08/08/2014 | -మామిడి హరికృష్ణ
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలోనూ, ఇక్కడ తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రభుత్వాలు స్వల్పకాలంలోనే తేరుకుని ఆయా అభివృద్ధి పథకాల విషయంలో నిర్దిష్ట వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ సందర్భంలోనే చలనచిత్రాలు- చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల మీద అటు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ఓ ‘‘ఫిల్మ్‌పాలసీ’’రూపంలో
నిర్ధారించాల్సిన సమయం ఆసన్నమయింది.
-------------------
స్వాతంత్య్రానంతరం నుండీ జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వం, రాష్టస్థ్రాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతా రంగాల విషయంలో తమతమ విధానాలను ప్రకటిస్తూ వచ్చాయి. ఈ విధాన ప్రకటనలవల్ల ఆయా రంగాల ప్రగతి పురోగతికై ప్రభుత్వం ఏ నిర్మాణాత్మక చర్యలను తీసుకుంటున్నదో తెలుసుకుని, దానికనుగుణంగా ఆయా రంగాలలోని వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలను నిర్ధారించుకునే అవకాశం ఏర్పడ్తుంది. అయితే 66 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ అటు జాతీయస్థాయి ప్రభుత్వాలు కానీ, ఇటు రాష్టస్థ్రాయి ప్రభుత్వాలు సంస్కృతి- కళలు- సినిమా రంగానికి సంబంధించి ఎలాంటి ‘‘విధాన తీర్మానాన్ని’’ ప్రకటించకపోవడం ఒకింత ఆశ్చర్యమే!
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలోనూ, ఇక్కడ తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఈ ప్రభుత్వాలు స్వల్పకాలంలోనే తేరుకుని ఆయా అభివృద్ధి పథకాల విషయంలో నిర్దిష్ట వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ సందర్భంలోనే చలనచిత్రాలు- చిత్ర పరిశ్రమ తీరుతెన్నుల మీద అటు జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని ఓ ‘‘ఫిల్మ్‌పాలసీ’’రూపంలో నిర్ధారించాల్సిన సమయం ఆసన్నమయింది.
‘ఫిల్మ్ పాలసీ’ అవసరమేంటి?
ప్రపంచం మొత్తంమీద అత్యధిక సంఖ్యాక సినిమాలు నిర్మిస్తున్న దేశం మన దేశమే అనే ఒకే ఒక్క వాస్తవ సూచిక చాలు మనకంటూ ఓ ‘‘ఫిల్మ్ పాలసీ’’ అవసరం అని చెప్పడానికి! ఇదొక్కటేనా? వినోద రంగంలో సినిమాలకు సంబంధించి ఇంకా ఎన్నో విశేషాలు భారతీయ సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నాయి. వినోద రంగంలో హాలీవుడ్ తర్వాత అత్యధిక పెట్టుబడులు పెడుతున్నది మన సినీ రంగంలోనే. రష్యా తర్వాత అత్యధిక సినిమా థియేటర్లున్నది, ప్రపంచం మొత్తంమీద అత్యధిక ప్రేక్షక వర్గం ఉన్నదీ ఇండియాలోనే. అన్నింటినీ మించి అంతర్జాతీయంగా ‘‘బ్రాండ్ ఇండియా’’ ఇమేజ్ రూపొందించడంలో మన సినిమాలు పోషిస్తున్న పాత్ర అత్యంత ప్రముఖమైనది. ప్రపంచం మొత్తంమీద ఓవర్సీస్ పరంగా అత్యధిక బిజినెస్ అవుతున్న సినిమాలు మన భారతీయ సినిమాలే!
