Sunday, 31 May 2020

తెలంగాణ చరిత్రలో ఖాళీల పూరణ !


తెలంగాణ చరిత్రలో ఖాళీల పూరణ !

History is the long struggle of man, by exercise of his reason, to understand his environment and to act upon it. - Edward Hallett Carr,

నిన్నటి దాకా తెలంగాణ
మహాకవి దాశరధి అన్నట్లు కోటి రతనాల వీణ .
ఇప్పుడది
సకల కళల ఖజానా
సాంస్కృతిక శోభల నజరానా !! "
ఇంకా లోతుల్లోకి , చరిత్ర పొరల్లోకి, సాంస్కృతిక మూలాల్లోకి తొంగి చూస్తే నాకర్థమైన సత్యం , తెలంగాణ - ఒక అక్షయ పాత్ర !"
చరిత్ర పరంగా గత కాలపు వైభవపు పరంగా మనం ఎంత కనుక్కున్నా , ఎన్ని నూతన అంశాలను వెల్లడి చేసినా ఇంకా పుట్లుపుట్లుగా పుట్టుకువచ్చే ప్రదేశాలతో క్షయం అనేది లేకుండా అక్షయ చరిత్రను నిక్షిప్తం చేసుకున్న నేల - తెలంగాణ .అందుకే చరిత్రపరంగా ఒక అక్షయపాత్ర .!
ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఒక పుష్పకవిమానం . !!"

