FOLKS, here its d story on the endeavours put by our Department of Tsdirector Culture, after my assumption of charge, published in BATUKAMMA, sunday supplement of NAMASTHE TELANGANA, 27 Dec, 2015.. Thank u Katta Shekar Reddy anna
మన భాషా సాంస్కృతిక శాఖ పునర్నిర్మాణంలో కొత్త సాలు
- మధుకర్ వైద్యుల
కొత్తసాలు వస్తున్న క్రమంలో రాష్ర్టావతరణ తొలిపొద్దు నుంచి నేటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వేసిన పాదు తంగేడు వనంగా ఎదగడానికి ఆ శాఖ చేసిన కృషి ఎంతో ఉంది.
ఎక్కడైతే భాషా సంస్కృతులు పరిఢవిల్లు తాయో ఆ ప్రాంతం సుసంపన్నంగా ఉంటుంది. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత సాధించుకున్న తెలంగాణలో మన అస్తిత్వం కనిపించేలా భాషా సాంస్కృతిక శాఖ పనితీరు ఉండాలి.
ఇంకా చెప్పాలంటే పునర్నిర్మాణం సోయితో పనిచేయాలి. ఆ లక్ష్యసాధనలో వేసే ప్రతి అడుగు స్వతంత్రంగా, నవ్యంగా సాగాలి. సకల జనులు ఏ ఆశయం కోసం ఉద్యమించారో ఆ ఆకాంక్షలు తీర్చాలి. ఆయా రంగాల్లో కృషి చేసిన కళాకారులు, వైతాళికులు, కవులకు అశేషంగా సబ్బండ వర్ణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ల కళారూపాలను ఆదరించడం, ప్రోత్సహించడం, అభినందించడం కూడా ఒక బాధ్యతే.
తెలంగాణ అంటేనే సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ ప్రతీది ఒక పండుగే. మనిషి అచేతనాన్ని చైతన్య పరిచే శక్తి ఇక్కడి మట్టి, నీరు, గాలికి ఉంది. అందుకే ఈ నేల ఎన్నో కళలకు పురుడు పోసింది. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ కళలుగానే గుర్తింపు పొందాయి.
అందువల్లే తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం ఒక భాగమైంది. అందుకే, మన రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు కొత్త జీవం పోసి కళారాధనకు శ్రీకారం చుట్టింది. సమైక్య రాష్ట్రంలో కేవలం 36 కోట్లకు పరిమితమైన సాంస్కృతిక శాఖ బడ్జెట్‌ను ఈ ఏడాది 154 కోట్లకు పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఉదారతను చాటుకొంది.
వైతాళికుల స్మరణ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది మొదలు భాషా సంస్కృతి అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఇక్కడి సంస్కృతిని, కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది. అందులో భాగంగా మన వైతాళికుల జయంతి, వర్థంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడంతోపాటు వారి పేర్లతో అవార్డులనూ ప్రకటించింది.
కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడంతోపాటు ప్రభుత్వం ఆయన పేరునా పురస్కారాన్ని ప్రవేశపెట్టి తొలిసారి అమ్మంగి వేణుగోపాల్‌కు అందించింది. దాశరథి జయంతి ఉత్సవాలలో దాశరథి పురస్కారాన్ని తిరుమల శ్రీనివాసాచార్యులకు అందజేసింది. వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రం ఏర్పాటుకు 50 కోట్లు కేటాయించగా, హైదరాబాద్‌లో 14 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో తెలంగాణా కళాభారతి నిర్మాణం చేపట్టనుంది.
గజ్వేల్‌లోనూ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఆడిటోరియం ఏర్పాటు చేయనుంది. ఇవేకాక ప్రతి జిల్లాలో ఆడిటోరియం, కళాభారతిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొమురాం భీం, పి.వి. నరసింహారావు, ఈశ్వరీ బాయి, కొండా లక్ష్మన్ బాపూజీ వంటి మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్య క్రమాలుగా ప్రకటించింది. 3,254 మంది వృద్ధ కళాకారులకు ప్రతి నెల 1500 రూపాయల పెన్షన్ సౌకర్యం, 550 మంది కళాకారులకు సాంస్కృతిక సారథి కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది.
రాష్ట్ర అవతరణ సందర్భంగా మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ఉత్తమ పురస్కారాలనూ అందించడం ద్వారా కేసీఆర్ తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 32 విభాగాల్లో 52 రంగాల వారికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలిచ్చి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు 5,780 మందిని ప్రభుత్వం సత్కరించింది. ఆవార్డుల కింద 7 కోట్ల 52 లక్షల 70 వేలు అందజేసింది. భారతదేశ చరిత్రలోనే ఇంతలా ప్రజలను గౌరవించుకున్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరేదీ లేదంటే అతిశయోక్తికాదు. ఉగాది వేడుకల్లోనూ 19 అంశాల్లో 28 మందికి 10 వేల చొప్పున అందించి వారిని ఘనంగా సత్కరిస్తూ వారి సేవలను ప్రశంసించుకుంది.
