Here, it's my article published in Andhra bhoomi Sunday supplement as cover story on 15-8-2010...
హమారా భారత్!
-మామిడి హరికృష్ణ
August 15th, 2010
‘‘్భరతదేశం వివిధ జాతుల చోద్యమైన ప్రదర్శనశాల!’’
- వి.ఎ.స్మిత్
‘‘్భరతదేశం ప్రపంచ మతాల సంగమ స్థలం.’’
- రవీంద్రనాథ్ టాగూర్
‘‘్భరతదేశం ఓ చీకటి ప్రాంతం... లక్షలాది తిరుగుబాట్ల రణస్థలి... భారతదేశం ఓ గాయపడిన నాగరికత!’’
- వి.ఎస్.నరుూపాల్
‘‘ఇండియా ఈజ్ షైనింగ్’’
- భారతీయ జనతాపార్టీ
‘‘మేరా భారత్ మహాన్’’
- దేశభక్త భారతీయుడి స్పందన
‘‘గ్లోబల్ ఇండియా.. గ్లోయింగ్ ఇండియా’’
- కార్పొరేట్‌ల అంతరంగం
‘‘హిందుస్థాన్ అబ్‌తో యంగిస్థాన్ బన్‌గయే’’
- యూత్ ఆలోచన
‘‘్భరతదేశం ఆకలి కేకల నిలయం.. కరువు, కాటకాలు, దారిద్య్రం ఇక్కడి నిత్య సత్యాలు’’
- అమర్త్యసేన్
‘‘్భరతదేశం నిట్టనిలువుగా చీలిన రెండు ప్రపంచాల సహజీవన వనం. అత్యంత ఆధునికమైన నగరాల ప్రపంచం... అత్యంత ప్రాచీనమైన గ్రామీణ ప్రపంచం ఇక్కడ ఒకే ఛత్రం కింద నివసిస్తున్నాయి.’’
- ఆర్థికవేత్తలు
‘‘్భన్నత్వంలో ఏకత్వం భారతీయ ఆత్మ.’’
- జవహర్‌లాల్ నెహ్రూ
----------------------
ఇవన్నీ భారతదేశం గురించి వేర్వేరు అభిప్రాయాలు... ఇందులో నిజాలూ ఉన్నాయి...! మనం ఒప్పుకోలేని చేదు వాస్తవాలూ ఉన్నాయి...! కొత్త ఆశల చిగుళ్ళను, గొప్ప స్ఫూర్తిని నింపే కామెంట్లూ ఉన్నాయి...! దేశమొక్కటే! కానీ ఇన్ని రకాలుగా ‘‘ఇంటర్‌ప్రీట్’’ చేయడానికి తగిన అవకాశం ఉన్న ఒకే ఒక్క దేశం ప్రపంచం మొత్తంమీద బహుశా భారతదేశం ఒక్కటే అంటే అతిశయోక్తి కాదేమో! అందుకే భారతదేశం అనాదికాలం నుంచి అందరికీ ఓ ఆసక్తిదాయకమైన విషయమే! మన దేశం ‘‘మిస్టిక్ ఇండియా’... ‘మిస్టరీ ఇండియా’... ‘‘మిరాక్యులస్ ఇండియా’... ‘మాగ్నిఫైయింగ్ ఇండియా’... ‘మల్టీకల్చరల్ ఇండియా’... ఇంకా ఎనె్నన్నో విశే్లషణలు కలిపినా ఇంకా వివరించడానికి మిగిలి ఉండే పుష్పక విమానం ఇండియా!
అసలు మన దేశానికి ఇంత ‘ఇంటరెస్టింగ్ ఎలిమెంట్’ ఒనగూడటం బహుశా మన స్వాతంత్య్ర దినం నుండే మొదలయిందేమో! ప్రపంచం అంతా గాఢంగా నిద్రిస్తున్న అర్ధరాత్రి తరుణంలో... మనదేశం కొత్త స్వాతంత్య్ర గాలులను గుండెనిండా పీల్చుకుంది. 1947 ఆగస్టు 15న మన దేశం విదేశీ పాలన గాఢ నిద్రనుండి జాగృతం అయింది.. స్వాతంత్య్రాన్ని సాధించింది. క్రీ.శ. 1757నుండి 1947 వరకూ దాదాపు 200 ఏళ్ల బానిసత్వం నుండి స్వేచ్ఛా వెలుగులలోకి ఉద్యమించింది... అలా స్వాతంత్య్ర సూర్యుని మన దేశంలో వెలిగించి ఇప్పటికి 63 ఏళ్ళయింది. షష్ఠిపూర్తి దాటేసిన భారతదేశం ఇనే్నళ్ళ స్వాతంత్య్ర ప్రస్థానంలో ఏ వెలుగులను చేరుకుంది? ఏ లక్ష్యాలను చేరుకుంది? ఈ గమ్యం సరైనదేనా? ఇన్నాళ్ళ ఈ గమనం భారతీయులకు ఏమేరకు మేలు చేసింది?
