Sunday, 31 May 2020

తెలంగాణ చరిత్రలో ఖాళీల పూరణ !


తెలంగాణ చరిత్రలో ఖాళీల పూరణ !

History is the long struggle of man, by exercise of his reason, to understand his environment and to act upon it. - Edward Hallett Carr,

నిన్నటి దాకా తెలంగాణ
మహాకవి దాశరధి అన్నట్లు కోటి రతనాల వీణ .
ఇప్పుడది
సకల కళల ఖజానా
సాంస్కృతిక శోభల నజరానా !! "
ఇంకా లోతుల్లోకి , చరిత్ర పొరల్లోకి, సాంస్కృతిక మూలాల్లోకి తొంగి చూస్తే నాకర్థమైన సత్యం , తెలంగాణ - ఒక అక్షయ పాత్ర !"
చరిత్ర పరంగా గత కాలపు వైభవపు పరంగా మనం ఎంత కనుక్కున్నా , ఎన్ని నూతన అంశాలను వెల్లడి చేసినా ఇంకా పుట్లుపుట్లుగా పుట్టుకువచ్చే ప్రదేశాలతో క్షయం అనేది లేకుండా అక్షయ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న నేల - తెలంగాణ .అందుకే చరిత్రపరంగా ఒక అక్షయపాత్ర .!
ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఒక పుష్పకవిమానం . !!"

పురాణాల ప్రకారం ఎంత మంది ఎక్కినా ఇంకో మనిషికి చోటు ఇవ్వగలిగిన అపురూప అద్భుత వాహనం - పుష్పకవిమానం !
తెలంగాణ మట్టి దొంతరలలో దాగి ఉన్న చరిత్రను వెలికి తీసే చరిత్రకారుల విషయంలో ఎంతో మంది పరిశోధిస్తున్నా ఇంకో చరిత్రకారుడు తన పరిశోధన సాగించడానికి , కావలసిన ఆసక్తికరమైన అంశాలను మరెన్నో అంశాలను ఇవ్వగలిగిన గడ్డ - తెలంగాణ .
అందుకే చరిత్రకారుల పరంగా ఇది ఓ పుష్పకవిమానం .
‌అందుకే తెలంగాణ చరిత్ర , ప్రాచీన , మధ్యయుగకాలపు విశేషాల మీద సురవరం ప్రతాపరెడ్డి , కోమర్రాజు లక్ష్మణరాజు , పి.వి పరబ్రహ్మ శాస్ర్తీ , బి.ఎన్ శాస్త్రి , గులాం యజ్దాని, అడపా సత్యనారాయణ , దేమే రాజారెడ్డి , కుర్రా జితేంద్రబాబు ఇంకా చాలా మంది తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు తెలియని అనేక చారిత్రక విశేషాలను ప్రపంచానికి వెల్లడి చేశారు . తెలంగాణ ప్రాంతం ప్రస్తుత వర్తమాన కాలంలోనే కాదు , ప్రాచీన కాలంలో కూడా అత్యున్నత ప్రాభవ , వైభవాలను కలిగి ఉన్నదనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించారు.
‌తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా పీఠభూమిగా ఉండడం , ప్రాచీన గోండ్వానలో భాగంగా ఉండడం వల్ల ప్రాచీన చారిత్రక అవశేషాలు , విశేషాలు మాత్రమే కాక ప్రాక్ చరిత్ర మూలాలను ఎన్నింటికో ఈ నేల మౌన సాక్షిగా మిగిలింది . మెసొయిక్ యుగం నాటి ( అంటే 65 మిలియన్ సంవత్సరాల క్రితం ) ఆనవాళ్ళను సైతం తన గర్భంలో దాచుకుని ఉంది . అలా తెలంగాణ మట్టి పోరలలో గొప్ప చారిత్రక సంపద నిక్షిప్తమై ఉంది. మృణ్మయపాత్రలు , లోహ వస్తువులు , శిలలు ,శిల్పాలు , ఆలయాలు ,కోటలు , వర్ణచిత్రాలు , రాతి సూచికలు ,కోటలు , నిర్మాణాలు ఎన్నో చరిత్రను కొత్తగా నిర్మించడానికి , చరిత్రను కొత్తగా రాయడానికి , పునర్ నిర్మించడానికి కావలసిన అన్ని ఆధారాలను అందిస్తున్నాయి .
నిజానికి తెలంగాణ చరిత్రను అల్లడానికి కావాల్సిన సమస్త ఆధారాలు ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి.
అయితే ఉమ్మడి రాష్ట్ర కాలంలో తెలంగాణ ప్రాంత ప్రాచీన చరిత్ర పరిశోధన దిశగా చేయాల్సినంత కృషి జరగకపోవడం శోచనీయం .
అటు ప్రభుత్వ సంస్థలు కానీ , ప్రయివేటు వ్యక్తులు , చరిత్ర పరిశోధకులు కానీ తెలంగాణ ప్రాంతం మీద అంతగా దృష్టి పెట్టలేదు. కానీ తెలంగాణ ఉద్యమం మొదలయి జ్వలిస్తున్న కాలం ( 2000- 2014 ) లో తెలంగాణ చారిత్రక వైభవ పునాదులలోకి ఉద్యమస్పూర్తిని రగిలించడం వల్ల విస్తృతమైన ఆలోచన మొదలయింది. అయినప్పటికీ అప్పటివరకూ తెల్సిన చరిత్ర మాత్రమే ప్రజల్లోకి విస్తరించింది .
అయితే తెలంగాణ చరిత్ర 2014 వరకూ వెల్లడయిన విషయాలకే పరిమితమా ? తెలంగాణ చరిత్ర అంతమాత్రమేనా ? ఎంతమాత్రమూ కాదు . తవ్వుతున్న కొద్దీ ఊరే చెలిమె లాంటిది- తెలంగాణ అని 2014 నుండి తెలంగాణ నేల అంతటా ఔత్సహిక చరిత్ర పరిశోధకులు చేస్తున్న పరిశోధనలు , అన్వేషణలు వారు వెల్లడి చేస్తున్న విషయాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటివరకు పురావస్తు శాఖకు , ప్రపంచానికి తెలియని ఎన్నెన్నో వింతైన , వినూత్నమైన , చారిత్రక విశేషాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి . ఒక్కొక్క చారిత్రక విశేషం ఆవిష్కృతవుతున్న ప్రతిసారీ ఆశ్చర్యం కలుగుతోంది, సంభ్రమం కలుగుతోంది .విస్మయం వెల్లి విరుస్తోంది... అద్భుతం సాక్ష్యాత్కారం అవుతున్నది .అన్నింటినీ మించి ఇంతటి మహోన్నత చారిత్రక భూమి మీద పుట్టినందుకు గర్వంగా కూడా అనిపిస్తున్నది ...! ఒక దేశం , ఒక భూమి , ఒక జాతి తన తోటి మనుషులకు ఇంతకన్నా ఏమివ్వాలి ? నేను తెలంగాణ బిడ్డను అని గర్వంగా ఛాతి విరుచుకుని పొలికేక పెట్టేంత స్థైర్యాన్ని మన తెలంగాణ చారిత్రక వైభవం ఇస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ మూలమూలల్లోకి సంచరించి పొరలలోకి , అరలలోకి తరచి తరచి చూస్తుంటే తెలంగాణ కొత్త కొత్త వెలుగులతో మన ముందు ప్రత్యక్షం అవుతోంది . అలాంటివాటిలో కొన్ని .
ప్రాచీన పెదరాతి యుగంలోనే తెలంగాణ ప్రాంతంలో మానవుల ఉనికి ఉందనే విషయం దామరవాయి గ్రామంలోని సమాధుల ద్వారా తెలుస్తోంది .
- కేవలం ఇటుకలను మాత్రమే వాడి 65 అడుగుల ఎత్తయిన గొల్లత్త
గుడి నిర్మాణ తీరు .
- హనుమకొండలో బ్రహ్మ దేవుడి విగ్రహం లభించడం.
- కాకతీయుల కాలం నాటి మెట్లబావుల విశిష్టత .
- హన్మకొండలో అష్టభైరవులు కొలువై ఉన్న ప్రదేశం .
- కాకతీయుల కాలం నాటి కోటలు
జల , గిరి , వన , దుర్గంగా ఉన్న ప్రతాపగిరి కోట , అడవిలో సైనిక
పహారా కోసం నందిగామ , కాపురం ,మల్లూరు లాంటి ఎన్నో కోటలు .
- ప్రఖ్యాత కాకతీయ కీర్తితోరణం కన్నా ప్రాచీనమైన అనుమకొండ కోట
తోరణాలు , గొడిశాల తోరణం , నంది కంది , కొలనుపాక లాంటి
తోరణాలు .
ప్రపంచంలోనే అత్యంత ఆరుదైన దేవుడి గుట్ట ఆలయం .
అడవి సోమనపల్లిలోని గుహలయాలు , శాసనాలు , వర్ణ చిత్రాలు . ఇలా ఎన్నో ఎన్నేన్నో
ఇదంతా ఇప్పటిదాకా మనకు తెలియని తెలంగాణ ! తెలుసుకోవడానికి ఇంకా ఎంతో మిగిలి ఉన్న తెలంగాణ ! అందుకే తెలంగాణ చరిత్ర ఆవిష్కరణ విషయంలో ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ లు లేవు . కేవలం కామాలు మాత్రమే ఉన్నాయి ...
ఈ అసంపూర్ణతే నికార్సయిన చరిత్రకారుడికి సవాలు విసురుతుంది . అతనిలోని అన్వేషనాకాంక్షకు ప్రోత్సాహకాన్నీ అందిస్తుంది. అతనిలోని విషయవాంఛకు స్ఫూర్తినిస్తుంది .

As quoted by Robert Stone
" History is perceived as a rational process, the unfolding of a design, something with a dynamic to be uncovered."

ఈ నేపధ్యంలోనే తెలంగాణ ప్రాంతపు ప్రాచీన చరిత్రను , ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలకు ఊతం ఇవ్వాలని భాషా సాంస్కృతిక శాఖ భావించింది . తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించింది . అందుకే ఆ దిశగా పరిశోధన చేస్తున్న చరిత్రకారుల గురించి అన్వేషిస్తే నవ తరంలో కొత్త ఆలోచనలతో, అమిత సాహసంతో పరిశోధన చేస్తున్న కొంతమంది యువ చరిత్రకారులు దృష్టిలోకి వచ్చారు . వారిలో సీరియస్ గా పనిచేస్తూ తన జీవిత పరమావధిగా చరిత్రను అన్వేషిస్తున్న అరవింద్ ఆర్య కనిపించాడు .
ఏ ఫలితం గురించీ , ప్రయోజనం గురించీ ఆలోచించకుండా గత 5 ఏళ్లుగా నిరంతరం చరిత్ర పరిశోధనకే తన సమయాన్ని , శక్తినీ, జ్ఞానాన్ని , ధనాన్ని వినియోస్తున్న యువకుడు అరవింద్ ఆర్య

" Anybody can make history .But only a great man can write it " అని ప్రఖ్యాత రచయిత ఆస్కార్ వైల్డ్ అన్నట్లు చరిత్ర పరిశోధన ఒకెత్తు అయితే , ఆ పరిశోధనలో వెల్లడి అయిన అంశాలను సప్రమాణాలతో రాయడం , శాస్త్రీయంగా నమోదు చేయడం మరొక ఎత్తు . ఈ రెండు కార్యాలలోతనదైన ఆసక్తి , ప్రతిభ అరవింద్ లో ఉన్నాయని భాషా సాంస్కృతిక శాఖ 2017లోనే గమనించింది .

అరవింద్ అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో " The Untold Telangana " పేరుతో ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ICCR ఆర్ట్ గ్యాలరీలో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు , వాటి వివరాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రపంచానికి తెలిశాయి . అనూహ్య స్పందనతో ఆ ప్రదర్శన విజయవంతం అయింది. ఈ కృషిని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని అరవింద్ చేసిన చారిత్రక అన్వేషణలకు శాశ్వతత్వాన్ని తీసుకుని రావాలని ఆలోచించి అతని పరిశోధనా ఫలితాలను మనకు తెలియని తెలంగాణ పేరుతో పుస్తకంగా ప్రచురించాలని సంకల్పించింది .

మహోన్నత వైభవం , మహోజ్వల వారసత్వ ప్రాభవం , చరిత్ర పరిశోధకులకు స్వర్గధామం లాంటి ప్రాచీన జ్ఞానం ఉన్న తెలంగాణను కొన్ని కొంగొత్త అన్వేషణలతో ఆవిష్కరించడం ఈ పుస్తకం ఉద్దేశ్యం.
భాషా సాంస్కృతిక శాఖ గతంలో కూడా ' కాకతీయ ప్రస్థానం' అనే పేరుతో ఒక పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించి తెలంగాణ చరిత్రకు నీరాజనం పట్టింది.
అయితే చరిత్ర ఎప్పుడూ నిర్మాణామవుతూనే ఉంటుంది. కొత్త అన్వేషణలు , కొత్త పరిశోధనలు జరిగిన ప్రతిసారి చరిత్రకు సంబంధించి అప్పటివరకూ ఉన్న చరిత్రకు తోడు అవుతాయి. చారిత్రక విశేషాల జ్ఞానాన్ని సంపన్నం చేస్తాయి . అందుకే చరిత్రకు ఎప్పుడూ అంతం లేదు . ఇది ఎప్పుడూ మధ్యమమే .
John H. Arnold అనే చరిత్రకారుడు History : A very Short Introduction లో చెప్పినట్టు The past itself is not a narrative. In its entirety, it is chaotic, uncoordinated, and complex as life. History is about making sense of that mess, finding or creating patterns and meanings and stories from the maelstrom."
చరిత్ర ఎప్పుడూ అసంబద్ధoగాను , అసంపూర్ణంగాను , కలగుర గంపగాను , అసమగ్రంగానూ ఉంటుంది. చరిత్రకారుడి నైపుణ్యం వాటిని సంపూర్ణoగా , సమగ్రంగా రచించడంలోనే బయటపడుతుంది. ఆ ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. అయినా ఈ పుస్తకమే సమస్తం అని చెప్పే సాహసం మాకు లేదు . ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఈ పుస్తకం వెల్లడి చేస్తున్న విషయాలపై ఏకీభవించవచ్చు , విభేదించవచ్చు . మరింత విశదంగా పరిశోధించనూవచ్చు . వాటి ద్వారా చరిత్ర సుసంపన్నం అవుతుంది. ఆ దిశగా ఎవరు ప్రయత్నించినా హర్షణీయమే .
అందుకే , For nothing ever ends, really; stories lead to other stories, journeys across a thousand miles of ocean lead to journeys across a continent, and the meanings and interpretations of these stories are legion. '
అని జె.హెచ్ ఆర్నాల్డ్ అన్నమాటలు అక్షర సత్యాలు .

----మామిడి హరికృష్ణ .
సంచాలకులు .భాషా సాంస్కృతిక శాఖ , తెలంగాణ ప్రభుత్వం.

Cinema in Nizam times

https://youtu.be/E0FjXjJtOgo





ఛాయా స్వరం

Folks,  here it's my translated poem of MARGARET ATWOOD,  Canadian,  who won the prestigious Booker prize,... Published in Namaste Telangana paper on 19-11-2018.. ఛాయా స్వరం!
         మూలం: మార్గరెట్ ఆట్ వుడ్ 
          స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ 8008005231

నా నీడ నన్నడిగింది
విషయం ఏమిటి అని!

ఈ వెన్నెల వెచ్చదనమే నీకు సరిపోవట్లేదా ?
మరొక దేహపు దుప్పటిని
నువ్వెందుకు వాంఛిస్తున్నావు  అని !

ఈ సమయాన ఎవరి చుంబనమో
నదీ తీరం మీద నాచులా 
వన భోజనపు బల్లల చుట్టూ
వెలుగు లీనే గులాబీ హస్తాల్లో
ఇమిడి పోయిన రొట్టెల్లో నిక్షిప్తం అయి ఉంది!
పెరిగిన హృదయ దూరాలు... 
ముక్కలు ముక్కలైన మనసులు !
ఎవరిలోకి వారు ముడుచుకుపోయాక 
తాజా పిండి వంటలపై ముసురుతున్న ఈగలు!

 ఇంతకీ ఈ దుప్పట్లో ఏముందో నీకు తెలుసా?
తెలీదు కాక తెలీదు!
చిన్నపిల్లలు యుద్ధం ఆట ఆడుకుంటున్నారు 
తుపాకుల కాల్పుల ఉధృతికి  
ఆరుబయటి చెట్లు వంగిపోతున్నాయి  
వాళ్ళని వంటరిగానే వదిలెయ్యండి
వాళ్ళు వారిదైన ఆటల్ని
వారి పద్ధతిలో ఆడుకుంటున్నారు
వాళ్ళలోకంలో వాళ్ళని విహరించనియ్యండి!

అయినా, ఇన్ని గోలల మధ్య 
నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉన్నాను కదా!
నీ దాహం తీర్చడానికి నీళ్ళిచ్చాను
నీ ఆకలి తగ్గించడానికి శుభ్రమైన రొట్టె ముక్కలనిచ్చాను
ఇప్పుడు చెప్పు,
నీ రక్త నాళాల్లో ప్రవహిస్తున్న పదాలు
నీ నిరంతర ప్రస్థానానికి కొనసాగింపులు !
ఇంతకీ అవి సరిపోయేంతగా ఉన్నాయా, లేవా?

......                                  

మార్గరెట్ ఆట్ వుడ్ ( 18 నవంబర్ 1939 )

కెనడా రాజధాని అట్టావాలో జన్మించిన మార్గరెట్ ఎలియనార్ ఆట్ వుడ్, తన 6వ ఏట నుండే రాయడం ఆరంభించింది. బాల్యం నుండే ఆమెలో మొదలైన అధ్యయన పిపాస తర్వాతి జీవితంలో ఆమె కవిగా, నవల, అపేరా, టీవీ సీరియల్స్, సినిమా కథా రచయితగా, స్త్రీ వాదిగా, పర్యావరణ హక్కుల కార్యకర్తగా, ఉపాధ్యాయురాలిగా బహుముఖ ప్రతిభ కనబర్చడానికి దోహదం చేసింది. తన రచనలన్నింటిలోనూ కెనడా దేశ ప్రజలు- సంస్కృతీ- వారి సంఘర్షణలను సహజత్వానికి దగ్గరగా చిత్రించడం వల్ల ఆమె, కెనడా అస్తిత్వ ప్రతీకగా జేజేలు అందుకుంది. 

ఆమె Double Persephone (1961) తో మొదలెట్టి,  The Circle Game(1964), The Animals in that Country(1968) కావ్యాలలో మానవ ప్రవర్తనని, ప్రకృతిని, ఆధునిక వస్తు సంస్కృతిని విమర్శనాత్మకంగా, సౌందర్యాత్మకంగా చర్చించింది. అలాగే Power Politics  (1971), Two-Headed Poems (1978) ద్వారా తాత్విక - రాజకీయ- ప్రగతి శీల భావనలను వెల్లడి చేసింది. The Heart Goes Last (2015)తో సీరియల్ ఈ-బుక్ ను, షేక్స్పియర్ The Tempest ను Hag- Seed (2016) పేరుతో Retelling చేసి సాహితీ ప్రయోగాలెన్నిటికో పునాదులు వేసింది. 2006 లో ప్రతిష్టాత్మక బుకర్ పురస్కారాన్ని సాధించింది!