పురాణాల ప్రకారం ఎంత మంది ఎక్కినా ఇంకో మనిషికి చోటు ఇవ్వగలిగిన అపురూప అద్భుత వాహనం - పుష్పకవిమానం !
తెలంగాణ మట్టి దొంతరలలో దాగి ఉన్న చరిత్రను వెలికి తీసే చరిత్రకారుల విషయంలో ఎంతో మంది పరిశోధిస్తున్నా ఇంకో చరిత్రకారుడు తన పరిశోధన సాగించడానికి , కావలసిన ఆసక్తికరమైన అంశాలను మరెన్నో అంశాలను ఇవ్వగలిగిన గడ్డ - తెలంగాణ .
అందుకే చరిత్రకారుల పరంగా ఇది ఓ పుష్పకవిమానం .
‌అందుకే తెలంగాణ చరిత్ర , ప్రాచీన , మధ్యయుగకాలపు విశేషాల మీద సురవరం ప్రతాపరెడ్డి , కోమర్రాజు లక్ష్మణరాజు , పి.వి పరబ్రహ్మ శాస్ర్తీ , బి.ఎన్ శాస్త్రి , గులాం యజ్దాని, అడపా సత్యనారాయణ , దేమే రాజారెడ్డి , కుర్రా జితేంద్రబాబు ఇంకా చాలా మంది తెలంగాణకు సంబంధించి ఇప్పటివరకు తెలియని అనేక చారిత్రక విశేషాలను ప్రపంచానికి వెల్లడి చేశారు . తెలంగాణ ప్రాంతం ప్రస్తుత వర్తమాన కాలంలోనే కాదు , ప్రాచీన కాలంలో కూడా అత్యున్నత ప్రాభవ , వైభవాలను కలిగి ఉన్నదనే విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించారు.
‌తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా పీఠభూమిగా ఉండడం , ప్రాచీన గోండ్వానలో భాగంగా ఉండడం వల్ల ప్రాచీన చారిత్రక అవశేషాలు , విశేషాలు మాత్రమే కాక ప్రాక్ చరిత్ర మూలాలను ఎన్నింటికో ఈ నేల మౌన సాక్షిగా మిగిలింది . మెసొయిక్ యుగం నాటి ( అంటే 65 మిలియన్ సంవత్సరాల క్రితం ) ఆనవాళ్ళను సైతం తన గర్భంలో దాచుకుని ఉంది . అలా తెలంగాణ మట్టి పోరలలో గొప్ప చారిత్రక సంపద నిక్షిప్తమై ఉంది. మృణ్మయపాత్రలు , లోహ వస్తువులు , శిలలు ,శిల్పాలు , ఆలయాలు ,కోటలు , వర్ణచిత్రాలు , రాతి సూచికలు ,కోటలు , నిర్మాణాలు ఎన్నో చరిత్రను కొత్తగా నిర్మించడానికి , చరిత్రను కొత్తగా రాయడానికి , పునర్ నిర్మించడానికి కావలసిన అన్ని ఆధారాలను అందిస్తున్నాయి .
నిజానికి తెలంగాణ చరిత్రను అల్లడానికి కావాల్సిన సమస్త ఆధారాలు ఇప్పుడు విరివిగా లభిస్తున్నాయి.
అయితే ఉమ్మడి రాష్ట్ర కాలంలో తెలంగాణ ప్రాంత ప్రాచీన చరిత్ర పరిశోధన దిశగా చేయాల్సినంత కృషి జరగకపోవడం శోచనీయం .
అటు ప్రభుత్వ సంస్థలు కానీ , ప్రయివేటు వ్యక్తులు , చరిత్ర పరిశోధకులు కానీ తెలంగాణ ప్రాంతం మీద అంతగా దృష్టి పెట్టలేదు. కానీ తెలంగాణ ఉద్యమం మొదలయి జ్వలిస్తున్న కాలం ( 2000- 2014 ) లో తెలంగాణ చారిత్రక వైభవ పునాదులలోకి ఉద్యమస్పూర్తిని రగిలించడం వల్ల విస్తృతమైన ఆలోచన మొదలయింది. అయినప్పటికీ అప్పటివరకూ తెల్సిన చరిత్ర మాత్రమే ప్రజల్లోకి విస్తరించింది .
అయితే తెలంగాణ చరిత్ర 2014 వరకూ వెల్లడయిన విషయాలకే పరిమితమా ? తెలంగాణ చరిత్ర అంతమాత్రమేనా ? ఎంతమాత్రమూ కాదు . తవ్వుతున్న కొద్దీ ఊరే చెలిమె లాంటిది- తెలంగాణ అని 2014 నుండి తెలంగాణ నేల అంతటా ఔత్సహిక చరిత్ర పరిశోధకులు చేస్తున్న పరిశోధనలు , అన్వేషణలు వారు వెల్లడి చేస్తున్న విషయాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇప్పటివరకు పురావస్తు శాఖకు , ప్రపంచానికి తెలియని ఎన్నెన్నో వింతైన , వినూత్నమైన , చారిత్రక విశేషాలు ఇప్పుడు వెలుగుచూస్తున్నాయి . ఒక్కొక్క చారిత్రక విశేషం ఆవిష్కృతవుతున్న ప్రతిసారీ ఆశ్చర్యం కలుగుతోంది, సంభ్రమం కలుగుతోంది .విస్మయం వెల్లి విరుస్తోంది... అద్భుతం సాక్ష్యాత్కారం అవుతున్నది .అన్నింటినీ మించి ఇంతటి మహోన్నత చారిత్రక భూమి మీద పుట్టినందుకు గర్వంగా కూడా అనిపిస్తున్నది ...! ఒక దేశం , ఒక భూమి , ఒక జాతి తన తోటి మనుషులకు ఇంతకన్నా ఏమివ్వాలి ? నేను తెలంగాణ బిడ్డను అని గర్వంగా ఛాతి విరుచుకుని పొలికేక పెట్టేంత స్థైర్యాన్ని మన తెలంగాణ చారిత్రక వైభవం ఇస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ మూలమూలల్లోకి సంచరించి పొరలలోకి , అరలలోకి తరచి తరచి చూస్తుంటే తెలంగాణ కొత్త కొత్త వెలుగులతో మన ముందు ప్రత్యక్షం అవుతోంది . అలాంటివాటిలో కొన్ని .
ప్రాచీన పెదరాతి యుగంలోనే తెలంగాణ ప్రాంతంలో మానవుల ఉనికి ఉందనే విషయం దామరవాయి గ్రామంలోని సమాధుల ద్వారా తెలుస్తోంది .
- కేవలం ఇటుకలను మాత్రమే వాడి 65 అడుగుల ఎత్తయిన గొల్లత్త
గుడి నిర్మాణ తీరు .
- హనుమకొండలో బ్రహ్మ దేవుడి విగ్రహం లభించడం.
- కాకతీయుల కాలం నాటి మెట్లబావుల విశిష్టత .
- హన్మకొండలో అష్టభైరవులు కొలువై ఉన్న ప్రదేశం .
- కాకతీయుల కాలం నాటి కోటలు
జల , గిరి , వన , దుర్గంగా ఉన్న ప్రతాపగిరి కోట , అడవిలో సైనిక
పహారా కోసం నందిగామ , కాపురం ,మల్లూరు లాంటి ఎన్నో కోటలు .
- ప్రఖ్యాత కాకతీయ కీర్తితోరణం కన్నా ప్రాచీనమైన అనుమకొండ కోట
తోరణాలు , గొడిశాల తోరణం , నంది కంది , కొలనుపాక లాంటి
తోరణాలు .
ప్రపంచంలోనే అత్యంత ఆరుదైన దేవుడి గుట్ట ఆలయం .
అడవి సోమనపల్లిలోని గుహలయాలు , శాసనాలు , వర్ణ చిత్రాలు . ఇలా ఎన్నో ఎన్నేన్నో
ఇదంతా ఇప్పటిదాకా మనకు తెలియని తెలంగాణ ! తెలుసుకోవడానికి ఇంకా ఎంతో మిగిలి ఉన్న తెలంగాణ ! అందుకే తెలంగాణ చరిత్ర ఆవిష్కరణ విషయంలో ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ లు లేవు . కేవలం కామాలు మాత్రమే ఉన్నాయి ...
ఈ అసంపూర్ణతే నికార్సయిన చరిత్రకారుడికి సవాలు విసురుతుంది . అతనిలోని అన్వేషనాకాంక్షకు ప్రోత్సాహకాన్నీ అందిస్తుంది. అతనిలోని విషయవాంఛకు స్ఫూర్తినిస్తుంది .

