Here, it's my article published in Namaste Telangana edit page on 24-12-2017...
వ్యంగ్య చిత్రానికి వందనం!
కార్టూన్ జర్నలిస్ట్‌లకు, కార్టూన్‌లకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంకల్పించింది. అందుకే మున్నెన్నడూ లేని విధంగా 2015 తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలలో రవీంద్రభారతిలో కార్టూనిస్ట్‌ల సదస్సును ఏర్పాటుచేసి దాదాపు 42 మంది కార్టూనిస్ట్‌లను సత్కరించింది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కూడా కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం గొప్ప విషయం.
**************************
కార్టూన్..!
రాతగీతల దృశ్య చిత్రం..!
అన్ని చిత్రాలలాంటి ఒకానొక చిత్రమే. కానీ మిగ తా సీరియస్ చిత్రాలకు లేని గొప్ప లక్షణం ఉన్న చిత్రం కార్టూన్! ఆ గొప్ప లక్షణం హాస్యం! వ్యం గ్యం!
మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపచేస్తుంది.ఆశ్చర్య పరుస్తుంది.ఆవేదన చెందేలా చేస్తుం ది. ఎక్కువసార్లు ఆహ్లాద పరుస్తుంది. తీవ్ర ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఛార్లీ ఛాప్లి న్ జీవితం లాంగ్ షాట్‌లో కామెడీ, క్లోజ్ షాట్‌లో ట్రాజెడీ అని చెప్పినట్లు కార్టూన్ రాతగీతల్లో కామెడీ, విషయ వస్తువులో ట్రాజెడీ అని భావించేలా ఉంటుంది. మనిషి మాత్రమే అనుభూతించగలిగిన హాస్య భావనను ఉద్దీపింప చేయగలిగే ఒకానొక సృజన రూపం కార్టూన్! గీతలతోనే చక్కిలిగిలి పెట్టగలిగిన హాస్య మంత్రం కార్టూన్!
ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మన పంచేంద్రియాల సమన్వయ జ్ఞానంతోపాటు, మనకు ఇదివరలో లభించిన పూర్వజ్ఞానం, అనుభవం అవసరం. ఇంత మానసిక ప్రక్రియ మనకు, మన చుట్టూ ఉన్న భౌతిక, రాజకీయ, సాంఘిక పరిసరాలకు మధ్య సమన్వయానికి అవసరం అవుతుందని మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెపుతారు. అయితే కంటితో చూసిందే తడవుగా పాఠకుడిలో / వీక్షకుడిలో ఆనంద భావనను, ఆహ్లాద అనుభూతిని, హాస్య రసాన్ని అందించగలిగేది కార్టూన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అధునిక కాలంలో హాస్యానికి టానిక్‌గా కార్టూన్ మారిందన్నా ఆశ్చర్యం లేదు. నవరసాలలో నవ్వే రసానికి ఇగ్నిషన్ కార్టూన్! తీవ్రమైన మానసిక, ఆర్థిక సంక్షోభంలో సైతం హృదయాన్ని తేలిక పర్చగలగటం కార్టూన్ ప్రత్యేకత!
ఇలాంటి కార్టూన్ ఇపుడు సర్వాంతర్యామి. ఏ పత్రిక చూసినా, ఆఖరికి విద్యాసంస్థలలోని గోడపత్రికలలో సైతం కనిపించే అద్భుత విశేషం కార్టూన్! వ్యం గ్యం, హాస్యం, సునిశిత ధిక్కారం, తార్కిక నిరసన, విషాద సందర్భానికి సంఘీభావం అనే ఐదు లక్ష్యాల సాధనే కార్టూన్‌ల అంతిమ లక్ష్యం అని కార్టూన్‌ల ప్రస్థానాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అయితే కాలక్రమంలో కార్టూన్‌లు పత్రికలలోనూ, మన నిత్య జీవితంలోనూ అంతర్భాగం అయిపోయాయి. పత్రిక తెరవగానే కార్టూన్‌లను వెతకడం సహజం. ఇంతగా మన జీవితంతో ముడివేసుకున్న సృజనాత్మక వ్యాసంగం మరేదీ లేదని చెప్పవచ్చు.