*********************************************

దుఃఖ జన్యువు

Folks, pl see my poem published in andhrajyothy Sunday supplement 16-8-2015

దుఃఖ జన్యువు 
----- మామిడి హరికృష్ణ 99088 44222

1. అత్యంత మామూలుగా 
దేహం 
పగలు షర్ట్ ని విడిచి 
రాత్రి లుంగీని చుట్టుకుంటుంది 

ఎన్ని వర్ణాలలో మెరిసినా
మరెన్ని వర్షాలనో కురిసినా 
లోలోపలి మస్తిష్కం 
చీకటి చెలిమెలో ఎడారిని విత్తుతూనే ఉంటుంది 
గాలి తాకిడికి కోసుకుపోయిన పాట  
ఉల్లిపాయ పొరల స్వరాలలో 
దుఃఖాన్ని నిల్వ చేస్తూనే ఉంటుంది 

రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్న స్ట్రీట్ లైట్ 
వేకువ జాము దాకా కునికిపాట్లు పడుతున్న నైట్ క్వీన్ 
సకల సోయిలని కోమా చితిలోకి జారవిడిచి 
జాగ్రత్తగా 'జోహార్' చేస్తాయి 

2. అత్యంత మామూలుగానే 
దేహం 
రాత్రి లుంగీని విడిచి 
పగలు షర్ట్ ని తొడుక్కుంటుంది

తర్కం అడవిలో కార్చిచ్చు పుట్టించిన మిణుగురులు 
మనసు ఐ.సి. యూనిట్ లోని
సెలైన్ బాటిల్ లోంచి జారిన గోల్డెన్ డ్రాప్ లు 
ప్రాచీన క్రోమోజోముల సముద్రం లో దూకి
ఆత్మహత్య చేసుకుంటాయి 

బ్రెయిన్ స్క్రీన్ అంతా ఫార్మటింగ్ అయి 
నీలాకాశం తునక మానిటర్ లో ఒదిగిపోతుంది 
పాత అనుభవాలకి షార్ట్ కట్స్ మాయమై 
కొత్త అనుభూతులు మొగ్గలుగా మొలుస్తాయి 

3. అత్యంత మామూలుగానే 
దేహం 
పగలు లుంగీని విడిచి 
రాత్రి షర్ట్ ని తొడుక్కుంటుంది 

అరిషడ్వర్గాలకి ఆవలి ఒడ్డున పూసిన పువ్వు 
పంచ భూతాలకి ఎగువన కాసిన వెన్నెల 
చతుర్విధ పురుషార్థాతీతంగా ప్రవహించిన  నది 
త్రిగుణాలను అధిగమించి నిలిచిన పర్వతం 
ద్వైతాన్ని జయించి అవతరించిన అంతరిక్షం 
ఏకత్వాన్ని సర్వ లోకాలలో ప్రతిష్టించిన శూన్యం 
దుఃఖ జన్యువులలో లీనమై పోతాయి 

వోపెనింగ్ బ్యాలెన్స్ ఎంతతో మొదలైనా 
క్లోజింగ్ బ్యాలెన్స్ ' నిల్ ' గానే లెక్క తేలుతుంది 

4. అత్యంత మామూలుగానే  
దేహం 
జీవం ఉడుపులు విడిచి 
ఆత్మ వస్త్రాలని ధరిస్తుంది ..... !!

Interview with Telangana cinema

https://youtu.be/mS03iJFbEE8






Interview with Daruvu

https://youtu.be/129xnb2_thE

విభజన వికాసానికేనా



ఆస్కార్ రీలుపై విదేశీ చిత్రాలు

Hi folks, here are d excerpts from my coverstory article published in bathukamma of namasthe telangana on 5 oct, 2014
ఆస్కార్ రీలుపై విదేశీ చిత్రాలు

1929 ఆస్కార్ అవార్డులు ఆరంభమైన 18 ఏళ్ల తర్వాత, విదేశీ భాషాచిత్రాలను కూడా సముచిత రీతిలో సత్కరించే సంప్రదాయం మొదలయింది. అయితే, విదేశీ భాషాచిత్రాల ఆస్కార్ అవార్డు ప్రస్థానం ప్రధానంగా రెండు దశలలో జరిగిందని చెప్పాలి. 1947-1955 మరకు తొలిదశ. ఈ దశలో ఎంపికైన విదేశీ చిత్రాలకు ఇచ్చే అవార్డులను ప్రత్యేక గౌరవ అవార్డు గా పిలిచేవారు. ఇక, 1956 నుండి కొనసాగుతున్న రెండో దశలో ప్రతిభా అవార్డుగా అందజేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ అత్యుత్తమ చిత్రాలుగా పేరెన్నిక గన్న చిత్రాలకు సూచికగా మారిన ఈ విదేశీ భాషాచిత్రాల ఆస్కార్ అవార్డును గెల్చుకున్న చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి

తొలి దశ: (1947-1955)
ఆస్కార్ అవార్డును పొందిన తొలి విదేశీ చిత్రం క్రెడిట్‌ని ఇటాలియన్ నియో రియలిజం చిత్రాల సృష్టికర్త విట్టోరియా డి సికా. సొంతం చేసుకోవడం ఈ క్యాటగిరీ చిత్రాలలో విశేషం. కాగా, ఆ తొలి చిత్రంగా రికార్డు సృష్టించిన సినిమా షూ షైన్ (1947). ఆ తర్వాత వరుసగా, మాన్యుయర్ విన్సెంట్ (ఫ్రాన్స్ -1948), ది బైసికిల్ థీఫ్ (1949 ఇటలీ), ది వాల్స్ ఆఫ్ మలసాగా (ఫెంచ్ -ఇటలీ 1950), రషోమన్ (1951-జపాన్), ఫార్ బిడెన్ గేమ్స్ (1952-ఫ్రెంచ్) సినిమాలు విదేశీ చిత్రాల పురస్కారాలను అందుకున్నాయి.

ప్రస్తుత మలి దశ:
1956 నుండే ఆస్కార్ అవార్డులలో విదేశీ భాషాచిత్ర విభాగం సువ్యవస్థీకృతమైంది. అలా 1956లో తొలి అవార్డును గెల్చుకున్న సినిమాగా ఫెఢరికో ఫెల్లిని దర్శకత్వంలో వచ్చిన ఇటాలియన్ సినిమా లా స్ట్రాడా(1956) రికార్డు సృష్టించింది. ఆ తర్వాత నైట్స్ ఆఫ్ కబీరియా (1957), మై అంకుల్ (1958), బ్లాక్ ఓర్ఫియస్ (1959), ది వర్జిన్ స్ప్రింగ్ (1960) సినిమాలు ఈ అవార్డును గెల్చుకున్నాయి.
స్వీడన్ దర్శకుడు ఇన్గ్‌మార్ బెర్గ్‌మన్ తీసిన త్రూ ఎ గ్లాస్ డార్క్ లీ సినిమా 1961 సంవత్సరపు విదేశీ భాషాచిత్ర ఆస్కార్‌ను అందుకోగా, 1962లలో సండేస్ అండ్ సైబీల్ సినిమా (ఫ్రెంచ్) గెల్చుకుంది. ఆ తర్వాత 8 1/2 (1963), యెస్టర్ డే, టుడే అండ్ టుమారో (1964), ది షాప్ ఆన్ మెయిన్ స్ట్రీట్ (1965), ఎ మ్యాన్ అండ్ ఎ వుమన్ (1966), క్లోజ్‌లీ వాచ్‌డ్ ట్రెయిన్స్ (1967), వార్ అండ్ ఫీస్ (1968), Z (1969) ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఎ సిటిజెన్ ఎబోవ్ సస్పీషియన్ (1970) సినిమాలు ఆస్కార్‌లను గెలుచుకుని, విదేశీ భాషాచిత్రం అనే విభాగానికి క్రేజ్ తెచ్చాయి.

ఇక, 1971లో విట్టోరియా జెసికా తీసిన ది గార్డెన్ ఆఫ్ ది పూజి కాంటినిస్ సినిమా, ఆ తర్వాత ది డిస్క్రీట్ ఛార్మ్ ఆఫ్ ది బూర్జువా (1972), డే ఫర్ నైట్ (1973), అమర్ కార్డ్ (1974), దెర్సూ ఉజాలా (1975), బ్లాక్ అండ్ వైట్ ఇన్ కలర్ (1976), మేడమ్ రోసా (1977), గెటౌట్ యువర్ హ్యాండ్ కర్ఛీఫ్స్ (1978), ది టిన్ డ్రమ్ (1979), మాస్కో డజ్‌నాట్ బిలీవ్ ఇన్ టియర్స్ (1980), సినిమాలు ఆస్కార్‌లను సాధించి అమెరికా ప్రేక్షకులను సైతం తమ వైపు దృష్టి మరల్చుకునేలా చేసాయి.
1981లో జర్మన్ భాషలో వచ్చిన మెఫిస్టో సినిమా వరల్డ్ సినిమాలో హంగరీ దేశ ప్రాతినిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే, ఆ తర్వాత 1982లో వూల్వర్ ఎ ఎంపెజెర్, 1983లో ఫానీ అండ్ అలెగ్జాండర్ (స్వీడన్), 1984లో డేంజరస్ మూన్స్, 1985లో ది అఫీషియల్ స్టోరీ, 1986లో ది అపాల్ట్, 1987లో బాబెట్స్ ఫీస్ట్, 1988లో పెల్లీ ది కాంకరర్, 1989లో సినిమా ప్యారడిసో (ఇటాలియన్ గిసెప్పి టార్నటోర్ దర్వకత్వం), 1990లో జర్నీ ఆఫ్ హోప్ సినిమాలు ఆస్కార్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డులను గెల్చుకున్నాయి.

1991 దశకంలో ప్రపంచవ్యాప్తంగా సోవియెట్ రష్యాపతనం, తదనంతర ఏకధ్రువ రాజకీయాలలో నుంచి ప్రపంచ సినిమా కొత్త పోకడలను మొదలెట్టింది. ఈ చారిత్రిక సందర్భంలో 1991లో వచ్చిన మెడిటరేనియో సినిమా, ఇండో చైన్ (1992), బెల్లె ఎపోక్ (1993), బర్న్ బై దిసన్ (1994), ఆంటోనియాస్ లైన్ (1995), కోల్యా (1996), క్యారెక్టర్ (1997), లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (1998- రాబర్టో బెనిగ్నీ దర్శకత్వం), ఆల్ ఎబౌట్ మై మదర్ (1998), క్రౌనింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్ (2000- ఆంగ్ లీ దర్శకత్వం- మాండరిన్ భాష) సినిమాలు ఆస్కార్ విదేశీ చిత్రాల కేటగిరిలో తమదైన ముద్రని వేయగలిగాయి.
బోస్నియా హెర్జెగోవినా వంటి కొత్తగా ఏర్పడిన స్వతంత్ర దేశాలు కూడా ఆస్కార్ ఫారిన్ భాషా చిత్రాలలో తమ సత్తాని చాటుకోవడం ప్రస్తావనార్హం. 2001లో బోస్నియన్ భాషలో వచ్చిన నో మాన్స్ ల్యాండ్ సినిమా ఒక్కసారిగా అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. 

అలాగే, 2002లో నోవేర్ ఇన్ ఆఫ్రికా, 2003లో ది బార్బేరియన్ ఇన్వేజన్స్, 2004లో ది సీ ఇన్‌సైడ్, 2005లో సోట్సీ, 2006లో ది లైన్స్ ఆఫ్ అదర్స్, 2007లో ది కౌంటర్ ఫీటర్స్, 2008లో డిపార్చర్స్ (జపాన్), 2009లో ది సీక్రెట్ ఇన్ వెయిర్ ఐస్, 2010లో ఇన్ ఎ బెటర్ వరల్డ్ (డెన్మార్క్) సినిమాలు కూడా ఆస్కార్ పురస్కారాలను తమ తమ దేశాలకు తీసుకెళ్ళాయి.
న్యూ మిలీనియంలోని రెండో దశాబ్దంలో వచ్చిన ప్రపంచ భాషా చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచి విదేశీ చిత్రాలుగా ప్రశంసలను పొందడమే కాక, యావత్ ప్రపంచ దృష్టినీ ఆకట్టుకోగలిగాయి. వాటిలో 2011లో ఆస్కార్ గెల్చుకున్న ఇరాన్ సినిమా ఎ సెపరేషన్ చెప్పుకోదగ్గ సినిమా. 2012లో గెల్చుకున్న అమోర్ (ఫ్రెంచ్), 2013లో ఆస్కార్ సాధించిన ఇటాలియన్ సినిమా ది గ్రేట్ బ్యూటీ కూడా విదేశీ చిత్రాలుగా వరల్డ్ సినిమాని సుసంపన్నం చేసినవే!

కేసీఆర్ విజన్‌తో సకల కళల వికాసం*

*కేసీఆర్ విజన్‌తో సకల కళల వికాసం*

ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా తానై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన పాత్ర తెరవెనుకే ఉండిపోయింది. అప్పుడే పుట్టిన శిశువు తెలంగాణ సాహిత్య అకాడమీని ముందు నిలిపి తాను అన్నీ ఒక తల్లిలా సవరించి, తెరవెనుకే ఉండిపోయిన బృందం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖది. వందలాది కవులు, కళాకారులు, కథకులు, రచయితలు, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఎందరినో వేదికపై కనులారా తిలకించడం ఒక చరిత్ర. మన చరిత్రను మనం, మన సంస్కృతిని మనం గర్వించేలా తీర్చిదిద్దడం గత నాలుగేండ్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి సారాంశం. గతంలో ఇలాంటిది ఊహించి ఉండలేదు. కలలు మాత్రం కన్నాం. ఆ కలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజన్ ఉన్న నాయకత్వం, సలహాదారులు, ప్రభుత్వ కార్యదర్శులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ల, తదితరుల సమిష్టి కృషి, కమిట్‌మెంట్ వల్లనే సాధ్యపడుతున్నది. ఈ కృషి మరింత విస్తృతంగా కొనసాగడం అవసరం.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అద్వితీయమైనది. తెలంగాణ కళలు, సాహి త్యం, తెలంగాణ తేజోమూర్తులు గురించి చేస్తున్న కృషి అపూర్వమైనది. రవీంద్రభారతి, కళాభవన్ కేంద్రంగా జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ భాషను, సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని పతాక రీతి ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ సినిమా నూతన వికాసం కోసం రవీంద్రభారతి పైడి జయరాజ్ థియేటర్‌లో ప్రతి శని, ఆదివారాలు జరుగుతున్న సినిమా, డాక్యుమెంటరీ ప్రదర్శనలు వాటికవే ఒక గొప్ప జాతీ యస్థాయి ప్రదర్శనలుగా నిలుస్తున్నాయి. ఎందరో యువనటులు, దర్శకులు, రచయితలు ప్రపంచంలోని విభిన్న అంశాల సినిమాలను, డాక్యుమెంటరీలను చూసి తమదైన తెలంగాణ సినిమాను రూపొందించే కృషి చేయడం ప్రశంసనీయం. శనివారం ప్రాంతీయ భాష చిత్రాలను ప్రదర్శించడం అందుకు శనివారాన్ని సినీవారంగా ప్రచారం చేయడం దానికదే ఒక కొత్త చరిత్ర. ప్రతీ ఆదివారం జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సినిమాలను ప్రదర్శించడం ఒకనాడు ఫిలిం సొసైటీలు చేసిన పనిని భాషా సాంస్కృతిక శాఖ నెరవేర్చడం గొప్ప విషయం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రోత్సాహంతో, తెలంగాణ జన జీవితం పై, సంస్కృతిపై, సమస్యలపై, అభివృద్ధి సంక్షేమంపై ఎన్నో డాక్యుమెంటరీలు వెలువడ్డాయి. నూతన ఒరవడి తెలంగాణ సినిమా అనేది ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటూ విజయాలు సాధిస్తున్నది. రవీంద్రభారతి మినీహాల్ అనేక సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనల కు, పుస్తకావిష్కరణలకు వేదికగా నిలుస్తున్నది. అనేక సెమినార్లు కూడా జరుగడం విశేషం. రవీంద్రభారతి మెయిన్‌హాల్‌లో నిరంతరం జరుగుతున్న ప్రదర్శనలు, సభలు వాటికవే ఒక మహత్తర చరిత్ర. తెలంగాణ మహనీయుల జయంతి, వర్ధంతి సభలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే సాధ్యపడింది. రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వడమంటే, రవీంద్రభారతిలో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సభ పెట్టుకోవాలంటే పూర్వం అందని ఆకాశం. జీవితానికి ఒక్కసారైనా రవీంద్రభారతిలో వేదికపై సభనో, సాహిత్య ప్రదర్శనో జరుపాలనుకునే ఆశయం ఉండేది. అదిప్పుడు అందరికి అందిన ఆకాశం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.

రవీంద్రభారతి ముందున్న ఓపెన్ ఆడిటోరియంలో ఎన్నో జానపద, ప్రజాకళల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కళాభవన్ మొదటి అంతస్తు లో నిరంతరంగా ఆర్ట్ ప్రదర్శనలు, ఫొటో ప్రదర్శనలు, తెలంగాణ సం స్కృతిని, తెలంగాణ చిత్రకారుల ఫొటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని విస్తృతంగా వెలికి తెస్తున్నాయి. కేసీఆర్ విజన్ వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కేసీఆర్ విజన్‌తోపాటు సాంస్కృతిక సలహాదారు కె.వి. రమణాచారి, సాంస్కృతిక శాఖ, టూరిజం, బీసీ సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణల సమిష్ఠి కృషి ఎంత మెచ్చుకున్నా తక్కువే. మామిడి హరికృష్ణ తొలి యవ్వన ప్రా యం నుంచే రచన ప్రారంభించి అనేక వ్యాసాలు, కవితలు విశ్లేషణలు రాసి తనదైన ముద్ర కలిగినవాడు. జీవితాన్ని సాహిత్యానికి, సంస్కృతి కి, కళలకు అంకితం చేస్తూ ఒక మహోద్యమంగా రాత్రింబవళ్లు పనిచేయడం మరచిపోలేనిది. అలాంటి నిబద్ధత గల వ్యక్తి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా రావడం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కలిసి ఒక గొప్ప చరిత్ర సృష్టించడుతున్నది. కేవలం రవీంద్రభారతి ఆవరణలోని కార్యక్రమాలే కాకుండా త్యాగరాయ గానసభ, సుందరయ్య విజ్ఞా న కేంద్రం, ప్రెస్‌క్లబ్ వంటి చోట్ల జరిగే కార్యక్రమాలకు ఇతోధికంగా సౌజన్యాన్ని అందిస్తూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అపూర్వమైనది. ఇలాంటి కార్యక్రమాలతోపాటు మరెన్నో కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూ వస్తున్న విషయం చాలామందికి తెలియదు. పలు కార్యక్రమాల వెనుక నిట్టాడుగ, వెన్నెముకగా తెలంగా ణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నేపథ్యంలో ఉండి అనేక కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నది. ప్రగతిభవన్, జనహితలో ఉగాది సమ్మేళనాలు కానీ, గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలు గానీ, బతుకమ్మ పండుగ ఉత్సవాలు గానీ, గోల్కొండ ఖిల్లాను, ఆయా ఉత్సవాల సందర్భంగా వందలాది కళాకారులతో కన్నులపండుగగా తీర్చిద్దిడం గాని, సంక్రాంతి ముగ్గుల ఉత్సవాలు గానీ, కళాత్మకంగా గొప్ప స్ఫూర్తితో నిర్వహించబడుతున్న తీరు గుర్తు చేసుకుండా ఉండలేము. ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా తానై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన పాత్ర తెరవెనుకే ఉండిపోయింది.