As quoted by Robert Stone
" History is perceived as a rational process, the unfolding of a design, something with a dynamic to be uncovered."

ఈ నేపధ్యంలోనే తెలంగాణ ప్రాంతపు ప్రాచీన చరిత్రను , ఇప్పటివరకూ వెల్లడికాని తెలంగాణ చారిత్రక వైభవాన్ని సప్రామాణికంగా అందించే పరిశోధనలకు ఊతం ఇవ్వాలని భాషా సాంస్కృతిక శాఖ భావించింది . తెలంగాణ సాంస్కృతిక మూలాల అన్వేషణకు చరిత్ర మాత్రమే దారి చూపుతుందని భావించింది . అందుకే ఆ దిశగా పరిశోధన చేస్తున్న చరిత్రకారుల గురించి అన్వేషిస్తే నవ తరంలో కొత్త ఆలోచనలతో, అమిత సాహసంతో పరిశోధన చేస్తున్న కొంతమంది యువ చరిత్రకారులు దృష్టిలోకి వచ్చారు . వారిలో సీరియస్ గా పనిచేస్తూ తన జీవిత పరమావధిగా చరిత్రను అన్వేషిస్తున్న అరవింద్ ఆర్య కనిపించాడు .
ఏ ఫలితం గురించీ , ప్రయోజనం గురించీ ఆలోచించకుండా గత 5 ఏళ్లుగా నిరంతరం చరిత్ర పరిశోధనకే తన సమయాన్ని , శక్తినీ, జ్ఞానాన్ని , ధనాన్ని వినియోస్తున్న యువకుడు అరవింద్ ఆర్య

" Anybody can make history .But only a great man can write it " అని ప్రఖ్యాత రచయిత ఆస్కార్ వైల్డ్ అన్నట్లు చరిత్ర పరిశోధన ఒకెత్తు అయితే , ఆ పరిశోధనలో వెల్లడి అయిన అంశాలను సప్రమాణాలతో రాయడం , శాస్త్రీయంగా నమోదు చేయడం మరొక ఎత్తు . ఈ రెండు కార్యాలలోతనదైన ఆసక్తి , ప్రతిభ అరవింద్ లో ఉన్నాయని భాషా సాంస్కృతిక శాఖ 2017లోనే గమనించింది .

