Tuesday, 6 October 2020

MHK poetry Analysis 1

 కవిముద్ర - 52

~

తెలంగాణ జీవద్భాష సొబగుల సౌందర్యం- 'మామిడి హరికృష్ణ' కవిత్వం

~

కవిగా 'ఊరికిపోయిన యాళ్ళ'(2018), 'ఒంటరీకరణ'(2019), 'సుషుప్తి నుంచి'(2020) మూడు కవిత్వసంపుటులు తీసుకొచ్చారు. వరంగల్ జిల్లాలోని శాయంపేట తన పుట్టినూరు. ఊరితో కవికున్న గాఢమైన అనుబంధం, పల్లెభాష, జానపదుల బతుకుల్లోని సంస్కృతులు, జీవనవిధానాలు; పల్లెలపై ప్రపంచీకరణ ప్రభావం, తెలంగాణ ఉద్యమం, మనిషి మనసు లోతుల్లోకి వెళ్ళి తనను తాను అన్వేషించడం, మనిషి భావోద్వేగస్థాయిలు, యవ్వనంలోని ప్రేమ, విరహం, అభ్యుదయ భావజాల ప్రభావం మొ.నవి తన కవిత్వం నిండా పుష్కలంగా కనిపిస్తాయి. కవిత్వనిర్మాణంలో కథనాత్మక పద్ధతి వాడటం వల్ల ఊర్లలో జనం ముచ్చట్లు చెప్పుకునే విధానంలానే ఆసక్తికరంగా వుంటూ సారం వైపుకు తన కవిత్వం లాక్కెళ్తుంది. చెప్పదల్చుకున్న విషయానికి 'ఉన్ముఖీకరణ' లాగా నిర్మాణవిధానంలోని కొనసాగింపు వుంటుంది. శీర్షికను ధృడపరిచేలా బహుళ నిర్వచన ప్రవచనాలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వీటిని మొదటి సంపుటిలో ఎక్కువగా చూస్తాం.

"కొడ్కా! నువ్వు ఎక్కడికిపోతే అక్కడికి నువ్వొక్కనివే పోవు"(అమ్మమాట)

ఇందులో సమాంతర చర్యలు(parallel actions) ప్రస్తావించబడ్డాయి. తల్లి పిల్లాడిని బడికి తయారు చేయడం ఒక పక్క, మంచిగ  సద్వుకుని మంచిగ పనిచేస్తే మంచోల్లంటరని బుద్దులు జెప్పుడు ఇంకోపక్క ఏకకాలంలో జరుగుతుంటాయి. ప్రాంతీయత నుండి అంతర్జాతీయత వరకు మనిషి ఎదుగుదలను, ఎదుగుదలతో పాటుగా అవిభాజ్యంగా ప్రయాణం చేసే కుటుంబం, కులం, ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం మొ.నవి  మంచి-చెడ్డల్ని ఎలా మోస్తుంటాయో చెప్తూ- పిల్లల వ్యక్తిత్వవికాసనిర్మాణంలో తల్లి పోషించే పాత్రను ప్రతిబింబిస్తుందీ కవిత.

"ఇగ చూస్కో ఊరు ఊరే బండ్లమీద బైలెల్లినట్టుండేది!"(బుగులోని తీర్థం)

తెలంగాణ సంస్కృతిలోని జాతరలు, తీర్థాలు జానపదుల జీవితాలతో ఎంతగా పెనవేసుకుని వున్నాయో చెప్పడం ప్రధానమైన విషయం. దానితోపాటు పట్టింపు వున్న, ఆచరించే మనుషులున్నంత కాలమే అవి వారితో వెలుగొందుతాయన్న సత్యం అంతర్గతంగా చెప్పబడింది. తల్లిపేగును తెంపుకున్న పసిబిడ్డను ప్రస్తావించడంలోని ఉద్ధేశ్యం అంతరార్థం ఇదే! 

"బోనాన్ని తలకెత్తుకొని/సాంపి సల్లి, సాలుకట్టి, సాకుకొని/సావుకెదురు నిల్సింది నా తెలంగాణ!"(బోనం సాక!)

ఇవి పండుగలే కాదన్నోల్లకు, అనాగరికమని అవమానించినోల్లకు బుద్ధి చెప్పిన కాలమది. నగరం ఊరులా రూపాంతరం చెందే బోనాలు హైద్రాబాద్ పురా సంస్కృతికి ఆనవాలు. ఊరి పండుగల్ని ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక ఆయుధాలుగా ఎక్కుపెట్టిన కాలమది.