అప్పుడే పుట్టిన శిశువు తెలంగాణ సాహిత్య అకాడమీని ముందు నిలిపి తాను అన్నీ ఒక తల్లిలా సవరించి, తెరవెనుకే ఉండిపోయిన బృందం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖది. వందలాది కవులు, కళాకారులు, కథకులు, రచయితలు, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఎందరినో వేదికపై కనులారా తిలకించడం ఒక చరిత్ర. తెలంగాణ మహనీయుల పేరిట నగరమంతటా ద్వార తోరణాలు ఏర్పా టుచేయడం, అన్నీచూసి మనస్సు పులకరించినవారు అరుదు. అంతేకాదు తెలంగాణ సారస్వత పరిషత్, తెలుగు అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంస్థలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో అనేక గ్రంథాలు వెలువరించడం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకే సాధ్యపడింది. తెలంగాణ తేజోమూర్తులు పెద్ద పుస్తకంలో 153 మంది తెలంగాణ తేజోమూర్తుల గురించి అందంగా అచ్చువేసిన పుస్తకం కలకాలం నిలిచిపోతుంది. సినారె గురించి స్వరనారాయణీయం అనే గ్రం థం దానికదే ఒక డాక్యుమెంట్. తొలిపొద్దు అనే శీర్షికతో నాలుగువందల నలభై మంది కవుల కవిత్వంతో తెచ్చిన కవిత్వ పుస్తకం ప్రభుత్వం కూడా ఇంత అందంగా అచ్చువేస్తుందా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం మనవంతు. అలాగే ఆత్మగౌరవ సంకేతంగా తంగేడువనం అనే కవితా సంకలనం తంగేడు పూలపై అత్యధిక కవితలతో వెలువడటం ఒక మహాఖండకావ్యం. ఇందులో 166 కవితలు తీరొక్క తీరును వ్యక్తీకరిస్తాయి. కాళోజీ బతుకమ్మా బతుకు కవితతో ప్రారంభమైన ఈ సంకలనం దానికదే ఒక విశిష్ఠమైన గ్రంథం. శతాబ్దాలుగా కనుమరుగయిపోయిన కాకతీయుల నాటి పేరిణి నృత్యాన్ని పునర్జీవింపజేసిన ఖ్యాతి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకే దక్కుతుంది. నటరాజ రామకృష్ణ వెలికితీసిన తర్వాత దానిని 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చి పేరిణి తాం డవం, పేరిణి లాస్యంలను అభివృద్ధి పరుచడంతో పాటు 4 ఏండ్ల కోర్సు గా మార్చి సిలబస్ రూపొందించి 400 మంది శిక్షణ పొందేట్టు కృషి సల్పిన తీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కవిత్వమే కాకుండా తెలంగాణ హార్వస్ట్ అనే గ్రంథాన్ని ప్రముఖుల కథకులతో ఇంగ్లీష్ అనువాద సంకలనాన్ని ప్రచురించారు.

2015లో వెలువరించిన కొత్తసాలు అనే కవితా సంకలనంలో 60 మంది కవుల కవితలను ఫొటో, చిరునామాలను అందించడం ఒక గొప్ప విశేషం. అలాగే మట్టి ముద్ర అనే కవితా సంకలనాన్ని శ్రీ దుర్ముఖినామ ఉగాది 2016 సందర్భంగా ప్రచురించారు. ఇందులో 64 మం ది కవులతోపాటు వారందరి ఫొటోలు, చిరునామాలు కూడా ప్రచురించడం నిజంగా ఎంత అబ్బురమో. అలాగే స్వేదభూమి అనే గ్రంథం 2017 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవుల అక్షర నీరాజనంగా 66 కవుల కవితలతో వెలువరించారు. హేవళంబి నామ ఉగాది కవిత్వం తల్లి వేరు అనే గ్రంథంలో సంకలించారు. ఇందులో 47 మంది కవుల కవి సమ్మేళనం పొందుపరిచారు. అలాగే నయాసాల్ అనే పేరుతో 2017లో 59 మంది కవితలను హిందీలోకి అనువదించి తీసుకురావ డం జరిగింది. ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఎందరో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా డైరెక్టర్లుగా వచ్చారు, వెళ్లారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అందివచ్చిన అవకాశాలను ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలో అంత విరివిగా విస్తరించడం జరుగుతున్నది. ఈ చరిత్రను తర్వాతి కాలంలో ఇదేస్థాయిలో నిలుపుకోవడం దానికదే ఒక గొప్ప విశే షం. ఈ కృషి దానికదే ఒక జాతీయస్థాయి రికార్డు. డెభ్భై ఏండ్ల స్వాతంత్య్రానంతర తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఈ కృషిలో మరికొన్ని జోడించకపోతే భాషా సాంస్కృతికశాఖ కృషిని అసమగ్రంగా చెప్పినట్టవుతుంది. కల్చర్ ఆఫ్ యెమిటీ పేరిట హైదరాబాద్‌లోని దర్గాల గురించిన చక్కని ఫొటోలతో ప్రచురించిన పుస్తకం జాతీయస్థాయిలో నాటకోత్సవాలను రవీంద్రభారతి వేదికపై ఘనంగా నిర్వహించడం కళాకారులను సత్కరించడం, జానపద కళలతో పాటు మిమిక్రీ మైవ్‌ు, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం ఆధునిక తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించిన ప్రదర్శనలు మరుగునపడిన చరిత్ర, సంస్కృతి వెలికితీస్తూ రచించిన దృశ్యరూపకాలను, రాష్ట్రవ్యాప్తంగా రవీంద్రభారతితో పాటు ప్రదర్శింపజేయడం మొదలైనవి మన చరిత్రను మనం, మన సంస్కృతిని మనం గర్వించేలా తీర్చిదిద్దడం గత నాలుగేండ్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి సారాంశం. 

గతంలో ఇలాంటిది ఊహించి ఉండలేదు. కలలు మాత్రం కన్నాం. ఆ కలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజన్ ఉన్న నాయకత్వం, సలహాదారులు, ప్రభుత్వ కార్యదర్శులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ల, తదితరుల సమిష్టి కృషి, కమిట్‌మెంట్ వల్లనే సాధ్యపడుతున్నది. ఈ కృషి మరింత విస్తృతంగా కొనసాగడం అవసరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ప్రారంభమైన దశ దిశల విస్తరించిన తెలంగాణ భాషా సాంస్కృతిక కృషి రేపటితరాలకు మార్గదర్శనంగా నిలుస్తుంది. ఇందుకు కృషిచేసిన, సహకరించిన, జీవితాలను అంకితం చేసిన అధికారులకు, కళాకారులకు, రచయితలకు, దర్శకులకు, నటులకు, నేపథ్యంలో కృషిచేసిన వారికి, గాయకులకు అందరికి ఒకసారైనా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పకపోతే కడుపు నిండదు. భాషా సాహిత్య సాంస్కృతిక కళాదృష్టి దృక్పథం లేని, వాటి ప్రాధాన్యం గుర్తించని నాయకత్వం ఉంటే ఇవి వాస్తవరూపం ధరించడం కాదు కదా ఊహించడమే కష్టం. 

(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)

Harikrishna Mamidi , Telugu Culture 

#తెలంగాణ #Telangana #Culture #TelanganaCinema #కేసీఆర్_విజన్
#KCRVISION
#RavindraBharathi
#రవీంద్రభారతి #తెలంగాణ_ప్రభుత్వ_భాషా_సాంస్కృతిక_శాఖ #కళాభవన్

https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=496129

నవ తెలంగాణ సినిమా



           నిజానికి తెలంగాణ సినిమాకు తెలుగు సినిమాకున్నంత చరిత్ర ఉంది. ఇక్కడ 1922లోనే సినిమా నిర్మాణం మొగ్గ తొడిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రూపొందిన సినీ కళకు గ్రహణం పట్టి ఆంధ్రాప్రాంత సినిమాదే ఆధిపత్యంగా మారింది. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ సినిమా కూడా జూలు విదిల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మన సినిమా భవిష్యత్‌ను ఆవిష్కరించే ప్రయత్నమే ఇది....

మొదటినుంచీ సినీ నిర్మాతలు, దర్శకులు, జర్నలిస్టులు అందరూ కూడా ఆంధ్రాప్రాంత తెలుగు సినిమాని హైలెట్ చేసే వ్యూహంలో భాగంగా తెలంగాణ సినిమా, దాని చరిత్రను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. ఒకదశలో ఆంధ్రాప్రాంత సినిమాలతోనే తెలుగు సినిమా, తెలంగాణ సినిమా కూడా ఆవిర్భవించిందనే అవాస్తవిక నమ్మకాన్ని కలిగించారు. కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నం. హైదరాబాద్ స్టేట్‌కాలంనాటి చారిత్రక ఆధారాలను, 19వ శతాబ్దపు ఉత్తరకాలంనాటి రికార్డులను పరిశీలిస్తే మరుగున పడ్డ ఎన్నో నిజాలు బయటపడ్డాయి. అందులో ప్రధానమైనది.. హైదరాబాద్ కేంద్రంగా స్వాతంత్య్రానికి పూర్వమే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సినిమా జయకేతనం ఎగురవేసిందనేది కూడా ఒకటి!

తొలిదశ తెలంగాణ సినిమా
తెలుగులో తొలిమూకీ సినిమా భీష్మ ప్రతిజ్ఞను రఘుపతి వెంకయ్య తీసినకాలంలోనే అంటే 1921లోనే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా సినీకళ ఆరంభమైంది. అదే యేడు ఇక్కడ ధీరేన్ గంగూలీ ఇంగ్లండ్ రిటర్న్ అనే మూకీ సినిమాను తీశారు. జన్మతః బెంగాలీ అయిన ధీరేన్ నిజాంకాలేజ్‌లో ఆర్ట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరి తన చొరవతో అప్పటి నైజాం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంగ్లండ్ రిటర్నే కాకుండా ఇంకెన్నో చిత్రాలు తీశాడు. అలా 1922లో ఆయన ది లేడీ టీచర్ పేరిట పూర్తిగా హైదరాబాద్‌లోనే ఓ సినిమా తీశాడు. ఆ తర్వాత 1923లో ది స్టెప్ మదర్, చింతామణి, యయాతి వంటి పది సినిమాలు నిర్మాణమయ్యాయి. అది మొదలు ఓ పదేళ్లపాటు మూకీ సినిమాల నిర్మాణం, ప్రదర్శన విస్తతస్థాయిలోనే జరిగింది కానీ 1935 తర్వాత వేర్వేరు కారణాలవల్ల తెలంగాణ సినిమా వెనుకంజ వేసింది.

మలిదశ తెలంగాణ సినిమా
1935 తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల కాలం అంటే 1974 వరకూ తెలంగాణ సినిమా అంతగా నిర్మాణంకాలేదు. 1974లో శ్యామ్‌బెనెగళ్ అంకూర్ తో జాతీయ స్థాయిలో, 1975లో చిల్లర దేవుళ్లు తో రాష్ట్రస్థాయిలో తెలంగాణ సినిమా తన ఉనికిని చాటి ప్రత్యేకతను నిలుపుకున్నది. ఆ తర్వాత వచ్చిన మా భూమి, రంగులకల, దాసి, కొమురం భీమ్, విముక్తికోసం, మట్టి మనుషులు వంటి సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కేవలం తెలంగాణ సినిమాకే కాక మొత్తం భారతీయ సినిమాకే పేరు ప్రఖ్యాతులను సాధించిపెట్టాయి. 1998లో వచ్చిన హైదరాబాద్ బ్లూస్ వంటి సినిమాలతో భారతీయ సినిమాలోనే హింగ్లీష్, క్రాసోవర్ అనే సినిమా జానర్ మొదలై అనంతరం అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ వంటి హైదరాబాద్ సినిమాగా ఎదిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమయ్యాక ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తితో తీసిన సినిమాలు మెయిన్‌స్ట్రీమ్ తరహాలో రూపొంది ప్రజలను చైతన్యవంతం చేశాయి.

కథలకు, టాలెంట్‌కు కొదవలేదు
ఎంతో చారిత్రక నేపథ్యం, భౌగోళిక వైవిధ్యం, భిన్న జీవన సంస్కతి ఉన్న తెలంగాణలో సినిమాకు అనుగుణమైన కథలకు కొదవలేదు. అలాగే ఇటీవలికాలంలో టాలీవుడ్, బాలీవుడ్‌లలో రాణిస్తున్న సినీకళాకారులు, రచయితలు, దర్శకులలో తెలంగాణవారు కూడా రాశిపరంగా, వాసిపరంగా కూడా మెండుగానే ఉన్నారు. ఇంకాచెప్పాలంటే ప్రస్తుత మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ తెలుగు సినిమాల్లో తెలంగాణ రచయిత, దర్శకుల ప్రమేయంలేని సినిమా ఏదీ లేదనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఆ లెక్కన సినీ సజనలో సమకాలీన తెలంగాణ యువ దర్శక, రచయితలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు మంచి ఊపుమీదున్నారనే చెప్పాలి. అయితే వీరిలో ఎక్కువమంది మెయిన్‌స్ట్రీమ్ తెలుగు సినిమా ప్రభంజనంలో పడిపోయి ఆ ఒరవడిలోనే సినిమాలు రాస్తున్నారు, తీస్తున్నారు.

ఇప్పుడు వీరి దష్టిని, వీరి ఆలోచనా సరళిని తెలుగు సినిమాల మీదినుంచి తెలంగాణ సినిమాల దిశగా మళ్లించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ నేపథ్యం, భాష, యాస, కథావస్తువులతో తెలంగాణ సినిమాలను కమర్షియల్ తరహాల్లోనే అయినా విస్తతం చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకులు, రచయితలు, కళాకారులు, గీత రచయితలు ఇంకా ఆంధ్రా ప్రాంత తెలుగు సినిమాల్లో స్థానం కోసం వెంపర్లాడడం మానాలి. అందులోంచి విముక్తి పొంది తెలంగాణ సినిమాకోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన సమయం ఇదే!

తెలంగాణ సినిమా ప్రత్యేకత
ఇప్పటివరకు వచ్చిన తెలంగాణ సినిమాలు తెలంగాణ సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. తెలంగాణ సినిమాల్లో కథ, నాయకులు, వస్తువు అన్నీ సామాన్య ప్రజల వైపునే నిలిచాయి. అట్లాగే అభూతకల్పనలు, అవాస్తవిక సన్నివేశాలతో కూడిన కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, ఆర్ట్/ పాపులర్ సినిమాలను తెలుగు గడ్డమీద బతికించిన ఘనతనూ సొంతం చేసుకున్నాయి. మరోవైపు 1990 దశకం నుంచి తెలంగాణ సినిమా అంటే నక్సలైట్ కథావస్తువుల సినిమానే అనే పరిమిత దష్టిని సోకాల్డ్ టాలీవుడ్ వర్గాలు ఏర్పర్చాయి. కానీ ఈ పరిమిత దష్టికన్నా విస్తత క్యాన్వాస్ తెలంగాణ కథలది. ఆ దిశగా ఇప్పుడు మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సందర్భం వచ్చింది. 

విజన్‌తో కూడిన మిషన్

1.మన రాష్ట్రం, మన పాలన సాకారమైన ఈ వేళ తెలంగాణ సినిమా అభివద్ధి కోసం నిర్దిష్టవ్యూహంతో ప్రభుత్వం, ప్రజలు, సినీరంగ కళాకారులు, దర్శకులు, రచయితలు, పెద్దలు ముందుకు వెళ్లడం తక్షణ కర్తవ్యం. దీనికోసం ఓ స్పష్టమైన విజన్‌ని మిషన్ స్థాయిలో తీసుకెళ్లాలి. తెలంగాణ సినిమా విస్తరణ, వికాసం కోసం దానికి భవిష్యత్తులో ఉన్న అవకాశాల గురించి ప్రభుత్వం ఓ విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. దీనికోసం ప్రఖ్యాత దర్శకులు బి. నరసింగ్‌రావు, శ్యామ్‌బెనెగళ్ వంటివారి నేతత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పరిచి ఓ విజన్ డాక్యుమెంట్‌ని రూపొందించాలి. 
2.జాతీయస్థాయిలో నేషనల్ ఫిలిండెవలప్‌మెంట కార్పొరేషన్ లాగా తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఔత్సాహిక దర్శకులు, రచయితలు తీసే లోబడ్జెట్ సినిమాలకు ఆర్థికసాయం అందించే పథకాలను ఆరంభించాలి. 
3.పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ తరహాలో తెలంగాణ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించాలి. వీలుంటే ఎఫ్‌టీఐఐతో అనుసంధానం చేయడం మంచిది. ఈ సంస్థలో సినిమాస్క్రిప్ట్ రచన నుంచి మొదలు దర్శకత్వం, ఎడిటింగ్, నటన వంటి అన్ని క్రాఫ్ట్‌లపై డిగ్రీస్థాయి శిక్షణనివ్వాలి. 

4.ఇటీవలికాలంలో కాలేజ్ యూత్ షార్ట్ ఫిలింస్‌ని, డాక్యుమెంటరీస్‌ని విస్తతంగా తీస్తున్నారు. ఈ యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం స్థాయిలో ప్రతియేటా షార్ట్‌ఫిలిం డాక్యుమెంటరీ కాంపిటీషన్స్‌ని నిర్వహించాలి. అలాగే ఎంపిక చేసిన వాటిని ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పించాలి. అయితే ఈ దిశగా ఇప్పటికే అల్లాణి శ్రీధర్ తెలంగాణ థీమ్‌తో షార్ట్ ఫిలిం కాంపిటేషన్‌ని ప్రకటించాడు. ఇది అభినందించదగ్గ విషయం. ఇలా వ్యక్తిపరంగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వపరమైన తోడ్పాటు, ఓ వ్యవస్థ అండగా ఉంటే మరింత ప్రాచుర్యంలోకి వస్తుంది. 
5.కనీసం రెండేళ్లకోసారైనా తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF)ని నిర్వహించి ఈ ఫెస్టివల్ విదేశాలలోని ఉత్తమ చిత్రాలను ఆహ్వానించి తెలంగాణ సినీ సజనకారులకు వరల్డ్ సినిమాతో ఎక్స్‌పోజర్‌నిచ్చే అవకాశాన్ని కల్పించాలి. దీంట్లో తెలంగాణ సినిమా పేరిట రెట్రాస్పెక్టివ్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఎంపికచేసిన తెలంగాణ సినిమాలను ప్రదర్శించి వాటికి ప్రపంచస్థాయి మార్కెట్‌ను క్రియేట్ చేయాలి. 
6.తెలంగాణలో సినిమాల నిర్మాణానికి ప్రత్యేకమైన రాయితీలు, సబ్సిడీలు, వినోదపన్ను మినహాయింపును ఇవ్వాలి. 
7.జిల్లాస్థాయిలో ఫిలింసొసైటీలు, యూనివర్శిటీ, డిగ్రీ స్థాయిల్లో ఫిలింక్లబ్‌లను ఏర్పాటు చేయాలి. ఈ మేరకు కరీంనగర్ ఫిలింసొసైటీతరహాలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటుచేయాలి.
8. తెలంగాణ సినిమాలకు ప్రతి దసరాకు అవార్డులను (నంది, జాతీయ అవార్డుల తరహాలో)అందిచండం ఆరంభించాలి. 
9.దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన తెలంగాణవారు ఇద్దరున్నారు. శ్యామ్‌బెనెగళ్, పైడిజైరాజ్. వీరి జన్మదినాన్ని లేదా మరేదైనా ప్రత్యేకదినాన్ని తెలంగాణ సినిమాదినోత్సవంగా ప్రకటించి ఆరోజు ప్రత్యేకకార్యక్రమాల రూపకల్పన చేయాలి!

