాలీ ,మరాఠీ ,గుజరాతీ, ఒడిసి మొదలైన అన్ని భాషల్లోని సినిమాల మీద అవగాహనతో పాటు శాస్త్రీయంగా విశ్లేషించగల ప్రతిభావంతులు. భారతీయ సినిమానే కాకుండా హాలీవుడ్, కొరియా, జపనీస్ మొదలైన ప్రపంచ స్థాయి సినిమా మీద కూడా అవగాహన ఉన్న ప్రతిభాశాలి. ఆయా భాషల సినిమాల గురించి స్కీన్ ప్లే, కథలు, కథనాలు, ఆయా కథలు ఆ సమయంలో రావడానికి గల కారణాలను, టెక్నిక్స్ , ఆ సినిమాలో అంతర్లీనంగా ఉన్న సామాజికాంశాలను, సద్విమర్శ, విమర్శ చేయగల సమర్థులు. అంతర్జాతీయ సినిమా తో పాటు భారతీయ సినిమా గురించి అనేక వ్యాసాలు రాశారు. సినిమా దర్శకులకే వారు తీసిన సినిమాలో వారికిి తెలియని కొత్త కోణాన్ని చూపిస్తూ కూడా రాయగల నైపుణ్యం హరికృష్ణ గారిది. అందుకే ఉత్తమ సినిమా విమర్శకునిగా మూడు సార్లు నంది అవార్డులు అందుకున్నారు. వీరికి సినిమా మీద ఉన్న విస్తృత పరిజ్ఞానం ప్రపంచ సినిమా మీదనే ఎక్కువ వ్యాసాలు రాసేలా చేసిందనడం లో అతిశయోక్తి లేదు. హరికృష్ణ గారిని నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు సినిమా గురించి లఘు గ్రంధాన్ని రాయమని తెలుగు అకాడమీ కోరినపుడు కేవలం ఏడు రోజుల్లోనే 'తెలుగు సినిమాలో భాష-సాహిత్యం -సంస్కృతి అనే గ్రంథాన్ని రాశారు. దీన్ని బట్టి వారికి సినిమా మీద ఎంత విస్తృత అవగాహన ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వారు సినిమా మీద ఇష్టంతోనే తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద సినిమా మీద పరిశోధన కూడా చేస్తున్నారు.
కవిగా:
హరికృష్ణ గారు బహుముఖ వ్యాసకర్త,కవి, విమర్శకుడు, అనువాదకుడు, బహుభాషావేత్త, ఆర్టిస్టు అంతేగాక కళల గురించి అమితంగా అవగాహన కలిగిన వారు. తాను సమాజంలో కష్టాలు కన్నీళ్లు ఒక దశలో అనుభవించిన వారు కావడంతో సంఘజీవిగా తన మనుగడ కోసం పరిభ్రమిస్తున్నప్పుడు తనలో కలిగే సంఘర్షణ భావజాలాన్ని వ్యక్తీకరించడానికి తాను కవిగా ఆవిష్కరింపబడినారు. వీరి కవిత్వం ఒక ప్రవాహంలో చిన్నచిన్న పాయలు కలిసినట్టుగా అన్ని భావజాలాలు పాయలుగా కలిసి ప్రవహిస్తూనే ఉంటుంది. వీరి కవితలు వివిధ పత్రికల్లో మ్యాగజైన్స్ లో నిరంతరం ప్రచురితంవుతూనేఉంటాయి కానీ వాటిని ప్రచురించటం జరగలేదు. ఆ కవిత్వమనే ప్రవాహానికి అడ్డుకట్టవేసి పుస్తకాలు ప్రచురించాల నుకోలేదు. ప్రపంచ సాహిత్యాన్ని అవపోసన పట్టిన వారు కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక లో ప్రపంచ కవిత శీర్షికన ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన కవుల కవితలను అనువదిస్తూ ప్రచురిస్తున్నారు. ఇందులో అమెరికా న్యూజెర్సీకి చెందిన డోరాతి షిల్డ్ పార్కర్, గ్రీక్ కవి నోబెల్ సాహిత్య బహుమతి దిగ్గజం జార్గోస్ సెఫెరిస్, నైజీరియా సాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బెన్ ఓక్రి మొదలైనవారి కవితలను అనువదిస్తూ ,ప్రపంచ సాహిత్యాన్ని నేటి సమాజానికి తెలియజేస్తున్నారు . వీరు భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ విస్తృతంగా కవితలు వ్యాసాలు రాస్తున్నప్పటికీ , తెలంగాణ యాస భాషకు పట్టం కట్టేలా,తెలంగాణ యాసలో 2018 సెప్టెంబర్20 న వారి అమ్మకు అంకితమిస్తూ రాసి , ప్రచురించిన 'ఊరికి పోయినయాళ్ల ' అనే దీర్ఘ కవితా పుస్తకం మణిమకుటంలా నిలుస్తుంది.