ఈ 63 ఏళ్ళ కాలంలో మన దేశం ఓ గొప్ప ‘జర్నీ’నే చేసింది. అయితే ఈ ‘జర్నీ’లో మన దేశం ఎనె్నన్నో కొత్త కొత్త సంస్కృతులను, విప్లవాలను, మార్పులను చవిచూసింది. వాటన్నింటినీ సహృదయంతో స్వాగతించింది.. తనదిగా మలుచుకుంది.. తనకు అనుకూలంగా మార్చుకుంది.. అయితే ఇది ఏ దేశంలోనైనా అనివార్యంగా జరిగే పరిణామమే! ప్రపంచ స్థాయిలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త కొత్త విన్యాసాలను ఆహ్వానించడం ఏ దేశంలోనైనా సహజమే! కానీ ఇక్కడే భారతదేశం యొక్క గొప్పతనం బయటపడ్తోంది.. మన దేశం నవ్యపోకడలన్నింటినీ ఒకవైపు ‘రెడ్ కార్పెట్’ పరుస్తూనే, మరోవైపు తనదైన అనూచాన సంప్రదాయాలను ఎక్కడా వదులుకోలేదు! ‘‘కొత్త నీరు వచ్చి పాత నీరును తొలగించడం అన్ని దేశాల్లో సహజం.. కానీ మన దేశం విషయంలో పాత నీరు అలాగే ఉంటూనే కొత్తనీరు కొత్త పుంతలు తొక్కుతోంది’’... అందుకే మన దేశంలో ఇప్పటికీ ఎద్దులబండి నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో గాలిలో విమానాలు రివ్వున దూసుకుపోతూనే ఉంటాయి.. ఇంతటి ‘‘ఎక్స్‌ట్రీమ్’’ వైవిధ్యత బహుశా భారతదేశంలో మాత్రమే కనిపిస్తుందేమో! ఈ వైవిధ్యతని ఈ 63 ఏళ్ళ కాలంలో మన దేశం మరింత కాపాడుకోగలిగింది..
అలాగే మనదేశం- చూస్తే ఒక్క దేశం.. అఖండ భారతంలా అనిపిస్తుంది. కానీ మన దేశంలోనే వందలాది దేశాలకు సరిపడా విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, మతాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక దేశాలలో ఒక దేశాన్ని, ఆ దేశానికి ఉండే ప్రత్యేకతను పట్టి ఇచ్చేవి దాని సంస్కృతి- భాష- సాహిత్యం- నాగరికత- సంప్రదాయాలు ఇలాంటివి. అలా దేశాలన్నీ ఒకే తరహా సంస్కృతిని, మతాన్ని అనుసరించడం సర్వసాధారణం.. ఆ కోణంనుంచి చూస్తే మన దేశం వందలాది దేశాలతో సమానం... అన్ని రకాల జాతులు- ప్రాంతీయ వైవిధ్యాలు, నైసర్గిక- భౌగోళిక మార్పులు నెలవైన ఓ విచిత్ర భూమి మనది! ఈ విచిత్రాలన్నింట్లోకెల్లా మహా విచిత్రం- ఇన్ని రకాల జాతులు అన్నీ ఒకే నీడన ‘్భరతీయత’గా మనుగడ సాగించడం అని చెప్పాలి! ఈ మహా విచిత్రాన్ని 63 ఏళ్ళ తర్వాత కూడా అదే తరహాలో కొనసాగించడం ఓ విశేషం! 1947 ఆగస్టులో నెహ్రూ చెప్పిన మాటలు ఇప్పటికీ అతికినట్లుగా ఉండటం ఇక్కడ గమనార్హం! ‘‘్భరతదేశ శక్తి అంతా దాని సహజీవన సౌందర్యంలోనే ఉంది. మతాలు- ప్రాంతాలు- భాషలు- కల్చర్స్ వేరైనా మనమంతా ఒక్కటే అనే మన ప్రగాఢ నమ్మకంలోనే ఉంది!’’ అని 63 ఏళ్ళ క్రితం అన్నమాటలు ఇప్పటికీ తగినట్లుగానే ఉన్నాయి...
