Sunday, 31 May 2020

కొత్తరాష్ట్రంలో కొత్తసాలు

కొత్తరాష్ట్రంలో కొత్తసాలు
Mon,April 16, 2018 
ఉద్యమకాలంలో ఎగిసిన కవితా జ్వాలను జాజ్వల్యమానంగా వెలిగించడంలో ఈ సామూహిక కవితా సంకలనాలు విజయాన్ని సాధించాయి. రాబోయే కాలపు కవితా ప్రస్థానానికి దీప స్తంభంలా నిలిచాయి.

రాష్ట్ర అవతరణ అనంతరం ఈ మూడున్నరేండ్ల కాలంలో వచ్చిన సామూహిక కవితా సంకలనాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా వెల్లడవుతాయి. వాటిలో ప్రధానాంశం రాష్ట్రం ఏర్పాటుకు ముందు వివిధ సంస్థ లు ప్రజాసంఘాలు నిర్వర్తించిన బాధ్యతను, ఈ సారి అత్యంత సమర్థ వంతంగా ప్రభుత్వమే నిర్వహించిందనీ, అందులోనూ భాషా సాంస్కృ తిక శాఖ ప్రణాళికాబద్ధంగా సామూహిక సంకలనాలను తెచ్చిందనీ అర్థమవుతుంది. ఈ శాఖ ఒక్కటే ఈ కాలంలో విస్తృతంగా కవి సమ్మేళనాలు నిర్వహించటమే గాక వాటన్నింటినీ పుస్తక రూపంగా ప్రచురించి కవిత్వానికి శాశ్వతత్వాన్ని అందించింది. అలా దాదాపు ఆరు కవితా సంకలనాలను ప్రచురించింది. ఇవేగాక ఈ కాలంలో జిల్లాల నుంచి, ఇతర సంస్థల నుంచి కూడా కొన్ని సంకలనాలు వెలువడ్డాయి. రాష్ట్ర అవతర ణ అనంతరం వెలువడిన వివిధ సామూహిక కవితా సంకలనాలు, వాటి విశేషాలు..

తొలకరి కవితా జల్లు కొత్త సాలు: 2015లో ప్రపంచ కవితా దినోత్సవం, మన్మధనామ ఉగాది రెండూ కలిసొచ్చిన సందర్భంలో తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ కొత్త సాలుకు శ్రీకారం చుట్టింది. కొత్త ఆకాంక్షల సంతకంగా మన్మథనామ సంవత్సరాదిని ఆహ్వానిస్తూ రవీంద్రభారతి వేదిక సాక్షిగా జరిగిన కవిసమ్మేళనం కవితాత్మకంగా చిక్క ని కవితాసారాన్ని పంచిఇచ్చింది.
పూలకి అక్షర నీరాజనం తంగేడు వనం: బతుకు బతికించు అనే జీవన సందేశాన్ని పూలసాక్షిగా ప్రపంచానికి చాటిచెప్పిన పండుగ బతుక మ్మ. రాష్ట్ర పుష్పంగా తంగేడు పుష్పాన్ని ప్రకటించిన అనంతరం ప్రపం చ సాహితీ చరిత్రలో తంగేడు పూలపై అత్యధిక కవితల సంకలనంగా తంగేడు వనంగా 166 మంది కవులు పేర్చిన బతుకమ్మగా వెలుగు చూసింది ఈ సంపుటి. పువ్వు పండుగ మీద 166 మంది కవులు పేర్చిన ఈ కవితా సంకలనం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ప్రసిద్ధి పొందిన కవితా సంకలనంగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ నుంచి వెలువడిన ఈ రెండవ కవితా సంకలనం దసరా రోజు ఆవిష్కతమై అక్షరాల ఆకులను పరచి పూల పదాలను పేర్చి వాక్యాల వరుసలను అమర్చి ఒక రసానుభూతిని కలిగించేలా అల్లిన కవిత్వరూపంగా కనిపిస్తుంది ఈ తంగేడు వనం.

బహత్ కవితా సంకలనం తొలిపొద్దు: సాహితీ చరిత్రలో అధిక సం ఖ్యాక కవుల కవితా సంకలనంగా వెలువడిన తొలిపొద్దుని తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ 3వ పుస్తకంగా వెలువరించింది. 56 ఏండ్ల రవీం ద్ర భారతి చరిత్రలో మెయిన్ హాల్లో జరిగిన అతి పెద్ద కవి సమ్మేళనం ఇదే. తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తూ 2015 జూన్ 7వ తేదీన poetry marathonగా నిర్వహించి నభూతో నభవిష్యత్ అనిపించింది. 13 గంటల పాటు నిర్విరామంగా సాగిన విశిష్ట కవి సమ్మేళనంలోని కవి తా సమాహారమే ఈ సంకలనం. పుస్తకం తెరిచిన వెంటనే సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు, సాగిపో దలచిన ఆగిపోరాదెచటెపుడు అన్న ప్రజాకవి కాళోజీ కవితతో కొత్త కవితా ప్రపంచంలోకి పుటలు తెరిచినట్లనిపిస్తుంది.