అరవింద్ అన్వేషించిన చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాలతో " The Untold Telangana " పేరుతో ఒక ఛాయాచిత్ర ప్రదర్శనను ICCR ఆర్ట్ గ్యాలరీలో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసింది. అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో చారిత్రక ప్రదేశాలు , వాటి వివరాలు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ప్రపంచానికి తెలిశాయి . అనూహ్య స్పందనతో ఆ ప్రదర్శన విజయవంతం అయింది. ఈ కృషిని మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని అరవింద్ చేసిన చారిత్రక అన్వేషణలకు శాశ్వతత్వాన్ని తీసుకుని రావాలని ఆలోచించి అతని పరిశోధనా ఫలితాలను మనకు తెలియని తెలంగాణ పేరుతో పుస్తకంగా ప్రచురించాలని సంకల్పించింది .

మహోన్నత వైభవం , మహోజ్వల వారసత్వ ప్రాభవం , చరిత్ర పరిశోధకులకు స్వర్గధామం లాంటి ప్రాచీన జ్ఞానం ఉన్న తెలంగాణను కొన్ని కొంగొత్త అన్వేషణలతో ఆవిష్కరించడం ఈ పుస్తకం ఉద్దేశ్యం.
భాషా సాంస్కృతిక శాఖ గతంలో కూడా ' కాకతీయ ప్రస్థానం' అనే పేరుతో ఒక పరిశోధనా గ్రంధాన్ని ప్రచురించి తెలంగాణ చరిత్రకు నీరాజనం పట్టింది.
అయితే చరిత్ర ఎప్పుడూ నిర్మాణామవుతూనే ఉంటుంది. కొత్త అన్వేషణలు , కొత్త పరిశోధనలు జరిగిన ప్రతిసారి చరిత్రకు సంబంధించి అప్పటివరకూ ఉన్న చరిత్రకు తోడు అవుతాయి. చారిత్రక విశేషాల జ్ఞానాన్ని సంపన్నం చేస్తాయి . అందుకే చరిత్రకు ఎప్పుడూ అంతం లేదు . ఇది ఎప్పుడూ మధ్యమమే .
John H. Arnold అనే చరిత్రకారుడు History : A very Short Introduction లో చెప్పినట్టు The past itself is not a narrative. In its entirety, it is chaotic, uncoordinated, and complex as life. History is about making sense of that mess, finding or creating patterns and meanings and stories from the maelstrom."
చరిత్ర ఎప్పుడూ అసంబద్ధoగాను , అసంపూర్ణంగాను , కలగుర గంపగాను , అసమగ్రంగానూ ఉంటుంది. చరిత్రకారుడి నైపుణ్యం వాటిని సంపూర్ణoగా , సమగ్రంగా రచించడంలోనే బయటపడుతుంది. ఆ ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది. అయినా ఈ పుస్తకమే సమస్తం అని చెప్పే సాహసం మాకు లేదు . ఇది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఈ పుస్తకం వెల్లడి చేస్తున్న విషయాలపై ఏకీభవించవచ్చు , విభేదించవచ్చు . మరింత విశదంగా పరిశోధించనూవచ్చు . వాటి ద్వారా చరిత్ర సుసంపన్నం అవుతుంది. ఆ దిశగా ఎవరు ప్రయత్నించినా హర్షణీయమే .
అందుకే , For nothing ever ends, really; stories lead to other stories, journeys across a thousand miles of ocean lead to journeys across a continent, and the meanings and interpretations of these stories are legion. '
అని జె.హెచ్ ఆర్నాల్డ్ అన్నమాటలు అక్షర సత్యాలు .

----మామిడి హరికృష్ణ .
సంచాలకులు .భాషా సాంస్కృతిక శాఖ , తెలంగాణ ప్రభుత్వం.

No comments:

Post a Comment