ఒక జాతి జీవనంలో... గమనంలో 63 ఏళ్ళ కాలం తక్కువదేమీ కాదు... అయితే భారతదేశ స్వాతంత్య్రానంతర ప్రగతిని అవలోకన చేసేముందు, మిగతా ప్రపంచ దేశాల స్వాతంత్య్రానంతర ప్రగతితో పోల్చడం అవసరం! అమెరికా స్వాతంత్య్రానంతర ప్రస్థానం దాదాపు 234 ఏళ్ళది! (1776- అమెరికా స్వాతంత్య్ర పోరాటం) ఫ్రాన్స్‌ది 221 ఏళ్ళది (1789- ఫ్రెంచ్ రివల్యూషన్)! బ్రిటన్‌ది 322 ఏళ్ళనాటిది (1688- గ్లోరియస్ రివల్యూషన్)! ఇలా వందలాది సంవత్సరాల స్వాతంత్య్ర జీవనంలో ఈ దేశాలు ఎనె్నన్ని విజయాలు సాధించాయో మన దేశం ఇపుడు కేవలం 63 ఏళ్ళ కాలంలోనే అన్ని విజయాలను సాధించింది. ప్రస్తుతం ఈ దేశాలతో పోటీపడుతూ అతికొద్దికాలంలోనే ‘సూపర్ పవర్’గా ఈ దేశాల సరసన చేరే అవకాశాన్ని సాధించింది.
1947నుండి 1951 వరకూ తప్పటడుగులతో పోరాడిన భారతదేశం 1951నాటి పంచవర్ష ప్రణాళికలతో నడకని మొదలెట్టింది... 1991నాటి సరళీకృత ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్ పాలసీలతో ఇపుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ దూకుడు ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటికీ పెనుసవాలుగా మారింది. ఇదంతా కేవలం 63 ఏళ్ళ కాలంలోనే సాధ్యమవడం ఓ విచిత్రం! అయితే సాధారణంగా భారతీయుడు ‘సంప్రదాయవాది, మార్పును త్వరగా ఒప్పుకోడు’అనే భావనలను కాలదన్ని భారతీయుడు ‘నిత్య చైతన్యశీలి’అని నిరూపించిన చారిత్రక సందర్భం ఇది!
గత 63 ఏళ్ళ కాలంలో మన దేశం అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించింది... వ్యవసాయ రంగం, శాస్త్ర సాంకేతిక రంగం, వైద్య- ఆరోగ్య రంగం, విద్యారంగం, రవాణా రంగం.. ఇలా అన్ని రంగాలలో లెక్కకుమిక్కిలి ప్రగతిని సాధించింది. ఇక, కమ్యూనికేషన్లు- ఎంటర్‌టైన్‌మెంట్, బ్యాంకింగ్, క్రీడలు, కార్పొరేట్ సెక్టర్, గ్లోబలైజేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో భారతదేశం ఇపుడు ప్రపంచవ్యాప్తంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది.
----------------------
శాస్త్ర- సాంకేతిక రంగం
63 ఏళ్ళ క్రితం చందమామను ఓ గ్రహంగాకాక ఓ దేవుడిగా కొలిచిన దేశం మనది! మన సంస్కృతిలో, పురాణాల్లో చంద్రుణ్ణి ఓ కాల్పనిక రూపంగా మల్చుకుని పూజించిన నేల మనది. కానీ, అనాది కాలంగా మానవుణ్ణి ఊరిస్తున్న చంద్రునిపైకే యాత్రను జరపగలగడం అనేది స్వాతంత్య్రానంతర భారతం అతి తక్కువ కాలంలో సాధించిన అద్భుత విజయం అని చెప్పాలి. ఒకప్పుడు మూఢ నమ్మకాలు, విశ్వాసాలకు నెలవైన భారతదేశం ఈ 63 ఏళ్ళ కాలంలో ఆ అంధ విశ్వాసంలోంచే ఓ గొప్ప శాస్ర్తియతని ఆవిష్కరించడం గొప్ప అఛీవ్‌మెంట్! ఇవేకాకుండా అంతరిక్ష పరిశోధనలో 1960 దశకంలో ప్రారంభించిన ‘‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్’’ ద్వారా మన దేశం సాధించిన, సాధిస్తున్న విజయాలు స్వాతంత్య్ర అనంతర ప్రగతి ఫలాలుగానే భావించాలి.
న్యూక్లియర్ సైన్స్ రంగంలో ప్రస్తుతం మన దేశం రష్యా, ఫ్రాన్స్, జపాన్‌ల తర్వాత ‘్ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్స్’ విషయంలో నాలుగో దేశంగా అరుదైన క్రెడిట్‌ను సాధించింది. అలాగే శాటిలైట్ టెక్నాలజీని మన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మల్చుకోవడంలో కూడా మన దేశానిది ముందంజే! అలాగే రక్షణ రంగంలో అత్యంత ఆధునిక మిస్సైల్స్‌ని (అగ్ని, నాగ్, ఆకాశ్ వంటివి) ‘డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ నేతృత్వంలో రూపొందించడం, తేలికపాటి యుద్ధవిమానాలు (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్), మానవ రహిత యుద్ధ విమానాలను రూపొందించడం ఇవన్నీ భారత్ కీర్తికిరీటంలో కలికితురాయిలే!