కవి కూడా నేతగాడే బహుచక్కని సాలెగూడు అల్లువాడే అని కాళో జీ చెప్పినట్టు తెలంగాణ ఇతివృత్తంగా సాగిన ఈ కవితల్లో కొన్ని ఆయుధాలుగా, కొన్ని పరిమళభరితమైన పుష్పాలుగా, కొన్ని ఆకాంక్షల సమీరాలుగా, మరికొన్ని ఆనంద భరితాలుగా, ఇంకొన్ని అనుభవైక వేద్యాలుగా కనిపిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం మీద కవిత్వపు జండాను ఎగురేశాయి. సరికొత్త చరిత్రను లిఖిస్తూ తమ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తూ కలర్ ఫుల్‌గా ఐదు వందల పేజీలతో ముస్తాబైన ఈ సంకలనం వైవిధ్యానికి, కవితా విస్తృతికి, తెలంగాణ కవుల దీక్షకు సమైఖ్య స్ఫూర్తికి సంఘటిత శక్తికి చిరునామాగా నిలిచింది. 97ఏండ్ల కవుల నుంచి 19 ఏండ్ల నవ యువకవుల వరకూ కవితా పుష్పాలను వెలయించిన ఈ సంకలనం ఆసాంతం చదివితే తెలంగాణ వచన కవితలో ఉన్న వైవిధ్యాన్ని గమనించవచ్చు. భద్రయ్య గారి పద్య కవిత్వం నుంచి హరికష్ణ గారి ఫ్యూజన్ షాయరీ వరకు సాగిన ఈ కవిత్వ కవాతు అటు సంప్రదాయానికి ఇటు మోడ్రన్ వచన కవిత్వానికి వారధిగా నిలిచిందని చెప్పొచ్చు. ఇన్ని ఇజా ల కవులు కలగలసిన వేదికగా ఎన్నో సిద్ధాంతాలు కలబోసిన పుస్తకంగా నవ చరిత్రకు శ్రీకారం చుట్టిన సంకలనమే ఈ తొలిపొద్దు, కొత్త సాలు, తంగేడు వనం. ఈ తొలిపొద్దుకు డాక్టర్ నందిని సిధారెడ్డి, అమ్మంగి వేణుగోపాల్, బుక్కా బాలస్వామి, నాళేశ్వరం శంకరం, గంటా జలందర్‌రెడ్డి, జాజుల గౌరి, అయినంపూడి శ్రీలక్ష్మి షాజహానా సంపాదక మం డలిగా వ్యవహరించారు. తెలంగాణ కవుల అరువై ఏండ్ల పోరాటానికి ప్రజల అస్తిత్వ గౌరవ ఆరాటాలకు సాక్షిభూతమైన ఈ సంకలనం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ కృషికి తెలంగాణ కవుల వికాసానికి తార్కాణంగా నిలిచింది. అన్నిటికన్నా ముఖ్యంగా సంపాదకుని మాటగా తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు తెలంగాణ చరిత్రనంతా అధ్బుతంగా మలచి అందించిన వైనం ఆకట్టుకుంటుంది.