>
> తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణాలోభాగంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఇక్కడి సాంస్కృతిక జీవనం, కళలు, కళాకారులు, కవులు ,పండుగలు, తెలంగాణ భాష యాస పునరుజ్జీవింప చేయాలనే సంకల్పానికి అనుగుణంగా ,అన్ని రకాలుగా విస్తృత పరిజ్ఞానం కలిగిన మామిడి హరికృష్ణ గారిని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గా నియమించింది .ఇక ముఖ్యమంత్రి గారి మనోగతానికి తగ్గట్టుగానే హరికృష్ణ గారు తెలంగాణ కళలకు,కళాకారులకు ,కవులకు, పండుగలకు అధిక ప్రాధాన్యమిస్తూ రవీంద్ర భారతి వేదిక తో పాటు దేశరాజధాని మరియు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నూతనంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. గత అరవై ఏళ్లుగా జానపద కళలు మనుగడ కోసం పాకులాడిన తండ్లాటను , గోసను దృష్టిలో ఉంచుకొని జానపద కళ బతకాలంటే అవకాశం, ఆదాయం కల్పిస్తే కళ బతుకుతుందని, ఆ రకంగా వాటికి అవకాశాలు ఆదాయం సమకూరే కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మొదట రవీంద్రభారతి వేదికగా నూట ఇరవై ఐదు రోజులు రాష్ట్రంలోని జానపద కళలకు అవకాశం కల్పిస్తూ కళారాధన పేరుతో రవీంద్రభారతిలో జానపద కళలకు పెద్దపీట వేశారు .అంతే కాకుండా కేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శించే జానపద కళా రూపాలను కూడా రవీంద్రభారతి వేదికతో పాటు జాతీయ స్థాయిలో ప్రదర్శించే అవకాశాలు కల్పిస్తూ, ఆ కళారూపాల మనుగడకు మరియు కళాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలను గుర్తించి, వాటిని డాక్యుమెంటేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు . హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ వంటి వేదికల మీద కూడా జానపద కళల ప్రదర్శన తో పాటు, ముఖ్యంగా జానపద వాద్యాల ప్రదర్శన ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ జానపద కళల వైశిష్ట్యాన్ని తెలియజేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ను, పండుగల సందర్భాల్లోనూ అనేక కళారూపాలకు, కళాకారులకు అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 'జానపద జాతర 'అనే పేరుతో ఉత్సవాలు నిర్వహించి జానపద కళల మూల సంస్కృతిని పరిరక్షించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు.
>
> హరికృష్ణ గారు తమ శాఖ తరపున కొన్ని పథకాలను కూడా రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా కళోధ్ధారణ పేరుతో దేవాదాయశాఖ తో కలిసి కొన్ని జానపద కళా బృందాలను ఎంపిక చేసుకొని, ఆ బృందాలకు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రదర్శనలు కల్పిస్తూ, ఆయా కళారూపాల మనుగడకు మరియు ఆర్థికంగా కూడా చేయూతనిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు నిర్వహించడం లేదు. కానీ అది మామిడి హరికృష్ణ గారికే సాధ్యమైంది. అంతేకాకుండా వీరు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా 42 వ యేటనే నియమింపబడటం విశేషం. దేశంలోని మిగతా భాషా సాంస్కృతిక శాఖ ల్లో నియమింపబడిన సంచాలకుల వయసును బట్టి చూస్తే అతి పిన్న వయస్కులు వీరే కావడం మరో విశేషం .అందుకే నూతన ఆలోచనలతో తెలంగాణ సోయితో అనేక కార్యక్రమాలు చేయగలుగుతున్నారు.