మన భాషా సాంస్కృతిక పునర్నిర్మాణం లో కొత్త సాలు








FOLKS, here its d story on the endeavours put by our Department of Tsdirector Culture, after my assumption of charge, published in BATUKAMMA, sunday supplement of NAMASTHE TELANGANA, 27 Dec, 2015.. Thank u Katta Shekar Reddy anna
మన భాషా సాంస్కృతిక శాఖ పునర్నిర్మాణంలో కొత్త సాలు 
- మధుకర్ వైద్యుల

కొత్తసాలు వస్తున్న క్రమంలో రాష్ర్టావతరణ తొలిపొద్దు నుంచి నేటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వేసిన పాదు తంగేడు వనంగా ఎదగడానికి ఆ శాఖ చేసిన కృషి ఎంతో ఉంది.
ఎక్కడైతే భాషా సంస్కృతులు పరిఢవిల్లు తాయో ఆ ప్రాంతం సుసంపన్నంగా ఉంటుంది. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో మన అస్తిత్వం కనిపించేలా భాషా సాంస్కృతిక శాఖ పనితీరు ఉండాలి. 

ఇంకా చెప్పాలంటే పునర్నిర్మాణం సోయితో పనిచేయాలి. ఆ లక్ష్యసాధనలో వేసే ప్రతి అడుగు స్వతంత్రంగా, నవ్యంగా సాగాలి. సకల జనులు ఏ ఆశయం కోసం ఉద్యమించారో ఆ ఆకాంక్షలు తీర్చాలి. ఆయా రంగాల్లో కృషి చేసిన కళాకారులు, వైతాళికులు, కవులకు అశేషంగా సబ్బండ వర్ణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ల కళారూపాలను ఆదరించడం, ప్రోత్సహించడం, అభినందించడం కూడా ఒక బాధ్యతే.
తెలంగాణ అంటేనే సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ ప్రతీది ఒక పండుగే. మనిషి అచేతనాన్ని చైతన్య పరిచే శక్తి ఇక్కడి మట్టి, నీరు, గాలికి ఉంది. అందుకే ఈ నేల ఎన్నో కళలకు పురుడు పోసింది. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ కళలుగానే గుర్తింపు పొందాయి.

అందువల్లే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం ఒక భాగమైంది. అందుకే, మన రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు కొత్త జీవం పోసి కళారాధనకు శ్రీకారం చుట్టింది. సమైక్య రాష్ట్రంలో కేవలం 36 కోట్లకు పరిమితమైన సాంస్కృతిక శాఖ బడ్జెట్‌ను ఈ ఏడాది 154 కోట్లకు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఉదారతను చాటుకొంది.

వైతాళికుల స్మరణ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది మొదలు భాషా సంస్కృతి అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇక్కడి సంస్కృతిని, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా మన వైతాళికుల జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతోపాటు వారి పేర్లతో అవార్డులనూ ప్రకటించింది.

కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడంతోపాటు ప్రభుత్వం ఆయన పేరునా పురస్కారాన్ని ప్రవేశపెట్టి తొలిసారి అమ్మంగి వేణుగోపాల్‌కు అందించింది. దాశరథి జయంతి ఉత్సవాలలో దాశరథి పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్యులకు అందజేసింది. వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రం ఏర్పాటుకు 50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్‌లో 14 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో తెలంగాణా కళాభారతి నిర్మాణం చేపట్టనుంది.

గజ్వేల్‌లోనూ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఆడిటోరియం ఏర్పాటు చేయనుంది. ఇవేకాక ప్రతి జిల్లాలో ఆడిటోరియం, కళాభారతిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొమురాం భీం, పి.వి. నరసింహారావు, ఈశ్వరీ బాయి, కొండా లక్ష్మన్ బాపూజీ వంటి మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్య క్రమాలుగా ప్రకటించింది. 3,254 మంది వృద్ధ కళాకారులకు ప్రతి నెల 1500 రూపాయల పెన్షన్ సౌకర్యం, 550 మంది కళాకారులకు సాంస్కృతిక సారథి కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. 

రాష్ట్ర అవతరణ సందర్భంగా మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉత్తమ పురస్కారాలనూ అందించడం ద్వారా కేసీఆర్ తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 రంగాల వారికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలిచ్చి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని ప్రభుత్వం సత్కరించింది. ఆవార్డుల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది. భారతదేశ చరిత్రలోనే ఇంతలా ప్రజలను గౌరవించుకున్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరేదీ లేదంటే అతిశయోక్తికాదు. ఉగాది వేడుకల్లోనూ 19 అంశాల్లో 28 మందికి 10 వేల చొప్పున అందించి వారిని ఘనంగా సత్కరిస్తూ వారి సేవలను ప్రశంసించుకుంది.

జాతీయ సంస్థలతో సమన్వయం: తెలంగాణ అస్తిత్వాన్ని దేశ నలుమూలలా ప్రసరింప జేయడానికి భాషా సాంస్కృతిక శాఖ చేసిన కృషి గర్వించదగింది. జాతీయ స్థాయి సాంస్కృతిక సంస్థలతో కలసి పనిచేయడం ద్వారా కళలను ఇచ్చి పుచ్చుకునే కొత్త ధోరణికి శ్రీకారం చుట్టింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా నాటకోత్సవాలు నిర్వహించారు. సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు, నార్త్‌ఈస్ట్ కల్చరల్ సెంటర్, దిమాపూర్ కళాకారులతో సాంస్కృతిక వినిమయాన్ని పెంపొందించుకుంటోంది. ఈశాన్య రాష్ర్టాల కళాకారులతో ఆక్చేవ్-2014 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ కళాకారులు వారం రోజుల పాటు దేశ రాజధానిలోనూ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మన సాంస్కృతిక వైభవాన్ని చాటే అవకాశం దక్కించుకున్నారు.

ఇరాన్, తెలంగాణ కళాకారులతో హైదరాబాద్‌లో జుగల్‌బందీ నిర్వహించింది. గతంలో తెలంగాణలో భాగమైన కర్ణాటక, బీదర్ ప్రాంతాల్లో యాదోంకీ బారాత్ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ప్రదర్శనలిచ్చారు. అంతర్రాష్ట్ర సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి గాను కేరళభవన్ నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వడంతో పాటు కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రీజనల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌ఎస్‌డీ ఛైర్మన్ రతన్ థియామ్‌కు అందించడం జరిగింది.

అంతరించి పోతున్న కళలకు జీవం: తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. సమైక్య పాలనలో ఇక్కడి కళలకు సరైన గుర్తింపు లభించకపోవడంతో ఎన్నో కళలు కనుమరుగయ్యాయి. అలా అవసాన దశలో ఉన్న కళలకు కొత్త జీవం పోయడానికి సాంస్కృతిక శాఖ పూనుకున్నది. వరంగల్ జిల్లా శాయంపేట ప్రాంతానికి చెందిన కూనపులి పటం కథ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కథ, దురిశెట్టి రామయ్య కడ్డీ తంత్రి కథ, కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన సాధన శూరుల సాహసాలు వంటివి అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వారి తర్వాత ప్రదర్శన ఇచ్చేవారే లేరు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ఆ కళలను పునరుజ్జీవింప జేసుకునే బృహత్తర కార్యక్రమానికి శాఖ శ్రీకారం చుట్టింది. వీటితోపాటు ఆధునిక కళలైన డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, సినిమాలకు కూడాప్రాధాన్యం ఇస్తున్నారు. 

116 రోజుల నిరంతర తెలంగాణ కళారాధన: భాషా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ నియమితులయ్యాక రవీంద్రభారతి స్థాపించిన 54 సంవత్సరాల చరిత్రలో జరగనటువంటి ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. రాష్ర్టావిర్భావం తర్వాత తెలంగాణ కళారాధన పేరుతో 116 రోజులపాటు నిత్యం కళాప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఈ ఘనతను స్వంతం చేసుకుంది. ఈ ఉత్సవాల్లో బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, సురభి నాటకాలు, మైమ్, మ్యాజిక్, మిమిక్రీ, సలామ్ తెలంగాణ శీర్షికన ఉర్దూ సంప్రదాయ కళలు సూఫీ, ముషాయిరా, ఖవ్వాలి, గజల్స్ ఇలా విభిన్న రకాల కళలను ఒకే వేదికపై ప్రదర్శించడం అద్భుతం. 

చిందు యక్షగాన కళకు కొత్త జవసత్వాలను అందించడానికిగాను నీటి పారుదల శాఖతో సమన్వయం చేసి 129 బృందాలతో మన ఊరు మన చెరువు కార్యక్రమ ప్రచార కళా ప్రదర్శనలు ఇప్పించారు. దీనికోసం చెరువు కథాంశంగా ఒగ్గు కళాకారులకు జనగాం ప్రాంతంలో 9 రకాల కొత్త కథలతో శిక్షణనిచ్చి వారిచే రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ పనులు జరుగుతున్న గ్రామాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సాహిత్యానికి పెద్ద పీట: గతంలో చేయని కార్యక్రమాల్లో భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమం సాహిత్యానికి పెద్ద పీట వేయడం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా మూడు అంశాలపై ప్రత్యేక కవితా సంపుటాలు తీసుకు రావడం ద్వారా తెలంగాణ కవుల పుట్టిల్లు అని నిరూపించే ప్రయత్నం చేసారు. తొలి ప్రయత్నంగా కొత్తసాలు పేరుతో సంకలనాన్ని తీసుకువచ్చింది. బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడువనం పేరుతో కేవలం తంగేడు పువ్వు మీద 166 మంది కవులతో కవితా సంకలనం తీసుకురావడం ప్రపంచ సాహితీ చరిత్రలోనే చారిత్రాత్మక అంశం. ఇక రాష్ట్ర అవతరణను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన మరో సంకలనం తొలిపొద్దు. అత్యధిక కవులు రాసిన కవితా సంకలనం ఇది. 442 మంది కవుల స్పందనకు ఈ సంకలనం ప్రత్యక్ష నిదర్శనం.

మరోవైపు తెలంగాణకు పుట్టినిల్లయిన పేరిణీ నృత్యానికి జీవం పోసే ఉద్దేశ్యంతో నెలరోజుల పాటు పేరిణీ నృత్య కళాకారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. గంగా జమునా తేహజిబ్‌గా పేరు గాంచిన హైదరాబాద్ సంస్కృతికి పెద్దపీట వేసేందుకు గాను ఉర్దూ ముషాయిరా, గజల్స్, సూఫీ సంగీతం ఖవ్వాలీ వంటి ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది.

మేడారం జాతర: వచ్చే ఏడాది నిర్వహించనున్న మేడారం జాతరలోనూ సాంస్కృతిక శాఖ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. జాతర జరుగుతున్నన్ని రోజులు కూడా గిరిజన కళాకారులతో కళా ప్రదర్శనలతోపాటు సురభి కళాకారులు రూపొందించిన సమ్మక్క, సారక్క నాటకాన్ని కూడా ప్రదర్శించనున్నారు.

తెలంగాణ భారతి: హైదరాబాద్ నడిబొడ్డున భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో ఉన్న కళానిలయం రవీంద్రభారతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవీంద్రభారతిలో తెలంగాణ మట్టివాసన వేస్తోంది. తెలంగాణ కళారూపాలన్నీ ఆ వేదికమీద ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతుంటే చల్లని అంబలి తాగినట్టు కడుపు నిండుగుండి ఆకలి ఆమడ దూరం పోతోందంటే అతిశయోక్తి కాదు. 
***************************************************************************
మన రాష్ట్రం-మన పండుగలు
రాష్ర్టావతరణ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం మొదలు నేటివరకు కూడా తెలంగాణ పండుగలన్నింటినీ ఒక సామూహిక ఉత్సవాలుగా నిర్వహించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి భాషా సాంస్కృతిక శాఖ వెన్ను దన్నైంది. రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది వేడుకలతో కనీవినీ ఎరుగని రీతిలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో చౌమల్లా ప్యాలెస్ మొదలుకొని శిల్పారామం వరకు 32 వేదికల మీద కళాప్రదర్శనలు ఇవ్వడం ద్వారా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ ఉత్సవాలకు 20 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించింది.

బతుకమ్మ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిలోని విశిష్టత లన్నింటినీ చాటి చెప్పేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఫొటోగ్రఫీ పోటీలు, చిత్రలేఖనం, సాంస్కృతిక- సాహిత్య వేడుకలు, చిత్రోత్సవం, కవి సమ్మేళనం నిర్వహించింది. బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. కేవలం పూల పండుగగానే కాకుండా మహిళలు, బాలికలు, ప్రకృతి, చెరువుల పండుగగా బతుకమ్మను తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణ జీవన నేపథ్యాన్ని ప్రచారం చేసే అవకాశం దక్కింది.

బోనాలు: హైదరాబాద్‌కే తలమానికమైన బోనాల పండుగను సైతం గతం కంటే వైభవంగా నిర్వహించింది. దీనికోసం 89 దేవాలయాల్లో నెల రోజలపాటు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. గత పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఈ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి ఆత్మగౌరవ ప్రతీకలుగా మలుచుకున్నం.

గోదావరి పుష్కరాలు: తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. గోదావరిని మనం కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం పుష్కరాల ద్వారా దక్కింది. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో పుష్కర వేడుకలను 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పుష్కరాల్లో సోన్, గూడెం, బాసర, పోచంపాడు, కందకుర్తి, ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, రామన్నగూడెం, మంగపేట, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సాంస్కృతిక సారథి బృందాలతోపాటు స్థానిక వృత్తి, జానపద, శాస్త్రీయ కళాకారులచే కళా ప్రదర్శనలు, భక్తి సంగీత కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక ప్రచారానికి పెద్ద పీట వేసింది.

జానపద జాతర: అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న చిందు ఎల్లమ్మకు జన్మనిచ్చిన నిజామాబాద్ నుంచి మొదలుపెట్టి పది రోజుల పాటు తెలంగాణ జానపద జాతర పేరుతో పది జిల్లాల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఆగస్టు 30న హైదరాబాద్‌లో ముగింపు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది.


Interview with Palapitta

folks, here its my interview published in PALAPITTA magazine December, 2017 issue..
‘అక్షరం నాకు మా అమ్మ ఇచ్చిన వరం’!

“ప్రపంచ స్థాయి సాహిత్యం వెలుగులు సంతరించుకున్న తెలంగాణ సాహిత్యం”

మామిడి హరికృష్ణ గారు నిరంతర అన్వేషి.  అధ్యయనశీలి.  ఒంటరి బాటసారిలా సాగుతూ ఇలకోయిల పాటలా పరిమళమై అందరినీ చేరే సహృదయశీలి.  భాషా సాంస్కృతిక సంచాలకులుగా రోజూ 15, 16 గంటల పాట్లు బాధ్యతలు నిర్వహిస్తూనే కళలను శ్వాసించే సృజనాశీలి.  పోయెట్రీ, పెయింటింగ్, ఫిలాసఫీలను మూవీస్, మ్యూజిక్, మేగజైన్లు కలిపితే అది మామిడి హరికృష్ణ అవుతారు అని చమత్కారంగా చెబుతూ సాగే బహుదూరపు బాటసారి!
 మూడేళ్ళ కాలంలో కళాకారులకు ఆప్తుడుగా, భాషకు బాసటగా తెలంగాణ సినిమాకు స్నేహ హస్తం చాపిన అందరి ఆత్మీయుడు. సౌందర్యారాధకుడు. సౌందర్య పిపాసి.!
  పాతికేళ్ళుగా మూతపడిన రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్ ని కొత్త వెలుగులతో ‘పైడి జయరాజ్’ ప్రివ్యూ థియేటర్ గా మార్చినా, కళా ఉత్సవాలకు కొత్త ఊపిరి పోసినా, భాషా సాంస్కృతిక శాఖను దేశంలో అగ్రగామిగా నిలిపినా ఆ ఖ్యాతి తెలంగాణ నేలది అని వినమ్రంగా చెప్పే ఈ సృజనశీలి రాబోయే ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని ‘పాలపిట్ట’ తో  మనసులోని మాటను విహంగంలా రెక్కలు విప్పి పాలపిట్టంత అందంగా పంచుకున్నారు. వారి ఆలోచనల అంతరంగాన్ని అక్షరతోరణంగా అందిస్తున్నాం...
 
హరికృష్ణ గారూ, రవీంద్రభారతి రెండవ ఫ్లోర్ లో మీరు ‘పైడి జయరాజ్’ ప్రివ్యూ థియేటర్ గా తీర్చిదిద్దారు.  సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది.  దాని గురించి చెప్పండి...

రవీంద్రభారతి 1961 లో ఏర్పాటయింది కదా.  ఇదే సెకండ్ ఫ్లోర్ లో ప్రివ్యూ థియేటర్ నిర్మించి 1982 varaku సినిమాలు ప్రదర్శించే వారట! తర్వాతి కాలంలో దాన్ని ఉపయోగించడం మానేశారు.  సినిమా అనేది సంస్కృతిలో అంతర్భాగం కాబట్టి రవీంద్రభారతిలో శాస్త్రీయ, జానపద నృత్యాలతో పాటు సినిమాను కూడా ప్రదర్శిస్తే బావుంటుందని ఆలోచించినప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్ గుర్తుకొచ్చింది.  24 ఏళ్ళ క్రితం మూతబడిపోయిన ఈ ప్రదేశాన్ని తిరిగి ఒక కొత్త శోభనిచ్చే ప్రయత్నం చేశాం.  ‘బతుకమ్మ’ ఫిలిం ఫెస్టివల్ ని 2015 లో నిర్వహించినప్పుడు కొంచెం శుభ్రం చేసి యంగ్ ఫిలిం మేకర్స్ తో పది రోజుల పాటు బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్ చేశాం.  అలా సినిమాకు వేదికగా దీన్ని తయారు చేయాలన్న ఆలోచనకు అంకురార్పణం జరిగింది.  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.  చక్కటి ప్రొజెక్టర్, dolby surround system, 150 మంది చూసేందుకు వీలుగా వసతి, అనువైన స్క్రీన్ ఏర్పడడానికి రెండేళ్ళు పట్టింది.  25 ఏళ్ల తర్వాత రవీంద్రభారతిలో పూర్తి స్థాయిలో సినిమాల ప్రదర్శన మొదలయింది.