కార్టూన్ వేయి విధాలు :
ప్రపంచవ్యాప్తంగా కార్టూన్‌కు ఉండే ప్రాధాన్యం గుర్తింపులోకి వచ్చిన కాలం నుంచి అది రకరకాల రూపాలను సంతరించుకుంటూ వస్తున్నది. నిజానికి ఆదిమకాలంలో, మనిషి గుహలలో జంతు జీవనం సాగిస్తున్న కాలంలో తను చూసిన జంతువులను సంకేతాత్మకంగా చూపిస్తూ నాలుగు గీతలతో జంతువు రూపు రేఖలను వ్యక్తీకరించడం కార్టూన్‌కు ప్రాథమికరూపంగా భావించవచ్చు. అయితే ఆనాటి మానవుని సృజన వెనుక ఆహ్లాదం, వినోదం కన్నా భయమే ప్రధాన చోదకశక్తిగా ఉండేదనే విషయాన్ని గమనిం చాలి. అలా మొదలైన కార్టూన్ ఇపుడు ఎన్నెన్నో దశలను దాటి బహుముఖీనతని సాధించి జీవితంలోని అన్ని పార్శ్వాలను సమర్థవంతంగా ప్రతిబింబించగలుగుతున్నది. ఈ ప్రస్థానాన్ని ఇక్కడ గమనిస్తే కార్టూన్‌లను అనేక రకాలుగా వర్గీకరించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కార్టూన్‌లలో గార్‌ఫీల్డ్ కార్టూన్‌లు (పిల్లి ప్రధానపాత్ర), జెన్నిస్ ది మినేస్ (హాన్ కె చావ్‌ు కార్టూనిస్ట్), కామన్‌మ్యాన్ (ఆర్.కె.లక్ష్మణ్ కార్టూనిస్ట్), పీనట్స్ (ఛార్లెస్ ఎం. షుల్జ్) కార్టూన్‌లు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి. ఇవేగాక, ఆయా సందర్భాలను అనుసరించే ఏకవస్తువుగా వచ్చే కార్టూన్‌లు కూడా ప్రసిద్ధమే! పర్యావరణ అంశాలు, అక్షరాస్యత, ఆఫ్రికా, బాలికా సంరక్షణ, గృహహింస, శాంతి, యుద్ధ నివారణ వంటి అంశాలు ఆధారంగా వచ్చిన కార్టూన్‌లను Thematic Cartoonగా పిలుస్తాం.
రోజురోజుకూ కార్టూన్‌లకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణను గమనించిన కొన్ని విశ్వవిద్యాలయాలు, సంస్థలు, వ్యక్తులు కార్టూన్‌ల కోసం ప్రత్యేక లైబ్రరీలను, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయడం మంచి పరిణామం. ఈ ధోరణికి శ్రీకారం చుట్టిన సంస్థ బిల్లీ ఐర్లాండ్ కార్టూన్ లైబ్రరీ అండ్ మ్యూజి యం! ఓహియో స్టేట్ యూనివర్శిటీకి అనుబంధంగా 1977లో అమెరికాలోని కొలంబస్‌లో ఏర్పాటైన ఈ పరిశోధనా సంస్థ పూర్తిగా కార్టూన్‌లకే అంకితమై పనిచేస్తున్నది. దీనిలో ఇప్పటికీ 4.5 లక్షల ఒరిజినల్ కార్టూన్‌లు, 36వేలకు పైగా కార్టూన్ పుస్తకాలు, 51వేలకు పైగా కార్టూన్ సీరియల్ టైటిల్స్, 25లక్షలకు పైగా కామిక్ క్లిప్పింగ్స్ భద్రపరచబడ్డా యి.
అలాగే బ్రస్సెల్స్ నగరంలో (బెల్జియం దేశం) 1989 లో బెల్జియన్ సెంటర్ ఫర్ కామిక్ స్ట్రిప్ ఆర్ట్ పేరుతో కార్టూన్‌ల కళా పరిశోధనా సంస్థ ఏర్పడింది.
బ్రిటన్‌లో ఉన్న కార్టూనిస్ట్‌ల కోసం లండన్‌లో 2006లో ది కార్టూన్ మ్యూజి యం పేరిట ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో టూన్‌జియవ్‌ు పేరుతో పిట్స్‌బర్గ్ మ్యూజియం ఆఫ్ కార్టూన్ ఆర్ట్ ని 2007లో నెలకొల్పారు. ఇవన్నీ ఆయా కార్టూనిస్ట్‌లు వేసిన కార్టూన్‌లను సేకరించడమే గాక, వాటిని శాశ్వతంగా భద్రపరుస్తూ, వివిధ పరిశోధనలకు సహకరిస్తూ కార్టూన్‌కి కూడా కళాప్రతిపత్తిని, పరిశోధనా సంపత్తిని సమకూరుస్తున్నాయి.
కార్టూన్ థెరపీ:
ఇటీవలి కాలంలో మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనుషులలో సానుకూల దృక్పథం ఎదుగుదల కోసం, ఒత్తిడుల నుంచి విముక్తి కోసం సంప్రదాయేతర చికిత్సా విధానాలను సూచిస్తున్నారు. వాటిలో కామెడీ సినిమాలను ప్రదర్శించడమే గాక, హాస్య రసస్పోరకమైన కార్టూన్‌లను, కార్టూన్ పుస్తకాలను చదవడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆధునిక వైద్యశాస్త్రంలో కార్టూన్ థెర పీ దిశగా మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. కార్టూన్‌లు కేవలం వినోదం కోసమే కాదు. చికిత్సకోసం, మానవ వికాసం కోసం కూడా అనే నూతన కోణాలు ఆవిష్కృతం అవుతున్నాయి.
