hi folks, here its my poem published in PRASTHANAM, august, 2014 issue..
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్ నా!
-------మామిడి హరికృష్ణ-9908844222
1.ఏదో ఓ ఘడియన
ఆకులన్నీ చెట్టుకి అల్విదా చెప్పి
భూమి పొరల్లో కన్రెప్పలని వాల్చేసి
మట్టిగా రూపాంతరిస్తాయి
ఆ నిర్దయ నిమిషాన్నే
ఎక్కడో ఏ చెట్టు నీడనో
ఖండిత హృదయం వెక్కి వెక్కి దిగులు పడుతుంది
ఎక్కడో ఏ గోడ చాటునో
ఒక దుఃఖిత నీడ సూర్యున్ని ఆవిరి చేస్తుంది
ఎక్కడో ఏ వాడ మలుపునో
ఒక అవాంచిత అడుగు జాడ సముద్రాన్ని దిగమింగుతుంది
ఎక్కడో ఏ మేడ మెట్లనో
ఒక అస్ఖలిత జ్ఞాపకం జారిపడి తల బద్దలు చేసుకుంటుంది
ఎక్కడో ఏ ఎడారి తీరాన్నో
ఒక జ్వలిత గాయం ఇసుక తుఫానై సుళ్ళు తిరుగుతుంది
2.ఏదో ఒక ఘడియన
చినుకులన్నీ మబ్బులకి అల్విదా చెప్పి
గాలి జారుడుబండలోంచి
నేల పైకి దూకేస్తాయి
ఆ దయార్ద్ర సమయాన్నే
ఎక్కడో ఏ తడారిన గొంతుల్లోనో
ఒక వ్యధిత స్వరం పాటై ఎగురుతుంది
ఎక్కడో ఏ శిశిర కొమ్మ కళ్ళలోనో
ఒక వసంత పుష్పం పల్లవిస్తుంది
ఎక్కడో ఏ క్షతగాత్ర యుద్ధ భూమిలోనో
ఒక నిశాంత శాంతి వెన్నెలలా కురుస్తుంది
ఎక్కడో ఏ బెంగపడిన గుండెల్లోనో
ఒక హరిత స్పందన కొత్త జీవితమై పుడుతుంది
3.చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్ నా
ఇరు ఘడియల అంచుల దాకా వ్యాపించిన కాలం
నువ్వు
రెండు అల్విదా ల మధ్య పెండ్యులం
నేను...... !
No comments:
Post a Comment