ఈ ప్రివ్యూ థియేటర్ కు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించినప్పుడు ‘పైడి జయరాజ్’ పేరు తప్ప మరో పేరు గుర్తుకురాలేదు.  కరీంనగర్ నుంచి 1920 – 30 లలో బొంబాయికి వెళ్లి 50 కి పైగా చిత్రాలలో కధానాయకుడిగా నటించిన తెలుగువాడు.  తెలంగాణ బిడ్డ.  ఒక విస్మృత నటుడు.  మన భారత ప్రభుత్వం గుర్తించింది కానీ, సినిమా ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు.  వారికి నివాళిగా ఈ ప్రివ్యూ థియేటర్ కు వారి పేరు పెట్టాలని ప్రభుత్వం G.O. కూడా విడుదల చేసింది. 

2017 సెప్టెంబర్ 22వ తేదీన ‘బతుకమ్మ’ ఉత్సవాలలో భాగంగా గౌరవ మంత్రివర్యులు ఈ థియేటర్ ను ప్రారంభించారు.  కొత్త తరం వారికి, కొత్త ఆలోచనలున్న యంగ్ జనరేషన్ కు ఫిలిం మేకర్స్ కు, డాక్యుమెంటరీ నిర్మాతలకు ఇదో వరం. ఉచిత స్క్రీనింగ్ సౌకర్యాన్ని మేం కల్పిస్తున్నాం.  దర్శకులు శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి, సంకల్ప రెడ్డి, హాస్యనటులు శ్రీనివాస రెడ్డి లాంటి వారందరూ వచ్చారు.  వారందరూ ఆశ్చర్యపోయారు.  ఒక informal film training institute చూసిన అనుభూతి కలిగిందన్నారు.  నాకు మళ్ళా Howard Film Institute గుర్తుకొస్తోందని శేఖర్ కమ్ముల అన్నారు.  సినిమా మేకింగ్ కు సంబంధించి, టెక్నిక్కు సంబంధించి ఒక మేథో మధనం జరగాలని అనుకుంటా వుండే వాడిని.  అలాంటి స్పేస్ ఉండాలని అనుకునే వాడిని.  ఈ ప్రివ్యూ థియేటర్ ఆ లోటు భర్తీచేసిందని అర్జున్ రెడ్డి, సందీప్ రెడ్డి చిత్ర దర్శకులు అన్నారు.   

న్యూవేవ్ చిత్ర నిర్మాతలకు, దర్శకులకు ‘సినివారం’ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఒక కొత్త గాలికి, కొత్త తరానికి ఆహ్వానం పలుకుతున్నాయి.  ఇదంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లోంచి పుట్టిందని చెప్పటానికి నాకెంతో సంతోషంగా వుంది.  సినిమా రంగంలో తెలంగాణ ప్రతిభను చాటేందుకు ఇదో అడుగుగా నేను భావిస్తున్నాను.  ఒక్క ప్రదర్శనలే కాకుండా టీజర్స్ లాంచ్, సినిమా పోస్టర్ల ఆవిష్కరణ, సినిమా పుస్తకాల ఆవిష్కరణ... ఇలా వీటన్నింటికీ ఇప్పుడీ ప్రివ్యూ థియేటర్ ఒక వేదికగా నిలుస్తోంది.  Main Stream సినిమాకు ప్రత్యామ్నాయ వేదికగా ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ నిలుస్తోందని మాత్రం చెప్పగలను.  సినివారంలో ఈ దాదాపు 160 మంది దర్శకుల కొత్త చిత్రాలను, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలను మేం ప్రదర్శించాం.  ఒక్క ఆస్కారే కాకుండా బెర్లిన్, కొరియన్, చైనీస్ ఫిలిం ఫెస్టివల్స్ వంటి వాటిపై నాకు అవగాహన వుంది.  ఇంకా కేన్స్ బ్రిటిష్ ఫిలిం ఫెస్టివల్ ఇలా ఎన్నో వున్నాయి.  ఆ pattern అనుసరించే ప్రయత్నం చేస్తాం. 

ముందుగా ఫిల్మ్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఫిల్మ్ crew వేదిక మీదకు వస్తారు. అప్పుడు వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.  అందులో సినిమా మేకింగ్స్, సీనిక్ ఆర్డర్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ ఇలా ఎన్నో అంశాలపై చర్చ వుంటుంది.  అనంతరం ‘అతిధి దేవో భవ’ అన్నది మన తెలంగాణ సాంప్రదాయం.  వాళ్ళని సత్కరిస్తాం కూడా.  పెళ్లిచూపులు దర్శకులు తరుణ్ భాస్కర్ కి తొలి సన్మానం జరిగిందీ ఇక్కడే.  ఈ 160 మంది దర్శకులనీ శాలువాతో సత్కరించి, మొమెంటో యిచ్చి గౌరవించడం జరిగింది. 

ప్రశ్న : సినిమాపై మీకు మంచి అవగాహన, పరిజ్ఞానం వున్నాయి.  కొన్ని డాక్యుమెంటరీలు మీరూ తీశారు కదా ...

దాదాపు 150 కి పైగా డాక్యుమెంటరీలు తీశాను.  జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు రావూరి భరద్వాజ గారితో మొదలుకొని, ‘విశ్వంభరుడు’ అనే పేరుతో డాక్టర్ సి.నారయణరెడ్డి గారి పై కూడా తీశాను.  ఇలా ఎన్నో ... ఇంకా వందేళ్ళ భారతీయ చిత్రంపై 60 – 70 ఎపిసోడ్లుగా వివిధ భాషల చిత్రాలపై డాక్యుమెంటరీలను ప్రొడ్యూస్ చేశాను.  క్లాసిక్ సినిమాలను, గొప్ప ఫిల్మ్ పర్సనాలిటీస్ ని పరిచయం చేస్తూ కొన్ని డాక్యుమెంటరీలు.  ఇవన్నీ వివిధ ఛానళ్ళు స్క్రీన్ చేశాయి.  script writing, editing, direction నేనే చేశాను. 

ప్రశ్న : పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఎంట్రన్స్ లో మీరు ప్రపంచ సినిమాను ప్రతిబింబించే ఒక ‘collage’ రూపొందించారు.  అదే విధంగా లోపల కూడా చిత్రమాలిక, వివిధ ప్రముఖుల కొటేషన్లు దర్శనమిస్తాయి.  మీ అభిరుచికి దర్పణంగా ఇలాంటి ప్రివ్యూ థియేటర్ మరోటి ఉందా అనిపిస్తుంది.  అంటే ఒక ప్రభుత్వ శాఖ ఈ స్థాయిలో ఏర్పాటు చేసిందా అని ...

లేదు. ఇలాంటి ప్రివ్యూ థియేటర్ మరోటి లేదు. షార్ట్ ఫిలిమ్స్ కోసం, డాక్యుమెంటరీల కోసం, అమెచ్యూర్ ఫిల్మ్ మేకర్స్ కోసం అసలు లేదు.  Its first of its kind in the country.  మంచి మూవీలు అనగానే గుర్తొచ్చే బెంగాల్, కేరళలలో కూడా లేదు.  కేరళలో నాకు మంచి మిత్రులున్నారు.  నేను మలయాళం నేర్చుకున్నాను.  మలయాళంలో రాస్తాను.  అందువలన పరిచయాలు కూడా ఎక్కువే.  కేరళ ఫెస్టివల్స్ ఇక్కడ చేశాను.  వ్యక్తిగతంగా, డైరెక్టర్ గా, ఇది ఒక్క తెలంగాణలోనే, హైదరాబాద్ లోనే సాధ్యమయింది.  తెలంగాణ ప్రభుత్వం పూనికతో మా కల్చరల్ డిపార్టుమెంటుతో జరిగింది. 

ప్రశ్న :  హరికృష్ణ గారూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆఫీసు పనుల్లో తలమునకలవుతూ మీ personal space ని కాపాడుకుంటూ సినిమా, సాహిత్యం, పెయింటింగ్ వంటి మీకు నచ్చిన అంశాలలో చేయగలిగినవి చేస్తూ energy unbound అన్నట్టుండే మీ ఉత్సాహం వెనక రహస్యమేమిటి ?

నాకు మొదట్నించి ఉన్న వరమేమిటంటే మా అమ్మ నాకిచ్చిన అక్షరం.  అమ్మ వెళ్ళిపోయింది గానీ అక్షరాన్ని నాకు తోడుగా వుంచి వెళ్ళింది.  అప్పటినించి అక్షరమంటే ప్రేమ, తృష్ణ ఏర్పడ్డాయి.  నాకు మొదట చలంతో పరిచయం 9వ తరగతిలో ఏర్పడింది.  ఈనాడు ఆదివారం టాబ్లాయిన్ లో చలం మీద నిమగడ్డ వెంకటేశ్వర రావు ‘చలం – స్మశాన సాహిత్యం’ వ్యాసాలూ వచ్చేవి.  అర్ధం కాకపోయినా చదవటమే నాకు తెలిసింది.  అక్షరమంటే అంత ప్రేమ.  మాది వరంగల్ దగ్గర శాయంపేట.  నాన్న ‘BAMS’ లో డాక్టర్.  ఎప్పుడూ పుస్తకాలు తెస్తూండేవాడు.  తాతది వందల ఎకరాల్లో వ్యవసాయమున్నా ఇంట్లో చదువుకునే వాతావరం ఉండేది.  మా ఊళ్ళో మొదటి బంగ్లా కట్టింది మా తాత.  ఆయన పేరు బంగ్ల వెంకట రాజం అని స్థిరపడిపోయింది.  మాకు కచ్చరముండేది.  ఊళ్ళో తొలి రేడియో మా ఇంట్లోనే.  ఇక మా నాన్న డాక్టర్ అవటం వల్ల అందరితోనూ మమేకమయిపోయేవాడు.  మా అమ్మకి సేవే దైవం.  మా అమ్మకి కొనసాగింపు నేను.  చదువు మీద, పుస్తకం మీద, ఆలోచన మీద, జ్ఞానం మీద ఇంత తృష్ణ రావడానికి కారణం మా అమ్మ.  ఆమె చదివేది, నేను చదివేది, నాతో చర్చ పెట్టేది.  నాకు మా పెద్ద చెల్లాయికి 8 సంవత్సరాల అంతరం వుంది.  ఆ ఎనిమిదేళ్ళు మా అమ్మ నాతోనే, నేను మా అమ్మతోనే. మా చిన్న ప్రపంచం అలా ఉండేది.  పదో తరగతి వచ్చే వరకు శరత్ తెలిశాడు.  ఇంటర్మీడియట్ వచ్చే సరికి నన్నయ్య మహాభారతం, పాల్కు బసవపురాణం, అల్లసాని పెద్దన స్వారోబషమను సంభవం వంటివి చదవగలిగాను.  సిలబస్ కు పరిమితం అయిపోవటం నాకు ఇష్టముండదు.  నేను out of SYLLABUS లో వెళతాను.  నేనో విధ్వంసవాదిని (నవ్వు).  I am an iconoclast.  జీవితం విషయంలో నిబద్ధత ఉండాలి.  జ్ఞాన సమపార్జన విషయంలో చట్రాలు ఉండకూడదని నా నమ్మకం.  నాలో ఆ స్పష్టత వుంది.  చిగురు కనిపించే చెట్టుకు ఎన్నో ఏళ్ళ వేళ్ళు ఉన్నట్టే నాలోని యిప్పటి comprehensive outlook పునాది ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడ్డదే. ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ప్రాచీన సాహిత్యంతో పాటు తకళ్ శివశంకర్ పిళ్ళై, బిభితిభూషణ్ బందోపాధ్యాయ , పన్నాలాల్ పటేల్, హరిప్రీత్ సింగ్, మాస్తి వెంకటేశ అయ్యంగార్ ఇలా అన్ని బాషల సాహిత్యాన్ని చదివే అవకాశం దక్కింది.  అయినా ఆ దాహం తీరేది కాదు.  యిప్పటికీ కొనసాగుతోంది.  డిగ్రీ చదివేటప్పటికి ఆక్టేవియాపాజ్ పరిచయం.   పరిచయం మంటే ఆక్టేవియాపాజ్ కవితల్ని తెలుగులోకి అనువాదం చేశాను.  తోమస్ ట్రాన్స్ తోమర్ ని కూడా. 1986 ప్రాంతంలో భోపాల్ లో కవితోత్సవం జరిగింది.  దాని మీద ఆంధ్రజ్యోతిలో వ్యాసాలూ సిరీస్ గా వెలువడ్డాయి.  అవి చదువుతున్నప్పుడు మనో నేత్ర దృష్టి ప్రపంచ సాహిత్య గవాక్షం వైపు మళ్ళింది.  ఒక మేర ప్రపంచ సాహిత్య చదివాను.  ఓలే  సోయంకా, టోనీ మోరిసన్, నోర్డిన్ గోల్డ్ మర్ ఇలా ఎంత మందినో చదివాను.  మార్క్వెజ్, సల్మాన్ రష్దీల మేజిక్ రియలిజం ప్రభావితం చేశాయి.  ఆల్బర్ట్ కేమూ, కాఫ్కా, సోమర్ సెట్ మామ్ లను ఎలా మర్చిపోతాం.  నిజం చెప్పాలంటే నేను వాళ్ళతోనే జీవిస్తున్నా.  క్లాసి శిష్ట్, మోడర్నిష్టులు, కంటెంపొరరీ ఎవరినీ వదలడం నాకిష్టముండదు.  ‘బందిపోట్లు’ రాసిన సావిత్రిని, ‘my stories’ కమలాదాస్, సెకండ్ సెక్స్ రాసిన సైమన్ డిబోవాని అంతే ప్రేమగా చదువుతా.  ఇంత చదవటం వలన విషయ విస్తృతి పెరిగి విస్తారమయిన అవగాహన ఏర్పడటానికి దారితీసింది.  నా  తాత్విక పునాదికి వీరంతా కారణం.  నేను చదివిన, నాకెదురయిన నేను చూసిన జీవితమే ఒక నేను. పెయింటింగ్ కూడా బాగా ఇష్టం.  నా స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ వేస్తాను.  పెయింటింగ్ మీద విస్తృతమయిన స్టడీ చేశాను.  ఫోటోగ్రఫీ, పెయింటింగ్, ఆర్కిటెక్చరు వీటి మీద Encyclopedia of Visual Arts అని 28 వాల్యూమ్స్ వున్నాయి.  ఏ పేజీలో ఏముంది అంటే చెప్పగలుగుతా.  నియోండర్తల్ కాలం నాటి Cave Paintings మొదలుకుని ఇప్పుడు ఆధునిక కాలం నాటి Existential Paintings వరకు impressionism, dadaism, surrealism, expressionism .... విన్వెంట్ వానో గోగ్, రఫెల్, డావిన్సీ, రినోయిర్ వీళ్ళందరి పద్ధతుల నుంచి జతిన్ దాస్ లు మన దామెర్ల రామారావులు, మన కొండపల్లి శేషగిరి రావులు, ఏలె లక్ష్మణ్ లు .... ఎంత విస్తృతమయింది ప్రపంచం అనిపిస్తుంది. 

ఒక్కటి చెబుతాను దేవుడు గొప్పవాడు. కాళ్ళను నేలమీద పెట్టాడు.  బుద్ధిని తలపై ఉంచాడు.  నా ఊహలు, భావాలు, ఆశలు, ఆశయాలు ఆకాశంలో విహరించొచ్చు, కానీ కాళ్ళు మాత్రం నేలపై వున్నాయి గుర్తుంచుకో అంటూ ఈ రెండింటిని సమన్వయం చేసే గుండెని మటుకు మధ్యలో పెట్టాడు.  ఇది గమనించాలి.  గమనించాను గనక రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళతాను.  ఇదో నిరంతర తృష్ణ. 

నా పదవీ బాధ్యతల నిర్వాహణలో, నా కార్య క్షేత్రంలో 14 – 15 గంటలు పనిచేస్తున్నా మిగతా టైం నాదే కదా.  ఇంటికి వెళ్ళాక రాత్రి పదిన్నర నుండి నా టైం మొదలవుతుంది.  మూడే మూడు పనులు చేస్తా.  చదవటమూ, రాయటమూ, చూడటమూ ... ప్రపంచ సినిమా చూస్తాను. లేదా వరల్డ్ లిటరేచర్ చదువుతాను ... లేదా రాస్తాను.  ఇది నా personal space.  A wave neither tires or retires. A soldier has no holidays. నేనూ అంతే.  ఒక్కరోజు కూడా లీవు తీసుకున్న దాఖలాలు లేవు. నాకు పనే పండగ. పనిలోనే పండగ. 

ప్రశ్న : కొత్త తరానికి ఆసక్తికర విషయాలు చెబుతున్నారు కదా ... సాహిత్యంలో అనువాదాలు, కవితలు, వ్యాసాలు ఎన్నో చేశారు కదా డిపార్టుమెంటు కోసం పుస్తకాలను ఎడిట్ చేశారు ప్రచురించారు ... మరి స్వంత రచనలను పట్టించుకోకపోవడానికి కారణం ...

దాదాపు పదివేలకు పైగా వ్యాసాలు రాశాను. సినిమా, సాహిత్యం, కళలు, సైకాలజీ, బిహేవియర్ ఇలా ఎన్నో ఎన్నో అంశాలపై వ్యాసాలు అనేక పత్రికలలో వచ్చాయి.  తెలుగు, ఇంగ్లీషు భాషలలో ‘టైమ్’ magazine లో కూడా గెస్ట్ కాలమ్స్ రాశాను.  నా గురించి ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు.  జీవితమనే చెంప మీద ఛళ్ళుమనిపించ నీ లెక్కంత అన్నవాడిని.  ఆనవాళ్ల మీద నా గుర్తులు అన్న దాని మీద నమ్మకం లేనివాడిని.  జాన్ పాల్ సార్త్రే ముద్రలు దేనికి, బ్రాండ్ దేనికి అంటాడు.  శిలాఫలకం వేసుకుని కూచోలేదు వాళ్ళెవ్వరూ. నేనొక రైతుని తోటమాలి కదలుచుకోలేదు.  రైతు విత్తనాలు వేస్తాడు.  సత్తా ఉంటే బతుకుతాయి.  తోటమాలి ఎరువు వేస్తాడు, పెంచుతాడు, పోషిస్తాడు, మందు వేస్తాడు.  ఈ తోట నాది అని బోర్డు పెట్టుకుని వచ్చినోడికల్లా చూపిస్తాడు. 

500 పైగా కవితలు పబ్లిష్ అయ్యాయి.  వ్యాసాలు పుస్తకాలుగా వేస్తే 60 బుక్స్ అవుతాయి.  దాంట్లో అనువాదాలున్నాయి. కవిత్వం వేయదలచుకున్నాను. కవిత్వంలో ఏం జరుగుతుందంటే బయట ప్రపంచం గురించి కవి స్పందిస్తాడు.  కవి అంటే ఒక దుఃఖం జరిగింది, సంఘటన జరిగింది స్పందిస్తాడు.  కానీ అంతరంగంలో కూడా ఒక ప్రపంచముంది మనసులోని ప్రపంచంలోకి తొంగి చూడటమనేది నా కవిత్వంలో ఎక్కువగా నేను ప్రయత్నించాను.  అందుకే నాది అంతర్వీక్షణం.  అంతర్లోకాల్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయాలనే ఒక తాపత్రయముంది.  రెండవది ఒక ఫిలాసఫికల్ జర్నీ వుంటుంది.  మూడవది తెలంగాణ పట్ల ప్రేమ, ఆకాంక్ష.

