Sunday, 31 May 2020

త్రివేణీ సంగమం తెలంగాణ !




త్రివేణీ సంగమం తెలంగాణ !... మామిడి హరికృష్ణ.

* మహాసభల్లో తెలంగాణ కళా రూపాలతోపాటు సాహితీ సాంస్కృతిక ఉత్తేజం
* తెలుగు సినీ రంగ కార్యక్రమాలకూ స్థానం
* ‘తెలంగాణ హార్వెస్ట్‌’ పేరుతో ఆంగ్లంలోకి తెలంగాణ కథలు
* ‘ఆంధ్రజ్యోతి’తో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భాష గొప్పదని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం తర్వాత అంటే, 2000 సంవత్సరం నుంచే తెలంగాణ భాష అస్తిత్వ స్ఫూర్తితో, ఆత్మగౌరవ కేతనంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రాంత భాషా ప్రేమికులు, కవులు, రచయితలు తెలుగు భాషాభివృద్ధికి వందల ఏళ్ల క్రితమే పరిశోధనలు చేశారన్నారు. కానీ, వారు మరుగున పడ్డారని అన్నారు. తెలుగుకు ప్రాచీన హోదా లభించిన తర్వాత.. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం మహాసభల ద్వారా లభించనుందన్నారు. తెలుగు మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ‘ఆంధ్ర‌జ్యోతి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు..
 
ఆంధ్రజ్యోతి: తెలంగాణ సంస్కృతి తెలుగు భాషాభివృద్ధికి ఎలా తోడ్పడుతోంది?
హరికృష్ణ: సంస్కృతి అనేది విస్తృత ధోరణి కలిగినది. ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, కట్టుబాట్లు, ఉత్సవాలు, వేడుకలు, భాష, ఆహారం, ఆహార్యం, కవిత్వం, సినిమా అన్నీ కలిపితేనే సంస్కృతి. వ్యక్తికి గుర్తింపు కార్డు ఎలాంటిదో.. ఒక జాతికి సంస్కృతి అలాంటిది. తెలంగాణ శైలిలో మాట్లాడుతున్నాం కాబట్టే తెలంగాణ సంస్కృతి అన్నాం. సంస్కృతిలో భాగమే భాష. సంస్కృతికి నిర్దిష్ట రూపం అనేది లేదు. అది కళ, సినిమా, కట్టు బొట్టు, హస్తకళలు మొదలగు వాటి రూపంలో కనిపిస్తుంది. అందుకే, భాషా సాహిత్య ఉత్సవాలు ప్రధానంగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలనుజనరంజకంగా ఉండేలా సాంస్కృతిక కళా ప్రదర్శనలను తోడు చేస్తూ ప్రణాళిక రూపొందించాం. తెలుగు భాష, సాహిత్యం ఉన్నతిలో తెలంగాణ కృషిని వెల్లడించే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
 
‘తెలంగాణ భాష’ అనే భావన ఎప్పుడు ఏర్పడింది?
అంటే, 60 ఏళ్ల చరిత్ర తీసుకుంటే, తెలంగాణ నుంచి వచ్చిన కవులు, భాషావేత్తలు చేసిన కృషి గుర్తించబడలేదు. మన సంస్కృతి అణచివేయబడింది. అలాంటి క్రమంలో, రాష్ట్రం వచ్చి మూడేళ్లైన సందర్భంగా మనవాళ్లు చేసిన కృషిని గుర్తించాల్సి ఉంది. వాస్తవానికి, 2000 సంవత్సరం నుంచే అంటే, మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాతే తెలంగాణ భాషలో మాట్లాడటం తెలంగాణ వాదుల్లో ఆత్మ గౌరవం ఎదిగింది. సోమన కాలం నుంచి పోతన, రామదాసు, దాశరథి, కాళోజీ, భాగ్యరెడ్డి వర్మ, సినారె వంటి మహనీయులు తెలుగు భాష, సాహిత్యానికి సేవలు చేశారు.
 
తెలంగాణ సుసంపన్నతకు దారులు వేశారు. వారి జీవిత చిత్రాలను కటౌట్ల రూపంలో ఏర్పాటు చేస్తున్నాం. వేదికపై తెలంగాణ శిల్పం, వాస్తుశిల్పం, పెయింటింగ్‌లు, సంస్కృతి ఉట్టిపడేలా ఉంటాయి. తెలంగాణ ఉద్యమాన్ని, వారసత్వాన్ని తెలియజెప్పే నాటకాలు, కళారూపాలు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సాంస్కృతిక సౌరభం, సాహితీ వాతావరణం కలగలిసి ఉంటాయి. మహా సభలు ఒక రథం అయితే సాహిత్యం- సంస్కృతి రెండు చక్రాల్లాంటివి.
 
తెలుగు భాషపై అత్యధికంగా ప్రభావం చూపే ‘తెలుగు సినిమా’పై తెలంగాణ ముద్ర తక్కువనే భావన ఉంది? మీరేమంటారు?
మహా సభల నిర్వహణలో సినిమాలకు, సినిమాపై చర్చలకు, సంగీత ప్రదర్శనలకు ఒకరోజు కేటాయించాం. మంచి సందేశం ఇచ్చే పాటలు, సినిమాలను ప్రదర్శించబోతున్నాం. ఇటీవలి కాలంలో సినిమాలు తీసే యువకులు చాలా మంది వచ్చారు. లఘు చిత్రాలు తీసి యూ ట్యూబ్‌లో పెడుతున్నారు. ఇలాంటి కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. అప్పుడే స్వతంత్రంగా సినిమాలు తీయగలిగే వర్గం ఒకటి ఉత్పన్నమవుతుంది.
 