>
> తెలంగాణాలో నాటకమే లేదనే దశలో హరికృష్ణ గారు నాటక కళాకారులను ప్రోత్సహించి పద్య నాటకాలు మరియు పౌరాణిక నాటకాలు కలిపి నెలకు 45 నాటకాల చొప్పున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నాటకోత్సవాలను నిర్వహిస్తూ, తెలంగాణ నాటకాలకు ఆ కళాకారులకు గుర్తింపును గౌరవాన్ని కలిగిస్తున్నారు.
> హరికృష్ణ గారు జానపద కళల్ని ప్రోత్సహించినట్లు గానే మిగతా కళల్ని కూడా, అంతే దృష్టితో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తెలంగాణకే పరిమితమైన పేరిణి నృత్యానికి పూర్వవైభవాన్ని తెచ్చే దిశగా రాష్ట్రంలోని అన్ని సంగీత కళాశాలల్లో ప్రత్యేకంగా పేరిణి కోర్సును ప్రవేశపెట్టి అనేకరకాలుగా ప్రోత్సహించడమే కాక ఆ కళాకారులకు కూడా ప్రదర్శనావకాశాలు కల్పిస్తూ,కళను పునరుజ్జీవింప చేస్తున్నారు. వీటితో పాటుగా తెలంగాణాలోని శాస్త్రీయ కళల్ని, నాటకం ,మిమిక్రీ, చిత్రకళ, కార్టూనిస్ట్ ,శిల్పకళ మొదలైన కళలు ఏవైనా కళాకారులందర్నీ సాదరంగా ఆహ్వానించి , ఆయా కళలకు రాష్ట్రస్థాయి ,జాతీయస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ,వారి యొక్క కళకు బహుళ ప్రాచుర్యాన్ని, ఆయా కళాకారులకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు.
>
> పుస్తకాల ప్రచురణ:
>
> హరికృష్ణ గారు స్వయంగా కవి, విమర్శకుడు, అనువాదకుడు .అంతేకాకుండా సాహిత్యంలోని అస్తిత్వ వాదాలు, భావజాలాలు సమగ్రంగా తెలిసిన వారు కావడంతో తెలంగాణ సాహితీకారులు అంటే అమితంగా ఇష్టపడతారు. ఈ కోవలోనే ఉగాది ,బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రవీంద్రభారతి వేదికగా అనేక కవి సమ్మేళనాలు నిర్వహించారు. కవిసమ్మేళనాలు నిర్వహించడమే కాకుండా ,ఆ కవితలను సంకలనం చేసి ,పుస్తకాల రూపంలో ప్రచురించి తెలంగాణ కవుల భావజాలాన్ని ఆవిష్కరింపజేశారు. ఇందులో ప్రధానంగా తంగేడు వనం, కొత్త సాలు, తల్లివేరు, తొలిపొద్దు, మట్టి ముద్ర, స్వేదభూమి, పద్య తెలంగాణం మొదలైనవి. ఇవే కాకుండా తెలంగాణ మట్టి కోసం ఇక్కడి అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణ బిడ్డలను స్మరించుకోవాలని, వారి చరిత్ర నిక్షిప్తం కావాలని ,ఆ మహనీయులను భావితరాలు తలుచుకోవాలని" తెలంగాణ తేజోమూర్తులు" అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అంతేకాకుండా కాకతీయుల ప్రస్థానం, తెలంగాణ రుచులు, మనకు తెలియని తెలంగాణ ,తారీఖులలో తెలంగాణ , తెలంగాణ హార్వెస్ట్, తెలంగాణ సోయితో రచనలు చేసిన మేధావులను ప్రోత్సహిస్తూ వారి పుస్తకాలను కూడా భాషా సాంస్కృతిక శాఖ తరపున ప్రచురిస్తూ తెలంగాణ సంస్కృతిని విభిన్న కోణాల నుండి పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి మీద కూడా 'స్వర నారాయణీయం 'అనే పుస్తకాన్ని ప్రచురించి భాషా సాంస్కృతిక శాఖ వారి ఔన్నత్యాన్ని తెలిపింది. అలాగే జానపద కళల మీద ఉన్న మక్కువతో 'పటం కథలు' , 'కళా తెలంగాణం' అనే రెండు పుస్తకాలను ప్రచురించి వాటి సంస్కృతిని నిక్షిప్తంచేశారు .సంచాలకులుగా వీరు శాఖ తరపున ప్రచురించిన పుస్తకాల మీద పరిశోధనచేస్తే ,నాలుగైదు సిద్ధాంత గ్రంథాలను కూడా రాయడానికి వీలైన విస్తృతమైన తెలంగాణ విజ్ఞానం దాగి ఉందనడంలో అతిశయోక్తి లేదు.