ఈ నేల చాలా గొప్పది.  ప్రపంచ సాహిత్యమంతా చదివిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతికథా, ప్రతి కవితా, ప్రతి నవల, ప్రతి అంశమూ కూడా ప్రపంచ సాహిత్యానికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నదన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు.  మార్క్విజ్ రాసిన దానికి, అరుంధతీరాయ్ రాసిన దానికీ, మన దగ్గరున్న తెలంగాణ రచయిత రాసింది అన్నీ ఒకే నేపథ్యంలో ప్రతిబింబం సమస్థాయిని కలిగి ఉంటాయి.  లోపం ఏమన్నా ఉంటే మనకు చెప్పే విధానం తెలియకపోవడం. Exposure లేకపోవటం. 

ఇది గమనించి మన తెలంగాణ కవితల్ని ఇంగ్లీషులో translate చేశాను.  ప్రచురించే ప్రయత్నం చేయాలి. 

నా వాక్యంలో గానీ, నా రచనల్లో గానీ multi cultural influence ఎక్కువ.  ఆఫ్రికన్ కల్చర్, లాటిన్ అమెరికన్ కల్చర్, కొరియన్ కల్చర్, జపనీస్ కల్చర్ ... వీటన్నిటి సమాహారంగా నా కవితలు ఉంటాయి.  పక్కా తెలంగాణ భాషలో 95లోనే కవిత్వాన్ని రాశా.  అప్పుడు మాండలీక ఇప్పుడు భాష. ఇటు నేటివిటీని, అటు యూనివర్సల్ కాస్మోస్ ని, కంట్రీని అన్నింటిని కలగలిపే అప్రోచ్ శైలి నాది. 
****************************************************

ఫ్యూజన్ షాయరీ

నేను ప్రవేశ పెట్టిన ప్రకియ ఫ్యుజన్ షాయరీ.  చాలా మంది దాని గురించి రాశారు.  ఆ స్టైల్ లో రాశారు.  దానికో గ్రామర్ ని దిద్ది రాసిన వాళ్ళు లేరు. ఫ్యుజన్ షాయరీ అంటే మనం నివసిస్తున్న ప్రదేశాలు, ప్రపంచం ... కానీ ప్యూర్ కల్చర్ గా ఉన్న సందర్భం లేదు.  ఇందులో మల్టీ కలర్స్ వున్నాయి.  మల్టీ లింగ్యువల్, మల్టీ లైవ్స్ వున్నాయి.  మల్టీ లైవ్స్ మనం గడుపుతున్నాం.  బహుముఖీన జీవితాన్ని బహు జీవితాలని మనం గడుపుతున్నాం.  ఒక జీవితంలో బహు జీవితాలను గడుపుతున్నప్పుడు ఒక్క జీవితంలోని ఒక్క పార్శ్వాన్ని చూపిస్తాననడం సంపూర్ణం కాదు కదా.  బహుముఖీన జీవితాన్ని, బహు భాషాతత్వాన్ని, బహు సంస్కృతుల సందేశాన్ని అలాగే రీప్రెజెంట్ చేయాలని నా తపన.  ‘గోస’ అనే తెలంగాణ పదాన్ని Agony అనో Pain అనో ఇంగ్లీషులో చెప్పినా అందులో సాంద్రత రాదు, impact ఉండదు.  ఒక భాషలో ఆలోచించి రాస్తున్నప్పుడు ఒక ఫీల్ తో ఉన్న ఆ భాష పదాన్ని సమానార్ధాలు వెతకకుండా ఆ పదాన్ని అలాగే వుంచేయాలి.  అది ‘ఫ్యూజన్ షాయరీ’ అనుకుని డానికి కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నాను. 

ఐదు నుంచి ఎనిమిది stanza లు ఉండాలి.  అది లైన్ బై లైన్ గా కాకుండా పేరాలుగా ఉన్నా ఫరవాలేదు.  Prose లో poetry చొప్పించటం.  ప్రతి stanza కు ఒక కొస మెరుపు వుంటుంది. అలా ఒక ప్రయోగం చేశాను.  దాదాపు ముప్పై కవితలు రాశాను.  ఇరవై కవితల వరకు ప్రచురించబడ్డాయి.  ఇది నాదైన కోణంలో కవిత్వాన్ని చూసే దృష్టి.  ఇప్పుడు కన్పించే ప్రయత్నానికి మూలాలు ఎక్కడో ఉంటాయి.  నేను రూపాన్నిచ్చే ప్రయత్నం నాది. ముత్యాల సరాల్లాగా .... sonnet, octave లాగా ... నియమం ఉంటే రీతి ఉంటుందన్న గ్రామర్ నాది. 
*********************************************************
ప్రశ్న : ఇక్కడ్నించి మీ జర్నీ ఎలా ఉండబోతోంది ?  విస్తృతమయిన కేన్వాసుతో కూడిన మీ వైయక్తిక జీవితం ...

ఒక విత్తనం నేల తల్లి చీల్చుకుని తల పైకి పెట్టి బయటకు వచ్చింది, పెరిగింది. పూత పూసింది.  పరిమళాన్నిచ్చింది.  కాయకాసింది. రాలిపోయింది.  ఎంత సహజంగా జరిగింది.  ఇంతే సహజంగా వెళ్లిపోవాలి.  No strings attached. అతిధి వోలె వచ్చాను ... అతిధి వోలె వెళ్ళానన్నట్టుగా ... నేను ఈ లోకం నుంచి నిష్క్రమించిన మరుక్షణం నన్ను తలుచుకోకూడదు (philosophical గా).  ఆనవాళ్ల వ్యవస్థను ధిక్కరించేవాడిని.  ఓషో  ఫిలాసఫీలో ఒక మాట చెబుతారు. ఓషో ఈ లోకాన్ని ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు సందర్శించారు.  యిదొక జర్నీ.  ఈ జర్నీతో వచ్చాము, వెళ్తున్నాం ... ముందేముందో వెనకేముందో తెలీదు. 
************************************************************
మర్రి చెట్టు నాకాదర్శం

ప్రాకృతిక నియమాలను సంతులనం చేయడంలో ప్రతి జీవి ఒక పాత్ర పోషిస్తుంది.  Positive purposivism అంటారు కదా.  ప్రతి కార్యానికి ఒక purpose ఉంటుంది.  ఆ purpose వుందని నమ్ముతాను.  నాకు మర్రి చెట్టు అంటే ఇష్టం.  గడ్డి మొక్క నుంచి మహా వృక్షం వరకు దాని నిరంతర తపన ఆకాశం వైపే వుంటుంది.  ఆకాశం వంక ఆశగా చూస్తుంది.  ఎదగాలి ఎదగాలి అని.  ఒక్క మర్రి చెట్టు మాత్రమే ఎదిగే క్రమంలో చేతులను ఊడలుగా చేసి నేలతల్లికి వందనమంటుంది.  అమ్మా తల్లీ నా ఎదుగుదలకు కారణమయిన నీకు వందనం అంటుంది.  నేల తల్లి చుబుకాన్ని చుంబించడం కోసం ఊడలతో ప్రయత్నం చేస్తూ వుంటుంది.  అది ఆ చెట్టు చెప్పే జీవన సందేశం.  అలాగే దేవుడు కూడా నేలను మించిన ఆలోచనలు చేయొద్దని కాళ్ళను నేలమీదుంచాడు. హ్యూమన్ ఇంజనీరింగ్ మించిన వండర్ మరొకటి లేదని అన్పిస్తుంది. 
**********************************************************
ప్రశ్న  : ప్రపంచ తెలుగు మహాసభల్లో మీ పాత్ర  :

ఇక్కడ రెండు అంశాలున్నాయి.  తెలంగాణలో చాలా గొప్ప సాహిత్య కృషి జరిగింది.  అది పద్యం కావచ్చు. వచన కావచ్చు.  నన్నయ్య కంటే ముందే జరిగింది.  ఇంతవరకు గత అరవై ఏళ్ల కాలంలో సాహిత్య చరిత్ర ఒక perspective లో రాయబడింది.  తెలంగాణలో అంతకు ముందు జరిగిన కృషిని విస్మరించారు.  నన్నయ్య కన్నా వందేళ్ళ ముందున్న పంపన ప్రస్తావన ఎక్కడా కనబడదు.  మల్లినాధ సూరిని మర్చిపోయారు.  పాల్కురికి సోమన్న ఎన్నెన్నో ప్రక్రియలకు ఆద్యుడు.  నామ మాత్రపు ప్రస్తావన ఉంటుంది.  ఇలా అసంపూర్ణ ప్రాధాన్యతా క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది.  తెలంగాణ మలిదశ ఉద్యమంలో అధ్బుతమయిన సాహిత్యమొచ్చింది. 

మనల్ని మనం re discover చేసుకునేలా చేసింది.  14 ఏళ్ళ ఉద్యమం ఒక చైతన్యాన్ని తీసుకురాగలిగింది.  దాని కొనసాగింపు కావాలి.  మన మధ్య consolidate అయిన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి.  అందుకని ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా తెలుగు భాష సుసంపన్నతలో సాహిత్య శోభతో ఇక్కడి కవులు, రచయితలు పోషించిన పాత్రను ప్రపంచానికి తెలియ చెప్పాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఈ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఈ సంకల్పాన్ని తీసుకున్నారు. దాన్ని సమర్ధంగా అందించే బాధ్యతలో అన్ని శాఖలతో పాటు మా భాషా సాంస్కృతిక శాఖ కీలకపాత్ర పోషిస్తుంది.  తెలుగు బాష, సాహిత్యం, పద్యం, అవధానం ప్రధానంగా వుండే అంశాలే అయినప్పటికీ వాటిని ముందుకు తీసుకువెళ్ళటంలో మా కృషి వుంటుంది.  పద్యాన్నొక సాంస్కృతిక రూపంగా ప్రదర్శింపచేస్తే అది మరింత రంజింప చేస్తుంది.  పంపన యొక్క పద్యాన్ని, జనవల్లభుడి శాసన ప్రశంసాన్ని, పాల్కురికి సోమన కవిత్వాన్ని నాటకీకరించి ఆ పద్యాలను పాత్రల ద్వారా నాటకీయంగా పలికిస్తే అది జన బాహుళ్యానికి చేరుతుంది.  మేం చేస్తున్న ప్రయత్నం అది.  తెలంగాణ సాహితీకారుల తెలుగు సాహిత్య సేవను సాంస్కృతిక రూపాల ద్వారా జనరంజకంగా ప్రదర్శింపజేయ బోతున్నాం.  మేము చేసే ప్రయత్నం అదీ. 

ప్రధాన వేదికలయిన రవీంద్రభారతి, LB స్టేడియం, లలిత కళాతోరణంలో ఈ ప్రదర్శనలుంటాయి.  ప్రపంచ తెలుగు మహాసభలు ఒక జీవితకాలపు అనుభూతిని మిగల్చాలన్న లక్ష్యంతో మేం కృషి చేస్తున్నాం. ఇది తెలుగు పండగ.  అందరి పండగ.  భాషా పండగ.  తెలంగాణ జాతి పండగ.  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.  నందిని సిధారెడ్డి గారు, డాక్టర్ కె.వి.రమణాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, బుర్రా వెంకటేశం గారూ వీరందరి సారధ్యంలో పండగ జరగబోతోంది.  సాంస్కృతికంగా, శాఖాపరంగా మేం కృషి చేస్తున్నాం.  పది పుస్తకాల వరకు ఆవిష్కరణలుంటాయి.  ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతో గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేశాం.  ఇటీవల ఆకాశవాణి ప్రసారం చేసిన తెలంగాణ వైతాళికులు, కళల గురించి ధారావాహిక ప్రసంగాలను పుస్తక రూపంలో తెస్తున్నాం. అలాగే ‘TELANGANA HARVEST’ పేరుతో తెలంగాణ కధా సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువాదంగా తెస్తున్నాం.  ప్రొఫెసర్ దామోదర రావు గారు వారి బృందం దాని కోసం సంవత్సరన్నర కాలం బట్టి కృషి చేస్తున్నారు.  ఆ గ్రంధాన్ని కూడా ఈ సందర్భంగా తెస్తున్నాం.  50 అత్యుత్తమ కధలు ఇందులో ఉంటాయి.  ‘కొత్తసాలు’ గ్రంధాన్ని హిందీలో ‘నయాసాల్’ పేరుతో తెస్తున్నాం. 

ప్రశ్న : మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారంటే ఏమని చెబుతారు ?

నేను 3 P’s, 3 M’s అని చెబుతాను. 3 P’s అంటే Poetry, Painting and Philosophy.  3 M’s అంటే Movies, Magazines and Music. ఇవన్నీ కలిపితే నేను అని చెబుతాను.  Solitude is my attitude.

కొత్తరాష్ట్రంలో కొత్తసాలు

కొత్తరాష్ట్రంలో కొత్తసాలు
Mon,April 16, 2018 
ఉద్యమకాలంలో ఎగిసిన కవితా జ్వాలను జాజ్వల్యమానంగా వెలిగించడంలో ఈ సామూహిక కవితా సంకలనాలు విజయాన్ని సాధించాయి. రాబోయే కాలపు కవితా ప్రస్థానానికి దీప స్తంభంలా నిలిచాయి.

రాష్ట్ర అవతరణ అనంతరం ఈ మూడున్నరేండ్ల కాలంలో వచ్చిన సామూహిక కవితా సంకలనాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా వెల్లడవుతాయి. వాటిలో ప్రధానాంశం రాష్ట్రం ఏర్పాటుకు ముందు వివిధ సంస్థ లు ప్రజాసంఘాలు నిర్వర్తించిన బాధ్యతను, ఈ సారి అత్యంత సమర్థ వంతంగా ప్రభుత్వమే నిర్వహించిందనీ, అందులోనూ భాషా సాంస్కృ తిక శాఖ ప్రణాళికాబద్ధంగా సామూహిక సంకలనాలను తెచ్చిందనీ అర్థమవుతుంది. ఈ శాఖ ఒక్కటే ఈ కాలంలో విస్తృతంగా కవి సమ్మేళనాలు నిర్వహించటమే గాక వాటన్నింటినీ పుస్తక రూపంగా ప్రచురించి కవిత్వానికి శాశ్వతత్వాన్ని అందించింది. అలా దాదాపు ఆరు కవితా సంకలనాలను ప్రచురించింది. ఇవేగాక ఈ కాలంలో జిల్లాల నుంచి, ఇతర సంస్థల నుంచి కూడా కొన్ని సంకలనాలు వెలువడ్డాయి. రాష్ట్ర అవతర ణ అనంతరం వెలువడిన వివిధ సామూహిక కవితా సంకలనాలు, వాటి విశేషాలు..

తొలకరి కవితా జల్లు కొత్త సాలు: 2015లో ప్రపంచ కవితా దినోత్సవం, మన్మధనామ ఉగాది రెండూ కలిసొచ్చిన సందర్భంలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ కొత్త సాలుకు శ్రీకారం చుట్టింది. కొత్త ఆకాంక్షల సంతకంగా మన్మథనామ సంవత్సరాదిని ఆహ్వానిస్తూ రవీంద్రభారతి వేదిక సాక్షిగా జరిగిన కవిసమ్మేళనం కవితాత్మకంగా చిక్క ని కవితాసారాన్ని పంచిఇచ్చింది.
పూలకి అక్షర నీరాజనం తంగేడు వనం: బతుకు బతికించు అనే జీవన సందేశాన్ని పూలసాక్షిగా ప్రపంచానికి చాటిచెప్పిన పండుగ బతుక మ్మ. రాష్ట్ర పుష్పంగా తంగేడు పుష్పాన్ని ప్రకటించిన అనంతరం ప్రపం చ సాహితీ చరిత్రలో తంగేడు పూలపై అత్యధిక కవితల సంకలనంగా తంగేడు వనంగా 166 మంది కవులు పేర్చిన బతుకమ్మగా వెలుగు చూసింది ఈ సంపుటి. పువ్వు పండుగ మీద 166 మంది కవులు పేర్చిన ఈ కవితా సంకలనం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధి పొందిన కవితా సంకలనంగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ నుంచి వెలువడిన ఈ రెండవ కవితా సంకలనం దసరా రోజు ఆవిష్కతమై అక్షరాల ఆకులను పరచి పూల పదాలను పేర్చి వాక్యాల వరుసలను అమర్చి ఒక రసానుభూతిని కలిగించేలా అల్లిన కవిత్వరూపంగా కనిపిస్తుంది ఈ తంగేడు వనం.

బహత్ కవితా సంకలనం తొలిపొద్దు: సాహితీ చరిత్రలో అధిక సం ఖ్యాక కవుల కవితా సంకలనంగా వెలువడిన తొలిపొద్దుని తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ 3వ పుస్తకంగా వెలువరించింది. 56 ఏండ్ల రవీం ద్ర భారతి చరిత్రలో మెయిన్ హాల్లో జరిగిన అతి పెద్ద కవి సమ్మేళనం ఇదే. తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తూ 2015 జూన్ 7వ తేదీన poetry marathonగా నిర్వహించి నభూతో నభవిష్యత్ అనిపించింది. 13 గంటల పాటు నిర్విరామంగా సాగిన విశిష్ట కవి సమ్మేళనంలోని కవి తా సమాహారమే ఈ సంకలనం. పుస్తకం తెరిచిన వెంటనే సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు, సాగిపో దలచిన ఆగిపోరాదెచటెపుడు అన్న ప్రజాకవి కాళోజీ కవితతో కొత్త కవితా ప్రపంచంలోకి పుటలు తెరిచినట్లనిపిస్తుంది.

కవి కూడా నేతగాడే బహుచక్కని సాలెగూడు అల్లువాడే అని కాళో జీ చెప్పినట్టు తెలంగాణ ఇతివృత్తంగా సాగిన ఈ కవితల్లో కొన్ని ఆయుధాలుగా, కొన్ని పరిమళభరితమైన పుష్పాలుగా, కొన్ని ఆకాంక్షల సమీరాలుగా, మరికొన్ని ఆనంద భరితాలుగా, ఇంకొన్ని అనుభవైక వేద్యాలుగా కనిపిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం మీద కవిత్వపు జండాను ఎగురేశాయి. సరికొత్త చరిత్రను లిఖిస్తూ తమ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తూ కలర్ ఫుల్‌గా ఐదు వందల పేజీలతో ముస్తాబైన ఈ సంకలనం వైవిధ్యానికి, కవితా విస్తృతికి, తెలంగాణ కవుల దీక్షకు సమైఖ్య స్ఫూర్తికి సంఘటిత శక్తికి చిరునామాగా నిలిచింది. 97ఏండ్ల కవుల నుంచి 19 ఏండ్ల నవ యువకవుల వరకూ కవితా పుష్పాలను వెలయించిన ఈ సంకలనం ఆసాంతం చదివితే తెలంగాణ వచన కవితలో ఉన్న వైవిధ్యాన్ని గమనించవచ్చు. భద్రయ్య గారి పద్య కవిత్వం నుంచి హరికష్ణ గారి ఫ్యూజన్ షాయరీ వరకు సాగిన ఈ కవిత్వ కవాతు అటు సంప్రదాయానికి ఇటు మోడ్రన్ వచన కవిత్వానికి వారధిగా నిలిచిందని చెప్పొచ్చు. ఇన్ని ఇజా ల కవులు కలగలసిన వేదికగా ఎన్నో సిద్ధాంతాలు కలబోసిన పుస్తకంగా నవ చరిత్రకు శ్రీకారం చుట్టిన సంకలనమే ఈ తొలిపొద్దు, కొత్త సాలు, తంగేడు వనం. ఈ తొలిపొద్దుకు డాక్టర్ నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, బుక్కా బాలస్వామి, నాళేశ్వరం శంకరం, గంటా జలందర్‌రెడ్డి, జాజుల గౌరి, అయినంపూడి శ్రీలక్ష్మి షాజహానా సంపాదక మం డలిగా వ్యవహరించారు. తెలంగాణ కవుల అరువై ఏండ్ల పోరాటానికి ప్రజల అస్తిత్వ గౌరవ ఆరాటాలకు సాక్షిభూతమైన ఈ సంకలనం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ కృషికి తెలంగాణ కవుల వికాసానికి తార్కాణంగా నిలిచింది. అన్నిటికన్నా ముఖ్యంగా సంపాదకుని మాటగా తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు తెలంగాణ చరిత్రనంతా అధ్బుతంగా మలచి అందించిన వైనం ఆకట్టుకుంటుంది.