తెలుగు భాషకు ప్రాచీన హోదా అంశంలో మీరు చేసిన కృషి ఏంటి?
వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్న భాషలకు కేంద్రం ప్రాచీన భాష హోదా కల్పిస్తోంది. తెలుగుకు కూడా 2006లో ఇచ్చారు. తమిళనాడులోని గాంధీ అనే న్యాయవాది మద్రాస్‌ హైకోర్టులో 2009లో కేసు వేశారు. కేంద్రం జీవో ఇచ్చినా ప్రాచీన హోదా నిలిచిపోయింది. అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలుగు భాషాభిమాని కావటం వల్ల 2015లో ఆ కేసులో ఇంప్లీడ్‌ అయి తెలంగాణ ప్రభుత్వం తరపున కోర్టులో కేసు ఫైల్‌ చేశాం. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించడంతో ద్విసభ్య ధర్మాసనం మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించింది. నేను స్వయంగా ప్రభుత్వం తరపున హాజరై పనులు పూర్తి చేశా. ప్రస్తుత మహా సభల నిర్వహణతో కూడా తె లుగు భాష గొప్పతనాన్ని, ప్రాచీన మూలాలను చాటి చెప్పడానికి అవకాశం లభిస్తుంది.
 
మహా సభల్లో సాంస్కృతిక శాఖ తరపున చేస్తున్న కార్యక్రమాలు ఏంటి?
తెలంగాణ అంటేనే జానపద కళల ఖజానా. జానపదం, శాస్త్రీయం, దక్కనీ కలగలిసిన త్రివేణీ సంగమం తెలంగాణ. ఈ మూడు కళారూపాలకు సంబంధించి ప్రదర్శించే నృత్యం, నాటకం, సంగీతంలో తెలుగు భాష, తెలంగాణ సంస్కృతికి మద్దతుగా కార్యక్రమాలు రూపొందించాం. వీటితో పాటు తెలుగు కవులు, రచయితలను కీర్తించే విధంగా ప్రత్యేక నృత్య రూపకాలను రచించాం. కొరియోగ్రఫీ చేసి వాటిని ప్రదర్శించబోతున్నాం. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడిన తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పిస్తున్నాం. వారికి కళారూపాలు ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నాం.

భాషాభివృద్ధికి తోడ్పడిన వారి రచనలకు సంబంధించి సాంస్కృతిక శాఖ ఏం చేస్తుంది?
సీఎం కేసీఆర్‌ స్వతహాగా భాషా ప్రేమికుడు. కాబట్టి తెలంగాణ రచనలు వెలుగులోకి తేవాలని సూచించారు. నందిని సిధారెడ్డి, రమణాచారి, దేశపతి, బుర్రా వెంకటేశం సహకారంతో రచనలు, కవితా సంకలనాలను పుస్తక రూపంలో తెస్తున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రస్థాయిలో ఏడాదికి ఐదుసార్లు కవి సమ్మేళనాలు నిర్వహించాం. అవి చరిత్రలో నిలిచిపోయేలా పుస్తకరూపం చేశాం. మహా సభల్లో ‘పద్య తెలంగాణం’ పేరుతో చందోబద్ధ కవితలతో కూడిన పుస్తకం రూపొందిస్తున్నాం.
 
136 మంది పద్య కవులతో కవి సమ్మేళనం నిర్వహించి, వారి కవితలను పుస్తక రూపంలో వేస్తున్నాం. ఆలిండియా రేడియో వారితో ఒప్పందం చేసుకుని.. వ్యాసాలు రాయించాం. 151 మంది మహనీయుల జీవిత గాథలను ‘తేజోమూర్తులు’ పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరిస్తాం. ఇవి కాకుండా 15 రకాల ‘పటం కథలు’ తెలంగాణలో ఉన్నట్లు గమనించాం. వాటన్నింటికీ సంబంధించి ‘కళా తెలంగానం’ పేరిట మరో పుస్తకం వేస్తున్నాం. తెలుగులో వచ్చిన కవితలను ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నాం. కొత్త సాలును హిందీలోకి ‘నయా సాల్‌’ పేరుతో ఆవిష్కరించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హిందీలో వస్తున్న మొదటి అనువాదం ఇది. బండారు అచ్చమాంబ కాలం నుంచీ తెలంగాణలో కథా సంప్రదాయం ఉంది. వందేళ్ల కాలంలో వచ్చిన కథల్లోంచి 50 కథలను ఎంపిక చేసి, వాటిని ఆంగ్లంలోకి అనువాదం చేశాం. ‘తెలంగాణ హార్వెస్ట్‌’ పేరుతో విడుదల చేస్తున్నాం.
 
మహాసభల నిర్వహణ ఎందుకు? కొత్త తరానికి ఏం చెప్పబోతున్నారు?
ఏ జాతికైనా భాష అనేది ఐక్యతా సూత్రం. దానివల్ల పురాతన కాలం నుంచి వస్తున్న భాషా ఔన్నత్యాన్ని కొత్త తరానికి తెలపటం ఒక ఎత్తైతే.. ఆధునిక కాలంలో నవీన పోకడలు, మార్పులను భాషకు తోడు చేస్తూ ముందుకెళ్లడం కూడా ముఖ్యమే. ఆధునిక అవసరాలకు అనుగుణంగా భాషను సుసంపన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో.. ఈ సభల్లో చర్చ జరిగి.. భాషాభివృద్ధికి పునాదులు పడతాయి. భాష, సాహిత్యం, సాంస్కృతిక విలువలు.. ఈ మూడింటి పరిరక్షణ, ఔన్నత్యాన్ని గుర్తు చేయటం కోసం ప్రపంచ తెలుగు సభలు నిర్వహిస్తున్నాం.

Harikrishna Mamidi

No comments:

Post a Comment