ప్రజల హదయ స్పందన మట్టి ముద్ర: తెలంగాణ భాషా సాంస్కతి క శాఖ నుంచి వెలువడిన నాలుగవ పుస్తకం మట్టి ముద్ర. 2016 ఉగాది కవి సమ్మేళనంలోని కవితలతో 9 మంది సలహా మండలితో మామిడి హరికృష్ణ గారి సంపాదకత్వంలో సెప్టెంబర్‌లో దసరాకు ఆవిష్కరించబడిన కవితా సంకలనం మట్టి ముద్ర. ఆరు ఋతువులకు ఆరంభపతాకం కొత్త చిగుళ్ళపై ప్రకృతి మాత సంతకం ఈ ఉగాది కవి త్వం. నిన్న పోరాటాల గడ్డగా పిలవబడిన రాష్ట్రం ఈ రోజు కొత్త సాహిత్యపు అడ్డాగా మారుతున్న వైనాన్ని సరికొత్తగా ఎరుకపరచింది. శిశిరం లోని చిగుళ్ళే కవిత్వంగా మలిచిన వైనాన్ని చాటింది. 64 కవితలు చోటుచేసుకున్న ఈ సంకలనంలో సంపాదక వాక్యం ప్రత్యేక ఆకర్షణ.
పర్యావరణ కవిత్వం ఆకుపచ్చని పొద్దుపొడుపు: సమిష్టి ప్రజా ఉద్యమంగా ఉరకలెత్తుతున్న హరితహారానికి కవితా హారతులందిస్తూ పర్యావరణ స్పృహతో 2017 మార్చిలో భాషా సాంస్కతిక శాఖ తీసుకొచ్చిన మరొక సంకలనం ఇది. అయితే అన్ని పుస్తకాల మాదిరి కాకుండా ఈ పుస్తకానికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఎప్పుడూ కవిసమ్మేళనాలు పెట్టి ఆ తర్వాత సంకలనాలు ముద్రించే ఈ శాఖ ఈసారి హరితహారం మీద కవితల పోటీలు పెట్టి ఆ పోటీకి వచ్చిన కవితలను మరికొన్ని పర్యావర ణ కవితలను ఏర్చికూర్చి ఆకుపచ్చని పొద్దుపొడుపుగా అందించింది. హేవలంబి నామ ఉగాది సందర్భంగా 164 మంది కవులతో వెలువరించబడిన సంకలనం ఇది.

ఊరుకు వందనం తల్లి వేరు: హేవళంబి నామ ఉగాది రోజున జరిగిన కవి సమ్మేళనానికి ఊరును ఇతివృత్తంగా తీసుకొని రాయమని సూచించిన భాషా సాంస్కృతిక శాఖ వారు 2017 జూన్‌లో ఈ సంకలనాన్ని ముద్రించడం జరిగింది. మనమెంత గొప్ప వాళ్ళమైనా మన మూలాలు సొంత ఊళ్లోనే ఉంటాయి. మన కీర్తి మన అనురక్తి మన స్ఫూర్తి అంతా ఊరే. ఊరిచ్చిన బతుకుబాటను, జీవితాలను తలుచుకుంటూ 47 మంది కవులు తమ అనుభవాలను, ఊరుతో తమ అనుబంధాన్ని అక్షరీకరించిన అరుదైన పుస్తకం ఇది. ఉగాది సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కవి సమ్మేళనం ఇది.
భాషా సాంస్క తికశాఖ నుంచి ప్రభుత్వపరంగా వెలువడిన ఈ ఆరు పుస్తకాల్లో మూడు ప్రత్యేకమైన విశేషాలున్నాయి. మామిడి హరికృష్ణ సంపాదకీయం ఓ పీహెచ్‌డీ పత్రంలా ఉండటం ఒక విశేషమైతే, ప్రతీ పుస్తకానికి అరుదైన ముఖచిత్రాలను ఎంపిక చేయడం మరొక విశేషం.

ఇతర సాహితీసంస్థలు కూడా సంకలనాలను ప్రచురించాయి. 2014 జూన్ 2న నిర్వహించబడిన కవి సమ్మేళనంలోని కవితలను, మహబూబ్‌నగర్ జిల్లా సాంస్కృతిక మండలి తెలంగాణ పొద్దు పొడుపు కవితా సంకలనంగా మలిచింది. 68 కవితల ఈ సంకలనం ఒక ప్రాంతానికి పరిమితమైన కవితా వస్తువుల్లా గాక తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా విరబూసింది. రంగుల చిత్రమాలతో సంక్షిప్త సందేశాలతో వెలువడిన ఈ సంకలనం అందరినీ ఆకట్టుకున్నది. మహబూబ్ నగర్ నుంచి వెలువడిన మరొక కవితా సంకలనం బంగారు తెలంగాణ పాలమూరు కవితా తరంగిణి. భాషా సాంస్కృతిక శాఖ మహబూబ్‌న గర్ జిల్లా ఆధ్వర్యంలో 2016 జూన్ 2న జరిగిన కవి సమ్మేళనంలోని కవితల సంపుటి ఇది.
కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర ఆవిర్భావానంతరం రెండు కవితా సంకలనాలు సాహితీ గౌతమీ ఆధ్వర్యంలో వెలువడినాయి. మానేరు నీరు తాగి పెరిగిన మామంచి కవులున్న జిల్లా కరీంనగర్. ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో. ఆ మాను సంతకం ఉంది చివురుల్లో. నా మనసు సం తకం ఉంది ఈ సంకలనాల్లో అన్నట్టుగా మలిచారు ఈ సంపుటాల్ని కరీంనగర్ కవులు.