----------------------
వైద్య ఆరోగ్య రంగం
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే ఆ దేశ మానవ వనరులు అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. 1947నాటు అసలు వైద్యం అంటూ అందని ఎన్నో గ్రామాలు, ప్రాంతాలు ఇపుడు వైద్య సదుపాయాలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే నగరాల్లో అయితే ఈ సౌకర్యాలు ఎంతగా అభివృద్ధి చెందాయంటే అమెరికాలాంటి అడ్వాన్స్‌డ్ దేశాలతో పోటీ పడేంత స్థాయిలో వృద్ధిచెందాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో కూడిన కార్పొరేట్ హాస్పిటల్స్... ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ వంటి ‘రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థలు’ ఎన్నో ఇపుడు భారతదేశంలో స్థాపించబడ్డాయి. అందుకే ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా రోగగ్రస్తులకు చికిత్సకోసం భారతదేశం ఓ ప్రత్యేక డెస్టినేషన్‌గా మారింది. ఇటీవలి అంచనాల ప్రకారం విదేశాలనుంచి మన దేశానికి వచ్చే విదేశీయులలో అత్యధిక శాతం ప్రజలు ‘హెల్త్‌పర్పస్’తోనే వస్తున్నారని నివేదికలు వెల్లడి చేస్తున్నాయి. దీనినే ఇపుడు ‘హెల్త్ టూరిజం’ అంటున్నారు. ఒకనాటి ‘హెరిటేజ్ టూరిజం’నుండి ఇపుడు ‘ఆరోగ్య పర్యటనం’కు భారత్ సరైన ప్రదేశంగా గుర్తింపబడటం ఓ కీలక సాధనే!
----------------------
వ్యవసాయ రంగం:
‘‘అవర్ కామన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్!’’ అనేది స్వాతంత్య్రకాలంనాటి నినాదం! మహాత్మాగాంధీగారు అన్నట్లు ‘‘మన దేశం గ్రామాల్లోనే నివసిస్తోంది... గ్రామీణులంతా వ్యవసాయంపైనే జీవిస్తున్నారు.’’ అందుకే వ్యవసాయ రంగం భారతీయ ఆత్మ! 63 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగంలో కూడా కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయ ఉత్పత్తి విధానాలు, పాత తరం వ్యవసాయ విధానాల స్థానంలో ఆధునిక ఉత్పత్తి విక్రయాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో కరువుకాటకాలు, ఆహార సమస్యతో, తిండి గింజలను దిగుమతి చేసుకునే దయనీయ స్థితి ఉండేది... ఇపుడు మన దేశం స్వయంపోషకత్వాన్ని సాధించింది. 1960 దశకంలోని ‘‘హరిత విప్లవం’’ దేశంలో తొలిసారిగా వ్యవసాయ ఉత్పత్తిరంగంలో సంస్కరణలను ఆరంభించింది. కాగా 1991 తర్వాత వ్యవసాయ రంగంలోని పరిణామాలు కొత్త రకాల వంగడాలు, డ్రిప్ ఇరిగేషన్, హైడ్రోపోనిక్స్ (తక్కువ నీటితో పంటలు పండించడం) వంటి ఎనె్నన్నో ప్రక్రియలను ప్రవేశపెట్టాయి. మన దేశం ‘‘గ్లోబల్ రైస్ జెనోమ్ ప్రాజెక్ట్’’లో అంతర్భాగం కావడం, ఆహార ఉత్పత్తుల శీఘ్రతర వృద్ధికి ఓ మైలురాయిగా మారింది. దీనికి తగినట్లు ఆధునిక శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి, ‘‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్’’ సాంకేతికత సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలలోని వైవిధ్యాలను, నేల లక్షణాలను గమనించడం, మృత్తికలలోని లవణాలను గుర్తించడం సాధ్యమయింది. దానికి తగిన పంటలను పండించే అవకాశం దీంతో శాస్ర్తియతను సంతరించుకుంది. ఈ 63 ఏళ్ళ కాలంలో దిగుబడి రేటును విపరీతంగా పెంచగలగడం కూడా ఓ గొప్ప అఛీవ్‌మెంటే! అలాగే వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే ‘మ్యాన్ పవర్’ని సైతం తగ్గించగలగడం ఇక్కడ గమనార్హం! హార్వెస్టింగ్ టెక్నాలజీ, ట్రాక్టర్స్ వంటి సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయంపై ఆధారపడిన మానవ వనరులు తగ్గించబడి, వారిని ఇతర రంగాలలోకి తరలించడానికి, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలోకి తరలించడానికి సాధ్యమయింది.