ప్రజల హదయ స్పందన మట్టి ముద్ర: తెలంగాణ భాషా సాంస్కతి క శాఖ నుంచి వెలువడిన నాలుగవ పుస్తకం మట్టి ముద్ర. 2016 ఉగాది కవి సమ్మేళనంలోని కవితలతో 9 మంది సలహా మండలితో మామిడి హరికృష్ణ గారి సంపాదకత్వంలో సెప్టెంబర్‌లో దసరాకు ఆవిష్కరించబడిన కవితా సంకలనం మట్టి ముద్ర. ఆరు ఋతువులకు ఆరంభపతాకం కొత్త చిగుళ్ళపై ప్రకృతి మాత సంతకం ఈ ఉగాది కవి త్వం. నిన్న పోరాటాల గడ్డగా పిలవబడిన రాష్ట్రం ఈ రోజు కొత్త సాహిత్యపు అడ్డాగా మారుతున్న వైనాన్ని సరికొత్తగా ఎరుకపరచింది. శిశిరం లోని చిగుళ్ళే కవిత్వంగా మలిచిన వైనాన్ని చాటింది. 64 కవితలు చోటుచేసుకున్న ఈ సంకలనంలో సంపాదక వాక్యం ప్రత్యేక ఆకర్షణ.
పర్యావరణ కవిత్వం ఆకుపచ్చని పొద్దుపొడుపు: సమిష్టి ప్రజా ఉద్యమంగా ఉరకలెత్తుతున్న హరితహారానికి కవితా హారతులందిస్తూ పర్యావరణ స్పృహతో 2017 మార్చిలో భాషా సాంస్కతిక శాఖ తీసుకొచ్చిన మరొక సంకలనం ఇది. అయితే అన్ని పుస్తకాల మాదిరి కాకుండా ఈ పుస్తకానికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఎప్పుడూ కవిసమ్మేళనాలు పెట్టి ఆ తర్వాత సంకలనాలు ముద్రించే ఈ శాఖ ఈసారి హరితహారం మీద కవితల పోటీలు పెట్టి ఆ పోటీకి వచ్చిన కవితలను మరికొన్ని పర్యావర ణ కవితలను ఏర్చికూర్చి ఆకుపచ్చని పొద్దుపొడుపుగా అందించింది. హేవలంబి నామ ఉగాది సందర్భంగా 164 మంది కవులతో వెలువరించబడిన సంకలనం ఇది.

ఊరుకు వందనం తల్లి వేరు: హేవళంబి నామ ఉగాది రోజున జరిగిన కవి సమ్మేళనానికి ఊరును ఇతివృత్తంగా తీసుకొని రాయమని సూచించిన భాషా సాంస్కృతిక శాఖ వారు 2017 జూన్‌లో ఈ సంకలనాన్ని ముద్రించడం జరిగింది. మనమెంత గొప్ప వాళ్ళమైనా మన మూలాలు సొంత ఊళ్లోనే ఉంటాయి. మన కీర్తి మన అనురక్తి మన స్ఫూర్తి అంతా ఊరే. ఊరిచ్చిన బతుకుబాటను, జీవితాలను తలుచుకుంటూ 47 మంది కవులు తమ అనుభవాలను, ఊరుతో తమ అనుబంధాన్ని అక్షరీకరించిన అరుదైన పుస్తకం ఇది. ఉగాది సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కవి సమ్మేళనం ఇది.
భాషా సాంస్క తికశాఖ నుంచి ప్రభుత్వపరంగా వెలువడిన ఈ ఆరు పుస్తకాల్లో మూడు ప్రత్యేకమైన విశేషాలున్నాయి. మామిడి హరికృష్ణ సంపాదకీయం ఓ పీహెచ్‌డీ పత్రంలా ఉండటం ఒక విశేషమైతే, ప్రతీ పుస్తకానికి అరుదైన ముఖచిత్రాలను ఎంపిక చేయడం మరొక విశేషం.

ఇతర సాహితీసంస్థలు కూడా సంకలనాలను ప్రచురించాయి. 2014 జూన్ 2న నిర్వహించబడిన కవి సమ్మేళనంలోని కవితలను, మహబూబ్‌నగర్ జిల్లా సాంస్కృతిక మండలి తెలంగాణ పొద్దు పొడుపు కవితా సంకలనంగా మలిచింది. 68 కవితల ఈ సంకలనం ఒక ప్రాంతానికి పరిమితమైన కవితా వస్తువుల్లా గాక తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా విరబూసింది. రంగుల చిత్రమాలతో సంక్షిప్త సందేశాలతో వెలువడిన ఈ సంకలనం అందరినీ ఆకట్టుకున్నది. మహబూబ్ నగర్ నుంచి వెలువడిన మరొక కవితా సంకలనం బంగారు తెలంగాణ పాలమూరు కవితా తరంగిణి. భాషా సాంస్కృతిక శాఖ మహబూబ్‌న గర్ జిల్లా ఆధ్వర్యంలో 2016 జూన్ 2న జరిగిన కవి సమ్మేళనంలోని కవితల సంపుటి ఇది.
కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర ఆవిర్భావానంతరం రెండు కవితా సంకలనాలు సాహితీ గౌతమీ ఆధ్వర్యంలో వెలువడినాయి. మానేరు నీరు తాగి పెరిగిన మామంచి కవులున్న జిల్లా కరీంనగర్. ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో. ఆ మాను సంతకం ఉంది చివురుల్లో. నా మనసు సం తకం ఉంది ఈ సంకలనాల్లో అన్నట్టుగా మలిచారు ఈ సంపుటాల్ని కరీంనగర్ కవులు.

కరీంనగర్ జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య సాహి తీ గౌతమి ఆధ్వర్యంలో 2014లో జయగానం కవితా సంకలనం వెలువడింది. 2016లో పంచమ స్వరం పేరుతో మరో కవితా సంపుటి వెలువడింది. జయగానం సంపుటిలో 111 కవితలున్నాయి. వీటిలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య, బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ నలిమెల భాస్కర్, వారాల ఆనంద్, అన్నవరం దేవేందర్, డాక్టర్ కాలువకుంట రామకృష్ణ వంటి లబ్ధ ప్రతిష్టులైన అనేకమంది రచనలున్నాయి. సాహితీ గౌతమి ఆధ్వర్యంలో 2016లో వెలువడిన మరో కవితా సంపుటి పంచమ స్వరం పుస్తకం మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో వెలువడగా ఆ పాఠశాలల అధినేత కడారు అనంతరెడ్డికి అంకితం ఇవ్వబడింది. ఇందులో మొత్తం 67 కవితలున్నాయి. ఈ పుస్తకానికి సంపాదకులుగా కె.ఎస్.అనంతాచర్య, దాస్యం సేనాధిపతి, వారాల ఆనంద్, మాడిసెట్టి గోపాల్, డాక్టర్ బి.వి. ఎన్ స్వామిలు వ్యవహరించారు. మన్మథనామ ఉగాది సందర్భంగా కవు లు చదివిన కవితలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

మనం చెప్పుకోవాల్సిన మరో సామూహిక సంకలనం మిర్గం. తెలంగాణ కవిత్వంగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య కళావేదిక 2017 ఆగస్టులో వెలువరించిన సంక లనం. 2015 ఫిబ్రవరి 22న తెలంగాణ సాహిత్య కళావేదిక ప్రారంభమై, ఆ రోజే పదిజిల్లాల కవులతో కవితాగానాన్ని నిర్వహించింది. ఇందు లో 76 మంది కవులు స్వయంగా పాల్గొంటే 15 మంది కవులు తమ కవితలను పంపించారు. అలా 102 మంది కవితలతో 60 ఏండ్ల ఆం ధ్రా పాలన నుంచి విముక్తమై ఇప్పుడీ కవితల జలపాతం మొదలైందని ప్రతీకాత్మకంగా చెబుతూ సాహితీ మిర్గాన్ని ఆవిష్కరించారు. పండబో యే పంటల అంచనాకు మిర్గం జీవనాడి ఎలా అవుతుందో, ఈ పుస్తకం కూడా అలాగే రానున్న కాలంలో తెలంగాణ జనజీవితాల ప్రతిఫల నాలకు సాక్షీభూతం అవుతుంది. కవులను చరిత్ర దాచుకునే మంచి సంకలనం ఇది.

మూడున్నరేండ్ల కాలంలో వెలువడిన సామూహిక కవితా సంకలనా లు కవుల వైయక్తిక స్పందనలను వ్యక్తం చేయడమేగాక సామూహిక ఆకాంక్షలను కూడా తెలిపాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలకు, స్పందించే చైతన్యవంతుడు కవి అన్న మాటలను నిజంచేస్తూ ఈ సంకలనాలన్నీ తెలంగాణ కవుల్లోని స్పందనలను, సంవేదనలను, సహానుభూతిని, స్వీయానుభావాన్ని దోసిళ్ళలో పట్టి మనకందించాయి. ప్రక్రియలపరంగా, ప్రయోగాల పరంగా, శిల్ప పరంగా, వైవిధ్యతను అందించడమేగాక వస్తుపరంగా కూడా విభిన్న అంశాలను తెలంగాణ సాహిత్యానికి ఆపాదించాయి. సమకాలీన తెలంగాణ కవిత్వం సరికొత్తగా ఆవిష్కరించడానికి మరింత సుసంపన్నం కావడానికి కావలసిన సరంజామాను అంతా ఇవి సిద్ధం చేశాయి. మొత్తం మీద, ఉద్యమ కాలంలో ఎగిసిన కవితా జ్వాలను జాజ్వల్యమానంగా వెలిగించడంలో ఈ సామూహిక కవితా సంకలనాలు విజయాన్ని సాధించాయి. రాబోయే కాలపు కవితా ప్రస్థానానికి దీప స్తంభంలా నిలిచాయి.
- అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562

కాలం జారిపోతున్న సవ్వడి

HI folks, PL SEE MY LATEST POEM published in andhra jyothi sunday 21 sept,2014

కాలం జారిపోతున్న సవ్వడి 
---మామిడి హరికృష్ణ 99088 44222

చెంపల మీది బిందువుల్లా 
రోజులు జారిపోతున్న చప్పుడు 
మెలుకువ లోకి ఊడిపడిన కాలం 

మెట్ల మీద కరిగిపోతున్న వడగళ్ళలా  
జ్ఞాపకం పగిలిపోతున్న దృశ్యం 
మత్తులోకి కూరుకుపోయిన సమయం 

సముద్రంలోకి ఒలికిపోతున్న ఆకాశం 
ఆకాశం లోకి ఇంకిపోతున్న మేఘం 
మేఘంలో కుంగిపోతున్న ఆకారం 
ఆకారం లో రూపు మారిన వేలాది అవతారాలు 
మునిగిన పడవను నీటి రంగులలో ఖననం చేస్తాయి 
అడుగున ఉన్న నాచు మొక్కని పైకి తెలుస్తాయి 

తీరం వెంట చెట్టునై నేను 
ఇసుకనంతా పాదాల దగ్గర కుప్పలుగా పోసుకుని 
పిట్ట గూడును అల్లుతుంటాను 

కెరటాలు నడుస్తూ నడుస్తూ గవ్వల చేయి పట్టుకుని వస్తాయి  
ప్రేమలు మండుతూ మండుతూ పువ్వుల్ని మసి చేస్తాయి 
స్పర్శలు వర్షిస్తూ వర్షిస్తూ నవ్వులని  ఆశ్షబ్దం చేస్తాయి 
అనుభవాలు కోసుకుని కోసుకుని దేహాన్ని దాహరహితం చేస్తాయి 

ఇక్కడ ఇక వెన్నెల 
కన్నీటి చుక్కై 
చీకటి రెక్కలు తొడుక్కుని ఎగిరెల్లిపోతుంది 
పడమటి గాలి వెలుగుచుక్కైె
అంతరిక్షం గొంగళి కప్పుకుని మెరుస్తుంది .....

వ్యంగ్య చిత్రానికే వందనం

Here,  it's my article published in Namaste Telangana edit page on 24-12-2017...
వ్యంగ్య చిత్రానికి వందనం!

కార్టూన్ జర్నలిస్ట్‌లకు, కార్టూన్‌లకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంకల్పించింది. అందుకే మున్నెన్నడూ లేని విధంగా 2015 తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలలో రవీంద్రభారతిలో కార్టూనిస్ట్‌ల సదస్సును ఏర్పాటుచేసి దాదాపు 42 మంది కార్టూనిస్ట్‌లను సత్కరించింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. 
**************************
కార్టూన్..!
రాతగీతల దృశ్య చిత్రం..! 
అన్ని చిత్రాలలాంటి ఒకానొక చిత్రమే. కానీ మిగ తా సీరియస్ చిత్రాలకు లేని గొప్ప లక్షణం ఉన్న చిత్రం కార్టూన్! ఆ గొప్ప లక్షణం హాస్యం! వ్యం గ్యం!
మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపచేస్తుంది.ఆశ్చర్య పరుస్తుంది.ఆవేదన చెందేలా చేస్తుం ది. ఎక్కువసార్లు ఆహ్లాద పరుస్తుంది. తీవ్ర ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఛార్లీ ఛాప్లి న్ జీవితం లాంగ్ షాట్‌లో కామెడీ, క్లోజ్ షాట్‌లో ట్రాజెడీ అని చెప్పినట్లు కార్టూన్ రాతగీతల్లో కామెడీ, విషయ వస్తువులో ట్రాజెడీ అని భావించేలా ఉంటుంది. మనిషి మాత్రమే అనుభూతించగలిగిన హాస్య భావనను ఉద్దీపింప చేయగలిగే ఒకానొక సృజన రూపం కార్టూన్! గీతలతోనే చక్కిలిగిలి పెట్టగలిగిన హాస్య మంత్రం కార్టూన్!
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మన పంచేంద్రియాల సమన్వయ జ్ఞానంతోపాటు, మనకు ఇదివరలో లభించిన పూర్వజ్ఞానం, అనుభవం అవసరం. ఇంత మానసిక ప్రక్రియ మనకు, మన చుట్టూ ఉన్న భౌతిక, రాజకీయ, సాంఘిక పరిసరాలకు మధ్య సమన్వయానికి అవసరం అవుతుందని మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెపుతారు. అయితే కంటితో చూసిందే తడవుగా పాఠకుడిలో / వీక్షకుడిలో ఆనంద భావనను, ఆహ్లాద అనుభూతిని, హాస్య రసాన్ని అందించగలిగేది కార్టూన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధునిక కాలంలో హాస్యానికి టానిక్‌గా కార్టూన్ మారిందన్నా ఆశ్చర్యం లేదు. నవరసాలలో నవ్వే రసానికి ఇగ్నిషన్ కార్టూన్! తీవ్రమైన మానసిక, ఆర్థిక సంక్షోభంలో సైతం హృదయాన్ని తేలిక పర్చగలగటం కార్టూన్ ప్రత్యేకత!
ఇలాంటి కార్టూన్ ఇపుడు సర్వాంతర్యామి. ఏ పత్రిక చూసినా, ఆఖరికి విద్యాసంస్థలలోని గోడపత్రికలలో సైతం కనిపించే అద్భుత విశేషం కార్టూన్! వ్యం గ్యం, హాస్యం, సునిశిత ధిక్కారం, తార్కిక నిరసన, విషాద సందర్భానికి సంఘీభావం అనే ఐదు లక్ష్యాల సాధనే కార్టూన్‌ల అంతిమ లక్ష్యం అని కార్టూన్‌ల ప్రస్థానాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అయితే కాలక్రమంలో కార్టూన్‌లు పత్రికలలోనూ, మన నిత్య జీవితంలోనూ అంతర్భాగం అయిపోయాయి. పత్రిక తెరవగానే కార్టూన్‌లను వెతకడం సహజం. ఇంతగా మన జీవితంతో ముడివేసుకున్న సృజనాత్మక వ్యాసంగం మరేదీ లేదని చెప్పవచ్చు.

కార్టూన్ వేయి విధాలు : 
ప్రపంచవ్యాప్తంగా కార్టూన్‌కు ఉండే ప్రాధాన్యం గుర్తింపులోకి వచ్చిన కాలం నుంచి అది రకరకాల రూపాలను సంతరించుకుంటూ వస్తున్నది. నిజానికి ఆదిమకాలంలో, మనిషి గుహలలో జంతు జీవనం సాగిస్తున్న కాలంలో తను చూసిన జంతువులను సంకేతాత్మకంగా చూపిస్తూ నాలుగు గీతలతో జంతువు రూపు రేఖలను వ్యక్తీకరించడం కార్టూన్‌కు ప్రాథమికరూపంగా భావించవచ్చు. అయితే ఆనాటి మానవుని సృజన వెనుక ఆహ్లాదం, వినోదం కన్నా భయమే ప్రధాన చోదకశక్తిగా ఉండేదనే విషయాన్ని గమనిం చాలి. అలా మొదలైన కార్టూన్ ఇపుడు ఎన్నెన్నో దశలను దాటి బహుముఖీనతని సాధించి జీవితంలోని అన్ని పార్శ్వాలను సమర్థవంతంగా ప్రతిబింబించగలుగుతున్నది. ఈ ప్రస్థానాన్ని ఇక్కడ గమనిస్తే కార్టూన్‌లను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కార్టూన్‌లలో గార్‌ఫీల్డ్ కార్టూన్‌లు (పిల్లి ప్రధానపాత్ర), జెన్నిస్ ది మినేస్ (హాన్ కె చావ్‌ు కార్టూనిస్ట్), కామన్‌మ్యాన్ (ఆర్.కె.లక్ష్మణ్ కార్టూనిస్ట్), పీనట్స్ (ఛార్లెస్ ఎం. షుల్జ్) కార్టూన్‌లు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి. ఇవేగాక, ఆయా సందర్భాలను అనుసరించే ఏకవస్తువుగా వచ్చే కార్టూన్‌లు కూడా ప్రసిద్ధమే! పర్యావరణ అంశాలు, అక్షరాస్యత, ఆఫ్రికా, బాలికా సంరక్షణ, గృహహింస, శాంతి, యుద్ధ నివారణ వంటి అంశాలు ఆధారంగా వచ్చిన కార్టూన్‌లను Thematic Cartoonగా పిలుస్తాం.