కరీంనగర్ జిల్లా సాహితీ సంఘాల సమాఖ్య సాహి తీ గౌతమి ఆధ్వర్యంలో 2014లో జయగానం కవితా సంకలనం వెలువడింది. 2016లో పంచమ స్వరం పేరుతో మరో కవితా సంపుటి వెలువడింది. జయగానం సంపుటిలో 111 కవితలున్నాయి. వీటిలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ మలయశ్రీ, డాక్టర్ డింగరి నరహరి ఆచార్య, బూర్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ నలిమెల భాస్కర్, వారాల ఆనంద్, అన్నవరం దేవేందర్, డాక్టర్ కాలువకుంట రామకృష్ణ వంటి లబ్ధ ప్రతిష్టులైన అనేకమంది రచనలున్నాయి. సాహితీ గౌతమి ఆధ్వర్యంలో 2016లో వెలువడిన మరో కవితా సంపుటి పంచమ స్వరం పుస్తకం మానేరు విద్యాసంస్థల సౌజన్యంతో వెలువడగా ఆ పాఠశాలల అధినేత కడారు అనంతరెడ్డికి అంకితం ఇవ్వబడింది. ఇందులో మొత్తం 67 కవితలున్నాయి. ఈ పుస్తకానికి సంపాదకులుగా కె.ఎస్.అనంతాచర్య, దాస్యం సేనాధిపతి, వారాల ఆనంద్, మాడిసెట్టి గోపాల్, డాక్టర్ బి.వి. ఎన్ స్వామిలు వ్యవహరించారు. మన్మథనామ ఉగాది సందర్భంగా కవు లు చదివిన కవితలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

మనం చెప్పుకోవాల్సిన మరో సామూహిక సంకలనం మిర్గం. తెలంగాణ కవిత్వంగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ సంపాదకత్వంలో తెలంగాణ సాహిత్య కళావేదిక 2017 ఆగస్టులో వెలువరించిన సంక లనం. 2015 ఫిబ్రవరి 22న తెలంగాణ సాహిత్య కళావేదిక ప్రారంభమై, ఆ రోజే పదిజిల్లాల కవులతో కవితాగానాన్ని నిర్వహించింది. ఇందు లో 76 మంది కవులు స్వయంగా పాల్గొంటే 15 మంది కవులు తమ కవితలను పంపించారు. అలా 102 మంది కవితలతో 60 ఏండ్ల ఆం ధ్రా పాలన నుంచి విముక్తమై ఇప్పుడీ కవితల జలపాతం మొదలైందని ప్రతీకాత్మకంగా చెబుతూ సాహితీ మిర్గాన్ని ఆవిష్కరించారు. పండబో యే పంటల అంచనాకు మిర్గం జీవనాడి ఎలా అవుతుందో, ఈ పుస్తకం కూడా అలాగే రానున్న కాలంలో తెలంగాణ జనజీవితాల ప్రతిఫల నాలకు సాక్షీభూతం అవుతుంది. కవులను చరిత్ర దాచుకునే మంచి సంకలనం ఇది.

మూడున్నరేండ్ల కాలంలో వెలువడిన సామూహిక కవితా సంకలనా లు కవుల వైయక్తిక స్పందనలను వ్యక్తం చేయడమేగాక సామూహిక ఆకాంక్షలను కూడా తెలిపాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలకు, స్పందించే చైతన్యవంతుడు కవి అన్న మాటలను నిజంచేస్తూ ఈ సంకలనాలన్నీ తెలంగాణ కవుల్లోని స్పందనలను, సంవేదనలను, సహానుభూతిని, స్వీయానుభావాన్ని దోసిళ్ళలో పట్టి మనకందించాయి. ప్రక్రియలపరంగా, ప్రయోగాల పరంగా, శిల్ప పరంగా, వైవిధ్యతను అందించడమేగాక వస్తుపరంగా కూడా విభిన్న అంశాలను తెలంగాణ సాహిత్యానికి ఆపాదించాయి. సమకాలీన తెలంగాణ కవిత్వం సరికొత్తగా ఆవిష్కరించడానికి మరింత సుసంపన్నం కావడానికి కావలసిన సరంజామాను అంతా ఇవి సిద్ధం చేశాయి. మొత్తం మీద, ఉద్యమ కాలంలో ఎగిసిన కవితా జ్వాలను జాజ్వల్యమానంగా వెలిగించడంలో ఈ సామూహిక కవితా సంకలనాలు విజయాన్ని సాధించాయి. రాబోయే కాలపు కవితా ప్రస్థానానికి దీప స్తంభంలా నిలిచాయి.
- అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562

No comments:

Post a Comment