----------------------
జనాభా- మానవ వనరులు
చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం మనదే! అమెరికా మొత్తం జనాభా కేవలం 30 కోట్లు... యూరప్ ఖండం మొత్తం జనాభా 56 కోట్లు... కాగా ఒక్క మన దేశం జనాభానే 120 కోట్ల వరకూ ఉంది. అయితే మన దేశంలోని అన్ని సమస్యలకూ జనాభానే కారణం అనీ, ‘జనాభా విస్ఫోటనం’ భారతదేశ అభివృద్ధికి ఆటంకం అవుతున్నదనే ఆలోచన గత కాలంలోని ఆర్ధిక వేత్తల మధ్య వుండేది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఇంతమంది నిరక్ష్యరాస్యులు, పేదరికంతో కునారిల్లుతున్న జనాభాతో మనదేశాన్ని ప్రగతిపథంలో ఎలా తీసుకెళ్లగలుగుతాం అనే సందేహాలుండేవి. కానీ, ఈ ధోరణిలో 1986 ప్రాంతంనుడి మార్పు వచ్చింది. ఇప్పుడు జనాభాను ‘మానవ వనరు’గా గుర్తించడం మొదలైంది. మనకున్న సమృద్ధమైన వనరులలో ‘మానవశక్తి’ కూడా ఒకటని దాని కనుకూలంగానే ‘ప్లానింగ్’ చేయడం ఆరంభమైంది.
కోకాకోలా, పెప్సీ వంటి ఎనె్నన్నో మల్టీ నేషనల్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులకు ముందుకు రావడానికి మన దేశంలో వున్న ఈ మానవ జనాభానే ఓ కారణం అయింది. ఇంత విస్తృతమైన మార్కెట్ మరెక్కడా దొరకదనే విషయం ప్రపంచవ్యాప్తంగా అవగతం అయింది. అందుకే మొన్నామధ్య ముఖేష్ అంబానీని ఓ సందర్భంలో ‘మీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ నమ్మకంపై విస్తరిస్తున్నారు?’ అని అడిగినపుడు ఆయన చెప్పిన సమాధానం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. ‘నా దేశంలో నూరుకోట్ల ప్రజలున్నారు. వారంతా నాకు వినియోగదారులే! ఇంతకన్నా నమ్మకం ఏం కావాలి?’ అని అన్నారు! ఆ లెక్కన 63 ఏళ్ల స్వాతంత్య్ర భారతం ఒకనాటి జనాభా అనే ‘్భరాన్ని’ ఇప్పుడు ‘లాభం’గా మల్చుకోవడం ఓ గొప్ప పాజిటివ్ అంశం!
----------------------
కమ్యూనికేషన్ల విప్లవం
భారతదేశం ఈ 63 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతి అంతా ఒకెత్తయితే గత 15 ఏళ్ల కాలంలో కమ్యూనికేషన్ల రంగంలో సాధించిన పురోగతి అంతా ఒకెత్తని చెప్పాలి. 1947లో భారతదేశంలో టెలిఫోన్ అనే సాధనాన్ని ఊహించడం కూడా కష్టమనే స్థితి! ఇప్పుడు టెలిఫోన్, పేజర్‌ల దశ దాటి మొబైల్ ఫోన్ల విప్లవం దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న మొత్తం ప్రజలలో దాదాపు 52 కోట్ల మందికి సెల్‌ఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇంకా 50 కోట్ల జనాలకు కావాల్సిన మార్కెట్ మనదేశంలో ఉంది! అలాగే టెలివిజన్‌లు కూడా ఎనె్నన్నో పరిణామాలను సంతరించుకుని అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు తగిన టెలివిజన్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఎల్‌సీడీలు, ఎల్‌ఇడీలు, హోమ్ థియేటర్ స్థాయి వరకు వచ్చాయి. కమ్యూనికేషన్ల విప్లవంలో గొప్ప పరిణామం టెలివిజన్ న్యూస్ చానెళ్ల విజృంభణ అని చెప్పాలి. 1995 సంవత్సరం వరకు కేవలం దూరదర్శన్ సంబంధిత ప్రభుత్వ ప్రసార సాధనాలు మాత్రమే సమాచార సాధనాలుగా వున్న స్థితి. ఇప్పుడది వందలాది న్యూస్ ఛానల్స్‌గా ప్రైవేటు రంగంలోకి విస్తరించింది. 24 గంటల వార్తా ప్రసారాలు, స్టింగ్ ఆపరేషన్లు, లైవ్ కవరేజిలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. ప్రపంచంలో దేశం నలుమూలలా ఏ క్షణం ఏం జరిగినా మరుక్షణంలోనే టీవీ తెపై ప్రత్యక్షం కాగలిగే నెట్‌వర్క్ భారతదేశ టెలివిజన్ ఛానెళ్ల సొంతం అయింది.