>
> తెలంగాణ అంటేనే మన బతుకమ్మ మన బోనం అంటూ బతుకమ్మ సంబరాలకు ప్రాచుర్యం కల్పిస్తూ ,ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే విధంగా చేస్తున్నారు. అంతేకాక మహా బతుకమ్మ పేరిట గిన్నిస్ బుక్ రికార్డు ఆకర్షించేలా చేశారు. జంటనగరాల్లో జరిగే బోనాలను వైభవంగా జరిగేలా పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోళ్ల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ బోనాల పండుగ శోభాయమానంగా జరిగేటట్టు నిర్వహిస్తున్నారు.
>
> హరికృష్ణ గారు ప్రత్యేక తెలంగాణ రాకముందే ప్రముఖ కవి రావూరి భరద్వాజ మీద డాక్యుమెంటరీ ఫిలిమ్ తీశారు . వీరికి సినిమా అంటే ప్రాణం. తెలంగాణ నుండి ఆశించినంతగా సినిమారంగంలో లేరని ,నేటి తరంలో సినిమా మీద ఆసక్తి గల యువతను ప్రోత్సహిస్తూ, లఘు చిత్రాలను తీస్తున్నవారికి ఒక వేదిక ఒక గుర్తింపు ఉండాలని' సినీవారం ' పేరుతో ప్రతి శనివారం ఒక నూతన లఘు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వారి లఘు చిత్రానికి గుర్తింపుతో పాటు ప్రాచుర్యం కల్పిస్తూ,వారిలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లఘు చిత్రాల దర్శకులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డులు కూడా ప్రధానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. రవీంద్ర భారతిలో లఘు చిత్రాలు ప్రదర్శించే హాలును కూడా పునరుద్దరించి తెలంగాణ ముద్దుబిడ్డ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడి జయరాజ్ పేరును నామకరణం చేశారు. అంతేకాకుండా సండే సినిమా 'పేరుతో రవీంద్రభారతిలో ప్రతి ఆదివారం ఒక సందేశాత్మక భారతీయ సినిమాలనే కాకుండా అంతర్జాతీయ సినిమాలను కూడా ప్రదర్శిస్తూ అన్నిరకాలుగా ప్రేక్షకులను ఆకర్షించేలా చేస్తున్నారు. అంతేకాకుండా ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సెంటర్ ను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నారు.
>
> తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన కాళోజి, దాశరధి, సురవరం ప్రతాపరెడ్డి , ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ,డా.సి.నారాయణరెడ్డి గారి వంటి జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తూ వస్తున్నారు. భూమికోసం, భుక్తికోసం ,నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమురయ్య , కొమురం భీమ్ ను, సినిమా రంగంలో ప్రముఖులైన ప్రభాకర్ రెడ్డి, కాంతారావు వంటి వారిని కూడా స్మరించుకుంటూ తెలంగాణ భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. వీరినే కాకుండా తెలంగాణలోని ప్రముఖ కవులు కళాకారుల జయంతి ఉత్సవాలను కూడా జరుపుతున్నారు.