దేశంలో.. :
మనదేశంలో తొలి వార్తా పత్రిక బెంగాల్ గెజిట్. జేవ్‌సు ఆగస్టస్ హిక్కీ కోల్‌కత్తాలో ఈ పత్రికను 1780లో ప్రారంభించినప్పటి నుంచీ దేశంలో వార్తాపత్రికల ప్రభంజనం మొదలైంది. అందులో కూడా కార్టూన్‌లు ప్రచురితం అయ్యా యి. ఆ తర్వాత 19వ శతాబ్దంలో స్వాతంత్య్రోద్యమ కాలంలో వచ్చిన పత్రికలలోని కార్టూన్‌లు రాజకీయ అంశాల ప్రాతిపదికగా ప్రజాదరణ పొందాయి. ఆనాటి బ్రిటీష్ పాలకుల విధానాలు, దానికి నిరసనగా వ్యాసాలు, విశ్లేషణలు ఎంత ప్రభావం చూపాయో, అంతే సున్నిత విమర్శలను కార్టూన్‌లు చేసాయి. కొన్ని నిషేధానికి కూడా గురవడం గమనార్హం.
స్వాతంత్య్రానంతరం, నెహ్రూకాలంలో ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళైతో, కార్టూన్‌లకు ముఖ్యంగా పొలిటికల్ కార్టూన్‌లకు విశేష ప్రజాదరణ ఏర్పడింది. ప్రత్యేకంగా కార్టూన్‌ల కోసమే ఓ పత్రిక శంకర్స్‌వీక్లీ ప్రచురితమైం ది. ఆ తర్వాతి కాలంలో ఆర్.కె. లక్ష్మణ్, సుధీర్ తెలంగ్, అజిత్ నైనాన్, మారి యో మిరాండా వంటి ఎందరో కార్టూనిస్ట్‌లు దేశవ్యాప్త కీర్తిని సంపాదించారు.
తెలుగు పరిస్థితి:
తెలుగు వారి జీవనంలో హాస్యం, వ్యంగ్యం కూడా ఎంతో ముఖ్యమైన భావోద్వేగాలు! అదే జీవన విధానం కార్టూన్‌లలో కూడా ప్రతిబింబించింది. ప్రబంధాలలో వర్ణించిన స్త్రీల సౌందర్యాన్ని వ్యంగ్యంగా చిత్రించడంలో తెలుగులో తొలి కార్టూన్ ప్రారంభమైందని తెలుస్తున్నది. తలిసెట్టి రామారావు గారు వేసిన ఈ చిత్రం ఆల్‌టైవ్‌ు ఫేవరేట్ స్థాయిని సాధించింది. ఆ తర్వాత ఎందరెందరో కార్టూనిస్ట్‌లు కేవలం రాజకీయ కార్టూన్‌లనే గాక, అన్ని రకాల కార్టూన్‌లలో తమదైన ప్రతిభా ముద్రలతో దూసుకు వెళ్తున్నారు.
వీరిలో బాపు గారిది ఓ ప్రత్యేకశైలి.మోహన్, చంద్ర, గీతా సుబ్బారావు, టీ.వీ., శేఖర్, శ్రీధర్, సురేంద్ర, సరసి, మృత్యుంజయ్, నర్సిం, శంకర్, వెంకటేష్, నారు, జావెద్, అవినాశ్, సూర్య, రవినాగ్ ఇంకా ఎందరో తెలుగు కార్టూన్ జర్నలిజంలో తమదైన శైలితో నిరంతరం పనిచేస్తున్నారు.కార్టూనిజంను తెలుగు మాధ్యమాలలో కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అందుకే మీడి యా జర్నలిజంలో ఇటీవలి కాలంలో కార్టూన్ షోలు కూడా సీరియల్స్‌గా ఛానెళ్ళలో ఆదరణ పొందాయి. కాగా, ఇటీవలి కాలంలో అత్యధిక కార్టూనిస్ట్‌లు తెలంగాణ రాష్ర్టం నుంచే వస్తుండటం విశేషం. అంతేగాక, క్రోక్విల్, హాస్యానందం వం టి పత్రికలు కార్టూన్ స్పెషల్ పత్రికలుగా పేరుపొందాయి.

వీటన్నిటి నేపథ్యంలో, కార్టూన్ జర్నలిస్ట్‌లకు, కార్టూన్‌లకు సముచిత గౌర వం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంకల్పించింది. అందుకే మున్నెన్నడూ లేని విధంగా 2015 తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలలో రవీంద్రభారతిలో కార్టూనిస్ట్‌ల సదస్సును ఏర్పాటుచేసి దాదాపు 42 మంది కార్టూనిస్ట్‌లను సత్కరించింది.
ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రపంచ తెలు గు మహాసభల సందర్భంగా కూడా కార్టూన్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దాదాపు 105గురు కార్టూనిస్ట్‌లు 175 పైగా తమ కార్టూన్‌లను ప్రదర్శించారు. భాష, సంస్కృతి ప్రధాన వస్తువులుగా రూపొందిన ఈ కార్టూన్‌షో ఈ కోవలో ఇదే తొలి ప్రయత్నం అని చెప్పాలి. ఈ కార్టూన్‌షోను ప్రదర్శనకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక అందమైన పుస్తకంగా ప్రచురించడం, ఓ చిరకాల జ్ఞాపకంగా తీర్చిదిద్దడం అభినందనీయం.
(వ్యాసకర్త: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు)
No comments:
Post a Comment