----------------------
కార్పొరేట్ భారతం
63 ఏళ్ల భారతదేశం ఒకప్పుడు ‘కనె్వన్షనల్ ఇండియా’ నుండి ఇప్పుడు ‘కార్పొరేట్ ఇండియా’గా రూపాంతరం చెందింది. బ్యాంకింగ్ రంగం, షేర్ మార్కెట్, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, మల్టీ నేషనల్ కంపెనీల పెట్టుబడులు, వాటి సంస్థల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. మరోవైపున దేశీయ సంస్థలు, కంపెనీలతో ఈ విదేశీ సంస్థల ‘టైఅప్’లు, ‘కొలాబరేషన్స్’ కూడా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. వీటికితోడు 1991 నుండి 2001 నాటి తొలిదశలో ఏం చేయాలో పాలుపోని దేశీయ కంపెనీలు బహుళజాతి కంపెనీల దాడిలో నాశనమైపోవడమో, లేక వాటిలో ‘మెర్జ్’ కావడమో, వాటికి తమ బ్రాండ్లను అమ్ముకోవడమో జరిగింది. కానీ 2001 అనంతరం మన దేశీయ కంపెనీలు సైతం కొత్త వ్యాపార వ్యూహాలతో ముందుకెళ్లి ‘కార్పొరేట్ స్ట్రాటజీ’లను ఒంటపట్టించుకున్నాయి. మన దేశీయ బ్రాండ్లు అయిన రిలయన్స్, టాటా, బిర్లా, బజాజ్, మహింద్రా , ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు ఇప్పుడు దేశీయ మార్కెట్‌నే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించాయ. విదేశాలలో వ్యాపారాలు చేసే స్థాయికి పెట్టుబడులు పెడుతూ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే స్థాయికి ఎదిగాయి.1992నాటి గ్లోబలైజేషన్ ప్రక్రియలో మొదట తడబడిన ఇండియన్ కంపెనీలు ఇప్పుడు ఆ ఫలాలను అందిపుచ్చుకుని ప్రపంచ మార్కెట్‌కు పోటీనిస్తున్నాయి. ఇప్పుడు ‘ఇండియా ఇంక్’ అనే బ్రాండ్‌ను వరల్డ్‌వైడ్‌గా గుర్తించేలా చేసాయి.
----------------------
ఎంటర్‌టైన్‌మెంట్ హబ్
మనదేశం గత 63 ఏళ్ల కాలంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కనీవినీ ఎరుగని స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు సినిమా రంగంలో కనీసం కలర్ ప్రాసెసింగ్‌కు, కెమెరాలకు దిక్కులేని భారతీయ సినీ పరిశ్రమ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌కే ‘చెక్’ పెట్టే స్థితికి వచ్చింది. ప్రపంచంలోనే ప్రతి ఏటా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా మన దేశం ఇప్పుడు ‘ప్రపంచ ఎంటర్‌టైన్‌మెంట్ సామ్రాజ్యానికి రాజధాని’గా మారింది. ముంబయి ప్రధానంగా రూపొందుతున్న హిందీ బాలీవుడ్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ సినీ ప్రపంచంలో సైతం ప్రకంపనలు పుట్టిస్తోంది. పాపులారిటీ పరంగా, కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా కొల్లగొట్టిన బాలీవుడ్ సినిమా ఇప్పుడు విదేశాల్లో ప్రత్యేక థియేటర్లను కైవసం చేసుకుంది. అంతేకాక 2008లో ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్థిక మాంద్యం’ ఏర్పడిన సందర్భంలో ప్రత్యామ్నాయ ఉద్యోగాలకోసం హాలీవుడ్ నటీనటులంతా బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించడం ఈ సందర్భంగా ఆలోచించాల్సిన విషయం.
ఇక భారతదేశంలోని ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్ విలువను గుర్తించిన హాలీవుడ్ సినీ పరిశ్రమ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలను సైతం ప్రాంతీయ, స్థానిక భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తోంది. ఇదంతా ప్రస్తుత భారతదేశ పరిస్థితికి నిలువెత్తు సూచికలే! ఇక ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోని మరో రూపమైన టెలివిజన్ కూడా ఇప్పుడు కోట్లాది రూపాయల పెట్టుబడులతో గేమ్‌షోస్‌ని, క్విజ్‌షోస్‌ని, టాలెంట్ షోలని నిర్వహిస్తోంది.