>
> తెలంగాణ కవులు, రచయితలు, సాహితీ సంస్థలు రవీంద్ర భారతిలో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకునేందుకు 'అక్షర' అనే పథకాన్ని రూపొందించి, ఉచితంగా ఒక హాలును కేటాయించారు హరికృష్ణగారు.ఈ రకంగా కూడా కవులను ప్రోత్సహిస్తూ,ప్రత్యేక తెలంగాణ తెచ్చిన ప్రతి ఫలంలో ఇది ఒకటని చెప్పుకునేలా చేస్తున్నారు. అంతేగాక శాఖ తరపున సాహితీసదస్సులకు,ఉత్సవాలకు కాదనకుండా ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు.రవీంద్రభారతిలో హరికృష్ణ గారి సిబ్బందిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు కానీ, వీరు చేసే కార్యక్రమాలు వందల్లో లెక్కపెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి.వీరు రూపొందించే కార్యక్రమాలు ఎక్కువ మంది కళాకారులకు అవకాశాలు కల్పించే విధంగా ఉండటమే కాక ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ఒక విజన్ తోపాటు దాని వెనకాల తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉండటంప్రత్యేకత.
>
> హరికృష్ణగారు తెలంగాణలో తిరిగి అకాడమీల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న అకాడమీలను అధ్యయనం చేసి గౌరవముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మనోగతానికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపకల్పన చేసి సాహిత్య అకాడమీ, సంగీతనాటక అకాడమీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా లలిత కళా అకాడమీ, జానపదకళల అకాడమీ, 'ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ' ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి , వాటి స్థాపనలో కూడా తమ వంతుగా కృషి చేస్తున్నారు .
>
> తెలంగాణలోని ప్రతి కళాకారున్ని గుర్తించి ప్రభుత్వపరంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఒక వెబ్ సైట్ ను రూపొందించడం జరిగింది. దీనికి కళాకారుల నుండి విశేష స్పందన వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కంప్యూటర్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే జాతీయస్థాయి స్కాచ్ అవార్డు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు దక్కింది. భారతదేశంలోని ఏ సాంస్కృతిక శాఖకు కంప్యూటర్ రంగంలో ఇచ్చే ఈ అవార్డు ఇంతవరకు రాలేదు .అది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కు రావడం గొప్ప విశేషం.
> తెలుగుకు ప్రాచీన హోదా విషయంలో కూడా హరికృష్ణ గారు తనదైన శైలిలో ప్రాచీన హోదాకు తగిన ఆధారాలను సేకరించి తెలుగుకు ప్రాచీన హోదా రావడం కోసం ప్రముఖపాత్ర వహించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తమ శాఖ తరపున అమూల్యమైన గ్రంధాలను వెలువరించడమేగాక, సభల్లో రవీంద్ర భారతి వేదిక సాహిత్య కార్యక్రమాలకు ప్రధాన దిక్సూచి కావడం లో హరికృష్ణ గారి పాత్ర ఎంతో ఉంది. కళలకు కళాకారులకు సాహితీవేత్తలకు సాహితీ సంస్థలకు వీరు చేస్తున్న కృషిని గమనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుగారి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ గారు ఒక సందర్భంలో "తెలంగాణ బిడ్డలను ,కళాకారులను, కవులను, రచయితలను ఆహ్వానించడానికి 'రవీంద్ర భారతికి కట్టిన ఒక మంచి మామిడితోరణం' హరికృష్ణ గారని అన్నారు .బంగారు తెలంగాణ నిర్మాణంలో కళలు ,పండుగలు పూర్వవైభవం సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న హరికృష్ణ గారి గురించి చెప్పుకుంటే సంవత్సరాన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం సూచించినట్టుగానే, ముందు ముందు రవీంద్ర భారతి గురించి చర్చకు వస్తే హరికృష్ణ గారికంటే పూర్వం ,ముందు అని చెప్పుకోవడం కనిపిస్తుంది. అంతేకాదు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా హరికృష్ణ గారి గురించి ఒక వ్యాసం రాయడం కంటే ఒక పుస్తకమే రాయడం సమగ్రంగా ఉంటుంది.
>
> డా.బాసని సురేష్
> 9989417299.
> Email.basanisuresh75@gmail.com
No comments:
Post a Comment