జాతీయ సంస్థలతో సమన్వయం: తెలంగాణ అస్తిత్వాన్ని దేశ నలుమూలలా ప్రసరింప జేయడానికి భాషా సాంస్కృతిక శాఖ చేసిన కృషి గర్వించదగింది. జాతీయ స్థాయి సాంస్కృతిక సంస్థలతో కలసి పనిచేయడం ద్వారా కళలను ఇచ్చి పుచ్చుకునే కొత్త ధోరణికి శ్రీకారం చుట్టింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ద్వారా నాటకోత్సవాలు నిర్వహించారు. సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు, నార్త్‌ఈస్ట్ కల్చరల్ సెంటర్, దిమాపూర్ కళాకారులతో సాంస్కృతిక వినిమయాన్ని పెంపొందించుకుంటోంది. ఈశాన్య రాష్ర్టాల కళాకారులతో ఆక్చేవ్-2014 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించారు. తెలంగాణ కళాకారులు వారం రోజుల పాటు దేశ రాజధానిలోనూ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా మన సాంస్కృతిక వైభవాన్ని చాటే అవకాశం దక్కించుకున్నారు.
ఇరాన్, తెలంగాణ కళాకారులతో హైదరాబాద్‌లో జుగల్‌బందీ నిర్వహించింది. గతంలో తెలంగాణలో భాగమైన కర్ణాటక, బీదర్ ప్రాంతాల్లో యాదోంకీ బారాత్ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా ప్రదర్శనలిచ్చారు. అంతర్రాష్ట్ర సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి గాను కేరళభవన్ నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వడంతో పాటు కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రీజనల్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌ఎస్‌డీ ఛైర్మన్ రతన్ థియామ్‌కు అందించడం జరిగింది.
అంతరించి పోతున్న కళలకు జీవం: తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. సమైక్య పాలనలో ఇక్కడి కళలకు సరైన గుర్తింపు లభించకపోవడంతో ఎన్నో కళలు కనుమరుగయ్యాయి. అలా అవసాన దశలో ఉన్న కళలకు కొత్త జీవం పోయడానికి సాంస్కృతిక శాఖ పూనుకున్నది. వరంగల్ జిల్లా శాయంపేట ప్రాంతానికి చెందిన కూనపులి పటం కథ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కథ, దురిశెట్టి రామయ్య కడ్డీ తంత్రి కథ, కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన సాధన శూరుల సాహసాలు వంటివి అంతరించి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వారి తర్వాత ప్రదర్శన ఇచ్చేవారే లేరు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా ఆ కళలను పునరుజ్జీవింప జేసుకునే బృహత్తర కార్యక్రమానికి శాఖ శ్రీకారం చుట్టింది. వీటితోపాటు ఆధునిక కళలైన డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిం, సినిమాలకు కూడాప్రాధాన్యం ఇస్తున్నారు.
116 రోజుల నిరంతర తెలంగాణ కళారాధన: భాషా సాంస్కృతిక శాఖకు డైరెక్టర్‌గా మామిడి హరికృష్ణ నియమితులయ్యాక రవీంద్రభారతి స్థాపించిన 54 సంవత్సరాల చరిత్రలో జరగనటువంటి ఒక అద్భుతాన్ని చేసి చూపెట్టారు. రాష్ర్టావిర్భావం తర్వాత తెలంగాణ కళారాధన పేరుతో 116 రోజులపాటు నిత్యం కళాప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ఈ ఘనతను స్వంతం చేసుకుంది. ఈ ఉత్సవాల్లో బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, సురభి నాటకాలు, మైమ్, మ్యాజిక్, మిమిక్రీ, సలామ్ తెలంగాణ శీర్షికన ఉర్దూ సంప్రదాయ కళలు సూఫీ, ముషాయిరా, ఖవ్వాలి, గజల్స్ ఇలా విభిన్న రకాల కళలను ఒకే వేదికపై ప్రదర్శించడం అద్భుతం.
చిందు యక్షగాన కళకు కొత్త జవసత్వాలను అందించడానికిగాను నీటి పారుదల శాఖతో సమన్వయం చేసి 129 బృందాలతో మన ఊరు మన చెరువు కార్యక్రమ ప్రచార కళా ప్రదర్శనలు ఇప్పించారు. దీనికోసం చెరువు కథాంశంగా ఒగ్గు కళాకారులకు జనగాం ప్రాంతంలో 9 రకాల కొత్త కథలతో శిక్షణనిచ్చి వారిచే రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ పనులు జరుగుతున్న గ్రామాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సాహిత్యానికి పెద్ద పీట: గతంలో చేయని కార్యక్రమాల్లో భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమం సాహిత్యానికి పెద్ద పీట వేయడం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా మూడు అంశాలపై ప్రత్యేక కవితా సంపుటాలు తీసుకు రావడం ద్వారా తెలంగాణ కవుల పుట్టిల్లు అని నిరూపించే ప్రయత్నం చేసారు. తొలి ప్రయత్నంగా కొత్తసాలు పేరుతో సంకలనాన్ని తీసుకువచ్చింది. బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడువనం పేరుతో కేవలం తంగేడు పువ్వు మీద 166 మంది కవులతో కవితా సంకలనం తీసుకురావడం ప్రపంచ సాహితీ చరిత్రలోనే చారిత్రాత్మక అంశం. ఇక రాష్ట్ర అవతరణను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన మరో సంకలనం తొలిపొద్దు. అత్యధిక కవులు రాసిన కవితా సంకలనం ఇది. 442 మంది కవుల స్పందనకు ఈ సంకలనం ప్రత్యక్ష నిదర్శనం.