----------------------
ఇంకా ఎనె్నన్నో..
గత 63 ఏళ్లలో ఉద్యోగావకాశాలు ఎనె్నన్నో రంగాలలో పెరిగాయి. కేవలం వ్యవసాయం, పరిశ్రమలలో మాత్రమే కనిపించే ఉద్యోగావకాశాలు ఇప్పుడు సేవారంగం, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ రంగాలలో విస్తరించాయి. ఇక ప్రపంచ సాఫ్ట్‌వేర్ వ్యవస్థకు భారతదేశ టెక్నీషియన్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దాంతో ఎనె్నన్నో స్వదేశీ, విదేశీ కంపెనీలు దేశంలోని ప్రధాన నగరాల్లో తమ సంస్థలను ఆరంభించాయి. దాంతో ‘నగరాల విస్ఫోటనం’ పెరిగింది. పట్టణాలు నగరాలుగా రూపాంతరం చెందడం వేగవంతంగా జరుగుతోంది. ఒకప్పుడు ముంబాయి వంటి నగరాల్లో మాత్రమే లక్షలాది జనం వుండే స్థితి! ఇప్పుడది కోటికి పైగా జనం వుండే నగరాల సంఖ్య దేశంలో పెరిగింది.
ఇక రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలెన్నో చోటుచేసుకున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమకాలం నాటి నిస్వార్ధ సేవ నాయకులు, త్యాగభావనగల ప్రజానాయకుల శకం అంతరించింది. స్వార్ధపర రాజకీయాలు విజృంభించాయి. నెహ్రూ కుటుంబ వారసత్వం ఇంకా కొనసాగుతుండడం ఓ విశేషం! అయితే నెహ్రూ కుటుంబానికే చెందిన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు ప్రాణాలు కోల్పోవడం భారత రాజకీయాల్లో తీరని మచ్చలుగానే చెప్పాలి. అలాగే ఏకపార్టీ పాలనలో ‘‘సంకీర్ణరాజకీయాలు’’ విజృంభిచడం ఓ గొప్ప పరిణామం. దీనికితోడు ప్రాంతీయ శక్తులు, ప్రాంతీయ రాజకీయాలు జాతీయ రాజకీయాలను శాసించేస్థితికి ఎదగడం కూడా ఓ పరిణామమే! గత 63 ఏళ్ల కాలంలో హాకీవంటి ఎనె్నన్నో క్రీడలను కాలతన్ని క్రికెట్ మన ‘జాతీయ మతం’గా మారింది. ఒకప్పుడు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో చోటుకోసం వెంపర్లాడిన దశనుంచి ఐపిఎల్, ఐసిఎల్, టి-20 ద్వారా ప్రపంచంలోని క్రీడాకారులను మనం కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాం.
----------------------
సమస్యలే లేవా?
‘‘ఏ దేశ అభివృద్ధి అయినా, ఆ దేశంలోని మహిళల స్థితిని బట్టి అంచనా వేయాలి’’ అనేది ఆర్థికవేత్తలు, సామాజిక విశే్లషకుల అంచనా. ఆ లెక్కన గత 63 ఏళ్ల కాలంలో దేశంలోని మహిళల స్థితిగతులను విశే్లషిస్తే భారతదేశం సాధించింది అని చెప్పుకుంటున్న ప్రగతి ఎంత నిరర్ధకమైనదో అర్ధమవుతోంది. ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు, స్ర్తిని వస్తువుగా, ఆస్తిగా భావించే ధోరణులే ఇంకా వున్నాయని అర్ధమవుతోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో’ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం స్ర్తిలపై జరిగే నేరాల సంఖ్య లక్షా 50 వేలుగా వుంది. వీటిలో దాదాపు 50వేలు గృహహింసకు సంబంధించినవే కావడం మన భారతీయ కుటుంబ వ్యవస్థలోని పవిత్రతను ఎత్తి చూపుతున్నదే! ఇక నమోదుకాని కేసుల సంగతి చెప్పనక్కర్లేదు. అక్షరాస్యత విషయంలో కూడా 1951లో కేవలం 7 శాతం వున్న మహిళా అక్షరాస్యత, 2001 నాటి 54.16శాతానికి పెరిగింది. కానీ ఈ విద్యావిధానం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో అంతగా సఫలం కాలేదని చెప్పాలి. ఇక చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే వర్తించాయి కానీ శాసనసభలు, పార్లమెంటుకు వర్తించలేదు.. ఇది ఓ గొప్ప వెనుకబాటే!
వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో వుంది. రానున్న కాలంలో ఆహార కొరత తీవ్రంగా వుండే అవకాశం వుందనేది ఆర్ధిక నిపుణుల హెచ్చరిక. వ్యవసాయం వాణిజ్యీకరించడం ఈ సమస్యకు కారణం. మరోవైపున గ్రామీణ ప్రాంతంనుండి పట్టణ ప్రాంతాలకు వలసలు కనీ వినీ ఎరుగని స్థాయిలో పెరిగాయి. ‘రూరల్ ఇండియా’ ఇప్పుడు ‘రూయనింగ్ ఇండియా’గా మారింది. నగరాలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగునీరు, సాగునీరు ఓ నిరంతర సమస్యగా మారింది.
భారతదేశం ఇప్పడు యువభారత్ ప్రపంచం మొత్తం మీద వున్న 25 ఏళ్ల లోపు జనాభాలో 52 శాతం ఒక్క భారత్‌లోనే వున్నారు. ‘‘ఉక్కు నరాలు-దృఢ సంకల్పం కల యువతే నా దేశానికి వెనె్నముక’ అని వివేకానంద అన్నారు. ఆ మాటలకు తగిన యువశక్తి ఇప్పుడు భారతదేశంలో వున్నారు. కానీ వీందరికీ తగిన విద్య-ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయా? అనేది ఓ సమస్య! ఈ ‘యంగిస్థాన్’ ఇప్పుడు అంతా సంక్షోభంలో వుంది. అలాగే ఎన్ని పథకాలు పెట్టినా పేదరికం విశ్వరూపంతో కనిపిస్తూ ఉంది.
ఈ 63 ఏళ్ల కాలంలో ధనవంతులు, వారి సౌకర్యాలు ఎంత ‘లగ్జరియస్’గా అందుబాటులోకి వచ్చాయో, పేదలు వారి స్థాయిలో అంతే పతనం కనిపిస్తోంది. ‘‘పేద-్ధనిక వర్గాలు, గ్రామీణ-నగర స్థాయిల మధ్య అంతరాలు తగ్గించినపుడే నిజమైన అభివృద్ధి’’ అని ‘ఆసియన్ డ్రామా’ రచయిత గున్నార్ మీర్డాల్ అన్నమాటల వెలుగులో చూస్తే 63 ఏళ్ల స్వాతంత్య్ర భారతం సాధించిన విజయాలు అంత గొప్పగా కనిపించవు. అదే సమయంలో దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న టెర్రరిజం, నక్సలిజం, ట్రాన్స్‌బోర్డర్ టెర్రరిజం తాలూకు భయోత్పాతాలు కూడా ఉండనే ఉన్నాయి. ఏ లక్ష్యాల కోసం, ఏ వెలుగులకోసం, ఏ ప్రగతి కోసం స్వాతంత్య్రం సాధించామో...63 ఏళ్ల స్వాతంత్య్రానంతర సందర్భంలో ఆ లక్ష్యాలు ఇంకా పూర్తిగా నెరవేరని స్థితే వుండడం ఒకింత బాధాకరం. ఒకవైపు ‘గ్లోబల్ ఇండియా’ మరోవైపు ‘ఘోరమైన భారతం’ రెండూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నేటి భారతం!
----------------------
కొసమెరుపు
ఏది ఏమైనా ఆర్థిక సూచికల ప్రకారం గణంకాల లెక్కల ప్రకారం భారత్ విజృంభిస్తోందనే చెప్పాలి. అయితే ఈ సాధనకు మూలాలు మన భారతీయ ఆత్మలోనే వున్నాయనడంలో సందేహం లనేదు. ‘కర్మసిద్ధాంతం’ భారతీయ జీవనసూత్రం! ఈ సూత్రమే మనకు ఎన్ని సమస్యలు, ఉత్పాతాలు వచ్చినా తిరిగి సర్దుకుని ముందుకెళ్లేలా చేస్తోందేమో! ఇప్పుడు సాధిస్తున్న ప్రగతి అంతా ఆ వ్యక్తిత్వ వికాస సూత్ర ఫలితమేనేమో!
అదలా వుంచితే ఇక ఆర్థికాన్ని-హార్థికాన్ని రెండింటినీ సమన్వయం చేసిన దేశం ప్రపంచం మొత్తంమీద మన దేశం ఒక్కటేనంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఇండియన్ కరెన్సీ నోటుని, ఏ విదేశీ కరెన్సీ నోటునైనా చూడండి. ప్రపంచంలోని ఏ దేశ కరెన్సీ నోటుపైనా ఏదేని ఒక్క భాషలో మాత్రమే ఆ కరెన్సీ నోటు విలువ రాసివుంటుంది. కానీ ఒక్క భారతీయ కరెన్సీ నోటుపైననే 17 భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది.
No comments:
Post a Comment