Sunday, 31 May 2020

దుఃఖ జన్యువు

Folks, pl see my poem published in andhrajyothy Sunday supplement 16-8-2015

దుఃఖ జన్యువు 
----- మామిడి హరికృష్ణ 99088 44222

1. అత్యంత మామూలుగా 
దేహం 
పగలు షర్ట్ ని విడిచి 
రాత్రి లుంగీని చుట్టుకుంటుంది 

ఎన్ని వర్ణాలలో మెరిసినా
మరెన్ని వర్షాలనో కురిసినా 
లోలోపలి మస్తిష్కం 
చీకటి చెలిమెలో ఎడారిని విత్తుతూనే ఉంటుంది 
గాలి తాకిడికి కోసుకుపోయిన పాట  
ఉల్లిపాయ పొరల స్వరాలలో 
దుఃఖాన్ని నిల్వ చేస్తూనే ఉంటుంది 

రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్న స్ట్రీట్ లైట్ 
వేకువ జాము దాకా కునికిపాట్లు పడుతున్న నైట్ క్వీన్ 
సకల సోయిలని కోమా చితిలోకి జారవిడిచి 
జాగ్రత్తగా 'జోహార్' చేస్తాయి 

2. అత్యంత మామూలుగానే 
దేహం 
రాత్రి లుంగీని విడిచి 
పగలు షర్ట్ ని తొడుక్కుంటుంది

తర్కం అడవిలో కార్చిచ్చు పుట్టించిన మిణుగురులు 
మనసు ఐ.సి. యూనిట్ లోని
సెలైన్ బాటిల్ లోంచి జారిన గోల్డెన్ డ్రాప్ లు 
ప్రాచీన క్రోమోజోముల సముద్రం లో దూకి
ఆత్మహత్య చేసుకుంటాయి 

బ్రెయిన్ స్క్రీన్ అంతా ఫార్మటింగ్ అయి 
నీలాకాశం తునక మానిటర్ లో ఒదిగిపోతుంది 
పాత అనుభవాలకి షార్ట్ కట్స్ మాయమై 
కొత్త అనుభూతులు మొగ్గలుగా మొలుస్తాయి 

3. అత్యంత మామూలుగానే 
దేహం 
పగలు లుంగీని విడిచి 
రాత్రి షర్ట్ ని తొడుక్కుంటుంది 

అరిషడ్వర్గాలకి ఆవలి ఒడ్డున పూసిన పువ్వు 
పంచ భూతాలకి ఎగువన కాసిన వెన్నెల 
చతుర్విధ పురుషార్థాతీతంగా ప్రవహించిన  నది 
త్రిగుణాలను అధిగమించి నిలిచిన పర్వతం 
ద్వైతాన్ని జయించి అవతరించిన అంతరిక్షం 
ఏకత్వాన్ని సర్వ లోకాలలో ప్రతిష్టించిన శూన్యం 
దుఃఖ జన్యువులలో లీనమై పోతాయి 

వోపెనింగ్ బ్యాలెన్స్ ఎంతతో మొదలైనా 
క్లోజింగ్ బ్యాలెన్స్ ' నిల్ ' గానే లెక్క తేలుతుంది 

4. అత్యంత మామూలుగానే  
దేహం 
జీవం ఉడుపులు విడిచి 
ఆత్మ వస్త్రాలని ధరిస్తుంది ..... !!

No comments:

Post a Comment