ఇక దేశీయంగా ప్రస్తుతం సినిమాలు భారతీయ జన జీవనంలో ఒక ‘‘రెలీజియన్’’స్థాయిని సాధించాయి. ఇంకా చెప్పాలంటే, ఎన్నో విభిన్నతలు, మరెన్నో వైరుధ్యాలు ఉన్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచుతున్న రెండు ఏకీకృత కారకాలలో ఒకటి క్రికెట్ అయితే, రెండోది నిస్సందేహంగా సినిమానే! వర్ణ, వర్గ, ప్రాంత, లింగ, భాషా వివక్షలకు అతీతంగా భారతీయులందరిలో ఒకే జాతీయతతో మెలిగే సంఘటిత స్ఫూర్తిని రగిలిస్తున్నవి మన సినిమాలే!
మన దేశంలోని ప్రభుత్వాలు ఆర్థిక ఉత్పాదకతకు సంబంధించిన రంగాలలో ప్రభుత్వ విధానాలను గతంలో రూపొందించాయి. ఇప్పటికీ రూపొందిస్తున్నాయి. ఉదాహరణకు వ్యవసాయ విధానం (1948, 1965 మొ.), పారిశ్రామిక విధాన తీర్మానాలు (1948, 1956, 1978, 1991, 2001 మొ.), బ్యాంకింగ్ విధానం (1935, 1976, 1991) ఇలా ఎనె్నన్నో! అలాగే వినోదం, కళలు, సంస్కృతి ప్రాతిపదికను అనుసరించి సినిమాలమీద కూడా ఆయా ప్రభుత్వాలు విధాన తీర్మానాన్ని చేయడం అవసరం.
గతంలో చేయలేదా?
స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనుండి ఏడేళ్లవరకు, ఆనాటి ప్రభుత్వం సినీ రంగంపై ఎలాంటి చర్యలూ, ఆలోచనలూ చేపట్టలేదు. అయితే అప్పటి ప్రధాని నెహ్రూజీ స్వతహాగా రచయిత కావడంవల్లనూ, సాహిత్యం, కళలు, సినిమాలు వంటి రంగాలపై మంచి అవగాహన, పట్టుఉన్న వ్యక్తి కావడంవల్ల తొలిసారిగా సినీ రంగంలో చేయాల్సిన ప్రభుత్వపరమైన చర్యల గురించి 1954లో ఓ కమిటీని వేసారు. హృదయనాథ్ కుంజ్రూ అధ్యక్షతన ఏర్పడిన ఆ కమిటీ సూచనలను అనుసరించే మన దేశంలో తొలిసారిగా జాతీయ అవార్డుల వ్యవస్థ, నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డైరెక్టర్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్, సెన్సారింగ్ వ్యవస్థ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ వంటివి అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని కమిటీలు, అధ్యయనాలు జరిగాయి కానీ అవేవీ జాతీయస్థాయిలో సినీ రంగానికి సంబంధించి వౌలిక మార్పులను తీసుకురాలేకపోయాయి.
రెండేళ్ళ క్రితం గీత రచయిత జావెద్ అక్తర్ చొరవతో పార్లమెంట్ ఆమోదించిన ‘‘సినీ గీత రచయితలకు పాటలపై కాపీరైట్ హక్కులు’’అనేదే 1954నుండి ఇప్పటివరకూ 60 ఏళ్ళ కాలంలో వచ్చిన అతిముఖ్యమైన పరిణామం అని చెప్పాలి.
అయితే ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఇటు ప్రాంతీయ సినీ పరిశ్రమలలోనూ, అటు జాతీయ బాలీవుడ్ సినీ రంగంలోనూ ఎనె్నన్నో మార్పులు సంభవించాయి. గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరగని పరిణామాలు సినీ నిర్మాణపరంగా, కథలపరంగా, మార్కెటింగ్ పరంగా, ప్రదర్శనపరంగా భారతీయ సినిమాలలో చోటుచేసుకున్నాయి. మరి ఈ మార్పులకు తగినట్లుగా ప్రభుత్వ వైఖరి, విధానం కూడా నిర్ధారణ కావలసి ఉంది. అప్పటికప్పుడు ఆయా అవసరాలను అనుసరించి చేసే నియమిత కాలిక చట్టాలు వంటివి కాకుండా నిర్దిష్ట కార్యాచరణ, దీర్ఘదర్శి ప్రణాళికతో కూడిన ‘‘ప్రత్యేక ఫిలిం పాలసీ’’ని ఈ కొత్త కేంద్ర ప్రభుత్వం తీసుకోవలసి ఉంది. దానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌తో సహా తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఒడిశా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు (సినీ నిర్మాణం, సినీ పరిశ్రమ చురుకుగా ఉన్న ఇతర రాష్ట్రాలతో కలిసి) కూడా ఒక్కుమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది!