ప్రతి కవితలోనూ ప్రాణప్రదమైన పాలమొగురం లాంటి ఒక్కవాక్యమైనా దొరుకుతుంది. ఆ వాక్యం చుట్టూ 'కవిత' మొత్తం అనేక అంత్రాల తీగల్లెక్క అ లుముకుని తన బలిమిని చూపిస్తుంది.

"నివద్దిగ చెప్తే గీ వానల చత్తిరి ఉంటే/పక్కన మనిషున్నట్టే"(చత్తిరి)

వస్తువుతో ముడిపడివున్న అనేక నిర్ధిష్టతలను  ఆధారంగా చేసుకుని సాధారణీకరించడం కనిపిస్తుంది. ఇక్కడ చత్తిరిని రకరకాలుగా " చినుకులల్ల పూసిన నల్లతంగేడుపువ్వు, పెద్ద మర్రిచెట్టు, సాత్ గ నిలబడ్డ జిగ్రీదోస్త్, అత్తాకోడల్ల పంచాయితీ నడిమిట్ల అడ్డంగ నిలబడ్డ ఎర్రిబాగుల కొడుకు" గా వర్ణించడం జరిగింది. చత్తిరి పట్టుకున్న వ్యక్తినిబట్టి అవతారాల్ని చెప్పడం(వామనుడు, గోపయ్య, ఇంద్రుడు, ఆదిశేషు) చూస్తాం. ఇటువంటి సాధనను 'దారం కట్టిన సందమామ', 'దోని నీళ్ళు' కవితల్లోనూ చూస్తాం. 

"మెడల గొలుసు కట్టుకున్న కుక్కపిల్ల/మా ఎన్క తోకూపుకుంట/గాలిల తేలుకుంట వచ్చినట్టు అనిపిచ్చేటిది"(దారం కట్టిన సందమామ)

పతంగిని దారం కట్టిన సందమామగా, పైలోకాలనున్న ఏ దేవునికో పంపించే ధన్యవాదాల ఉత్తరంగా, మనకాలపు అర్జునుడు ఏసిన కాయితపు నిచ్చెనగా చెప్పిన నూతన అభివ్యక్తులకు ముగ్ధులమవుతాం.

"రెండు కాలాలలో ఎవరికీ పట్టని దోని/వానకాలంల శివుని శిగల గంగలెక్కయితది/అప్పటిదాంక సడీసప్పుడు చెయ్యక/ఇంటికప్పు మీది చెత్తను/రాలిపడిన యాపచెట్టు ఆకులను నింపుకుని వడ్లబస్తలెక్క గమ్మునుంటది/తొలిచినుకు పడంగనే/దబ్బదబ్బ ఆ సరుకునంత ఖాళీచేత్తది"(దోని నీళ్ళు)

తరంగ చలనంలో శృంగం, ద్రోణి లాంటి పదాల్ని వింటాం. ద్రోణిలాంటిదే దోని. దోనిని 'ఇల్లు పట్టిన దోసిలి, మబ్బుల వాన కోసం కట్టిన కాలువ, బెంగుళూరు గూనలన్ని కలిసి చినుకుల గింజలను ఒక్కచోట రాశిపోసే కల్లం'గా చెప్తాడు కవి. ఇవి కవిత్వసాంద్రతను పట్టిస్తాయి. అలాగే "ఊరికిపోవడం అంటే/ఊరికే పోవడం కాదు/ఊపిరి కోసం పోవడం"(ఊరికిపోయిన యాళ్ల) లాంటి వాక్యాలు ఎప్పటికీ మనోఫలకంపై గుర్తుండిపోతాయి. తెలంగాణ జీవద్భాష అత్యంత సహజంగా ఒదిగిపోవడం కవిత్వానికి మరింత శోభను చేకూర్చే అంశం.

"గుట్టల్ల బాంబు పెట్టినం/సుతిలికి అగ్గిపెట్టి/గుట్ట ఎప్పుడు పేలుతదా/అని యెదురుసూసినం/గుట్ట పేలింది - ముక్కలు చెక్కలయింది"(గుట్టను పగలేసినం)

అది బొర్రపెట్టిన సీమాంధ్ర నాయకత్వపు అధికారపు గుట్ట. గుట్టను పగలేసినంకనే మన జాగ జాడ దెల్శింది. మన జెండాపాతి అస్తిత్వ గౌరవాన్ని నిల్పుకున్నం - అనే సారాంశం ఇందులో వుంది.