రోజురోజుకూ కార్టూన్‌లకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణను గమనించిన కొన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థలు, వ్యక్తులు కార్టూన్‌ల కోసం ప్రత్యేక లైబ్రరీలను, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఈ ధోరణికి శ్రీకారం చుట్టిన సంస్థ బిల్లీ ఐర్లాండ్ కార్టూన్ లైబ్రరీ అండ్ మ్యూజి యం! ఓహియో స్టేట్ యూనివర్శిటీకి అనుబంధంగా 1977లో అమెరికాలోని కొలంబస్‌లో ఏర్పాటైన ఈ పరిశోధనా సంస్థ పూర్తిగా కార్టూన్‌లకే అంకితమై పనిచేస్తున్నది. దీనిలో ఇప్పటికీ 4.5 లక్షల ఒరిజినల్ కార్టూన్‌లు, 36వేలకు పైగా కార్టూన్ పుస్తకాలు, 51వేలకు పైగా కార్టూన్ సీరియల్ టైటిల్స్, 25లక్షలకు పైగా కామిక్ క్లిప్పింగ్స్ భద్రపరచబడ్డా యి. 
అలాగే బ్రస్సెల్స్ నగరంలో (బెల్జియం దేశం) 1989 లో బెల్జియన్ సెంటర్ ఫర్ కామిక్ స్ట్రిప్ ఆర్ట్ పేరుతో కార్టూన్‌ల కళా పరిశోధనా సంస్థ ఏర్పడింది. 
బ్రిటన్‌లో ఉన్న కార్టూనిస్ట్‌ల కోసం లండన్‌లో 2006లో ది కార్టూన్ మ్యూజి యం పేరిట ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
 ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో టూన్‌జియవ్‌ు పేరుతో పిట్స్‌బర్గ్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్ ని 2007లో నెలకొల్పారు. ఇవన్నీ ఆయా కార్టూనిస్ట్‌లు వేసిన కార్టూన్‌లను సేకరించడమే గాక, వాటిని శాశ్వతంగా భద్రపరుస్తూ, వివిధ పరిశోధనలకు సహకరిస్తూ కార్టూన్‌కి కూడా కళాప్రతిపత్తిని, పరిశోధనా సంపత్తిని సమకూరుస్తున్నాయి.

కార్టూన్ థెరపీ: 
ఇటీవలి కాలంలో మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనుషులలో సానుకూల దృక్పథం ఎదుగుదల కోసం, ఒత్తిడుల నుంచి విముక్తి కోసం సంప్రదాయేతర చికిత్సా విధానాలను సూచిస్తున్నారు. వాటిలో కామెడీ సినిమాలను ప్రదర్శించడమే గాక, హాస్య రసస్పోరకమైన కార్టూన్‌లను, కార్టూన్ పుస్తకాలను చదవడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక వైద్యశాస్త్రంలో కార్టూన్ థెర పీ దిశగా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. కార్టూన్‌లు కేవలం వినోదం కోసమే కాదు. చికిత్సకోసం, మానవ వికాసం కోసం కూడా అనే నూతన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి. 

దేశంలో.. :
మనదేశంలో తొలి వార్తా పత్రిక బెంగాల్ గెజిట్. జేవ్‌‌సు ఆగస్టస్ హిక్కీ కోల్‌కత్తాలో ఈ పత్రికను 1780లో ప్రారంభించినప్పటి నుంచీ దేశంలో వార్తాపత్రికల ప్రభంజనం మొదలైంది. అందులో కూడా కార్టూన్‌లు ప్రచురితం అయ్యా యి. ఆ తర్వాత 19వ శతాబ్దంలో స్వాతంత్య్రోద్యమ కాలంలో వచ్చిన పత్రికలలోని కార్టూన్‌లు రాజకీయ అంశాల ప్రాతిపదికగా ప్రజాదరణ పొందాయి. ఆనాటి బ్రిటీష్ పాలకుల విధానాలు, దానికి నిరసనగా వ్యాసాలు, విశ్లేషణలు ఎంత ప్రభావం చూపాయో, అంతే సున్నిత విమర్శలను కార్టూన్‌లు చేసాయి. కొన్ని నిషేధానికి కూడా గురవడం గమనార్హం.

స్వాతంత్య్రానంతరం, నెహ్రూకాలంలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళైతో, కార్టూన్‌లకు ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్‌లకు విశేష ప్రజాదరణ ఏర్పడింది. ప్రత్యేకంగా కార్టూన్‌ల కోసమే ఓ పత్రిక శంకర్స్‌వీక్లీ ప్రచురితమైం ది. ఆ తర్వాతి కాలంలో ఆర్.కె. లక్ష్మణ్, సుధీర్ తెలంగ్, అజిత్ నైనాన్, మారి యో మిరాండా వంటి ఎందరో కార్టూనిస్ట్‌లు దేశవ్యాప్త కీర్తిని సంపాదించారు.

తెలుగు పరిస్థితి: 
తెలుగు వారి జీవనంలో హాస్యం, వ్యంగ్యం కూడా ఎంతో ముఖ్యమైన భావోద్వేగాలు! అదే జీవన విధానం కార్టూన్‌లలో కూడా ప్రతిబింబించింది. ప్రబంధాలలో వర్ణించిన స్త్రీల సౌందర్యాన్ని వ్యంగ్యంగా చిత్రించడంలో తెలుగులో తొలి కార్టూన్ ప్రారంభమైందని తెలుస్తున్నది. తలిసెట్టి రామారావు గారు వేసిన ఈ చిత్రం ఆల్‌టైవ్‌ు ఫేవరేట్ స్థాయిని సాధించింది. ఆ తర్వాత ఎందరెందరో కార్టూనిస్ట్‌లు కేవలం రాజకీయ కార్టూన్‌లనే గాక, అన్ని రకాల కార్టూన్‌లలో తమదైన ప్రతిభా ముద్రలతో దూసుకు వెళ్తున్నారు.

వీరిలో బాపు గారిది ఓ ప్రత్యేకశైలి.మోహన్, చంద్ర, గీతా సుబ్బారావు, టీ.వీ., శేఖర్, శ్రీధర్, సురేంద్ర, సరసి, మృత్యుంజయ్, నర్సిం, శంకర్, వెంకటేష్, నారు, జావెద్, అవినాశ్, సూర్య, రవినాగ్ ఇంకా ఎందరో తెలుగు కార్టూన్ జర్నలిజంలో తమదైన శైలితో నిరంతరం పనిచేస్తున్నారు.కార్టూనిజంను తెలుగు మాధ్యమాలలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అందుకే మీడి యా జర్నలిజంలో ఇటీవలి కాలంలో కార్టూన్ షోలు కూడా సీరియల్స్‌గా ఛానెళ్ళలో ఆదరణ పొందాయి. కాగా, ఇటీవలి కాలంలో అత్యధిక కార్టూనిస్ట్‌లు తెలంగాణ రాష్ర్టం నుంచే వస్తుండటం విశేషం. అంతేగాక, క్రోక్విల్, హాస్యానందం వం టి పత్రికలు కార్టూన్ స్పెషల్ పత్రికలుగా పేరుపొందాయి.
వీటన్నిటి నేపథ్యంలో, కార్టూన్ జర్నలిస్ట్‌లకు, కార్టూన్‌లకు సముచిత గౌర వం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంకల్పించింది. అందుకే మున్నెన్నడూ లేని విధంగా 2015 తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలలో రవీంద్రభారతిలో కార్టూనిస్ట్‌ల సదస్సును ఏర్పాటుచేసి దాదాపు 42 మంది కార్టూనిస్ట్‌లను సత్కరించింది.
 ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రపంచ తెలు గు మహాసభల సందర్భంగా కూడా కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దాదాపు 105గురు కార్టూనిస్ట్‌లు 175 పైగా తమ కార్టూన్‌లను ప్రదర్శించారు. భాష, సంస్కృతి ప్రధాన వస్తువులుగా రూపొందిన ఈ కార్టూన్‌షో ఈ కోవలో ఇదే తొలి ప్రయత్నం అని చెప్పాలి. ఈ కార్టూన్‌షోను ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక అందమైన పుస్తకంగా ప్రచురించడం, ఓ చిరకాల జ్ఞాపకంగా తీర్చిదిద్దడం అభినందనీయం.
(వ్యాసకర్త: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు)


నిర్జనమ్


ఇప్పుడు కావల సింది చలన చిత్ర విధానం

ఇప్పుడు కావలసింది .. చలనచిత్ర విధానం!
08/08/2014 | -మామిడి హరికృష్ణ

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలోనూ, ఇక్కడ తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రభుత్వాలు స్వల్పకాలంలోనే తేరుకుని ఆయా అభివృద్ధి పథకాల విషయంలో నిర్దిష్ట వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ సందర్భంలోనే చలనచిత్రాలు- చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల మీద అటు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ఓ ‘‘ఫిల్మ్‌పాలసీ’’రూపంలో
నిర్ధారించాల్సిన సమయం ఆసన్నమయింది.
-------------------
స్వాతంత్య్రానంతరం నుండీ జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం, రాష్టస్థ్రాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతా రంగాల విషయంలో తమతమ విధానాలను ప్రకటిస్తూ వచ్చాయి. ఈ విధాన ప్రకటనలవల్ల ఆయా రంగాల ప్రగతి పురోగతికై ప్రభుత్వం ఏ నిర్మాణాత్మక చర్యలను తీసుకుంటున్నదో తెలుసుకుని, దానికనుగుణంగా ఆయా రంగాలలోని వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలను నిర్ధారించుకునే అవకాశం ఏర్పడ్తుంది. అయితే 66 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ అటు జాతీయస్థాయి ప్రభుత్వాలు కానీ, ఇటు రాష్టస్థ్రాయి ప్రభుత్వాలు సంస్కృతి- కళలు- సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి ‘‘విధాన తీర్మానాన్ని’’ ప్రకటించకపోవడం ఒకింత ఆశ్చర్యమే!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలోనూ, ఇక్కడ తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రభుత్వాలు స్వల్పకాలంలోనే తేరుకుని ఆయా అభివృద్ధి పథకాల విషయంలో నిర్దిష్ట వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ సందర్భంలోనే చలనచిత్రాలు- చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల మీద అటు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ఓ ‘‘ఫిల్మ్‌పాలసీ’’రూపంలో నిర్ధారించాల్సిన సమయం ఆసన్నమయింది.

‘ఫిల్మ్ పాలసీ’ అవసరమేంటి?
ప్రపంచం మొత్తంమీద అత్యధిక సంఖ్యాక సినిమాలు నిర్మిస్తున్న దేశం మన దేశమే అనే ఒకే ఒక్క వాస్తవ సూచిక చాలు మనకంటూ ఓ ‘‘ఫిల్మ్ పాలసీ’’ అవసరం అని చెప్పడానికి! ఇదొక్కటేనా? వినోద రంగంలో సినిమాలకు సంబంధించి ఇంకా ఎన్నో విశేషాలు భారతీయ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నాయి. వినోద రంగంలో హాలీవుడ్ తర్వాత అత్యధిక పెట్టుబడులు పెడుతున్నది మన సినీ రంగంలోనే. రష్యా తర్వాత అత్యధిక సినిమా థియేటర్లున్నది, ప్రపంచం మొత్తంమీద అత్యధిక ప్రేక్షక వర్గం ఉన్నదీ ఇండియాలోనే. అన్నింటినీ మించి అంతర్జాతీయంగా ‘‘బ్రాండ్ ఇండియా’’ ఇమేజ్ రూపొందించడంలో మన సినిమాలు పోషిస్తున్న పాత్ర అత్యంత ప్రముఖమైనది. ప్రపంచం మొత్తంమీద ఓవర్సీస్ పరంగా అత్యధిక బిజినెస్ అవుతున్న సినిమాలు మన భారతీయ సినిమాలే! 
ఇక దేశీయంగా ప్రస్తుతం సినిమాలు భారతీయ జన జీవనంలో ఒక ‘‘రెలీజియన్’’స్థాయిని సాధించాయి. ఇంకా చెప్పాలంటే, ఎన్నో విభిన్నతలు, మరెన్నో వైరుధ్యాలు ఉన్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచుతున్న రెండు ఏకీకృత కారకాలలో ఒకటి క్రికెట్ అయితే, రెండోది నిస్సందేహంగా సినిమానే! వర్ణ, వర్గ, ప్రాంత, లింగ, భాషా వివక్షలకు అతీతంగా భారతీయులందరిలో ఒకే జాతీయతతో మెలిగే సంఘటిత స్ఫూర్తిని రగిలిస్తున్నవి మన సినిమాలే!
మన దేశంలోని ప్రభుత్వాలు ఆర్థిక ఉత్పాదకతకు సంబంధించిన రంగాలలో ప్రభుత్వ విధానాలను గతంలో రూపొందించాయి. ఇప్పటికీ రూపొందిస్తున్నాయి. ఉదాహరణకు వ్యవసాయ విధానం (1948, 1965 మొ.), పారిశ్రామిక విధాన తీర్మానాలు (1948, 1956, 1978, 1991, 2001 మొ.), బ్యాంకింగ్ విధానం (1935, 1976, 1991) ఇలా ఎనె్నన్నో! అలాగే వినోదం, కళలు, సంస్కృతి ప్రాతిపదికను అనుసరించి సినిమాలమీద కూడా ఆయా ప్రభుత్వాలు విధాన తీర్మానాన్ని చేయడం అవసరం.

గతంలో చేయలేదా?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనుండి ఏడేళ్లవరకు, ఆనాటి ప్రభుత్వం సినీ రంగంపై ఎలాంటి చర్యలూ, ఆలోచనలూ చేపట్టలేదు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూజీ స్వతహాగా రచయిత కావడంవల్లనూ, సాహిత్యం, కళలు, సినిమాలు వంటి రంగాలపై మంచి అవగాహన, పట్టుఉన్న వ్యక్తి కావడంవల్ల తొలిసారిగా సినీ రంగంలో చేయాల్సిన ప్రభుత్వపరమైన చర్యల గురించి 1954లో ఓ కమిటీని వేసారు. హృదయనాథ్ కుంజ్రూ అధ్యక్షతన ఏర్పడిన ఆ కమిటీ సూచనలను అనుసరించే మన దేశంలో తొలిసారిగా జాతీయ అవార్డుల వ్యవస్థ, నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, సెన్సారింగ్ వ్యవస్థ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ వంటివి అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని కమిటీలు, అధ్యయనాలు జరిగాయి కానీ అవేవీ జాతీయస్థాయిలో సినీ రంగానికి సంబంధించి వౌలిక మార్పులను తీసుకురాలేకపోయాయి. 
రెండేళ్ళ క్రితం గీత రచయిత జావెద్ అక్తర్ చొరవతో పార్లమెంట్ ఆమోదించిన ‘‘సినీ గీత రచయితలకు పాటలపై కాపీరైట్ హక్కులు’’అనేదే 1954నుండి ఇప్పటివరకూ 60 ఏళ్ళ కాలంలో వచ్చిన అతిముఖ్యమైన పరిణామం అని చెప్పాలి.
అయితే ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఇటు ప్రాంతీయ సినీ పరిశ్రమలలోనూ, అటు జాతీయ బాలీవుడ్ సినీ రంగంలోనూ ఎనె్నన్నో మార్పులు సంభవించాయి. గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరగని పరిణామాలు సినీ నిర్మాణపరంగా, కథలపరంగా, మార్కెటింగ్ పరంగా, ప్రదర్శనపరంగా భారతీయ సినిమాలలో చోటుచేసుకున్నాయి. మరి ఈ మార్పులకు తగినట్లుగా ప్రభుత్వ వైఖరి, విధానం కూడా నిర్ధారణ కావలసి ఉంది. అప్పటికప్పుడు ఆయా అవసరాలను అనుసరించి చేసే నియమిత కాలిక చట్టాలు వంటివి కాకుండా నిర్దిష్ట కార్యాచరణ, దీర్ఘదర్శి ప్రణాళికతో కూడిన ‘‘ప్రత్యేక ఫిలిం పాలసీ’’ని ఈ కొత్త కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసి ఉంది. దానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తో సహా తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఒడిశా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు (సినీ నిర్మాణం, సినీ పరిశ్రమ చురుకుగా ఉన్న ఇతర రాష్ట్రాలతో కలిసి) కూడా ఒక్కుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది!

తెలంగాణా ప్రభుత్వ చొరవ:
జాతీయ స్థాయిలో ‘ఫిల్మ్‌విధానం’ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వం మాత్రమే ఇప్పటికే సినిమా రంగం విషయంలో అధికారిక ప్రకటనను చేసింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంతటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 2000 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి ‘‘ఫిలింసిటీ’’ నిర్మాణాన్ని చేపడతామని, అక్కడ సినిమాలే కాకుండా, టీవీ సీరియళ్ళ నిర్మాణం, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి సాంకేతిక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెస్తామని, దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌ను ‘‘సినిమా హబ్’’గా మారుస్తామని ప్రకటించింది. అయితే నిర్దిష్ట ‘‘ఫిలింపాలసీ’’ ఏదీ ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ ప్రకటన ఆ దిశగా చేసిన ప్రయత్నంగానే భావించాలి. 
సినీ పరిశ్రమ ప్రగతి విషయంలో ఎంతో సానుకూల ధోరణితో కనిపిస్తున్న తెలంగాణా ప్రభుత్వం మరింత ఆచరణాత్మక వ్యూహ రచనకు, సంపూర్ణ ‘‘ఫిలిం పాలసీ’’ రూపకల్పనకు తెలంగాణా సినీ వైతాళికులు అనదగిన శ్యామ్‌బెనెగల్, బి.నరసింగరావుల నేతృత్వంలో దర్శకుడు ఎన్.శంకర్, అల్లాణి శ్రీధర్, దిల్‌రాజు, ఇతర సినీ సంఘాల సభ్యులతోనూ ఒక ఫిలిం అధ్యయన కమిటీని వేస్తే సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం-పరిశ్రమ చేయాల్సిన కార్యక్రమాలు, చట్టాల గురించిన సమగ్ర కార్యాచరణ రూపొందే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం:
ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన ఏదీ చేయకపోయినప్పటికీ, అవసరమైన సందర్భంలో ఎన్నోసార్లు తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఆహ్వానించారనే చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదివరకే ఉమ్మడి రాష్ట్రం ఏలుబడిలోనే విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా ‘తడ’ ప్రాంతంలోనూ, తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఎక్కడ చెబితే అక్కడ భూములను ఇవ్వడానికి, ప్రోత్సాహకాలను అందించడానికి సదా సిద్ధం అని చెపుతున్నారు. ఆమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకోసం సానుకూలంగానే స్పందిస్తోందని చెప్పాలి.

జాతీయస్థాయి కదలికే అవసరం: 
సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వపరమైన సహకారం విషయంలో ఇప్పుడు కావలసిందల్లా జాతీయస్థాయి కదలికే అని చెప్పాలి. దేశంలోని ప్రజలందరికి అత్యల్ప ఖర్చుతో అత్యంత వినోదాన్ని, మానసికోల్లాసాన్ని, ఆలోచనావైఖరులని రేకెత్తిస్తున్న సినిమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన జాతీయ విధానాన్ని ప్రకటించాల్సిన తరుణం ఇదే. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘‘జాతీయ ఫిలిం పాలసీ’’కోసం ఒత్తిడి తీసుకురావలసిన సమయం కూడా ఇదే!