తెలంగాణా ప్రభుత్వ చొరవ:
జాతీయ స్థాయిలో ‘ఫిల్మ్‌విధానం’ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వం మాత్రమే ఇప్పటికే సినిమా రంగం విషయంలో అధికారిక ప్రకటనను చేసింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంతటి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు 2000 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పూర్తిస్థాయి ‘‘ఫిలింసిటీ’’ నిర్మాణాన్ని చేపడతామని, అక్కడ సినిమాలే కాకుండా, టీవీ సీరియళ్ళ నిర్మాణం, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ వంటి సాంకేతిక సౌకర్యాలను కూడా అందుబాటులోకి తెస్తామని, దక్షిణ భారతంలోనే హైదరాబాద్‌ను ‘‘సినిమా హబ్’’గా మారుస్తామని ప్రకటించింది. అయితే నిర్దిష్ట ‘‘ఫిలింపాలసీ’’ ఏదీ ఇంకా వెల్లడి చేయనప్పటికీ, ఈ ప్రకటన ఆ దిశగా చేసిన ప్రయత్నంగానే భావించాలి.
సినీ పరిశ్రమ ప్రగతి విషయంలో ఎంతో సానుకూల ధోరణితో కనిపిస్తున్న తెలంగాణా ప్రభుత్వం మరింత ఆచరణాత్మక వ్యూహ రచనకు, సంపూర్ణ ‘‘ఫిలిం పాలసీ’’ రూపకల్పనకు తెలంగాణా సినీ వైతాళికులు అనదగిన శ్యామ్‌బెనెగల్, బి.నరసింగరావుల నేతృత్వంలో దర్శకుడు ఎన్.శంకర్, అల్లాణి శ్రీధర్, దిల్‌రాజు, ఇతర సినీ సంఘాల సభ్యులతోనూ ఒక ఫిలిం అధ్యయన కమిటీని వేస్తే సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం-పరిశ్రమ చేయాల్సిన కార్యక్రమాలు, చట్టాల గురించిన సమగ్ర కార్యాచరణ రూపొందే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం:
ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన ఏదీ చేయకపోయినప్పటికీ, అవసరమైన సందర్భంలో ఎన్నోసార్లు తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఆహ్వానించారనే చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇదివరకే ఉమ్మడి రాష్ట్రం ఏలుబడిలోనే విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా ‘తడ’ ప్రాంతంలోనూ, తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఎక్కడ చెబితే అక్కడ భూములను ఇవ్వడానికి, ప్రోత్సాహకాలను అందించడానికి సదా సిద్ధం అని చెపుతున్నారు. ఆమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకోసం సానుకూలంగానే స్పందిస్తోందని చెప్పాలి.
జాతీయస్థాయి కదలికే అవసరం:
సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వపరమైన సహకారం విషయంలో ఇప్పుడు కావలసిందల్లా జాతీయస్థాయి కదలికే అని చెప్పాలి. దేశంలోని ప్రజలందరికి అత్యల్ప ఖర్చుతో అత్యంత వినోదాన్ని, మానసికోల్లాసాన్ని, ఆలోచనావైఖరులని రేకెత్తిస్తున్న సినిమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన జాతీయ విధానాన్ని ప్రకటించాల్సిన తరుణం ఇదే. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘‘జాతీయ ఫిలిం పాలసీ’’కోసం ఒత్తిడి తీసుకురావలసిన సమయం కూడా ఇదే!
No comments:
Post a Comment