*

కవి సృష్టించిన నూతన కవితా ప్రక్రియ "Fusion షాయరీ". దీని అవసరం ఏంటి? అని ప్రశ్నించినపుడు "విశ్వవ్యాప్తమైన భావాల్ని వ్యక్తం చేసే భాష కూడా హద్దులకు, పరిమితులకు అతీతంగా మారాల్సిన అవసరంలోంచి, వాటి నేపథ్యంలోంచి పుట్టుకొచ్చిన సమకాలీన నవకవితా సంప్రదాయమే multi-lingual, multi-cultural కవిత్వంగా చెప్తూ దానికి Fusion షాయరీ" గా నామకరణం చేసినట్టు చెప్తాడు కవి. ఇక్కడ fusion అనేది poetry&prose ల కలయికను చెబుతుంది. prose style లోని paragraph pattern మరియు poetry లోని stanza form మిళితమై రెండింటి లక్షణాల్ని కల్గివుంటుంది. అయితే యిది 4 నుంచి 8 stanza లు వుండి, ప్రతి స్టాంజా చివర విడిగా కొసమెరుపు లాంటి వ్యాఖ్యానం ఉంటే గాఢత చేకూరి పాఠకుడికి రసానుభూతి కలుగుతుందని చెప్పబడింది. ఇది కవి సృజనాత్మక నైపుణ్యంపై ఆధారపడి వుంటుంది.

"Fusion షాయరీ on తెలంగాణ జమీన్" ను గమనిద్దాం.

1. of course, మట్టి గొప్పది.. మట్టి సూపిన బాట గొప్పది

2. Indeed, ఈ మట్టి గొప్పది. ఈ మట్టి మండించిన ఉద్యమాల బట్టీ గొప్పది

3. షాయర్ ఈ మట్టి గొప్పది. ఈ మట్టి నుండి పుట్టిన ప్రజానీకం గొప్పది

ఇవి వివిధ స్టాంజాల్లోని విడిగా వుండే మెరుపులాంటి వాక్యాలుగా చెప్పబడ్డ పంక్తులు. అయితే ఏ కవికైనా తాను రాసే కవిత్వంలో పూర్తిగా pure language వుండడం అన్నివేళలా సాధ్యంకాదు. ఒక భాష అనేక భాషల మిశ్రమంగా మాత్రమే తన ఉనికిని కాపాడుకుంటూ మనగల్గుతుంది. అది తెలంగాణ భాషైనా.. ప్రపంచంలో మరే భాషైనా కావచ్చు. కవికి తన మాతృభాషలోని పదం తట్టకపోతే భావానికి సరిపడే ఇతర భాషాపదాల్ని ఈ ప్రక్రియలో విరివిగా వాడుకునే స్వేచ్ఛ వుంది. దానితోపాటు ఈప్రక్రియ కేవలం తెలుగు కవిత్వానికే పరిమితం కానిది. ఏ భాషాకవులైనా ఈ ప్రక్రియలో యథేచ్ఛగా రాసుకునే వెసులుబాటు ఉంది. బహుళ ప్రాచుర్యం కల్పిస్తే ఎక్కడైనా మనగలిగే ప్రక్రియగా చెప్పొచ్చు. వస్తువు విషయంలో ఏకత్వం; శైలీ, నిర్మాణం విషయంలో అనేకత్వం వుండడం ఇందులోని అసలు అంశం.

*

'ఒంటరీకరణ' లో ప్రధానంగా భావోద్వేగ స్థాయిల్లో చెప్పబడ్డ భరతుని నాట్యశాస్త్రంలోని శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత రసాలు, ఉపగుప్తుని చేర్పు - శాంతరసం తో కలుపుకుని నవరసాల్లో మానవ భావోద్వేగాల్లోని ప్రతిఫలనాలు కొంతలో కొంత పొడచూపినట్టు గమనించవచ్చు. Know thyself(నిన్ను గూర్చి నీవు తెలుసుకో) కు ఎక్కువ priority ఇవ్వబడింది. మనిషి తనను తాను వెతుక్కోవడంలో భాగంగా రకరకాల ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి చేసే నిరంతర అన్వేషణ వుంటుంది. ఒంటరితనం, సమూహాంలో ఏకాంతాన్ని కోరుకోవడం(privacy factor), ప్రేమరాహిత్యం మొ.నవి కవిత్వగాఢతను నిర్ణయిస్తాయి. 