మరోవైపు తెలంగాణకు పుట్టినిల్లయిన పేరిణీ నృత్యానికి జీవం పోసే ఉద్దేశ్యంతో నెలరోజుల పాటు పేరిణీ నృత్య కళాకారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. గంగా జమునా తేహజిబ్‌గా పేరు గాంచిన హైదరాబాద్ సంస్కృతికి పెద్దపీట వేసేందుకు గాను ఉర్దూ ముషాయిరా, గజల్స్, సూఫీ సంగీతం ఖవ్వాలీ వంటి ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది.
మేడారం జాతర: వచ్చే ఏడాది నిర్వహించనున్న మేడారం జాతరలోనూ సాంస్కృతిక శాఖ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. జాతర జరుగుతున్నన్ని రోజులు కూడా గిరిజన కళాకారులతో కళా ప్రదర్శనలతోపాటు సురభి కళాకారులు రూపొందించిన సమ్మక్క, సారక్క నాటకాన్ని కూడా ప్రదర్శించనున్నారు.
తెలంగాణ భారతి: హైదరాబాద్ నడిబొడ్డున భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో ఉన్న కళానిలయం రవీంద్రభారతి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రవీంద్రభారతిలో తెలంగాణ మట్టివాసన వేస్తోంది. తెలంగాణ కళారూపాలన్నీ ఆ వేదికమీద ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతుంటే చల్లని అంబలి తాగినట్టు కడుపు నిండుగుండి ఆకలి ఆమడ దూరం పోతోందంటే అతిశయోక్తి కాదు.
***************************************************************************
మన రాష్ట్రం-మన పండుగలు
రాష్ర్టావతరణ: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం మొదలు నేటివరకు కూడా తెలంగాణ పండుగలన్నింటినీ ఒక సామూహిక ఉత్సవాలుగా నిర్వహించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి భాషా సాంస్కృతిక శాఖ వెన్ను దన్నైంది. రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాది వేడుకలతో కనీవినీ ఎరుగని రీతిలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో చౌమల్లా ప్యాలెస్ మొదలుకొని శిల్పారామం వరకు 32 వేదికల మీద కళాప్రదర్శనలు ఇవ్వడం ద్వారా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ ఉత్సవాలకు 20 కోట్లు ఖర్చు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించింది.
బతుకమ్మ: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిలోని విశిష్టత లన్నింటినీ చాటి చెప్పేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఫొటోగ్రఫీ పోటీలు, చిత్రలేఖనం, సాంస్కృతిక- సాహిత్య వేడుకలు, చిత్రోత్సవం, కవి సమ్మేళనం నిర్వహించింది. బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. కేవలం పూల పండుగగానే కాకుండా మహిళలు, బాలికలు, ప్రకృతి, చెరువుల పండుగగా బతుకమ్మను తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణ జీవన నేపథ్యాన్ని ప్రచారం చేసే అవకాశం దక్కింది.
బోనాలు: హైదరాబాద్‌కే తలమానికమైన బోనాల పండుగను సైతం గతం కంటే వైభవంగా నిర్వహించింది. దీనికోసం 89 దేవాలయాల్లో నెల రోజలపాటు కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. గత పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన ఈ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి ఆత్మగౌరవ ప్రతీకలుగా మలుచుకున్నం.
గోదావరి పుష్కరాలు: తెలంగాణ ఏర్పడిన తర్వాత గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. గోదావరిని మనం కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం పుష్కరాల ద్వారా దక్కింది. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో పుష్కర వేడుకలను 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పుష్కరాల్లో సోన్, గూడెం, బాసర, పోచంపాడు, కందకుర్తి, ధర్మపురి, కాళేశ్వరం, కోటిలింగాల, రామన్నగూడెం, మంగపేట, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సాంస్కృతిక సారథి బృందాలతోపాటు స్థానిక వృత్తి, జానపద, శాస్త్రీయ కళాకారులచే కళా ప్రదర్శనలు, భక్తి సంగీత కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక ప్రచారానికి పెద్ద పీట వేసింది.
జానపద జాతర: అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 22న చిందు ఎల్లమ్మకు జన్మనిచ్చిన నిజామాబాద్ నుంచి మొదలుపెట్టి పది రోజుల పాటు తెలంగాణ జానపద జాతర పేరుతో పది జిల్లాల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఆగస్టు 30న హైదరాబాద్‌లో ముగింపు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించింది.
No comments:
Post a Comment