"ఏళ్ళతరబడి అన్వేషించినా  రాత్రి అంతం కాలేదు/గుండె నిండుగా కురిసిన శూన్యం సాక్షిగా/మనసు అంతటా విచ్చిన చీకటి మొక్కలకి/అసంతృప్తి ఆకులు మొలిచి/నిరాశపూలు గుత్తులు గుత్తులుగా.."(అంతర్లోకం)

శూన్యం, అసంతృప్తి, నిరాశ మొ.నవి negative vibrations. అయినప్పటికీ అంతర్మథనంతో స్వచ్ఛమైన మనిషి జాడకు తొవ్వచూపే పరికరాలివే. 

*

"సుషుప్తి నుంచి' కవిత్వంలో  ప్రాథమికతనంతో పాటు ప్రౌఢ, యవ్వన ప్రాయాల్లోని భావోద్వేగాలకు, మానసిక అలజడులకు అద్దం పట్టే వస్తువుల్లో ప్రేమ అగ్రభాగాన నిలుస్తుంది. గ్రాఫాలజీ ద్వారా వ్యక్తిత్వ నిర్మాణ వికాస దశలను అంచనా వేయడానికి వీలవుతుందనే తలంపుతో తీసుకురాబడింది. తొలిప్రేమలోని తాజాదనం, ఏదైనా చేయగలననే ఆత్మవిశ్వాసంతొణికిసలాడుతుంది. ప్రేమతో పాటు సమాజంలోని అవకతవకల పట్ల, అంతరాల పట్ల సంఘర్షణ కూడా జమిలీగా పెనవేసుకుని వుంటుంది. 

"ఒక మనిషిగా/సాటి మనిషికి/నేనేమి చేయగలను?/చదవడమా..ఓదార్చడమా?"(జీవితపాఠం)

ఇదంతా కవి నోస్టాల్జియా. ఒకానొక ఫ్యూర్ లైఫ్ కి సాక్షీభూతంగా నిలువగలిగే కవిత్వం. వివిధ రంగాల్లో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూ versatile unique personality గా ఎదిగివచ్చిన కవికి శనార్తులు.

**

ఇప్పటివరకు 52 వారాలుగా "కవిముద్ర" ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అవకాశం కల్పించిన "కవిసంగమం" నిర్వాహకులకు, కవి యాకూబ్ గారికి కృతజ్ఞతలు. సెలవు.

***

కవిముద్ర ద్వారా పరిచయం చేసిన కవుల వివరాలు

*

దర్భశయనం శ్రీనివాసాచార్య, వడ్డెబోయిన శ్రీనివాస్, రవి వీరెల్లి, ఎన్. వేణుగోపాల్, మునాసు వెంకట్, తగుళ్ళ గోపాల్, మౌనశ్రీ మల్లిక్, కొండి మల్లారెడ్డి, సుంకర రమేష్, కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, షాజహానా, మెర్సీ మార్గరేట్, జూపాక సుభద్ర, మోహన్ రుషి, వనపట్ల సుబ్బయ్య, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ ఎస్వీకే, పసునూరి రవీందర్, నలిమెల భాస్కర్, బిల్లా మహేందర్, కొలిపాక శోభారాణి, నస్రీన్ ఖాన్, వాణి దేవులపల్లి, అరుణ నారదభట్ల, విప్లవశ్రీ శ్రీనిధి, స్కైబాబా, అవనిశ్రీ, కందుకూరి అంజయ్య, అనిశెట్టి రజిత, పొన్నాల బాలయ్య, బాసిత్, తైదల అంజయ్య, కందుకూరి దుర్గాప్రసాద్, అన్వర్, నందకిషోర్, కోడూరి విజయకుమార్, బూర్ల వెంకటేశ్వర్లు, శ్రీరామోజు హరగోపాల్, తెలిదేవర భానుమూర్తి, నరేష్ కుమార్ సూఫీ, కాసుల ప్రతాపరెడ్డి, ఇబ్రహిం నిర్గుణ్, నారాయణస్వామి వెంకటయోగి, పెన్నా శివరామకృష్ణ, నిధి, నాగేశ్వర్, సి.హెచ్ ఆంజనేయులు, వేముగంటి మురళీకృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, శేషభట్టర్ రఘు, ననుమాస స్వామి, మామిడి హరికృష్ణ

***

No comments:

Post a Comment